నవంబర్‌ 29 ‌సుబ్రహ్మణ్య షష్ఠి

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

ప్రకృతి పురుషుల ఏకత్వమే కుమారస్వామి/సుబ్రహ్మణ్యుడి అవతరా తత్త్వం. శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆనంద దాంపత్య ప్రదాతగా వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తుల మదిలో కొలువై ఉంటాడు. ‘సు’ అంటే పరిపూర్ణత అనీ అర్థం చెబుతారు. మంచి బ్రహ్మజ్ఞానం కలిగి ఉండడం వల్ల ‘సుబ్రహ్మణ్యుడు’ అయ్యాడు. విధాత సృష్టిని అటుంచితే పరిపూర్ణతత్త్వంతో కూడిన సుబ్రహ్మణ్య స్వరూపాన్ని కుమారతంత్రం ‘పరబ్రహ్మతత్త్వం’గా పేర్కొంది.ఆయన సర్పావతారుడు అనే భావనతో నాగులచవితి, నాగపంచమి లాంటి పర్వదినాలలోనూ ఆయనను ఆరాధించడం కనిపిస్తుంది. మార్గశిర శుద్ధ షష్ఠినాడు సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవాలని శాస్త్ర వచనం.

సుబ్రహ్మణ్యాది నామాలు గల కార్తికేయుడు కారణజన్ముడు. తారకాసురుడు అనే అసుర సంహారానికి సుబ్రహ్మణ్వేశ్వరుడు అవతరించాడు (ఏడేళ్ల వయసు గల బాలుడి చేతిలో తప్ప అన్యుల చేత మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు). కుమారస్వామి (సదా బాలప్రాయంలో ఉంటాడు), కార్తికేయుడు (కృత్తికా నక్షత్రంలో అవతరించాడు), షణ్ముఖుడు (కృత్తిక మాతలు పాలివ్వగా ఆరు ముఖాలతో తాగాడు), శరవణ భవుడు (రెల్లుగడ్డిలో జన్మించినందుకు), స్కలితమైన రేతస్సునుంచి (గర్భం నుంచి జారిపడడం వల్ల) పుట్టడం వల్ల స్కందుడిగా, మురుగన్‌, అర్ముగం, స్వామినాథుడు, దండాయుధపాణి తదితర పేర్లతో పూజలందుకుంటున్నాడు. తెలుగునాట ఈ స్వామి సుబ్బారాయుడు పేరిట ప్రసిద్ధుడు.

సుబ్రహ్మణ్వేశ్వరుడు అవతరించడానికి సంబంధించి ఇతిహాసాలలో ఎన్నో కథనాలు ఉన్నా స్కంద పురాణం హృద్యంగా వివరించింది. తన చేష్టలతో లోకాలను చీకాకు పరుస్తున్న తారకాసుర సంహారం పరమేశ్వరుడి తనయుడికే తప్ప అన్యులకు సాధ్యం కాదని బ్రహ్మ దేవతలకు చెప్పడంతో వారు శివుడిని ఆశ్రయించారు. తన తేజస్సు ద్వారా కుమారుడు జన్మిస్తాడని ఆయన అభయమివ్వగా, సురలు ‘కుమారోద్భవం’ కోసం నిరీక్షించసాగారు. కుమార జననం అద్భుత క్రమంలో సంభవించింది. పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు ఏకాంతంలో ఉన్నారు. వారి సంయోగం ఫలితంగా తనను మించిన ప్రభావం గల పుత్రుడు ఉదయిస్తా డేమోనన్న బెరుకుతో ఇంద్రుడు వారి శృంగార క్రీడకు అంతరాయం కల్పించాలంటూ అగ్నిని పురమా యించాడు. అగ్ని రాకకు ఆగ్రహించిన జగన్మాత నేల రాలిన శివుని తేజస్సు (వీరం) ఊరికేపోదని, నీవు ధరించాలని ఆదేశిస్తుంది. ఆమె ఆనతిని తలదాల్చిన అగ్ని ఆ తేజస్సును ధరించినా భరించలేక గంగకు అప్పగించాడు. దానిని భరించడం కొంత కాలానిక తనకూ దుర్భరం కావడంతో గంగ హిమాల యాలలోని పవిత్ర శరవణం అనే రెల్లుగడ్డి గల వనానికి విడిచిపెట్టింది. ఆరు ముఖాలతో జన్మించిన బాలుడికి కృత్తిక దేవతలు (ఆరుగురు మునిపత్నులు) పాలిచ్చి పెంచారు. ఆరు ముఖాలతో ఒకేసారి పాలు తాగడం వల్ల షణ్ముఖు డయ్యాడు. ఆ ఆరు ముఖాలూ షటక్రాలకు ప్రతీకలని చెబుతారు. దేవతల సేనాధిపతిగా నియమితుడై తారకాసురుడిని సంహరించాడు. ఆ సమయంలో ఆయన మెడలోని శివలింగం అయిదు ముక్కలుగా విడిపడి శివపంచారామ క్షేత్రాలుగా వినుతికెక్కాయి. కుమార సంభవాన్ని వ్యతిరేకిస్తూ, ఆయన ఆవిర్భానికి ఆటంకాలు సృష్టించ యత్నించిన ఇంద్రుడు ఆయనను అల్లుడికి చేసుకున్నాడు. శూర పద్మాసనుడు అనే దానవుడిని సంహరించి నందుకు మెచ్చుకోలుగా, తన కుమార్తె దేవసేనను ఇచ్చి వివాహం చేశాడని స్కాంద పురాణం చెబుతోంది. కుమారస్వామి బ్రహ్మజ్ఞాన స్వరూపుడు కాగా దేవేరులలో వల్లీదేవిని కుండలినీ శక్తికి, దేవసేనాదేవిని ఇంద్రియ శక్తులకు ప్రతీకలుగా చెబుతారు. శాఖుడు, విశాఖుడు, నైగమేషుడు, పృష్ఠజుడు అనేవారు సుబ్రహ్మణ్యస్వామి పుత్రులు.

సుబ్రహ్మణ్యస్వామి పురాణ పురుషుడే కాదు. తంత్రశాస్త్రంలోనూ ఆయన విశిష్టత కనిపిస్తుంది. శక్తి స్వరూపుడి గనుగకనే దేవసేనలకు అధిపతి అయ్యాడని, అది జ్ఞానం వల్లనే సాధ్యమైందని, జ్ఞానస్వరూపుడైన ఆయన మేధస్సును ప్రసాదిస్తాడని, అద్భుతశక్తియుక్తులకు సాధనకు, బహుముఖ ప్రజ్ఞను అభిలషించేవారు ఆయనను ఉపాసించాలని పెద్దలు చెబుతారు. మేధస్సుకు ప్రతీకగా ఆయన చేతిలో శక్తి అనే ఆయుధం ఉంటుంది.

తాటాకాది దానవ సంహారానికి రామలక్ష్మణు లను వెంట తీసుకువెళుతున్న బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వారికి కుమారసంభవాన్ని వివరించినట్లు రామాయణం పేర్కొంటోంది. కార్తికేయుడిని కాల స్వరూపుడిగా పెద్దలు అభివర్ణించారు. ఏడాదిలో ఆరు రుతువులు ఆయన ముఖాలని, పన్నెండు చేతులు నెలలని వ్యాఖ్యానించారు.

ప్రతి నెల శుద్ధ షష్ఠి ఆయనకు ప్రీతికరమైన రోజు కనుక, ముందు రోజు (పంచమి) ఉపవాసం ఉండి ఆరవ తిథి నాడు పూజిస్తారు. బాలవటులను సుబ్రహ్మణ్య స్వామి స్వరూపులుగా భావించి అర్చించి భోజన తాంబూలాదులు అర్పిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠినాడు నాగులకు చేసే పూజ ప్రత్యేకమైనది. దీపావళి తరువాత నాగుల చవితి తరహాలో పుట్టల వద్దకు వెళ్లి పాలు పోయరు. ఆలయాలలో సర్పరూపి అయిన స్వామిని కొలుస్తారు. సర్పదోషం ఉన్న వారు, జాతక రీత్యా కుజదోషం కలవారు వాటి పరిహార్థం సర్ప సూక్తాన్ని పఠిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆయన జన్మ తిథినాడు అర్చిస్తే, అవివాహితులకు వివాహమవుతుందని, చర్మవ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని విశ్వాసం. ప్రకృతి పురుషుల ఏకత్వమే సుబ్రహ్మణ్య అవతాతరత్త్వ మని, ఆయనను ఆరాధించడం లక్ష్మీనారాయణులు, శివశక్తులను అర్చించినంత ఫలమని పురాణవాక్కు.

కుమారస్వామి సైన్యసమేతంగా తారకాసురునిపై దండెత్తే సమయంలో ఆరు చోట్ల విడిది చేశారట.అవే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలుగా (తిరుప్పర కుండ్రం, తిరుచెందూరు, పళని, తిరుత్తణి, పళముదిర్‌ ‌చోళై, స్వామిమలై) ప్రసిద్ధమయ్యాయి. వీటిని తమిళంలో ‘పడైవీడుగళ్‌’ అం‌టారు. ‘పడై’ అంటే సైన్యం, ‘వీడు’ అంటే నివాసస్థలం అని అర్థం. తెలుగునాట మోపిదేవి, బిక్కవోలు, రామకుప్పం, నాగుల మడకలో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. మోపిదేవిలో మూలమూర్తి స్వయంభూ అని స్థల పురాణం చెబుతోంది. కుమారస్వామి పుట్టకింద సర్పరూపంలో ధ్యానం చేస్తూ ఉంటాడని చెబుతారు. ఆలయ ప్రాంగణంలోని నాగమల్లి చెట్టు వద్ద నాగ ప్రతిష్ఠలు విశేషంగా చేస్తారు.

 గుంటూరు జిల్లా మంగళగిరి శివారులోని నవులూరులో పుట్ట నాగేంద్రస్వామి ఆలయం ఉంది. అక్కడి స్వామికి సంతాన ప్రదాతగా పేరుంది. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా పరకాలలో కాకతీయ రాజుల హయాంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం నిర్మితమైంది. ఏటా మార్గశిర శుద్ధ పంచమి నుంచి దశమి వరకు సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు నిర్వహిస్తారు.గుజరాత్‌లో స్తంభాట్‌లో, పంజాబ్‌లో పహేవా, అచలేశ్వర్‌ ‌సుబ్రహ్మణ్య ఆలయాలు ఉన్నాయి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram