– బంకించంద్ర చటర్జీ

మహేంద్రుడు ‘‘చూస్తున్నాను’’ అన్నాడు.

‘‘విష్ణువు అంకంలో ఎవరున్నారో గమనించావా?’’

‘‘ఎవరో ఉన్నారు. ఎవరు ఆమె?’’

‘‘అమ్మ!’’

‘‘ఎవరు ఆ అమ్మ?’’

‘‘మేమంతా ఆమె సంతానం!’’

‘‘ఇంతకూ ఎవరామె?’’

‘‘నింపాదిగా తెలుస్తుంది. ముందు ‘వందే మాతరం’ అను. వెళ్లిపోదాం.’’

ఆ తరువాత బ్రహ్మచారి మహేంద్రుడిని మరొక గదిలోనికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి అపురూప సర్వాంగ సంపన్న సర్వాభరణ భూషిత జగద్ధాత్రి మూర్తి విరాజితమై అగుపిస్తోంది.

‘ఈ మూర్తి ఎవరిది?’ మహేంద్రుడు అడిగాడు.

‘‘అమ్మ!’’

‘‘ఎవరు?’’

‘‘బాలసూర్య ప్రభాది ఐశ్వర్య అధిష్టాత్రి ఈమె! ఈమెకు ప్రణామం చేయి!’’

మహేంద్రుడు భక్తిభావంచేత జగద్ధాత్రి రూపిణి మాతృభూమికి ప్రణామం చేశాడు. తరువాత బ్రహ్మచారి అతడికి అంధకారమైన సొరంగం ఒకటి చూపి ‘‘ఈ దారి వెంట నడువు’’ అన్నాడు.

బ్రహ్మచారి మెల్లి మెల్లిగా నడుస్తున్నాడు. మహేంద్రుడు భయభీతచిత్తంతో మెల్లిగా వెనకాల నడుస్తున్నాడు. భూగర్భ అంధకార కోణంలో ఎక్కడ నుండోగాని సన్నటి కాంతిరేఖ ప్రసరించి వెలుగువస్తోంది. ఈ స్వల్ప కాంతిలో ఒక కాళీ మూర్తి అగుపిస్తోంది.

బ్రహ్మచారి ‘‘చూచావా? ఇప్పుడు అమ్మ ఏ రూపంలో ఉన్నదో!’’

‘‘కాళి!’’

‘‘కాళి నగ్నంగా ఉంది. ఇప్పుడు దేశం నలుమూలలా శ్మశానంలా ఉంది. అందుకనే ఆమె కంకాళమాలిని అయి ఉంది. తన శివుడిని తన పాదతలంలోనే ఇముడ్చుకుంది. హా! మాతా!’’ ఈ మాటలు అంటూ ఉండగా బ్రహ్మచారి కళ్లలో నీళ్లు తిరుగసాగాయి. మహేంద్రుడు ‘‘చేతిలో కలీ, కపాలమూ ఎందుకు?’’ అన్నాడు.

‘‘మేమందరము సంతానులం. అమ్మ చేతులలో అస్త్రం ఉన్నది. ఆమె మాకు దీనిని ప్రసాదించింది! చెప్పు, ‘వందేమాతరం’ అని!’’

‘‘వందేమాతరం!’’ అని మహేంద్రుడు కాళికి ప్రణామం చేశాడు.

బ్రహ్మచారి ‘‘ఈ దారిగుండా రా’’ అంటూ రెండవ సొరంగంవైపు తీసుకు వెళ్లాడు. అకస్మాత్తుగా వారికెదురుగా సూర్యోదయకాంతి ప్రసరించసాగింది. నాలుగు పక్కల నుండి మధురస్వరంలో పక్షుల కిలకిలారావాలు వినవస్తున్నాయి. మర్మర ప్రస్తర నిర్మిత ప్రశాంత మందిరం వెనుక సువర్ణ నిర్మిత దశ భుజ ప్రతిమ నవారుణకిరణములలో జ్యోతిర్మయమై మందహాసం చేస్తూ ఉంది.

బ్రహ్మచారి ప్రణామం చేసి ‘‘ఈమె అమ్మ! భవిష్యత్తులో అమ్మరూపం ఇలా వుంటుంది. దశభుజాలు దశ దిక్కులా వ్యాపించి వున్నాయి. వాటిలో నానావిధ ఆయుధాలు వున్నాయి. అనేక శక్తులతో ఆమె విరాజిల్లుతూ వుంది. దిక్భుజ…’’

చెబుతూ చెబుతూనే ఆయన కంఠం గద్గదమైంది.

‘‘దిక్భుజ… నానా ప్రహారణ ధారిణీ శత్రువిమని, వీరేంద్ర పృష్టవిహారిణి! దక్షిణపువైపు లక్ష్మీభయ రూపిణి. ఎడమవైపు సరస్వతీదేవి! దగ్గర బలవంతు లైన కార్తికేయుడు, కార్యసిద్ధరూపుడైన గణపతి! రా, మనమిద్దరం దేవికి నమస్కారం చేద్దాం.’’

ఇద్దరూ చేతులు జోడించి నమస్కరించి ఈ విధంగా ప్రార్థన చేశారు.

‘‘సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే

శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే!’’

ప్రార్థన అయిన మీదట మహేంద్రుడు అడిగాడు ‘‘అమ్మను ఈ రూపం ఎప్పటికి దర్శించగలుగు తాము?’’

‘‘ఎప్పుడైతే అమ్మ సంతానం అందరూ ఏకకంఠంతో ఆమెను ఆహ్వానిస్తారో అప్పుడు ఆమె ఇలా ప్రసన్న రూపంలో సాక్షాత్కరిస్తుంది.’’

‘‘నా భార్య, పిల్ల ఎక్కడున్నారు?’’ అనడిగాడు మహేంద్రుడు ఉన్నట్లుండి.

‘‘పద, చూపిస్తాను.’’

‘‘వారిని ఒక్క మారుమాత్రం కలుసుకోవాలను కుంటున్నాను. ఆ తరువాత వారిని వదిలి వేస్తాను.’’

‘‘ఎందుకోసం వదిలివేయడం?’’

‘‘నేనీ మహామంత్రం స్వీకరిస్తాను’’

‘‘వారిని ఎక్కడ వదులుతావు?’’

మహేంద్రుడు కొద్దిసేపు ఆలోచించి ‘‘నా ఇంటిలో ఎవరూ లేరు. నాకు వేరే చోటు కూడా లేదు. ఈ మహామ్మారి సమయంలో ఇంకొక చోటు ఎక్కడ దొరుకుతుంది?’’ అన్నాడు.

‘‘ఏ రహదారిలో ఇటు వచ్చావో, అలాగే మందిరం బయటకు నడువు. మందిర ద్వారం వద్ద నీ భార్యా సుతులు అగుపిస్తారు. కల్యాణి ఇప్పటివరకు నిరాహారంగా ఉంది. వారు కూర్చుని ఉన్నచోట భోజన సామగ్రి అంతా ఉంది. వారికి భోజనం పెట్టు. నీ ఇష్టం వచ్చినంత సేపు కులాసా కబుర్లు చెప్పు. నేను వీలువెంట నిన్ను తరువాత కలుసుకుంటాను.’’

మహేంద్రుడు పూర్వ పరిచితమైన రహదారి వెంట వెళ్లాడు. భూగర్భంలో ఉన్న ఒక గదిలోనికి వెళ్లాడు. అక్కడ జీవానందుడు, భవానందుడు కూర్చుని రూపాయలు లెక్కబెట్టుకుంటున్నారు. ఆ గదిలో బంగారు, వెండి, రాగి, రత్నాలు, ముత్యాలు – రాసులుగా పోసి ఉన్నాయి. సత్యానందుడు ఈ గదిలో ప్రవేశించి ఇలా అన్నాడు.

‘‘జీవానందా! మహేంద్రుడు వచ్చాడు. ఆయన వచ్చిన తరువాత సంతానులకు విశేషమైన శుభం జరుగుతుంది. కారణం, ఆయన రావడంతోటే ఆయనకు సంచితంగా ప్రాప్తించిన ధనమంతా సంతానుల మాతృసేవకు అంకితం అవుతుంది. అయితే మనోవాక్కాయ కర్మలలోను అతడు మాతృభక్తి కలిగివుంటే తప్ప దీక్ష తీసుకోలేదు. మీరందరూ చేతిలోని పనులు అయిపోయిన మీదట అతనికి ఈ భక్తి భావం హృదయంలో పాతుకుపోయేందుకు తగిన పనులు చేయండి. సమయం చూచి అతడిని విష్ణుమండపంలో ప్రవేశపెట్టండి. అతడిని కనిపెట్టి ఉండండి.’’

12

అనేక కష్టాలు గడిచి మహేంద్రుడు, కల్యాణి తిరిగి కలుసుకోగలిగారు. కల్యాణి ఏడుపుతో గిరగిర చుట్టుకుపోయి దొర్లుతోంది. మహేంద్రుడు కూడా ఏడుస్తున్నాడు. ఎన్నిమార్లు కళ్లు తుడుచుకున్నారో లెక్కలేదు. కన్నీళ్లు ఆపే ఉద్దేశంతో కల్యాణి భోజన విషయం ప్రస్తావించింది. బ్రహ్మచారి అనుచరులు అక్కడ ఉంచి వెళ్లిన భోజన పదార్థాలను కల్యాణి మహేంద్రుని ముందు ఉంచింది. దుర్భిక్షం మూలంగా దేశంలో ఎక్కడా కడుపుకు సరిపడిన తిండిలేదు. దేశంలో పరిస్థితి ఎలా ఉన్నా సంతానులకు భోజన విషయంలో ఏమీ భయం లేదు. ఎందుకంటే ఈ అరణ్యం ఎవరూ జొరబడలేని చోట ఉంది. ఈ అరణ్యంలోని ఫలాలు లెక్కకు మిక్కిలి. సంతానులు ఈ ఫలాలను కోసుకువచ్చి తృప్తిగా ఆరగిస్తున్నారు. అదీగాక సంతానుల బలగంలో మేలుజాతికి చెందిన గేదెలు ఉన్నాయి. వాటి పాలు సంతానులకు ఆహారం. కల్యాణి బలవంతం మీద మహేంద్రుడు ముందు భోజనం చేశాడు. తరువాత కల్యాణి చేసింది. ఆపైన ఇద్దరూ సమాలోచించుకొన సాగారు. ‘‘ఇప్పుడు ఎక్కడికి వెళదాము, ఏం చేద్దాము?’’ అని.

కల్యాణి ‘‘ఇంటి దగ్గర ఆపదలు సంప్రాప్తం అవుతాయని ఇల్లువిడిచి బయలుదేరాంగదా! ఇల్లు విడిచిన తరువాతనే మనకు ఆపదలు అధికం అయినాయి. అందుచేత తిన్నగా ఇంటికి వెళ్లిపోదాం’’ అంది. మహేంద్రుడికి కూడా ఇంటికి వెళ్లిపోవడమే మంచిదనిపిస్తోంది. మహేంద్రుడి ఆలోచన ఏమిటంటే కల్యాణిని ఇంటిదగ్గర దిగవిడిచి, నమ్మకమైన నౌకరును ఒకడిని ఏర్పాటుచేసి తాను ఇక్కడకు తిరిగి వచ్చి మాతృసేవా వ్రతంలో పాల్గొనాలని! అందుచేత ఇంటికి వెడదామని భార్య ప్రతిపాదించడంతోటే అతడు వెంటనే అంగీక రించాడు. అమ్మాయి నిద్ర నుండి మేలుకోగానే వారు పదచిహ్న గ్రామంవైపు ప్రయాణం సాగించారు.

అయితే ఈ అరణ్య ప్రాంతం నుండి పదచిహ్న గ్రామానికి రహదారి ఎటువైపు ఉన్నదో వారికి తెలియకుండా అయిపోయింది. ఈ అరణ్యం దాటి బయటపడితే పదచిహ్న గ్రామానికి దారి దొరుకు తుంది. కాని ఇది దాటటం ఎట్లా? ఎటు తిరిగి ఎటు వచ్చినా వారికి మఠమే అగుపిస్తూ వచ్చింది. ఎవరినైనా అడిగి తెలుసుకుందామన్నా మానవమాత్రుడెవరూ అగుపించడం లేదు. వారు అలా వేచివుండి చూస్తూ ఉండగా ఒక వైష్ణవ వేషధారి నవ్వుతూ ఎదురుగా నిలబడి అగుపించాడు. అతడి నవ్వు చూచి మహేంద్రుడు కోపంతో మండి పోయాడు.

‘‘ఎందుకలా నవ్వుతున్నారు గోస్వామీ?’’ అని అడిగాడు మహేంద్రుడు అంత కోపంలోనూ.

‘‘మీరు ఈ వనంలోనికి ఎలా రాగలిగారు?’’

‘‘ఎలా వస్తేనేం, వచ్చాం.’’

‘‘రాగలిగినప్పుడు బయటకు ఎందుకు వెళ్లలేకపోతున్నారు?’’ ఈ ప్రశ్న వేసి, వైష్ణవ వేషధారి మొదటి కంటె ఎక్కువగా నవ్వసాగాడు.

మహేంద్రుడు ఇందాకటికంటే ఎక్కువగా రెచ్చిపోయి ‘‘నవ్వుతున్నారుగాని మీరు మాత్రం ఇక్కడి నుండి బయటకు వెళ్లగలరా?’’ అన్నాడు.

‘‘నాతోరండి. నేను దారిచూపిస్తాను. బహుశ మీరు బ్రహ్మచారితోనో, అతని అనుయాయులతోనో వచ్చి ఉంటారు. లేకపోతే ఈ అరణ్యంలోనికి రావడం సాధ్యం కాదు. అపరిచితులకు ఇదంతా దుర్గమంగా ఉంటుంది.’’

ఈ మాటలు విని మహేంద్రుడు ‘‘మీరు కూడా సంతానులేనా?’’ అని అడిగాడు.

‘‘అవును. నేనూ సంతానుడనే! నాతో రండి. మీకు దారి చూపించడంకోసమే! నేనిక్కడ నిలువ బడ్డాను.’’

 ‘‘తమ పేరు ఏమిటి?’’

‘‘నా పేరు ధీరానందస్వామి.’’

ధీరానందస్వామి ముందు నడుస్తున్నాడు. ఆయన వెనుక కల్యాణితో కలసి మహేంద్రుడు నడుస్తున్నాడు. ధీరానందుడు వారిని దుర్గమమైన దారివెంట నడిపించి బయటకు తీసుకువచ్చాడు. బయటికి వెళ్లేందుకు రహదారి చూపి, తాను తిరిగి అరణ్యంలో ప్రవేశించాడు.

మహేంద్రుడు గాఢమైన నిట్టూర్పు విడిచి ఇలా అన్నాడు ‘‘నేనిప్పుడు స్వాస్థ్యంలో లేను. నేనేం చేయాలో నాకు తెలియకుండా పోతోంది.’’ ‘‘ఎందు వలన?’’ ‘‘మిమ్మల్ని పోగొట్టుకున్న తరువాత నేను ఎన్ని కష్టాలకు గురి అయినానో తెలుసా?’’ అంటూ మహేంద్రుడు పూసగుచ్చినట్లు సమాచారం అంతా చెప్పాడు.

కల్యాణి అంతా విని ఇలా అంది. ‘‘నేనూ ఎన్నో ఆపదలు పడవలసి వచ్చింది. అవన్నీ ఏకరువు పెట్టి ఏం ప్రయోజనం? అయినా విచిత్రం, ఇన్ని కష్టాల లోను నాకు ఎలా పట్టిందో తెలియదుగాని నిద్ర పట్టింది. నిన్న రాత్రి తెల్లవారుజామున నిద్ర పోయాను. ఆ నిద్రలోనే ఒక కల కన్నాను. ఎలా జరిగిందో తెలియదుగాని నేను అపూర్వస్థానంలో చేరివున్నాను. అది నా పుణ్య విశేషమే! అక్కడ మట్టిలేదు. అంతటా వెలుగు, వెన్నెల. అక్కడ ఎవరూ మనుషులు లేరు. ప్రకాశమైన మూర్తులు మటుకు ఉన్నాయి. అక్కడ ఏమీ శబ్దాలు కూడా వినరావడం లేదు. చాలాదూరం నుండి అపూర్వమైన సంగీత నాదాలు వినవస్తున్నాయి. అక్కడ అన్నిటికీ ఎత్తున ఎవరో కూర్చుని ఉన్నారు. ఆయన శరీర కాంతి నీలవర్ణంతో అగ్నిశిఖలాగ వెలిగిపోతోంది. ఆయన తలమీద సూర్యునివలె వెలిగిపోతున్న కిరీటం ఉన్నది. ఆయనకు నాలుగు చేతులు. ఇరువైపులా ఏమేమి ఉన్నాయో నేను గమనించ లేకపోయాను. కాని ఒక స్త్రీమూర్తి ఉన్నట్లు మాత్రం అనిపించింది. ఆ రూపం, ఆ సౌరభం, ఆ సౌందర్యం చూసి నేను విహ్వలనై పోయాను. ఆయన ఎవరో, ఆ వైభవాన్నంతటిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఆ చతుర్భుజ మూర్తికి ఎదురుగా ఒక స్త్రీమూర్తి ఉన్నది. ఆమె కూడా జ్యోతిర్మయి వలె ఉన్నది. నాలుగుపక్కలా మేఘాలు ఆవరించినట్టు ఉంది. నేను ఆసాంతం విరామంగా చూడలేక పోయాను. అస్పష్టరూపంగా నాకు తెలియవచ్చిన దేమిటంటే ఆ నారీమూర్తి దుర్బల మర్మ పీడిత, అనన్యరూప అయివుండి, దుఃఖిస్తున్నదని! అక్కడి మంద సుగంధ పవనాలు నన్ను ఆ చతుర్భుజుని పాద సన్నిధికి తీసుకు పోయినాయి. ఆ స్త్రీమూర్తి నన్ను చూపుతూ ‘ఇదుగో – ఈమె! ఈమె కారణంగానే మహేంద్రుడు నా ఒడిలోనికి రాకుండా ఉన్నాడు’ అని చెప్పింది.

ఈ మాటల తరువాత అపూర్వమైన వేణునాదం వినవచ్చింది. ఆ నాదం చతుర్భుజునినుండి వచ్చింది. ఆయన నాతో ఇలా అన్నాడు :

‘నీవు నీ భర్తను వదిలి, నా దగ్గరకురా! ఈమె మీ కందరికీ మాత! మహేంద్రుడు ఈమె సేవ చేస్తూ ఉండిపోతాడు. నీవు నీ భర్త దగ్గరే ఉండిపోయేట్ల యితే, అతడు ఆ సేవలో పాల్గొనడం కష్టమయి పోతుంది. నీవు నా దగ్గరకు వచ్చివేయి!’

నేను ఏడుస్తూ ఇలా బదులు చెప్పాను : ‘భర్తను వదిలి ఎలారాను?’’

పూర్వపు అపూర్వ స్వరంలోనే చతుర్భుజమూర్తి ఇలా అన్నాడు : ‘నేనే భర్తను. నేను పుత్రుడను. నేనే తల్లిని. నేనే తండ్రిని. నేను పుత్రికను. అన్నీ నేనే! నా దగ్గరకు వచ్చివేయి!’ అని. నేను ఏం జవాబు చెప్పానో నాకు గుర్తులేదు. ఇంతలోనే నాకు నిద్ర మెలుకువ వచ్చేసింది’’ ఈ మాటలతో కల్యాణి తిరిగి నిశ్శబ్దంలో మునిగిపోయింది.

మహేంద్రుడు విస్మితుడైనాడు. స్థంభించి పోయాడు. కొంతసేపు తరువాత కల్యాణి ఇలా అంది. ‘‘ఏమిటి ఆలోచిస్తున్నారు?’’

‘‘అంతా కల. మనసులో పుట్టి మనసులో అంతరి స్తుంది. పద, ఇంటికి వెడదాం’’ అన్నాడు మహేంద్రుడు.

‘‘చతుర్భుజుడు మిమ్ము ఎక్కడకు వెళ్లమని ఆదేశించారో, అక్కడకు వెళ్లండి!’’ కల్యాణి సుకుమారిని భర్తకు అందించింది. ‘‘అయితే మరి మీరు ఎక్కడికి వెడతారు?’’ అని అడిగాడు మహేంద్రుడు అమ్మాయిని అందుకుంటూనే.

‘‘నాకు కూడా చతుర్భుజుడు మార్గం చూపించాడు కదా! అక్కడికే వెడతాను’’ అంది కల్యాణి కళ్లనీళ్లు తుడుచుకుని, దుఃఖం దిగమింగుకోవటానికి ప్రయత్నం చేస్తూ.

మహేంద్రుడు నివ్వెరపోయాడు. ‘‘ఎక్కడికి? ఎక్కడికి? ఎలా వెడతావు?’’ అన్నాడు.

కల్యాణి అతనికి సమీపంగా వెళ్లి తన చెంగున దాచుకున్న విషపు డబ్బా చూపించింది.

మహేంద్రుడు భయపడిపోయాడు. ‘‘ఇదేమిటి, విషం తింటావా?’’ అన్నాడు.

‘‘తినాలనే అనుకుంటున్నాను. కాని…’’ ఆమె వాక్యం పూర్తి చేయలేకపోయింది.

మహేంద్రుడు కొన్ని క్షణాలు వేచివుండి, తరువాత ‘‘చెప్పు! ఏమిటో!’’ అన్నాడు.

‘‘విషం తిందామనే ఉంది. కాని మిమ్ము, సుకుమారిని వదలి, వైకుంఠానికి వెళ్లడానికి కూడా మనస్కరించడం లేదు. నేను మరణానికి చేరువ కాలేకపోతున్నాను’’ అంది.

ఈ మాట అంటూ ఆమె విషపుడబ్బాను నేలమీద ఉంచింది. మాటల సందర్భంలో ఇద్దరూ అన్య మనస్కులు అయినారు. ఈ సమయంలో ఆడుతూ ఉన్న సుకుమారి ఆ విషపుడబ్బాను తీసుకుంది. ఆ సంగతి ఆ ఇద్దరిలో ఎవరూ గమనించలేదు.

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram