సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌పుష్య  బహుళ విదియ – 09 జనవరి 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయం నిస్సందేహంగా ఏ కాలానికైనా, ఏ ప్రభుత్వం తీసుకున్నా తుపాను సృష్టిస్తుంది. ఇలాంటి నిర్ణయాలు గతంలోను జరిగాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నవంబర్‌ 8, 2016‌న తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా పెద్ద కుదుపే. యథాతథ స్థితిని ఆశించేవారు తప్ప, మోదీ ప్రభుత్వం ఏం చేసినా రంధ్రాన్వేషణ చేయడమే పనిగా పెట్టుకున్న మూక తప్ప మిగిలిన వారంతా అనివార్యమైన ఆ కుదుపును అర్థం చేసుకున్నారు. మోదీ పట్ల ఉన్న అసూయ, బీజేపీ ఎడల ఉన్న అక్కసు మాటెలా ఉన్నా, నోట్ల రద్దు నిర్ణయంలో విపక్షాలు ఆరోపించినట్టు ఉల్లంఘనలేవీ జరగలేదని జనవరి 2, 2023న సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆ నిర్ణయం సబబేనని కూడా చెప్పింది.

నోట్ల రద్దు నిర్ణయంలో మోదీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించేసిందని గగ్గోలు పెడుతూ దాఖలైన 58 పిటిషన్లనూ అత్యున్నత న్యాయస్థానం కట్టకట్టి బుట్టదాఖలా చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేందుకు ధర్మాసనాలలో న్యాయమూర్తులను బేసి సంఖ్యలో నియమిస్తారు. అధిక సంఖ్యాకుల తీర్పు శిరోధార్యమవుతుంది. ఈ వివాదాన్ని విచారించడానికి నియమించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూనూ, ఒక్కరు వ్యతిరేకిస్తూనూ తీర్పు చెప్పారు. చిత్రంగా ఒక న్యాయమూర్తి వ్యతిరేక తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టంటూ విపక్షాలూ, అందులోను కాంగ్రెస్‌ ‌నేత చిదంబరం వంటి చీదర మనుషులూ భాష్యాలు వెలగబెట్టడమే వెగటు పుట్టించింది.

రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దొంగనోట్లు, నల్లధనం, ఉగ్రవాద సంస్థలకు నిధులు వంటి బెడదల నుంచి దేశాన్ని బయటపడేయడం ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ నిర్ణయం హడావుడిగా తీసుకున్నారనీ, సమస్త నియమాలను పక్కన పెట్టేశారనీ, తగినంత సమయం ఇవ్వలేదనీ పిటిషనర్ల వాదన. చిత్రంగా వ్యతిరేకంగా వచ్చిన తీర్పులో ఇవే వాదనలు వినబడడమూ వింతే. ఈ నిర్ణయానికి ముందు ఆరుమాసాల పాటు కేంద్రానికీ, రిజర్వు బ్యాంకుకూ మధ్య సంప్రతింపులు నడిచాయని కేంద్రం చెబుతున్నా ఈ వ్యాఖ్య రావడం దురదృష్టకరం కాదా! అయినా ఇలాంటి నిర్ణయాలు అందరికీ వీలైన ముహూర్తం ఏదో చూసుకుని అప్పుడు తీరికగా అమలు చేస్తారని అనుకోగలమా? దేశంలో పాకిస్తాన్‌ ‌చొప్పించిన దొంగ కరెన్సీ ఉంది. నల్లధనం సరే. ఇక కశ్మీర్‌లో నిత్యకృత్యంగా మారిన రాళ్లు రువ్వుడు కార్యక్రమానికీ, మావోయిస్టుల కార్యకలాపాలకీ కోట్లలో ధనం అందుతున్న సంగతి వాస్తవం. ఈ అవసరాల కోసమే అడవులలో డంపులలోను, హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ‌నేతల ఇళ్లలోను మూలుగుతున్న డబ్బును క్షేమంగా తరలించే వెసులుబాటు ఇచ్చి, ఆపై రద్దు నిర్ణయం ప్రకటించి ఉంటే బాగుంటుందని చాలామంది విపక్ష నేతల ఉద్దేశం కాబోలు. ఈ నిర్ణయాన్ని హఠాత్తుగా రుద్దారంటూ పిటిషనర్లు చేస్తున్న వాదన అర్థరహితమని అత్యున్నత న్యాయస్థానం సరిగానే చెప్పింది. లక్ష్యాలను చేరుకోవడంలో ఈ నిర్ణయం విఫలమైంది కాబట్టి దీనిని తప్పుడు నిర్ణయంగా ప్రకటించాలని వాదించడం కూడా అసంబద్ధమేనని నిర్ద్వంద్వంగా చెప్పడం ఈ తీర్పులోనే కీలకం. కానీ నిజం ఏమిటి? కశ్మీర్‌లో ఉగ్రమూకల, ఆ మూకల తోకల ఆట కట్టించింది పెద్ద నోట్ల రద్దు నిర్ణయమే. అంతిమంగా ఆగస్ట్ 5,2019‌న కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ ‌రద్దుకు ఇది వాతావరణాన్ని ఏర్పరిచింది. ఇప్పుడు కశ్మీర్‌ ‌ప్రధాన స్రవంతిలోకి వస్తున్న ప్రాంతం. ఈ వాస్తవాన్ని కేవలం దురుద్దేశాలే గాని మరో సదుద్దేశమేదీ లేని విపక్షాలు తప్ప, మిగిలిన దేశం ఎలా విస్మరించగలదు?

కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌, ఆయన తైనాతీలు చిదంబరం, జైరాంరమేశ్‌, ఇం‌కా ఎందరో నోట్ల రద్దు గురించి చేసిన రాద్ధాంతం జుగుప్సాకరమైనది. వీళ్లు సరే, అధికారదాహమనే వ్యాధితో బాధపడే జాతి. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ‌రఘురామ్‌ ‌రాజన్‌ ‌కూడా ఈ మూకకి వంత పాడడాన్ని ఏమనాలి? ఇక మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, ‌కేరళ కమ్యూనిస్టు గుంపు, మిగిలిన వామపక్ష మూక, స్వయం ప్రకటిత మేధావులు, ఉబుసుపోక కబుర్ల ఉదారవాదులు, కొన్ని టీవీ చానళ్లు అంతా నోట్ల రద్దు వ్యతిరేక కాకిగోలలో భాగస్వాములైనవారే. తీర్పు తరువాత శతాధిక వృద్ధ పక్షం కాంగ్రెస్‌ ‌చేసిన వ్యాఖ్య మరీ వికృతం. నిర్ణయం తప్పు కాదని మాత్రమే చెప్పింది తప్ప, లక్ష్యాలు నెరవేరడం మీద అత్యున్నత న్యాయస్థానం మాట్లాడలేదు కాబట్టి ఇది అభిశంసనేనని అది భాష్యం చెప్పింది. పార్లమెంటుకు చెప్పి నిర్ణయం తీసుకోలేదన్నది కూడా మరొక తిక్క వాదమే. అత్యవసర పరిస్థితి (1975) వంటి ఘోర నిర్ణయాన్ని ఇందిరాగాంధీ పార్లమెంటును అడిగే చేశారా? నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న నెలలోనే 82 మంది చనిపోయారని, ఇందుకు ఎవరిది బాధ్యత అని కొందరు నేతలు, టీవీ చానళ్ల పేనలిస్టులు కెమెరాలలో ముఖం పెట్టి కుమిలిపోతున్నారు. ఎవరి ప్రాణం పోయినా దురదృష్టకరమే. అది నిజం. కానీ ఢిల్లీ అల్లర్లు, కశ్మీరీ పండిత్‌ల ఊచకోత, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల హింసలో చనిపోయిన వారి గురించి వీళ్ల నోళ్లెందుకు లేవవు?

ఎన్నికైన ఏ ప్రభుత్వానికైనా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. యథాతథ స్థితి కొనసాగాలనీ, వ్యవస్థ ఇలాగే ఉండిపోవాలని, ఉగ్రవాదం, ముస్లిం మతోన్మాదం, మావోయిజాలకు రాజ్యమేలే వెసులుబాటు భద్రంగా ఉండాలని మోదీ కోరడం లేదు. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలనీ అనుకోవడం లేదు. అందుకే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవి దేశ హితమైనవా? కావా? అనేది ఎన్నికలలో ప్రజలు తేలుస్తారు. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో మాత్రం విపక్షాలు జాతికీ, మోదీకీ క్షమాపణలు చెప్పాలి.

About Author

By editor

Twitter
Instagram