– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌రాష్ట్రంలో హిందుధర్మంపై పరమత దాడులు, హిందువుల పట్ల ప్రభుత్వ విపక్ష కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల తిరుపతిల్లో భక్తులకు ఇచ్చే వసతి గదుల అద్దెను పెంచాలని నిర్ణయం తీసుకోవడం హిందూ వివక్ష కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరులోని వరసిద్ధి వినాయక క్షేత్రాన్ని ఒక ఫాస్టర్‌ ‌ధ్వంసం చేయడం హిందూ ధర్మంపై క్రైస్తవులు చేస్తున్న దాడిగా పేర్కొనవచ్చు. ఈ రెండే కాదు… మూడేళ్ల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తే ఒక విషయం అవగతమౌతుంది. మతమార్పిడులు, హిందూ ఆలయాల వద్ద క్రైస్తవ మత ప్రచారం, హిందూ దేవతలను తూలనాడటం, హిందూ దేవతల విగ్రహాలు, ఆలయాలు ధ్వంసం చేయడం, హిందూ మత ఆచారాలను అవమానించడం, కించపరచడం, హిందూ యువతులను ఆకర్షించి వారిని బలవంతంగానైనా మత మార్పిడులకు పురికొల్పడటం వంటి హిందూ మత వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయి. అదే సమయంలో చర్చిలు, మసీదులను అక్రమంగా నిర్మించడం, చర్చిల నిర్మాణానికి ప్రభుత్వమే నిధులు కేటాయించడం వంటివి ఉన్నాయి. హిందూమత దాడులను ప్రభుత్వం ఏమాత్రం ఖండించకపోగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈగ వాలనీయడం లేదు. నిందితులను తప్పిస్తూ, వారిని కొమ్ముకాసేలా మాట్లాడుతూ, బాధితులనే తిరిగి ఇబ్బందులు పెడుతోంది.

వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి తిరుమల భక్తులపై ఎప్పటికప్పుడు ఆర్థికభారం మోపుతూనే ఉంది. ఈ ప్రభుత్వ హయాం నుంచి తిరుపతి తిరుమల దేవస్థానం (తితిదే) నిర్వహణ ఏ మాత్రం సవ్యంగా లేదని భక్తులు అంటున్నారు. తితిదేని రాజకీయ వేదికగా మార్చారు. దేవస్థానం బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి వైసీపీ నాయకులకు బోర్డులో పదవులిచ్చి ఉపాధి కల్పి స్తున్నారు. నేర చరిత్ర కలిగిన, అర్హతలేని వారు సభ్యులుగా పదవులు పొందారు. చివరికి వీరిని తొలగించాలని కోర్టు ద్వారా మొట్టికాయలు వేయించుకున్నారు. రిజర్వేషన్ల ద్వారా అక్రమంగా ప్రవేశించి ఉద్యోగాలు పొంది క్రైస్తవాన్ని అనుసరి స్తోన్నవారిని గుర్తించేందుకు ప్రయత్నించిన ఈవోను వెంటనే ఈ ప్రభుత్వం బదిలీ చేసింది. భక్తులు సమర్పించిన కానుకలను ప్రభుత్వం వాడుకోవాలని కూడా చూసింది.

మూడింతలు పెంపు

తిరుమలకు విచ్చేసే భక్తుల నుంచి కావాల్సినంత పిండేసి వారిపై ఆర్థిక భారం మోపుతోంది. ఆల యంలో సౌకర్యాలు మాత్రం పెరగలేదు. భక్తులకు అందించే సేవలపై ఛార్జీలు పెంచేస్తున్న ప్రభుత్వం చర్చిలు, మసీదుల పట్ల ఆదరణ కనబరుస్తోంది. ముల్లాలు, ఫాస్టర్లకు జీతాలు చెల్లిస్తూ వారి పట్ల అంతులేని ప్రేమను కనబరుస్తూ హిందువుల పట్ల ద్వేషాన్ని వెళ్లగక్కుతోంది.

తిరుమలలోని భక్తుల వసతి గదుల ధరలను మరోసారి పెంచింది. అక్కడి కొన్ని రెస్ట్ ‌హౌస్‌లలో గదుల ధర రూ.150 ఉంది. వీటికి ఏసీలు, గీజర్‌లు బిగించి జీఎస్టీతో కలిపి ఒక్కసారిగా రూ.1700, రూ.750 నుంచి రూ.1700కు, మరోటి రూ.2200 లకు పెంచారు. స్పెషల్‌ ‌టైప్‌ ‌కాటేజీలలో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2800 చేశారు. ఇది కాక భక్తులు గదుల అద్దెతోపాటు డిపాజిట్‌ను అంతే మొత్తంలో చెల్లించాలి. గదిని 1700కు పొందితే డిపాజిట్‌ ‌నగదుతో కలిపి రూ. 3400 చెల్లించాలి. ఇలా ధరలు పెంచడంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆధునికీకర•ణ పేరుతో వసతి భవనాలకు మరమ్మతులు చేపట్టడం, కొన్నిటికి ఏసీ, గీజర్‌ ‌వంటి సదుపాయాలు కల్పించడం వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం దేవస్థానం విధి. అయితే ఖర్చుచేసిన డబ్బుకు మూడింతలు భక్తుల నుంచి రాబట్టాలని చూడటం సరైన చర్య కాదనేది భక్తుల అభిప్రాయం.

మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలను ఒక్కసారిగా రూ.500, రూ.600 నుంచి రూ.1000కు పెంచారు. మరోవంక భక్తులకు ఇచ్చే లడ్డూల సంఖ్యను తగ్గించి వేశారు. దీంతో భక్తుల్లో అసహనం పెరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం తగ్గడం లేదు.

తిరుమల హిందూ వారసత్వ సంపద

తిరుమల హిందూభక్తుల వారసత్వ సంపదే తప్ప వ్యాపార స్థలం కాదు. చారిత్రక, పురాణ, ప్రశస్తిగల ఆధ్యాత్మిక కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది హిందువులు కలియుగ దైవంగా విశ్వసించే సాక్షాత్‌ శ్రీ‌వేంకటేశ్వరుడు కొలువుదీరిన సప్తగిరిని భక్తులు పరమపవిత్ర ప్రాంతంగా భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా భగవంతుని చూడాలని పరితపిస్తారు. ఇందులో ధనిక, పేద భేదం లేదు. అందరూ ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. కొందరు కష్టపడి కూడబెట్టుకుని వస్తే, పేదలు వ్యయ ప్రయా సలతో స్వామి వారిని సేవించి తమ బాధల నుంచి ఉపశమనం కోసం వస్తుంటారు. ఇలాంటి వారిపై ధరల భారం మోపడం సరికాదని భక్తులంటున్నారు.

 భక్తులు దేవస్థానానికి ఇచ్చే కోట్లాది రూపాయల కానుకలను ఆదాయంగా పరిగణించరాదని, వాటిని భక్తులకు కల్పించే సేవలకు ఖర్చు చేయాలన్నది హిందూసంస్థలు, భక్తులు, భారతీయ జనతా పార్టీ డిమాండ్‌. ‘‌దేవస్థానానికి సంబంధించిన ఏ మౌలిక సదుపాయాలకు ఎంత ఖర్చయినా ఆ సంస్థ మాత్రమే భరించాలి. భక్తులపై రుద్ద వద్దు. తిరుమలకు వచ్చే సామాన్య, మధ్యతరగతి భక్తులను ధరాఘాతానికి గురిచేయవద్దు’ అన్న డిమాండ్‌లతో బీజేపీ జనవరి 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి వినతి పత్రాలు కూడా సమర్పించింది.

ఏలికల తీరుపై ధర్మాగ్రహం

ఇక వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న హిందు వ్యతిరేక చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. హిందువులు భగ్గుమంటున్నారు. క్రైస్తవ, ముస్లింలకు అన్నివిధాల అనుకూలంగా పని చేసి ఓటుబ్యాంకును పెంచుకుంటూ మళ్లీ అధికారానికి రావాలన్నది వైసీసీ ప్రభుత్వ ఆలోచన. అందుకోసం ప్రజాస్వామ్యానికి లౌకికత్వానికి తూట్లు పొడుస్తోంది. అందులో భాగంగానే ఈ రెండు మతాల వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు అమలుచేస్తూ, హిందువులను అణచివేసే పలు ప్రణాళికలు అమలు చేస్తోంది.

హిందూ ఆలయాలున్న ప్రాంతాను ముస్లిం, క్రైస్తవ జనావాసాలుగా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాదు… ముస్లింలు, క్రైస్తవులకు హిందూ ఆలయాలున్న ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుతూ వారు అక్కడ శాశ్వతంగా తిష్ఠ వేసేలా వ్యవహరిస్తోంది. అదే సమయంలో హిందువులను అణచివేయడం ద్వారా అక్కడి నుంచి తరిమేసేలా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆలయ నిర్వహణ బాధ్యతలను తీసుకున్న వైసీపీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేల సాయంతో ఈ అజెండాను అమలు చేస్తున్నారని హిందూ సంస్థలు, బీజేపీ ఆరోపిస్తు న్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి పరిసరాల్లో వేరే ప్రాంతాలకు చెందిన ముస్లింలు, క్రైస్తవులకు పెద్ద సంఖ్యలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే శ్రీశైలంలో ఆలయ దుకాణాల్లో చాలా వరకు ముస్లింలకే కేటాయించారు. శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన పలు కాంట్రా క్టులు ఎమ్యెల్యే అనుచరుడైన ఒక ముస్లిం చేస్తున్నారు. తిరుమలలోనూ ఇదే పరిస్థితి. దేవస్థానాలకు సంబంధించిన పనులన్నీ వైసీపీ నాయకులు తమ అనుయాయులైన ముస్లిం, క్రైస్తవులకు అప్పగించి చేయిస్తున్నారు.

ఆలయాల ధ్వంసం

నవరత్నాలు పథకాల మాదిరిగా ఆలయాల ధ్వంసం అనేది వైసీపీ హయాంలో నిత్య పథకంగా మారింది. కొండ బిట్రగుంటలో జరిగిన రథం దగ్ధం నుంచి అంతర్వేదిలో కొనసాగింపు, పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం నుంచి రామతీర్థంలో రాముల వారి విగ్రహం ఖండించడం వరకు సుమారు 100కు పైగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. ఈ నెల పదో తేదీన రాజమహేంద్రవరం గ్రామీణ పరిధిలోని కొంతమూరు అఫిషియల్‌ ‌కాలనీలోని వరసిద్ధి వినాయక ఆలయంలోకి కొంతమంది పాదరక్షలతో వెళ్లి ఆయుధాలతో ఆలయ గోడ కూల్చివేసిన సంఘటన స్థానికులైన హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి. ఆలయానికి అమర్చిన సీసీ• కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. ఆలయగోడలు కూల్చివేస్తోన్న వారిలో ఒక ఫాస్టర్‌ ‌కూడా వున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనను చూసి వారిని ఎదిరించిన మహిళకు హిందూ సమాజం తలవంచి నమస్కరిస్తోంది. ఆలయంపై దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవా లని స్థానిక హిందువులు అదే రోజు రాత్రి ఆందోళనకు దిగారు. గతంలోనూ ఇలాంటి ఘటనలే జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా న్యాయం జరగలేదంటున్నారు. దీనికి సంబంధించి ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ ‌చేసింది. తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కొందరు అతివాద క్రైస్తవ, ముస్లింలు సంఘటనలుగా హిందువులు అనుమానిస్తున్నారు. ఆత్మకూరులో అనుమతిలేని మసీదును నిర్మిస్తూ, అడ్డుకునేందుకు వచ్చిన బీజేపీ నంద్యాల నాయకులు డాక్టర్‌ ‌బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై హత్యాయత్నం జరగడం, తిరుపతి సమీపంలోని ఓటేరు పంచాయతీ పరిధిలోని నక్కలవారిపాలెంలోని సంచార తెగలున్న గ్రామంలో వీరభద్రస్వామి ఆలయం వద్ద సమస్యలు సృష్టించడం, త్రిపురాంతకం పెద్దారవీడు మండలంలోని చెంచుగూడెంలో చర్చిని అక్రమంగా నిర్మించడాన్ని అడ్డుకున్న స్థానిక హిందూ చెంచులపై దాడులు వంటివి జరుగుతూనే ఉన్నా ప్రభుత్వం మాత్రం వీటిని అరికట్టే ప్రయత్నం చేయడం లేదు.

వందేభారత్‌ ‌రైలుపై రాళ్లు రువ్వడం

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దేశంలోని పలు మార్గాలలో ప్రారంభించిన వందే భారత్‌ ‌రైళ్లపై జాతీయవాదాన్ని వ్యతిరేకించే వేర్పాటువాద శక్తులు రాళ్లురువ్వాయి. కొన్నిరోజుల క్రితం పశ్చిమబెంగాల్‌లో ఇలాంటి ఘటన జరిగితే ఇటీవల విశాఖలో చోటు చేసుకుంది. జాతీయ వాదాన్ని ప్రోత్సహించే బీజేపీ ప్రభుత్వం వందేభారత్‌ ‌రైళ్లను ప్రతిష్ఠాత్మకంగా భావించి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయించి నడుపుతోంది. ఇది ఓర్వలేని వేర్పాటువాదులు, కుహనా లౌకికవాద పార్టీల మద్దతుతో ఈ రైళ్లపై రాళ్ల దాడికి దిగారు. ఇది దేశ ప్రజలంతా ముమ్మాటికి ఖండించాల్సిన విషయం.

About Author

By editor

Twitter
Instagram