– జ్యోతిర్మయి మళ్ల

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

మల్లిబాబు కళ్లు తెరిచాడు. సూర్యుడింకా పూర్తిగా పైకి రాలేదు. అతనికి ఎదురుగా చెరువూ ఆకాశం కలిసే చోటు బంగారంలా మెరిసిపోతూంది. ఆ బంగారమే నీటిమీద కురుస్తున్నదా? అన్నంత అందంగా కనపడుతున్నదతనికి. సూర్యుడు పూర్తిగా పైకి రాకుండా కళ్లు తెరవడం తప్పనుకున్నాడో ఏమో చెంపలేసుకుని మళ్లీ కళ్లు మూసుకున్నాడు. దణ్ణం పెట్టి లోపల్లోపల ఏదో గొణుక్కుంటూ అలాగే చాలాసేపుండిపోయాడు. వొంటికి తగులుతున్న గాలి చిన్నగా వేడెక్కినట్లనిపించి సూర్యుడు పైకి వచ్చాడని అనిపించి కళ్లు తెరిచి చూసాడు. ఎదురుగా ఆ పక్కా ఈ పక్కా చుట్టూ కలియచూసాడు. అతని ముఖంలో దిగులు, బాధ కాసేపు కనపడి దుఃఖం గా మారింది. చెరువు గట్టుమీద కూచుని కాసేపు తనివితీరా ఏడ్చాడు. నెమ్మదిగా కళ్లు తుడుచుకుని ఇంటికి బయల్దేరాడు.

మల్లిబాబు అనబడే మల్లేశ్వర్రావు పాతికేళ్ళ క్రితం పేరయ్య అనే ఒక పేద రైతు ఇంట్లో ఏకైక సంతానంగా పుట్టాడు. తెల్లగా ముద్దుగా బొద్దుగా పెరుగుతున్న పిల్లాడిని చూసి మురిసిపోయారు పేరయ్య దంపతులు. వారి సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు. పిల్లాడికి నడకొచ్చింది, పరుగొచ్చింది గానీ మాట రాలేదు. అర్థాలు లేని చిన్న చిన్న శబ్దాలు మాత్రమే చేస్తున్నాడు. పిలిస్తే పలుకుతాడు గానీ తమవేపు కాక ఎటో దిక్కులు చూస్తాడు. కొన్నాళ్లకి అర్థమయింది పిల్లాడు పెరుగుతున్నాడు గానీ అతని మెదడు పెరగడం లేదని. మల్లిబాబుకి పదేళ్లప్పుడు పేరయ్యకి మరో శాపంలా భార్య చనిపోయింది. మెదడు ఎదగని కొడుకు శరీరం మాత్రం ఎదుగుతూ ఉంటే దాని సంరక్షణ ఒంటిగాడయిన పేరయ్యకి కష్టం అయింది.

ఆ ఊరి హెడ్‌మాస్టారు గారబ్బాయి చంద్రశేఖర్‌ ‌సలహాతో అతని సహాయంతో పట్నం తీసుకెళ్ళి మానసిక దివ్యాంగుల స్కూల్లో చేర్పించాడు. తిండీ పడకా ఆటాపాట అన్నీ అక్కడే మల్లిబాబుకి ఆరోజు నుంచీ. వారానికోసారి చూడ్డానికొచ్చే నాన్నని గుర్తు పట్టి ఓ నవ్వు నవ్వేవాడు. తెచ్చిన మిఠాయిలవీ తీసుకుని పక్కనున్న పిల్లలందరికీ పంచి తానూ తినేవాడు. మెల్లిమెల్లిగా స్కూల్లో టీచర్లు చెప్పే మాటలూ, చేతలూ అర్థం చేసుకోవడం , వాళ్లు చెప్పినట్టు చేయడంతో కొన్నాళ్లకే మిగతా పిల్లలందరికన్నా ప్రత్యేకంగా తయారయ్యాడు.

ఆటలూ పాటలే కాదు చిన్నగా డాన్సు చేయడం, బొమ్మలు గీయడం తెలుసుకున్నాడు. అతనిలోని ఆసక్తిని గుర్తించి టీచర్లు ప్రోత్సహించారు. సినిమా హీరోల బొమ్మలు చూస్తే ఇష్టపడుతున్నాడనిపించి ప్రింట్లు తీయించి ఇచ్చారు. ఫొటోని ముందు పెట్టుకుని గీయడం మొదలుపెట్టాడు. గీస్తున్నంతసేపూ అతని దృష్టంతా బొమ్మ మీదే. పని పూర్తయేదాకా భోజనానికి కూడా లేవడు. పూర్తయాక తను వేసిన బొమ్మని చూసి పిల్లలంతా చప్పట్లు కొడితే మురిసి పోయేవాడు. అలా సరదాగా సంతోషంగా గడిచిపోయాయతని రోజులు చాలా కాలం వరకూ.

రెండేళ్ల క్రితం ఒకరోజు మల్లిబాబు జీవితంలో అతి పెద్ద విషాదం జరిగింది. అతన్ని ఇంటికి తీసుకొచ్చేసారు. పొలం నుండి అలసిపోయి ఇంటికొచ్చిన నాన్న తనని చూసి కళ్ల నీళ్లు తిప్పుకోడం తరుచూ అతని కంట పడుతున్నా అతనికేమీ అనిపించదు. ఏదో ఆలోచిస్తూ ఇంటిబయటకు చూస్తూ దిగులుగానే ఉంటాడు. అతనికున్న ఒకే ఒక ఆశాకిరణం తను గీసిన బొమ్మలు. అప్పుడప్పుడూ వాటిని నేల మీద వరసగా పేర్చి చూసుకుంటూ ఉంటాడు.

ఇంటికొచ్చిన మర్నాడే మల్లిబాబు తెల్లారకుండానే లేచాడు. చీకట్లో బయటికెళ్తున్న కొడుకుని ఆపే ప్రయత్నం చేసాడు గానీ అతన్ని అనుసరించడం తప్ప గత్యంతరం లేకపోయింది పేరయ్యకి. తిన్నగా చెరువు గట్టుకెళ్లి ఆగాడు మల్లిబాబు. సూర్యోదయం ఇంకా కాలేదు. కనుచూపు మేరలో కనిపిస్తున్న సూర్యుని వెలుగుని చూస్తూ నిలబడ్డాడు. కన్నార్పకుండా చూస్తున్నాడు అటేపే. అతని తండ్రికిదంతా ఆశ్చర్యంగా ఉంది.

సూర్యుడు పూర్తిగా పైకి వచ్చేదాకా అలాగే చూస్తూ నిలబడ్డాడు. తర్వాత అటూ ఇటూ చూసాక దిగులుగా గట్టుమీద కూచుని ఏడ్వసాగాడు. అడిగినా కారణం చెప్పని కొడుకుని చూసి కడుపు తరుక్కుపోయిన తండ్రి అతని కళ్లు తుడిచి ఇంటికి తీసుకెళ్లాడు. ఆరోజు నుండీ ప్రతిరోజూ అదే జరుగుతోంది. అర్థం కాకా, రోజూ వెళ్లి అంతసేపు ఉండలేకా తండ్రి ఇక వెళ్లడం మానేసాడు. మల్లిబాబుకి మాత్రం ఉదయపు సూర్యుడి దర్శనమూ, ఎదురుచూపూ, ఏడుపూ అన్నీ దినచర్య అయిపోయాయి. మిగతా రోజంతా పెట్టింది తినడం, బొమ్మలు చూడడం, నిద్రపోవడం తప్ప వేరే వ్యాపకం లేదతనికి. స్కూల్లో ఉన్నప్పుడున్న నవ్వు అతని ముఖంలో కనపడకపోవడానికి కారణం తెలీక అయోమయంతో రోజులు వెళ్లదీస్తున్నాడు పేరయ్య.

రెండేళ్లు గడిచిపోయాయలాగే..

ఒకరోజు మల్లిబాబు చెరువుగట్టు మీద కూచుని చేతుల్లో ముఖం పెట్టుకుని ఏడుస్తుండగా కంటబడ్డాడు ఉదయపు నడకకని అటేపొచ్చిన చంద్రశేఖర్‌. ‌మల్లిబాబుని గుర్తించి అతను ఏడుస్తుండడం చూసి కంగారుగా దగ్గరకొచ్చి తలమీద చెయ్యివేసి పలకరించాడు. పైకి లేచి నిలబడ్డాడు మల్లిబాబు. అతని నీళ్లు నిండిన కళ్లను చూస్తే అర్థమయింది అతని మనసు ఏదో వేదనతో నిండి ఉన్నదని. భుజమ్మీద చెయ్యివేసి ఎలా ఉన్నావు? ఏమిటి? అని కుశల ప్రశ్నలడు గుతూ అతనితో పాటు ఇంటి వరకూ వెళ్లాడు. చాన్నాళ్ళకి కనపడ్డారంటూ మంచం వాల్చి కూచోమని మర్యాద చేశాడు పేరయ్య. చంద్రశేఖర్‌ ‌విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడూ సొంత ఊరు వచ్చినా పేరయ్యకి కనపడడం తక్కువ. కొడుకు పరిస్థితిని చెప్పుకుని బావురుమన్నాడు. చిన్నగా నిట్టూర్చి ఇంకో నాల్రోజులు ఊళ్లోనే ఉంటాననీ, మళ్లీ వస్తాననీ చెప్పి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్‌.

‌మర్నాడుదయమే మల్లిబాబుననుసరించాడు చంద్రశేఖర్‌. అతని ప్రతి కదలికనూ గమనించాడు. కళ్లు తెరచి సూర్యుని చూడగానే తలతిప్పిచుట్టూ దేనికోసమో వెతకడం, నిరాశతో గట్టుమీద కూచుని ఏడవడం అతన్ని కదిలించింది. మల్లిబాబు లేచి వెళ్లాక కళ్లు మూసుకుని కూచున్నాడు. స్కూల్లో ఉన్నన్నాళ్లూ నవ్వుతూ తుళ్లుతూ ఉత్సాహంగా కనిపించే మల్లిబాబు ఇంటికొచ్చాక ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అని బాధగా ఉంది. ఇంకొన్నాళ్లీ కుర్రాడు అక్కడే ఉన్నా బావుండేది అనుకోగానే ఒక్కసారిగా అతనికి బోధపడింది మల్లిబాబు ప్రవర్తనకి కారణమేమిటో! వెంటనే పైకి లేచి మల్లిబాబు ఇంటివేపు కదిలాడతను.

అరుగు మీద కూచుని శూన్యంలోకి చూస్తున్నాడు మల్లిబాబు. దగ్గరగా వెళ్లి పక్కనే కూచుని పిలిచాడు చంద్రశేఖర్‌

‘‘‌మల్లీ!’’

పిలుపుకి బదులుగా ముఖం లోనికి చూసాడు గానీ తనని పోల్చుకున్నట్లుగా ఏమీ అనిపించలేదు చంద్రశేఖర్‌కి. పోల్చుకోవడం ముఖ్యం కాదు. అతని సమస్యకు కారణం తెలుసుకోవడం, పరిష్కరించడం ముఖ్యం అనుకుని మెల్లగా పక్కన కూచుంటూ అడిగాడు.

‘‘బొమ్మలేమన్నా గీసావా ఇంటికొచ్చాక?’’

లేదన్నట్లు తలూపాడు

‘‘స్కూల్లో గీసిన బొమ్మలు నీదగ్గరున్నాయా?’’

ఉన్నాయని తలూపి, లోనికెళ్లి ఒక ఫైలు తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. సుమారు ముప్పై దాకా ఉన్నాయి ఒక్కొక్కటిగా చూసాడు. వెంకటేష్‌, ‌బాలకృష్ణ, సల్మాన్‌ ‌ఖాన్‌, ‌శ్రీదేవి…. తెలుగు, హిందీ హీరో, హీరోయిన్ల బొమ్మలు..అచ్చు గుద్దినట్టుగా ఉన్నాయి అతను పెన్నుతో గీసిన రేఖాచిత్రాలు. ఎంత కళ ఉందీ ఈ కుర్రాడిలో ! అనుకుని

‘‘ఎలా వేశావ్‌ ఇవన్నీ?’’ అన్నాడు. అతని కుడిచేతి రెండు వేళ్లు కళ్ల వైపు పెట్టి చూపించాడు.

‘‘ఫొటోలు చూసి వేసావా?’’ అంటే అవునని తలూపాడు.

‘‘అవునా! చాలా బాగున్నాయి’’ అని కాసేపు ఆగి

‘‘అమ్మ బొమ్మ గియ్యగలవా?’’ అనడిగాడు అతని కళ్లల్లోకి చూస్తూ.

ఒక్క నిమిషం అలా కదలకుండా ఉండిపోయాడు మల్లిబాబు. ఏదో ఆలోచన వచ్చినవాడిలా చటుక్కున లేచి లోనికెళ్లి తెల్లకాయితం, పెన్నూ తెచ్చుకుని అరుగు మీద కూచున్నాడు. బొమ్మ గీస్తున్నాడు శ్రద్ధగా. అతని చేతి కదలికల్ని ఆసక్తిగా చూస్తున్నాడు చంద్రశేఖర్‌. ‌జరుగుతున్నది అర్థం కాక వింతగా చూస్తున్నాడు పేరయ్య.

అరగంట తర్వాత ఆగింది మల్లిబాబు చెయ్యి.

అద్భుతం! అచ్చు గుద్దినట్టు అచ్చంగా అలాగే..అమ్మ ఎలా ఉండేదో అలాగే కనిపించింది కాయితం మీద అమ్మ!!

మల్లిబాబు ఆశ్చర్యపోయాడు. అర్థం కానివాడిలా చంద్రశేఖర్‌ ‌వేపు అయోమయంగా చూసాడు.

‘‘ఫొటో లేకుండా ఎలా వెయ్యగలిగావనా?’’ అన్నాడు. అవునని తలూపాడు. అమ్మ బొమ్మవేపు అపురూపంగా చూసుకుంటూ. అతని కళ్లు నీళ్లు చిమ్ముతున్నాయి.

‘‘అమ్మ నీ గుండెలోనే ఉంది’’ అన్నాడు అతని గుండెమీద చేత్తో తడుతూ. నీళ్లు నిండిన మల్లిబాబు కళ్లు మెరిసే జలపాతాల్లా ఉన్నాయి. అమ్మ బొమ్మని ఆప్యాయంగా తడుముతూ చంద్రశేఖర్‌ ‌వేపు చూసి నవ్వాడు. సంతోషంగా అతని తల నిమిరి అరుగు దిగాడు చంద్రశేఖర్‌. అయోమయంగా చూస్తున్న పేరయ్యతో అన్నాడు

‘‘ఇంకేం దిగుల్లేదు..చెరువు గట్టుకిక వెళ్ళడు.. దిగులుగా ఉండడు.. కళ్ల నీళ్లు పెట్టుకోడు’’

బొమ్మని చూసి పోల్చుకున్నాడు గానీ కొడుకు ఆ బొమ్మ ఎలా గీసాడో, ఇక నుండీ అతని బాధకి తెర పడుతుందని చంద్రశేఖర్‌ అం‌త నమ్మకంగా ఎలా చెబుతున్నాడో అతనికి అర్థం కాలేదు.

పేరయ్య చేతులు పట్టుకుని ధైర్యం చెప్పి మల్లిబాబు గీసిన బొమ్మలోని అమ్మని తల్చుకుంటూ గుండె భారమవగా అక్కడ్నించి కదిలాడు చంద్రశేఖర్‌. ‌వెళ్తున్న అతన్ని చూస్తే కొడుకు బ్రతుకులో మార్పు వస్తుందనే ఆశ చిగురించింది పేరయ్య మనసులో. అతని ఆశ అడియాస కాలేదు.

ఇప్పుడు మల్లిబాబు తండ్రితో పొలానికి వెళ్తున్నాడు. ఇంటి పనులన్నీ తానే చేస్తున్నాడు. ఊళ్లోవాళ్లెవరైనా ఫొటో ఇచ్చి బొమ్మ గియ్యమంటే రాత్రపుడు కూచుని గీసి వందా యాభై సంపాదిస్తున్నాడు. రోజు సంతోషంగా గడుస్తోందిప్పుడతనికి. తండ్రి పేరయ్యకు మాత్రం ఇప్పటికీ అర్థం కాలేదు బొమ్మ గియ్యడానికీ, కొడుకు దుఃఖానికి తెర పడడానికీ కారణమేమిటో! అతనికి తెలీని విషయం , మల్లిబాబుకీ చంద్రశేఖర్‌కీ మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే..

మానసిక వికలాంగుల సంరక్షణ కోసం గుడి లాంటి బడినొకటి నిర్మించి అహర్నిశలూ శ్రమించి వేలాది చిన్నారులకు అమ్మగా నిలిచింది ఒక స్త్రీమూర్తి. సుమారు పదేళ్ల కాలం మల్లిబాబుని కన్నతల్లిలా కన్నుల్లో పెట్టుకుని ప్రేమనందించింది ఆ అమ్మే! ఆ అమ్మదే మల్లిబాబుగీసిన బొమ్మ. మతి లేని మాంసం ముద్దలాంటి అతన్ని మనిషిలా తీర్చిదిద్దిన ఆ అమ్మదే అతని గుండెలో నిక్షిప్తం చేసుకున్న రూపం! గుండెలో దాగిన ప్రేమ వేళ్లను కదిలించగా కాగితం మీద బొమ్మగా మారిన ప్రతిరూపం!

స్కూల్లో ఉన్నన్నాళ్ల• ప్రతిరోజూ సూర్యోదయం కాకముందే ఆ అమ్మ తనతో పాటూ మల్లిబాబునీ సముద్రం ఒడ్డుకి తీసుకెళ్లేది. ఆమె చెయ్యి పట్టుకుని ఇసుకలో నడుస్తూ వెళ్లడం అతనికి ఎంతో బావుండేది. తను ఎక్కువ దూరం నడవలేడని ఒకచోట కూచోబెట్టి తను వెళ్లేది. కాసేపటికి బంగారు కిరణాలు వెదజల్లుతూ పైకి వస్తున్న సూర్యుడితో పాటుగా తానూ ఎదురుగా వస్తూ ప్రత్యక్షమయ్యేది. ఈ సన్నివేశం తరుచుగా అటువేపే ఉదయపు నడకకి వెళ్లే చంద్రశేఖర్‌ ‌కంట కూడా పడుతుండేది.

ప్రతి ఉదయం మల్లిబాబులో ఆనందోత్సాహాలను నింపే ఆ వెలుగు ఒక ఉదయాన అస్తమించింది.

ఆ అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది. అక్కడున్న పిల్లలందరి కన్నా మల్లిబాబే అమ్మకి బాగా దగ్గరయినవాడు. బాధని బయటపెట్టుకోగలిగే తెలివి ఉన్నవాడు.

అమ్మ ఇక లేదనే నిజాన్ని అతను తట్టుకోలేడని ఆ విషయం అతనికి చెప్పకుండా ఇంటికి పంపించారు.

మల్లిబాబు దృష్టిలో అమ్మ ఎక్కడికీ పోలేదు…

అతనిగుండె చప్పుడై అతన్ని నడిపిస్తూ ఉంది.

కాంతిపుంజమై అతనికి లోలోపల కనిపిస్తూనే ఉంది!

About Author

By editor

Twitter
Instagram