వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రతి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌ ‌హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటి పట్ల ఆసక్తి చూపించలేదు. ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతాంగానికి నిరాశ ఎదురైంది. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వ ఆదాయాన్ని పంపిణీ చేస్తూ నాలుగేళ్లు గడిపేశారు.చాలా ప్రాజెక్టు పనులు 65 నుంచి 95 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులకు నోచుకోవడం లేదు. 72 శాతం పూర్తయిన పోలవరం పనుల్లో కదలికలేదు. నాలుగేళ్లలో లక్షల కోట్ల అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను మాత్రం నిర్ల్యక్షం చేస్తోంది. వంశధార, నాగావళి అనుసంధానం పూర్తికాలేదు. హంద్రీ- నీవా ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 10 వేల క్యూసెక్కులు లిఫ్ట్ ‌చేసేలా సమాంతర కాలువ నిర్మిస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్‌ ‌మరచిపోయారు.

శ్రీశైలం జలాశయం ఎగువన 854 అడుగుల లెవల్‌లో సిద్ధేశ్వరం అలుగు నిర్మాణ హామీ ఏమైందో జగన్‌ ‌చెప్పాలి. వరదలతో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి, ఊళ్లకు ఊళ్లను ముంచేసి రెండేళ్లు గడుస్తున్నా ఆ ప్రాజెక్టును తిరిగి నిర్మించలేదు. ప్రాజెక్టు కోసం రూ.870 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచి గుత్తేదారుడికి పనులు అప్పగించినా 2023-24 బడ్జెట్‌లో కేవలం 20 లక్షలు మాత్రమే కేటా యించారు. దీనితో ఈ ప్రాజెక్టు అటకెక్కినట్లే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి  వచ్చేనాటికి 95శాతం మేర పనులు పూర్తయిన నెల్లూరు, సంగం బ్యారేజీలను మూడున్నరేళ్ల తర్వాత ఇటీవలే ప్రారంభించారు. భారీగా నిధులు కావలసిన పోలవరం సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు అటకెక్కాయి. నిధులివ్వకపోవడం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడా అడుగు ముందుకు పడడం లేదు. ప్రారంభోత్సవ ముహూర్తాలను ప్రకటించడం, లక్ష్యాలను చేరుకోలేక పదేపదే వాయిదాలు వేయడం సర్కారుకు ఆనవాయితీగా మారింది. జగన్‌ ‌ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కొన్ని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య పథకాలుగా ప్రకటించారు. వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. కాని, ఏ ప్రాజెక్టులోనూ పురోగతి లేదు.

పోలవరం పనులు ఎక్కడివక్కడే…

పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేది వైసీపీ మాత్రమే అని అధికారంలోకి వచ్చే ముందు జగన్‌ ‌పదేపదే చెప్పారు. కాని, ఇప్పుడు పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. పోలవరం ద్వారా నదుల అనుసంధానం పూర్తి అయితే ప్రత్యేకించి రాయల సీమ, ఉత్తరాంధ్ర రైతులందరూ బాగుపడతారు. నగరాలకు తాగునీటి సమస్య, విద్యుత్‌ ‌సమస్య తీర్తాయి. 72శాతం పనులు పూర్తి అయినట్లు చెబు తున్న పోలవరాన్ని పూర్తి చేస్తే రాష్ట్రానికి ఎంతో మంచి జరిగేది. ఈ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ్ద చూపకపోవడంతో ప్రాజెక్టు ముందడుగు వేయలేదు.

పడకేసిన ఎడమ కాలువ పనులు

అనకాపల్లి జిల్లాలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు ముందుకు సాగడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి 70 నుంచి 80 శాతం పనులు పూర్తికాగా, ఈ ప్రభుత్వం హయాంలో గత నాలుగేళ్లలో కనీసం ఐదు శాతం పనులు కూడా చేయలేదని, రివర్స్ ‌టెండరింగ్‌, ‌కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపుల్లో తీవ్రజాప్యంతో కాలువ పనులు ముందుకు సాగడం లేదని నిపుణులు విమర్శిస్తు న్నారు. మూడు ప్యాకేజీలుగా విభజించిన ఎడమ కాలువ పనులు నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. కశింకోట మండలం తాళ్లపాలెం నుంచి విశాఖ నగరంలోని కణితి బ్యాలెన్సింగ్‌ ‌రిజర్వాయర్‌ ‌వరకు ఎనిమిదో ప్యాకేజీ కింద పనులు చేపట్టేందుకు రూ.67 కోట్లతో అప్పట్లో ప్రణాళికను రూపొందిం చారు. ఇంతవరకు టెండర్లే పిలవలేదు. నిధులివ్వక, వరదల కారణంగా పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి హెడ్‌ ‌వర్కస్ ‌పనులు 12 శాతం మేర పూర్తయ్యాయి. జగన్‌ ‌గద్దె ఎక్కీ ఎక్కగానే కాంట్రాక్టు సంస్థను తొలగించి మేఘా ఇంజనీరింగ్‌ ‌సంస్థకు రివర్స్ ‌టెండరింగ్‌లో పనులు అప్పగించారు. కానీ ఈ నాలుగేళ్లలో ఏడుశాతం పనులు కూడా పూర్తికాలేదు. వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ ‌మరమ్మతులు చేపట్టాలి. గ్యాప్‌-1, ‌గ్యాప్‌-2‌లను ఇసుకతో పూడ్చాలి. అప్పుడే ఎర్త్ ‌కమ్‌ ‌రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఎఫ్‌) ‌డ్యాం నిర్మాణం మొదలు పెట్టగలుగుతారు. తాజాగా గైడ్‌బండ్‌ ‌కుంగిపోయింది. ఎగువ కాఫర్‌ ‌డ్యాం లీకవుతోంది. వీటికి మరమ్మతులు పూర్తయ్యాక అత్యంత కీలక మైన నిర్మాణ పనులు చేపట్టాలంటే.. కనీసం రెండు సంవత్సరాలైనా పడుతుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.

ఉత్తరాంధ్రకు వెన్నుపోటు

వెనుకబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్రకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనాకాలంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయిందని ఆరోపణ. 2020-21 సంవత్సరంలోనే వంశధార ప్రాజెక్టుతో పాటు వంశధార-నాగావళి అనుసంధాన ప్రాజెక్టును పూర్తి చేసేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ నాలుగేళ్లూ అసలు పట్టించుకోలేదు. చీడివలస, నారాయణపురం మధ్య అండర్‌ ‌టన్నెల్‌ ‌నిర్మాణం కోసం మట్టిని తవ్వి వదిలేయడంతో ఆ ప్రాంతం లోతట్టుగా మారింది. దిగువన ఉన్న పొలాలు నీట మునిగిపోతాయని రైతులు వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో వంశధార – నాగావళి అనుసంధాన ప్రాజెక్టు మొదటిది. 2020 జులై నాటికే వంశధార అనుసంధానం పూర్తి చేస్తా మని చెప్పి, ఆ తరువాత అదే ఏడాది. డిసెంబరుకు గడువు పెంచారు. మాటలు చెప్పినంత వేగంగా పనులు చేయించడంలో జగన్‌ ‌సర్కారు ఘోరంగా విఫలమైంది. సకాలంలో బిల్లులు చెల్లించక పోవటంతో గుత్తేదారులు మొండికేశారంటున్నారు.

వంశధార ప్రాజెక్టు స్వరూపం ఇలా…

వంశధార వరద జలాలను నాగావళి నదికి మళ్లించడం ద్వారా శ్రీకాకుళాన్ని అన్నపూర్ణగా మార్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అనుసంధాన ప్రాజెక్టును తలపెట్టింది. 2017 మార్చి 27న రూ.84.90 కోట్లతో పరిపాలనా ఆమోదం ఇచ్చింది. హీరమండలం జలాశయం నుంచి హైలెవెల్‌ ‌కాలువ తవ్వి నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్టకు కలపాలన్నది ప్రాజెక్టు ఉద్దేశ్యం. మొదట 130 క్యూసెక్కులను హైలెవెల్‌ ‌కాలువ మీదుగా తీసుకెళ్లాలన్నది ప్రతిపాదన. ఆ తరువాత దానిని 600 క్యూసెక్కులకు పెంచారు. గత ప్రభుత్వ హయాంలోనే భూమి సేకరించి 2019 మే నెల నాటికే 60శాతం పనులు పూర్తిచేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రవాహ సామర్థ్యాన్ని పెంచుతూ అంచనా వ్యయాన్ని రూ.145,34 కోట్లకు పెంచింది. హిరమండలం జలాశయం నుంచి నారాయణపురం ఆనకట్ట వరకు 33.583 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులను పూర్తి చేయలేదు. మొత్తం 64 కట్టడాలకు గాను 34 మాత్రమే పూర్తయ్యాయి. మరో 32 వేల క్యూబిక్‌ ‌మీటర్ల మేర కాంక్రీట్‌ ‌పనులు, 1.66 లక్షల క్యూబిక్‌ ‌మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉంది. మరో 1.7 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాలి. గేట్లు, హెడ్‌ ‌రెగ్యులేటర్లు, క్రాస్‌ ‌రెగ్యులేటర్ల పనులు, 10 డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణాలు ఇంకా చేపట్టాల్సి ఉంది. నిధులు సరిగా ఇవ్వక, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించక.. పనులు ముందుకు సాగడం లేదు. ఈ ప్రాజెక్టుకు హిరమండలం జలాశయమే ఆధారం. ఇందులో ఇంకా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ ఉంచడం లేదు. ఆ జలాశయం నిర్మాణాన్నీ పూర్తి చేయాల్సి ఉంది. మరో వైపు అనుసంధాన పనులూ చేయాలి.

తోటపల్లి పెండింగ్‌ ‌పనులు

పార్వతీపురం మన్యం జిల్లాలోని సర్దార్‌ ‌గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పెండింగ్‌ ‌పనుల్లో కదలిక లేదు. గత ఏడాది చేపట్టిన పనులకు సంబంధించి నేటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని కాంట్రాక్లర్లు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.10 కోట్లకు పైబడి బిల్లులు బకాయిలు ఉన్నాయట. దీంతో ప్లడ్‌ ‌బ్యాంక్‌లతో పాటు రాతికట్టుడు పనులు నిలిచి పోయాయి. తూతూ మంత్రంగా స్ట్రక్చర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. 2021 మే నాటికి 82% పనులు పూర్తయిన జంఝావతి రిజర్వాయర్‌ ‌నిర్మాణ పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి.

2021 నాటికి 48శాతం పూర్తయిన గజపతి నగరం బ్రాంచ్‌ ‌కెనాల్‌ ‌పనులు నిధులివ్వని కారణంగా పూర్తి కాలేదు. మహేంద్ర తనయ ఆప్పర్‌ ‌పనులు గత ఏడాది జూన్‌ ‌నాటికి, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టునూ గత డిసెంబరు నాటికి పూర్తి చేయవలసి ఉంది

 గండ్లకమ్మ ప్రాజెక్టు గేటుకు దుస్థితి

ప్రకాశం జిల్లాలో కీలకమైన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు ఒకటి గత ఏడాది ఆగస్టులో కొట్టుకుపోగా, ఇప్పటికీ దానిని ఏర్పాటు చేయలేదు. మొత్తం 12 గేట్లు బాగు చేయాల్సి ఉందని నిపుణులు తేల్చినా అతీగతీ లేదు. రెండింటికి కొద్దిపాటి పనులు చేసినా బిల్లులు చెల్లించకపోవడంతో అసలు ఇక్కడ పనులు చేయాలంటేనే గుత్తేదారులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొట్టుకుపోయిన గేటు బాగు చేసేందుకు టెండర్లు పిలిస్తే ఒక్కరూ ముందుకు రాలేదు.

వెలిగొండ పరిస్థితీ ఇంతే

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో దశ పనుల్లో 18,787 మీటర్ల మేర టన్నెల్‌ ‌తవ్వాల్సి ఉంటే. ఇప్పటివరకు 17,481 మీటర్ల మేర తవ్వారు. మరో 1,328 మీటర్ల పనులు మిగిలి ఉన్నాయి. తీగలేరు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌పనులు, హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ఈ‌స్ట్రన్‌ ‌మెయిన్‌ ‌కెనాల్‌ ‌పనులు సగమే పూర్త య్యాయి..

హంద్రీనీవా ఎత్తిపోతల అంతేనా?

హంద్రీనీవా ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 10 వేల క్యూసెక్కులు లిఫ్ట్ ‌చేసేలా సమాంతర కాలువ నిర్మిస్తామని జగన్‌ ‌పాదయాత్రలో చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత సామర్థ్ధ్యం మేరకు 3,800 క్యూసెక్కులు లిఫ్ట్ ‌చేయాల్సి ఉండగా 2వేల క్యూసెక్కులు కూడా లిఫ్టు చేయడం లేదు. పూర్తి సామర్థ్యంలో లిఫ్టు చేయాలనే లక్ష్యంగా రూ.350 కోట్లతో విస్తరణ పనులు చేపట్టాలి. కాని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పనులు ఆపేశారు. సమాంతర కాలువ ఊసే లేదు.

‘గుండ్రేవుల’ జోలికీ పోలేదు

గుండ్రేవుల జలాశయం నిర్మిస్తామని పాద యాత్రలో జగన్‌ ఇచ్చిన హామీని పట్టించుకోలేదు. కేసీ కాలువ పరిధిలో కర్నూలు, కడప జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. తుంగభద్ర నదీజలాల్లో కేసీ కాలువకు 39 టీఎంసీలు వాటా ఉంది. ఆ నీటిని నిలుపుకునేందుకు జలాశయం లేదు. సుంకేసుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మించాలని సీమ రైతుల డిమాండ్‌. ‌గత ప్రభుత్వం రూ.2,900 కోట్లు మంజూరు చేసి జీవో ఇచ్చి చేతులు దులుపుకుంది. జగన్‌ ‌కూడా అదే తీరున దీని నిర్మాణ ఊసే ఎత్తలేదని విమర్శలొస్తున్నాయి.

వేదావతి ఎత్తిపోతల పథకం ఏమైంది?

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగు నీటి అవసరాల కోసం నిర్మించ తలపెట్టిన వేదవతి ఎత్తిపోతల పథకం కూడా అసంపూర్తిగా మిగిలి పోయింది. రూ.1,985 కోట్లతో ఆర్డీఎస్‌ ‌కుడి కాలువ, రూ.1,995 కోట్లతో వేదవతి ఎత్తిపోతల పథకం ఇక్కడ అమలుచేయాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఆ పనులు ఆపేసి.. ఆ తరువాత మొదలు పెట్టినా నిధులు లేక అసంపూర్తిగా ఆగిపోయాయి. వీటిని ఎందుకు పూర్తి చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ, ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram