పాల్‌ ‌నెహెంగి మెకంజీ…

పేదరికంతో, అంతఃకలహాలతో, చమురు మాఫియాతో నిరంతరం తల్లడిల్లిపోయే కెన్యాకు చెందినవాడు. ఏకైక గుర్తింపు క్రైస్తవ మతబోధకుడు. గుడ్‌న్యూస్‌ ఇం‌టర్నేషనల్‌ ‌చర్చ్ ఇతడిదే. ఇతడిని ఉగ్రవాదిగా, భ్రాతృహంతకుడిగా నిరూపించ డానికి అక్కడి షకాహోలా ప్రభుత్వం ఎన్ని చట్టాలు ఉన్నాయో పడి పడి వెతుకుతున్నది. కిలీఫీ అనే చోట ఉన్న ఇతడి కేంద్రంలో వందలాదిగా కుళ్లిన మానవ కళేబరాలు దొరికాయి. ఇంతకీ ఇతడు తనకు తానుగా క్రైస్తవ మత ప్రబోధకుడుగా ప్రకటించుకున్న వాడు మాత్రమే. ఈ పాప భారం మోసిన స్థలం షాకాహోలా గ్రామం. కిలిఫీ కౌంటీలో ఉన్న మలిందీ అనే పర్యాటక కేంద్రానికి సమీపంగానే ఉంటుంది. మిలిందీలోనే ఇతడి గుడ్‌ ‌న్యూస్‌ ఇం‌టర్నేషనల్‌ ‌చర్చ్ ఉం‌ది. గట్టి ఎండతోనూ, గట్టి ఆకులు ఉన్న చెట్లతోను ఒక రకమైన ప్రశాంతత ఉండే షాకాహోలా గ్రామమే ఏప్రిల్‌ ‌నుంచి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

క్రైస్తవంలో కనిపించే మతోన్మాదం, ప్రబోధాల ఉన్మాదం దారుణంగా తయారవుతున్నది. పైగా వాటిని ప్రదర్శించి వీడియోలలో దేశాల మీదకి వదిలి పెడతారు. మెకంజీ చేసింది కూడా ఇదే. మన దేశంలో కూడా కరోనాను తొక్కేస్తా అంటూ ఒక పాస్టర్‌ ‌వీరంగం వేస్తున్నట్టు చూపించే వీడియోలు ఎన్నో వచ్చాయి. చనిపోయారంటూ ఎవరినో తీసుకు వచ్చి, పాస్టర్‌ ‌నీళ్లు చల్లితే లేచి కూర్చోవడం వంటివి కూడా వీడియోలలో వస్తున్నాయి. ఇక రోగాలు నయం చేయడం, అందులో మహిమలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గుండెలు బాదుకోవడం, మూర్చ వచ్చినట్టు తన్నుకోవడం పాస్టర్‌ ‌వచ్చి చేయి వేయగానే, బైబిల్‌ ‌వాక్యాలు చదవగానే వారికి నయం కావడం ఇవన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఇవి ఏవీ కూడా మెకంజీ ‘క్రైస్తవం’ ముందు దిగదుడుపే.

మూఢత్వం మాటున మెకంజీ ప్రదర్శించిన క్రూరత్వంతో కెన్యా ప్రభుత్వమే కదిలిపోయింది. ఇప్పటిదాకా జరిగిన ఉదంతాన్ని బట్టి తమ ప్రభుత్వం విఫలమైందని కెన్యా హోంశాఖ అంగీకరించింది. అలాగే ఇకపై ఇలాంటి దారుణాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ కేబినెట్‌ ‌కార్యదర్శి కితూరె కిండీకి చెప్పారు. ప్రభుత్వ డిటెక్టివ్‌లు అతడి కేంద్రం మీద దాడి చేసిన తరువాత విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. పరలోక ప్రాప్తి, అందుకు పస్తులతో మరణం ఇతని సిద్ధాంతం. ఈ మత ప్రచారకుడు చేసిన ఘోరం మాటలకు అందనిది. అందుకే ఏప్రిల్‌ ‌మధ్యలోనే ఇతడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశాధ్యక్షుడు విలియం ర్యూటో కూడా మెకంజీ ఒక నేరగాడని వ్యాఖ్యానించారు. ఇదంతా ఉగ్రవాదమే కాబట్టి అతడి మీద చర్య తీసుకోవాలని కూడా ఆదేశించాడు.

ఎజకీల్ ఒడిరో

కొందరు డిటెక్టివ్‌లో ఇతడి రహస్య క్రీస్తు ఆరాధన గుట్టు బయటపెట్టిన తరువాత ఒక్కసారి దేశం విలవిలలాడింది. ఏమిటా ఆరాధన. ఆకలితో మలమల మాడిపోవాలి. ఆకలితోనే మరణించాలి. ఆకలితో ఎక్కువ కాలం గడిపి, ఆఖరికి పస్తులతో మరణిస్తే క్రీస్తు దర్శనం సులభంగా దొరుకుతుంది. దీనికి అతడు పెట్టిన పేరు ‘మీట్‌ ‌జీసస్‌’. ‌కెన్యా వంటి పేద ఆఫ్రికా దేశంలో నానాటికీ మూఢ నమ్మకాలు వెర్రితలలు వేస్తున్నాయి. మెకంజీతో పాటు ఇంకొక మత బోధకుడు కూడా దాదాపు ఇలాంటి అకృత్యాలకే తన అనుచరులను ప్రోత్సహించినట్టు బయటపడింది.కొద్దివారాల క్రితం మిలిందీ దగ్గరి లాంగోబయా పోలీస్‌ ‌స్టేషన్‌లో ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి ఉందంతం మెకంజీ డొంకను కదిలించింది. షాకాహోలా గ్రామంలోనే మార్చి 16, 17 తేదీలలో ఇద్దరు మైనర్‌ ‌బాలురను పెద్దగా లోతుగా తవ్వని గోతులలోనే పూడ్చి పెట్టడడంతో విషయం తెలిసింది. శవ పరీక్షలో ఆ ఇద్దరు పిల్లలు తిండిలేక పోవడం వల్ల మరణించిన వాస్తవం తెలిసిపోయింది. ఇంతకీ మెకంజీ కూడా ఏడుగురు పిల్లల తండ్రి. కానీ వీళ్ల గతి ఏమైందో తెలియదు. తను బోధించే క్రైస్తవం శైలి ఇదేనని, కానీ దీనిని తాను 2019లోనే ఆపేశానని చెబుతు న్నాడు. అయినా తాను ఎప్పుడూ తన అభిప్రాయా లను ఇతరుల మీద రుద్దలేదని కూడా చెప్పాడు.

ఒక పక్క మెకంజీ రాక్షసత్వం కెన్యాను వణికిస్తుంటే, ఎజకీల్‌ ఒడిరో అనే మరొక మత ప్రబోధకుడిని కూడా అలాంటి ఆరోపణలతోనే అరెస్టు చేశారు. తన అనుచరులను సామూహికంగా హత్య చేశాడన్న అభియోగం ఇతని మీద మోపారు. మెకంజీ మాదిరిగానే ఇతడిని కూడా ఏప్రిల్‌ 27 ‌ప్రాంతంలోనే అరెస్ట్ ‌చేశారు. అయితే మెకంజీ ప్రమేయంతో జరిగిన ఆత్మహత్యలకీ, వీటికీ ఏమీ సంబంధం లేదని పోలీసులు చెప్పారు. ఇతడిది కూడా మెకంజీ నివాసం ఉంటున్న మిలిందీ ప్రాంతమే. కానీ ఇతడు ఉండేది మిలిందీకి దక్షిణాదిన. అక్కడ ఉన్న ఇతడి చర్చ్‌లో 40,000 మంది కూర్చొని ప్రార్థనలు వినొచ్చు. తాను విక్రయించే గుడ్డముక్కల వల్ల రోగాలు తగ్గిపోతాయని ఇతడు ప్రచారం చేస్తాడు. ఈ ఇద్దరి మత గురువుల పైత్యాలు బయటపడిన తరువాత దేశంలో చర్చ్‌ల మీద నిఘా ఉంచుతామని  హోంశాఖ వెల్లడించింది.

మెకంజీ సృష్టి ‘మీట్‌ ‌జీసస్‌’ ‌లేదా డూమ్స్‌డే కిల్లింగ్స్‌గా చెబుతున్న ఈ ఉన్మాదంలో చాలా హృదయ విదారకమైన వాస్తవాలు బయటపడు తున్నాయి. పిల్లలు త్వరగా చావడం కోసం పాకలలో ఐదేసి రోజులు నీళ్లు, ఆహారం లేకుండా బంధిం చారు. ఆ తరువాత తీసుకెళ్లి ఖననం చేసేవారు. ఒకరో ఇద్దరో కొన ఊపిరితో ఉన్నప్పటికీ ఈ క్రీస్తు విశ్వాసులు కరుణించలేదు. మోక్షానికి ఆలస్యం కాకుండా అలాగే పాతిపెట్టారు. మీట్‌ ‌జీసస్‌ ‌కార్యక్రమంలో మొదటి అవకాశం పిల్లలకే ఇచ్చాడు మెకంజీ. అంటే పిల్లల్నే బలిపశువులని చేశాడు. ఇవే ఇప్పుడు ప్రపంచంతో పాటు ఆఫ్రికాలోని కెన్యా కూడా విస్తుపోతోంది. ఏప్రిల్‌ ‌నెలలో ఆరంభమైన దీని దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అప్పటి నుంచి పాతిపెట్టిన శవాలను వెలికి తీసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. మే 15వ తేదీ నాటికి 201 శవాలను వెలికి తీశారు. కేవలం ఫోరెన్సిక్‌ ‌పరీక్షల కోసమే అక్కడి పోలీసులు ఈ పని చేస్తున్నారు. ఇవన్నీ కెన్యా ఆగ్నేయ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో దొరికినవే.

మెకంజీ బోధన ప్రకారం  జీసస్‌ను చేరుకునే అవకాశం మొదట పిల్లలకు ఇస్తారు.అంటే పిల్లల్ని తిండి నీళ్లూ ఇవ్వకుండా చంపుతారు.  ఒక రకంగా ప్రేరేపిత ఆత్మహత్యలు. ఇతడికి బాలల మీద అంత కక్ష ఎందుకో అర్ధం కాదు. తరువాత అవకాశం పెద్దలది. ఈ విషయాలను ఒకప్పుడు ఇదే ఆరాధనలో ఉండి తరువాత బయటపడిన ఒక మాజీ బోధకుడు టైటస్‌ ‌కటానా న్యూయార్క్ ‌టైమ్స్‌కు వెల్లడించినవే. మెకంజీ దొంగవేషాలను ముందే కనుగొని 2015లో ఇతడు ఆ ఆరాధనకి స్వస్తి పలికాడు. పిల్లలను పాకలలో బంధించి నీళ్లూ తిండి ఇవ్వకుండా చంపడం ఒకటి. అక్కడ నుంచి దుప్పట్లలో చుట్టి పట్టుకు వచ్చేవారు. మరొకటి నిరాహారంగా ఎండలో ఉంచడం. దీనితో పిల్లలు కచ్చితంగా వేగంగా మరణించేవారు. మెకంజీ మోసంలో పడినవారు కొన్ని వందల మంది. వారిలో 600 మందికి పైగా కనిపించడం లేదు. కాబట్టి వీరు చనిపోయే ఉంటారని అనుమానిస్తున్నారు. కొన్ని శవాల చేతులు వైర్లతో బిగించి  ఉన్నాయి. అంటే వారు తిరుగుబాటు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం- కొన్ని శవాలకు కొన్ని భాగాలు లేవు. కాబట్టి ఇందులో కిడ్నీ ర్యాకెట్‌ ‌కోణం కూడా ఉందన్న అనుమానాలు ఉన్నాయి. మెకంజీ ఎలాంటి దొంగ ప్రచారకుడో ప్రజలకు కనిపెట్టే అవకాశం అతడే ఇచ్చాడు. అయినా క్రీస్తు బోధనల మాయలో పడిన కెన్యా ప్రజలు దానిని గుర్తించడానికి నిరాకరించారు. మెకంజీ మంచి భవంతిలో, నిండా సామాగ్రి, టీవీ వంటి సమస్త సౌకర్యాలు ఉన్న ఇంట్లో నివాసం ఉండేవాడు. అనుచరులను మాత్రం పాలిథిన్‌ ‌గుడ్డలు కప్పిన తాత్కాలిక పందిళ్లలో బతకమనేవాడు.

గుడ్‌న్యూస్‌ ఇం‌టర్నేషనల్‌ ‌చర్చ్

మెకంజీని పోలీసులు అరెస్టు చేపినప్పటికీ అతడు గతంలో చెప్పిన  దైవవాక్యాలు అతడి చానల్‌ ‌గుడ్‌న్యూస్‌ ఇం‌టర్నేషనల్‌లో ఇప్పటికీ ప్రసారమవు తున్నాయని బీబీసీ వెల్లడించింది. అవేమిటో వినాల్సిందే. పిల్లలు ఏడుస్తున్నారా? ఆకలేసి అయి ఉంటుంది. ఆ ఆకలితోనే వాళ్లని చచ్చిపోనివ్వండి అని అతడు అనేవాడు. సంప్రదాయ విద్యలన్నీ చేటు చేసేవేనని అతడు అనేవాడు. ఇది శాతాను విద్య అట. ఈ చదువు చెప్పేవారంతా స్వప్రయోజనపరులు మాత్రమేనని అతడు తేల్చిపారేశాడు. ఏకరూప దుస్తులు అమ్మడం, పాఠ్య పుస్తకాలు రాయడం, పెన్నులు తయారు చేయడం ఇదంతా ఒట్టి చెత్త అని కూడా సిద్ధాంతీకరించాడు మెకంజీ. మీ డబ్బు గుంజి వాళ్లు బాగుపడుతున్నారు. మీరు మాత్రం పేదలుగా ఉండి పోతున్నారంటూ సరికొత్త సోషలిజం చెప్పి వాపోయేవాడు కూడా. బైబిల్‌ ఆమోదం లేదు కాబట్టి ఈ చదువులు చదవకండి అంటూ ప్రచారం మొదలెట్టినందుకు మెకంజీని 2017, 2018లలో అరెస్టు కూడా చేశారు. చదువంటే సెక్స్ ఎడ్యుకేషన్‌ ‌కూడా ఉంటుంది. కాబట్టి వీళ్లే స్వలింగ వివాహాలు కావాలంటారు అని కూడా మెకంజీ సూత్రీక రించాడు. శాటానిక్‌ ‌చెప్పే ఈ చదువులతో గేలు, స్వలింగ సంపర్కులు మాత్రమే తయారవుతారని కూడా తేల్చాడు. ఇతడు ఆధునిక వైద్యానికి కూడా బద్ధ శత్రువు. ప్రసవ సమయంలో మందులు వాడకండి అని మహిళలకు చెప్పేవాడు. పుట్టిన పిల్లలకి టీకాలు అవీ వేయించవద్దని కూడా హితబోధ చేశాడు. పిల్లికి ఎలక సాక్ష్యమన్నట్టు, ఇతడి వాగుడుకు దివ్యత్వాన్ని అంటగట్టడానికి కొందరు కిరాయిభక్తులు కూడా తగిన పాత్ర పోషిస్తూ ఉంటారు. ప్రసవ సమయంలో మందులు వద్దన్న మెకంజీ బోధ తనకు నచ్చిందని, ఆ విధంగా చేసి, సిజేరియన్‌ అవసరం లేకుండానే తాను బిడ్డను కన్నానని ఒక మహిళ వాగ్మూలం ఇచ్చింది. ఈ ప్రేరణతోనే తమ పక్కింట్లో చిన్నారికి వ్యాక్సిన్లు అవీ వద్దని చెప్పానని ఆమె సగర్వంగా చెప్పింది. డాక్టర్లు వేరే దేవుడిని ఆరాధిస్తారు కాబట్టి వాళ్లు వేసే వ్యాక్సిన్లు వాడకండని చెబుతాడట మెకంజీ.

గుడ్‌ ‌న్యూస్‌ ఇం‌టర్నేషనల్‌ ‌చర్చ్ ‌మత గురువు మెకంజీ జూన్‌ 2023‌కి సృష్టి అంతమైపోతుందని బోధించేవాడు. ఇది నిజమేనని నమ్మేసిన స్టీఫెన్‌ ‌మిటీ భార్య బహేతి జోన్‌ ‌తన ఆరుగురు పిల్లలతో సహా పస్తులతో మాడి చనిపోయింది. పైగా ఆమె అప్పటికి గర్భవతి. నా మనుమలు, మనుమరాండ్రు ఆకలితో ఎలా అలమటించి ఉంటారో అని అంతా అయ్యాక ఒక వృద్ధురాలు శాపనార్థాలు పెట్టారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram