– జంధ్యాల శరత్‌బాబు

వాణీజయరాం. ఐదు అక్షరాలు. సంగీత రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలంటారు. వాటికి అనురాగాన్ని జతచేరిస్తే, ‘వాణీజయరాం’ అవుతుంది. ఆమె పాటలోని ప్రతీ మాటలో అనురాగమే వినిపిస్తుంది, కనిపిస్తుంది. అనురాగం అంటే – అనురక్తి, ప్రీతి, ప్రియత్వం, సౌహార్దం, సౌభాగ్యం. ఆమెను వింటుంటే, ఇంట్లో మన కుటుంబ సభ్యురాలే అనిపిస్తుంది ఎవరికైనా. అందుకే భాషతో సంబంధం లేకుండా ఇంటింటా అలరిస్తోందా బాణీ. ఇవాళో రేపో పద్మ భూషణురాలు కావాల్సిన ఆపాత గానతరంగిణి ఒక్కసారిగా ఆగిందనగానే, అన్ని గుండెలూ ఒకేసారి కలుక్కుమన్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఒరియా, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, ఉర్దూ, ఆంగ్లం, మరెన్నో భాషల వారి హృదయాలన్నీ నేటికీ మౌన నివాళి సమర్పిస్తూనే ఉన్నాయి. కళాతపస్వి విశ్వనాథ్‌ ‌వెళ్లిపోయారని చింతాక్రాంతమైన చలనచిత్ర జగతి… మరికొన్ని గంటలైనా గడవకముందే…ఈ కళామనస్వి ఆయననే అనుసరిం చడంతో, శాశ్వత విషాదంలో కూరుకుపోయింది. బయటపడటం ఇక ఎప్పటికీ సాధ్యం కాదు. ‘రాగాలనంతాలు నీ వేయి రూపాలు, భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు’ వింటున్నంతసేపూ మన కళ్లముందు వాణీజయరాం ప్రత్యక్షమయ్యే ఉంటారు. ఆ రూపాన్ని, గాత్రాన్ని మనలో ఏ ఒక్కరం ఏ నాటికీ మరవలేం. అన్ని భాషలూ, ప్రాంతాలూ కళా పక్రియలకు అతీతమైన జీవితం ఆమెది. గీత సంగీత లోకంతో తనది అనుదినానుబంధం, పరిపూర్తిగా హృదయ బంధనం.

నాడు 1945. నేడు 2023. వీటి మధ్య కాల వ్యవధి 78 ఏళ్లు. తమిళనాట వేలూరు ప్రాంతంలో పుట్టి, చెన్నైలో తుదిశ్వాస విడిచిన వాణి అసలు పేరు కలైవాణి. పేరుకు తగిన రీతిలోనే సంగీత సరస్వతి అయ్యారు. మెట్టినింట ‘స్వరబంగారం’ అనిపించుకున్నారు. భర్త జయరాంతో రాగ తాన పల్లవులను పంచుకున్నారు. నాలుగేళ్ల కిందట పతీ వియోగం సంభవించడంతో, నవనాడులూ కుంగినట్లయి అల్లకల్లోలమయ్యారు. కష్టాల కడలిని దాటే ఆధారం సంగీతం నుంచే పొందారు. సంతానం లేదన్న పరితాపం, ఒంటరి జీవనం తెచ్చిన మరింత కుంగుబాటుతనం, పలు విధాల కలతలన్నింటికీ ఏకైక ఔషధం గీతమేనని నిశ్చయించుకున్నారు. తొలి నుంచీ తనది వ్యక్తిగత ప్రతిభా సంపత్తి. చిన్న వయసులోనే ఆకాశవాణి శ్రోతలను అలరించారు. బడిలో చదువుతుం డగానే, ఎందరెందరికో స్వరమధురిమ అందించారు. ఆమెలో గాయని ఒక్కరే కాదు, కవయిత్రీ ఉన్నారు. ఏ పదాన్ని ఎలా పలకాలో, సంగీత నియమాలకు తగిన రీతిలో ఏ విధంగా ఒదిగించాలో బాగా తెలిసినవారు. మొట్టమొదట హిందీ పాటతో పయనం ఆరంభించినప్పుడు, ఆమెకు పాతికేళ్లు. తెలుగులో ‘ఎప్పటివలె కాదురా’తో మురిపించినపుడు, తనకు 28 సంవత్సరాలు. అదే పాటలో ఒకచోట ‘పలుకు పలుకులో లలిత రాగములు చిలకరింతురా’ అని ఉంటుంది. సరిగ్గా అదే, అనంతర వృత్తి జీవితంలో కొనసాగుతూ వచ్చింది. ‘ఏ పాట పాడాలన్నా, ముందుగా అందులోని సారాంశాన్ని గుర్తిస్తాను. సందర్బానికి అనువైన గాత్ర సౌలభ్యాన్ని పాటిస్తూ వస్తాను. ఆ కారణంవల్లనే, ఎన్ని భాషల్లో, ఎన్నెన్ని పాడినా శ్రోతలంతా వాటిల్లో తమను తాము చూసుకున్నారు. ఇంతటి ఏకత్వాన్ని తెచ్చింది సంగీత కళే. దీనితోనే ఎంతైనా మమేకత్వం సాధించవచ్చని నేనూ రుజువు చేశాను’ అన్నారొక ముఖాముఖిలో. అవును, నిజమే. ప్రజల ఐక్యత, మమేకత వాణీజయరాం పాటలతో ఇంకెంతగానో వెల్లివిరిసింది. ఆ రీత్యా, ఆమె నిశ్చయంగా నిత్య విజేత.

నిత్య జీవన రాగాలాపన

‘తూరుపులోన తెలతెలవారే, బంగరు వెలుగు నింగిని చేరె’ అన్నప్పుడు ఉన్న మార్దవం ఆ మరు నిమిషంలో ‘తొలి కిరణాలా’ అంటూ రాగాలాపన చేస్తున్నప్పుడు ఎంతో విస్తృతం. ‘అందెల రవమిది పదములదా, అంబరమంటి న హృదయముదా’ గీతంలో ముందుగా ‘మంగళ ప్రదాయ గోతురంగతే నమః శివాయ, గంగయా తరంగితోత్తమాంగతే నమఃశివాయ’ అనేటప్పుడు ఆ గొంతులో పలికిన పరిణతి ఎంతైనా హృద్యం. మరో గీతిక ‘ఆనతి నీయరా హరా’లో ఒకచోట ‘రక్షధర శిక్షా దీక్ష ద్రక్ష విరూపాక్ష, నీ కృపా వీక్షణాపేక్షిత…’ అంటుంటే ప్రత్యక్షమైన దృశ్యమాలిక వాణీజయరాం స్వర విశ్వరూపానికి సూచిక. ఇలా ఏ భాష అయినా, ఏ సందర్భాన పాడినా, అది ఎటువంటి సన్నివేశమైనా అగ్రస్థాయిన మారుమోగేది ఆమె గాత్ర విలక్షణమే. తాను పాడిన పాటల్లోని ‘ఎన్నెన్నో జన్మల బంధం’ పదాల ప్రయోగం తనకూ, శ్రోతలకూ సంపూర్ణంగా వర్తిస్తుంది. తెలుగుదనమైనా, తమిళ సౌందర్యమైనా, భోజ్‌పురి వైవిధ్యమైనా, అది శ్లోకమైనా, లలితగీతిక అయినా, జానపదంగా సాగినా – అన్నింటా మొదటి నుంచి చివరి వరకు వీనుల విందు ప్రసాదించేది ఆమె గొంతుకే. ఎన్ని వేల పాటలు పాడారో లెక్కించలేం, ప్రతీ పాటలోనూ తానేమిటో నిరూపించారని మాత్రం గట్టిగా చెప్పగలం. తన పేరులోని ‘కలై’ విద్యాభ్యున్నతికి ప్రతీక. సంగీత కుటుంబంలో జన్మించి, – ఆ రంగ సమ్రాట్టుల సమక్షాన అభ్యసించడం ఆమె నేపథ్య వైభవానికి అక్షర మాలిక. పుట్టి పెరిగిన చెన్నైలోనే పట్టభద్రులయ్యారు. కొంతకాలం బ్యాంకు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కచేరీలతో తనదైన విస్తృతిని ఊరూవాడా చాటుకున్నారు. జీవనయానంలో భాగంగానే, కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉద్యోగిని అయ్యారు. అప్పుడు తెలుగుమీద కలిగి పెరిగిన ఇష్టతతో గాయనిగా ఎంతగానో దూసుకెళ్లారు. భావాన్ని పలికించడంలో సాటి, పోటీ మరెవ్వరూ లేరని సంగీత విమర్శకుల ప్రశంసలందుకున్నారు.

పురస్కారాల కల్పవల్లి

వినోదం, విషాదం – రెండింటినీ పలికించడం ఆమెకి పుట్టుకతో అలవడిన విద్య. సహజసిద్ధ ప్రతిభాసంపన్నత. శిక్షణవల్లనో, పలు పాటలు పాడిన అనుభవం తోనో మాత్రమే వచ్చింది కాదది. ఎప్పటి సినిమా ‘సీతాకోక చిలుక’? ఎప్పుడో నాలుగు దశాబ్దాల నాటిది. అందులోని ‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ’ పాటను ఇప్పుడు విన్నా కూడా కోనేటి తామరలు, రంగవల్లులు, పూలజల్లులు, కంటి కోలాటాలు, జంట పేరంటాలు, మరెన్నెన్నో సుందర దృశ్యాలు మనముందు నిలుస్తాయి. అంతకుముందు, అంటే నాలుగున్నర దశాబ్దాల కిందటి ‘విధి చేయు వింతలన్నీ’ గీతికను వింటుంటే ఇప్పటికీ శ్రోతలుగా మన మానసాలు విషాద పూరితాలవుతాయి. ‘మనసు కవి’ కలం రాసిన ఆ పాటను గాత్ర తపస్విగా వాణీజయరాం చిరకాలం గుర్తుండేలా ఆలాపించారు. ‘వలచి గెలిచి కలలు పండిన జంటలేదీ ఇలలో, కులము మతమొ ధనము బలమొ గొంతుకోసెను తుదిలో…’ అనేటప్పుడు మన చెవిని తాకేది అతి బలవత్తరమైన విషాద వీచిక. ఇంతటి స్వభావ పూర్ణత ఆమెకు సంగీతపరంగా ఎలా సాధ్యమైందన్నది ఎన్నటికీ ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది. ఆ గొంతు మూగవోయిందంటే ఎవరం నమ్మం. పాటలతోనే తాను మన మదిలో చిరంజీవిత్వం పొందారన్నది అక్షర సత్యం. లభించిన జాతీయ పురస్కారాలు మూడు. శ్రోతల హృదయసీమలో సాధించిన పురస్కృతులైతే బోలెడు. మొదట ఉత్తమ గాయని అవార్డు పొందిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్‌’. ఆ ‌రాగం అపూర్వం కాబట్టే, తెలుగులో రెండు చిత్రాలకు (శంకరాభరణం, స్వాతికిరణం) వరస పురస్కృతులు స్వీకరించారు.

ప్రతీ పాట తేనెల ఊట

బాగా పాడేవారున్నారు. బలంగా పాడేవారున్నారు. బలంగా, బాగా పాడేవారు మటుకు కొందరే ఉంటారు. ఆ కొద్దిమందిలో ముందువరస స్థానం వాణీజయరాం సొంతం. గాత్ర, వాద్య సంగీతాల్లో గట్టిపట్టు; మాటను పలికించేటప్పుడు కనబరచే ప్రస్ఫుటతత్వం ఆమెను అజరామరం చేస్తున్నాయి. సంగీతాన్ని, సాహిత్యాన్ని ఏ పాళ్లలో మేళవిస్తే గీతిక పండుతుందనేది ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. భావసంపద ప్రాధాన్యాన్ని తాను గ్రహించి వెలువరించనంత దృఢంగా ఇంకెవరూ చేయలేరు. అందువల్లనే తన ప్రతీ పాటా తేనె ఊటగా ఉంది, ఉంటోంది, ఉంటుంది కూడా. నవరసాలనూ వ్యక్తపరచే తీరుతో తనదైన ముద్రవేసుకున్న వాణీజయరాం నూటికి నూరుపాళ్లూ అపురూప గాయకురాలు. ప్రయోగం చేసినా, ప్రభావం చూపినా తనకే చెల్లు. సంగీత పారాయణంతో జాతిని ఇంతగా, ఇంతలా ప్రభావితం చేయగలిగిన ఆ విద్వన్మణి మహిళాలోక శిరోమణి.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సమున్నత ‘పద్మ’ బహూకృతిని స్వీకరించాల్సిన ఆమె ఈ లోపునే గంధర్వలోకానికి తరలివెళ్లటం విధివైచిత్రి. ప్రధాని నరేంద్రమోదీ అన్నట్లు, ఆ గాయనీమణి మరణం సృజన ప్రపంచానికి తీరనిలోటు. భక్తి గీతాల ఆలాపనతోనూ చరితార్థ అయ్యారు వాణీజయరాం. పూజలు చేయడానికి పూలు తెచ్చానని పాడితే, లక్షలమంది తన్మయులయ్యారు. సంగీత సరస్వతిని ఆరాధిం చడానికి అక్కడికీ ఇప్పుడు చేరుకున్నారా? అని వారంతా నేటికీ శోక సంతప్తులవుతున్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram