‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటుంది ఆర్షధర్మం. ఆ స్వరూపాన్ని మన ముందుకు తెచ్చేవే ధాన్యాలు. సస్యాలు ధాన్యాలను అందిస్తాయి. ధాన్యం మానవ శరీరానికి శక్తి. మానవాళికి సంపద. అందుకే వాటిలో దైవ భావన చూస్తాం. దాదాపు ఎనిమిది, పదివేల సంవత్సరాల కాలం నుంచి మనకు సేద్యం ఉంది. నాగరికతలన• ధాన్యాలు పరిపుష్టం చేశాయి. వీటిలో విస్తరికీ, శరీరానికీ కూడా నిండుదనాన్ని తెస్తున్నవి సిరిధాన్యాలు. చిరు ధాన్యాలనే వాటి విలువను బట్టి సిరిధాన్యాలుగా పేర్కొంటున్నారు. భారత ప్రభుత్వం 2018 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఇప్పుడు అంటే, 2023 సంవత్సరాన్ని కూడా  అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్య రాజ్య సమితి చేత భారత్‌ ‌ప్రకటింప చేసింది. సిరిధాన్యాలు లేదా చిరు ధాన్యాల ప్రత్యేకత పుష్కలమైన పోషక విలువలే కాదు, ఎన్నో ఇతర లక్షణాలు కూడా వాటిలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆయుష్షునూ ఇస్తాయి.


సిరిధాన్యాలను ప్రపంచ ఆహారంగా విస్తరింప చేయడమే భారత ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది. వీటి సులభతర సాగు గురించి, అవి ఇచ్చే ఆరోగ్యం గురించి భారత్‌ అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉంది. సిరిధాన్యాలు 200 నుంచి 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో కూడా పండుతాయి. మెట్ట ప్రాంతాలలోనే కాదు, ప్రతికూల వాతావరణాలను ఇవి తట్టుకుంటాయి. ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా దేశాలలో వీటిని పండిస్తారు.

విభిన్న వాతావరణ పరిస్థితులలో, వర్షాధార పంటలతో చిరుధాన్యాలు పండుతాయి. సాగు వ్యయం కూడా తక్కువ. వీటన్నిటిని ‘శ్రీఅన్న’ పేరుతో ప్రపంచ ప్రజల ముందుకు తీసుకువెళుతున్నారు. ఇది ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కీలకాంశం కూడా. చిరుధాన్యాల పంటల సాగును గురించి ఇదొక సమగ్ర అవగాహన ఏర్పాటు. ఆ విధంగా చిరుధాన్యాలకు భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడానికి కూడా భారత ప్రభుత్వం తన ప్రయత్నాలు చేస్తున్నది. సజ్జ, రాగి, జొన్న, కొర్రలు, సామలు, ఆరికె, వరిగ, ఊదలుగా పేరుపడిన చిరుధాన్యాల సాగు, ఉత్పత్తి, వినియోగాలను కలిపి శ్రీఅన్న కార్యక్రమంగా పిలుస్తున్నారు.

భారతదేశంలో చిరుధాన్యాలను 138 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 7.18 లక్షల హెక్టార్లలలో పండిస్తున్నారు. దిగుబడిని చూస్తే మన దేశం 173 లక్షల టన్నులతో గణనీయమైన స్థానంలో నిలబడి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ దిగుబడి 8.63 లక్షల టన్నులు. భారత్‌లో హెక్టార్‌కు 1239 కిలోలు, ప్రపంచంలో 1229 కిలోలు దిగుబడి లభిస్తున్నది. 173 లక్షల టన్నులు పండిస్తూ భారతదేశం ఆసియా చిరుధాన్యాల ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగి ఉన్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రపంచ ఉత్పత్తిలో 20 శాతం మన దేశ చిరుధాన్యాలే.

గతంలో భారతదేశంలో చిరుధాన్యాల సాగు, వినియోగం గణనీయంగా ఉండేది. కానీ గడచిన ఆరున్నర దశాబ్దాలుగా వీటి వినియోగానికి గండి పడింది. ఆహార భద్రత కోసం దేశంలో గోధుమ, వరి పంటలకు ప్రాధాన్యం పెంచారు. ఆ రెండు ఉత్పత్తులను చౌకధరలతో పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేపట్టారు. ఆ రెండు పంటలు చౌక ధరలతో లభ్యమవుతూ ఉండడంతో చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాధాన్యం దయనీయ స్థితికి చేరాయి. ఒకప్పుడు వాటికి ఉన్న ఆహార పంటల స్థాయి నుంచి పశుగ్రాసం స్థాయికి పడిపోయింది. 1965-70 ప్రాంతంలో ఆహారోత్పత్తులలో 20 శాతంగా ఉన్న చిరుధాన్యాలు ఆ తరువాత కాలంలో 6 శాతానికి దిగజారిపోయాయి. అదే గోధుమ ఉత్పత్తి చూడండి! ఈ ఆరున్నర దశాబ్దాలలో 7.6 శాతం నుంచి 16.2 శాతానికి ఎగబాకింది. జొన్న ఉత్పత్తి పరిస్థితి కూడా ఇదే. ఇదే కాలంలో 12.1 శాతం నుంచి 3.1 శాతానికి పతనమైంది. ఇదంతా హరిత విప్లవం ఫలితమని కూడా చెప్పవచ్చు.ఈ కాలంలో ఆహార భద్రత చేకూరిందని అనుకున్నా, చిరుధాన్యాలకు పట్టిన దుస్థితి విషాదకరమైనదనే చెప్పక తప్పదు.

శ్రీఅన్న ధాన్యాల విశిష్టత

ఒక పంట వినియోగం ఒక కాలంలో తగ్గినంత మాత్రాన దాని విలువను తగ్గించి చూడడం శాస్త్రీయదృష్టి కాలేదు. ఆ దృష్టి ఉన్నది కాబట్టే భారత ప్రధాని నరేంద్ర మోదీ చిరుధాన్యాలకు పునర్‌ ‌వైభవం తేవాలని కంకణం కట్టుకున్నారు. కొన్ని శతాబ్దాల పాటు చిరుధాన్యాలు కొన్ని ప్రాంతాలలో ప్రధాన ఆహారంగా ఉన్నాయంటే అందుకు వాటిలోని విశిష్టతే కారణం. ఏమిటది?

ఇంతకు ముందు చెప్పినట్టు ఈ పంటలు మారుతున్న వాతావరణానికే కాదు, ప్రతికూల వాతావరణ పరిస్థితులలోను దిగుబడిని ఇవ్వగలవు. తక్కువ నీటి లభ్యత, తక్కువ కాలపరిమితి వీటిలోని గొప్ప సౌలభ్యం. వరి సాగుతో పోల్చి చూస్తే చిరుధాన్యాల సాగుకు 70 శాతం నీటి లభ్యత చాలు. కాలపరిమితికి సంబంధించి చూస్తే గోధుమ పంట కంటే తక్కువ కాలంలో దిగుబడి వస్తుంది. విత్తన శుద్ధి వంటి పనిని వరితో పోలిస్తే 40 శాతం తక్కువ శక్తితో పూర్తి చేయవచ్చు. వరిధాన్యాలకు అవసరమయ్యే ఎరువులు వంటి వనరులు కూడా తక్కువే. వరి, గోధుమ ఎక్కువ కాలం పంట మీద ఉంటాయి. దీని వల్ల ఒక్కొక్క పరిస్థితిలో ఆ కారణంగా దిగుబడి తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ చీడపీడలు దాడిచేస్తే ఈ రెండు పంటలు సాగు అవుతున్న ఒక ప్రాంతంలోని మొత్తం దిగుబడి నాశనమయ్యే ప్రమాదం కూడా ఉంది. కానీ చాలా ప్రాంతాలలో చిరుధాన్యాలకు రసాయనిక మందుల వాడకం, క్రిమి సంహారకాల వినియోగం కూడా అవసరం రాదు. అందుకే ఇవి ఇప్పటికీ సేంద్రియ ఉత్పత్తులుగానే పరిగణనలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో యువతకు ఇది తగినంత ‘పని’ కల్పిస్తున్నది. పశుగ్రాసంగా కూడా అక్కరకు వస్తున్నది. శ్రీఅన్న ధాన్యాలు జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయి.

పోషక విలువలు

గోధుమ, వరి పంటలతో బేరీజు వేసినా చిరుధాన్యాలలో కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు) తక్కువేమీ కాదు. ఇంకా ప్రోటీన్లు (మాంసకృత్తులు), మినరల్స్ (‌ఖనిజ లవణాలు), పీచు పదార్థం, కాల్షియం, ఐరెన్‌, ‌విటమిన్‌లు వంటివన్నీ కూడా చిరుధాన్యాలలో పుష్కలంగానే ఉన్నాయి.

ఇన్ని ప్రత్యేకతలు, పోషక విలువలు ఉన్నవి కాబట్టే మన పూర్వికులు అటు చిరుధాన్యాలను పండిస్తూ ప్రకృతినీ, వాటిని వినియోగించుకుని ఆరోగ్యాన్నీ సంరక్షించుకున్నారు. వరి, గోధుమతో పోలిస్తే వీటిలో గ్లైసిమిక్‌ ఇం‌డెక్స్ ‌తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని వినియోగించేవారు మధుమేహం బారిన పడరనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఇవి గ్లూటీన్‌ ‌రహితం కూడా. కాబట్టి గుండె జబ్బులు, రక్తపోటులను నివారిస్తాయి. కొలస్ట్రాల్‌, ఇన్సులిన్‌ ‌నిరోధక శక్తి, స్థూలకాయం, జీర్ణకోశ వ్యాధులు, కొవ్వు సమస్య – ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ప్రాణాంతకాలైన వ్యాధులగా చెబుతున్న చాలా వాటిని చిరుధాన్యాల వినియోగంతో దూరం చేసుకునే అవకాశం ఉంది. ఆధునిక యుగాన్నీ, జీవన శైలినీ దృష్టిలో ఉంచుకుంటూనే మనం కూడా అలాంటి జీవితాన్ని గడపడానికి ఉద్దేశించినదే శ్రీఅన్న పథకం. ఇందుకు తగిన వాతావరణం సృష్టించుకోవడంలోనే అంతా ఉంది. చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహించడం, వాటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం అనివార్యం చేసుకోవాలి. ఇందుకు తగిన వాతావరణం క్రమేణా బలపడుతున్నది కూడా. జీవన ప్రమాణాల పెరుగుదల, ఆర్థిక ఉన్నతి, ఆరోగ్యం, వీటికి కావలసిన నేపథ్యం ఇటీవలీ తరాలు బాగా అర్ధం చేసుకుంటున్న కారణంగా చిరుధాన్యాల మీద ఆసక్తి కనపడుతున్నది. వరి, గోధుమల స్థానంలో చిరుధాన్యాల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 2018 నుంచి ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. దేశం చిరుధాన్యాల సంవత్సరంగా పాటించాలని మోదీ ప్రభుత్వం పిలుపునిచ్చినది ఆ సంవత్సరమే. వాటి వినియోగం, అందులోని ప్రయోజనాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడానికి కేంద్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది కూడా. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవ త్సరం పిలుపు దానికి కొన సాగింపు. ఇప్పుడు కూడా ఇటు దేశంలోను, అటు విశ్వవ్యాప్తంగా చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని వివరించే కార్యక్రమాలను చేపడుతున్నది. శ్రీఅన్న పథకంలో భాగంగానే ‘భారత చిరు ధాన్యాల సంస్థ’ను నెలకొల్పింది. ఇది హైదరాబాద్‌లోనే నెకొల్పారు. చిరుధాన్యాలపై పరిశోధనలకు కూడా ఇదే కేంద్ర బిందువు.

వాతావరణ మార్పులు- చిరుధాన్యాల సాగు

ఇవాళ్టి ప్రపంచ వాతావరణ, పర్యావరణ పరిస్థితులను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే చాలా ప్రశ్నలే వస్తాయి. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులు మాత్రమే ఉపకరిస్తాయి. కానీ పారిశ్రామికీకరణ, జీవనశైలి, ప్రకృతి వనరుల దుర్వినియోగం, పెరిగిన ఉద్గారాలు ప్రకృతి వైపరీత్యాలకు దారి తీశాయి. ఎండ, వాన, చలి అన్నీ అతిగానే ఉంటున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో మనుషులకు అవసరమైన ధాన్యాల మాటేమిటి? నీటి వనరుల సమస్య కూడా పొంచి ఉన్న మాట నిజం. వాటి ఉత్పత్తికి అనుకూల వాతావరణం మాటేమిటి? ఇవన్నీ శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్నలు. ఈ పరిస్థితులు మున్ముందు ఇంకాస్త అవాంఛనీయంగా పరిణమించే ప్రమాదమే ఎక్కువ. కాబట్టి ఇలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలిగిన పంటల వైపు మానవాళి మళ్లక తప్పని పరిస్థితి వచ్చింది. ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడం, తక్కువ నీటి వనరులతో దిగుబడి సాధించడం చిరుధాన్యాలతోనే సాధ్యం.

2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంతో శ్రీఅన్న పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన అంశాల గురించి ఒకసారి చర్చించుకోవాలి.

అధికోత్పత్తిని ఇచ్చే వంగడాలను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి విస్తృతంగా సాగు చేయడానికి చాలా రాష్ట్రాలలో కార్యక్రమాలను తీసుకుంది. మేలైన విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన ఒక కేంద్రంలో విత్తనాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి చుట్టుపక్కల రైతులను అక్కడికి వచ్చేటట్టు చేస్తున్నది. పంటల మార్పిడిని, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించే పనిని మరింత పటిష్టంగా సాగిస్తున్నది. వీటిని పండించ డానికి ముందుకు వచ్చిన రైతులకు ప్రోత్సాహం కల్పిస్తూ గిట్టుబాటు ధర కల్పించడం అన్నిటికంటే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈ మధ్యకాలంలో సిరిధాన్యాల మద్దతు ధరను 80 శాతం నుంచి 125 శాతం వరకు పెంచింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సేకరణ కేంద్రాల ద్వారా సహకరించాలి. ఇంత ప్రయత్నం వల్ల అధిక మొత్తంలో చిరుధాన్యాలు అందుబాటులోకి వస్తాయి. రైతులు లబ్ధి పొందుతారు. వినియోగదారులు పెరుగుతారు. చిరుధాన్యాల సాగు, ప్రాధాన్యం, వినియోగాల గురించి పూర్తి స్థాయి అవగాహన కల్పించవలసిన అవసరం ఇంకా ఉందన్న సంగతి కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది.

అంగన్‌వాడి కేంద్రాలు, ఇతర పాఠశాలల్లో వారంలో ఒక రోజు సిరిధాన్యాల వంటకాలను అందించాలి. హోటళ్లలోను చిరుధాన్యాలతో తయారు చేసిన ఒక వంటకం వడ్డించే ఏర్పాటుచేయాలి. చెఫ్‌లు కూడా చిరుధాన్యాల మీద తమకు ఉన్న అవగాహన మేరకు వినియోగదారులకు వాటి ప్రయోజనాన్ని వివరించాలి. అంతర్జాతీయంగా ఆహారపు అలవాట్లను నిర్దేశించేవారి సహాయం కూడా తీసుకోవాలి. ప్రవాస భారతీయుల సాయంతో ఆహారోత్సవాలను నిర్వహించి మరింత ప్రాచుర్యం కల్పించాలి. ప్రజలంతా వారంలో ఒక పూట అయినా చిరుధాన్యాలను స్వీకరించాలి. కొత్త కొత్త వంటకాలను అందుబాటులోకి తేవడంతో పాటు, అవి ఎక్కువ సమయం నిల్వ ఉండేవిధంగా తయారు చేయడమూ అవసరమే. చిరుధాన్యాల ఉత్పత్తులతో చేసే వంటకాలు, చిరుతిళ్లు ఈ విధంగా ఉండడానికి అవసరమైన పరిశోధన కూడా చేయించాలి. సంప్రదాయంలో కూడా వీటిని భాగం చేయడానికి దైవ, శుభ కార్యాలలో చిరుధాన్యాలను ప్రసాదాల తయారీకి వినియోగించాలి. వీటికి ప్రాచుర్యం కల్పించడానికి సామాజిక మాధ్యమాన్ని విరివిగా ఉపయోగించుకోవాలి. చిరుధాన్యాల వినియోగం గురించి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు కార్యక్రమాలు నిర్వహించి చైతన్యవంతం చేయాలి. భారత ఆహార నియంత్రణ మండలి నిబంధనల మేరకు ఈ ఉత్పత్తులకు ప్రమాణాలను నిర్దేశించాలి. ప్రభుత్వ, మంత్రిత్వ శాఖల కార్యక్రమాలలో విధిగా చిరుధాన్యాలతో చేసిన అల్పాహారాలను అందించాలి. కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని పదిలక్షల మంది స్త్రీలు, పిల్లలకు ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిండిగా చిరుధాన్యాలతో చేసిన వాటిని అందించాలి. జిల్లా స్థాయిలో ఐసీడీఎస్‌ ‌కార్యక్రమంలో భాగంగా వారానికి ఒకసారి సిరిధాన్యాలను ఉపయోగించే ందుకు కార్యక్రమం నిర్వహించాలి. పంచాయతీలను కూడా ఇందులో భాగస్వాములను చేసి చిరుధాన్యాలు అందరికి లభించే విధంగా పాటుపడాలి. రక్షణ, పోలీస్‌ ‌శాఖల క్యాంటీన్‌ ‌లలో ఈ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలి. మీడియా ఇందుకు తోడ్పడాలి. వీటిలోని పౌష్టిక విలువలను అందరి దృష్టికి తీసుకువెళ్లవలసి ఉంది. ఈ ఉత్పత్తులతో తయారు చేసే వంటకాలలో నూతన ఆవిష్కరణలను ఆశ్రయించవలసి ఉంది. వీటిని ఎగుమతి చేయడానికి ఏపీజీపీఏ వంటి సంస్థల సాయంతో ఈ వంటకాల బ్రాండ్‌ ‌గురించి కృషి చేయాలి. ఇందుకు కార్యశాలలను నిర్వహించాలి. వీటి ఉత్పత్తిలో మన దేశానికి ఉన్న చరిత్ర, అవగాహనలను బట్టి మూడు చోట్ల అధునాత సౌకర్యాలతో పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయాలి. పరిశోధనలను ముమ్మరం చేయాలి. రైతులకు అందించే విత్తనాలను తగిన విధంగా శుద్ధి చేసేందుకు గ్రామాలకు సమీపంలోనే కేంద్రాలను ఏర్పాటు చేయాలి. చిరుధాన్యాల ఉత్పత్తులను మెరుగు పరచడంతో పాటు మార్కెటింగ్‌ ‌వ్యవస్థలో మంచి సమన్వయం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టార్ట్అప్‌లు, యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలి.

ఆజాదీ కా అమృతోత్సవం జరుగుతున్న కాలంలోనే, 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం సంతోషదాయకం. అమృతోత్సవాలలో చిరుధాన్యాల వినియోగానికి ప్రాచుర్యం కల్పించే బృహత్తర ఆశయానికి చోటు కల్పించడం మరింత శుభప్రదం. ఇది రైతులకు, వినియోగదారులకు కూడా సంతోషాన్ని పంచగలదు. ప్రపంచ మానవాళికి ఆరోగ్యం ఒక క్లిష్ట సమస్యగా మారిపోతోందని అనుకుంటున్న కాలంలో భారతదేశం కేంద్రంగా చిరుధాన్యాల అభివృద్ధికి పథక రచన జరగడం మనమంతా గర్వించదగినది.


భావి ప్రపంచపు సాగు

పురాతనకాలం నుంచి చిరుధాన్యాలు భారతదేశానికి తెలుసు. ఇప్పుడు కూడా భారతదేశం ద్వారా ప్రపంచానికి వాటి ప్రాధాన్యం వెల్లడవుతున్నది. వాతావరణ మార్పులే కాదు, ఉపాంత భూములలో కూడా పండే చిరుధాన్యాలు పోవాసియా తెగకు చెందినవి. ఇప్పుడు భూగోళం మీద 131 దేశాలలో చిరుధాన్యాలను పండిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాలలో నివసించే 59 కోట్ల మందికి చిరుధాన్యాలే సంప్రదాయక ఆహారం. ఇంతకాలం ఉపేక్షకు గురైన చిరుధాన్యాల ప్రాముఖ్యం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.వీటి మాతృభూమి భారతదేశమే.  ఆహారం, ఇంధనం, పౌష్టికాహార లోపం, ఆరోగ్యం, వాతావరణ మార్పు వంటి కీలక అంశాలకు సమాధానం చిరుధాన్యాలతో సాధ్యమన్న భావన ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. ఎందుకంటే వీటికి స్వల్ప నీటి వనరులు చాలు. మందులతో పని తక్కువ. పనికిరాని భూములలోనూ ఇవి పండుతాయి. ఆ విధంగా ఇవి భవిష్యత్తు సమస్యలను ఎదుర్కొనేందుకు ఆయుధాలుగా కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేయబోతున్నాయి. నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వరి ఉత్పత్తి తగ్గిపోతుందని ఒక అంచనా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు చేయక తప్పదు. వాతావరణ మార్పుల ఫలితంగా అసలు ఆహార భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. చీడపీడల బాధ మరింత ఉధృతం కావడం, భూసారం క్షీణించడం, పంట సాగు సమయాలు మారిపోవడం, భూములు ఎడారుల లక్షణాలను తెచ్చుకోవడం వంటివి భవిష్యత్తులో మానవాళి ఎదుర్కొనవలసి ఉంది. ఇంత ఉత్పాతం నుంచి మానవాళిని రక్షించగలిగినవే చిరుధాన్యాలు. కాబట్టి భవిష్యత్తు సాగు అంటే చిరుధాన్యాలేనని గట్టిగా చెబుతున్నారు.

మానవాళి ఎదుర్కొనబోతున్న ఆరోగ్య సమస్యలకు కూడా చిరుధాన్యాలే దివ్యౌషధాలుగా కనిపిస్తున్నాయి. మారిన జీవనశైలితో మనుషులు అధిక బరువుతో లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారు. వీరి బరువు తగ్గించడానికి చిరుధాన్యాలు సహకరిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడాంట్స్ ఉం‌డడం వల్ల గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే నాళాలలో క్లాట్స్ ఏర్పడకుండా కాపాడతాయి. కొర్రలలో ఉండే ఫైటో కెమికల్‌ ‌క్యాన్సర్‌ ఏర్పడకుండా కాపాడుతుంది.

 భారత రైతులు తొమ్మిది రకాల చిరుధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా సాగు అవుతున్నవి మూడు- జొన్నలు, రాగులు, సజ్జలు. ఇవే చిరుధాన్యాల ఉత్పత్తిలో 95 శాతం వాటా కలిగి ఉన్నాయి. వీటిని న్యూట్రీ సిరియెల్స్ అని కూడా పిలుస్తారు. అంటే పోషకాహార విలువలు ఉన్న ధాన్యాలు. రాగులు ప్రతి వంద గ్రాములలోను 4 నుంచి 8 మిల్లీ గ్రాముల ఐరెన్‌ను కలిగి ఉంటాయి. ఇది భారతదేశంలో ఎక్కువ మందిని వేధిస్తున్న రక్తహీనత లోపాన్ని సరిదిద్దగలదు. జింక్‌, ‌ఫాలిక్‌ ‌యాసిడ్‌ ‌కూడా ఉంటాయి కాబట్టి గర్భిణులకు దీనిని అందిస్తారు.


ప్రకృతి ప్రసాదించిన నవరత్నాలు

భారత రైతాంగం తొమ్మిదిరకాల చిరుధాన్యాలను పండిస్తున్నది. అంటే నవరత్నాలుగా చెప్పుకోవచ్చు. వాటి గొప్పతనం గురించి ఒకసారి పరిశీలిద్దాం..

1. కొర్రలు (ఫాక్స్‌టెయిల్‌): ‌వీటిలో ఫైబర్‌, ‌విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. స్థూలకాయం, కీళ్లనొప్పులు, పార్కిన్‌సన్స్, ‌మూర్చ, గుండె సంబంధిత వ్యాధులను నివారించే గుణం వీటికి ఉంది.

2. సామలు (లిటిల్‌ ‌మిల్లెట్‌): ఇం‌దులోను విటమిన్‌లు, ఫైబర్‌, ‌ప్రోటీన్లు, మినరల్స్, ‌కార్బోహైడ్రేట్స్ ఉం‌టాయి. పీసీఓడీ, గర్భధారణ సమస్యలకు ఇదొక విరుగుడుగా ప్రసిద్ధి.

3. ఆరికలు (కొడొ మిల్లెట్‌): ఇది మధుమేహ వ్యాధి నివారణకు దోహదం చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనతను అరికడుతుంది.

4. ఊదలు/ కొడిసామ (బేర్న్‌యార్డ్ ‌మిల్లెట్‌): ఇది గ్లూటీన్‌ ‌రహితం కావడంతో కొలెస్ట్రాల్‌ను నిరోధించగలుగుతుంది. లివర్‌, ‌మూత్రపిండాల సమస్యలు రాకుండా చేయగలదు. దీనితో ఇడ్లీ, ఉప్మా, దోసె తరహాలో వంటకాలు చేయవచ్చు.

5. రాగిచోడి (ఫింగర్‌ ‌మిల్లెట్‌): ఇది ప్రధానంగా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే రక్తహీనత రాకుండా నివారించగలదు. రాగి రొట్టె, రాగి జావలను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సర్వసాధారణంగా తీసుకుంటున్నారు.

6. సజ్జలు (పెర్ల్ ‌మిల్లెట్‌): ‌శరీరంలోని విషాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచడం దీని ప్రత్యేకత. టైప్‌ 2 ‌మధుమేహానికి, గాల్‌స్టోన్స్‌కు కూడా ఇది విరుగుడు. సజ్జరొట్టె, సజ్జ అంబలిని తెలుగు ప్రాంతాలలో విరివిగా తయారు చేస్తారు.

7. అండు కొర్రలు (బ్రౌన్‌ ‌టాప్‌ ‌మిల్లెట్‌): ఇం‌దులోను విటమిన్‌లు, ఫైబర్‌ ఉం‌టాయి. థైరాయిడ్‌, ‌కీళ్లనొప్పులు, స్థూలకాయం, రక్తపోటు రాకుండా నివారించ గలవు.

8. వరిగ (ప్రోసో మిల్లెట్‌/‌కామన్‌ ‌మిల్లెట్‌): ఇం‌దులో ఫాలిక్‌ ‌యాసిడ్‌, ‌విటమిన్లు ఉంటాయి. కార్టినాయిడ్స్, ‌పాలిఫెనోల్స్ ‌వంటి యాంటీ టాక్సిడాంట్లు ఇందులో ఉన్నాయి. అందుకే కొలస్ట్రాల్‌ను అదుపు చేయడంలోను, రోగ నిరోధక శక్తికి తోడ్పడడంలోను దీనికి ప్రాధాన్యం ఉంది.

9. జొన్నలు (గ్రేట్‌ ‌మిల్లెట్‌/‌సొర్గుమ్‌): ఇది చెడు కొలస్ట్రాల్‌ను నివారిస్తుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. జొన్నరొట్టె, జొన్న అంబలి విరివిగా తీసుకుంటారు.

చిరుధాన్యాలను ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఆహార పదార్థాలుగా, సమున్నత ఆహారంగా చెబుతారు. ఇది నిజం.

– ప్రొ।। పి. రాఘవరెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ  విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి

About Author

By editor

Twitter
Instagram