– సుజాత గోపగోని, 6302164068

కేసీఆర్‌.. ‌బలమైన వేర్పాటువాది. సమైక్యాంధ్ర వ్యతిరేకి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమ నేత. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర నేతలను లెక్కచేయకపోవడమే కాదు, వాళ్లను ఇష్టం వచ్చినట్లు దూషించిన నాయకుడు. కేసీఆర్‌ అం‌టేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్‌.. అని తనకు తాను భావించుకున్న నేత. తమ పార్టీ ఒక్కటే తెలంగాణ కోసం పనిచేసే ప్రాంతీయ పార్టీ అని, మిగతావన్నీ సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే పార్టీలని, ముద్రవేసి ప్రచారం చేశారు. ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా కేవలం తెలంగాణకే పరిమితమైనది ఒక్క గులాబీ పార్టీనే అని.. మిగతావన్నీ సమైక్యాంధ్రను ఏదో ఒక సందర్భంలో సమర్థించే పార్టీలే అని నమ్మిన పరిస్థితి. కానీ, పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. టీఆర్‌ఎస్‌ ‌బీఆర్‌ఎస్‌గా మారిపోయింది. అంటే, ఉద్యమ పార్టీ నుంచి ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీగా మారింది టీఆర్‌ఎస్‌. ఇన్నాళ్లు తమది ఉద్యమపార్టీ అని చెప్పుకున్న గులాబీ నేతలు ఇప్పుడు రాజకీయ కాంక్షతో బీఆర్‌ఎస్‌గా మారిన తమ పార్టీ గురించి ఏం చెబుతారని సోషల్‌ ‌మీడియా వేదికగా పలువురు స్పందిస్తున్నారు.

సుమారు రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర సమితిగా మనుగడలో ఉన్న కేసీఆర్‌ ‌నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. తెలంగాణ ప్రయోజనాలకే పరిమితం కాదని, దేశంలోని ప్రజలందరికీ ప్రత్యేక పార్టీ అవసరమైందని, అందుకే పేరు మార్చి మరీ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నామని కేసీఆర్‌ ‌ప్రకటించారు. అంతేకాదు, దేశ రాజధాని ఢిల్లీలో అట్టహాసంగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించారు. జాతీయస్థాయిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, గతంలో టీఆర్‌ఎస్‌ అధినేతగా ఢిల్లీకి కేసీఆర్‌ ‌వెళ్లినప్పుడు వచ్చినంత స్పందన కూడా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సమయంలో రాలేదు. కర్ణాటక నుంచి కుమారస్వామి మినహా.. పెద్దగా ఎవరూ కేసీఆర్‌ను కలవలేదన్నది ఆ సమయంలో జరిగిన పరిణామాలు చూస్తే అందరికీ అర్థమవుతుంది.

జాతీయ పార్టీ అంటూ కేసీఆర్‌ ‌తెలంగాణను వదిలి హస్తిన రాజకీయాలు మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. తెలంగాణ సెంటిమెంట్‌తో ఇన్నాళ్లు ఇక్కడి రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకొని దూషించిన వ్యవహారం చర్చకు వస్తోంది. అంతేకాదు, కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమ లేదని, కేవలం అధికార దాహమేనన్నది ఇప్పుడు ప్రస్ఫుటమైందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉద్యమకారుల బలిదానం, ఉద్యమాలతోనే ప్రత్యేక రాష్ట్రం వస్తే.. తెలంగాణ తెచ్చింది తానే అని ఇన్నాళ్లు రాజకీయంగా లబ్ధి పొందారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రాంతీయ వాదం, తెలంగాణ వాదం అనేది తన అవసరానికి, రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికే వినియోగించుకున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతానికి తెలంగాణ దాటి ఏ రాష్ట్రంలో అడుగుపెట్టాలన్న అంశంపై కేసీఆర్‌ ‌వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు పరిణామాలను గమనిస్తే బీఆర్‌ఎస్‌కు కర్ణాటక నుంచే బహిరంగ మద్దతు లభించింది. ఇతర పొరుగు రాష్ట్రాల్లోకి ఎలా ప్రవేశించాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు. అయితే, ప్రధానంగా ఆంధప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ ‌ప్రవేశంపై అనేక రకాల వాదనలు ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడి ఏ రాజకీయ పార్టీ కూడా బీఆర్‌ఎస్‌ను ఆహ్వానించలేదు. మిత్రపక్షా లుగా వ్యవహరిస్తామని ఏ పార్టీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు ఏపీలో ఆటుపోట్లు తప్పేలా లేవు. ఉద్యమ సమయంలో, తెలంగాణ ఆవిర్భావానికి ముందు సీమాంధ్ర నేతలను కేసీఆర్‌ ‌తిట్టిన తిట్లు ఇప్పటికీ తమ మదిలో మెదులుతున్నాయంటున్నారు సీమాంధ్ర నేతలు. అక్కడి ప్రజలు కూడా కేసీఆర్‌ ‌చేసిన విమర్శలు, ఆరోపణలు మర్చిపోలేమంటున్నారు. తమకూ పౌరుషం ఉందని, అప్పుడు తెలంగాణ ప్రజలను సెంటిమెంట్‌తో ఎలా రెచ్చగొట్టారో, అందుకోసం సీమాంధ్ర ప్రాంతాన్ని ఎంతలా విమర్శించారో తెలుసని, ఇప్పుడు తాము కూడా అదే సెంటిమెంట్‌ను బీఆర్‌ఎస్‌కు రుచి చూపిస్తామని చెబుతున్నారు.

దేశంలో వనరులను సద్వినియోగం చేసుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న బీజేపీ ఈ విషయంలో విఫలమవుతోందన్న ప్రధాన ఆరోపణను లేవనెత్తుతున్నారు కేసీఆర్‌. అం‌దుకే తాను జాతీయ రాజకీయాల వైపు దృష్టిపెట్టానంటున్నారు. క్రమంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడతానన్న ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఇప్పటికే ఉద్ధండులుగా ఆయా పార్టీలను ఒంటిచేత్తో నడిపిస్తోన్న ప్రముఖ నాయకులు, నాయకురాళ్లు కేసీఆర్‌ ‌నేతృత్వంలో పని చేయడానికి ముఖం చాటేస్తున్నారు. అయితే, దేశవ్యాప్తంగా తెలుగువారు ఏ రాష్ట్రంలో ఎంత శాతం ఉన్నారు? అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలేవి? తెలుగువారి కోసమని పోటీచేస్తే స్పందన ఎలా ఉంటుంది? స్థానిక పార్టీలతో ఏమైనా పొత్తు పెట్టుకోవాలా? ఇత్యాది అంశాలపై కేసీఆర్‌ ఒక అంచనాకు వచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, ‌న్యూఢిల్లీ తదితర రాష్ట్రాల్లో తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా జాతీయ పార్టీకి కావల్సిన హోదాను సంపాదించవచ్చని భావిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అసలు తెలంగాణలో ఉనికే లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీ తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో రెండు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కనుమరుగైపోయింది. అలా కేసీఆర్‌ ‌చక్రం తిప్పారనడం సబబుగా ఉంటుంది. తెలంగాణ ప్రజల్లో ఆ స్థాయిలో ఆ పార్టీపై అభిప్రాయాన్ని నూరిపోశారు. ఫలితంగా తెలుగుదేశం విభజిత ఆంధప్రదేశ్‌కే పరిమితమయింది. తెలంగాణలో ఆ పార్టీ పేరెత్తే పరిస్థితి కూడా మొన్నటి దాకా లేదు. ఏదో పేరుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంటూ కార్యకలాపాలు సాగించినా నామమాత్రమే అయ్యింది. అయితే, ఇప్పుడు టీడీపీకి కూడా ఇక్కడ అవకాశం దొరికినట్లయింది. కేసీఆర్‌ ‌తమ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చడం.. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఊపిరి పోసినట్లయింది. ఫలితంగా చంద్రబాబు నాయుడు తిరిగి ఇక్కడ రాజకీయయాత్ర మొదలుపెట్టారు.

 ఖమ్మం జిల్లాలో టీడీపీ ఇటీవల భారీ బహిరంగ సభ నిర్వహించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ సభలో పాల్గొన్నారు. ఒకరకంగా తెలంగాణలో తిరిగి ప్రవేశానికి బలనిరూపణ మాదిరిగా ఆ సభను నిర్వహించారు. అంతేకాదు.. ఇటీవలే తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి కొత్త అధ్యక్షుడిని కూడా నియమించారు. వాస్తవానికి మునుగోడు ఉపఎన్నికల్లోనే పోటీ చేయాలని ఆ పార్టీ ఆలోచన చేసింది. కానీ, ఎందుకో వెనుకడుగు వేసింది.

మరోవైపు.. బీఆర్‌ఎస్‌ని అనుసరించాలని తెలుగుదేశం పార్టీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ, జాతీయ రాజకీయాల పేరుతో భారత రాష్ట్ర సమితి ఎక్కడెక్కడికి వెళ్తే.. అక్కడక్కడికి తెలుగుదేశం పార్టీని కూడా తీసుకెళ్లాలని చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా కేసీఆర్‌ ఎక్కడికి వెళితే అక్కడికి టీడీపీ కూడా వస్తుందని, బీఆర్‌ఎస్‌ ‌పోటీ చేసిన చోట టీడీపీ కూడా పోటీ చేయబోతోందని అంచనా వేస్తున్నారు.

 తొలి నుంచి ప్రత్యర్థులుగా కత్తులు నూరుకుంటున్న కేసీఆర్‌, ‌చంద్రబాబు మధ్య రాష్ట్రం విడిపోయిన తర్వాత విభేదాలు మరింత ముదిరాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టి కేసీఆర్‌ను ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. గెలుపొందిన తర్వాత రిటర్న్ ‌గిఫ్ట్ ఇస్తానంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్‌ ఏపీలో 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్‌ ‌గెలిచేందుకు సహాయపడ్డారు.

ఇప్పుడు ఆంధ్రుల పార్టీ, సెంటిమెంట్‌, ‌ప్రత్యేక తెలంగాణ అనడానికి అవకాశం లేకుండా కేసీఆరే చేశారు. దీంతో చంద్రబాబు ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా రాజకీయం చేసుకోగలుగుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఏపీలోను రాజకీయం చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కార్యాలయ నిర్మాణానికి అవసరమైన పనులను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌ద్వారా ఏపీలోకి వస్తుండగా, చంద్రబాబు అదే తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో బలోపేతమయ్యేందుకు కృషి చేస్తున్నారు. ఇరువురు నేతల మధ్య ఉన్న వైరం కారణంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మంచిరోజులు వచ్చాయని సీనియర్‌ ‌రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.

అయితే, తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణలో పుంజుకుంటే ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం? అన్న అంచనాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు 12 నెలలు మాత్రమే సమయం ఉండగా.. ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు కార్యాచరణ మొదలుపెట్టాయి. ప్రధానంగా అధికార బీఆర్‌ఎస్‌తో పాటు.. బీజేపీ, కాంగ్రెస్‌లతో త్రిముఖ పోటీ నెలకొంటుందన్న విశ్లేషణలు సాగుతుండగా.. టీడీపీ కూడా బరిలో నిలిచే అవకాశం ఉందని వినిపిస్తోంది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram