జనవరి 26 శ్రీపంచమి

‘విద్వాన్‌ ‌సర్వత్ర పూజ్యతే..’ హితోక్తికి హేతువు సకలజ్ఞాన ప్రదాయిని సరస్వతీమాత. సురగురువు లాంటి అసామాన్యులు నుంచి సామాన్యుల వరకు ఆమె దయాలబ్ధపాత్రులే. మేధాశక్తి, విద్యాసంపద గల దేవతాగురువు బృహస్పతి విద్యాసిద్ధి కోసం వాణిని ఆశ్రయించారని కథనం. గురుశాపంతో విద్యలన్నీ కోల్పోయిన యాజ్ఞవల్క్య మహర్షి తిరిగి వాటిని పొందినా, అజ్ఞానిగా ఉన్న వ్యక్తి మహాకవి కాళిదాసుగా వినుతికెక్కినా, బోయవాడు ఆదికవి వాల్మీకిగా అవతరించి దివ్యభవ్య రామాయణం రాసినా వాగ్దేవి కరుణా కటాక్ష వీక్షణలే కారణం. సరస్వతిని భారతి, వేదమాత, వాగీశ్వరి, శారద, వాగ్దేవి వంటి పేర్లతో అభివర్ణిస్తారు. సామాన్య పరిభాషలో ‘చదువుల తల్లి’.

విద్యవల్ల జ్ఞానం, దాని ద్వారా భుక్తి, ముక్తి సిద్ధిస్తాయి. కేవలం చదవడం, రాయడమే (అక్షర జ్ఞానం) విద్యకాదు. మనిషిలోని వివేకం,కళలు, బుద్ధి(విచక్షణ) నైపుణ్యం/సృజన, విషయాల పట్ల అవగాహన, సమయస్ఫూర్తి వంటివీ చదువు కిందికే వస్తాయంటారు. ఈ సకల మేధో సంపదలకు ఆమెను అధిష్ఠానదేవతగా కొలుస్తారు.

సరస్వతీనది అంతర్వాహినిగా ఉన్నట్లే వాణీ ప్రసాదిత జ్ఞానసంపద వివేకవంతమైన జీవితానికి చుక్కానిగా నిలుస్తుంది. అఖిల విద్యావరదాయనిగా, జ్ఞానవల్లీ సముల్లాసినిగా సరస్వతీదేవి మాఘ శుద్ధ పంచమి (శ్రీ పంచమి) నాడు అభివ్యక్తమైందని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. సృష్టి నిర్మాణ నిర్వహణా శక్తులన్నిటిలో సర్వోత్కృష్ట మూలకారకశక్తి మహాసరస్వతి అని జగద్గురు ఆదిశంకర భగవ త్పాదులు ‘సౌందర్యలహరి’లో శ్లాఘించారు. తాము నెలకొల్పిన నాలుగు ఆమ్నాయపీఠాలలో దక్షిణా మ్నాయ శృంగేరి శారదా పీఠం మొట్టమొదటిది. తుంగాతీరంలో ప్రసవవేదన పడుతున్న కప్పకు తాచుపాము తన పడగ నీడలో ఆశ్రయమిచ్చిన దృశ్యం ఈ పీఠస్థాపనకు ప్రేరణగా చెబుతారు. లోకా నికి ప్రేమసుధలు పంచే విద్యానిలయంగా శంకరులు ఈ పీఠాన్ని స్థాపించారు. ‘ప్రణోదేవి సరస్వతి’ అని రుగ్వేదం, ‘సరస్వతీ శాస్త్రమయీ’ అని లలితా సహస్ర నామావళి శారదాంబ వైభవాన్ని కీర్తించాయి. ‘తెల్లని వస్త్రం ధరించిన సరస్వతీదేవి కాంతిమంత వదనంతో చల్లని చిరునవ్వు వెదజల్లుతుంటుంది. సత్త్వగుణ

ప్రధానంగా విరాజిల్లుతుండగా, బ్రహ్మాది దేవతలు ఆమెను కీర్తిస్తుంటారు’ అని (దేవీ భాగవతం) శ్రీ మహావిష్ణువు నారదమునికి వర్ణించి చెప్పారు. అనంతమైన అక్షర మహిమతోనే జ్ఞానం వెలుగులు విరజిమ్ముతుంది. అలాంటి జ్ఞానవేత్తలను సరస్వతీ అవతారంగా సంభావిస్తూ ‘పుంభావ సరస్వతులు’గా అభివర్ణిస్తారు.

ఈ జగత్తు ఒక దశలో నిస్తేజంగా, నిశ్శబ్దంగా మార డంతో ఆందోళన చెందిన దేవతలు విధాతను ఆశ్రయిం చగా, ఆయన తన దివ్య కమండలంలోని మంత్రపూరిత జలాన్ని భూమిపై చిలకరించాడట. దాంతో రెండు చేతులతో వీణ వాయిస్తూ, మరో రెండు చేతులలో జపమాల, పుస్తకాన్ని ధరించిన బ్రాహ్మీశక్తి ఉద్భవించిందని చెబుతారు. ఆమే విద్యల రాణి వాణి. ఆమె పంచమి నాడు అవిర్భవించారు కనుక ఆ రోజును ‘శ్రీపంచమి’ అంటారని పురాణాలు. శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శ్రీపంచమిని ‘మదన పంచమి’ అనీ అంటారు. శివుడు కోపాగ్నికి ఆహుతైన మన్మథుడు భార్య రతీదేవి ప్రార్థనతో తన రూపం ఆమెకు మాత్రమే కనిపించేలా వరం పొందిన రోజు ఇదేనని చెబుతారు. బౌద్ధులు దీనిని ‘మంజుపంచమి’గా పిలుస్తారు. సరస్వతి ఆరాధన సనాతన వైదిక ధర్మంలోనే కాకుండా బౌద్ధ జైనాలలోనూ కనిపిస్తోంది. బౌద్ధులు ‘మంజుశ్రీ’ పేరుతో, జైనులు ‘శ్రుతవదన’గా ఆమెను అర్చిస్తారు. రోమన్లు, గ్రీకులు శ్రీవాణిని ‘జ్ఞాన దేవత’గా ఆరాధిస్తారు.

 సరస్వతిని జ్ఞాన ఐశ్వర్య సౌభాగ్యశక్తుల ప్రతీకగా చెబుతారు. జ్ఞానం వల్ల ఐశ్వర్యం, ఐశ్వర్యం వల్ల సౌభాగ్యం, సౌభాగ్యం వల్ల జీవిత పరమార్థం సిద్ధిస్తాయని పెద్దలు చెబుతారు. వాణీ బ్రహ్మ స్వరూ పిణి. సర్వవిద్యలకూ అధి దేవత. ఆమె శక్తి వల్లనే ప్రాణులకు ఉలుకు, పలుకు సిద్ధిస్తున్నాయి. దీపం నుంచి కాంతి ప్రసరించి నట్లు అమెలోని చైతన్యం జగత్తంతా వెల్లివిరుస్తుంది

చదువుల తల్లిని నియమ నిష్ఠలతో ఆరాధించ డమే అక్షరాభ్యాసం. శ్రీపంచమినాడే కాకుండా శరన్నవరాత్రుల సందర్భంగా మూలా నక్షత్రం నాడు చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తారు. విద్యా సామగ్రిని అమ్మవారి సమక్షంలో ఉంచి ప్రత్యేకంగా అర్చించినా ప్రతినెలా మూలానక్షత్రం నాడు సరస్వతిని పూజించా లని, పాయసం, చెరకు రసం, ఆవుపాలు, అరటి

పళ్లు, చక్కెర, పటిక బెల్లం లాంటి సాత్విక పదార్థాలు నివేదించాలని పెద్దలు చెబుతారు.

వేదవ్యాస భగవానుడు ప్రతిష్ఠించిన నేటి తెలంగాణ రాష్ట్రంలోని బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయంలో పుష్య బహుళ పంచమి నుంచి మాఘ శుద్ధ అష్టమి వరకు పద్దెనిమిది రోజుల పాటు

శ్రీ పంచమి ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీపంచమి నాడు అమ్మవారికి మహాభిషేకం తరువాత పుష్పా లంకరణ కన్నుల పండువుగా ఉంటుంది.

‘శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి

వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే’

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram