– సుజాత గోపగోని, 6302164068

‘దేశంలోనే తెలంగాణ అత్యంత ధనిక రాష్ట్రం’ ఇది ఎవరో అన్న మాట కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్వయంగా అనేకసార్లు బాహాటంగా ప్రకటించిన వాస్తవం. తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లు గడిచాయి. మరికొన్ని నెలలైతే తొమ్మిదేళ్లు కూడా పూర్తవుతాయి. అయితే, ఈ తొమ్మిదేళ్లలో ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల కుప్పలా మారిందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అప్పులు కేసీఆర్‌ ‌పాలనకు అద్దం పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో సింహభాగం ఆదాయం వివిధ పన్నుల రూపంలో రాజధాని హైదరాబాద్‌ ‌నుంచే వచ్చేది. ఈ ఆదాయాన్నే అన్ని జిల్లాలకు, అంటే 23 జిల్లాలకు వ్యయం చేసేవాళ్లు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాలు ఆంధప్రదేశ్‌కు వెళ్లిపోయాయి. తెలంగాణలో 10 జిల్లాలే మిగిలాయి. ఇప్పుడు హైదరాబాద్‌ ‌నుంచి వచ్చే ఆదాయం ఒక్క తెలంగాణకే సొంతం. అంతేకాదు, హైదరాబాద్‌ ‌కాస్మో పాలిటన్‌ ‌సిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తెలంగాణ అత్యంత ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించే పరిస్థితులు ఉన్నాయి. స్వయంగా కేసీఆర్‌ ‌కూడా ఈ విషయాన్ని అనేకసార్లు చెప్పుకున్నారు. కానీ, తొమ్మిదేళ్లు గడిచేసరికి రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రకటించింది.

 తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో ఉన్న అప్పు ఎంత? ప్రస్తుతం ఉన్న అప్పు ఎంత? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్నది ఎంత? ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు తీసుకున్న రుణాల మాటేంటి? ఈ వివరాలన్నింటినీ లెక్కలతో సహా ప్రకటించింది కేంద్రం. అభివృద్ధి.. అప్పులపై తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఒక చిన్న యుద్ధమే నడుస్తోంది. మొన్నటి బడ్జెట్‌ ‌సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా కూడా సీఎం కేసీఆర్‌ ‌ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాల్లో వెనకబడిందని విమర్శించారు. అయితే, ఇప్పుడు కేంద్రం తెలంగాణ అప్పులపై లోక్‌సభలో కీలక ప్రకటనచేసింది. కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ ‌చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ఉన్న అప్పు.. 75 వేల 577 కోట్ల రూపాయలు. ఆ తర్వాత నుంచి ఏటా అది ఎలా పెరిగింది? ఏ సంవత్సరంలో ఎంత అప్పు తీసుకున్నారు అన్న వివరాలను కేంద్రం వెల్లడించింది. 2020-21 నాటికి తెలంగాణ అప్పు 2 లక్షల 83 వేల 452 కోట్ల రూపాయలకు చేరినట్లు కేంద్రం పేర్కొంది. అయితే ఇది ప్రభుత్వం చేసిన అప్పు మాత్రమే. ఇక ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు మరో లక్షా 50 వేల కోట్లు అప్పు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మొత్తం కలిపితే తెలంగాణ రుణం 4 లక్షల 33 వేల 817 కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో 12 వాణిజ్య బ్యాంకుల నుంచి తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు చేసిన అప్పు  లక్షా 30 వేల 934.94 కోట్ల రూపాయలు, నాబార్డు నుంచి ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు తీసుకున్న రుణాలు 19 వేల 431 కోట్ల రూపాయల మేర ఉన్నట్లు వివరించారు.

ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నికరంగా 2 లక్షల 7 వేల 875 కోట్ల రూపాయల అప్పు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంకులు 2014 జూన్‌ ‌నుంచి, 2022 అక్టోబర్‌ ‌వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అప్పులూ ఇవ్వలేదని, కానీ ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు మాత్రం ఇచ్చాయని స్పష్టంచేశారు. ఇదే సమయంలో నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌ ‌కింద తెలంగాణ ప్రభుత్వానికి 2014 జూన్‌ ‌నుంచి 2022 అక్టోబర్‌ ‌వరకు మొత్తం 7 వేల 144 కోట్ల రూపాయలు, వేర్‌హౌస్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ ‌ఫండ్‌ ‌కింద 852.27 కోట్ల రూపాయల రుణం ఇచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి సాయం కింద ప్రభుత్వరంగ కార్పొరేషన్లకు 11 వేల 424.66 కోట్ల రూపాయలు, తెలంగాణ ఐఐసీకి 10.07 కోట్ల రూపాయల రుణం ఇచ్చినట్లు వెల్లడించారు.

గత కొన్ని నెలలుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌సందర్భం దొరికినప్పుడల్లా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దూషణల స్థాయిని సైతం పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ అప్పులపై కేంద్రం చేసిన కీలక ప్రకటన కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ తీసుకున్న అప్పుల వివరాలు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించడంతో బీఆర్‌ఎస్‌ ‌తట్టుకోలేకపోతోంది. ఆ పార్టీ నాయకులు బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.

పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వ అప్పుల వివరాలు యేడాది వారీగా…

2014-15లో రూ. 8,121 కోట్లు

2015-16లో రూ. 15,515 కోట్లు

2016-17లో రూ. 30,319 కోట్లు

2017-18లో రూ. 22,658 కోట్లు

2018-19లో రూ. 23,091 కోట్లు

2019-20లో రూ. 30,577 కోట్లు

2020-21లో రూ. 38,161 కోట్లు

2021-22లో రూ. 39,433 కోట్లు

– వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram