ఉగాది కృత్యం

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉగాది పండుగ జరుపుకోవడం తెలుగు ప్రజల ఆనవాయితీ. తెలుగువారు చాంద్రమానం పాటిస్తుండగా, తమిళులు సౌరమానం పాటిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు. పంచాంగ శ్రవణం ద్వారా ఆ ఏడాది దేశ కాలమాన పరిస్థితులు, జాతక విశేషాలు తెలుసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడపడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉగాది రోజున పాటిస్తారు. చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీ శోభకృత్‌ ‌నామ సంవత్సరంగా పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 37వది శ్రీ శోభకృత్‌ ‌నామ సంవత్సరం. అధిపతి రవి. సూర్యభగవానుని పూజించిన తేజస్సు, ఆరోగ్యం కలుగుతాయి. అలాగే శోభకృత్‌ ‌నామ సంవత్సరాధిపతి శుక్రుడు. ఈ శుక్రుని ఆరాధించిన సుఖసంపదలు, తేజస్సు, కీర్తి దక్కుతాయి.

పుష్కర నిర్ణయం

శ్రీ శోభకృత్‌ ‌నామ సంవత్సర వైశాఖ శుక్ల విదియ, శుక్రవారం అనగా 21.04.23వ తేదీ తెల్లవారు ఝామున గం.5.16 ని.లకు తెల్లవారితే శనివారం దేవగురుడు బృహస్పతి మిత్రస్థానమైన మేషరాశిలో ప్రవేశంతో గంగానదీ పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇవి 12 రోజుల పాటు జరుగుతాయి. ఈ కాలంలో దానధర్మాలు, స్నానాదులు పుణ్యఫలాన్నిస్తాయి.

గ్రహణాలు

ఈ ఏడాది ఆశ్వయుజ పౌర్ణమి అనగా 28.10.23వ తేదీ శనివారం రాత్రి 1.05 గంటలకు రాహుగ్రస్త పాక్షిక చందగ్రహణం సంభవిస్తుంది. ఇది అశ్వని నక్షత్రంలో వస్తున్నందున ఈ నక్షత్రం వారితో పాటు, మేషరాశి వారు చూడరాదు. వీరు తగు పరిహారాలు పాటించాలి. గ్రహణ మోక్షకాలం గం. 2.23 ని.లకు.

మకర సంక్రాంతి

శ్రీ శోభకృత్‌ ‌నామ సంవత్సర పుష్య శుక్ల చవితి సోమవారం, అనగా 15.01.24వ తేదీ ఉదయం గం.8.26 ని.లకు రవి మకరరాశి ప్రవేశం. ఇదే రోజు మకర సంక్రాంతి పండగ.

మూఢములు

గురు మూఢమి: చైత్ర శుక్ల అష్టమి బుధవారం అనగా 29.03.2023వ తేదీ సా. 5.01 గంటలకు గురుమూఢమి ప్రారంభం.

వైశాఖ శుక్ల షష్ఠి మంగళవారం అనగా 25.04.23వ తేదీ మూఢమి ముగుస్తుంది.

శుక్ర మూఢమి: అధిక శ్రావణ బహుళ అష్టమి మంగళవారం, అనగా 08.08.23వ తేదీ ప.1.59 గంటలకు శుక్రమూఢమి ప్రారంభం.

నిజశ్రావణ శుక్ల తదియ, శుక్రవారం, అనగా 18.08.23వ తేదీ రా.7.20 గంటలకు మూఢమి ముగుస్తుంది.

(ఈ కాలాల్లో సాధారణ కార్యక్రమాలు మినహా వివాహాది శుభ ముహూర్తాలు ఉండవు.)

అధిక మాసం

ఈ ఏడాది శ్రావణ మాసం అధికమాసమైంది. అధిక మాసంలో శుభకార్యాలు ఉండవు. నిజ శ్రావణ మాసంలోనే శుభముహూర్తాలు ఉంటాయి. (జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకూ అధిక శ్రావణం. 17.08.23 నుండి సెప్టెంబర్‌ 18‌వ తేదీ వరకూ నిజశ్రావణ మాసం)

కర్తరీ నిర్ణయం

వైశాఖ పౌర్ణమి శుక్రవారం అనగా 05.05.23న డొల్లు కర్తరి ప్రారంభం.

వైశాఖ బహుళ షష్ఠి గురువారం అనగా 11.05.23వ తేదీ తెల్లవారు ఝామున 4.12 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) నిజకర్తరి(అగ్ని) ప్రారంభం.

జ్యేష్ఠ శుక్ల దశమి సోమవారం, అనగా మే 29వ తేదీ ప.1.22 గంటలకు కర్తరి త్యాగమగును. ఈ కాలంలో ఇళ్ల నిర్మాణాలు వంటివి చేయరాదు.

————–

శ్రీ శోభకృత్‌ ‌నామ సంవత్సర ఫలితాలు

ఈ సంవత్సరం రాజు బుధుడు, మంత్రి, మేఘాధిపతి శుక్రుడు, సేనాధిపతి, ఆర్ఘ్యాధిపతి గురుడు, పూర్వ సస్యాధిపతి చంద్రుడు, దాన్యాధిపతి శని, రసాధిపతి బుధుడు, నీరసాధిపతి చంద్రుడు అయ్యారు. రాజు, మంత్రితో సహా అధిక గ్రహాలు శుభులే కావడంతో పరిపాలన సాఫీగా సాగిపోతుంది. దేశంలో కొన్ని వివాదాలు పరిష్కారమై ప్రజల మధ్య సయోధ్య ఏర్పడుతుంది. ఆర్థికంగా మరింత బలం పుంజుకుంటుంది. అలాగే, పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగి ధరలు అందుబాటులో ఉంటాయి. ఇక బంగారం, వెండి సహా కొన్ని లోహాల ధరలు మరింత పెరుగుతాయి. పచ్చని ధాన్యాలు విశేషంగా పండుతాయి. అపరాల ధరలు కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే వంటనూనెలు, చమురు ధరలు మాత్రం పెరిగే సూచనలున్నాయి. ఇక పశుపాలకుడు బలరాముడు, పశు సంరక్షకుడు శ్రీకృష్ణుడు కావున పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి. పాడిపరిశ్రమ విశేష ప్రగతి కలిగి ఉంటుంది. పాల ఉత్పత్తులు అధికంగా ఉంటాయి.

ఇక వర్షాలు కూడా సమతూకంగా కురుస్తాయి. వర్షలగ్నం వృశ్చికం, జగలగ్నం కన్య అయినది. ఈ లగ్నాలకు కేంద్ర కోణములందు శుభగ్రహాలు, శుభదృష్టి కలిగి ఉండడం వల్ల సుభిక్షం, ధన, ధాన్య వృద్ధి ఉంటుంది.

పశ్చిమ ప్రాంతంలో కొంతకాలం దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. తూర్పు ప్రాంతంలో సమతూకంగా పరిస్థితులు ఉంటాయి. ఇక దక్షిణ దేశమందు పాలకులు మారడం, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహాయ సహకారాలు నామమాత్రంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఊహించని ఖనిజసంపదలు వెలుగులోకి వస్తాయి. అలాగే, ఇరుగు పొరుగు దేశాలలో శాంతిసామరస్యాలకు మన పాలకులు విశేష కృషి చేస్తారు. శాస్త్రసాంకేతిక రంగాలలో మన దేశం మరింత అభివృద్ధి సాధించే దిశగా సాగిపోతుంది. కొన్ని ప్రాంతాలలో ప్రజలకు వివిధ వ్యాధులు సోకి అలజడిగా ఉంటుంది. గురుడు మేషరాశి సంచారం వల్ల దేశానికి, ప్రజలకు మరింత మేలు కలుగుతుంది. అలాగే, శని కుంభరాశి సంచారం వల్ల అన్ని విధాలా మేలు చేకూరుతుంది. నవనాయకుల్లో అధికంగా శుభులే కావడం విశేషం. రాజకీయ వైషమ్యాలు, ప్రజాసమస్యలు తగ్గి అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరిస్తాయి. భూకంపాలు, తుపానులు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారాలు, వాణిజ్యరంగాల వారికి ధరలు తగ్గినా లాభాలకు లోటు రాదు. వ్యవసాయదారులు పంటలపై పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి. రాజకీయవర్గాలలో పరస్పర వివాదాలు, పార్టీల మార్పు వంటివి ఉంటాయి.

కార్తీక, మార్గశిర మాసాలలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు రావచ్చు. కళారంగం వారు విశేషమైన కీర్తిప్రతిష్టలు పొందుతారు. సాఫ్ట్‌వేర్‌, ‌రియల్‌ ఎస్టేట్‌ ‌రంగాలు పూర్వవైభవం పొందుతాయి. వైద్య, సేవారంగాల వారికి విశేష కీర్తి దక్కుతుంది. సరికొత్త పరిశోధనలతో శాస్త్రవేత్తలు ఇతర దేశాలతో పోటీ పడతారు. సాధారణ వృత్తుల వారికి సైతం ఇబ్బందులు తొలగుతాయి. శ్రావణం, భాద్రపద మాసాలలో మరిన్ని అవినీతి వ్యవహారాలు వెలుగులోకి రావచ్చు. దీనివల్ల కొందరికి పదవీవియోగం కలిగే సూచనలున్నాయి. అలాగే, ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో రైలు, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం శుభఫలితాలే అధికంగా ఉంటాయి. ప్రజలు సుభిక్షంగా జీవించే పరిస్థితులు ఏర్పడవచ్చు.

మేషం

(ఆదాయం-5, వ్యయం-5, రాజపూజ్యం-3, అవమానం-1)

గురుడు జన్మరాశి సంచారం సానుకూల ఫలితాలు ఇస్తుంది. కొన్ని ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు, వివాదాలు ఎదురైనా ప్రభావం తక్కువే. ఇక అక్టోబర్‌ ‌వరకు గురు, రాహువుల కలయికతో గురు ఛండాలయోగం వల్ల మానసికంగా అశాంతి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరంతో ముందడుగు వేస్తారు. మీ సమర్థతతో గౌరవప్రతిష్ఠలు సంపాదించుకుంటారు. ఇక శని లాభస్థానంలో సంచారం అన్ని విధాలా లాభదాయకమే. పొదుపు మార్గాలు పాటిస్తారు. అక్టోబర్‌ 30 ‌వరకు జన్మరాహువు, సప్తమంలో కేతువు కారణంగా మానసిక ఆందోళన. అత్యంత ఆప్తుల మధ్య విభేదాలు రావచ్చు. పరస్పర అవగాహన, సర్దుబాట్లతో మసలుకోవడం మంచిది. తదుపరి పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయానికి ఈ ఏడాది ఇబ్బందులు ఉండవు. స్థిరాస్తుల సమీకరణ ఫలిస్తుంది. వారసత్వ ఆస్తులు దక్కించుకుంటారు. నిలిచిన ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. సమాజసేవ, ధార్మిక కార్యక్రమాలలో మీ వంతు పాత్ర పోషిస్తారు. ఏ కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. మీ ఆలోచనలు ఇతరులకు ఉపయుక్తం కావచ్చు. మహిళలకు అన్నింటా విజయాలు. వ్యాపారులు లాభాలు పెంచుకునేందుకు తగిన ప్రణాళికతో ముదుకు సాగుతారు. ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం పెరిగి గుర్తింపు లభిస్తుంది. వీరి పనితీరుని అధికారులు ప్రశంసిస్తారు. కొందరికి పదోన్నతులు కలుగవచ్చు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. అనూహ్యంగా పెట్టుబడులు సమకూరతాయి. పారిశ్రామికవేత్తలు మునుపటి కంటే చురుగ్గా అడుగులు వేస్తారు. రాజకీయవేత్తలకు పదవులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. క్రీడాకారులు, కళాకారులు చేజారిన అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. వీరికి కొన్ని అవార్డులు, పురస్కారాలు రావచ్చు. జూన్‌ 17 ‌నుండి శని వక్రగతిలో సంచారం వల్ల నాలుగు నెలలు కొన్ని అనుకోని సంఘటనలు, ఆరోగ్య సమస్యలు ఎదురైనా దృఢదీక్షతో మసలుకోండి. ద్వితీయార్ధంలో వివాహ యత్నాలు కలసివస్తాయి. చైత్రం, వైశాఖం, ఆషాఢం, మార్గశిరం, మాఘ మాసాలు మరింత అనుకూలం. హనుమాన్‌ ‌ఛాలీసా, ఆదిత్య హృదయం పఠించాలి.

వృషభం

(ఆదాయం-14, వ్యయం-11, రాజపూజ్యం 5, అవమానం-1)

ఈ ఏడాది సమస్థాయిలో ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్‌ 21 ‌వరకు గురుడు విశేష శుభుడు. తదుపరి సాధారణ ఫలితాలు ఉంటాయి. శని అంతా శుభఫలితాలు ఇస్తాడు. రాహుకేతువులు అక్టోబర్‌ 31‌వ తేదీ నుండి శుభదాయకమైనవిగా ఉంటాయి. ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలను తిరిగి పునఃపరిశీలిస్తారు. విలాసాలు, వేడుకలకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ద్వితీయార్ధంలో స్థిరాస్తులు, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు తిరిగి కొనసాగిస్తారు. విద్యార్థుల కృషి ఎంతో ఉపకరిస్తుంది. ఇతరుల పట్ల సామరస్యంగా మెలుగుతూ కార్యాలను చక్కదిద్దుకుంటూ వెళ్లడం మంచిది. ప్రధమార్థంలో ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాగా క్రమేపీ స్వస్థత చేకూరుతుంది. కొందరికి విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు రావచ్చు. కళాకారులకు ఈ ఏడాది అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి. క్రీడాకారులు, రచయితల ఆశలు ఇంతకాలానికి నెరవేరవచ్చు. వ్యాపారులు తమ లావాదేవీల విస్తృతి కోసం మరింత కృషి చేస్తారు. పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగస్తులు తమపై పడిన అదనపు భారాన్ని తగ్గించుకుంటారు. రాజకీయవేత్తలు, పారిశ్రామికరంగం వారి చిరకాల స్వప్నం నెరవేరవచ్చు. అయితే ప్రధమార్థంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వివాహాది శుభకార్యాలు ద్వితీయార్థంలో కలసివస్తాయి. వ్యవసాయదారులు మునుపటి కంటే లాభపడతారు. వైద్యులు, సాంకేతిక, పరిశోధనా రంగాల వారిలో మరింత భరోసా ఏర్పడుతుంది. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు బాగా కలిసివస్తాయి. వీరు రాహు, కేతువులకు జపాలు వంటి పరిహారాలు చేయాలి. దుర్గామాతకు పూజాదికాలు నిర్వహించాలి.

మిథునం

(ఆదాయం -2, వ్యయం-11, రాజపూజ్యం-2, అవమానం-4)

వీరికి సంవత్సరమంతా శుభదాయకమే. ఏ కార్యక్రమం చేపట్టినా తిరిగి చూడకుండా విజయాలు సాధిస్తారు. ఆదాయం మరింతగా మెరుగుపడుతుంది. రావలసిన బాకీలు చాలా వరకూ వసూలవుతాయి. శుభకార్యాలకు డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. మీపట్ల వ్యతిరేక భావాలు కలిగిన వారు కూడా స్నేహహస్తం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలలో అనూహ్యంగా ఒప్పందాలు ఖరారు చేసుకుంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ యత్నాలు ఫలించి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తండ్రి తరఫు నుండి ధన, ఆస్తి లాభ సూచనలు ఉండవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ఒక వ్యక్తి మీకు ఇతోధికంగా సహాయపడవచ్చు. వ్యాపారులకు పెట్టుబడులకు ఢోకాలేదు. లాభాలు విశేషంగా అందుతాయి. ఉద్యోగులపై విమర్శలు, అభియోగాలు తొలగుతాయి. ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతికవర్గాల వారు విజయాలు సాధిస్తారు. క్రీడాకారులు పడిన శ్రమ వృథా కాదు. వైద్యులు, న్యాయవాదులు, పరిశోధకులకు శుభదాయకమే. కళాకారుల సుదీర్ఘ ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభదాయకమే. రాజకీయవర్గాలకు ద్వితీయార్ధంలో కొన్ని పదవులు వరించవచ్చు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. కొద్దిపాటి రుగ్మతలు ఇబ్బంది కలిగించవచ్చు. అయితే వెనువెంటనే ఉపశమనం లభిస్తుంది. చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్య మాసాలు విశేషంగా కలసివస్తాయి. వీరు సుందరకాండ పారాయణం చేయడం మంచిది.

కర్కాటకం

(ఆదాయం -11, వ్యయం- 8, రాజపూజ్యం-5, అవమానం-4)

వీరికి అష్టమశని ప్రభావం అధికంగా ఉంటుంది. గురుబలమే వీరికి శ్రీరామరక్ష అని చెప్పవచ్చు. అలాగే, రాహు, కేతువులు కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తారు. కొన్ని విషయాలలో ఆవేశాలు, భావోద్వేగాలకు లోనవుతారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, కుటుంబ సభ్యులతో సఖ్యతకు కొంత విఘాతం కలిగే అవకాశాలు. అష్టమశని ఫలితంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉండాలి. అలాగే, ప్రతి కార్యక్రమంలోనూ మరింత జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయం తీసుకోరాదు. గురుబలం వల్ల ఆదాయానికి లోటు లేకుండా జీవితాన్ని నడిపిస్తారు. అలాగే, శుభకార్యాలపై ఖర్చులు చేయాల్సి వస్తుంది. చర, స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలలో సఫలమవుతారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటులో ఆచితూచి వ్యవహరించాలి. బ్యాంకు రుణాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు మరింత పనిభారంతో పాటు, అధికారుల నిఘా పెరుగుతుంది. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా ముందుకు సాగితే విజయాలు సాధించగలుగుతారు. క్రీడాకారులు, రాజకీయ నాయకులకు మొదట్లో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నా ద్వితీయార్థంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులు ఈ సంవత్సరం కొంత భిన్నమైన వైఖరితో అందరినీ ఆకట్టుకుంటారు. రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. అనుకున్న పెట్టుబడుల్లో కొంత జాప్యం తప్పదు. విద్యార్థులకు గురుని అనుకూలస్థితి ఉపకరిస్తుంది. న్యాయ, వైద్య, పరిశోధనారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. చైత్రం, వైశాఖం, శ్రావణం, మాఘ మాసాలు కొంత అనుకూలిస్తాయి. వీరు శనికి తైలాభిషేకం, జపాలు చేయించాలి. అలాగే, ఆంజనేయ స్వామిని పూజించండి.

సింహం

(ఆదాయం -14, వ్యయం-2, రాజపూజ్యం-1, అవమానం-7)

గురుబలం అధికంగా కలిగి ఉంటారు. అక్టోబర్‌ ‌నుండి రాహు, కేతువులు అనుకూలించరు. ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా ఏదో ఖర్చు ఎదురవుతూనే ఉంటుంది. పోటీపరీక్షలలో అవలీలగా విజయం సాధిస్తారు. ఇతరులకు సలహాలు ఇచ్చేందుకు సిద్ధపడతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై సంబంధిత వ్యక్తులతో చర్చలు సాగిస్తారు. మీ శుభసంకల్పాలు నెరవేరే సమయం. అయితే కొంత శ్రమ తప్పకపోవచ్చు. ఇంటి నిర్మాణాలు ద్వితీయార్ధంలో కలసివస్తాయి. అయితే శని ప్రభావం, అక్టోబర్‌ ‌నుండి రాహు, కేతువుల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మరింత అప్రమత్తంగా మెలగాలి. జీవితభాగస్వామితో కలహాలు, వీరి మధ్య కొంత ఎడబాటు తప్పకపోవచ్చు. మీతో సన్నిహితంగా మెలిగిన వారే సమస్యలు సృష్టించే వీలుంది. వ్యాపారులు కష్టపడినా ఆశించినంతగా లాభాలు అందుకోలేరు. ఉద్యోగస్తులు విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాలి. రాజకీయవేత్తలు, పారిశ్రామికవర్గాల వారు తమకు తామే సమస్యలు సృష్టించుకునే వీలుంది. తొందరపాటు వీడడం మంచిది. వైద్యులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు గుర్తింపు పొందినా ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటారు. కళాకారులకు పరీక్షాసమయం. వ్యవసాయదారులకు మొదటి పంట కలసి వస్తుంది. చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు విశేషంగా కలసివస్తాయి. శనీశ్వరునికి పరిహారాలు. రాహుకేతువులకు అక్టోబర్‌ 31 ‌నుండి పరిహారాలు చేయాలి.

కన్య

(ఆదాయం-2, వ్యయం-11, రాజపూజ్యం-4, అవమానం-7)

శని మినహా గ్రహాల స్థితిగతులు అంతగా అనుకూలం కాదు. గురుడు ఏప్రిల్‌ 21 ‌నుండి అష్టమస్థితి సంచారం, రాహువుతో కలయిక మరింత క్లిష్టంగా ఉండే అవకాశం. ఇక శని సంచారం శుభఫలితాలు ఇస్తుంది. మొత్తానికి వీరు కొన్ని శుభఫలితాలు పొందినా ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగలాభం. ఆదాయపరంగా కొంత ఇబ్బంది కలిగినా ఏదో విధంగా అవసరాలు తీరతాయి. బంధువులు, స్నేహితుల మనోభావాలను గుర్తించి మసలుకోవడం అవసరం. ఒక పరిచయస్తుని ద్వారా అందిన సమాచారం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. రైస్‌ ‌మిల్లర్లు, ఫైనాన్స్ ‌రంగంలోని వారికి అనుకూల పరిస్థితులు. ఇంటి నిర్మాణాల్లో జాప్యం లేకుండా పూర్తి కాగలవు. ఏప్రిల్‌-అక్టోబర్‌ ‌మధ్య కాలంలో అష్టమంలో గురుఛండాల యోగం వల్ల ముఖ్యమైన వ్యవహారాలలో తొందరలేకుండా ముందుకు సాగాలి. ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారులు లాభాలతో పాటు కొన్ని వివాదాలు కూడా కొని తెచ్చుకుంటారు. భాగస్వాములతోనే విభేదాలు రావచ్చు. ఉద్యోగస్తులు విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్లడం మంచిది. వీరిపై అధికారుల అజమాయిషీ ఉండే సూచనలు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ వర్గాలు సమస్యలతోనే గడుపుతారు. కళాకారులు, క్రీడాకారులు అవకాశాలు చేజేతులా పోగొట్టుకుంటారు. సాంకేతికరంగం, వైద్యులు, శాస్త్రవేత్తలకు కొంత అనుకూలంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు రెండు పంటలూ సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు శ్రమతో కొన్ని విజయాలు అందుకుంటారు. మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. జ్యేష్ఠం, ఆషాఢం, మార్గశిరం, పుష్యమాసాలు మరింత కలసివస్తాయి. శని, గురుడు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం మంచిది.

తుల

(ఆదాయం-14, వ్యయం-11, రాజపూజ్యం-7, అవమానం-7)

ఏప్రిల్‌ 21 ‌నుండి గురుసంచారం, అక్టోబర్‌ 31 ‌నుండి రాహువు సంచారం అనుకూలం. శని సంచారం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. చిత్రవిచిత్రమైన రీతిలో వ్యవహారాలు చక్కదిద్దుతారు. గురుబలం వల్ల అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఖ్యాతి, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. చాకచక్యంగా మీలోని కార్యదక్షతను నిరూపిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఊరట చెందుతారు. ఉద్యోగార్ధులు ఉద్యోగాలు పొందుతారు. శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖరీదైన వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు. శని సంచారం కొంత వ్యతిరేకంగా ఉండవచ్చు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు రావచ్చు. అవివాహితులకు వివాహయోగం. విద్యార్థులకు మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారులు కొత్త భాగస్వాములతో జతకడతారు. లాభనష్టాలు సమతూకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు విశేష గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు కూడా లభించవచ్చు. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలకు శుభదాయక కాలం. కళాకారులకు మరిన్ని అవకాశాలు అవలీలగా దక్కుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ప్రజాదరణ పెరుగుతుంది. వ్యవసాయదారులు రెండు పంటలూ లాభిస్తాయి. ఆషాఢం, శ్రావణం, మార్గశిరం, మాఘమాసాలు విశేషంగా కలసివస్తాయి. శనీశ్వరునికి, రాహువునకు పరిహారాలు చేయించుకోవడం మంచిది.

వృశ్చికం

(ఆదాయం-5, వ్యయం-5, రాజపూజ్యం-3, అవమానం-3)

ఈ రాశి వారికి అర్దాష్టమ శని ప్రభావం మినహా, మిగతా గ్రహాలన్నీ శుభఫలితాలు ఇస్తాయి. గురుని అనుకూలత వల్ల ఆర్థికంగా విశేషంగా కలసి వస్తుంది. సంతాన రీత్యా శుభవార్తలు. ఉద్యోగలాభాలు సంతోషం కలిగిస్తాయి. మీ సమర్థత, నైపుణ్యం అందరూ గుర్తించే సమయం. ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది.బంధువులతో సత్సంబంధాలు మరింత పటిష్టమవుతాయి. చర, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఎన్నడూ ఊహించని వారితో పరిచయాలు ఏర్పడతాయి. గృహం, వాహనాలు కొంటారు.రాహుకేతువుల ప్రభావం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఇక అర్దాష్టమ శని ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గి, భయాందోళనలు, మానసిక అశాంతితో గడుపుతారు. చేసే పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం వీడాలి. విద్యార్థులకు అవకాశాలు అసంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారులు ప్రధమార్ధంలో అధిక లాభాలు, ద్వితీయార్థంలో సాధారణ లాభాలు పొందుతారు. పెట్టుబడులకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు ఉన్నా హఠాత్తుగా బదిలీలు తప్పకపోవచ్చు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, క్రీడాకారులు సొంత ఆలోచనలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కళాకారులు తమ ప్రతిభను చాటుకునే సమయమిదే. వ్యవసాయదారులు రెండు పంటలపై లాభాలు గడిస్తారు. వైద్య, శాస్త్రరంగాల వారు విశేష గుర్తింపుతో పాటు, ప్రతిభను చాటుకుంటారు. శ్రావణం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసివస్తాయి. శనీశ్వరునికి, రాహుకేతువులకు పరిహారాలు చేయించాలి.

ధనుస్సు

(ఆదాయం-8, వ్యయం-11, రాజపూజ్యం-6, అవమానం-3)

వీరికి అక్టోబర్‌ 31 ‌నుండి అర్దాష్టమ రాహుదోషం మినహా మిగతా గ్రహాలన్నీ అనుకూల ఫలితాలు ఇస్తాయి. అన్ని విధాలా అభివృద్ధి ఉంటుంది. ఆర్ధికంగా మరింత కలసివస్తుంది. విరివిగా దానధర్మాలు, విరాళాలు అందిస్తారు. సంతాన పరంగా ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల తోడ్పాటుతో ఎటువంటి కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. శని సంచారం కూడా లాభిస్తుంది. కొత్త నిర్మాణాలు చేపట్టి చురుగ్గా సాగిస్తారు. కుటుంబ విషయాలలో సమస్యలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. విద్యాసంస్థల వారికి గతేడాది కంటే మరింత కలిసివస్తుంది. విద్యార్థులకు విజయం సిద్ధిస్తుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిపిస్తారు. ప్రథమార్ధంలో ఆశ్చర్యకరమైన ఒక సమాచారం తెలుస్తుంది. స్థిరాస్తులను వృద్ధి చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. వాహనాలు, నగలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు లావాదేవీల్లో దూసుకువెళతారు. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతల నుండి బయటపడతారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, క్రీడాకారుల చిరకాల నిరీక్షణ ఫలిస్తుంది. రాజకీయవేత్తలకు ఊహించని పదవీయోగం. ప్రజాదరణ పెరుగుతుంది. కళాకారులు, రచయితలు అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యవసాయదారులకు రెండు పంటలలోనూ లాభాలు అందుతాయి. వైద్య, శాస్త్రరంగాల వారు తమ నిబద్ధతను చాటుకుంటారు. అక్టోబర్‌ 31 ‌నుండి అర్దాష్టమ రాహు సంచారం వల్ల ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే, తల్లి తరఫు వారితో వివాదాలు. మానసిక ఆందోళన. చైత్రం, వైశాఖం, భాద్రపదం, ఆశ్వయుజం, మాఘ మాసాలు అత్యంత సానుకూలం. చండీ పారాయణ, రాహువునకు పరిహారాలు నిర్వహించడం మంచిది.

మకరం

(ఆదాయం-11, వ్యయం-5, రాజపూజ్యం-2, అవమానం-6)

వీరికి ఏప్రిల్‌ 21 ‌నుండి అర్దాష్టమంలో గురుడు సంచారం. అలాగే, అక్టోబర్‌ 30 ‌వరకు అర్దాష్టమ రాహువు, ఏల్నాటి శని ప్రభావం వీరిపై ఉంటుంది. ప్రతి వ్యవహారంలోనూ ఏకాగ్రత లోపించి మధ్యలో విరమిస్తుంటారు. మానసికంగా ఆందోళన, చికాకులు. కుటుంబ సభ్యులు, మిత్రులతో సఖ్యంగా మసలుకుంటూ వివాదాలకు దూరంగా ఉండాలి. తరచూ దూరప్రయాణాలు సైతం ఉంటాయి. ఆరోగ్య పరంగా మరిన్ని జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై అప్పుల కోసం అన్వేషణ సాగిస్తారు. గురుసంచారం మిశ్రమ ఫలాలు ఇస్తుంది. కొత్త ఇంటి నిర్మాణాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం వారు ఎక్కువగా లాభపడతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తీరే సమయం. తల్లిదండ్రుల నుండి స్థిరాస్తి లేదా కొంత ధనలాభాలు ఉండవచ్చు. ఇక శని, మరో వైపు రాహు ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ భయాందోళనలు, మానసిక అశాంతి, ఆలోచనలపై ఒక నిర్ణయానికి రాలేరు. ఆత్మవిశ్వాసం పెంచుకుని ముందుకు సాగడం ఉత్తమం. నిరుద్యోగులు ఎంత కృషి చేసినా ఫలితం నామమాత్రంగా ఉంటుంది. వ్యాపారులకు సామాన్యమైన లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడరాదు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలకు సమస్యలు ఎదురుకావచ్చు. కళాకారులు, క్రీడాకారులు అందిన అవకాశాలు కూడా చేజార్చుకుంటారు. విద్యార్థులకు శ్రమాధిక్యంతో ఫలితాలు అందుతాయి. రాజకీయవేత్తలకు పరీక్షా సమయం. కొన్ని విచారణలు ఎదుర్కొనే సమయం. వ్యవసాయదారులు ఉత్పత్తులు పెరిగినా తగిన గిట్టుబాటు లేక ఇబ్బందులు పడతారు. అక్టోబర్‌ 31 ‌నుండి రాహుసంచారం కొంత ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తీరతాయి. వైశాఖం, జ్యేష్ఠం, ఆశ్వయుజం, కార్తీక మాసాలు విశేషంగా కలసివస్తాయి. శని, రాహువులకు జపాలు, ఇతర పరిహారాలు చేయాలి.

కుంభం

(ఆదాయం-11, వ్యయం-5, రాజపూజ్యం-2, అవమానం-6)

గురుసంచార సమయం సామాన్యంగా ఉంటుంది. ఏల్నాటి శని ప్రభావం కలిగినా కుంభరాశి కావడం వల్ల మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఇక రాహువు అక్టోబర్‌ ‌వరకూ శుభఫలితాలు ఇస్తాడు. మొత్తానికి వీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొవలసి ఉంటుంది. కుటుంబంలో మీ మాటను కాదనలేరు. కానీ వారిలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. వివాదాలకు మరింత దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఖర్చులు అదుపు చేసుకోవడం మంచిది. ఎక్కువ శ్రమ పడితే కొంత ఫలితం కనిపిస్తుంటుంది. శని సంచారం ఈ ఏడాది అనుకూలం. ఆచితూచి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. జూన్‌ 18, ‌నవంబర్‌ 4 ‌మధ్య మాత్రం శని కొంత•ప్రభావం చూపవచ్చు. వాహనాల విషయంలో తొందరపాటు వద్దు. రాహుకేతువులు ప్రథమార్థంలో శుభదాయమైన ఫలితాలు ఇస్తారు. నిరుద్యోగులు తమ అన్వేషణ తీవ్రతరం చేసి ఎట్టకేలకు విజయం సాధిస్తారు. స్థిరాస్తుల కొనుగోలులో మొదట్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి దక్కించుకుంటారు. వ్యాపారులు కృషికి తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు బాధ్యతలు పెరిగి కొంత నిరాశ చెందే అవకాశాలున్నాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తల శ్రమ ఇతరులకు ఉపయోగపడుతుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులపై ఒత్తిడులు పెరుగుతాయి. కళాకారులకు ద్వితీయార్థంలో అనుకూలిస్తుంది. వ్యవసాయదారులు మనోనిబ్బరంతో నష్టాలు అధిగమిస్తారు. విద్యార్థులకు శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వీడి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. చైత్రం, జ్యేష్ఠం, కార్తీకం, మార్గశిర మాసాలు విశేషంగా అనుకూలిస్తాయి. శనీశ్వరునికి తైలాభిషేకాలు, గురునికి జపాలు, రాహుకేతువులకు పరిహారాలు చేయడం మంచిది.

మీనం

(ఆదాయం-8, వ్యయం-11, రాజపూజ్యం-1, అవమానం-2)

వీరికి ఏల్నాటి శని ప్రారంభమైనా మూర్తిమంతం వల్ల శుభకారకుడే. అలాగే, ధనస్థానంలో గురు సంచారం విశేష లాభదాయకంగా ఉంటుంది. కీర్తిప్రతిష్ఠలు పెరిగి సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. అన్ని వ్యవహారాలలోనూ చురుగ్గా అడుగులు వేస్తారు. ఆత్మవిశ్వాసానికి పట్టుదల తోడై మీరు అనుకున్నది సాధిస్తారు. మీ మంచితనం, ఆదరణ ఇతరులను సైతం ప్రభావితం చేస్తుంది. ఆదాయానికి లోటులేకున్నా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉత్సాహం పెరుగుతుంది. శత్రువులు కూడా మీ పట్ల అనుకూలత• వ్యక్తం చేస్తారు. మీ వాగ్ధాటి, నైపుణ్యంతో విజయాలు సాధిస్తారు. బంధువులు, ఆత్మీయులతో సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపడతాయి. సంతానం విషయంలో మీ ఆశలు నెరవేరతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం, ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు. అక్టోబర్‌ 31 ‌నుండి రాహు, కేతువుల ప్రభావం వల్ల కొత్త సమస్యలు ఎదురై కొంత ఇబ్బంది పడతారు. చర, స్థిరాస్తుల కొనుగోలుపై కొంత సందిగ్ధత నెలకొన్నా ద్వితీయార్థంలో సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. వ్యాపారుల యత్నాలు సామాన్యంగా ఫలిస్తాయి. వీరు భాగస్వాముల చర్యలతో కొంత కలత చెందుతారు. ఉద్యోగస్తులు విధులలో సమర్థతను చాటుకుని గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. రాజకీయవర్గాల వారు కొన్ని వివాదాలలో చిక్కుకున్నా మనోనిబ్బరంతో బయటపడే అవకాశం. కళాకారులు, వైద్యరంగాల వారికి ద్వితీయార్థంలో శుభదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండో పంట అనుకూలిస్తుంది. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మార్గశిర మాసాలు విశేషంగా కలసి వస్తాయి. వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, రాహుకేతువులకు పరిహారాలు చేయడం మంచిది.

శుభమస్తు! సర్వేజనాం సుఖినోభవంతు!!

About Author

By editor

Twitter
Instagram