‘ఔను! మేం లవ్‌ ‌జిహాద్‌ ‌బాధితులం! మతోన్మాదుల చేతులలో వంచితులం! మమ్మల్ని మతం మార్చారు! మా శరీరాలను వాడుకున్నారు! హింసోన్మాదులను చేశారు!’ అని బాధిత యువతులు దేశం ముందుకు వచ్చి ఆక్రోశించిన దుర్ఘటన మే 17వ తేదీన ముంబైలో జరిగింది. వారంతా మతోన్మాదం కోరలకు చిక్కినవారు. మతోన్మాదంలోని కాముక బానిసత్వ వలలో పడిపోయినవారు భారతీయ అంధ మేధావులారా! బుజ్జగింపు బురదలో పొర్లుతున్న రాజకీయ నేతలారా! మేం చిత్రించిన ‘ది కేరళ స్టోరీ’ అబద్ధం కాదు, కల్పన కాదు, అందులో కనిపించేది ఒక మతం మీద ద్వేషం అసలే కాదు, వాస్తవం అని చెప్పడానికి ఆ చిత్ర నిర్మాత విఫుల్‌ ‌షా, దర్శకుడు సుదీప్తో సేన్‌ ‌నిర్వహించిన అసాధారణమైన పంచాయతీ అది. 26 మంది బాధితులను కొచ్చిన్‌ ‌నుంచి బాంద్రా (ముంబై) రంగశారద సభా మందిరానికి తీసుకువచ్చి ఇస్లాం మతోన్మాదం వారి మనసులకు చేసిన గాయాల గురించి వారితోనే వినిపించారు. ఇలాంటి వంచితులను కూడా అవహేళన చేసే దుస్థితికి చేరుకుంది దేశ మేధావి వర్గం. ఇక్కడ ఒక సంగతి గుర్తు చేసుకోవడం అనివార్యం. జూలై 15, 2004న మణిపూర్‌ ‌రాజధాని ఇంఫాల్‌లో అస్సాం రైఫిల్స్ ‌ప్రధాన కార్యాలయం ఎదుట  ఆ రాష్ట్ర ప్రౌఢ మహిళలు 12 మంది పూర్తి నగ్నంగా ప్రదర్శన నిర్వహించారు. మనోరమా తంగజం అనే ఒక యువతిని భద్రతాదళాలు అరెస్టు పేరుతో తీసుకుపోయి లైంగిక అత్యాచారం చేసి చంపినందుకు నిరసనగానే ఆ మహిళలు ఇంత తీవ్ర నిరసన చర్యకు దిగారు. అలాగే భద్రతా బలగాలలో కొందరు పాల్పడుతున్న లైంగిక అత్యాచారాలకు నిరసన ప్రకటించడం కూడా ఆ ప్రదర్శన ఉద్దేశం. భద్రతాదళాల చర్య ఒక ఘోరమైతే, ఆ మహిళల నగ్నప్రదర్శన సభ్య సమాజం చెంప చెళ్లు మనిపించేదే. భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే భద్రతాదళాలు చేసిన దుశ్చర్యలకు ఆ మహిళలు చేసిన ప్రదర్శన గురించి దేశంలో మేధావులు ఆనాడు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మీడియా ఆ వార్తతో నిండిపోయింది. ఏళ్ల తరబడి దాని ప్రస్తావన వస్తూనే ఉంది. మరి ఇప్పుడో! మభ్యపెట్టి మా శరీరాలను ఉపయోగించు కున్నారంటూ 26 మంది మహిళలు దేశం నడిబొడ్డున నిలబడి ఆక్రోశిస్తుంటే ఆ మేధావి బిరుదాంకితులు అవహేళన చేస్తున్నారేమిటి? టీవీ చానళ్లలో చులకన చేసి మాట్లాడు తున్నారేమి? కొందరు అసలు నోరే ఎత్తరేమి? ఎందుకంటే ఇది చేసింది ముస్లిం మతోన్మాదులు. ఆ 12 మంది మహిళల నగ్న ప్రదర్శన మీద అంత రచ్చ ఎందుకంటే అది భద్రతాదళాల మీద నిరసన కాబట్టి. పరోక్షంగా భారత ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టడం కాబట్టి. వీరంతా నిజంగా మేధావులైతే ఆ 12 మంది మహిళల నగ్న ప్రదర్శన పట్ల చూపిన జాలి,దయ, ఆగ్రహం, ఆక్రోశం, నిరసన ఈ 26 మంది యువతుల పట్ల కూడా చూపించి ఉండేవారు. కనీసం సానుభూతితో వారి కన్నీటి గాథ వినేవారు. మైనారిటీల తరఫున హక్కుల గురించి మాట్లాడడం వేరు. వారిని  సమర్ధించడం వేరు. వారు చేసిన ఘోర నేరాలను కప్పిపుచ్చడం వేరు. సరిగ్గా ఇక్కడే మన మేధోవర్గం కళ్లుండి కబోదుల్లా ప్రవరిస్తున్నారు. ఈ దేశ మేధావులు, ఉదారవాదులు ఈ స్థాయికి దిగజారిపోయారు. అయినా దేశ ప్రజలు స్పందించారు. ది కేరళ స్టోరీని ఆదరించి మేధావుల చెంప చెళ్లుమనిపించారు. పినరయ్‌ ‌విజయన్‌, ‌మమతా బెనర్జీ వంటి నేతలకు కర్రు కాల్చి వాత పెట్టారు.

న్యాయస్థానాలు చెప్పినా మన రాజకీయ నేతలకు తలకెక్కడం లేదు. ది కేరళ స్టోరీలో ముస్లిం వర్గాన్ని ద్వేషించినట్టు, దూషించినట్టు ఎక్కడో ఉందో చెప్పమని సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయినా కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హద్దులు లేని మూర్ఖత్వాన్ని ప్రదర్శించారు. ఆ చిత్రం విడుదలను అడ్డుకున్నారు. కోర్టు ఆదేశం తరువాత కూడా చిత్రం ప్రదర్శించకుండా థియేటర్ల యాజ మాన్యాలను బెదిరించారని వార్తలు వచ్చాయి. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ‌కూడా ఈ చిత్రాన్ని నిలిపివేయించారు. ఈ దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఎంత పాక్షికంగా ఉన్నదో తెలియ చేసే మరొక ఘటన ఇది. నిజమే, ఒక  ఘటన ఒక కళారూపంలోకి వచ్చిన తరువాత కొంత కల్పన ఉంటుంది. దీనికే క్రియేటివ్‌ ‌లిబర్టీ అని పేరు. దీనిని అతి దారుణంగా వక్రీకరించినవారు కూడా ఈ మేధావులే. ది కేరళ స్టోరీ చిత్రంలో కూడా కొంత కల్పన చేసినట్టు దర్శక నిర్మాతలే చెప్పుకున్నారు. అయితే ఈ చిత్రంలో కీలకాంశం లవ్‌ ‌జిహాద్‌ అసలు లేనే లేదని చెప్పడం ఎంతవరకు సబబు! 2010 జూన్‌ ‌మొదటివారంలో కమ్యూనిస్టు ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ ‌తమ రాష్ట్రంలో ముస్లిం, క్రైస్తవ మతోన్మాదం పెరిగిపోతోందని ప్రకటించి కేరళ, దేశ రాజకీయవేత్తలను, మేధావులను, ఉదార వాదులను బెంబేలెత్తించారు. పైగా దేశ రాజధానిలో విలేకరుల సమావేశంలో ఇలాంటి సత్యం ఆయన నోటి నుంచి వచ్చేసింది. మతోన్మాదులు మతాంతరీ కరణల ద్వారా తమ జనాభాను పెంచుకోవాలని చూస్తున్నారని మరొక దారుణ సత్యం కూడా బయటపెట్టేశారు. ఈ లక్ష్య సాధన కోసం యువతకు డబ్బు, ఆయుధాలు కూడా ఇస్తున్నారని చెప్పారు. ఈ లక్ష్యం కోసమే  వారు (జనాభా పెంచుకోవాలని చూస్తున్నవారు) హిందూ బాలికలను పెళ్లి చేసుకొన వలసిందని కూడా చెబుతున్నారని అచ్యుతా నందన్‌ ‌వెల్లడించారు (జూలై 27, 2010, ఎకనమిక్‌ ‌టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా). అచ్యుతానందన్‌ ‌ప్రకటనను బట్టి కేరళలో పెళ్లిళ్ల ద్వారా డబ్బు వెదజల్లడం ద్వారా పీఎఫ్‌ఐ ‌వంటి సంస్థలు ఇస్లాం విస్తరణకు పని చేస్తున్నాయని అనుకోవలసి వస్తున్నదని కాంగ్రెస్‌ ఆనాడు ధ్వజమెత్తింది కూడా. దీనితో సొంత పార్టీ (సీపీఎం) కూడా అచ్యుతానందన్‌ ‌మీద మాటల బెత్తం ఝళిపించింది. ఇక్కడితో అయిపోలేదు. జూన్‌ 25,2014‌న నాటి కేరళ ముఖ్యమంత్రి ఊమన్‌ ‌చాందీ సాక్షాత్తు రాష్ట్ర శాసనసభలో చేసిన ప్రకటన మాటేమిటి? 2006-2014 సంవత్సరాల మధ్య రాష్ట్రంలో 2,667 మంది యువతులను ఇస్లాంలోకి మతాంతరీకరణ చేశారని ఆయన చెప్పారు. అయితే వీరంతా కూడా బలవంతంగా మతం మారినవారు కాదని ముక్తాయించారు. లవ్‌ ‌జిహాద్‌కు ఆధారాలు లేవని ఈయన కూడా అన్నారు. అంటే ఒక వాస్తవం. వెంటనే దానికి బుజ్జగింపుగా ఒక అబద్ధం. కేరళలో హిందూ యువతులే కాదు, క్రైస్తవ యువతులను కూడా మతం మారుస్తున్నారు. సైరో మలబార్‌ ‌చర్చ్‌కు చెందిన బిషప్‌ ‌జోసెఫ్‌ ‌కల్లారంగట్ట ఏం చెప్పారు (సెప్టెంబర్‌ 9, 2021,ఇం‌డియన్‌ ఎక్స్‌ప్రెస్‌)? ‌రాష్ట్రంలో లవ్‌ ‌జిహాద్‌ ‌లేదనేవాళ్లు వాస్తవాలను గుర్తించలేకపోతున్నారు అని ఆయన ఆరోపించారు. మా యువతులను ప్రేమ వివాహాల పేరుతో తీసుకుపోతున్నారు. అంతేకాదు, వారి జీవితాలను ధ్వంసం చేస్తున్నారు అని ఆయన చెప్పారు. నాటి రాష్ట్ర పోలీస్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌లోక్‌నాథ్‌ ‌బెహరా అయితే కేరళ ఉగ్రవాద నియామకాల కేంద్రంగా మారిపోయిందని బాహాటంగానే చెప్పారు. ఇలాంటి కార్యకలాపాల కోసం ‘స్లీపర్‌ ‌సెల్స్’ ‌పనిచేస్తున్నాయని కూడా ఆ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఇవి చావా, ఈ దేశ మేధావి వర్గానికి! ఇవి చాలవా, వాస్తవాలను కనీసం అంగీకరించడానికి!

32,000 మంది యువతులను మతం మార్చి పంపేశారని చెప్పడం అతిశయోక్తి కాదా, అసలు దేశంలో ఉన్న ఐసిస్‌ ‌కార్యకర్తలు ఎందరు? ఇంత మందిని ఎలా తీసుకువెళతారు అంటూ చెత్త లెక్కలు చెబుతున్న కొందరు స్వయం ప్రకటిత విశ్లేషకుల మాటలు వింటుంటే వాంతి రావడం లేదా? వీరందరినీ ఒకేసారి మందలా తీసుకుని వెళ్లారని ఆ మాజీ నక్సల్‌, ‌వ్యాఖ్యాత ఉద్దేశంలా ఉంది.  ఇదంతా రహస్యంగానే జరిగింది. మూడో కంటికి తెలియకుండా సాగింది. ఈ చిత్ర నిర్మాణం కోసం ఆ బృందం ఏడేళ్లు పరిశోధన సాగించింది.

మే 17న మీడియా ముందుకు వచ్చిన కేరళ లవ్‌ ‌జిహాద్‌ ‌బాధితుల మాటలు కొన్ని తెలుసు కుందాం. 32,000 మందిని మతం మార్చారు అన్న మాట గురించి  నిర్మాత షా మాట్లాడుతూ, దీనిని ప్రచార చిత్రమని అంటున్నారని, కానీ ప్రజానీకం తమ చుట్టూ ఏం జరుగుతున్నదో ఈ సినిమాలో చూశారని అన్నారు. అసలు 32,000 మందిని ఎలా చూపించగలరు ఎవరైనా? వీరికి ప్రతినిధులుగా మూడు పాత్రలను సృష్టించి వాటి ఆధారంగా కథ నడిపారు. ఇందులో అబద్ధాలు చూపించారు అన్న ఆరోపణ దరిమిలా తాము బాధితుల పట్ల నిజమైన సానుభూతి కలిగిన వారిగా వారితోనే ఆ గాథలు తెలియచేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిజానికి ఈ సమావేశం ద్వారా చిత్ర నిర్మాత మరొక చక్కని పని చేశారు. కేరళ నుంచే కాకుండా దేశంలోని ఇంకొన్ని ప్రాంతాల నుంచి కూడా లవ్‌ ‌జిహాద్‌ ‌బాధితులను తీసుకువచ్చారు. ఆర్ష విద్యా సమాజం (కేరళ) సంస్థ నుంచి ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన యువతి శ్రుతి. తమ ఒక్క సంస్థే మతం మారిన 7000 మందిని (కేరళలో) తిరిగి హిందూ జీవన విధానంలోకి తెచ్చిందని ఆమె తెలియచేసింది. ఈమె కూడా లవ్‌ ‌జిహాద్‌ ‌బాధితురాలే. ఆ ఏడువేల మంది 1999, 2023 మధ్య స్వధర్మంలోకి  తిరిగి వచ్చిన వారు. ‘మన ఆడపడుచులను రక్షించుకుందాం’ పేరుతో ఆర్ష విద్యా సమాజానికి నిర్మాత రూ. 51 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న యువతులు ఇంకొందరు అభాగ్య యువతులను ఆ సాలెగూడు నుంచి రక్షించేందుకు శ్రమిస్తున్నారు. తమను ఆదుకొమ్మని కోరుతూ ప్రపంచం నలుమూలల నుంచి రోజుకు ఐదు నుంచి పది ఫోన్‌ ‌కాల్స్ ‌వస్తాయని సమాజ నిర్వాహకులు చెబుతున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు 15 ఏళ్ల వయసులో ఉండగానే మత మార్పిడికి సంబంధించిన ప్రయత్నాలు మొదలవుతున్నాయని కూడా వారు చెప్పారు. ఇక్కడే చిత్ర నిర్మాత షా చెప్పిన ఒక విషయం గుర్తు చేసుకోవాలి. పీఎఫ్‌ఐ ‌రద్దు కాక ముందు కేరళలో ఒక ప్రదర్శన నిర్వహించారు. అందులో హిందువులను, క్రైస్తవులను సామూ హికంగా వధిస్తాం అంటూ ఒక నినాదం వినపడింది. అది ఇచ్చినవాడు కేవలం పదేళ్ల బాలుడు. నూరు శాతం అక్షరాస్యత సాధించిన కేరళలో ఇస్లామిస్టుల గ్రామాలు, అక్కడ షరియత్‌ ‌నడుస్తున్న సంగతి గుర్తుంచుకోవాలని కూడా నిర్మాత ఒక విలేకరికి సమాధానం ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, కేరళలో ఇస్లాం జనాభా పెంచుకోవ డానికీ, ఆధిపత్యం చూపడానికీ, అలనాటి పోలీసు ఉన్నతాధికారి చెప్పినట్టు అదొక ఉగ్రవాదులను చేర్చుకునే కేంద్రంగా మారిందని చెప్పడానికే. లవ్‌ ‌జిహాద్‌ అం‌దులో భాగమే. అక్కడి విద్యార్థి వసతి గృహాలలో ముస్లిమేతరుల మీద మతాంతరీకరణ వల పడడం నిరంతర పక్రియ. మీకు అంతమంది దేవుళ్లు ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చారు? రాళ్లూ రప్పలని ఎందుకు పూజిస్తారు? వంటి ప్రశ్నలతో వేధిస్తారు. అంతిమంగా అది వారిని ఒక గందరగోళ స్థితిలోకి పంపుతున్నది. ఇదంతా మతాంతరీకరణ కోసం వ్యవస్థీకృతంగా జరిగిన ఏర్పాటు. ఇక్కడ పెద్ద బలహీనత- హిందువులకు తమ మతం పట్ల, అది నమ్మే విశ్వాసాల పట్ల అవగాహన లేకపోవడం. ఇంకొందరి పరిస్థితి ఏమిటి! వాళ్ల ఇంట్లో మార్క్సిస్టులు ఉంటారు. లేదా నాస్తికులమని పేరు ఉంటుంది. ఆ కీర్తిని వదులుకోలేక చాలామంది హిందూ యువతీయువకులు ఆ ప్రశ్నలకు మౌనంగా ఉండిపోతున్నారు. ఈ మధ్య కమ్యూనిస్టులలో కూడా కొంత మార్పు వచ్చినా, గడచిన మూడు తరాలలో ఆ సిద్ధాంతం పాతుకు పోవడం వల్ల జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ మౌనం ఆధారంగానే మతాంతరీకరణ మాఫియా ఖురాన్‌ను ఇస్తుంది. అది దేవుడు ఒక్కడే అని చెబుతుంది. ఇతరులను కాఫిర్లు అంటుంది. వారికి జీవించే హక్కు లేదని ప్రకటి స్తుంది. ఆ తరువాత జకీర్‌ ‌నాయక్‌, ఎంఎం అక్బర్‌ ‌వంటివారి మతోన్మాద ప్రవచనాలు వినపడతాయి. ఆపై నమాజ్‌, ‌ఖురాన్‌ ‌పఠనం, రంజాన్‌ ఉపవాసాలు మొదలవుతాయి. మీ అమ్మానాన్నా కాఫిర్లు కాబట్టి మీరు వారి మాట లెక్కచేయనవసరం లేదని యువతులకు హితబోధ మొదలవుతుంది.

యువతులను మాత్రమే కాదు, హిందూ యువకులను కూడా మతం మార్చారని చిత్ర అనే యువతి చెప్పింది. ఎవరైనా ఒకసారి మతాంతరీ కరణకు గురైతే ఇక కుటుంబాలతో సంబంధం తెగిపోతుంది. ఇలాంటి వాళ్ల గురించి గణాంకాలు ఏమీ లేవు. ఎందుకంటే వీళ్ల గురించి మాట్లాడడానికి ఏ కుటుంబమూ అంగీకరించదని కూడా ఆమె చెప్పారు. నిజానికి ఆ జీవితం నుంచి బయట పడిన తరువాత దాని గురించి తలుచుకోవడానికి కూడా ఇష్టం ఉండదని ఆమె వెల్లడించారు. అందుకే బయటపడ్డాక సాధ్యమైనంతవరకు రహస్య జీవితం గడుపుతారు. ఆర్ష విద్యా సమాజం నుంచి వచ్చిన అనఘ, అథిరా, చిత్ర, వైశాలి కూడా తమ గాథలు వెల్లడించారు. నిజానికి ఈ విలేకరుల సమావేశం బయటకు వెల్లడించలేదు కాని, లేకుంటే ఉగ్రవాద సానుభూతి పరులు, ఉదారవాదులు దీనిని తప్పక అడ్డుకునే వారన్న అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తున్నది. ఆర్ష విద్యా ఆశ్రమానికి రాకముందు వీరు ఒక ఇంటిలో ఉండేవారు.ఆ ఇంటికి విద్యుత్‌ ఆపివేయడం, ఆశ్రమానికి వెళ్లినప్పుడు ఆహార పదార్థాలన్నీ దొంగిలించడం వంటివి జరిగాయి. ఈ యువతు లంతా ఒకసారి రాత్రంతా ఏమీ తినకుండా ఉండి పోవలసి వచ్చింది.

ఈ 26 మందిలో ఎవరైనా ఐసిస్‌ ‌సంస్థలో చేరి బయటకు వచ్చినవారు ఉన్నారా అని విలేకరులు ప్రశ్నించగా, లేరని శ్రుతి నిజాయితీగా చెప్పారు. కానీ ఒకటి వాస్తవం. హిందూ యువతుల మీద వల విసిరిన వారంతా కూడా ఐసిస్‌ ‌కనుసన్నలలో ఉన్నవారే. రంగశారద భవంతికి వచ్చిన ఒక బాధితురాలు చెప్పిన మాటలు వింటూ ఉంటే ఇవాళ హిందూ సమాజం ఎంత ప్రమాదకర పరిస్థితులలో ఉందో అర్ధమవుతుంది. ‘హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం పూర్వకాలంలోనే చాలా సులభంగా ఉండేది. కృష్ణభగవానుడు, శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై రాక్షసపాత్రలను సంహరించగలిగేవారు. దుష్టశక్తులను తుదముట్టించేవారు. కానీ ఈ ఆధునిక యుగంలో ఇద్దరో ముగ్గురో కాదు, వేలాది దుష్ట శక్తులను సంహరించవలసి ఉంది. అది వాస్తవంగా అంత సులభం కాదు’ అన్నారామె

 కానీ హిందూ సమాజం మేల్కొంటున్న మాట నిజం. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో కేరళ స్టోరీని నిషేధించారు. అక్కడి హిందూ యువతీ యువకులు పక్కనే ఉన్న అస్సాం వెళ్లి ఆ చిత్రాన్ని చూసి వస్తున్నారన్న వార్తలు పెద్ద మార్పును సూచించేవే. ఈ చిత్రం 13 రోజులకే రూ. 165 కోట్ల రూపాయల వసూళ్లను సాధ్యం చేసింది. అది రూ. 200 కోట్లకు చేరుతుందని అంచనా. ఒక సినిమా, అది ఇస్తున్న మేలుకొలుపులతోనే హిందూ సమాజం ఎల్లవేళలా సజీవంగా ఉంటుందని అనుకోరాదు. కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌వలెనే ది కేరళ స్టోరీ వంటి చిత్రాలు కొన్ని వాస్తవాలు చెప్పడానికి అవసరమే. కానీ అంతకు మించి హిందూ సమాజం లోనే నిత్య జాగరూకత రావాలి. మన కుటుంబం, అందులో ధర్మం పట్ల ఉండాల్సిన దీక్ష, ఆచరణల గురించి శ్రద్ధ ఉండాలి. వాటిని పాటించాలి.

—————–

‘నేను గర్భవతిగా ఉండగా రెండేళ్ల క్రితం ఇది జరిగింది. శాలిని నాడు ఎదుర్కొన్న పరిస్థితి లోనే నేను కూడా ఉన్నాను (శాలిని.. చిత్రంలో ప్రధాన పాత్ర. అదాశర్మ నటించారు). సినిమాలో చూపించినట్టే అసిఫా, నేను ఇంకా చాలామంది యువతులు ఆ విద్యార్థి వసతిగృహంలో ఉండే వాళ్లం. అక్కడ కొందరు మామూలు విషయమే అన్నట్టు మతం గురించి చర్చ తీసుకువచ్చేవారు. ఆధ్యాత్మిక అంశాలలో వాళ్లు మమ్మల్ని గందర గోళంలోకి నెట్టేసేవారు. జరిగిందేమిటీ అంటే, మా మతం విషయంలో మాకు సరైన పరిజ్ఞానం లేనందువల్ల మేం పటిష్టంగా మాట్లాడలేక• పోయేవాళ్లం. అక్కడ మాతో ఉన్న ముస్లిం యువతులు మాత్రం దేవుడు ఒక్కడే, ఆయన అల్లా అని వాదించేవారు. ఆ సమయంలోనే వాళ్లు నాకు ఖురాన్‌ ‌హిందీ అనువాదం ఇచ్చారు. అదేమిటో, అది చదవగానే వాళ్ల రాక్షస కుట్రలో నేను పడిపోయాను. హిందూ ద్వేషిగా మారి పోయాను. నా కుటుంబాన్ని వదిలిపెట్టేశాను. ఇస్లాం తీసుకున్నాను. మా ఇంట్లో హిందూ భగవంతుడిని ఆరాధించేవారు. మేడ మీద నా గదిలో నేను నమాజ్‌ ‌చేసేదాన్ని. ఆ సమయంలో నా సమీప బంధువు కూతురి మీద నాకు చాలా కోపం కూడా వచ్చేది. ఎందుకంటే నేను నమాజ్‌ ‌చేయకుండా ఆమె అడ్డుకుంటూ ఉండేది. చివరికి ఎంతవరకు వచ్చిందంటే, నన్ను కన్నవాళ్లనే నేను కాఫిర్లు అని పిలవడం మొదలెట్టాను. ఇలాంటి పనులు వద్దని వాళ్లు అక్షరాలా నా కాళ్ల మీద పడి బతిమాలేవారు. దానికి నేను, మీరంతా కూడా ఇస్లాం తీసుకోండి. ఎవరు ఇస్లాం తీసుకోరో, వారంతా నరకానికి (జన్నుమ్‌) ‌పోతారని చెప్పేదాన్ని. ది కేరళ స్టోరీ చూశాక, అచ్చంగా నా కథలాగే అనిపించింది. ఆ క్షణంలో నాకు గుండె నిండా తనివితీరా ఏడవాలని అనిపించింది’

– అనఘా జైగోపాల్‌

—————–

‘‌సినిమా నిర్మాణం సమయంలో కథకు సంబంధించి నాకు అనేక వీడియోలు చూపించారు. యువతులను ట్యాంకర్లలోకి విసిరివేస్తున్న వాస్తవిక ఘటనలవి. కొందరు చనిపోయేవారు. వాళ్లకి ఆడది అంటే లైంగిక అవసరం. పిల్లలను కనే యంత్రం. ఆ పిల్లలు ఉగ్రవాదులుగా, మానవబాంబులుగా తయారవుతారు.’

– ఆదాశర్మ

————–

నిమిష (శాలినీ ఉన్నికృష్ణన్‌)

‌మే 17న ముంబై వచ్చి గాథలు వినిపించిన వారిలో ఐసిస్‌ ‌దాకా వెళ్లినవారు లేరు. ఆ విషయాన్ని వారు నిజాయితీగా ఒప్పుకున్నారు. అంతమాత్రాన ఐసిస్‌కూ కేరళ లవ్‌ ‌జిహాద్‌కూ సంబంధం లేదని చంకలు గుద్దుకోవడం అజ్ఞానం. అందుకు గొప్ప ఉదాహరణ నిమిష. మతం మారిన తరువాత ఈమే ఫాతిమా అయింది. ఈ పాత్రనే శాలినీ ఉన్నికృష్ణన్‌ ‌పేరుతో చిత్రించారు. ఇదే నాయిక పాత్ర. ఈమెతో పాటు ముస్లిం ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరిన మరొక ముగ్గురు కేరళ యువతుల వాస్తవగాథల ఆధారంగా నిర్మించిన చిత్రమే ‘ది కేరళ స్టోరీ.’ శాలినీ ఉన్నికృష్ణన్‌ (‌నిమిష) ఒక వాస్తవం. ఈ పాత్రను ఆదా శర్మ పోషించారు. జరగవలసిన నష్టమంతా జరిగిన తరువాత ఒక దశలో తాను ఐసిస్‌లో ఎందుకు చేరిందో ఆమె అధికారులకు వెల్లడించింది కూడా. నిమిష మరో ఇద్దరు- సోనియా సెబాస్టియన్‌ (ఆయేషా), మెరిన్‌ ‌జాకబ్‌ (‌మరియం) అఫ్ఘానిస్తాన్‌కు పారిపోయి, ఐసిస్‌లో చేరారు. అంటే స్వర్గం చూపిస్తామని వీరిని మతం మార్చిన యువకులు తీసుకువెళ్లారు. ఆ ముస్లిం మతోన్మాద సంస్థలో చేరి అమెరికా సేనలతో పోరాడడం వీరి ఉద్దేశం. రమీజ్‌ ‌నిజ జీవితంలో నిమిష స్నేహితుడు. ఇతడినే పెళ్లి చేసుకుంది. అతడు ఆమెను వీడే నాటికి నిమిష గర్భవతి. తరువాత ఒక మత గురువు ఆమెను ఒక ఐసిస్‌ ఉ‌గ్రవాదికి ఇచ్చి పెళ్లిచేశాడు. ఇతడు వైమానిక దాడిలో చనిపోతాడు. ఆమె అఫ్ఘానిస్తాన్‌ ‌పోలీసులకు పట్టుబడుతుంది. నిజ జీవితంలో జరిగింది ఇదే. తన కుమార్తె నిమిషను భారత్‌కు రప్పించే ఏర్పాట్లు చేయవలసిందిగా ఆమె తల్లి మన విదేశ వ్యవహారాల శాఖను కన్నీటితో వేడుకుంటున్నది.

About Author

By editor

Twitter
Instagram