– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

నాలుగేళ్ల తర్వాత ఆ రెండు దేశాల మధ్య సయోధ్యకు బీజం పడింది. అధినేతలు ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. గత ఏడాది నవంబరులో జీ 20 సదస్సు వేదికగా ఆవిష్కృతమయిన ఈ దృశ్యం రాజకీయంగా కొత్త సమీకరణాలకు దారి తీస్తుందని ప్రపంచం అంతా భావించింది. అంతలోనే ‘బుడగ’ పేలింది. ఆ రెండు దేశాల మధ్య అగ్గిరాజుకుంది. ఒక దేశం పేరు చెబితే రెండో దేశం భగ్గుమంటోంది. అమెరికా, చైనాల మధ్య దౌత్యసంబంధాలను దెబ్బతీసిన ఆ ‘బెలూన్‌’ ‌కథేంటి? ఒక స్పైథ్రిల్లర్‌ ‌కంటే ఉత్కంఠను కలిగించే సంఘటనలు, ఉద్వేగాన్ని పెంచే సన్నివేశాలు ఇందులో కోకొల్లలుగా ఉన్నాయి. ఇందులో కొన్ని బాహ్య ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయి. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరాటాల వెనక ఇన్ని కుట్రలు, వ్యూహాలు ఉంటాయా అన్న ఆసక్తినీ రేకెత్తిస్తున్నాయి.

చైనా ప్రయోగించిన నిఘా బెలూన్‌ ఒకటి తమ గగనతలంలోకి ప్రవేశించటాన్ని అమెరికా రక్షణ శాఖ అధికారులు గుర్తించారు. జనవరి 28న మొదటి సారి కనిపించిన ఈ బెలూన్‌ ‌తర్వాత కెనడా వైపు మళ్లింది. మళ్లీ 31 నాటికి తిరిగి అమెరికాలోకి అడుగుపెట్టింది. అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో అణుక్షిపణి స్థావరాలున్నాయి. రక్షణశాఖకు ఇది అత్యంత కీలక రాష్ట్రం కూడా. దాంతో మొదట వేచిచూసే ధోరణిని అవలంబించిన ప్రభుత్వం.. బెలూన్‌ ‌కదలికలు అమెరికా రక్షణ కేంద్రాలు, క్షిపణి స్థావరాల మీదుగా సాగుతూండటంతో కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించుకుంది. ‘దాన్ని కూల్చి అవతలపారేయండి’ అని ఆదేశించారు అమెరికా అధ్యక్షుడు బైడన్‌. ‌మూడు అమెరికా యుద్ధవిమానాలు బెలూన్‌ను చుట్టుముడితే, ఒక మిలటరీ జెట్‌ ‌నుంచి ప్రయోగించిన క్షిపణి దానిని తుత్తునియలు చేసింది. అట్లాంటిక్‌ ‌సముద్రంలో దాన్ని కూల్చేసింది. పేలిన భూభాగాలు, అందులోని పరికరాలను సముద్రంలో 11 కి.మీ మేర పడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకోవటానికి భారీ క్రేన్‌ ‌సహా అమెరికా నౌకా దళానికి చెందిన రెండు ఓడలు అక్కడకు వెళ్లాయి. బెలూన్‌ ‌సముద్రంలో పడిపోతున్న దృశ్యాలు అమెరికా టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. చిన్నపాటి పేలుడు తర్వాత బెలూన్‌ ‌సముద్రంలో పడిపోవటాన్ని అందరూ చూశారు.

బెలూన్‌ ‌బయట ఉన్నప్పుడు కూలిస్తే, దాని భాగాలు ప్రజల మీద పడే ప్రమాదం ఉందన్న కారణంగా సముద్ర ఉపరితలం మీదకు వచ్చే వరకూ నిరీక్షించి ఆ తర్వాత పేల్చివేశామని పెంటగాన్‌ అధికారులు ప్రకటించారు. కూల్చివేత సమయంలో దక్షిణ కరోలినా తీరానికి సమీపంలో మూడు విమానాశ్రయాల నుంచి రాకపోకలను మూడు గంటల పాటు నిలిపివేశారు. సముద్రంలో ఎవరూ లేకుండా, కోస్ట్‌గార్డ్‌లను కూడా ఖాళీ చేయించారు. ఆ తర్వాత ఫైటర్‌ ‌జెట్‌లు రంగంలోకి దిగాయి. ఎఫ్‌-22 ‌మిలటరీ జెట్‌ ‌నుంచి ఏఐఎం-9 ఎక్స్ ‌సైడ్‌ ‌వెండర్‌ ‌క్షిపణిని ప్రయోగించి ఈ బెలూన్‌ను కూల్చినట్టు అమెరికా రక్షణశాఖ అధికారులు మీడియాకు చెప్పారు. దక్షిణ కరోలినాలోని మిర్టిల్‌ ‌బీచ్‌ ‌నుంచి 6 నాటికల్‌ ‌మైళ్ల దూరంలో 47 అడుగుల లోతున్న సముద్రంలో ఇది పడిందని ప్రకటించారు.

బెలూన్‌ను విజయవంతంగా కూల్చిన వైమానిక దళాన్ని అధ్యక్షుడు బైడెన్‌ అభినందించారు. అమెరికా చర్యపైన చైనా విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అది గూఢచర్య బెలూన్‌ ‌కాదని, వాతావరణ పరిశోధనకు ఉద్దేశించిందని చెప్పుకొచ్చింది. ‘తమ దేశానికి చెందిన ఎయిర్‌ ‌షిప్‌ ‌గతితప్పి ప్రమాదవశాత్తు అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని, దీనిని గుర్తించినప్పటి నుంచి అనేకమార్లు అమెరికాకు సమాచారం ఇచ్చాం’ అని ప్రకటించింది. ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలపైన ప్రభావం చూపింది. అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. అంతేకాదు, బెలూన్‌ ‌శకలాలను చైనాకు అప్పగించేది లేదని అమెరికా తేల్చి చెప్పేస్తే.. తప్పుడు ఆరోపణలతో బెలూన్‌ను పేల్చివేసి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న అమెరికా ఇంతకింతా అనుభవిస్తుందని చైనా హెచ్చరికలు చేసింది. ‘మా సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తే చూస్తూ ఊరుకుంటామా?’ అని బైడెన్‌ ‌ప్రతిస్పందించారు. చైనా బెలూన్‌ను కూల్చివేసిన అనంతరం, అమెరికా అధికారులు దీనికి సంబంధించిన వివరాలను భారత్‌ ‌సహా అనేక మిత్ర దేశాలతో పంచుకున్నారు. ‘ఇండియా, జపాన్‌ ‌సహా పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచర్యం నడుపుతోంది’ అని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ ‌స్టేట్‌ ‌వెండీషెర్మన్‌ ‌వాషింగ్టన్‌లోని 40 ఎంబసీల అధికారులతో చెప్పారు. రాబోయే రోజుల్లో గానీ దీని ప్రభావం తెలియదు.

గూఢచర్యంలో చైనాది అందె వేసిన చెయ్యి

చైనా నిఘా బెలూన్లను ఎగరవేస్తూ గూఢచర్యం చేపట్టటం కొత్త విషయం కాదు. అది హెయినన్‌ ‌కేంద్రంగా దక్షిణతీరంలో వీటిని ఎగురవేసి భారత్‌, ‌వియత్నాం, తైవాన్‌, ‌ఫిలిప్పీన్స్ ‌దేశాల్లో ఆయుధ సంపత్తి, సైన్యం గుట్టుమట్లను రాబడుతోందంటూ ‘వాషింగ్టన్‌ ‌పోస్టు’ అందించిన కథనం సంచలనం కలిగించింది. డిఫెన్సు, ఇంటెలిజెన్సు అధికారుల సమాచారం అందిస్తున్నట్టు స్పష్టంగా పేర్కొంది. హెయినన్‌లో పీఎల్‌ఏ ‌కంట్రోల్‌ ‌కేంద్రాలు ఉన్నాయి. జె-8 ఇంటర్‌ ‌సెప్టర్‌ ‌విమానాల ప్రధాన బేస్‌ ‌కూడా ఇక్కడ ఉంది. ఇదంతా చైనా వాయుసేన ఆధీనంలో సాగుతోంది. నిఘా కార్యకలాపాల కోసం ఈ బెలూన్లను పీపుల్స్ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనా (పీఆర్సీ) రూపొందించింది. ఇవి ఇతర దేశాల సార్వభౌమాధి కారాన్ని ఉల్లంఘించేలా సాగుతాయి. ట్రంప్‌ ‌హయాంలో ఇలాంటి సంఘటనలు మూడు నాలుగు చోటుచేసుకున్నాగానీ, అవి చైనా గూఢచర్యానికి వాడే ఎయిర్‌ ‌షిప్‌లనే విషయం ఇప్పుడే బయటకొచ్చింది. ఇటీవల కాలంలో హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్‌, ‌గువామ్‌లలో నాలుగు బెలూన్లను గుర్తించినట్టు పేర్కొన్నారు. మరో నిఘా బెలూన్‌ ‌దక్షిణ అమెరికా దేశాల మీదుగా ప్రయాణిస్తున్నా అమెరికాతో సయోధ్య ఉన్న దేశాలు దానిని అంతగా పట్టించు కోవటం లేదు. వాతావరణ ప్రభావం వల్ల దాని దిశ మారిపోయిందని చైనా ప్రకటించింది.

అత్యాధునిక నిఘా ఉపగ్రహాలు పంపే దృశ్యాల కంటే ఈ స్పై బెలూన్లు అందించే సమాచారం మరింత మెరుగ్గా ఉంటుందని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు. అమెరికా కూడా ఇలాంటి బెలూన్లను ప్రయోగిస్తోంది. నాసా వాటిని తయారు చేస్తోంది కూడా. ఒక బెలూన్ని పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారా, లేక గూఢచర్యం కోసమా అనేది తేల్చిచెప్పటం కష్టమైన పని. ఆయా దేశాలు తమ సాంకేతిక నైపుణ్యాలను అనుసరించి శత్రుదేశాల గుట్టుమట్లను లాగేస్తుంటారు. అమెరికా కూల్చిన మానవ రహిత చైనా బెలూన్‌ 200 అడుగుల పొడవు, వేలాది పౌండ్ల బరువు ఉంది. మోటారు, ప్రొపెల్లర్‌ ‌లతో పాటు కొన్ని అసాధారణమైన ఫీచర్లు ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. స్పై బెలూన్లు (సాంకేతికంగా చెప్పాలంటే ఎయిర్‌ ‌షిప్పులు) వినియోగించటంలో కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి. స్ప్రై శాటిలైట్లు చేయలేని కొన్ని పనులను అవి చేయగలుగుతాయి. అవి శాటిలైట్లతో పోలిస్తే చాలా చవక. అవి అత్యంత ఎత్తుకు ఎగరగలుగుతాయి. ఎయిర్‌-‌టు-ఎయిర్‌, ‌సర్ఫేస్‌-‌టు-ఎయిర్‌ ‌మిస్సెల్‌ ‌రేంజిని దాటి ప్రయాణించగలుగుతాయి. శత్రుదేశాల నౌకా విన్యాసాలను ఎక్కువ సమయం గమనించగల సామర్థ్యం, వెసులుబాటు వాటికి అధికంగా ఉంటాయి. వాటిని త్వరగా గుర్తించటం కష్టం. రాడార్‌ అబ్జార్బింగ్‌ ‌మెటీరియల్‌ (ఆర్‌ఏఎమ్‌)‌తో అవి తయారవుతాయి. 1998లో బెలూన్‌ ఒకటి కెనడా మీదుగా అట్లాంటిక్‌ ‌దాటి ఆర్కిటిక్‌ ‌సముద్రంలో కుప్పకూలింది.

గగనతలంలోనే కాదు, సముద్రం అట్టడుగునా చైనా గూఢచర్యం చేస్తోంది. 2019, 2020లలో ఇండోనేసియాలో మత్స్యకారులు తమ ప్రాదేశిక సముద్రజలాల్లో అట్టడుగున పనిచేస్తున్న రెండు చైనా అండర్‌ ‌వాటర్‌ ‌వెహికల్స్ (‌యూయూవీ) స్వాధీనం చేసుకున్నారు. సముద్రలోతుల్లో రెండు నెలలపాటు ప్రయాణించి అవి సమాచారాన్ని సేకరిస్తాయి. అలాంటి సర్వే షిప్‌ ఒకటి 2019 ప్రాంతంలో భారత దేశానికి చెందిన అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులలోని ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ ‌జోన్‌ (ఈఈజడ్‌)‌లోకి ప్రవేశించింది. దాన్ని వెనక్కితీసుకోవాలని మన దేశం కోరింది. ప్రాథమికంగా అలాంటి వాహకాలు ప్రమాద రహితమైన శాస్త్రీయ పరి శోధనలకు ఉపయోగ పడ తాయి. కానీ సముద్ర తీరానికి సంబం ధించిన వివరాలు, దాని లవణీయత ఉష్ణోగ్రతలు తదితర సమాచారం చైనా సబ్‌ ‌మెరైన్‌ ఆపరేషన్లకు, యుద్ధ నైపుణ్యాన్ని పెంచుకోవటానికి ఉపకరి స్తాయి. చైనా సముద్రానికే పరిమితం కాలేదు. 2019లో రియాయూ ద్వీపకల్పంలో ప్రొపెల్లర్‌ ఉన్న వాహనాన్ని కనుగొన్నారు. దాని పైన గల అక్షరాలను బట్టి దానిని చైనాది అని గుర్తించగలిగారు. రెండు రకాలుగా ఉపయోగపడే యూయూవీలను ఒక్క చైనానే కాదు. 2016లో పిలిప్పైన్స్ ‌సమీపంలో అమెరికా యూయూ వీని చైనా పీఎల్‌ఏ ‌నేవీ సిబ్బంది కనుగొన్నారు. వాషింగ్టన్‌ ‌నిరసన వ్యక్తం చేయటంతో దానిని తిప్పి పంపించారు.

భారత్‌కు ప్రయోజనం

మారుతున్న సవాళ్ల నేపథ్యంలో, భారత్‌ ‌కూడా తన నిఘా సామర్థ్యాలను పెంచుకోవలసి ఉంది. ప్రత్యేక జామర్లను రూపొందించుకోవటంతో పాటు, క్షిపణులు వంటి వాటితో కాకుండా చవకబారు డ్రోన్లను కూల్చివేయగల తక్కువ ఖర్చు గల సాధనాలను రూపొందించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ సరిహద్దుల్లో నిఘా కార్యక్రమాలను మెరుగుపరుచుకోటానికి ఈ ఎయిర్‌ ‌షిప్పులు ఉపయోగపడతాయి. సముద్ర తీరాల్లోనూ, సరిహద్దు ల్లోనూ, స్మగ్లర్లను గుర్తించటంలోనూ, అవసరమైన సమయాల్లో ఫిషింగ్‌ ‌బోట్లను కనుగొనటంలోనూ ఉపయోగపడతాయి. యుద్ధ సమయాల్లో గానీ, మరొకప్పుడు గానీ సముద్రయానంలో నిఘాకు అవసరమైన వెస్సల్స్ ‌గుర్తించవచ్చు. మన దేశం ‘సంధ్యక్‌’ ‌పేరుతో ఆరు సర్వే షిప్‌లను నిర్వహిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో నాలుగు దానికి జత కూడుతున్నాయి. ఏది ఏమైనా అమెరికా.. చైనా బెలూన్‌ను కూల్చివేసిన సంఘటన అంతర్జాతీయంగా కొత్త చర్చకు దారితీసింది.

About Author

By editor

Twitter
YOUTUBE