– సుజాత గోపగోని, 6302164068

తెలంగాణలో రైస్‌మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ధాన్యం విషయంలో అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు జోరుగా వస్తున్నాయి. నిబంధనల ప్రకారం సర్కారుకు రావాల్సిన బియ్యం విషయంలో ప్రభుత్వ పెద్దలు మొద్దునిద్రలో ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. వేల కోట్ల రూపా యల విలువైన ధాన్యం సేకరిస్తున్న మిల్లర్లు… సర్కారుకు చేరవేయకుండా బయట మార్కెట్‌లో అమ్మేసు కుంటున్నారన్న ఆరో పణలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు మిల్లర్లతో ములాఖత్‌ ‌కావడమే ఇందుకు అసలు కారణమన్న విమర్శలు వస్తున్నాయి. సేకరిస్తున్న ధాన్యాన్ని మిల్లింగ్‌ ‌చేయకున్నా అడిగేవాళ్లు లేరనే ఆవేదన వ్యక్తమవు తోంది. అయితే, అధికార బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలకు ఈ పరిణా మాలు ప్రయోజనం చేకూరుస్తు న్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంలు, డీఎస్‌వోలు… ఎవరూ ఈ విషయంపై దృష్టి సారించడం లేదని, ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని అంటు న్నారు. మిల్లర్లు 2022-23 ఆర్థిక సంవత్సరా నికి సంబంధించి రెండు పంటలకు సంబం ధించి 75 లక్షల టన్నుల బియ్యం బకాయి పడ్డారని వీటి విలువ రూ.26,250 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

పై పరిణామాలు, పరిస్థితులను గమనిస్తే కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైస్‌మిల్లర్లతో ములాఖత్‌ అయిపోయిందా? వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైస్‌ ‌మిల్లర్లకు అప్పనంగా కట్టబెట్టి సర్కారు చోద్యం చూస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ ధాన్యాన్ని ఆడించకుండా ప్రభుత్వ పెద్దల సహకారం తోనే రైస్‌మిల్లర్లు బ్లాక్‌మార్కెట్లో అమ్ముకొని కోట్లకు పడగలెత్తుతున్నారా? అన్న సందేహాలు చుట్టుముడుతున్నాయి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీస్తున్నా పట్టని అధికార పక్షం పెద్దలు అవినీతి, అక్రమా లకు నిలయమైన రైస్‌మిల్‌ ‌పరిశ్రమను తమపాలిట బంగారు బాతులా చూస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మిల్లర్ల నుంచి బియ్యం రికవరీపై దృష్టిపెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కొన్ని సీజన్ల నుంచి ధాన్యం సేకరణ, సీఎస్‌సీకి మిల్లర్ల బకాయిలు పేరుకు పోవడం చూస్తే పై వాదనలన్నీ నిజమే అనే అభిప్రాయం కలుగుతోంది. ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్‌ ‌చేసి సీఎస్‌సీకి అప్పగించాల్సిన మిల్లర్లు ఆ పని చేయకపోగా, ఆ ధాన్యాన్ని దర్జాగా అమ్ముకుంటున్నారని, ఇదంతా తెలిసినా, సర్కారు ఏ చర్యలూ తీసుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉన్న అధికార యంత్రాంగాన్ని వినియోగించి రైస్‌మిల్లర్ల ముక్కుపిండి బియ్యాన్ని వసూలుచేసే ప్రయత్నాలు ఎక్కడా చేయటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2019-2023 వరకు రైస్‌ ‌మిల్లర్ల నుంచి పౌరసరఫరాల సంస్థకు అందాల్సిన బియ్యం అక్షరాలా రూ.28,700 కోట్ల విలువైన 82 లక్షల మెట్రిక్‌ ‌టన్నులుగా లెక్కలు చెబుతున్నాయి.

కేసీఆర్‌ ‌మొదటిసారి ముఖ్యమంత్రి అయిన త•ర్వాత ధాన్యం, బియ్యం సేకరణ, మిల్లర్ల నుంచి సేకరణ, పీడీఎస్‌ ‌పంపిణీ కాస్త నియంత్రణలోనే సాగిందని అధికారవర్గాలు అంటున్నాయి. టీఆర్‌ఎస్‌ ‌సర్కారు తొలి విడత అధికారం చేపట్టిన సమయంలో 2014 నుంచి 2018 మధ్యకాలంలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పౌరసరఫరాలశాఖ కమిషనర్లుగా, పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్లుగా పనిచేశారు. ఆ సమయంలో ధాన్యం సేకరణ సహా పీడీఎస్‌ ‌వ్యవస్థను గాడిలో పెట్టారని చెబుతున్నారు. అవినీతి, అక్రమాలకు దాదాపుగా అడ్డుకట్ట వేశారంటున్నారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కూడా ఆ ఆనవాయితీని కొనసాగించే ప్రయత్నం చేశారంటు న్నారు. కానీ, దేనినీ సీరియస్‌గా పట్టించుకోవద్దని, చూసీచూడనట్లు వ్యవహరించాలని అత్యున్నతస్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు రావటంతో అది తన వల్ల కాదని ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారట. ఆ తర్వాత మరో రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారికి పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా, కార్పొరేషన్‌ ఎం‌డీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆ అధికారి కూడా నిజాయతీపరుడు, మంచి అధికారనే పేరుంది. కానీ, ఆయన మెతక వైఖరే ఇప్పుడు కార్పొరేషన్‌ ‌దివాలా తీయటానికి కారణమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అప్పులు రూ. 60 వేల కోట్లకు చేరుకున్నాయంటేనే కార్పొరేషన్‌ ‌పరిస్థితి ఏస్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 2018లో •కేసీఆర్‌ ‌పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చాక ధాన్యం సేకరణలో అవినీతి, అక్రమాలు తారస్థాయికి చేరాయన్న వాదనలు ఉన్నాయి. 2019-2022 మధ్య కాలానికి సంబంధించి రైస్‌మిల్లర్ల వద్ద ఇంకా 7 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల బకాయి ఉన్నాయి. ఈ బియ్యం విలువ రూ.2వేల 450 కోట్లు కావటం గమనార్హం. ఇక 2022- 23 ఏడాది రెండు పంటలకు సంబంధించి రూ. 26,250 కోట్లు. అయితే, ఈ బియ్యం అప్పగించటానికి సెప్టెంబరు 30వ తేదీవరకు గడువు ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో రైస్‌మిల్లర్లు నిర్దేశిత లక్ష్యం పూర్తిచేసే పరిస్థితులు ఏమాత్రం కనిపించటం లేదంటున్నారు నిపుణులు. రాష్ట్రంలో మూడు వేలకు పైచిలుకు మిల్లులు ఉంటే, రోజుకు కనీసం 10 వేల టన్నుల బియ్యం కూడా ఎఫ్‌సీఐకి డెలివరీ చేయడం లేదని చెబుతున్నారు.

ఈ పరిణామాల వెనుక మరో కోణం ఉందన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు, మంత్రులకు రైస్‌మిల్‌ ఇం‌డస్ట్రీ బంగారుబాతులా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ధాన్యం సేకరణ నుంచే అక్రమాలు మొదలవుతున్నాయంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు సగటున 10 కిలోలు తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్నిచోట్లా కాకున్నా, ఆయా ప్రాంతాల్లో సెంటర్ల నిర్వాహకులు, పీఏసీఎస్‌ ‌సిబ్బంది, సీఈవోల నుంచి మొదలుకొని డిప్యూటీ తహసీల్లార్లు, తహసీల్దార్లు, డీఎస్‌వోలు, జిల్లా మేనేజర్లు, అడిషనల్‌ ‌కలెక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సెంటర్లలో తరుగు తీసిన తర్వాత… రైస్‌మిల్లర్ల తరుగు తీసి… మొత్తం కలిపి క్వింటాకు 200 రూపాయల దాకా దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా రైతులు గడిచిన సీజన్‌లోనే ఒక ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున నష్టపోయారు. ఇదంతా ఒకెత్తయితే.. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీ లేకుండా, కనీసం అగ్రిమెంటు కూడా లేకుండా కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైస్‌మిల్లర్లకు కోట్ల రూపాయల విలువైన ధాన్యం అప్పగించింది. రైస్‌మిల్లర్లలో ఎక్కువమంది ఆ ధాన్యాన్ని బ్లాక్‌ ‌మార్కెట్లో అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. నాలుగేళ్లుగా ధాన్యం సేకరణలో జరుగుతున్న అవినీతి, అక్రమాలతో రైస్‌మిల్లర్లు వందల కోట్ల రూపాయలకు పడగలెత్తారని చెప్పుకుం టున్నారు. మిల్లర్ల అసోసియేషన్‌ ‌కూడా ఆర్థికంగా బలోపేతమైందని, జీవోలు, నిబంధనలు కూడా మార్చే స్థాయికి మిల్లర్లు ఎదిగారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు.. రైస్‌మిల్లర్లతో ములాఖత్‌ అయిపో యారన్న చర్చ జోరుగా నడుస్తోంది. పార్టీ అవసరాలు, ప్రభుత్వ అవసరాలకు రైస్‌మిల్లర్లను వినియోగించుకుంటున్నారని గుసగుసలాడు కుంటున్నారు. ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున రైస్‌మిల్లర్లు ఫండింగ్‌ ‌చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులే చెప్పుకుంటున్నాయి. మరో మూడు, నాలుగు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగ నుండటంతో రైస్‌మిల్లర్ల సేవలను ఆ ఎన్నికల్లో కూడా వినియోగించుకునే వ్యూహంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు అమ్ముకొని, సీఎంఆర్‌ ‌కోటా భర్తీ చేయటానికి పీడీఎస్‌ ‌బియ్యంపైనే ఆధారపడుతున్నారు. పీడీఎస్‌ ‌బియ్యాన్ని రీ- సైక్లింగ్‌ ‌చేసి ఇచ్చినా, బస్తాలు మార్చేసినా, రంగు మారినా, నాణ్యత లేకపోయినా… పౌర సరఫరాల సంస్థ కనీసం పరిశీలించడం లేదన్న విమర్శ లున్నాయి. అధికారులు కళ్లు మూసుకొని ఆ బియ్యం తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ పక్రియలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని చెబుతున్నారు. కిందిస్థాయి నుంచి మొదలుకొని పౌరసరఫరాల భవన్‌ ఉన్నతా ధికారుల వరకు లెక్క ప్రకారం మామూళ్లు తీసుకుంటున్నారని కూడా చర్చ జరుగుతోంది. కానీ, ఎఫ్‌సీఐ అయితే బియ్యం ఏమాత్రం నాణ్యత లేకపోయినా తిరస్కరిస్తుంది. దీంతో నిబంధనలు కఠినంగా ఉన్నాయని, ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వటం తమవల్ల కాదని రైస్‌మిల్లర్లు మొండికేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా రాష్ట్ర బడ్టెట్‌ ‌నుంచి పౌర సరఫరాల సంస్థకు నయా పైసా కేటాయించలేదు. పైగా సకాలంలో బియ్యం రికవరీ కూడా చేయక పోవడంతో కార్పొరేషన్‌ 60‌వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని లెక్కలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులకు రైస్‌ ‌మిల్లులు ఆదాయ వనరుల్లా మారిపోవటంతో ఎవరూ కార్పొరేషన్‌కు రావాల్సిన బకా యిలపై ఒత్తిడి చేయటంలేదని చెబుతున్నారు. డిప్యూటీ తహసీల్లార్లు, తహసీల్దార్లు, డీఎస్‌వోలు, జిల్లా మేనేజర్లు, అడిషనల్‌ ‌కలెక్టర్లు, కలెక్టర్లతోపాటు పౌరసరఫరాల సంస్థ అధికారులు, సిబ్బంది, మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌దాకా రికవరీపై దృష్టిపెట్టేలా చేస్తే మిల్లింగ్‌, ‌సీఎంఆర్‌ ‌డెలివరీ గాడిన పడుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

పౌరసరఫరాల సంస్థకు మిల్లర్లు ఈస్థాయిలో బకాయిలు పడగా.. ప్రభుత్వ రైస్‌మిల్లులంటూ కొత్త నినాదం బయలుదేరింది. రైతులు పండించిన ప్రతి గింజను కొంటున్నామని కేసీఆర్‌ ‌ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అయితే.. తాలు, తరుగు పేరుతో ధాన్యం సేకరించేటప్పుడు సేకరణ కేంద్రాల నిర్వాహకులు భారీగా కోత పెడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో, ప్రభుత్వంపై విమర్శలొచ్చాయి. ఈ సీజన్‌లో ధాన్యం సేకరణలో 10 కిలోల తరుగుతో క్వింటాకు 200 రూపాయల చొప్పున కోతపడింది. ఈ లెక్కన ఒక ఎకరానికి 6 వేలరూపాయల చొప్పున రైతులు నష్టపోయారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఒక ఎకరానికి రైతుబంధు పేరిట 5వేల రూపాయలు ఇచ్చి… ధాన్యంలో తరుగు పేరుతో 6 వేల రూపాయలు దోచుకున్నదని రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచు కుపడ్డాయి. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే సేకరణపరంగా వచ్చిన ఈ వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకే… ప్రభుత్వ రైస్‌మిల్లుల అంశాన్ని కేసీఆర్‌ ‌ప్రభుత్వం తెరపైకి తెచ్చిందనే చర్చ జరుగుతోంది. జిల్లాకు ఒకటి, రెండు రైస్‌మిల్లులను ప్రభుత్వమే ఏర్పాటుచేస్తుందని, ఆధునిక టెక్నాలజీతో కూడిన మిల్లులు ఏర్పాటుచేస్తామని, 2 వేల కోట్ల రూపాయలతో కొత్త రైస్‌మిల్లులు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. అయితే, ఈ ప్రతిపాదన ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో అన్న చర్చ జరుగుతోంది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram