– అరుణ

గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫీ) గోవాలోనే జరుగుతోంది. ఈ యేడాది కూడా నవంబర్‌ 20‌న ఈ వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది. నవంబర్‌ 28 ‌వరకూ జరిగే ఈ అంతర్జాతీయ సినిమా వేడుకలో 79 దేశాలకు చెందిన 280 చిత్రాలను ప్రదర్శించబోతున్నారు. విశేషం ఏమంటే.. ఈసారి ఇఫీలో తెలుగు వారి సినిమాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులకు అక్కడ అపూర్వమైన గుర్తింపు దక్కబోతోంది. ఇది నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని సినీ అభిమానులు ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే, ఇప్పుడిప్పుడే జాతీయ అవార్డులలోనూ తెలుగు సినిమాలు తన సత్తాను చాటుకుంటున్నాయి. అదే సమయంలో ఇలాంటి చిత్రోత్సవాలలోనూ మన సినిమాలకు తగిన ప్రాధాన్యం లభించడం అందరూ హర్షించే అంశం.

53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్స వంలో ఆస్ట్రేలియన్‌ ‌మూవీ ‘అల్మా అండ్‌ ఆస్కార్‌’‌ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించారు. ఇఫీ ప్రారంభోత్సవ వేడుకల్లో సమాచార ప్రసార శాఖ, యువ, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ఆసియాలోనే అతి పెద్ద అంతర్జా తీయ చలన చిత్రోత్సవాన్ని భారత్‌ ‌నిర్వహిస్తోందని, గ్లోబల్‌ ‌కంటెంట్‌ ‌హబ్‌గా ఇండియాను మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. తొలిరోజున అజయ్‌ ‌దేవ్‌గన్‌, ‌పరేశ్‌ ‌రావెల్‌, ‌మనోజ్‌ ‌వాజ్‌పాయ్‌, ‌కార్తీక్‌ ఆర్యన్‌, ‌సునీల్‌ ‌శెట్టి, వరుణ్‌ ‌ధావన్‌, ‌సారా అలీఖాన్‌, ‌మృణాల్‌ ‌ఠాకూర్‌ ‌తదితరులు చిత్రోత్సవంలో పాల్గొ న్నారు. విశేషం ఏమంటే ప్రారంభోత్సవం రోజునే తెలుగు సినీ ప్రముఖుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని 2022 ఇండియన్‌ ‌ఫిల్మ్ ‌పర్సనాలిటీ అవార్డుకు ఎంపిక చేసినట్టు అనురాగ్‌ ‌ఠాగూర్‌ ‌తెలిపారు. భారతీయ సినిమా శతజయంతి జరుపు కున్న నాటి నుండీ ఈ కేటగిరిని ఏర్పాటు చేసి సినీ ప్రముఖులను సత్కరిస్తున్నారు. ఇప్పటివరకూ వహిదా రెహ్మాన్‌, ‌రజనీకాంత్‌, ఇళయరాజా, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, అమితాబ్‌ ‌బచ్చన్‌, ‌సలీమ్‌ ‌ఖాన్‌, ‌బిస్వజిత్‌ ‌ఛటర్జీ, హేమమాలిని, ప్రసూన్‌ ‌జోషీ ఈ అవార్డులను అందుకున్నారు. ఇఫీ ముగింపు రోజున చిరంజీవి ఈ సత్కారాన్ని అందుకోబోతున్నారు. అభిమానుల ఆదరణ వల్లే తాను ఈ అవార్డుకు ఎంపికయ్యానంటూ చిరంజీవి స్పందించారు. అలానే ప్రారంభోత్సవంలో ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు వి. విజయేంద్ర ప్రసాద్‌ను సత్కరించారు. 21వ తేదీ ‘మాస్టర్‌ ‌క్లాస్‌’ ‌సెక్షన్‌లో ‘ది మాస్టర్స్ ‌రైటింగ్‌ ‌ప్రాసెస్‌’ అనే అంశంపై విజయేంద్ర ప్రసాద్‌ ఉపన్యసించారు.

తెలుగువారికి పెద్ద పీట!

ఈసారి ఇఫీలో తెలుగువారికి, తెలుగు సినిమా లకూ పెద్ద పీట వేశారు. ఇండియన్‌ ‌పనోరమా జ్యూరీలో తెలుగు దర్శకులు వి.ఎన్‌. ఆదిత్య, ప్రేమ్‌ ‌రాజుకు చోటు దక్కింది. దాంతో స్ట్రయిట్‌ ‌తెలుగు సినిమాలతో పాటు తెలుగు నిర్మాతల పరభాషా చిత్రాలకూ వీరు ప్రాధాన్యమిచ్చి ఎంపిక చేశారు. ఇండియన్‌ ‌పనోరమాలో ఈసారి బాలకృష్ణ ‘అఖండ’, ఎన్టీయార్‌, ‌రామ్‌చరణ్‌తో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’, ‘‌సినిమా బండి’, ‘ఖుదీరామ్‌ ‌బోస్‌’ ‌చిత్రాలు ఎంపికయ్యాయి. ఇందులో ‘సినిమా బండి’ ఓటీటీలో విడుదల కాగా, విద్యాసాగర్‌ ‌రాజు తీసిన పాన్‌ ఇం‌డియా మూవీ ‘ఖుదీరామ్‌ ‌బోస్‌’ ‌విడుదల కావాల్సి ఉంది. ఇక మొదటిసారి తమిళంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ ‌నిర్మించిన ‘కీడా’ సినిమా, అడవి శేష్‌తో మహేశ్‌ ‌బాబు నిర్మించిన ‘మేజర్‌’ ‌హిందీ సినిమా, అల్లు అరవింద్‌ ‌సమర్పకుడిగా వ్యవహ రించిన హిందీ సినిమా ‘త్రీ ఆఫ్‌ అజ్‌’ ఇం‌డియన్‌ ‌పనోరమాకు ఎంపికయ్యాయి. అలానే హైదరాబాద్‌ ‌వాస్తవ్యుడు అభిషేక్‌ అగర్వాల్‌ ‌నిర్మించిన ‘ది కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌సైతం ఇండియన్‌ ‌పనోరమాకు సెలెక్ట్ అయ్యింది. ఇండియన్‌ ‌రెస్టోర్డ్ ‌క్లాసిక్‌ ‌కేటగిరిలో ఐదు చిత్రాలను ఎంపిక చేయగా, కె. విశ్వనాథ్‌ ‌దర్శ కత్వంలో ఏడిద నాగేశ్వరరావు తీసిన ‘శంకరా భరణం’ను ఎంపిక చేసి చిత్రోత్సవంలో ప్రదర్శిస్తు న్నారు. అలానే హోమేజ్‌ ‌కేటగిరిలో ప్రముఖ నటుడు కృష్ణంరాజు జ్ఞాపకార్థం ‘జీవన తరంగాలు’ను ప్రదర్శించబోతున్నారు.

ఈసారి ఇఫీలో మహిళా దర్శకులకు చక్కని ప్రాధాన్యం లభించింది. వివిధ దేశాల నుండి మహిళలు రూపొందించిన 54 సినిమాలు ఎంట్రీకి వచ్చాయి. 2017లో 30, 2019లో 50 సినిమాలు రాగా వాటిని అధిగమిస్తూ ఈసారి అత్యధిక ఎంట్రీస్‌ ‌రావడం విశేషం. మణిపురీ సినిమా యాభై సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఐదు మణిపూరి సినిమాలను ఇఫీలో స్పెషల్‌ ‌స్క్రీనింగ్‌కు ఎంపిక చేశారు. అలానే కంట్రీ ఫోకస్‌ ‌విభాగంలో ఈసారి ఫ్రాన్స్‌ను ఎంపిక చేశారు. ఆ దేశానికి చెందిన ఎనిమిది చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. దాదాసాహేబ్‌ ‌ఫాల్కే రెట్రోస్పెక్టివ్‌ ‌కేటగిరిలో 2020కి గానూ ఆ అవార్డును అందుకున్న ఆశాపరేఖ్‌కు చెందిన మూడు సినిమాలను ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా చూసినప్పుడు గతంలో కంటే తెలుగు వారికి ఈ చిత్రోత్సవంలో అత్యధిక ప్రాధాన్యమిచ్చి నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇక చిరంజీవిని ఇండియన్‌ ‌ఫిల్మ్ ‌పర్సనాలిటీ ఆఫ్‌ ‌ది ఇయర్‌ అవా ర్డుకు ఎంపిక చేసినట్టు ప్రకటన రాగానే స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ చిరంజీవిని అభినందిస్తూ తెలుగులో ట్వీట్‌ ‌చేశారు. ఇవాళ కేంద్రంలోని ప్రభుత్వం ముంబైని కాదని హైదరాబాద్‌ ‌లోని తెలుగు సినిమా రంగం మీద దృష్టి పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకు ఇఫీలోని తెలుగు వెలుగులు ఓ ఉదాహరణ.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram