– మోచర్ల అనంత పద్మనాభరావు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

జిల్లా సెషన్స్ ‌న్యాయస్థానం హాలు కిక్కిరిసి ఉంది. న్యాయమూర్తి కుమారి బీబి అందరికీ నమస్కరిస్తూ తన స్థానంలో కూర్చున్నారు. కళ్లు మాత్రం కనిపించేలా ఆమె ముఖమంతా కప్పబడిన వస్త్రం మొదటిసారి న్యాయస్థానాని కొచ్చిన వారిలో ఆసక్తిని కల్గించింది.

రోజువారీ కేసుల విచారణతో న్యాయస్థానం ప్రారంభమయింది. పట్టణంలో సంచలనం సృష్టించిన వినూత్న ఇంజనీరింగ్‌ ‌కాలేజీ విద్యార్ధినిపై జరిగిన యాసిడ్‌ ‌దాడి కేసు వాదనలు జరగుతు న్నాయి. స్థానిక శాసనసభ్యుడి కొడుకు, అదే కాలేజీ విద్యార్థి అయిన మానవ్‌ను నిందితుడిగా న్యాయ స్థానంలో పోలీసులు ప్రవేశపెట్టారు.

అప్పటికే కేసు విచారణ మొదలై ఆరు వారా లయ్యింది. బాధితురాలి పక్షాన పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ అభియోగపత్రం, నేరనిరూపణకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. సాక్షులను విచారించి నిందితుడిని దోషిగా నిరూ పించడానికి తన శక్తియుక్తులను వినియోగించారు. అటు నిందితుడి పక్షాన హైదరాబాదు నుంచి వచ్చిన సీనియర్‌ ‌న్యాయవాది వాదనలను బలంగా వినిపిం చారు. తన క్లయింటు నేరం చేయలేదని, అది కల్పిత ఘటనని, దానిని నిరూపించడానికి అవసరమైన ఆధారాలు, సాక్షులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి తన తెలివితేటలతో వాదనా పటిమతో నిందితుడు నిరపరాధని న్యాయస్థానానికి తెలిపారు. కేసు విచారణ దాదాపు చివరికొచ్చింది.

ముగింపు వాదనలను వినడానికి సిద్ధమైన న్యాయమూర్తి అప్పటి వరకు జరిగిన వాదోప వాదాలకు సంబంధించిన కాగితాలను ఓసారి తిరగేసారు. కేసు విచారణ మొదలైంది

‘‘మేడం జడ్జి!’’ పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌, ‘‘‌మళ్లీ ఓసారి కేసు పూర్వాపరాలను న్యాయస్థానం ముందుంచ డానికి అనుమతి కోరుతున్నాను. నిందితుడు వినూత్న ఇంజనీరింగ్‌ ‌కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అతని తండ్రి గౌరవ శాసన సభ్యుడు. ఆ కాలేజీ అతని ఆధ్వర్యంలోనే నడుస్తోంది. తండ్రి అధికారబలం, ధనబలం నిందితుడిని చదువుకు దూరం చేసి జులాయితనానికి దగ్గర చేసింది. వారసత్వపు రాజకీయాలు అతణ్ణి యువజన నాయకుడిని చేసాయి. బాధితురాలు కూడా అదే కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమె చాలా తెలివైన విద్యార్థిని. చెడును ప్రతిఘటిస్తుంది, అన్యాయాన్ని ఎదిరిస్తుంది. అరకొర వసతులతో, అనుభవజ్ఞులైన అధ్యాపకుల కొరతతో, కాలేజీని నడుపుతున్న యాజమాన్య తీరును పదేపదే ప్రశ్నించేది. సోషల్‌ ‌మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చేది. ఈమె ప్రవర్తన యాజమాన్యానికి కంటగింపుగా ఉండేది. కాలేజీ పాలకవర్గ అధ్యక్షుడైన గౌరవ శాసనసభ్యుడు బాధితురాలిపై క్రమశిక్షణ చర్యలు తప్పదని పలుమార్లు హెచ్చరించాడు

బాధితురాలి వైఖరిని నిందితుడు తన తండ్రిపై వ్యక్తిగత ద్వేషంగా భావించాడు. ఆమెకు బుద్ధి చెప్పాలని ఓ పథకాన్ని రచించాడు. ఆమె స్నేహితు రాలి ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆమెను ఆకర్షించడానికి చాలా ప్రయత్నాలు చేసాడు. కాని అతని ప్రవర్తన నచ్చని బాధితురాలు అతనికి దూరంగా మసలింది. నిందితుడు తన తీరు మార్చు కోకుండా ఆమె వెంటపడి ప్రేమించాలంటూ వేధిం చాడు. ఆమె తిరస్కరించడంతో చంపుతానని బెదిరిం చాడు. అతని బెదిరింపులకు భయపడి ఆమె తల్లిదండ్రులు గౌరవ శాసనసభ్యుడితో తమ గోడు చెప్పుకుని, కుమార్తెకు రక్షణ కల్పించాలని మొర పెట్టుకున్నారు. కొడుకును సమర్థించిన ఆ తండ్రి, బాధితురాలిదే తప్పంతా అన్నట్టుగా మాట్లాడి, వాళ్లను అవహేళన చేసాడు. వేరే గత్యంతరం లేక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆ ఫిర్యాదును బుట్ట దాఖలు చేసిన పోలీసులు, సమస్యను సామ రస్యంగా పరిష్క రించుకోవాలని వారికి సలహా ఇచ్చారు.

ఈ పరిస్థితులు బాధితురాలిని మనో వేదనకు గురిచేశాయి. చదువుపై తగిన శ్రద్ధ పెట్టలేక తనలో తాను కుమిలిపోయింది. స్నేహితుల వద్ద తన బాధను వెళ్లగక్కేది. ఇదిలా ఉండగా గత నెల ఐదో తేదీన, బాధితురాలు ఒంటరిగా కాలేజీ నుండి వెళ్తోంటే, నిందితుడు ఆమెను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తిం చాడు. ఆమెను బలాత్కారం చేయబోయాడు. అతని అనైతిక ప్రవర్తనను ప్రతిఘటిస్తూ బాధితురాలు సహాయం కోసం గట్టిగా అరిచింది. ఆ సమయంలో నిందితుడి తండ్రి కూడా కాలేజీ ఆవరణలోనే ఉన్నాడు. అక్కడున్న కాలేజీ సిబ్బంది తమ కళ్ల ముందే అఘాయిత్యం జరుగుతున్నా ఉద్యోగం పోతుందేమో నన్న భయంతో ఆపలేకపోయారు. బాధితురాలి ప్రతిఘటన,తిరస్కరణ సహించని నిందితుడు ఆమెపై యాసిడ్‌ ‌పోసాడు. గాఢమైన యాసిడ్‌ ఆమె ముఖాన్ని, శరీరాన్ని తీవ్రంగా గాయపరచింది. గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఊగిస లాడింది. వైద్యులు తీవ్రంగా శ్రమించి ఆమె ప్రాణాలను కాపాడగలిగారు. గాయాల తీవ్రతకు ఆమె ఒక కన్నును పోగొట్టుకుంది. యవ్వనంతో మిసమిస లాడాల్సిన ఆమె ముఖం కాలిపోయి వికృతంగా మారింది. నిందితుడు పైశాచికత్వంతో చేసిన పనికి ఆమె జీవితం బుగ్గి పాలయ్యింది. ఆమె బ్రతుకు, భవిష్యత్తు అగమ్య గోచరంగా మారాయి. చట్టసభలో సభ్యుడైన నింది తుడి తండ్రి, చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించకుండా పుతప్రేమతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేసాడు.’’

పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌వాదనను జనం నిశ్శబ్దంగా వింటున్నారు .

‘‘మేడం జడ్జి! నిందితుడు ఉద్దేశపూర్వకంగా బాధితురాలిపై యాసిడ్‌ ‌పోసి, ఆమెకు శాశ్వత వైకల్యం, కన్ను పోగొట్టడం, మానసిక హింసకు, మనోవేదనకు గురిచేసాడు. ఇది × సెక్షన్‌ 326  ‌క్రింద ఘోరమైన నేరం. తరతరాలుగా స్త్రీల పట్ల జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలను తీవ్రమైన నేరాలుగా పరిగణించాలి. వాటిని మనమంతా ప్రతిఘటించాలి. చట్టాలు, న్యాయస్థానాలు, చట్ట సభలు స్త్రీకి రక్షణ, భరోసా కలిగించాలి. ఆ నేరాలను చేసిన దోషులను నిర్దా క్షిణ్యంగా, కఠినంగా శిక్షించాలి. బాధితురాలికి చట్టాలు, న్యాయస్థానాలు ఎప్పుడూ అండగా ఉంటాయనే భరోసా నిస్తూ, భవిష్యత్తులో స్త్రీలపై ఎవరూ అత్యాచారాలక• పాల్పడకుండా నింది తుడికి కఠినమైన శిక్ష విధించాలి. మేడం జడ్జీ! × 326 సెక్షన్‌ ‌నిందితుడి నేరా నికి తగిన శిక్షను నిర్వ చిస్తోంది. ఆ సెక్షన్‌ ‌క్రింద నేరాన్ని పరిగణించి నింది తుడిని కఠి నంగా శిక్షించాలని, బాధితు రాలి ఆరోగ్యం కుదుటపడే వరకు వైద్య ఖర్చులన్నీ నింది తుడే భరించేలా తీర్పునియ్యాలని గౌరవ న్యాయస్థానాన్ని ప్రార్థిస్తున్నాను.’’అంటూ వాదనను ముగించాడు.

నిందితుడి తరపు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ, ‘‘గౌరవ న్యాయమూర్తి మేడం! పవిత్రమైన ఈ న్యాయస్థానంలో ఎన్నో అబద్ధాలు, మరెన్నో కట్టుకథలు వినిపించారు మిత్రులు, గౌరవనీయులైన పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌. అసలు చేయని నేరాన్ని నా క్లయింటుకు ఆపాదించి అతనిని, అతని తండ్రైన గౌరవ శాసనసభ్యుడి పరువు, ప్రతిష్టలను దెబ్బతీయ డానికి ప్రయత్నించారు. సంఘంలో నా క్లయింటుకు తండ్రి ద్వారా సంక్రమించే పలుకుబడి, హోదా, అంతస్తులకు ఆశపడి ఫిర్యాదుదారు, ఆమె తల్లి దండ్రులు ఉద్దేశపూర్వకంగా నేరానికి కారకు లయ్యారు. నిజానికి ఈ ఫిర్యాదుదారే నా క్లయింటు వెంబడి తిరిగి తనను ప్రేమించమని వేధించింది. నా క్లయింటు తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, తనవల్ల తండ్రి పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్ల కూడదనే సత్సంకల్పంతో ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించాడు. అయినా ఫిర్యాదుదారు బరితెగించి తన కోర్కెను నెరవేర్చకపోతే ఎంతటి అఘాయిత్యాని కైనా పాల్పడతానని బెదిరించింది. చివరికి అన్నంత పని చేసింది. తనకు తానే యాసిడ్‌ ‌పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ నేరాన్ని అమాయకుడైన నా క్లయింటుకు అంటగట్టడానికి ఎన్నో అబద్ధపు ఆధారాలను, సాక్ష్యాలను సృష్టించింది. ఆ సాక్ష్యా ధారాలను గౌరవ న్యాయస్థానం పరిగణలోకి తీసుకో వద్దని కోరుతున్నాను. గౌరవ న్యాయమూర్తి మేడం! ప్రజలలోనే కాదు , రాష్ట్రంలో కూడా గొప్ప ప్రజా సేవకుడిగా, గౌరవ శాసనసభ్యుడిగా పేరు గాంచిన తండ్రికి కుమారుడైన నా క్లయింట్‌ ‌నిరపరాధి, నిర్దోషి అని విన్నవించుకుంటూ అతని ఉజ్వలమైన భవిష్యత్తును కాపాడాలని కోరుతూ, ఈ అబద్ధపు కేసును కొట్టివేయ వల్సిందిగా గౌరవ న్యాయస్థానాన్ని ప్రార్థిస్తూ నా వాదనను ముగిస్తు న్నాను.’’ అతిశయంగా అని కూర్చున్నాడు.

ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి, ‘‘ఈ కేసులో వాదనలు ముగిసాయి. తీర్పు చెప్పడం కోసం కేసును వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాను.’’ అని చాంబర్‌కి వెళ్ళిపోయారు.

……………..

సంచలన కేసులో ఎటువంటి తీర్పు వస్తుందోననే ఆసక్తితో న్యాయస్థానం జనంతో నిండిపోయింది. సరిగ్గా పదకొండు గంటలకు తీర్పు చదివి వినిపించ డానికి న్యాయమూర్తి సిద్ధమయ్యారు. ఎటువంటి తీర్పు వస్తుందోనని ఇరుపక్షాలలో ఉత్కంఠ నెలకొంది.

న్యాయమూర్తి తన ముందున్న కాగితాలను చూస్తూ మెల్లగా, స్పష్టంగా చదవడం ప్రారంభిం చారు. కేసు వివరాలు, నేర అభియోగం, నేరం జరిగిన తీరు, సంగ్రహంగా వివరిస్తూ, ‘‘ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన పిదప, ఇటువంటి నేరాలపై వివిధ న్యాయస్థానాలలో న్యాయమూర్తులిచ్చిన తీర్పులను క్షుణ్ణంగా పరీక్షించిన మీదట ఈ కేసుపై నేను తీర్పును ఇస్తున్నాను. ప్రపంచం సాంకేతికతతో పురోగ మిస్తోంది. దేశం ప్రగతి పథం వైపు అడుగులేస్తోంది. విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో ఆవిష్క రణలు, మరెన్నో విజయాలు. యువత ఆధునికతను సంతరించుకుని ముందుకు దూసుకెళ్తోంది. అయినా నేటి స్త్రీ ఈ పురుషాధిక్య ప్రపంచంలో తన అస్తిత్వాన్ని నిలుపుకోడానికి ఇంకా పోరాడుతోనే ఉంది. కొన్ని సందర్భాలలో వివక్షతకు గురౌతూనే ఉంది. ప్రపంచం ఎంత పురోగమిస్తున్నా దేశ, విదేశాలలో స్త్రీలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశం, ముఖ్యంగా మన రాష్ట్రం అందుకు మినహాయింపు కాదు.’’

‘‘సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఇలాగే యాసిడ్‌ ‌దాడికి గురైంది ఓ పదిహేనేళ్ళ బాలిక. పేరు నాంచారి. ఇది ఆమె యదార్థ, దీనగాథ ఇక్కడ చెప్పడానికి ఇది సరైన సందర్భమని నేను భావిస్తు న్నాను దయచేసి నిశ్శబ్దంగా వినండి.

‘యాసిడ్‌ ‌దాడి జరిగిన తర్వాత చావుబ్రతుకుల పోరాటమయ్యింది ఆమె జీవితం. యాసిడ్‌ ‌వలన ముఖమంతా వికృతంగా మారిపోయింది. ఆమె తన ముఖాన్ని అద్దంలో చూసుకోడానికి భయపడేది. కాలిన గాయానికి మందు రాయాలన్నా, కట్టు కట్టా లన్నా డాక్టర్లకు సాధ్యమయ్యేది కాదు. ఆమె ముఖంపై కాలిన చర్మాన్నంతా పూర్తిగా తీసివేయడానికి ఆపరేషన్‌ ‌చేస్తే గాని కుదర్లేదు. అలా నాలుగు ఆపరేషన్లు జరిగాయి. ఆమె కోలుకోవడానికి మరో మూడో, నాలుగో ఆపరేషన్లు చెయ్యాలన్నారు డాక్టర్లు. ఆమె ఆర్ధిక పరిస్థితి అందుకు సహక•రించలేదు. శరీర బాధకన్నా ఆమెను అమితంగా బాధ పెట్టినదేమి టంటే… ఆమె ఆప్తుల ప్రవర్తన. తన వాళ్లనుకున్న వాళ్లెవరూ, చివరికి ఆమె స్నేహితులు కూడా ఆమెను చూడడానికి ఇష్టపడలేదు. ఏడు సంవత్సరాల పాటు ఇంట్లోనే ఉండిపోయింది. ఎక్కడకైనా వెళ్లాలంటే ముఖాన్ని గుడ్డతో కప్పుకుని వెళ్లేది. ఆమెపై దాడి చేసిన వ్యక్తి బెయిలుపై విడుదలై పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. కానీ, ఆమె బ్రతుకు మాత్రం బండలు పాలైంది. కనీసం స్నేహ హస్తాన్నందిచ డానికి కూడా ఎవ్వరూ రాని స్థితిలో, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందు కొస్తారు? తన వికృత రూపానికి ఆమేం చేయగలదు? ఇంకో కొత్త మొహం కొనుక్కోలేదుగా?

తండ్రికి సాయం చేయడానికి ఉద్యోగ ప్రయ త్నాలు చేసింది. ఏ ఆఫీసు కెళ్లినా ఆమె వికృత రూపాన్ని చూసి అసహ్యించుకునే వాళ్లే తప్ప బ్రతుకు తెరువు చూపించే వారు కరువయ్యారు. ఎందుకు…? తప్పెవరిది…? దివ్యాంగులుగా జన్మించిన వారిని, పుట్టు కబోదులను కూడా సమాజం ఆదరిస్తోంది. మరి అందరూ ఆమెనెందుకు అసహ్యించుకుంటు న్నారో చాలా కాలం ఆమెకు బోధపడ•లేదు. తన అందమైన రూపాన్ని కోల్పోయి, తన్నెవరూ గుర్తించ లేని పరిస్థితుల్లో, మానభంగానికి గురైన స్త్రీ కంటే హీనంగా మారింది ఆమె బ్రతుకు. తండ్రి ఆరోగ్యం పాడై మంచం పట్టాడు. వారి కుటుంబ పరిస్థితి మరింత దిగ జారింది. ఆ సమయంలో ఆమెను ఆదుకున్నారు ఓ వృద్ధ దంపతులు. ఆమె వైద్య ఖర్చులు భరించి ఆపరేషన్లు చేయించారు. చదువు చెప్పించారు. వారి ఆసరాతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అప్పుడే ఆమెకు కొత్త స్నేహితులు దొరికారు. వాళ్లూ యాసిడ్‌ ‌బాధితులే. యాసిడ్‌ ‌దాడిలో ఆమెకు ఒక కన్ను మాత్రమే పోయింది. కానీ వాళ్లలో కొంతమందికి రెండు కళ్లు పోయి గ్రుడ్డి వాళ్లయ్యారు. కళ్లున్న వాళ్లు ఒక్కసారి కళ్లకు గంతలు కట్టుకుంటే తెలుస్తుంది వాళ్ల చీకటి బ్రతుకుల వ్యథ.

ఆమెపై దాడి చేసిన వాడికి శిక్ష విధించారు. ఆ శిక్ష ముగించుకుని హాయిగా జీవితాన్ని గడుపుతు న్నాడు. మరి ఆమె జీవితం పగలూ, రాత్రిలా మారి పోయింది. గాయాలు జీవితాంతం ఆమెను వెంటాడు తాయి. ఎవరూ సహాయ పడకపోయినా ఆమె జీవితం సాగిపోతూనే ఉంటుంది. సుమారు ఆరు, ఏడూ ఆపరేషన్లు చేయించుకుంది. దానికెంత ఖర్చయ్యిందో ప్రభుత్వానికి, న్యాయస్థానానికి తెలీదు. తెల్సుకోవాలని కూడా ఆ రెండూ అనుకోలేదు. ఎందుకంటే నామమాత్రపు రుసుమును మాత్రమే దోషి చెల్లించా లని తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. చిన్న దేశాలు కూడా స్త్రీల పట్ల జరుగుతున్నా అన్యాయాలను అరికట్టడానికి ఎన్నో కఠిన చట్టాలను అమలు పరిచాయి. దోషులను కఠినంగా శిక్షిస్తున్నాయి. మన దేశంలో కూడా ఆ మార్పు రావాలి’ అంటూ, న్యాయ మూర్తి మెల్లగా తన కుర్చీలోంచి లేచి మౌనంగా నిలబడ్డారు. అక్కడెదో సంతాపసభ జరుగుతోందేమో నన్నట్టుగా బరువెక్కిన హృదయా లతో అందరూ లేచి నిలుచున్నారు. అందరి కళ్లలో బాధ. కొందరైతే బాహాటంగానే కన్నీళ్లు కారుస్తు న్నారు. మరికొందరు మౌనంగా రోదిస్తున్నారు.

‘‘ఇప్పుడు ఆమెను మీకు పరిచయం చేయ బోతున్నాను.’’ అంటూ న్యాయమూర్తి సున్నితంగా తన ముఖానికి చుట్టుకున్న వస్త్రాన్ని తొలగించారు. ఆ ముసుగు వెనకాల దాచుకున్న వికృత రూపం బహిరంగమైంది. అందరూ అవాక్కయ్యారు. కొందరు దాన్ని చూడలేక కళ్లు మూసుకున్నారు. కొందరు జాలిగా నిట్టూర్చారు మరికొందరు సానుభూతి కురిపించారు. ఎవరి భావాలు ఎలా ఉన్నా ఆమె చలించని హృదయంతో విగ్రహంలా ఉండిపోయింది. తిరిగి తలకు వస్త్రం చుట్టుకుని,

‘‘వ్యక్తిగా పోరాడలేని నేను, చట్టాన్ని అమలుపరిచే శక్తిగా మారాలనుకున్నాను. అందుకనే న్యాయశాస్త్రం చదువుకున్నాను. అంచెలంచెలుగా నా గమ్యాన్ని చేరుకుంటున్నాను. నాకో కల ఉంది. దాన్ని సాకారం చెయ్యాలి. యాసిడ్‌ ‌దాడికి గురైన స్త్రీలకు ఆర్థ్ధిక స్వావలంబన కోసం పోరాటం జరపాలి. నా ఊపిరున్నంత వరకు ఆ పోరాటం ఆగకూడదు. నా స్వానుభవం నాకు శక్తినిచ్చింది.

ప్రస్తుత కేసులో కాలేజీ విద్యార్ధి మానవ్‌ ‌తన తోటి విద్యార్థినిపై అమానవీయంగా ప్రవర్తించాడు. ఆమె శీలాన్ని హరించడానికి ప్రయత్నించాడు. ఆమెపై యాసిడ్‌ ‌పోసి ఆమె రూపాన్ని వికృతంగా చేసాడు. ఆమె జీవితాన్ని సంక్షోభంలో పడేసాడు. దీనికి కారణం అతని తండ్రి హోదా, ధనాహంకారం. వాటి అండతో ఒక యువతి పట్ల హీనంగా, హేయంగా ప్రవర్తించాడని సాక్ష్యాధారాలతో రుజువైంది. ప్రాసిక్యూషన్‌ ‌వారు ఉటంకించిన × 326, సెక్షన్‌ను పరిగణలోకి తీసుకుని నిందితుడు మానవ్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, బాధితురాలికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరేవరకు అయ్యే వైద్య ఖర్చులన్నీ భరించాలని తీర్పునిస్తున్నాను. ఇవి వెంటనే అమలులోకి వస్తాయి.

నేటి యువతరం అహంకారంతో, విచ్చలవిడి తనంతో పెడదారులు పడ్తోంది. వారిని సరైన మార్గంలో పెట్టవలసిన బృహత్తర బాధ్యత తల్లి దండ్రులపై ఉంది. వేగంగా ఉరికే వరదకు అడ్డుకట్ట వేయాలి లేకపోతే అది ఊళ్లను, వాడలను ముంచు తుంది. మానవ్‌ ‌దుష్ప్రవర్తన అతని తండ్రి దృష్టిలోకి వచ్చినా, ఆయన నివారించలేదు. తన పాలకవర్గంలో నడుస్తున్న కాలేజీలో ఒక విద్యార్థినిపై జరుగుతున్న అకృత్యాన్ని అడ్డుకోకపోవడమనేది అతని బాధ్యతా రాహిత్యం. గౌరవ శాసనసభ్యుడై ఉండి కూడా ఆ దుశ్చర్యను పరోక్షంగా ప్రోత్సహించి, చట్టాన్ని, న్యాయాన్ని అగౌరవ పర్చినట్టుగా న్యాయస్థానం భావిస్తోంది.

ఇటువంటి దుష్ప్రవర్తన శిక్షించదగినదే. గౌరవ శాసనసభ్యుడి ప్రవర్తన సభ్య సమాజానికి అవమానకరం. చట్టసభలలో వారు చేసిన చట్టాలకు వాళ్లు అతీతులు కారు. ఇది చర్చనీయాంశం. దేశ ప్రజలు, న్యాయకోవిదులు, మేధావులు విస్తృతంగా చర్చించవలసిన అంశం. చట్టసభల్లో చర్చించి, సభ్యులు తగిన రీతిలో రాజ్యాంగ సవరణలు చేపట్టవలసిన అవసరముందని ఈ న్యాయస్థానం భావిస్తోంది.’’

స్త్రీల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేసేలా ఇచ్చిన తీర్పు కాగితాలపై ఆత్మవిశ్వాసంతో సంతకం చేసారు న్యాయమూర్తి కుమారి బీబీ నాంచారి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram