– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

ఆం‌ధప్రదేశ్‌లో మద్యం కేంద్రంగా రాజకీయం సాగుతోంది. మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వైసీపీ , తమ ప్రభుత్వం ఏర్పడ్డాక అందుకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. దుకాణాలను తగ్గించినట్లు నటించి అమ్మకాలు పెంచింది. విజయనగరంలో పర్యటిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తాము అధికారంలోకి వస్తే మద్యం షాపుల్లో 20 శాతం గీత కార్మికులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంటే మద్యాన్ని నిషేధిస్తామని ఆయన హామీ ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబుకు అవకాశం ఇవ్వరాదని భావిస్తోన్న తమ ప్రభుత్వం మద్యం నిషేధిస్తుందని డిప్యూటీ స్పీకర్‌ ‌కోలగట్ల వీరభద్రస్వామి మీడియాకు చెప్పారు. పేరుకు ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందు నిషేధించి, గెలిస్తే ప్రజలే డిమాండ్‌ ‌చేస్తున్నారని చెప్పి తిరిగి దుకాణాలను ప్రారంభిస్తారని భావించవచ్చు. వైసీపీ హామీ మేరకు మద్యం దుకాణాలను నిషేధించాలని విపక్షాలు పట్టుబడినా ఏడాదికి రూ.24 వేల కోట్ల ఆదాయాన్నిచ్చే మద్యం అమ్మకాలను ఏ ప్రభుత్వమూ వదులుకోదు. సంక్షేమ పథకాలకు ఇచ్చే నిధులన్నీ మద్యం ఆదాయంతో ముడిపడి ఉండడమే అందుకు కారణం.

తమ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తూ, పేద మహిళల కన్నీళ్లు తుడుస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఏటా దుకాణాలను 20 శాతం తగ్గిస్తామన్నారు. ఆయన మాట నమ్మిన మహిళలు ఓట్లేసి గెలిపించారు. దశలవారీగా మద్య నిషేధం విధిస్తామని అధికారానికి వచ్చిన తరువాత పునరుద్ఘాటించింది. ప్రైవేటు దుకాణాలకు ఇచ్చిన లైసెన్సులు రెన్యూవల్‌ ‌చేయలేదు. ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని ప్రకటించి దుకాణాలు తెరిచారు. ఇతర రాష్ట్రాల్లో తయారయ్యే పాపుర్‌ ‌బ్రాండ్లను అమ్మకుండా స్థానికంగా తయారు చేసిన బ్రాండ్‌లను రెండు రెట్లు అధిక ధరకు అమ్ముతోంది. గత ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం షాపులు ఉండగా, ఏటా రూ.18 వేల కోట్ల ఆదాయం వచ్చేది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 20 శాతం దుకాణాలు తగ్గించవలసి ఉండగా, అది పది శాతానికే పరిమితమైంది. ఇప్పుడు వీటి సంఖ్య 2,934. అయినా అమ్మకాలు మాత్రం తగ్గలేదు సరికదా పరిమాణం, వాటి ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. అమ్మకాలు తగ్గిన ప్రాంతాల్లోని దుకాణాలను రద్దీ ప్రాంతాలకు మార్చారు. పాపులర్‌ ‌బ్రాండ్లు దొరకడం లేదని, పక్క రాష్ట్రం నుంచి మద్యం అక్రమంగా దిగుబడి అవుతుందనే విమర్శలతో మాల్స్‌లో కూడా ప్రత్యేక దుకాణాలకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇప్పుడు తాజాగా పర్యాటక ప్రాంతాల్లో కూడా ‘టూరిజం ఫెసిలిటేషన్‌ ‌సెంటర్‌ (‌టీఎఫ్సీ)ల పేరుతో వంద వరకు మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు.

సంక్షేమానికి ఆధారం

వైసీపీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలైన నవరత్నాల పథకాలకు మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మారింది. ప్రభుత్వం ఏటా సుమారు 50 వేల కోట్ల విలువైన మొత్తాన్ని సంక్షేమ పథకాలకు నగదుగా పంపిణీ చేయాలి. అయితే గెలిచినప్పటి నుంచి ప్రభుత్వం కొన్నిటిని పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా అమలుచేస్తూ నెట్టుకువస్తోంది. సుమారు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు వీటికై ఖర్చుచేస్తోంది. వీటిలో 60 నుంచి 70 శాతం నిధులు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నుంచి సమకూర్చుకుంటున్నారు. అంటే సంక్షేమ పథకాలకు మద్యం అమ్మకాలే ప్రధాన ఆధారం అయింది. అందువల్ల ప్రభుత్వం కూడా మద్య నిషేధాన్ని విధించే ఆలోచన చేయడం లేదు. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికి మూడేళ్లు దాటింది. అంటే ఏడాదికి 20 శాతం చొప్పన ఇప్పటికి 2,600లకు పైగా దుకాణాలు తగ్గించాలి. కేవలం 1700 దుకాణాలు మాత్రమే ఉండాలి. అమ్మకాలు కూడా తగ్గి రూ.5 వేల కోట్లకు దిగిరావాలి. కాని వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. దుకాణాల సంఖ్య 3 వేల వరకు ఉంది. అమ్మకాలు రూ.25 వేల కోట్లు పెరిగాయి. మద్య నిషేధంపై విపక్షాలు ఎంతగా డిమాండ్‌ ‌చేస్తున్నా దీనిపైనే దీనినే ప్రధాన ఆదాయ వనరుగా ఆధారపడిన ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడం లేదు. పైగా మద్యంపై ఆదాయాన్ని అపరిమితంగా పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మద్యం ఆదాయాన్ని మరో పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి.. అప్పులు తెచ్చుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు దీనిపై ఎంతగా ఆధారపడిందంటే మద్య నిషేధం కాదు కదా కనీసం దుకాణాల్ని కూడా నియంత్రించ లేదు. ఎందుకంటే ఈ మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేదు…కేవలం నగదు పంపిణీకి మీటలు నొక్కడం తప్ప.

మద్యంతో లక్ష కుటుంబాలు ఛిద్రం

రాష్ట్ర ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్న మద్యం లక్షల కుటుంబాలను ఛిద్రం చేసింది. ప్రైవేటు దుకాణాల లైసెన్సులు రద్దుచేసి తామే మద్యం అమ్ముతామని ప్రభుత్వం ప్రకటించ డంతో, దీనివల్ల ధరలు తగ్గుతాయని మద్యం ప్రియులు సంబరపడ్డారు. తీరా దుకాణాలకు వెళ్లాక కంగుతిన్నారు. అప్పటి వరకు లభించిన పేరెన్నికగన్న బ్రాండ్లేవీ అక్కడ లేవు. ఎప్పుడూ వినని, తెలియని పేర్లతో మద్యం సీసాలు కనిపించాయి. పైగా ధరలు రెండు రెట్లు పెంచి అమ్ముతున్నారు. గతంలో రూ.50 లకు లభించే క్వార్టర్‌ ‌చీప్‌ ‌బాటిల్‌ ‌ధర రూ.160లుగా ఉంది.

 వైసీపీకి చెందిన నాయకులే మద్యం తయారీని చేపట్టి ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారని విపక్షాలు ఆరోపించడం కూడా తెలిసిందే. నాసిరకం మద్యాన్ని రెండు మూడు రెట్ల ధరలక• అమ్మడంతో మద్యం మాఫియా చెలరేగిపోయింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా మద్యాన్ని అక్రమంగా తెచ్చి విక్రయించడంతో ప్రభుత్వం మద్యం ధరలు కాస్త తగ్గించింది. అయినా గతంతో పోలిస్తే వాటి ధరలు రెట్టింపుగానే ఉన్నాయి. పెరిగిన మద్యం ధరలతో నాటుసారా సరఫరా కూడా యధేచ్ఛగా సాగుతోంది. నాటుసారా తాగి జంగారెడ్డిగూడెంలో 17 మంది మరణించడం తాజా సంఘటన. భవన నిర్మాణ కార్మికులైతే మద్యం అలవాటును మానుకోలేక సంపాదన మొత్తాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలకే అర్పించి జేబులు, ఆరోగ్యం గుల్లచేసుకుంటున్నారు. మొత్తంగా మద్యం వల్ల ఏపీలో పేదల బతుకులు చితికిపోయాయి.

మద్యం కేంద్రంగా రాజకీయం

మరో పదహారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానుండగా, గెలుపు దిశలో అన్ని పార్టీలు ప్రజలకు పలురకాల హామీలు ఇస్తున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే 20 శాతం మద్యం దుకాణాలను గీత కార్మికులకు కేటాయిస్తామని ఉత్తరాంధ్రలో పర్యటిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. వేరే ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు అమలవుతున్న నవరత్నాల పథకాలను పేర్లు మార్చి కొనసాగిస్తారే తప్ప నిలిపివేసే ప్రయత్నం మాత్రం చేయరు. అందుకే పథకాల అమలును విమర్శిస్తున్నారు తప్పించి తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పడం లేదు. ఆ కోణంలోనే టీడీపీ కూడా ‘నిషేధం’పై మాట్లాడటం లేదు. టీడీపీ ప్రభుత్వం వస్తే దుకాణాలను తెరిచి ప్రెవేట్‌ ‌వారితో అమ్మిస్తుంది తప్ప మద్యం నిషేధం విధానాన్ని పాలసీని అమలు చేయదు. ఆ ఆలోచనలో పడిన వైసీపీ ప్రభుత్వం కూడా రాజకీయం చేస్తోంది. మద్యనిషేధం తప్పక విధిస్తామని, ప్రస్తుతం ఎన్ని షాపులు ఉన్నాయన్నది ముఖ్యం కాదని, షాపులు ఎన్ని ఉన్నా ‘నిషేధం’ విధిస్తే మూసేయాల్సిందేనని కోలగట్ల వీరభద్రస్వామి చెబుతున్నారు. ఈ మాటలను బట్టి ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చే వీలుందని తెలుస్తోంది.

ఎన్నికలు జరిగే రెండు, మూడు నెలల మధ్య మాత్రమే నిషేధం ఉంటుంది. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు మద్యం నిషేధించినట్లు ప్రచారం చేసుకోవచ్చు. తాము గెలిస్తే ప్రజలే నిషేధాన్ని తీసేయమన్నారంటూ వాదించి మద్యం దుకాణాలు తెరవవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. ఒక వేళ చంద్రబాబు గెలిస్తే మద్య నిషేధం తీసేస్తారని, అప్పుడు తాము మద్యనిషేధం విధించగా, ఆయన తీసేశారని ప్రచారం చేసుకోవచ్చన్నది వైసీపీ భావనలా ఉంది. ఏదైనా ప్రజల రక్తం పీల్చి దానిని మరల వారికే సంక్షేమాల పేరుతో ఇచ్చి రాజకీయం చేయడం మాత్రం ప్రాంతీయ పార్టీలకు అలవాటైపోయింది.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram