భారతదేశాన్ని కలకాలం తమ పదఘట్టనల కిందే అణచి ఉంచడానికీ, ఈ దేశవాసుల మానసిక స్థయిర్యాన్ని నిరంతరం డోలాయమానంలో ఉంచడానికి జరిగిన తొలి ప్రయత్నం- హిందూ దేశ చరిత్రను వక్రీకరించడం. ఆ పని ఈస్టిండియా కంపెనీ వచ్చిన కొద్దికాలానికే మొదలయింది. ఎప్పుడో అలెగ్జాండర్‌  ‌కాలం నుంచి, తమ వరకు అంటే ఈస్టిండియా కంపెనీ రాక వరకు ఒకటి రెండు ప్రతిఘటనలు తప్ప అంతా సజావుగా, ఎర్ర తివాచీ పరచినంత సులభంగా దండయాత్ర సాగిపోయిందని చెప్పడమే చరిత్ర వక్రీకరణకు తొలి మెట్టు. అది నిజమా? ఆ ప్రశ్న కంటే ఏనాడో చచ్చిపోయిన ఈస్టిండియా కంపెనీ వాదనలు ఇంకా ఉన్నాయా? అన్న ప్రశ్న ముందు వేసుకోవాలి. అవును, అవే వాదనలు పాచిపట్టి సాగుతున్నాయి. ఆర్యుల రాక సిద్ధాంతం అలాంటిదే. ఈ దేశానికి ముస్లింలు వచ్చే వరకు అసలు నాగరికత తెలియదన్న దురహంకారపూరిత వైఖరి కూడా చరిత్ర రచనలో తిష్టవేసింది. అంతేనా, అసలు బ్రిటిష్‌ ‌జాతి రాకుంటే ఈ దేశం మధ్య యుగాలలోనే ఉండిపోయేదన్న వాదన కూడా ఉంది. ఇవన్నీ నిజాలేనా? వాళ్లు వచ్చింది భారతీయ సమాజాన్ని ఉద్ధరించడానికేనా? దాదాపు 30,000 గుడులు ముస్లిం యుగంలో కూలిపోయాయి. ఇదేనా నాగరికతను నేర్పడమంటే. బ్రిటిష్‌ ఇక్కడ నిర్మించిన బడులు, కర్మాగారాలు, రైలు మార్గాలు అన్నీ భారతదేశ సౌభాగ్యం కోసమేనా?  అవన్నీ పచ్చి అబద్ధమని నాడే దాదాభాయ్‌ ‌నౌరోజీ వంటివారు ‘పావర్టీ అండ్‌ అన్‌ ‌బ్రిటిష్‌ ‌రూల్‌ ఇన్‌ ఇం‌డియా’ అన్న ఉద్గ్రంథంలో అరటిపండు ఒలిచి చెప్పినట్టు చెప్పారు. కానీ తొలితరం కాంగ్రెస్‌ ‌నాయకత్వం కూడా దానిని పట్టించుకోవలసినంతగా పట్టించుకోలేదు. మిషనరీల ఉద్దేశం నిరుపేద భారతాన్ని అక్కున చేర్చుకోవడమా? ముమ్మాటికీ కాదు. దేశాన్ని క్రైస్తవ పరం చేయడమే. భారతీయ సమాజాన్ని కూకటివేళ్లతో పెళ్లగించడమే. ఈ వాస్తవాలు చెబితే అనేక ముద్రలు పడతాయి. నిజాలు పాఠ్య పుస్తకాలలో చేర్చబోతే కాషాయీకరణ గోల మొదలవుతుంది. అయినా అ చారిత్రక వాస్తవాలన్నీ ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.

చరిత్ర అంటే అంధకారంలో ఉంచేది కాదు. చరిత్ర అంటే గతాన్ని చూసి గర్వించేది మాత్రమే కాదు. చరిత్రలో ఎక్కడ నుంచి బయలుదేరామో తెలిస్తేనే, మనం ఎటు ప్రయాణించాలో తెలుస్తుంది. భారత్‌ ‌వంటి దేశానికి చరిత్ర ఎప్పుడూ భారం కాదు, వరం. గతం చేసిన గాయాలకు కావలసిన ఔషధాన్ని అది మాత్రమే అందించగలదు.

సాఫ్రాన్‌ ‌స్వోర్డస్

‌సెంచరీస్‌ ఆఫ్‌ ఇం‌డిక్‌ ‌రెసిస్టెన్స్ ‌టు ఇన్వేడర్స్ ఈ ‌రచన ఒక గొప్ప ప్రయత్నం. దేశం కోసం, ధర్మం కోసం, స్వరాజ్యం కోసం పాటుపడిన ఎవరైనా కావచ్చు- మహిళలు, వనవాసులు, కింది వర్గాల వారు, కర్షకులు, వృత్తిపనుల వారు- అందరికీ చరిత్రపుటలలో చోటు కల్పించాలన్న సమున్నత ఆశయంతో మనోషి సిన్హా రావల్‌ ఎం‌తో శ్రమకోర్చి ఈ చక్కని గ్రంథం వెలువరించారు. మన అల్లూరి శ్రీరామరాజు సహా 52 మంది మరుగున పడిన త్యాగమూర్తుల జీవితాలను ఈ ఆంగ్లగ్రంథంలో పరిచయం చేశారు. రాణా సంగ్రామ్‌, ‌రాణా ప్రతాప్‌ ‌చరిత్రలు ఏం చెబుతాయి? ప్రతిఘటన గురించి కాదా! ఇలాంటి వారందరి చరిత్ర వెల్లడైతే మొగలుల గురించి నెహ్రూ (భారత దర్శనం), వామపక్ష చరిత్రకారులు, ఉదారవాదులు ఇచ్చిన అభూతకల్పన ఒక్కసారిగా తునాతునకలవుతుందన్న భయమే ఈ ధోరణిలో కనిపిస్తుంది. 40,000 మంది మహిళలను సంఘటితం చేసి, తైమూర్‌ను ఎదిరించి ఓడించిన మహిళ రామ్‌ప్యారీ గుర్జర్‌. ‌మీరట్‌, ‌హరిద్వార్‌లలో ఆమె తైమూర్‌ ‌సైన్యంతో తలపడింది. కానీ ఆమెకు చరిత్రపుటలలో స్థానం ఇవ్వలేదు. ఆ లోటు మనోషి సిన్హా కొంతవరకు తీర్చారు. అసలు ఏ విదేశీ దురాక్రమణదారుడికీ స్థానికుల నుంచి పెద్ద ప్రతిఘటన ఏదీ ఎదురుకాలేదన్న ఉదారవాద, వామపక్ష చరిత్ర రచయితల చెప్పే అతిపెద్ద అబద్ధానికి ఇదొక ఉదాహరణ. భక్తియార్‌ ‌ఖిల్జీని అస్సాంలో ఎదిరించిన, నిలువరించిన పృథు చరిత్ర కూడా మనకు తెలియదు. విదేశాలలో ఉండి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌తరఫున గూఢచారిగా పనిచేసిన సరస్వతి రాజమణి గాథ చరిత్ర పుటలకు ఎందుకు ఎక్కలేదు. ఆనాడు కాంగ్రెస్‌కీ, వామపక్షవాదులకీ సుభాశ్‌ ‌చంద్ర బోస్‌ అం‌టే ఉన్న వ్యతిరేకత ఇందుకు కారణం కాదా? శివాజీ సహచరుడు బాజీప్రభు దేశ్‌పాండే, కన్నడ దేశంలో మొగలాయి సైన్యాన్ని ఓడించిన రాణి కర్ణావతి, ఇంకా చెన్నమ్మ, వీరపాండ్య కట్టబ్రహ్మన, కన్హోజీ ఆంగ్రే, హేమచంద్ర విక్రమాదిత్య, కుయిలీ, తారాబాయి భోంస్లే, బాజీ రౌత్‌, ‌తిరోత్‌ ‌సింగ్‌, ‌కనకలత బారువా, పోనాబ్రాజా బాషి, శివదేవి తోమార్‌ ‌వంటి త్యాగమూర్తుల చరిత్రలను రచయిత వాస్తవికంగా అందించారు. అదృష్టవశాత్తు చరిత్రలో కొద్ది స్థానమే అయినా దక్కించుకున్న ఝాన్సీలక్ష్మి,  సావార్కర్‌, ‌భగత్‌సింగ్‌, ‌రాజ్‌గురు, సుఖదేవ్‌, ‌చంద్రశేఖర్‌ ఆజాద్‌, ‌ఖుదిరాంబోస్‌  ‌వంటి కొందరి జీవితాశయాలను కూడా ఇందులో పరిచయం చేశారు. అలాగే బిష్ణోయిలు, గుర్జర్ల పోరాటం కూడా చదవవచ్చు. ఈ పుస్తకం చదువుతుంటే ఒక వాస్తవం గమనంలోకి వస్తుంది. వీరంతా భారతదేశం నలు మూలలకూ చెందినవారు. అంటే స్వాతంత్య్రం పోరాటం చాలామంది చెప్పినట్టు ఉత్తర భారత దేశానికో, చదువుకున్న మధ్య తరగతి వర్గాలకో, ఉన్నత కులాలకో, ఒక వర్గానికో, పురుషులకో పరిమితం కాలేదు. కానీ మన చరిత్ర పుస్తకాలు ఇలాంటి అవగాహనను ఎందుకు కల్పించడం లేదు? పైగా చాలామంది చరిత్ర పురుషులకు వ్యక్తిగత ప్రయోజనాలు ఆపాదించి వారిని కించపరిచే ప్రయత్నం కూడా సుస్పష్టం.

నిజాం పోరులో హిందూ సంస్థల పాత్ర

దేశమంతటా నిరుడే ఆజాదీ కా అమృతోత్సవ్‌ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కానీ పాత హైదరా బాద్‌ ‌సంస్థానంలో ఒక్క సంవత్సరం ఆలస్యంగా ఇప్పుడు ఆ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దురదృష్టవ శాత్తు ఇక్కడ అధికారంలోకి వచ్చిన రాజకీయ పక్షం, ఆనాటి పోరులో పాల్గొన్న కమ్యూనిస్టులు ఈ ఉత్సవాలను మనస్ఫూర్తిగా చేయడం లేదు. కారణం, నిజాం భూతం వీరిని వీడలేదు. నిజాంను గద్దె దించవలసిన ఆ చారిత్రక సందర్భాన్ని సంస్థాన వాసులు మతం ప్రాతిపదికగా గుర్తించలేదని అంగీకరించవచ్చు. ఆ పోరాట చరిత్రలో అదంతా కమ్యూనిస్టులు చేసిన పోరాటంగా నమోదయి పోయింది. ఈ చారిత్రక దగాను వివరించే ప్రయత్నం చేసిన పుస్తకం ‘హైదరాబాద్‌ ‌నిరాయుధ ప్రతిఘటన: ఆర్‌ఎస్‌ఎస్‌, ఆర్యసమాజ్‌, ‌హిందూ మహాసభ పాత్ర’ డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గోడ్బొలే రాసిన ఈ మరాఠీ పుస్తకాన్ని హైందవి, పరిమళ నడింపల్లి అనువదించారు. అటు కన్నడ ప్రాంతాలు, ఇటు మరాఠీ ప్రాంతాలు కూడా కలసి ఉన్న ఈ సంస్థానంలో తిరుగుబాటును రగిలించినది ఆర్యసమాజమే. భారత జాతీయ కాంగ్రెస్‌ ‌కూడా కలిసింది. సావార్కర్‌, ‌లక్ష్మణ్‌ ‌బల్వంత్‌ ‌భోపట్‌కర్‌, ‌గోవింద రఘునాథ్‌ ‌కాళే, శివరాం విష్ణు మోదక్‌, ‌సేనాపతి బాపట్‌, ‌యశ్వంత్‌రావు దిగంబర్‌ ‌జోషి, గజానన్‌ ‌విశ్వనాథ కేత్కర్‌, ‌డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌, ‌పండిత్‌ ‌నారాయణ్‌ ‌స్వామి, చాంద్‌ ‌కరణ్‌ ‌శారద, బాబా మదన్‌సింగ్‌ ‌గాగా, డాక్టర్‌ ‌హెడ్గేవార్‌, ‌భయ్యాజీ దాణి, వామన్‌రావ్‌ ‌హెడ్గేవారు,బాబూరావ్‌ ‌మోరే, వేలాదిమంది స్వయంసేవకులు ఇందులో పాలు పంచుకున్నారు. ఆ వివరాలను ఈ చిన్న పుస్తకం క్లుప్తంగా అందిస్తుంది. ఏడు అధ్యాయాలలో విషయాన్ని వివరించారు. కాగా నిజాం మీద గాంధీజీ ఏర్పరచుకున్న దృక్పథంతో విభేదించడానికి ఏమాత్రం వెనుకాడకుండా మూల రచయిత చరిత్ర రచన పట్ల తన నిబద్ధతను నిరూపించుకున్నారు. నిజాం ప్రభువు నిజంగానే అంతటి ఉదారుడైతే ఇంత ఉద్యమం, దేశ సమగ్రత ప్రశ్నార్థకం కావడం వంటి అంశాలు  ఎందుకు చర్చకు వచ్చాయన్నదే అసలు ప్రశ్న.

నిజాం దోపిడీకి నిలువెత్తు నిదర్శనం

ప్రఖ్యాత వైద్యులు డాక్టర్‌ ‌దేమె రాజారెడ్డి, రచన  ‘మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అం‌డ్‌ ‌హిస్‌ ‌వెల్త్’‌లో నిజాం ఆస్తుల గురించి అద్భుతమైన వివరణ ఉంది. భూములు, ఆభరణాలు, వజ్రవైఢూర్యాలను అక్షరాల మేటలు వేయించారు నిజాం ప్రభువులు. ప్రభువుల భోగాలకు పోయినంత పోగా మిగిలిన సంపద ఇది. భృత్యులు, బంధువులు కొల్లగొట్టినంత కొల్లగొట్టగా నేటికి కనిపిస్తున్న కనకరాశులు ఇవి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సేకరించిన సమాచారమిది.

ఆ ఏలుబడి అంతా దోపిడీయే

1757 నుంచి 1947 వరకు భారతదేశాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్రిటిష్‌ ‌జాతి పాలించింది. దేశం నుంచి ఇంగ్లండ్‌కూ ఓడల కొద్దీ సంపద తరలిపోయిన కాలమిది. మనదైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అణచి ఉంచడమే కాదు, పారిశ్రామిక విప్లవానికి దేశం దూరంగా ఉండిపోయిన దుస్థితికి కూడా ఆ కాలమే కారణం. కానీ దీనినే చాలామంది ఉదారవాదులు దేశం ఆధునికతను సంతరించు కున్నదిగా భాష్యం చెబుతూ ఉంటారు. అదెంత బూటకమో సవివరంగా ఆధారాలతో చెప్పిన ఉద్గ్రంథం ‘ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడి’ (బి.సారంగపాణి) ఇంగ్లండ్‌ ‌సైనిక వ్యయం మొత్తం భారతదేశం నుంచే గుంజేవారు. దీనికే నౌరోజీ డ్రెయిన్‌ ‌థియరీ అని పేరు పెట్టారు. ఆంగ్లేయుల ఆధ్వర్యంలో వచ్చిన రైల్వే, నౌకా రేవులు ఇవన్నీ భారతదేశాభివృద్ధికి దోహదం చేసినవి కానేకావు. ఇక్కడి ముడిసరుకును అక్కడకు తీసుకుపోయి, తయారైన వస్తువులను ఇక్కడికి తెచ్చి విక్రయించ డానికే. ఈ అంశాలను ఎంతో సమర్థ వంతంగా పొందుపరిచిన పరిశోధన గ్రంథమిది. బ్రిటిష్‌పాలన మీద ఇప్పటికీ కొందరికి ఉన్న భ్రమలను ఈ పుస్తకం నిశ్చయంగా నిర్మూలించ గలుగుతుంది.

ఖిలాఫత్‌ ఉద్యమంతో జరిగిందేమిటి?

ఈ ప్రశ్నను రేకెత్తిస్తూ సాగిన రచన ‘ఖిలాఫత్‌: ‌ముస్లిం వేర్పాటువాదం- దేశ విభజన’.ఇది కూడా డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గోడ్బోలే రాసినదే. ఖిలాఫత్‌ ఉద్యమం వందేళ్ల సందర్భాన్ని చాలా ఆర్భాటంగా నిర్వహించా లని కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు ఉబలాటపడిన వేళ చాలా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అంశాల సంకలనమే ఈ పుస్తకం. ఖిలాఫత్‌ ఉద్యమంతో ఎంతటి అవాంఛనీయ ధోరణులు ప్రవేశించాయో చెప్పాలంటే మలబార్‌లో జరిగిన హింసను చూపవచ్చు. కానీ ఖిలాఫత్‌ ఉద్యమం సమయంలోనే జరిగిన ఈ హిందూ నరమేధాన్ని ఉదారవాదులు రైతాంగ పోరాటంగా చరిత్రకెక్కించారు. ఆ దగాను ఈ పుస్తకం వివరిస్తుంది.

సార్థక జీవితం

వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావార్కర్‌ ‌భారత స్వాతంత్య్రోద్యమంలో పరిపూర్ణ జాతీయవాదానికీ, తిరుగులేని విదేశీ వ్యతిరేకతకీ చిరునామా. కానీ ఆయన జీవించి ఉన్న కాలంలోనే కాదు, కీర్తిశేషులైన తరువాత కూడా కాంగ్రెస్‌ ‌వెంటాడే, వేటాడే ప్రయత్నం చేస్తూనే ఉంది. సావార్కర్‌ ‌పోరాట యోధుడు. అంటరానితనం మీద, ఇతర మూఢ నమ్మకాల మీద తిరుగుబాటు చేసిన సంస్కర్త. 1857 మహోన్నత చరిత్రను ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామమని పిలిచినవారు. వక్త. మహా రచయిత. ఆయన మీద ఎందుకీ అక్కసు? నెహ్రూ,గాంధీజీల మార్గానికి వ్యతిరేకంగా నడిచిన ఎంతటి దేశభక్తి పరుడు, చరిత్రపురుషుడు అయినా వారిని నిందించడం ఎంతవరకు న్యాయం? ఈ అంశాలను చర్చించిన పుస్తకం డాక్టర్‌ అరవింద్‌ ‌గోడ్బోలే రాసిన ‘సావర్కర్‌ అం‌టే.. సమున్నత వ్యక్తిత్వం సార్థకమైన జీవితం’ (అను: నడింపల్లి పరిమళ). సావార్కర్‌పై కురిపించే విమర్శల వెనుక ఉన్నది దేశభక్తా? చారిత్రకతా? దేశద్రోహమా? అన్న ప్రశ్న దగ్గరకి  పాఠకులను ఈ పుస్తకం తీసుకువస్తుంది.

బలిదాన పరంపర

‘స్వాతంత్య్ర పోరాటపు పూర్తి గౌరవం గాంధీజీకి, కాంగ్రెస్‌కే దక్కుతుందని భావించడం అసంఖ్యాక విప్లవవీరులను అన్యాయం చేయడమే’ అన్న దృక్పథంతో వెలువడిన పుస్తకం ‘బలిదాన పరంపర’. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి శాంతా కుమార్‌ 1962‌లో రాసిన ఈ పుస్తకానికి (అను: కె. శ్యాంప్రకాశ్‌) ‌వీర సావార్కర్‌ ‌ముందుమాట రాశారు. పైన పేర్కొన్న వాక్యాలు ఆయనవే. ఇది భగత్‌సింగ్‌, ‌రాజగురు, సుఖదేవ్‌ల చరిత్రతో పాటు తీవ్ర జాతీయవాద పంథాలో నడిచిన వాసుదేవ్‌ ‌బల్వంత్‌ ‌ఫాడ్కే, కూకారాం సింగ్‌, ‌చాపేకర్‌ ‌సోదరులు, మదన్‌లాల్‌ ‌ధీంగ్రా, గేందాలాల్‌ ‌దీక్షిత్‌ ‌వంటి ఎందరో చరిత్ర పుటలకు చేరని ధన్యజీవుల చరిత్రలను అందిస్తుంది.

(ఈ వ్యాసాలలో ప్రస్తావించిన పుస్తకాలు కావలసినవారు సాహిత్యనికేతన్‌, ‌నవయుగభారతి సంస్థలతో సంప్రదించవచ్చు. 040-27563236, 9290127329)  

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram