– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌రాజకీయ నాయకులకు.. ముఖ్యంగా ప్రతిపక్షాల నాయకులకు, పాదయాత్రలకు అవినాభావ సంబంధం ఉంది. ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు, అధికార పీఠాన్ని అందుకునేందుకు వారు దీనిని ఒక సాధనంగా ఎంచుకుంటారు. ఇది వాస్తవం. కానీ ఈ విషయాన్ని ఎవరూ ఒప్పుకోరు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వారి కష్టాలను దగ్గరగా చూసి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు, వివిధ వర్గాల ప్రజల మధ్య సమైక్యత, స్నేహభావం పెంపొందించేందుకు మాత్రమే తాము పాదయాత్ర చేస్తున్నట్లు నాయకులు బీరాలు పలుకుతుంటారు. సూక్తులు వల్లె వేస్తుంటారు. సుద్దులు చెబుతుంటారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అనధికార యువరాజు రాహుల్‌ ‌గాంధీ చేస్తున్నదిదే. ఇక్కడ కాంగ్రెస్‌ అనధికార యువరాజు అన్న విషయమై కొంత వివరణ ఇవ్వాల్సి ఉంది. తాను కాంగ్రెస్‌ ‌పార్టీలో అందరి మాదిరిగా సాధారణ కార్యకర్తని అని ఆయన పైకి వినయం, విధేయత ప్రదర్శిస్తుంటారు. కానీ పార్టీలో తల్లి తరఫున అన్ని వ్యవహారాలను చక్కబెట్టేది ఆయనేనన్నది జగమెరిగిన సత్యం. బయటివారి కన్నా పార్టీ శ్రేణులకు ఈ విషయం బాగా తెలుసు. ఇక ఆయన సాగిస్తున్న పాదయాత్ర విషయానికి వస్తే కొన్ని కఠిన వాస్తవాలను, చేదు నిజాలను ఒప్పుకోక తప్పదు. ఆయన పైకి చెబుతున్నది ఒకటి, అసలు అంతరంగం మరొకటి.


ప్రజల మధ్య విద్వేషాలను, విభజనలను తొలగించి, వారిలో జాతీయ సమైక్యత, సమగ్రత భావాలను పెంపొందించడం, దేశాన్ని సమైక్యంగా ఉంచడం తన ‘భారత జోడోయాత్ర’ లక్ష్యమని రాహుల్‌ ‌ప్రతి సభలోనూ నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ మాట చెప్పడానికి, వినడానికి బాగా కనిపించ వచ్చు. కానీ ఇందులో ఎంత వాస్తవం ఉందన్న విశ్లేషిస్తే నేతి బీరకాయలో నేయి ఎంతుందన్న సామెత గుర్తుకు రాక మానదు. ముందుగా ప్రజల్లో విద్వేషాలను, విభజన వాదాలను తొలగించడమే తన లక్ష్యమన్నట్లు రాహుల్‌ ‌పదేపదే ఊదరగొడుతున్నారు. కానీ ఆయన అనుకున్నట్లు ప్రజల్లో అలాంటి భావనలు ఏనాడూ లేవు. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావని సమైక్యంగా ముందుకు సాగుతూనే ఉంది. భిన్న వర్గాలు, మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, సామాజిక వర్గాల ప్రజలు కలసిమెలసే ఉంటున్నారు. ఇతరుల అభిప్రాయాలను, పద్ధతులను, ఆచార వ్యవహారాలను, విశ్వాసాలను పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు. వారి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు. రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు అలాంటి ప్రచారాలు చేస్తున్నప్పటికీ ప్రజలు వివేకంగా వ్యవహరించి అలాంటి ప్రయత్నాలను తిప్పి కొట్టడం ద్వారా నాయకుల కుయత్నాలను అడ్డుకుంటున్నారు. ఈ విషయం రాహుల్‌కు తెలియదునుకోలేం. లౌకికవాదం పేరిట ఒక వర్గాన్ని నెత్తిన పెట్టుకోవడాన్ని, మరొక వర్గాన్ని చిన్నచూపు చూడటాన్ని సమయం వచ్చినప్పుడల్లా తిప్పికొడుతూనే ఉన్నారు. వివిధ సందర్భాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మైనార్టీల హక్కులు ఎంత ముఖ్యమో అదే సమయంలో మెజార్టీ ప్రజల మనోభావాలను గుర్తించడం, గౌరవించడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని యువ నాయకుడు రాహుల్‌ ‌గుర్తించడం లేదు. అందువల్లే వందేళ్ల చరిత్ర గల హస్తం పార్టీ నానాటికీ కుదేలైపోతోంది. ఇక వామపక్షాలు ఉనికి కోల్పోయే దుస్థితిలో ఉన్నాయి.

తాను తలపెట్టిన భారత్‌ ‌జోడోయాత్ర ద్వారా పార్టీకి పూర్వ వైభవం తేవాలన్నది రాహుల్‌ ‌ప్రయత్నం. కానీ పైకి మాత్రం ఆయన ఆ మాట చెప్పరు. దేశాన్ని ఉద్ధరించేందుకే తన తాపత్రయం అన్న భావన కలిగించేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి ఒక పార్టీ నాయకుడిగా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో తప్పేమీ లేదు. అభినందించాల్సిన విషయమే. పార్టీని బలోపేతం చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తారు. పాదయాత్ర అందులో ఒకటి. ఇందులో అభ్యంతరం పెట్టాల్సిందేమీ లేదు. పార్టీ కోసం కాకుండా దేశం కోసం చేస్తున్నాననడమే అతిశయోక్తి. కన్యాకుమారిలో మొదలైన పాదయాత్ర వివిధ ప్రాంతాల మీదుగా 3570 కిలోమీటర్లు సాగి కశ్మీర్‌లో ముగుస్తుంది. సెప్టెంబర్‌ 7‌న తమిళనాడులో ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. తరవాత కర్ణాటక మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళుతుంది. రోజుకు ఉదయం పది, సాయంత్రం పది కిలోమీటర్ల చొప్పున సగటున 20 కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు రాహుల్‌. ‌కేరళలో 18 రోజులు, మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్రలో 18 రోజుల వంతున, తెలంగాణలో 13, హర్యాణాలో 12, పంజాబ్‌లో 11 రోజులు పాదయాత్ర చేస్తారు. దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్‌లో మాత్రం అయిదు రోజులే పాదయాత్ర కొనసాగు తుంది. అమేథీ ప్రజలు తిరస్కరించగా కేరళలోని వయనాడ్‌కు ఆయన మూటా ముల్లే సర్దుకుని వచ్చిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులు రాహుల్‌ ‌యాత్ర సాగిస్తారు. ఫిబ్రవరిలో జమ్ము కశ్మీర్‌కు చేరుకోవడం ద్వారా యాత్ర పరిసమాప్తమవుతుంది.

పాదయాత్రలో రాహుల్‌, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తన్న పనులు బెడిసి కొడుతున్నాయి. జోడో యాత్రకు విరాళాలు ఇవ్వాలంటూ కొందరు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు వ్యాపారులను బలవంతం చేయడం ద్వారా పార్టీ అసలు నైజాన్ని చాటుకుంది. కొల్లాంలోని ఫవాజ్‌ అనే ఓ కూరగాయల వ్యాపారిని రూ. 2వేలు విరాళం డిమాండ్‌ ‌చేయగా ఆ వ్యాపారి రూ. 500కు మించి ఇవ్వనని తిరగబడటం పార్టీని నవ్వుల పాల్జేసింది. అడిగినంత విరాళమివ్వని వ్యాపారిని చంపుతామని పార్టీ కార్యకర్తలు బెదిరించడం పరాకాష్ట. అతని కూరగాయల దుకాణాన్ని చిందరవందర చేసి తమ చపలత్వాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ ‌కావడంతో పార్టీకి మింగలేని, కక్కలేని పరిస్థితి ఎదురైంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులైన ముగ్గురు కార్యకర్తలను సస్పెండ్‌ ‌చేసింది. తమ పార్టీ ఇలాంటి వాటిని ఎప్పుడూ ప్రోత్సహించదని, ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదని కేరళ పీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్‌, ‌కర్ణాటకకు చెందిన పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ‌పేర్కొన్నారు. పాదయాత్రలో రాహుల్‌ ‌చేసే విన్యాసాలు, చేసే ప్రసంగాలు నవ్వు తెప్పిస్తున్నాయి. దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం తాండవిస్తోందని, ఉపాధి లేక యువత నైరాశ్యంలో కూరుకుపోయిందని, ధరల పెరుగుదలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారని ఇందుకు మోదీ సర్కారుదే బాధ్యతని ధ్వజమెత్తుతున్నారు. నిరుద్యోగ సమస్యకు దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన హస్తం పార్టీకి బాధ్యత లేదా అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఈ విషయాన్ని ఆయన గ్రహించినట్లు లేదు. ధరల పెరుగుదల గురించి ఆయన మాట్లాడటం మరింత వింతగా ఉంది. ధరల పెరుగుదల అనేక విషయాలతో ముడిపడి ఉన్న విషయం ఆయనకు తెలియదని అనుకోలేం. దేశ సరిహద్దులను చైనాకు ధారాదత్తం చేశారన్న రాహుల్‌ ‌వ్యాఖ్యలూ హాస్యాస్పదంగా ఉన్నాయి. తన అనాలోచిత వ్యాఖ్యల ద్వారా సైనిక బలగాల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారన్న విషయాన్ని యువరాజు గ్రహించలేకపోతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి జవాన్లు పని చేయడాన్ని అభినందించాల్సింది పోయి ఇలా మాట్లడటం సరికాదు. ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఎవరి హయాంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందో అర్థమవుతుంది. తన ముత్తాత హయాంలో యుద్ధంలో ఓడిపోయి భారత్‌ ‌తన భూభాగాన్ని చైనాకు కట్టబెట్టిందన్న విషయం భావి భారత ప్రధాని కావాలని కలలు గంటున్న రాహుల్‌కు తెలియదా?

పాదయాత్రలో భాగంగా రాహుల్‌ ‌చేసే విన్యాసాలు పేపర్లలో ఫొటోలు వేయించుకోవడానికి పనికి వస్తాయి తప్ప పార్టీ బలోపేతానికి పనికిరావు. రోడ్డు పక్కన కాకా హోటల్లో తేనీరు తాగడం, కూరగాయల వ్యాపారితో మాట్లాడటం, కార్మికుడితో సంభాషించడం, సామాన్యుడి భుజంపై చేయి వేసి నడవటం వంటివి ప్రచార జిమ్మిక్కులు తప్ప మరొకటి కావు. మరుసటి రోజు పేపర్లలో ఫొటోలు వేయించుకోవడానికి ఇలాంటి జిమ్మిక్కులు ఉపయోగపడతాయి. ‘పాదయాత్రలో ఎంతోమంది యువకులు నాతో కలసి నడుస్తున్నారు. వారు నా నుంచి ఏమి ఆశిస్తున్నారో, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏం చేయాలో, వారికి అవకాశాలు కల్పించడానికి ఏం చేయాలో తెలుసుకుంటున్నాను. దేశంలో యువశక్తి గణనీయంగా ఉంది. వారిని సరిగా వినియోగించుకుంటే అద్భుతాలు చేయవచ్చు. యాత్రలో భాగంగా అన్ని వర్గాల సమస్యలు తెలుసుకోవడం నా బాధ్యత’ అని రాహుల్‌ ఊదర గొడుతున్నారు. వందేళ్ల చరిత్ర గల పార్టీకి దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి గల పరిష్కార మార్గాల గురించి తెలియదనుకోవడం భ్రమ. బహుశా రాహుల్‌కు తెలియకపోవచ్చు. మార్గ మధ్యంలో హిందూమతానికి చెందిన ప్రతినిధులను రాహుల్‌ ‌కలుస్తుండటం విశేషం. కొల్లాం జిల్లాలోని కరుగాపల్లి సమీపంలో ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయిని ఆయన కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇదంతా హిందువులను ప్రసన్నం చేసుకునే పక్రియలో భాగం తప్ప మరొకటి కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రజల్లో విశ్వాసం కల్పించడం, పార్టీ శ్రేణుల్లో భరోసా నింపడం, దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై నిర్దిష్ట పరిష్కారాలను ప్రజల ముందుం చడం ద్వారా మాత్రమే ఏ నాయకుడైనా అధికారానికి చేరువ కాగలడు. అంతేతప్ప శుష్క ప్రసంగాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, ఏకపక్షంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం, బాధ్యత లేని అధికారం చెలాయించడం ద్వారా ప్రజలకు చేరువ కాలేరు. ఈ విషయం హస్తం శ్రేణులు, సీనియర్‌ ‌నాయకులు గుర్తించడం అవసరం.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram