– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ

వైసీపీ పాలనలో ఆంధప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాక, స్వయం ఉపాధికి సహకారం అందక యువత భవిత ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటి వరకు దారిచూపిన ఐటీ రంగం కూడా ఆర్థికమాంద్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో యువత దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది.

డిగ్రీ చదివిన విద్యార్థులు సైతం ఉద్యోగాలు లేక ఇంటి వద్దే ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సంపన్న కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతకు ఇప్పటి కిప్పుడు ఎలాంటి సమస్యలు లేకున్నా, పేద కుటుంబా లకు మాత్రం ఆర్ధిక సమస్యలు పెరిగి పోతున్నాయి. డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌ ‌చదివితే ఏదైనా ఉద్యోగం వస్తుంది, అప్పులు తీర్చుకుని అయిదు వేళ్లు నోట్లో కెళ్తాయనుకున్న తల్లిదండ్రుల కల కల్లగా మారింది. కొందరికి ఉద్యోగాలొచ్చినా ఫీజు రీయింబర్స్ ‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించకపోవడంతో  సకాలంలో సర్టిఫికెట్లు అందక ఉద్యోగాల్లో చేరలేకపోతున్నారు. కొందరికి అపాయింట్‌మెంట్‌లు ఇచ్చినా విధులకు మాత్రం తీసుకోలేదు. ఉద్యోగ అవకాశాలు రాక, జీవితంలో స్థిరపడక పోవడంతో వివాహాలు కూడా కావడం లేదు. ఈ కారణాలన్నిటితో ఏపీ యువత తీవ్ర నిరాశలో ఉంది. అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, కాంట్రాక్టు ఉద్యోగాలు రెగ్యులర్‌ ‌చేస్తానని చెప్పిన జగన్మోహన్‌ ‌రెడ్డి తమను నిలువునా మోసం చేశారని నిరుద్యో గులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నిర్వహిస్తోన్న ఛార్జిషీట్‌ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంపై ప్రభుత్వంపై ఛార్జిషీట్లు నమోదు చేస్తున్నారు.

ఒక పక్క ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు అందక ఉద్యోగాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో ఉన్నత చదువులు అభ్యసించిన వారిలో ఇంజనీరింగ్‌ ‌చదివిన వారు 70 శాతం మంది దాకా ఉన్నారు. ప్రభుత్వం వృత్తి విద్యాకోర్సులు (ఇంజ నీరింగ్‌, ‌మెడికల్‌, అ‌గ్రికల్చరల్‌, ‌ఫార్మసీ, ఇతర మెడికల్‌ ‌కోర్సులు, డిప్లమా), సాధారణ డిగ్రీ కోర్సులు చదివే వారికి ఫీజు రియింబర్స్‌మెంట్‌ ‌పథకం అమలు చేస్తోంది. అయితే ప్రచార యావ, ఓటర్లను ఆకర్షించే క్రమంలో కళాశాలలకు నేరుగా ఫీజులను చెల్లించక విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజులను ప్రభుత్వం జమచేస్తోంది. ఏడాది ఫీజును ఒకేసారి చెల్లించక నాలుగు విడతలుగా చెల్లిస్తోంది. కాని మధ్యలో కొన్ని విడతలు చెల్లించకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్‌మెంట్‌పైనే ఆశలు పెట్టుకుని చదివే విద్యార్థులు సమస్యలకు గురయ్యారు. వీరికి క్యాంపస్‌ ‌సెలక్షన్‌లు వచ్చినా పూర్తి ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేయడంతో చేసేది లేక ఉద్యోగాలు వదిలేసుకుంటు న్నారు. అప్పులు పుట్టిన వారు కొందరు డబ్బు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఈ విషయంపై ఎన్ని వినతులు, విజ్ఞాపనలు, ఆందోళనలు, ఉద్యమాలు చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చా పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌చేయలేదు. దాంతో వారికి సర్టిఫికెట్లు రాక, మూడేళ్లుగా ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. ఈ విషయంపై కళాశాల యాజ మాన్యాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఫీజు చెల్లించాల్సిందే నని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే సగం ఫీజు చెల్లిస్తామని ఒకసారి, 60 శాతం, 70 శాతమని కొర్రీలు పెడుతు న్నట్లు కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

హామీలన్నీ అటకెక్కాయి!

ముఖ్యమంత్రి కాకముందు జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో మొత్తం 2.40 లక్షల ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించడం ద్వారా వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేస్తామని, పోలీసు కానిస్టేబుల్‌ ‌ఖాళీలు భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగాలు రెగ్యులర్‌ ‌చేస్తామన్నారు. పల్లె ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వలస పోనవసరం లేకుండా వారికి గ్రామాల్లోనే ఉపాధి కల్పిస్తామన్నారు. కాని అధికారంలోకి వచ్చాక ఏ హామీని అమలు చేయలేదు.

జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించలేదు. మెగా డీఎస్సీ లేదు. నిరుద్యోగుల పోరాటంతో దిగి వచ్చి ఇటీవల పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ ‌చేయ లేదు. ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తున్నారు. నవరత్నాల పథకాల అమలు కోసం వార్డు సచివాలయ ఉద్యోగాలు ప్రకటించి భర్తీచేశారు. వాలంటీర్ల పేరుతో తమ అనుచరులకు ప్రభుత్వం ద్వారా జీతం ఇప్పించి పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

పెరుగుతున్న నిరుద్యోగిత

ఉద్యోగాల కల్పన జరగకపోవడంతో రాష్ట్రంలో 2019 ఏప్రిల్‌ ‌నాటికి 4.0 శాతం ఉన్న నిరుద్యోగిత శాతం 2023 ఏప్రిల్‌ ‌నాటికి 6.6 శాతానికి పెరిగినట్లు సెంటర్‌ ‌ఫర్‌ ‌మానిటరింగ్‌ ఇం‌డియన్‌ ఎకానమీ నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు కంటే నిరుద్యోగ పట్టభద్రులు రాష్ట్రంలో రెండింతలు ఎక్కువగా ఉన్నారని ఆ సంస్థ విడుదల చేసిన సర్వేలో తేలింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో 73 శాతానికి పైగా పట్టభద్రులే. జాతీయ స్థాయిలో పట్టభద్రల నిరుద్యోగిత రేటు 17.23 శాతం ఉంటే రాష్ట్రంలో 35.14 శాతంగా ఉంది. ఉపాధి, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో గత మూడేళ్లలో 21,575 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంట్‌ ‌సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పడం వాస్తవం కాదా? కమీషన్ల కక్కుర్తితో మూడున్నరేళ్లలో 17 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమేసి తమ ఉపాధికి గండి కొట్టడంపై లక్షలాది యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మౌలిక వసతుల కల్పనపై చిత్తశుద్ధి లేదు!

వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేకపోవడం కూడా ఉపాధి అవకాశాలను కోల్పోయేలా చేసింది. ఈ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కూడా నిర్లక్ష్యం చేసింది. నాలుగేళ్లలో రూ.2.20 లక్షల కోట్ల నగదును సంక్షేమ పథకాలకు పంపిణీ చేశామన్న ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు మాత్రం అందులో పదిశాతం కూడా ఖర్చుపెట్టలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, ‌కాకినాడ పెట్రోకెమికల్‌ ‌సమూహం, శ్రీకాళహస్తి ఎలక్ట్రానిక్స్ ‌పారిశ్రామిక క్లస్టర్‌, ‌బెంగళూరు-చెన్నై పారిశ్రామిక క్లస్టర్‌, ‌శ్రీసిటి పారిశ్రామిక సమూహం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో రెండు సమీకృత పారిశ్రామిక టౌన్‌షిప్‌ (‌నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌మ్యానుఫాక్చరింగ్‌ ‌జోన్‌)‌ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టుల అమలుకు ఉత్సాహం చూపించలేదు. ఈ ప్రాజెక్టులకు భూసేకరణ చేయక పోవడంతో పరిశ్రమలు ఏర్పడలేదు. ఫలితంగా యువతకు కొలువులు లేకుండా పోయాయి. వీటిలో సగం ఏర్పాటైనా 10 లక్షల మందికి పైగా ఉద్యోగాలొచ్చేవి.

ఐటీలో వెనుకబాటు

ప్రభుత్వం పనితీరు, పోకడలు రాష్ట్రంలో ఐటీ రంగంపై కూడా ప్రభావం చూపించాయి. ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ (ఐటీ) రంగం నాలుగేళ్ల నుంచి ఆశాజనకంగా లేదు. ప్రధాన ఇంజనీరింగ్‌ ‌కళాశాల్లో ఎంపికలు నాలుగేళ్ల నుంచి బాగా తగ్గిపోయాయి. గత ఏడాది ఎంపికైన వారిని కూడా ఇప్పటికీ ఉద్యోగాలకు పిలవలేదు. ఇందులో బహుళ జాతి కంపెనీలు కూడా ఉన్నాయి. ఇదో సమస్య అయితే చదివిన వారికి రాష్ట్రంలో ఉద్యోగాలు లభించడం లేదు.

హైదరాబాద్‌, ‌బెంగళూరు, చెన్నై, ఉత్తర భారతదేశం వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌ ‌కంపెనీల ఏర్పాటుకు అవసరమైన వాతావరణం లేకపోవడం, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కంపెనీల రాకకు అవరోధంగా మారినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల ఏపీలో అసలు ఐటీ ఇండస్ట్రీ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. అయిదేళ్ల క్రితం గన్నవరంలో నిర్మించిన హెచ్‌సీఎల్‌తో పాటు మరో నాలుగైదు కంపెనీలు తప్ప ఉన్నవన్నీ స్టార్టప్‌లే. 2021-22లో ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.926 కోట్లే. భారతదేశం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల్లో ఇది 0.14 శాతం మాత్రమే. గత ఐదేళ్లలో ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా 0.2 శాతం కంటే తక్కువ గానే ఉంది. ఐటీరంగం పట్ల ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వ్యాసకర్త : ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
Instagram