భారతదేశ చరిత్ర అంటే ఢిల్లీ కేంద్రంగా జరిగిన చరిత్రను మాత్రమే పరిగణించడం సరికాదని ఆచార్య ఎస్‌.‌వి. శేషగిరిరావు అన్నారు. భారతావనిలో బానిస వంశీకుల నాయకత్వంలో కుతుబుద్దీన్‌ ఐబక్‌ ‌పాలన ప్రారంభించినప్పటి నుంచి మాత్రమే ఢిల్లీకి కొంత ప్రాధాన్యం వచ్చిందని అంటున్నారు. ఉత్తర భారతమే కాదు, దక్షిణాదిన తమిళనాడు, కేరళ; పైన కశ్మీర్‌, అస్సాం, కాస్త దిగువన ఒడిశా, అటు గుజరాత్‌ ‌ప్రాంతాల చరిత్ర సమ్మేళనమే భారతదేశ చరిత్రగా చూడాలి అంటారాయన. చరిత్ర సాధారణ ప్రజలకు కూడా చేరాలని, తను ఈ పుస్తకం రాయడం వెనుక అసలు ఉద్దేశం అదేనని ఆయన చెప్పారు. ఆచార్య ఎస్‌.‌వి. శేషగిరిరావు మేధావిగా, రచయితగా, విశ్లేషకునిగా చిరపరిచితులు. ఏబీవీపీ విస్తరణకి, తరువాత బీజేపీలోను పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన రచనపై స్వీయాభిప్రాయాలను ఆయన జాగృతితో ముచ్చటించారు.

నమస్కారం మాస్టారు! ‘సంక్షిప్త భారతదేశ చరిత్ర- సంస్కృతి (వేదకాలం నుంచి 1947 వరకు’ ఇది ఇటీవలి మీ రచన. చరిత్రను పునర్‌ ‌మూల్యాంకన చేసుకోవాలి. లేదా ప్రతితరం చరిత్రను పునర్లిఖించుకోవాలి అన్న కీలక, వాస్తవిక దృక్పథాలే మీ రచనకు ప్రేరణ అనుకోవచ్చా?

పునర్‌ ‌మూల్యాంకన అనడం సరికాకపోవచ్చు. ఇప్పటిదాకా వచ్చిన చరిత్ర గ్రంథాలు రెండు రకాలు. ఒకటి- పాఠశాలలు, కళాశాలలకు; పాఠ్యప్రణాళికకు అనుగుణంగా విద్యార్థుల కోసం రాసినవి. రెండు- ఆధారాలతో, విశ్లేషించి రాసిన పరిశోధక గ్రంథాలు. కానీ సాధారణ ప్రజానీకం కూడా చరిత్ర చదువుకోవడం అవసరమని నాకనిపిస్తుంది. రామాయణ, భారతాలు, శతకాలు, శాస్త్రాలు వంటివి పాఠశాలలకు బయటే చదువుకుంటాం. అలాగే చరిత్ర, ఆర్థికశాస్త్రం వంటివీ సాధారణ ప్రజలు చదవవలసిన విజ్ఞానానికి సంబంధించిన అంశాలంటాను. ఆ విధంగా ఈ పుస్తకాన్ని సాధారణ పాఠకులను ఉద్దేశించి రాశాను.

ఇందులో నేను ప్రత్యేక దృష్టితో రాసిన అంశాలు ఉన్నాయి. వాటిని ఇతర చరిత్ర గ్రంథాల్లో చూడం.

అసలు భారతదేశం ఎందుకు పేదదైంది? చరిత్రలో అధ్యయనం చేయవలసినటువంటి ప్రధాన అంశాల్లో ఇది ఒకటి. చంద్రగుప్త మౌర్యుడు ఆస్థానంలో గ్రీకు రాయబారి ఉన్న మెగస్తనీస్‌ ‌రాసిన ‘ఇండికా’ అనే గ్రంథంలో భారతదేశంలో కరవులు రావు, పేదరికం ఉండదు అని రాశాడు. అనేక నదులు ఉన్నాయి. సారవంతమైన నేల ఉంది. మంచి పంటలు పండుతాయి. ప్రజలు  ఆరోగ్యకరమైన ఆహారం తింటారు అని కూడా రాశాడు. అలాంటి దేశంలో ఎందుకు పేదరికం వచ్చింది? అనేక కారణాలు కనపడుతున్నాయి. దాన్ని అర్థం చేసుకోవాలి.

ఇప్పటిదాకా వచ్చిన చరిత్ర గ్రంథాల రచనలో అనుసరించిన పద్ధతులు కొంతవరకు ఇందులో కనిపిస్తాయి. అయినా కొన్ని ప్రత్యేకతలు సుస్పష్టం. ఢిల్లీ కేంద్రంగానే భారతదేశ చరిత్రను నిర్మించడమనే ధోరణి ఈ పుస్తకంలో దాదాపు కానరాదు. శాతవాహన యుగం, కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యాల ఘనత గురించీ చెప్పారు.ఈ కోణం మీద ప్రత్యేక దృష్టిని పెట్టారు. దీని పరమార్ధం ఏమిటి?

సామాన్య శకం 1206 కంటే ముందు ఢిల్లీకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పౌరాణిక యుగంలో యావద్భారతానికి రాజధాని అయోధ్య. దేశంలో అదే ప్రధాన నగరం. భారత చరిత్రలో మొదటి రాజధాని స్థానం అయోధ్యదే అనాలి.ఆ తరువాత అంటే బుద్ధుడు, ఆజాతశత్రువు, నంద సామ్రాజ్యం కాలంలో పాటలీపుత్రం సుదీర్ఘకాలం రాజధానిగా వెలుగొందింది. తరువాత గంగాతీరంలో ఉన్న కనౌజ్‌ ‌కొంతకాలం రాజధాని హోదాలో ఉంది. పురాణాలలోనే హస్తిన పేరుతో పిలిచే నగరానికి ప్రాధాన్యం లేదు. తరువాత చారిత్రక ఆధారాలతో చెప్పుకునే, ఘోరీ దండయాత్ర తరువాతి కాలంలో, కుతుబుద్దీన్‌ ఐబక్‌ ‌తురుష్క రాజ్యం ఏర్పాటు చేసినపుడు, ఇస్లామిక్‌ ‌రాజ్యం ఆవిర్భవించినప్పుడు ఢిల్లీకి చరిత్రలో స్థానం వచ్చింది. కానీ భారతదేశ చరిత్ర అన్నప్పుడు ఉత్తర భారతమే కాదు, దక్షిణాదిన తమిళనాడు, కేరళ; పైన కశ్మీర్‌, అస్సాం, ఈ దిగువన ఒడిశా, గుజరాత్‌… ‌వీటన్నిటి చరిత్ర కలిపితేనే భారతదేశ చరిత్ర.

జాతీయ కాంగ్రెస్‌ ‌కంటే ముందే భారతభూమిలో గిరిజనోద్యమాలు, రైతాంగ పోరాటాలు ఆరంభమయ్యాయి. అవన్నీ కూడా ఆంగ్లజాతి దోపిడీకి వ్యతిరేకంగా సాగినవే కూడా. అయినా ఈ పుస్తకంలో వాటికి స్థానం కనిపించదు. కారణం ఏమిటి?

బ్రిటిష్‌ ‌వాళ్లకి వ్యతిరేకంగా స్థానికంగా అనేక చోట్ల చిన్న చిన్న పోరాటాలు జరిగాయి. బెంగాల్‌లో సంథాల్స్ ‌తిరుగుబాటు చేశారు. ముండాలు, కుకీలు, తమిళనాడు ప్రాంతంలోను జరిగాయి. కానీ గ్రంథం విస్తృతి కారణంగా కొంత పరిమితం చేశాను. ఒక్క రంప తిరుగుబాటును మాత్రమే లోతుగా చెప్పడానికి ప్రయత్నించాను. ఇది ఒక రకంగా లోపమే.

1857… చరిత్రలో అదొక మలుపు. కానీ వేర్వేరు పేర్లతో పిలిచారు. అంచనా వేశారు. పీసీ సేన్‌ ‌వంటి బ్రిటిష్‌ అనుకూల చరిత్రకారులు దానిని తిరుగుబాటు-రివోల్ట్- ‌కింద జమకట్టారు. సావర్కర్‌ ‌వంటి వారు అందులో భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ జాడను చూశారు. ఇక మీ పుస్తకంలో ఆ ఘట్టానికి తిరుగుబాటు అన్న శీర్షిక కింద చూడడం వింతే అనిపించింది.

మనం ఆ ఘటనను పూర్తిగా అవగాహన చేసుకుంటే మూడు రకాల దృక్కోణాలు కనిపిస్తాయి. ఒకటి- కంపెనీ సైన్యంలో హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. కలసే పని చేశారు. కలసే ఆంగ్ల సైనికాధికారులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. 2. సైనికులు మీరట్‌ ‌నుంచి ఢిల్లీకి వచ్చాక చివరి మొగల్‌ ‌పాలకుడు బహదుర్‌ ‌షా జఫర్‌ను చక్రవర్తిగా ప్రకటించారు. అది పోరును నీరుగార్చింది. 3. ఈ తిరుగుబాటు ఎక్కువగా మొగల్‌ ‌పాలన అవశేషాలు రోహిల్‌ఖండ్‌, అవధ్‌ ‌ప్రాంతం లోనే, జాగీర్దార్ల నాయకత్వంలో జరిగింది. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి, తాతియాతోపే, నానా, కున్వర్‌ ‌సింగ్‌ ‌పాత్ర గణనీయమైనది. కానీ దీని మీద చాలా గందరగోళం నెలకొంది. కంపెనీ నిష్క్రమిస్తే పాలకులుఎవరు? ఎవరి రాజ్యం వస్తుంది? అయితే మహనీయుడు సావర్కర్‌ అభిప్రాయాన్ని నేను కాదనను. కానీ వైరుధ్యాల దృష్ట్యా నేను ఉంచిన శీర్షిక సరైనదేనంటాను.

చరిత్ర మీద మీ దృష్టికోణం విభిన్నమైనది. చారిత్రక ఘటనల విషయంలో, వ్యాఖ్యానం విషయంలో మిగిలిన చరిత్రకారుల కంటే భిన్నంగానే మీ రచన కనిపిస్తుంది. కానీ సాధారణంగా భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర అంటే 1857 నుంచి 1905, 1905 నుంచి 1919, 1919 నుంచి 1947 వరకు- ఈ మూడు దశలలో చరిత్ర చెబుతారు. ఇందులో చివరి దశకు గాంధీయుగమని పేరు కూడా. కానీ మీరు గాంధీజీ చరిత్రకి ప్రత్యేక యుగమంటూ ఏదీ కేటాయించలేదు.

గాంధీజీ పోరాటంలోకి వచ్చిన నాటి నుంచి సామాన్య ప్రజలు పాల్గొనడం ఎక్కువగా జరిగింది. ఆయన స్వరాజ్య సమరం కోసం తీసుకున్న కొత్త పంథాలు ప్రజలను కదిలించాయి. ఆయన పోరాటంలోకి దిగిన నాటికే అనేక రకాలుగా భారత ప్రజానీకాన్ని కదిలించారు కూడా. విప్లవకారులు, ఇతర పంథాలవారు ఇందులో ఉన్నారు. ప్రతి ఒక్కరి పాత్ర స్మరణీయమే. స్వాతంత్య్రోద్యమానికి ముందే పునరుజ్జీవనోద్యమం ఉంది. రామ్మోహన్‌రాయ్‌, ‌దయానంద, రామకృష్ణ పరమహంస, వివేకానంద, జ్యోతిరావ్‌ ‌ఫూలే, నారాయణ గురు వంటి వారంతా హిందూ సమాజంలోని రుగ్మతల మీద పోరాడి జాగృతం చేశారు. ఆ దశలోనే గాంధీజీ నాయకత్వం వహించారు. నిజానికి గాంధీజీ నాయకుడైన తరువాత కూడా అనేక మంది విప్లవకారులు త్యాగాలు చేశారు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌పాత్ర చాలా గొప్పది. అయితే గాంధీ యుగం అని పిలవడం చాలా చిన్న విషయం.

About Author

By editor

Twitter
Instagram