సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌పుష్య శుద్ధ ఏకాదశి – 02 జనవరి 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


బాధ్యత లేకుండా మాట్లాడడం, ఆ మాటకున్న గౌరవమెంతో గుర్తించ కుండా ప్రకటనలు రువ్వడం భారత విపక్షాలకు నిత్యకృత్యంగా మారింది. ఇందులో అందెవేసిన చేయి కాంగ్రెస్‌దే. ప్రపంచాన్ని మరొకసారి దారుణ పరిస్థితులలోకి నెట్టివేయడానికి కరోనా మహమ్మారి సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. అధికారపక్షం ఏది చెప్పినా అందులో రాజకీయం చూడడమేనా? కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ ‌జోడో యాత్ర ప్రస్తుతానికి విరమించే యోచన చేస్తే మంచిదని బీజేపీ ప్రభుత్వం మర్యాదగా విజ్ఞప్తి చేసింది. ఈ వినతిలోను రాజకీయాన్ని మాత్రమే ఆ శతాధిక వర్షాల పార్టీ చూసింది. స్వత్రత భారతంలో ప్రజాక్షేమం, దేశ భద్రత, వాస్తవ పరిస్థితులను, ప్రజాస్వామ్యాన్నీ ఏనాడూ గౌరవించని కాంగ్రెస్‌ ‌నుంచి ఇలాంటి ధోరణి కాక, వేరేదో ఆశించడం మన తప్పు. ఇంతకీ ఎవరిది రాజకీయం? కాంగ్రెస్‌ ‌పార్టీదా? బీజేపీ ప్రభుత్వానిదా? ఇది తెలియాలంటే వాస్తవం చూడాలి.

దేశం నాలుగో దశ కరోనా గురించి హెచ్చరికలు అందుకుంటున్న తరుణమిది. బీఎఫ్‌.7 అనే పేరుతో కొవిడ్‌ 19 ‌కొత్త అవతారం ప్రస్తుతం 90 దేశాలను ఇంకో సంక్షోభంలోకి నెడుతున్న సమయమిది. మన దేశంలో తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకున్నా జాగ్రత్తలు తప్పనిసరి. ప్రభుత్వం ఇదే చెబుతోంది. భారత్‌ ‌వచ్చిన విదేశీయులలోను, విదేశాలకు వెళ్లి వచ్చిన భారతీయులలోను దీని లక్షణాలు కనిపించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. విపత్తు ముంగిటకు వెళ్లే ప్రమాదం కనిపిస్తున్నప్పుడు ప్రజలను హెచ్చరించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కాదా? దీనికి రాద్ధాంతం ఏమిటి? రాహుల్‌ ‌యాత్రలో పాల్గొని వెళ్లిన తరువాత హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి కొవిడ్‌ ‌బారిన పడడం వాస్తవం కాదా? కాంగ్రెస్‌ ‌పార్టీకి కొత్తగా అధ్యక్ష బాధ్యతల స్వీకరించిన మత్తు ఇంకా వదలలేదు కాబోలు, మల్లికార్జున ఖర్గే అయితే, కొవిడ్డూ లేదు ఏమీ లేదు అంటూ కొట్టి పడేశారు. కొవిడ్‌ ‌లేదా? కాంగ్రెస్‌ ‌లేదనే అనగలదా?

90 దేశాలు, ఎక్కువ అగ్రరాజ్యాలు మళ్లీ కొవిడ్‌తో యుద్ధం మొదలు పెట్టాయి. అమెరికా, ఫ్రాన్స్, ‌జపాన్‌ ‌వంటి దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటన్నిటిలోను చైనా పరిస్థితి అత్యంత విషాదం. మూర్ఖత్వానికీ, మూఢత్వానికీ చిరునామాల వంటి మార్క్సిస్టు నేతలు ఆ దేశాన్ని నరకకూపం చేసేశారు. ఊహాన్‌ ‌వైరస్‌ను అదుపు చేయడం అంటే, సైన్యాన్ని పెట్టి సాధారణ ప్రజానీకాన్ని లొంగదీసినంత సులభం కాదని అనుభవమైంది. 2022 డిసెంబర్‌ ‌నెల మొదటి 20 రోజులలో పాతిక కోట్ల మంది వైరస్‌ ‌బారిన పడ్డారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. రోజుకు పది లక్షలు కేసులు నమోదవుతుంటే, 5000 మంది రాలిపోతున్నారని కూడా వెన్నులో వణుకు పుట్టించే సమాచారం ప్రపంచాన్ని తాకింది. అక్కడ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతుంటే, మృతదేహాలు శ్మశానాల దగ్గర అంత్యక్రియల కోసం పడిగాపులు పడి ఉన్నాయనీ వార్తలు వస్తున్నాయి. రక్తం కొరతతో, మందుల కొరతతో, ఆసుపత్రులలో చోటు కొరతతో దేశం తల్లడిల్లిపోతోంది. ఇదంతా ఎందుకు? శాస్త్ర పరీక్షలకు నిలిచిన విదేశీ వ్యాక్సిన్‌లను కాదనడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్డిగా ఆమోదముద్ర వేసిన స్వదేశీ వ్యాక్సిన్‌ ‌వాడడం ఓ కారణం. ఒక అపార్ట్‌మెంట్‌లో లేదా ఒక వీధిలో ఒక వ్యక్తిలో లక్షణాలు కనిపిస్తే మొత్తం ఆ ప్రాంతాన్నే లాక్‌డౌన్‌ ‌కిందికి తేవడం మరొక కారణం. ఈ రాక్షస చర్యకే జీరో కొవిడ్‌ ‌విధానమని పేరు. పాతిక కోట్ల మంది బాధితులు ఉన్నారంటూ వార్త పొక్కడం, సమాచార ప్రసారం మీద వేటు వేయడం ఏకకాలంలో చేసింది చైనా. ఇంతకు ముందు కూడా ప్రపంచానికి సరైన సమాచారం ఇవ్వక చైనాయే నష్టపోయింది. అయినా అదే బాటకు ఇప్పుడూ మళ్లింది. మావో మారణకాండ కొన్ని దశాబ్దాల తరువాత బయటపడింది. జీ జిన్‌పింగ్‌ అనే ప్రస్తుత నియంత అకృత్యాలూ దాగవు.

చైనాలో ఇలాంటి పరిస్థితి ఉంటే, భారత్‌ ‌ముందు జాగ్రత్త చర్యలలో నిమగ్నం కావాలని చూస్తుంటే రాహుల్‌ ‌గాంధీ అత్యంత బాధ్యతరాహిత్యంతో మరొక ప్రకటన కూడా చేశారు. భారత భూభాగాలను కొన్ని మైళ్లు ఆక్రమించుకున్న చైనా, పాకిస్తాన్‌తో కలసి మన దేశం మీద దాడి చేయాలని చూస్తున్నదట. భారత ప్రభుత్వం పెనునిద్రలో ఉన్నదట. అందుకు అవకాశాలు చాలా ఉన్నాయట. ఇదీ రాహుల్‌ ‌వాచాలత్వం. ఇది రాహుల్‌ ‌ముత్తాత నెహ్రూ హయాం నాటి 1962 కాదనీ, నరేంద్ర మోదీ హయాంలో 2023 అనీ గుర్తించగలిగితే ఆయన స్పృహలో ఉన్నట్టే. రాహుల్‌ ‌చెప్పినట్టు చైనాకు అలాంటి వక్రబుద్ధి లేదని అనలేం. ఆ దేశం శవాల మీద పేలాలు ఏరుకు తినగలదని రెండో దశ కరోనా కాలంలోనే రుజువైంది. భారత్‌ ‌కరోనాతో, విపక్షాల వక్రీకరణలతో సతమతమవుతుంటే చైనా గల్వాన్‌ ‌నిర్వాకం చేసింది. అలాంటి చైనా విధానం ఎవరికీ ఆదర్శం కాకూడదు. మన విపక్షాలు చైనా పంథానే ఎంచుకుంటున్నాయి. కొందరు పాత్రికేయులూ చైనానే నమ్మమంటున్నారు.

కాంగ్రెస్‌ ‌సహా మన విపక్షాలు వాస్తవాలు గ్రహించి మాట్లాడితే మంచిది. మన దేశం 90 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసింది. కరోనా నిరోధక చర్యలు తీసుకోవడంలో మెరుగైన సామర్థ్యం చూపించినందుకు మోదీ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి శ్లాఘించింది. 2020 నుంచి సరైన సమయంలోనే స్పందిస్తూ సర్కార్‌ ‌నష్టాన్ని తగ్గించగలిగింది. వ్యాక్సినేషన్‌ ‌లక్ష్య సాధనలో మోదీ ప్రభుత్వం ముమ్మాటికి ఘన విజయమే సాధించింది. నాలుగో దశతో అంటే, బీఎఫ్‌.7 ‌వేరియంట్‌తో దేశానికి పెద్దగా ముప్పు లేదని శాస్త్రజ్ఞులు, నిపుణులు చెబుతున్నారు. కానీ ముప్పంతా విపక్షాలతోనే అని భారత ప్రజానీకం నిర్ధారించుకుని వచ్చే ఎన్నికలలో తుడిచి పెట్టేయకుండా కాపాడుకోవడం వాటి మీద ఉన్న కర్తవ్యం. అందుకోసమైనా అవి ప్రజా సంక్షేమానికి ఉద్దేశించిన పనులలో ప్రభుత్వానికి చేయూతనివ్వాలి.

About Author

By editor

Twitter
Instagram