– బంకించంద్ర చటర్జీ

4

ఉత్తర వంగదేశం ముసల్మానుల చేజారి పోయింది. కాని వారు పైకి దీనిని యథాతథంగా అంగీకరించకుండా, అక్కడ ఏదో తిరుగుబాటులు చెలరేగుతున్నట్లూ, తాము ఆ తిరుగుబాటుదారులను, దేశద్రోహులను నాశనం చేస్తున్నట్లూ నటిస్తున్నారు. ఇంతలో వారన్‌ ‌హేస్టింగ్స్ ‌కలకత్తాకు గవర్నర్‌ ‌జనరల్‌గా వచ్చాడు. అతడీ విషయాన్ని కూలం కషంగా తెలుసుకోదలిచాడు. ఎడ్వర్డ్ అనే సేనాపతిని తీసుకుని తానే స్వయంగా వచ్చాడు.

ఎడ్వర్డ్ ‌పరిస్థితిని గమనించాడు. శత్రువులకు సేన లేదు. నగరం లేదు. రాజధాని లేదు. దుర్గం అంతకన్నా లేదు. కాని, ఇన్ని లేకపోయినా దేశమంతా వారి అధీనంలో ఉంది! ఒక ప్రదేశాన్ని ఇవాళ బ్రిటిష్‌ ‌సేనలు ఆక్రమించుకున్నప్పటికి మరురోజు ‘వందే మాతరం’ అనేపాట దిగంతాలకు వ్యాపిస్తూ ఉంది. దేశీయ రాజ్యాన్ని బలపరుస్తూ ఉంది.

ఎడ్వర్డ్ ‌విచారణకు సమాధానంగా పదచిహ్నమనే గ్రామంలో సంతానులకు కోట ఉన్నదనీ, అక్కడే కావలసిన అస్త్రశస్త్రాలు తయారవుతున్నాయనీ భోగట్టా తెలిసింది. కాబట్టి ఈ కోటను ముట్టడించ డమే తక్షణ కర్తవ్యమని ఎడ్వర్డ్ ‌దొర భావించాడు.

గుప్తచారుల ద్వారా పదచిహ్నంలో ఎందరు సైనికులు ఉన్నారు, వారు ఏమేం చేస్తుంటారు వంటి సమాచారం సేకరిస్తూ పోయాడు ఎడ్వర్డ్. అతడి మనసులో అప్పుడే ఒక యుద్ధతంత్రం నిర్మాణ మవుతోంది.

మాఘ పూర్ణిమ రానున్నది. దీనికి, సంతానులు ఎన్నో వేడుకలు చేసుకుంటారు. దాదాపు లక్షమంది జనాభా ఒకచోట చేరుతారు. ఈ వేడుకలకు. ఈమారు వైష్ణవరాజ్యం స్థాపితం అయింది గనుక, మరింత కన్నుల పండువగా, ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవాలని సంతానులు భావిస్తున్నారు.

సంతానులు ఈ వేడుకలలో నిమగ్నులై ఉండగా, తాను పదచిహ్నంలో కోటను ముట్టడించాలని ఎడ్వర్డ్ ‌సంకల్పించుకున్నాడు. ఉత్సవాలు జరగకుండా అటకాయిస్తామని ఎడ్వర్డ్ ‌ప్రకటన కూడా చేశాడు.

ఇవన్నీ జరగడానికి ముందే జీవానందుడు, శాంతి పదచిహ్నం నుండి బయటకు వచ్చారు. వారికి యుద్ధాన్ని గురించి ఎటువంటి ఆలోచన లేదు. మాఘ పౌర్ణమి వేడుకలు ఎలా, ఎంత అందంగా జరుపు కోవాలా అనే వారు యోచిస్తున్నారు. కాని ఈ యుద్ధప్రకటన విని జీవానందుడు కృత నిశ్చయుడు అయినాడు.

కొండ మీద నుండి చూస్తే, ఆంగ్లేయుల శిబిరాలు కనిపిస్తున్నాయి. సంతానులు అందరూ ‘వందేమాతరమ్‌’ ‌పాడుకుంటున్నారు.

5

శాంతి, జీవానందులు ఏదో ఆలోచిస్తున్నారు. జీవానందుడు ఒకదారి గుండా అరణ్యంలోనికి వెళ్లాడు. శాంతి మరోమార్గం గుండా వెళ్లింది.

శాంతి తాను మరణించబోతున్నాననీ, అందుచేత ఇప్పుడు సహజమైన స్త్రీ వేషంలోనే వుండాలనీ అనుకుంది.

శాంతి వైష్ణవి వలె వేషం వేసుకుని ఆంగ్లేయుల శిబిరాల చుట్టూ తిరుగుతోంది.

కొందరు సిపాయిలు ఆమె వెంట నడుస్తున్నారు. వారిలో కొందరు ‘‘అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తూ ఉండు’’ అన్నారు.

వైష్ణవి ‘‘మా ఇల్లు చాలదూరం’’ అంది. ‘‘ఎంతదూరం?’’ అన్నారు ఇంగ్లీషు సిపాయిలు.

‘‘పదచిహ్నంలో ఉంది.’’

 పదచిహ్నం అనే మాట వినబడడంతోటే ఈ కబురు సేనాపతి దగ్గరకు వెళ్లింది.

సేనాపతి దగ్గరకు వెళ్లి వైష్ణవి ఒక మధుర కటాక్ష వీక్షణం విసిరింది. సేనాపతి ఉక్కిరిబిక్కిరి అయినాడు. ‘‘ఏమి బీబీ! నీదేవూరు?’’ అని అడిగాడు. ‘‘నేను బీబీని కాదు, వైష్ణవిని! నా ఊరు పదచిహ్నంలో ఉంది.’’ ‘‘పదచిహ్నంలో ఇల్లు ఉందా?’’

‘‘చాల ఇళ్లు ఉన్నాయి.’’

‘‘మామూలు ఇళ్లు కాదు కోట, యుద్ధం సామగ్రులు దాచుకునే పెద్ద కోట ఉంది.’’

‘‘అక్కడ ఎంతమంది ఉన్నారు?’’

‘‘ఇరవై ఇరవయైదు వేలమంది ఉంటారు.’’

‘‘నీ ముఖం! కోటలో రెండు మూడు వేలకంటె ఉండలేరు. ఇప్పుడు వారంతా అక్కడే ఉన్నారా?’’

‘‘ఇంకెక్కడికి వెడతారు?’’

‘‘ఉత్సవానికి.’’

‘‘నీవు ఉత్సవానికి ఎప్పుడు వచ్చావు?’’ ‘‘నిన్న!’’ ‘‘అయితే వాళ్లు ఇవాళ వెళ్లిపోయారేమో!’’

శాంతి మనసులో ‘నీ తండ్రి శ్రాద్ధానికి ఎసరు పెట్టకపోతే నావేషం అంతా వృధా అయిపోదూ!’ అనుకుంది. పైకి ‘‘అయ్యా! అలా జరిగినా జరగ వచ్చును. ఇవాళ్టి మాట నాకు తెలియదు. మీరు చూచి రమ్మంటే అక్కడికి వెళ్లి, ఎల్లుండి మీకు ఏ కబురూ తెస్తాను’’ అంది.

‘‘ఎల్లుండిదాకా ఆగలేను.’’

‘‘చాలదూరం.’’

‘‘ఇవాళ రాత్రికే నాకు కబురు చేరాలి! నీకు వందరూపాయలు బహుమానం ఇస్తాను.’’

‘‘నడవలేను.’’

‘‘గుర్రం మీద వెళ్లు.’’

‘‘సవారీ రాదు.

‘‘నేను ఎక్కించుకు వెడతాను.’’

‘‘నాకు సిగ్గు!’’

‘‘నూరు రూపాయలు బహుమానం!’’

‘‘ఎవరు వస్తారు? నీవేనా?’’

సేనాపతి ఎదురుగా ‘లిండ్లేను చూపి ‘‘ఇతడు!’’ అన్నాడు.

‘‘పద’’ అంది శాంతి.

కొంతదూరం లిండ్లే గుర్రం మీద వెళ్లాడు. శాంతి పరుగు తీస్తోంది వెనకనే. నగరవీధులు దాటాక గుర్రం ఎక్కింది. అశ్రద్ధగా, బేఫరవాగా సవారీచేస్తున్న లిండ్లేను గుర్రం మీదనుంచి కిందికి దొర్లించి తను గుర్రాన్ని అతి వేగంగా పరుగెత్తించింది.

జీవానందుడిని కలుసుకుని సమాచారమంతా నివేదించింది. అతడు సత్యానందుని వద్దకు పరుగెత్తాడు.

ఇలా ఇద్దరూ రెండు దారులతో వెళ్లారు మళ్లీ. ఈమారు శాంతి నవీనానందుని రూపం ధరించింది.

6

ఎడ్వర్డ్ ‌పక్కా ఆంగ్ల జనరల్‌. ‌లిండ్లీ వెనక పరిశీలకులను పంపాడు. వారు వచ్చి శాంతి చేసిన మోసాన్ని ఆయనకు నివేదించారు.

‘‘శిబిరాలు కొల్లగొట్టండి. సంతానులను చంపి వేయండి’’ అని ఆజ్ఞ ఇచ్చాడు సేనాపతి ఎడ్వర్డ్.

‌సంతానులు ఉత్సవాల ఏర్పాటులో మునిగి తేలుతున్నారు. మహేంద్రుడు వారినందరినీ ఉత్సవ మార్గంలో నడిపించుకు వెడుతున్నాడు. వారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా జీవానందుడు వచ్చి ‘‘ఆ గుట్ట ఎక్కి చూడండి’’ అన్నాడు.

కొందరు చూశారు. ఆంగ్లేయుల సేన, యుద్ధ సన్నాహం అగుపించాయి.

‘‘ఈ గుట్ట ఎక్కి ఈ చంద్రకాంతిలో శత్రుసేనతో తలపడాలి మనం’’ అన్నాడు జీవానందుడు.

సంతానులంతా ఆయుధాలు చేతబూనారు.

‘హరే మురారే’ పాట దిగంతాల వ్యాపించింది.

జీవానందుడు మహేంద్రునకు ఎదురుగా నిలిచి ‘‘ఈ రోజు అంతిమదినం అనుకుంటున్నాను. ఇక్కడే చనిపోతాను’’ అన్నాడు. .

‘‘చావుతోనే విజయం సంభవించేట్లయితే అలాగే చేద్దాం. అనవసరంగా మరణించడం వీరధర్మం కాదు.’’

‘‘నేను వ్యర్ధంగానే మరణిస్తాను. అయితే యుద్ధం చేస్తూ చనిపోతాను’’ అంటూ జీవానందుడు ‘‘సోదరులారా! భగవంతుని పేరిట చెప్పండి, మృత్యువును కౌగలించుకుందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు?’’ అన్నాడు.

అనేకమంది సంతానులు ముందుకు వచ్చారు. జీవానందుడు ‘‘బొందిలో ప్రాణం వుండగా వెను దిరగబోమని ఈశ్వరుని ఎదుట ప్రమాణం చేయండి.’’

ఎవరూ ముందుకు రాలేదు. వెనక్కు తగ్గారు.

‘‘ఎవరూ రారా? అయితే నేను ఒక్కడినే వెడుతున్నాను.’’

జీవానందుడు గుర్రంపైని కూర్చుని ముఖం వెనక్కు తిప్పి మహేంద్రునితో ‘‘సోదరా! నవీనా నందుని కలుసుకోవడం తటస్థిస్తే నేను చనిపోయినాననీ, పర లోకంలో కలుసుకుంటానని చెప్పు’’ అన్నాడు.

‘‘హరే మురారే! హరే మురారే!’’ అంటూ జీవానందుడు శత్రుసేనలో ప్రవేశించాడు.

ఘోరమైన రణం జరిగింది. సంతానులు జయం పొందారు. ‘హరే మురారే! హరే మురారే!’ అంటూ లక్షమంది సంతా నులు ఆంగ్ల సైనికులం దరినీ చంపి వేశారు. ఆఖరుకు తిరిగి వెళ్లి వారన్‌ ‌హేస్టింగ్స్‌కు కబురు చెప్పటానిక్కూడా ఒక్క ఆంగ్ల సిపాయి మిగలలేదు.

పూర్ణిమ నాటి రాత్రి. రణరంగంలో యుద్ధం ముగిసింది. విగతజీవులు గుట్టలుగుట్టలుగా పడివున్నారు.

అర్ధరాత్రి సమయంలో ఒక స్త్రీ ఈ శవాలను పరిశీలిస్తూ తిరుగుతోంది ఆమె శాంతి! జీవానందుని శవం కోసం వెదుకుతోంది.

ఆమెకు ఎక్కడా అగుపించలేదు.

ఏడుస్తూ నేలమీద కూర్చుండిపోయింది.

ఎవరో పలుకరించారు. ‘‘ఎందుకమ్మా ఏడుస్తావు? రా, నేనుకూడా సహాయం చేస్తాను.’’

ఇలా అని ఆ మహాపురుషుడు శాంతితోపాటు రణక్షేత్రంలోని శవాలను పరిశీలించాడు.

ఒక గుట్టలో నుంచి అట్టడుగు శవాన్ని వెలికి తీశాడు. జీవానందుని శవాన్ని గుర్తించింది శాంతి.

శాంతి సాధారణ స్త్రీలాగ రోదించడం మొదలు పెట్టింది.

‘‘ఏడవకమ్మా! జీవానందుడు చనిపోయాడా? చూడు, శాంతంగా అతని శరీరం పరికించి చూడు. నాడి పరీక్షించు’’ అన్నాడు ఆ మహాపురుషుడు.

శాంతి నాడి పరీక్షించింది. ఎక్కడా జాడలేదు.

‘‘గుండె కొట్టుకుంటోందేమో చూడు.’’

శాంతి హృదయంపై చేయివేసి చూచింది. చల్లగా ఉంది. ఏమీ కదలిక లేదు.

‘‘ముక్కు దగ్గర వేలు పెట్టి చూడు. ఏమైనా శ్వాస ఆడుతోందేమో!’’

ఆడడంలేదు.

మహాపురుషుడు తిరిగి ఇలా అన్నాడు : ‘‘ముఖంలో ముఖం పెట్టి చూడు. కొద్దిగానైనా వేడిగా ఉందేమో!’’

శాంతి అలాగే చేసింది. ఏమీ అగుపించలేదు.

మహాపురుషుడు తనచేతితో శవాన్ని నిమిరాడు. ‘‘నీవు గాబరాపడి హతాశురాలవై చూచావు కాని ఇప్పుడు చూడు. శరీరం వెచ్చగా ఉంది.’’

శాంతి నాడి పరిశీలించింది. ఆశ్చర్యం! సన్నగా నాడి ఆడుతోంది. గుండె నీరసంగా కొట్టుకుంటోంది. శాంతి విస్మితురాలై ‘‘ప్రాణం ఉన్నదా? లేక పోయి వచ్చిందా?’’ అని అడిగింది.

‘‘అదీ జరుగుతుందిగాని అమ్మా! ఇతడిని చెరువు దగ్గరకు మోసుకురా. శవాన్ని కడిగివుంచు. నేను చికిత్స చేస్తాను’’ అన్నాడు ఆ మహాపురుషుడు.

శాంతి అలానే చేసింది.

మహాపురుషుడు కొన్ని లతల రసం పిండి దానిని జీవానందుని శరీరానికి పులిమాడు.

జీవానందుడు కొన్ని క్షణాలలో లేచి కూర్చున్నాడు. శాంతిముఖం చూచీ చూడడంతోటే ‘‘యుద్ధంలో విజయం ఎవరిది?’’ అని ప్రశ్నించాడు.

‘‘మీదే! ముందు ఈ మహాత్మునకు ప్రణామం చేయండి.’’

కాని అక్కడ ఎవరూలేరు. ఎవరికి ప్రణామం చేయాలి? ఆ మహాపురుషుడు అప్పుడే అంతర్ధానం అయినాడు.

సమీపంలో సంతాన సేన విజయోల్లాసం విని పిస్తోంది. జీవానందుడు, శాంతి, ఇద్దరిలో ఎవరూ లేచి నిలబడలేదు. ఇద్దరూ విమలజ్యోత్స్నలో పుష్కరిణి ఒడ్డున కూర్చున్నారు. జీవానందుని శరీరం అద్భుత సేవనం వల్ల యథాతథంగా తయారయింది. కనీసం అలసట అయినా అనిపించడం లేదు అతడికి.

‘‘శాంతీ! ఇక మనం సంతానుల వేడుకలో పాల్గొందాం’’ అన్నాడు జీవానందుడు.

‘‘ఇప్పుడు అక్కడికి పోనక్కరలేదు. మాత కార్యోధరణ అయిపోయింది. ఇప్పుడు దేశమంతా సంతానుల స్వాధీనంలో ఉంది. మనం ఇప్పుడు అక్కడకు వెళ్లి ఏం చేయాలి?’’ అంది శాంతి.

‘‘మన బాహుబలంతో జయించుకున్నదానిని పరిరక్షణ చేసుకోనవసరం లేదా ?’’

‘‘ఆ పని చేయడానికి మహేంద్రుడు ఉండనే ఉన్నాడు. మీరు ప్రాయశ్చిత్తం చేసి సంతాన ధర్మంకోసం ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు తిరిగి ప్రాప్తించిన ఈ ప్రాణంపైన సంతానుల అధికారం ఏమీలేదు. మనం సంతానుల కోసం చనిపోవడం జరిగి పోయింది. సంతానులు ఇప్పుడు మనను చూచినా, ప్రాయశ్చిత్తం అంటే భయంచేత ఇలా పారిపోయి వచ్చారు అనుకుంటారు. ఇప్పుడు విజయం చేకూరింది గనుక రాజ్యంలో వాటాకోసం వచ్చారు అనుకుంటారు.’’

‘‘ఇదంతా ఏమిటి శాంతీ! లోకులు ఏదో అనుకుంటారని మన కర్తవ్యం మనం మానుకుం టామా? నా పని మాతృసేవ. నేను మాతృసేవలోనే నిమగ్నుడనై ఉంటాను. ఇతరం ఏమీ చేయను.’’

‘‘మాతృసేవలో మీరు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు మీకు తిరిగి వచ్చిన ప్రాణం మీదికాదు. మీరు తిరిగి మాతృసేవ చేయాలనుకుంటే, చేసుకున్న ప్రాయశ్చిత్తం యేమయిపోతుంది?’’

‘‘నీవు చెప్పింది బాగానే ఉంది. కాని నాడు సంతాన ధర్మాన్ని అనుసరించ డంలోనే సుఖం ఉంది. మాతృసేవ వదలి ఇంటికి వెళ్లి సుఖభోగాలు అనుభవిస్తూ కూర్చోలేను.’’

‘‘నేను చెప్పేది అదికాదు. ఇప్పుడు గృహస్థుల మయిపోదామని నేను అనడంలేదు. మనమిద్దరమూ సన్యాసులంగానే ఉండిపోదాం. బ్రహ్మచర్య వ్రతాన్నే అనుసరిద్దాం. దేశ పర్యటన చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించుకుందాం’’

‘‘తరువాత?’’

‘‘హిమాలయాలలో ఒక కుటీరం నిర్మించుకొని, ఇద్దరమూ దేవతారాధనలో నిమగ్నులమవుదాం. మాతృదేవతకు మంగళం పాడే వరం పొందుదాం’’

ఇద్దరూ లేచి చెట్టపట్టాలు వేసుకుని నడుస్తూ జ్యోత్స్నామయమయిన ఆ చీకటి రాత్రిలో మాయ మయిపోయినారు.

హా మాతా! నీ కడుపున జీవానందుని వంటి కుమారుడు, శాంతి వంటి కుమార్తె తిరిగి ఎప్పుడు ఉద్భవిస్తారు?

సత్యానందస్వామి రణక్షేత్రం నుండి ఎవరికీ ఏమీ చెప్పకుండా ఆనంద మఠానికి చేరుకున్నాడు. ఆ గంభీరమైన పౌర్ణమిరాత్రి విష్ణు మండపంలో కూర్చుని ధ్యానమగ్నుడయినాడు. ఆ సమయంలో జీవానందు నకు చికిత్స చేసిన మహా పురుషుడు అక్కడకు వచ్చి ఆయనకు దర్శనమిచ్చాడు. సత్యానందుడు ఆయనకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ‘‘సత్యానందా! నేడు మాఘపౌర్ణమి!’’

‘‘నేను సంసిద్ధంగానే ఉన్నాను. కాని మహాత్మా! నాకు ఒక సందేహం మాత్రం తీరకుండా ఉంది. సంతాన ధ్వజం స్థాపించవలసిన ఈ సమయంలోనే నాకు ప్రాణత్యాగం ఎందుకు ప్రాప్తిస్తోంది?’’

7

‘నీవు చేయవలసిన పని పూర్తి అయింది సత్యానందా! నీవిక ఇక్కడ చేయవలసింది లేదు. ఆంగ్ల రాజ్యం ఇక్కడ సుస్థాపితమయిపోయింది.’’

సత్యానందుడు కన్నీరు కారుస్తున్నాడు.

జన్మభూమిని తలుచుకుని ‘‘ఆహా! మాతా! ఉద్ధరణ మార్గం చూపలేక పోయినాను. నీవు తిరిగి మ్లేచ్చులపాలిట పడినావా? సంతానుల అపరాధా లను క్షమించమ్మా! రణక్షేత్రంలోనే నాకు చావు ఎందుకు రాలేదు?’’ అన్నాడు సత్యానందుడు.

మహాత్ముడు ఇలా చెప్పాడు : ‘‘సత్యానందా! నీవేమీ చింతపడకు. నీవు బుద్ధి విభ్రమం చేత, దస్యు వృత్తివల్ల ధనార్జనచేసి రణంలో విజయం సాధిం చావు. పాపానికి ఎప్పుడూ పుణ్యఫలితం రాదు. అందుచేత నీ మనుష్యులు ఎన్నటికీ దేశాన్ని ఉద్ధరించ లేరు. ఇప్పుడు జరిగిన పని బాగానే ఉంది. ఆంగ్లే యుల రాజ్యం వస్తే తప్ప, సనాతన ధర్మం యిక్కడ పునః స్థాపితం కాదు. ముప్పది మూడు కోట్ల దేవతలను పూజిస్తూ ఉండడమే సంతాన ధర్మం కాదు. హిందూ ధర్మం అనేది లుప్తమయింది. ప్రాకృత హిందూధర్మం జ్ఞానాత్మకమైనది. కార్యాత్మకమైనది కాదు. అంతర్విషయకమయిన జ్ఞానం, సనాతన ధర్మానికి ప్రధానమయినది. ముందు బహిర్విష యముల జ్ఞానం కలిగితే తప్ప అంతర్విషయముల జ్ఞానం సిద్ధించదు. సనాతన ధర్మం ప్రచారానికి రావాలంటే ముందు బహిర్విషయమైన జ్ఞానం ప్రచారం కావాలి. ఆంగ్లేయులు ఈ జ్ఞానంలో ప్రకాండ పండితులు. వీరు లోకశిక్షా పటిష్ఠులు. అందుచేత ఆంగ్లేయుల రాజ్యం వచ్చేట్లయితే, హిందు వులు జ్ఞానవంతులు, గుణవంతులు, వీర్యవంతులు అవుతారు. అప్పుడు సనాతన ధర్మం తనంతట తానే వికసించుతుంది. అందుచేత నీవింక ఏమీ సందేహం పెట్టుకోక నాతో రా!’’

సత్యానందుడు ‘‘మహాత్మా! ఆంగ్లేయులను రాజులు చేసేట్లయితే, ఈ నరహింసా కార్యక్రమంలో మమ్మల్ని ఎందుకు నియుక్తులను చేశావు?’’ అని అడిగాడు.

‘‘ఆంగ్లేయులు ఇప్పుడు కేవలం వర్తక వ్యాపారాల లోనే మునిగివున్నారు. వారికి రాజ్యకాంక్ష కలిగించ టానికి మిమ్ము నియుక్తులను చేశాం. రాజదండం ఆంగ్లేయులకు రావడం కోసం సంతానులు ఇన్నాళ్లు పనిముట్లుగా ఉండి పోరాడారు. నీకు దివ్యచక్షువులు ప్రసాదిస్తున్నాను. వీటితో చూచి ఇంకా అనేక సంగతులు తెలుసుకో!’’

‘‘జ్ఞానప్రాప్తిలో నాకు ఇంకేమీ కోరికలు లేవు. నేను ఏ వ్రతాన్ని స్వీకరించానో దానినే పాలిస్తాను. నా మాతృభక్తి అచలంగా ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి.’’

‘‘అది సఫలం అయిపోయింది. నీవు మాతృ సేవకు మంగళకరమైన సేవచేశావు. ఆంగ్ల రాజ్యం నీవల్ల స్థాపితమయింది. యుద్ధ విగ్రహాలను విడిచి పెట్టు. కృషిలో నియుక్తుడవవు. పృధ్వి సస్యశ్యామలం అవుతుంది. జనుల ఐశ్వర్యం వృద్ధి అవుతుంది.’’ ,

సత్యానందుడు కళ్లనీళ్లు తుడుచుకుంటూ ‘‘శత్రు రక్తంతో నిండిపోయింది మాతృదేశం’’ అన్నాడు.

‘‘ఇప్పుడు శత్రువులు ఎవరు? శత్రువులు అంటూ ఎవరూ లేరు. ఆంగ్లేయులు మిత్రులు. ఆంగ్లేయులతో యుద్ధం చేసి విజయం సాధించడం ఇప్పటి పరిస్థితులలో సాధ్యం అయేపని కాదు. ఆ శక్తి భవిష్యత్తులో సంప్రాప్తం అవుతుంది.’’

‘‘ఇక్కడ మాత విగ్రహం ముందే బలిదానం చేసుకుంటాను.’’

‘‘నీవు అజ్ఞానవశుడవు. పద, ముందు జ్ఞానం పొందు. హిమాలయ శిఖరం మీద మాతృమందిరం వుంది. అక్కడ నీ మాతృమూర్తి ప్రత్యక్షం అవుతుంది.’’

ఈ మాటలు అని మహాపురుషుడు సత్యానందుని చేయి పట్టుకున్నాడు. ఎంత అపూర్వ శోభ! ఆ గంభీర నిస్తబ్ద రాత్రియందు చతుర్భుజ విష్ణు ప్రతిమ ముందు ఇద్దరు మహాపురుషులు చేతులు జోడించి నిలువ బడ్డారు. ఎవరు ఎవరిని పట్టుకున్నారు?

జ్ఞానమువచ్చి భక్తిచేతిని పట్టుకు నడిపిస్తోంది. విసర్జన ప్రతిష్టచేతిని పట్టుకుంది. ధర్మం వచ్చి కర్మచేతిని పట్టుకుంది.

సత్యానందుడే శాంతి. మహాపురుషుడే కళ్యాణి. సత్యానందుడు ప్రతిష్ట. మహాపురుషుడు విసర్జన. విసర్జన వచ్చి, ప్రతిష్టచేతిని తన చేతులలోనికి తీసుకుంది.

(అయిపోయింది)

—————

పునరుజ్జీవన సాహిత్యోద్యమ ద్రష్ట

విదేశీయులు, లేదా మత దురహంకారంతో, జాత్యహంకారంతో సాగే పాలన, అందులోని హింస ఎంత ఘోరమైనవో గొప్పగా గుర్తించిన నవలా కారుడు బంకించంద్ర చటర్జీ(1838-1894). మనవైన విద్య, కళ, తాత్త్వికత ఎలా లుప్తుమైపోతున్నాయో చూసి స్పందించిన రచయిత. ముస్లింల పాలన ఎంత దుర్భరమో, మొదట దాని నుంచి విముక్తం కావడమెలాగో రచయిత కల్పన చేశారు. చరిత్ర ప్రకారం చూసినా ముస్లింలకు సరైన సమాధానం చెప్పగలిగిన వారు, అణచి ఉంచగలిగినవారు ఆంగ్లేయులేనని భారతజాతి నమ్మినట్టుకనిపిస్తుంది. అందుకే మొదట ముస్లింల పాలనను, ఇంకొంత జ్ఞానం సముపార్జించిన తరువాత ఆంగ్లేయుల నుంచి దేశాన్ని విముక్తం చేయాలనే ఆనందమఠం నవల ఆశయంలో బంకించంద్ర చటర్జీ దానిని ప్రతిబింబించారని చెప్పవచ్చు. ఈ నవలలోని ఇతివృత్తం ఆ రెండు పార్శ్వాలలో కనిపిస్తుంది.

ఇది ఆధునిక వంగ సాహిత్యంలో కలికితురాయి. భారత స్వాతంత్య్ర సమరాన్ని నడిపించిన వందేమాతర గేయం ఇందులోనిదే. కాబట్టి భారతీయులు ఆధునికులైన తరువాత తప్పనిసరిగా ఆంగ్లేయుల పాలన మీద కూడా తిరగబడతారని ఆయన నవలాంతంలో సూచించడం రుషి భావనకు తక్కువదేమీ కాదనే అనుకోవాలి. కథకుడు, నవలాకర్త, పత్రికా రచయిత కూడా అయిన బంకించంద్ర 14 నవలలు రాశారు. ముస్లిం పాలన తరువాత, ఆంగ్లేయులు బలపడడానికి ముందు భారత గడ్డ మీద ప్రభవించిన సాహిత్య పునరుజ్జీవనోద్యమంలో ఆయన పాత్ర కీలకమైనదిగా విమర్శలు చెబుతారు. వంగదేశంలో మొదలయిన ఈ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి ఆయనను ప్రతీకగా కూడా కీర్తిస్తారు. ఆ గడ్డ నుంచి వచ్చిన మహోన్నత రచయితలు రవీంద్రనాథ్‌ ‌టాగోర్‌, ‌శరత్‌చంద్ర చటర్జీ కూడా ఆయన రచనల నుంచి ప్రేరణ పొందారు.

 ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయులలో బంకింబాబు ఒకరు. ‘బంగదర్శన్‌’ అనే పత్రిక ఆయన సంపాదకత్వంలో వెలువడింది. తన పత్రిక అక్షరాస్యులకూ, నిరక్షరాస్యులకూ నడుమ ఒక మాధ్యమిక వారధిగా ఉండాలని ఆయన ఆశించడమే ఒక అద్భుతం. సమకాలికులకు ఆయన రచనలు వేదవాక్యాలై భాసిల్లాయి. ఆయన రచనలలో కనిపించే హిందువులైన అకళంక మాతృదేశ భక్తిపరులు నాటి సమాజానికి ప్రేరణ ఇచ్చారు. ఇందులో కనిపించే సన్యాసుల తిరుగబాటు వాస్తవ గాథ. ఇస్లాం పాలనలో, అణచివేతలో మరుగున పడిన జాతీయ భావన లేదా భారతీయులమన్న స్పృహ ఆ సన్యాసులలో ఉదయించింది. బంకించంద్ర దృష్టిలో జాతీయత, హిందూధర్మం వేర్వేరుగా చూడవలసినవి కావు. ఆయన మహోన్నత గీతం ‘వందేమాతరం’ లోని తాత్త్వికత అంతా ఇదే. ఆ మహాగీతం నేటికీ ప్రతి భారతీయుని గుండెను తాకుతూనే ఉంది. అందుకే ఈ నవలను పదే పదే చదవడం ఒక చారిత్రక అవసరమని అనిపిస్తుంది. ఈ నవలను ఆదరించినందుకు పాఠకులకులందరికీ హృదయపూర్వక వందనాలు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram