– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌బ్రిటన్‌ ‌ప్రధానిగా రుషి సూనక్‌ ఎన్నికపై ఆయన సొంత పార్టీ కన్జర్వేటివ్‌ ‌లోనూ, అటు బ్రిటన్‌లోనూ, ఇటు భారత్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గత కొంతకాలంగా చట్టసభలో మంచి మెజార్టీ ఉన్నప్పటికీ ప్రధానుల ఎంపికలో ఒడిదొడుకులకు లోనవుతున్న కన్జర్వేటివ్‌ ‌పార్టీకి ఇంతకాలానికి రుషి రూపంలో బలమైన, ముందుచూపు గల యువ నాయకుడు లభించడం టోరీలకు ఎంతో ఊరట లభించింది. ఒకప్పటి అగ్రదేశం.. కారణాలు ఏమైనప్పటికీ అనేక సమస్యలతో సతమతమవుతున్న దేశానికి స్థిరమైన నాయకుడు లభించడంతో అంతర్జాతీయంగా బ్రిటన్‌ ‌తలెత్తుకోగలిగింది. ఇక.. భారత్‌ ‌పరంగా చూస్తే ఒకప్పుడు తనను పాలించిన దేశానికి తన మూలాలున్న నాయకుడు సారథ్యం వహించడం గర్వకారణ మనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన బ్రిటన్‌కు నాయకత్వం వహిస్తున్న రుషి సూనక్‌కు తాజా పరిస్థితుల్లో ప్రధాని పదవి ఎంతమాత్రం పూల పాన్పు కానే కాదు. కచ్చితంగా ముళ్ల కిరీటం వంటిదే అని చెప్పడం అతిశయోక్తి కాదు. రాజకీయ సుస్థిరత లోపించడం, ఆర్థికంగా దేశం అనేక ఒడిదొడుకులకు లోనవుతున్న నేపథ్యంలో రుషి ముందు అనేక సవాళ్లున్నాయి. అందులో ఆర్థిక పరిస్థితి మొదటిది. ఈ పరిస్థితిని చక్కదిద్దడం అసాధ్యం కానప్పటికీ అనుకున్నంత తేలికైతే కాదు. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో నిత్యావసర ధరలు నింగినంటుతున్నాయి. జీవన వ్యయాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో చాలీచాలని ఆదాయాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దలేక వైదొలగిన బోరిస్‌ ‌జాన్సన్‌, ‌లిజ్‌ ‌ట్రస్‌ ‌స్థానంలో పీఠమెక్కిన రుషిపై బ్రిటన్‌ ‌వాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఇది రుషికి తెలియనిది కాదు. అందుకే ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారు. ప్రజలకు ఎక్కడా అనవసరమైన ఆశలు కల్పించడం లేదు. అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదు. అదే సమయంలో బేలగా కూడా మాట్లాడటం లేదు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన ఆ కోణంలోనే మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితులు తనకేమీ భయం కలిగించడం లేదని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను వీలైనంత త్వరలో గాడిన పెట్టగలనన్న భరోసాను ప్రజల్లో కలిగిస్తున్నారు. ఇంతకుముందు జరిగిన తప్పులను సవరిస్తానని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తన శక్తి యుక్తులను వెచ్చిస్తానని చెప్పడం ద్వారా వారిలో నెలకొన్న ఆందోళనను దూరం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, ప్రధానిగా పూర్తిగా జవాబుదారీతనంతో వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.

‘దేశంలో ఇటీవల కొన్ని తప్పులు జరిగాయి. వాటి వల్ల మనకు తీవ్ర నష్టం జరిగిన మాట వాస్తవం. అయితే ఇవేమీ ఉద్దేశపూర్వకంగా జరిగినవి కావు. వాటిని సరిదిద్దుతా. దేశాన్ని ఆశావహమైన భవిష్యత్తులోకి నడిపిస్తాన’ని చెప్పడం ద్వారా సూనక్‌ ‌ప్రజలకు ఊరట కలిగించే ప్రయత్నం చేశారు. సొంత పార్టీని ఐక్యత దిశగా నడిపిస్తానని కూడా స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలను తెలుసుకుంటానని, కన్జర్వేటివ్‌ ‌పార్టీని బలోపేతం చేస్తానని, 2024 ఎన్నికల్లో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని కూడా ధీమాగా చెప్పారు. ఆయన అడుగులు కూడా ఆ దిశగానే సాగాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మంత్రివర్గ కూర్పుపై దృష్టి సారించారు. గత ప్రధాని లిజ్‌ ‌ట్రస్‌ ‌వద్ద హోం మంత్రిగా పనిచేసిన భారతీయ సంతతికి చెందిన సుయెల్లా బ్రావర్మన్‌కు మళ్లీ అదే శాఖను కేటాయించారు. ఈమె పూర్వికులది గుజరాత్‌ ‌రాష్ట్రం. బోరిస్‌ ‌జాన్సన్‌ ‌వద్ద హోం మంత్రిగా పనిచేసిన ప్రీతీ పటేల్‌ ‌కూడా గుజరాత్‌ ‌మూలాలున్న మహిళే కావడం గమనార్హం. ఆర్థిక మంత్రిగా జెరెమీ హంట్‌ను తిరిగి అదే పదవిలో కొనసాగించారు. తనకు అంతగా విశ్వాసపాత్రుడు కానప్పటికి జేమ్స్ ‌క్లెవెరినీ కీలకమైన విదేశాంగ మంత్రిగా మళ్లీ తీసుకున్నారు. జాన్సన్‌ ‌సర్కారులో ఉప ప్రధానిగా, న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన తన సన్నిహితుడు డొమినిక్‌ ‌రాబ్‌కు తిరిగి అవే పదవులను అప్పగించారు. రక్షణ మంత్రిగా బెన్‌ ‌వాలెస్‌ ‌కొనసాగుతున్నారు. టోరీ పార్టీ ఛైర్మన్‌గా నదీమ్‌ ‌జహావీని నియమించారు. ఆయనకు మంత్రిగానూ అవకాశం ఇచ్చారు. కీలకమైన మరో శాఖ వాణిజ్యాన్ని గ్రాంట్‌ ‌షాప్స్‌కు అప్పగించారు. స్థూలంగా చూస్తే మంత్రుల నియామకంపై రుషి మంచి మార్కులే సంపాదించారు. ఎక్కడా పెద్ద అసమ్మతి ఛాయలు కనపడలేదు. మంత్రులు, వారి శాఖలు, వారి అనుభవాన్ని చూస్తే సూనక్‌ ఎం‌పిక సరైనదేనన్న అభిప్రాయం వ్యక్తమైంది.

భారతీయ మూలాలున్న నాయకుడిగా రుషి.. మనదేశంతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారన్న ఆసక్తి రెండు దేశాల్లో నెలకొంది. ఈ విషయం ఆయనకు కత్తి మీద సాము వంటిది. భారత్‌తో ఎంతగా అనుబంధం ఉన్నప్పటికీ తన దేశ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమన్న విషయాన్ని విస్మరించరాదు. ఈ విషయంలో ఆయనను బ్రిటన్‌ ‌వాసులు నిశితంగా గమనిస్తుంటారు. దేశీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే భారత్‌తో స్నేహ సంబంధాలు నెరపడం కత్తి మీద సామే. బ్రిటన్‌ ‌హోంమంత్రిగా సుయెల్లా బ్రావర్మన్‌ ‌భారతీయ వసలదారులపై ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీని ఇరుకున పెట్టిన మాట వాస్తవం. భారత్‌తో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ- ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం) కుదుర్చుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు గతంలోనే సూనక్‌ ‌ప్రకటించారు. భారత్‌ ‌పట్ల ఆయన వైఖరిని ఈ సానుకూల ప్రకటన స్పష్టం చేస్తోంది. ఈ మేరకు ఎఫ్‌టీఏను సత్వరం సాకారం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తే అది రెండు దేశాలకు మేలు చేస్తుంది. ప్రధానంగా తోలు, జౌళి, శుద్ధి చేసిన వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఆభరణాల రంగంలో భారత్‌ ‌నుంచి బ్రిటన్‌కు ఎగుమతులు పెరిగేందుకు ఎఫ్‌టీఏ దోహద పడుతుంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఉభయ దేశాల మధ్య వార్షిక వాణిజ్య ఒప్పందం విలువ 2035 నాటికి దాదాపు రూ.2.8 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. బ్రెగ్జిట్‌ ‌ఫలితంగా ఐరోపా మార్కెట్లలో బ్రిటన్‌ ‌లావాదేవీలు గతంలో మాదిరిగా సాఫీగా సాగే అవకాశాలు లేవు. అమెరికాతో ఎఫ్‌టీఏ చర్చల్లోనూ పురోగతి లేదు. ఈ నేపథ్యంలో భారత్‌ ‌వంటి భారీ విపణిలో స్వేచ్ఛాయుత ప్రవేశాన్ని కలిగి ఉండటం బ్రిటన్‌కు అవసరం. అందుకు ఎఫ్‌టీఏ మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇంతకుముందు బోరిస్‌ ‌జాన్సన్‌ ‌హయాంలో ఈ ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిగాయి.

భారత్‌-‌బ్రిటన్‌ల మధ్య వస్తుసేవల వాణిజ్య విలువ గతంతో పోలిస్తే పెరిగిన మాట వాస్తవం. అది ఇప్పుడు 2,570 కోట్ల పౌండ్ల (ఒక పౌండ్‌ ‌విలువ దాదాపు 95 రూపాయలు)కు చేరుకుంది. గత ఏడాది మేలో ‘మెరుగైన వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాన్ని (ఈటీపీ) కుదుర్చుకున్నాయి. 2021లో రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం విలువ 2,400 కోట్ల పౌండ్లు. 2030 నాటికి దీనిని రెట్టింపు చేయాలన్నది ఈటీపీ లక్ష్యం. భద్రతాపరంగా ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో పరస్పర ప్రయోజనాల పరి రక్షణకు ఇరుదేశాలు కట్టుబడి ఉండటం సంబంధాల బలోపేతానికి నిదర్శనం. ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు కేంద్రంగా నిలుస్తున్న ఇండో-పసిఫిక్‌లో భారత్‌ ‌తమకు అతిపెద్ద భాగస్వామి అని గతంలో బోరిస్‌ ‌జాన్సన్‌ ‌ప్రకటించిన విషయం గమనార్హం. ఇండో-పసిఫిక్‌లో చైనా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దాని ప్రాబల్యాన్ని అడ్డుకు నేందుకు ఉభయ దేశాలు కలసి పని చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి బోరిస్‌ ‌జాన్సన్‌ ‌హయాంలోనే రెండు దేశాల సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. ఇప్పుడు సూనక్‌ ‌వాటిని మరింత ముందుకు తీసుకెళ్లగలరనడంలో సందేహం లేదు.

బ్రిటన్‌ ‌పర్యాటకం, వర్క్ ‌వీసాల కోసం ప్రస్తుతం భారతీయులు దాదాపు రూ.1.4 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. దీనిని తగ్గించాలని, గ్రాడ్యు యేషన్‌ ‌పూర్తయ్యాక భారత విద్యార్థులు బ్రిటన్‌లో కొనసాగేందుకు అనుమతించాలని, భారతీయులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని మనదేశం కోరుతోంది. బ్రిటన్‌లో ప్రస్తుతం దాదాపు 800లకు పైగా భారతీయ కంపెనీలు ఉన్నట్లు అంచనా. వాటిల్లో సుమారు 1.1 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. పింఛను తీసుకునే వయసు దాకా సామాజిక భద్రత పేరిట భారతీయ నిపుణుల నుంచి బ్రిటన్‌ ‌భారీగా రుసుములు వసూలు చేస్తోంది. ప్రస్తుతం కొంతమందికే ఉన్న ఈ మినహాయింపు లను భారతీయులు అందరికీ వర్తింపజేయాలని కోరుతోంది. వీటిని అంగీకరించడం వల్ల కోల్పోయే దాని కంటే భారత్‌తో ఒప్పందం కుదిరితే బ్రిటన్‌కు ఒనగూరే ప్రయోజనాలే ఎక్కువ. విద్యార్థులు, నిపుణులు, పరిశోధకుల వీసాలకు సంబంధించిన విషయంలో నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉంది. మరోవైపు వలసలకు సంబంధించి భారత్‌ ‌డిమాండ్లను అంగీకరిస్తే బ్రిటన్‌కే మంచిదన్నది విశ్లేషకుల అభిప్రాయం. బ్రెగ్జిట్‌ ‌తరవాత ఐరోపా దేశాల నుంచి బ్రిటన్‌కు వలసలు తగ్గిపోయాయి. దీనికితోడు ఆతిథ్యం, రవాణా వంటి రంగాల్లో బ్రిటన్‌ ‌మానవ వనరుల కొరతను ఎదుర్కోంటోంది. అందువల్ల వీసాల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని భారత్‌ ‌కోరుతోంది. భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాలనీ కోరుతోంది. ఇప్పుడు భారత్‌ ‌నుంచి వలసలను ప్రోత్సహిస్తే ప్రయోజనం యూకేకే అన్నది వాస్తవం.

బ్రిటన్‌ ‌కేంద్రంగా కొనసాగుతున్న ఖలిస్తానీలు, వేర్పాటువాదుల కార్యకలాపాలను అడ్డుకోవాలని భారత్‌ ‌గట్టిగా డిమాండ్‌ ‌చేస్తోంది. భారతీయుల వీసాలకు సంబంధించి ఇంతకుముందు హోంమంత్రి సుయెల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఉభయ దేశాల సంబంధాల మెరుగుదలకు అడ్డంకిగా మారుతాయని భారత్‌ ‌విస్పష్టంగా పేర్కొంది. వాస్తవానికి నవంబర్‌లో మోదీ బ్రిటన్‌ ‌పర్యటనకు వెళ్లి ఎఫ్‌టీఏ ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంది. కానీ ఆ దేశ హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తాత్కాలికంగా పర్యటన రద్దయింది. కొంతమంది అపరిపక్వ, అవగాహన లేని వారు చేసిన వ్యాఖ్యలను పక్కన పెడితే భారత్‌-‌బ్రిటన్‌ ‌సంబంధాలు రుషి సూనక్‌ ‌హయాంలో మరింత బలోపేతం కాగలవు. మారిన పరిస్థితుల నేపథ్యంలో బంధాలను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఇరు దేశాలకు ఉంది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE