‌నేటి యువతరం స్వర్గధామంగా భావించే దేశం, తన శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక బలంతో ప్రపంచాన్ని శాసించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్న దేశం. హక్కుల పేరుతోనూ, ప్రజాస్వామిక సిద్ధాంతాల పేరుతోనూ తన పైత్యాన్ని ప్రపంచంపై రుద్దుతూ తను చెప్పిందే వేదమన్నట్టుగా వ్యవహరిస్తున్న దేశం… తన ఆర్ధిక బలంతో భారత్‌ ‌సహా పలు దేశాల మేధావులను ఆకర్షించగలిగిన దేశమైన అమెరికా, ఇప్పుడు ఆర్ధిక పతనం దిశగా పయనిస్తున్నదా? యుఎస్‌ఎస్‌ఆర్‌ ‌పతనానంతరం తన అంగబలం, అర్థబలంతో ఏకధృవ ప్రపంచానికి పునాదులు వేసుకున్న అమెరికా పెత్తనానికి కాలం చెల్లుతోందా? పలువురు ఆర్ధికవేత్తలు విశ్లేషణల ప్రకారం అమెరికా ఇప్పుడు తనను తాను ఆర్ధికంగా సంస్కరించు కోవలసిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా, జియో ఎకనమిస్టు డా।। అంకిత్‌ ‌షా ప్రకారం, గాలిలోనుంచి డాలర్లను సృష్టించి తన పౌరులకు ఎటువంటి సమస్య తెలియని జీవన విధానాన్ని ఇచ్చిన అమెరికా మారకం విలువ కుప్ప కూలిపోతున్నది. ఇప్పటివరకూ, ప్రపంచ దేశాలన్నీ కూడా డాలరును రిజర్వు కరెన్సీగా అంగీకరించేందుకు, పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడానికి కారణం తిరిగి అమెరికా చౌకగా డాలర్లను ముద్రించి అయినా దానిని తమకు చెల్లించగలదనే విశ్వాసమే తప్ప దాని ఆర్ధిక వ్యవస్థ పునాదులు బలంగా ఉం డటంవల్ల కాదని డా।। షా చెప్తున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయుధాలను, యుద్ధ సామాగ్రిని ఇతర దేశాలకు అమ్మినందుకు బదులుగా పౌండ్లను కాక బంగారాన్ని భౌతిక రూపంలో అమెరికా సేకరించింది. దీనితో, అమెరికా బంగారం నిల్వలు అత్యధికంగా పెరిగి పోయి, డాలరు బలమైన కరెన్సీగా మారింది. అప్పటి వరకూ ఎవరి వద్ద ఎక్కువ బంగారు నిల్వలు ఉన్నాయో, ఆ కరెన్సీకి విలువ ఉండేది. తన సామ్రాజ్యవాదంతో ప్రపంచాన్ని దోచుకున్న బ్రిటన్‌ ‌వద్ద నాటి వరకూ బంగారు నిల్వలు అధికంగా ఉండడం, ప్రపంచవ్యాప్తంగా వలస కాలనీలు ఉండ డంతో పౌండుకు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యత ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం జరిగిన బ్రెట్టన్‌ ‌వుడ్‌ ఒప్పందం ఫలితంగా ఏర్పడి, డాలరును రిజిర్వ్ ‌కరెన్సీగా ఆమోదించిన ఐఎంఎఫ్‌, ‌ప్రపంచ బ్యాంకు, డబ్ల్యుటిఒ, గ్యాట్‌ ‌వంటి ఆర్ధిక సంస్థలన్నీ కూడా ఏకధృవ డాలరును ప్రోత్సహించే అంతర్జాతీయ వాణిజ్య సంస్థలని డా।। షా అంటారు.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం బంగారం నిల్వల బలంతో ముందుకు వచ్చిన అమెరికన్‌ ‌డాలరు, గుట్టుచప్పుడు కాకుండా 1971 నుంచి బంగారంతో లంకెను తెంచేసి ఫియాట్‌ ‌డాలరుకు శ్రీకారం చుట్టింది. అంటే, బంగారం, వెండి వంటి ఏ విలువైన లోహం కానీ ఇతర ఆస్తుల మద్దతు కానీ లేకుండానే డాలరును ముద్రించేసి అది చట్టబద్ధమైనదని ప్రకటించేసుకుంది. దీనితో, ఎక్కువ ఖర్చు లేకుండా, ఎటువంటి బాదరాబందీ లేకుండా చౌకగా డాలర్లను ముద్రించుకునే అవకాశం అమెరికాకు లభించింది. ఇక్కడి నుంచి డాలరు హవాకు తిరుగులేకుండా పోయింది.

తొలి డీడాలరీకరణ ప్రయత్నాలు…

ప్రపంచం అమెరికా ఎత్తుగడను గమనించలేదు అనలేం. ఎందుకంటే, ఇరాక్‌లో సద్దాం హుస్సేను, లిబ్యాలో గడ్డాఫీ వంటివారు వ్యక్తిగతంగా డాలరు ఉచ్చులో నుంచి బయిటపడేందుకు తమ దేశీయ మారకంతో వ్యాపార లావాదేవీలను చేసేందుకు ప్రయత్నించి, తిరిగి అమెరికా కుట్రకు బలైపోయారు. వారిరువురి అనంతరం, గంభీరంగా ఈ ప్రయత్నం చేసింది ఐరోపా దేశాలు మాత్రమే. వారంతా కలిసి, తమ వ్యాపార లావాదేవీల కోసం డాలరు స్థానంలో ‘యూరో’ కరెన్సీని సృష్టించుకుని, కొంతకాలం పాటు డాలరుకు తీవ్ర స్థాయిలోనే పోటీ ఇచ్చాయి. అయితే, ఈ యూరోను బంగారంతో ముడిపెట్టకుండా డాలరులాగానే ఫియాట్‌ ‌కరెన్సీగా తీసుకురావడంతో అది అమెరికా ఎత్తులకు దెబ్బతిన్నది. ప్రపంచంపై పెత్తనానికి అలవాటు పడిన అమెరికా, తెలివిగా నాటోలో సభ్యత్వం కలిగిన ఐరోపా దేశాలన్నింటినీ యుగస్లోవియాతో చిచ్చులోకి దించి, యూరో విలువను తగ్గించగలిగింది. అలాగే, చైనాను డబ్ల్యుటిఒ పరిధిలోకి తీసుకువచ్చి, ఐరోపా దేశాలకు పోటీగా భారీ ఉత్పత్తిదారుగా అమెరికా తయారు చేసింది.

నిరంతరం డాలర్లను ముద్రించగలిగిన సామర్ధ్యం కారణంగానే, మేధోసంపత్తి కలిగిన వారికి భారీగా జీతాలు ముట్టచెప్పి ఆవిష్కరణలను, వ్యవస్థాపతను ప్రోత్సహిస్తూ, వాటికి పుట్టిల్లుగా మారింది. తన రిజర్వు కరెన్సీ హోదాను నిలుపుకునే క్రమంలో అమెరికా తన దేశ పౌరుల కుటుంబ వ్యవస్థలో కూడా చిచ్చు పెట్టిందన్నది డా।। షా భావన. అమెరికాలో కుటుంబ వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నంత కాలం అమెరికా డాలరు రిజర్వు కరెన్సీ హోదాపై ప్రపంచ దేశాలకు విశ్వాసం ఉండేదని, ఈ ఫియాట్‌ ‌డాలర్‌ అమెరికా పౌరులను కుటుంబ బాధ్యతల నుంచి తప్పించిందని ఆయన అంటారు. తన పౌరుల జీవితాలను సౌకర్యవంతం చేస్తున్నామనే భావనతో ఆహార స్టాంపుల నుంచి ఆదాయ భద్రత వరకు, సామాజిక లబ్ధులు వంటి ఉచితాలను అందిస్తూ పౌరులను వారి కుటుంబాలనుంచి అమెరికా ప్రభుత్వం దూరం చేసిందన్నది ఆయన ఆరోపణ. ముఖ్యంగా, భారతీయ నాగరికతా విలువలకు భిన్నమైన ఒకటే జన్మ అన్న మతపరమైన భావన కారణంగా, జన్మెత్తింది అనుభవించడానికే అన్న రీతిలో వారి జీవితాలు సాగేలా తోడ్పడింది. డాలరు రిజర్వు కరెన్సీ హోదా కారణంగానే అమెరికా సమాజంలో కుటుంబ పతనం, నాగరికతా విలువలు విచ్ఛిన్నమై పోవడం, ఎక్కువమంది అమెరికన్లు ప్రాథమిక, మాధ్యమిక విద్యను దాటక పోవడం, ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సన్నద్ధంగా ఉండడంతో డబ్బు విలువ తెలియకపోవడం, పొదుపు చేయకపోవడం, చిన్న వయసులో పిల్లలను కుటుంబం నుంచి దూరంగా పంపడం, విడాకుల సమస్య, అప్పులపై ఆధారపడి అంటే, క్రెడిట్‌కార్డులు, బ్యాంకులోన్లపై ఆధారపడి జీవించడానికి ప్రజలు అలవాటుపడ్డారు. కేవలం కుటుంబ వ్యవస్థనే కాకుండా, వ్యవసాయం, ఉత్పాదక రంగం, చిన్న వ్యాపారాలను తదితరాలన్నింటినీ ఈ రిజర్వు కరెన్సీ హోదా కోసం అమెరికా తన దేశంలో నులిమి వేసిందని, అందుకే అమెరికన్‌ ‌పౌరులు వాడే ప్రతి వస్తువూ వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్నదే తప్ప, స్వంతంగా తయారు చేసుకున్నవి కావని డాక్టర్‌ ‌షా అంటారు. ఇప్పటివరకూ వస్తువులను దిగుమతి చేసుకొని,అత్యంత చౌకగా ప్రజలకు అందించిన అమెరికా భవిష్యత్తులో ఆసియా దేశాలు తయారు చేసుకునే వస్తువులను కొనుగోలు చేసే స్థాయిలో కూడా ఉండదని డాక్టర్‌ ‌షా భవిష్యవాణి.

ప్రస్తుతం అమెరికా రిజర్వు కరెన్సీ అంతా ఐటి రంగంలో కేంద్రీకృతమై ఉందని, డాలరు విలువ దిగజారుతున్న నేపథ్యంలో ఆ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశముందని డాక్టర్‌ ‌షా విశ్లేషణ. తొలి డీడాలరీకరణ పక్రియలో భాగంగా ఐరోపా దేశాలు యూరోను తీసుకువచ్చినప్పుడు, డాట్‌కాం బుడగ అలాగే పేలి పోయి, 2002నాటికి ఐటి రంగం విలువ పడిపోయింది. ఇప్పుడు కూడా సేవా రంగంలో ఉన్న ఐటి సంస్థలకు ముప్పు తప్పదని, ప్రస్తుతం పెద్ద పెద్ద ఐటి కంపెనీలన్నీ కూడా ఉద్యోగు లను తొలగించి, సంస్థలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అంటారు. నిన్న మొన్నటి వరకూ ట్విట్టర్‌, ‌ఫేస్‌బుక్‌, ‌యూట్యూబ్‌ ‌తదితర సంస్థల్లో భారీ జీతాలతో ఉద్యోగాలు చేస్తూ, జల్సా జీవనశైలిని సాగించిన యువతకు ఉద్యోగాలు కోల్పోవడం, లేక జీతాలు భారీగా తగ్గడంతో ఆకాశంలో విహరిస్తూ ఒక్కసారి భూమి మీద పడ్డట్టు అయింది.

కోవిడ్‌ ‌మహమ్మారి రాక ప్రపంచంలోని పరిణామాలను అనూహ్యంగా మార్చివేసింది. ఉత్పత్తి మూతపడడం, ఆర్ధిక వ్యవస్థలు కుదేలుకావడం, వైద్య, ఆరోగ్య రంగాల అసలు రంగు బయిటపడడం, అభివృద్ధి చెందిన దేశాల స్వార్ధ ప్రయోజనాలు ఎలా ఉంటాయో, ఎంతటి విషాదాన్ని అయినా వ్యాపార మయం చేసేందుకు ఎలా ప్రయత్నిస్తాయో ప్రపంచం చూసింది. తమ వాక్సీన్లను కొనుగోలు చేయాలన్న నిబంధనల కారణంగా, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు సాయం కోసం భారత్‌ ‌వైపు చూసిన వైనం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని వాక్సిన్‌ ‌దౌత్యం మనందరికీ గుర్తున్న విషయమే. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు ఎదుగుతున్న భారత్‌ను, దాని శక్తి సామర్ధ్యాలను గుర్తించాయన్నది నిర్వివాదాంశం. సౌదీ అరేబియా నుంచి ఆఫ్రికా దేశాల వరకూ ప్రతి దేశమూ కూడా నేడు భారత్‌ ‌వైపు మొగ్గు చూపడం మనం చూస్తున్నాం.

ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ హోదాను భారతదేశం సాధించడమే కాదు ఈ క్రమంలో బ్రిటన్‌ను వెనక్కి నెట్టివేసిన విషయం తెలిసిందే. అతి కొద్ది సంవత్సరాలలో అతిపెద్ద మూడవ ఆర్ధిక వ్యవస్థగా రూపొందేందుకు దూసుకు వెడుతున్న భారత్‌తో వ్యాపార ఒప్పందాలు చేసు కునేందుకు అమెరికా సహా ప్రపంచదేశాలన్నీ మక్కువ చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ ‌దేశాలు (బ్రెజిల్‌, ‌రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా) అన్నీ కూడా యూరో తరహాలో ఒక సామాన్య కరెన్సీని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. అందువల్లనే, బంగారం సహా అమూల్య మైన లోహా లన్నింటికీ విలువ పెరిగిపోవడం, పలు దేశాలలో వాటి గనులు ఉన్నాయని వెలుగులోకి రావడం జరుగుతున్నది. వీటి లంకెతో బ్రిక్స్ ‌కరెన్సీ వస్తే డాలరు విలువ మరింత పతనం కాక తప్పదు. తన ప్రవేశంతో, డాలరు రిజర్వు కరెన్సీ హోదాలో 20శాతాన్ని యూరో లాక్కుంది. ఇక బ్రిక్స్ ‌కరెన్సీ వస్తే డాలర్‌ ‌పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా బ్రిక్స్ ‌కరెన్సీ ప్రజాస్వామికంగా ఉంటుందని, దేశాలు దానిలోకి స్వేచ్ఛగా ప్రవేశించవచ్చు, నిష్క్రమించవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం విఫలమైనప్పటికీ, ఈ దేశాలు తమ లావాదేవీలకు మారకంగా తిరిగి డాలర్‌ను వాడేందుకు సిద్ధంగా ఉండవని, ద్వైపాక్షిక, బహుళ పాక్షిక ఒప్పందాల ద్వారా తమ దేశీయ కరెన్సీలతో వ్యాపార లావాదేవీలను నిర్వహించుకుంటాయని వారి చెప్తున్నారు.

డాక్టర్‌ అం‌కిత్‌ ‌షా విశ్లేషణ ప్రకారం, ఉక్రెయిన్‌ ‌యుద్ధం డీ డాలరీకరణ ఘర్షణ. ఐరోపా దేశాల ఆయుధాలను, ఆర్ధిక వ్యవస్థలను బలహీనం చేయడం ద్వారా తన కరెన్సీకి కొంత విలువ నిలుపుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నది. ఈ పరిణామాలన్నింటి కారణంగా, 2025-26 నుంచి ఆమెరికాలో వేతనాల స్థాయిలో 60శాతం, సామాజిక లబ్ధులలో 35శాతం, 45 శాతం ఉత్పత్తుల ధరల పెరుగుదల, 25శాతం రక్షణ రంగంలో కోతలు ఉంటాయని ఆయన అంచనా. ఈ దెబ్బతో అమెరికా సామాజిక విలువలలో కూడా మార్పు రాక తప్పదని, ఫియాట్‌ ‌డాలర్‌ ‌కారణంగా వ్యక్తులలో పెరిగిన వ్యక్తివాదం, అహం కారం వంటివన్నీ తగ్గి, కుటుంబవిలువలను స్వీకరించే పరిస్థితి వస్తుందని ఆయన అంటున్నారు. మంచి చదువు, కుటుంబం, పొదుపు చేసే అలవాటు ఉన్నవారికే బ్యాంకు రుణాలు ఇచ్చే పరిస్థితులు రావడంతో పిల్లలు, పెద్ద ప్రస్తుత సామాజిక విలువల్లో మార్పు వచ్చే అవకాశముందని, అందుకు భారతీయ నాగరికతా విలువలే మార్గదర్శకం అవుతాయని షా అంటున్నారు.

ప్రస్తుతం, సౌదీ అరేబియా సహా అరబ్బు దేశాలన్నీ ఫియాట్‌ ‌డాలరు మోజులో తాము చేసిన తప్పిదాలను గుర్తిస్తున్నాయి. ఈ డాలర్ల మోజులో తాము 50శాతం ముడి ఇంధనాన్ని ఎలా వృధా చేశామో, పెట్రో డాలరును సజీవంగా ఉంచేందుకు అర్థం లేని తీవ్రవాదానికి మద్దతునిచ్చి, అనవసరమైన ఘర్షణలలో ఎలా పాల్గొ న్నాయో గుర్తించాయి. అందుకే, ప్రస్తుతం ఆ దేశాలు తీవ్రవాదం, మతపరమైన అంశాలకు బదులుగా సామాజిక, ఆర్ధిక అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాయి. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. డాలర్‌ ‌పతనంతోనే, తీవ్రవాద నిర్మూలన, నిస్సైనికీకరణ, మతమార్పిడులకు బ్రేకు, అంతిమంగా కమ్యూనిజాన్ని తిరస్కరిం చే పరిస్థితులు వస్తాయనే డాక్టర్‌ ‌షా విశ్లేషణ వాస్తవమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రపంచం భారతీయ నాగరికతా విలువల దిశగా ప్రయాణించేందుకు మార్గం సుగమం అయ్యే సూచనలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.

– డి.అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram