మన్‌‌ప్రీతీ మోనికాసింగ్‌. ఇటు భారత్‌లో, అటు అమెరికాలో మారుమోగుతున్న పేరు. పేరు ప్రఖ్యాతలు అంటుంటాం సహజంగా. పేరుతో వచ్చిన ప్రసిద్ధి. కాంతి అని భావం. అన్నీ ఆమెలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. భారత సంతతి వనిత అయిన తాను అక్కడ మొట్టమొదటి సిక్కు న్యాయమూర్తి అయ్యారు. స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో న్యాయసాధనకు పరిశ్రమించిన నేపథ్యముంది. ఆ సేవాభావమే మోనికా కీర్తిని ఇప్పుడు అంతర్జాతీయ దశకు చేర్చింది. మహిళా జస్టిస్‌గా తన పేరు అన్నిటా అంతటా ప్రతిధ్వనిస్తూ, ఉభయ దేశాలకీ శిఖర సమానంగా నిలుస్తోంది. అది టెక్సాస్‌ ‌ప్రాంతం. హోస్టన్‌ ‌నగరం. హారిస్‌ ‌కౌంటీ సివిల్‌ ‌కోర్టు భవన ప్రాంగణం. అందులోని నాలుగో నంబరు న్యాయమందిరానికి ఆమె నియామకం. ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఈ మధ్యనే చక్కని వాతావరణంలో జరిగింది. ఆధ్వర్యం వహించిన సంథిల్‌ ‌సైతం భారతీయ అమెరికన్‌ ‌జడ్జి. ఇంతకంటే మించిన ప్రత్యేకత, ప్రాముఖ్యత ఇంకేం ఉంటాయి? అమెరికాలోని తొలి వనితా సిక్కు న్యాయమూర్తి స్థానాన్ని ఈ భారతీయ సంతతి పడతి అధిష్ఠించడం ఏ విధంగా చూసినా చరిత్రాత్మకమే. అందుకే ఇంతింత కీర్తీ ప్రతిష్ఠా!

న్యాయవాద వృత్తిలో మోనికా ఇరవై ఏళ్ల అనుభవశాలి. వాదించిన కేసులు వందల్లో ఉంటాయి. సాగించిన న్యాయచైతన్య కార్యక్రమాలూ అసంఖ్యాకం. ఆమె కుటుంబ పెద్దలు దశాబ్దాల కిందటే అమెరికా దేశానికి వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే హోస్టన్‌ ‌నగర విద్యాలయాల్లోనే చదువుకున్నారామె. విద్యతో పాటు సేవాభావనను తల్లిదండ్రుల నుంచి పుణికి పుచ్చుకున్నారు. గొప్ప భవిష్యత్తు కేవలం కలలు కంటే రాదని, వాటిని నిజం చేసుకునేందుకు కృషి అవసరమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. చట్టం, న్యాయం, సామాజిక శ్రేయస్సు గురించిన ఆలోచనలు చిన్నప్పటి నుంచీ ఉండేవి. వాటిని ఆచరణలోకి తెచ్చేందుకు ఎంతో పరిశ్రమించారు. స్ఫూర్తి కలిగించింది తండ్రి అతార్‌జిత్‌ ‌సింగ్‌. ఆయన ఆ రోజుల్లో నిర్మాణ పనులు చేస్తుండేవారు. ఏ పని చేపట్టాలన్నా ఒక ప్రణాళిక, ముందస్తు జాగ్రత్త, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుదిరగని తత్వాన్ని నాన్న నుంచే నేర్చుకున్నారు మోనికా. పాఠశాల విద్య క్లెయిన్‌ ‌ఫారెస్ట్ ఉన్నత పాఠశాలలో, విశ్వవిద్యాలయ అభ్యాసం టెక్సాస్‌లో. అటు తర్వాత – న్యాయ విద్యపైన శ్రద్ధాసక్తులు ఆమె సౌత్‌ ‌టెక్సాస్‌ ‌కాలేజ్‌ ఆఫ్‌ ‌లాలో చేరేలా చేశాయి. 2013లో ఎష్‌బీఐ సిటిజన్స్ అకాడమీ నుంచీ గ్రాడ్యుయేట్‌ అయ్యారు. మరుసటి సంవత్సరమే హార్వర్డ్ ‌బిజినెస్‌ ‌స్కూల్‌ ‌నుంచి నాయకత్వ నిపుణ పాఠాల్లో రాటుతేలారు. అనంతరం యువ న్యాయవాదుల డివిజన్‌ ‌లీడర్‌ ‌షిప్‌ అకాడ మీలో చేరారు. అక్కడే 2017 వరకు పలు అధ్యయన, సభల నిర్వహణలో తనవంతు పాత్ర పోషించారు. తండ్రి అతార్‌జిత్‌ ‌సింగ్‌ ‌నుంచి క్రియాశీలతను, తల్లి హరదీప్‌ ‌ద్వారా ఆలోచనా స్రవంతిని పొందగలిగా నని సగర్వంగా చెప్తుంటారు. ఎటువంటి పరిస్థితిలో నైనా సాటివారికి సాయపడే నైజం సోదరుడు గురుసింగ్‌ ‌నుంచి నేర్చుకున్నానని అంటుంటారు. మోనికా భర్త మన్‌దీప్‌ అనేక ప్రాజెక్టుల నిర్వాహకుడు. దంపతులైంది 2003లో. ఆ తర్వాత ఆమె విద్య, శిక్షణ పక్రియలు కొనసాగాయి. పిల్లలిద్దరినీ అల్లారు ముద్దుగా చూసుకుంటూనే, మరోవైపు న్యాయవాద ప్రావీణ్యాన్ని గడించారు ఆ అతివ.

బోధన, శిక్షణ, సాధన

ప్రజల హక్కులు, బాధ్యతల పరిరక్షణ మీదనే ఆమెకి ఎక్కువ మక్కువ. పలు సమస్యలకు పరిష్కారం ప్రధానంగా మధ్య వర్తిత్వం వల్లనే సాధ్యమవుతుంది ఎంతో విశ్వాసం. నమ్మిన సూత్రాలకు క్రియా రూపం ఇచ్చేందుకే, అదే అమెరికాలో అటార్నీ విధులు నిర్వర్తించారు. ప్రభుత్వ ధ్రువీకృత మధ్యవర్తిగానూ కేసుల నిర్వహణ చేపట్టారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే ‘చట్టం, ధర్మం, న్యాయం మధ్య ఉన్న సంబంధం ఏమిటో ప్రతి న్యాయవాదికి తెలియాలి. ఆ మూడింటితో పాటు మానవతా విలువలకు గల అనుసంధాన్ని న్యాయమూర్తులు గ్రహించగలగాలి. ఒక కేసు వాదించాలన్నా, దాని గురించిన తీర్పు చెప్పాలన్నా లిఖిత ఆధారాలే ప్రాతిపదిక. కానీ, అన్నింటికీ అన్ని సందర్భాల్లోనూ రాత మూలక సాక్ష్యాలంటూ ఉండవు. ఆ కాగితాలలో పరచుకునే అక్షరాల్లో ఎన్నో జీవితాలుంటాయి. ఆశలూ, ఆశయాలూ కనిపిస్తుంటాయి. వాటిని గుర్తించడమే లాయర్ల, జడ్జీల పని.’ రెండింట్లోనూ అనుభవమున్న మోనికా – ఎంతోమంది అంతరంగాల్లోకి తొంగి చూసి వాస్తవాలు రాబట్టే నిపుణురాలు. సదరన్‌ ‌డిస్ట్రిక్ట్ ఆఫ్‌ ‌టెక్సాస్‌కు చెందిన అమెరికన్‌ ‌డిస్ట్రిక్ట్ ‌కోర్టు నుంచి ధ్రువీకరణ పత్రాన్ని సాధించిన దరిమిలా, న్యాయ వాద వృత్తిలో మరింత ముందుకు దూసుకెళ్లారు. సిక్కు- అమెరికన్‌ ‌న్యాయవాద బృంద ప్రతినిధి అయ్యారు. వారి సభ్యత్వమున్న డైరెక్టర్ల బోర్డులో కీలక వ్యక్తిగా రాణించారు. తన సేవా సహాయ సహకార సమన్వయాలు కేవలం వృత్తికే పరిమితం కాలేదు. చట్ట విద్యకు సంబంధించిన తరగతులకు బోధకు రాలిగా వ్యవహరించారు. యూనివర్సిటీ ఆఫ్‌ ‌టెక్సాస్‌లా స్కూల్‌, ‌స్టేట్‌ ‌బార్‌ ఆఫ్‌ ‌టెక్సాస్‌, ‌హారిస్‌ ‌కౌంటీ జుడిషియరీలో కూడా ప్రముఖత్వాన్ని సంతరించుకున్నారు. వాటికి అదనంగా- టెక్సాస్‌ ‌గ్రివెన్స్ ‌కమిటీకి విస్తృత సేవలందించి అపార గౌరవాభిమానాలు సంపాదించారు. సౌత్‌ ఏషియన్‌ ‌ఛాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ (‌వాణిజ్య మండలి), సౌత్‌ ఏషియన్‌ ‌బార్‌ అసోసియేషన్‌లో సైతం తానే ప్రముఖురాలు. అమెరికన్‌ అడ్వొకేట్ల బోర్డులో హోస్టన్‌ ‌చాప్టర్‌ ‌ప్రతినిధి హోదా వరించాయి.

ఎంపికలూ ఎన్నికలూ

ఆమె వృత్తిగత, వ్యక్తిపరమైన జీవితంలో ఎంపిక, ఎన్నికలు ప్రధాన స్థానం పొందాయి. హారిస్‌ ‌కౌంటీ సివిల్‌ ‌కోర్టుకు అక్కడి నియమాల ప్రకారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలోనూ మోనికాదే పైచేయి. ఒక ముఖాముఖిలో వ్యక్తపరచినట్లు – ‘నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నందుకు గర్వంగా ఉంది. భావోద్విగ్న స్థితి నాలో చోటు చేసుకుంటోంది. న్యాయ నిర్ణయం ద్వారా సేవచేయాలన్నదే నా మనసులోని మాట. ఇదీ సేవా నాయకత్వం అంటాను నేను. సిక్కులు, ఇతరులకు సకాల న్యాయం అందించడానికి అన్ని విధాలా పనిచేస్తాను. నిజానికి ఈ హోస్టన్‌ ‌ప్రాంత మంతా వైవిధ్యమయం. న్యాయపరమైన ఏకత్వ సాధనకు ఏది ఎప్పుడు చేయాలో దానిని అప్పుడు నిర్వర్తిస్తాను. నాకు వచ్చిన పురస్కారాలు నా బాధ్య తల్ని మరింత పెంచాయి. దక్షిణాసియా న్యాయ వాదుల సంఘ సభ్య ప్రతిష్ఠాత్మక అవార్డు నాకే వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మరుసటి సంవత్సరమే టెక్సాస్‌ ‌డైవర్సిటీ ఛాంపియన్‌ ‌పురస్కారం వరిం చింది. ఎక్సలెన్స్ ‌పురస్కృతులూ నాకే లభించాయి. ఇన్ని వచ్చాయని గొప్ప చెప్పడం కాదు. అవన్నీ నా కర్తవ్యాల్ని విస్తారం చేశాయని ప్రకటిస్తున్నా. ప్రజల హక్కుల పరిరక్షణకు మించి మరేదీ ఉండదు. గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను ఎన్నటికీ మరవ లేను. మా నాన్నగారు అమెరికా వచ్చిన తొలిరోజుల్లో జాతి వివక్ష ఎదురైంది. మా అందరికీ ఎంతో బాధ కలిగింది. ఆ తరహా వివక్షకు పూర్తిగా ముగింపు పలకాలన్న పట్టుదలే నన్ను జుడీషియల్‌ ఎన్నికలలో పోటీ చేయించింది. మరో వాస్తవాన్ని, అదీ కఠినమైన దాన్ని ఇప్పుడు ఈ సందర్భంలో మీ ముందు ఉంచుతున్నా… మునుపు సీనియర్‌ ‌లాయర్‌ ‌దగ్గర న్యాయవాదిగా చేసేదాన్ని. ‘ఎవరితోనైనా పరిచయం చేకునేటప్పుడు ‘అమెరికన్‌’ అని చెప్పండి. ‘అమెరికన్‌ ఇం‌డియన్‌’ అనకండి అని ఆయన సలహా.

ఎందుకలా చెప్పాలన్నదీ నా ప్రశ్న!’ ఈ మాటలు చాలు, మోనికా భారతీయతత్వ మూలాన్ని వెల్లడి చేసేందుకు. అమెరికాలో దరిదాపు ఐదు లక్షల మంది సిక్కులున్నారు. వారిలో ఇరవై వేలమందిపైగా ఒక్క హోస్టన్‌ ‌పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అదే హోస్టన్‌ ‌మేయర్‌ ‌సిల్వెస్టర్‌ ‌టర్నెల్‌ ‘ఇదంతా ప్రత్యేకించి సిక్కులందరికీ సగర్వ కారణం’ అంటున్నారు. అంతేకాక, ప్రజలందరికీ సంతోషదాయకమని తానే చెప్తున్నారు. ఈ ప్రాంతమంతా విభిన్నతల నిలయం. ఇందులో ఏకత్వాన్ని చూడటమే అందరి ధ్యేయమూ కావాలి. న్యాయం, చట్టం అందరివీ. వాటిని కాపాడటం న్యాయమూర్తుల ప్రథమ బాధ్యత, విధి. ఇందులో మోనికా సఫలీకృతమవుతారన్నది ఆ మేయర్‌ ‌దృఢ నిశ్చయం. తనదే కాదు, అందరిదీ అదే ఆశాభావం. భారతీయత మూర్తీభవించిన మన్‌‌ప్రీత్‌ ‌మోనికా సింగ్‌ ‌చదివిన చదువుతో, నేర్చు కున్న శిక్షణతో, సాగిస్తున్న సేవతో పౌరులందరి గౌరవాదరాలకూ పాత్రురాలు. వివక్ష, అంతరాలకు తావులేని సమాజమే అవసరం. అందుకు ఆమె న్యాయమూర్తిత్వం, అందునా అతివగా తన నాయ కత్వం ఎంతగానో దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. అది తప్పక ఫలిస్తుందని ఇంకెప్పుడు కాదు – ఇప్పుడే చెప్పవచ్చు మనం.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram