– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌వినాయక చవితి.. దేశమంతటా అత్యంత ఆర్భాటంగా, ఘనంగా జరుపుకునే ప్రధాన పండుగ. ఊరూ వాడా ఏకమవుతుంది. గల్లీ గల్లీలో గణనాథుని ప్రతిష్టిస్తారు. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఆ తర్వాత గంగమ్మ చెంతకు గణేశున్ని మందీ మార్బలంతో, డప్పు చప్పుళ్లతో, డీజే మోతలతో తీసుకెళ్తారు. భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న విఘ్నేశ్వరుడిని అంతే భక్తిభావంతో నిమజ్జనం చేస్తారు. ఈ కోలాహలం, సందడి ప్రతి సంవత్సరం ఉండేదే.

కానీ ఈ ఏడాది తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వినాయక నవరాత్రుల వేడుకల వేళ వ్యవహరించిన తీరు, న్యాయస్థానాల ఆదేశాలను కూడా పట్టించుకోని వైనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. ఉత్సవాల్లో మమేకమైన జనాలకు, గణనాథున్ని కొలుస్తున్న భక్తులకు ఆటంకం కలిగించింది. ఒక రకంగా ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. గణేశ్‌ ఉత్సవ సమితిని రోడ్డుమీదకు లాగింది. చివరకు ఆమరణ నిరాహార దీక్షకు ఉసిగొల్పింది. నిరసనలు, ఆందోళనలకు కారణమయింది. తమ మనోభావాలు దెబ్బ తీయొద్దంటూ, వినాయకుడి నిమజ్జనానికి ఆటంకాలు కలిగించొ ద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తూ రాజకీయ పార్టీలు డిమాండ్లు చేసినట్లు హిందూ సంఘాలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనంతటికీ తాను అసలైన హిందువునని బాహాటంగా, అవసరం వచ్చినప్పుడల్లా చెప్పుకునే కేసీఆర్‌ ‌ప్రభుత్వ వైఫల్యమే కారణం.

వినాయక నవరాత్రుల పూజల అంశం పక్కన బెట్టి నిమజ్జనం ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితులు తలచుకొని భక్తులు దిగులు చెందారు. వినాయక చవితి తొలి నాలుగు రోజులు అందరూ ఎప్పటిలాగే సాఫీగానే పూజల్లో నిమగ్నం అయ్యారు. కానీ, నిమజ్జనోత్సవం దగ్గర పడుతున్న కొద్దీ గణనాథున్ని ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక అందరూ తలలు పట్టుకున్నారు. ప్రభుత్వం కనీసం ఏర్పాట్లు చేయకపోవడం, ఏ ప్రయత్నాలూ మొదలు పెట్టకపోవడం, పోలీసుల ‘అతి’ కలగలిపి రాష్ట్రంలో సందిగ్ధకర పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రతియేటా భాద్రపద మాసంలో నిర్వహించే వినాయక నవరాత్రోత్సవాలకు హైదరాబాద్‌ ‌పెట్టింది పేరు. ఈ వేడుకల పేరు చెబితే దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు, హైదరాబాద్‌ ‌గుర్తొస్తాయి. దేశంలో ఎక్కడా జరపని రీతిలో ఈ నగరాల్లో వినాయక చవితి, నిమజ్జనోత్సవం జరుగుతాయి. తమ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నట్లు, తమ వాడలో సంబరాలు సాగుతున్నట్లు, తమ ఊళ్లో జాతర కొనసాగుతున్నట్లు ప్రతి ఒక్కరూ ఈ వినాయక నవరాత్రోత్సవాల్లో పాలు పంచుకుంటారు. యేడాది పాటు గుర్తుంచుకునే రీతిలో, ఆ మధుర స్మృతులు వెంటాడే తరహాలో అత్యంత కోలాహలంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. చివరి రోజు బొజ్జ గణపయ్యను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్‌లో నిమజ్జనోత్సవం చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తజనం తండోపతండాలుగా తరలివస్తారు. అలాంటి వినాయక నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం ఈసారి శీతకన్ను వేసింది. వాస్తవానికి వినాయక చవితి రోజు ప్రతిష్ఠించిన గణేశుడి నిమజ్జనం మూడోరోజు నుంచే ప్రారంభమవుతుంది. సమీపంలోని చెరువులు, నదులు, వాగుల్లో గణపతిని నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్‌లో అయితే ప్రధానంగా హుస్సేన్‌ ‌సాగర్‌తో పాటు.. సరూర్‌నగర్‌ ‌చెరువుల్లో ప్రభుత్వం అధికారిక ఏర్పాట్లు చేస్తుంది. వీటితోపాటు ఆయా ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లోనూ అవసరమైన సదుపాయాలు కల్పిస్తుంది. కానీ, ఈ యేడాది ఐదురోజులు గడిచినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కనీసం నెలరోజుల ముందు నుంచే కార్యాచరణ ప్రకటించి, సంబంధిత అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ గణేశ్‌ ఉత్సవ సమితి తోడ్పాటుతో నిర్విఘ్నంగా వేడుకలు నిర్వహించాల్సి ఉండగా.. ఆ అంశాన్ని అసలు పట్టించుకోలేదు. చివరకు గణేశ్‌ ఉత్సవ సమితి ఆమరణ నిరాహార దీక్షకు దిగితే గానీ ప్రభుత్వం దిగిరాలేదు. ఈ పరిణామాలు సర్కారు బాధ్యతను మరోసారి గుర్తు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. అడిగితే తప్ప ఏదీ చేయబోమని, డిమాండ్లు చేసి.. నిరసనలు, దీక్షలకు దిగితే గానీ తమ తప్పేంటో తెలుసుకోలే మన్న స్థితిలో ప్రభుత్వం ఉందన్న సంకేతాలు వచ్చాయి. తప్పనిసరిగా చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా మరుగున పడేస్తుందన్న భయంకర వాస్తవం తెలిసొచ్చింది.

గణేశ్‌ ఉత్సవ సమితి హుస్సేన్‌ ‌సాగర్‌ ‌సహా.. చెరువులు, తాత్కాలిక పాండ్లలో ఏర్పాట్లపై పరిశీలన చేపట్టింది. కానీ, ప్రభుత్వ అధికారులు, పోలీసులు వాటి పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించలేదు. దీంతో, ఉత్సవ సమితి అనుమానం వ్యక్తం చేసింది. సర్కారు దిగొచ్చే దాకా సమరమే అంటూ రంగంలోకి దిగింది. గణపతి నవరాత్రోత్సవాలు నిర్విఘ్నంగా సాగేలా, మంటపాల నిర్వాహకులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం, ప్రభుత్వ శాఖలకు, విఘ్నేశ్వరుని భక్తులకు మధ్య గౌరవప్రదంగా, హుందాగా వేడుకలను నిర్వర్తించాల్సిన గణేశ ఉత్సవ సమితికి సర్కారు ఈసారి అదనపు పని కల్పించింది. డిమాండ్లు, ఆందోళనలు, నిరసనలు, బైఠాయింపులు, బైక్‌ ‌ర్యాలీలు, దీక్షలు, ఆమరణ దీక్షలకు దిగేలా పరిస్థితులను కల్పించింది. దీంతో, అనివార్యంగా ఉత్సవ సమితి పోరుబాట పట్టక తప్పలేదు. హుస్సేన్‌సాగర్‌ ‌చుట్టూ బైక్‌ర్యాలీలతో సాగరహారం నిర్వహించాలని తలచింది. అయితే, వారిని మొదట్లోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వందలమంది రోడ్డుపైనే బైఠాయించారు. చివరకు పోలీసులు ఈ కార్యక్రమాన్ని అణచివేసే క్రమంలో ఉత్సవ సమితి నాయకులను, పెద్ద సంఖ్యలో కార్యకర్తలను అరెస్టు చేశారు. నగరంలోని పలు పోలీస్‌ ‌స్టేషన్లకు వాళ్లను తరలించారు.

ప్రభుత్వం ఏర్పాట్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామని ఉత్సవ సమితి ప్రకటించింది. అరెస్టయిన నాయకులు పోలీస్‌ ‌స్టేషన్‌లోనే ఆమరణ దీక్ష ప్రారంభించారు. దీంతో, పోలీసులు ఝలక్‌ ‌తిన్నారు. సాయంత్రం వాళ్లందరినీ బలవంతంగా ఉత్సవ సమితి కార్యాలయం బహేతి భవన్‌లో వదిలేసి వెళ్లారు. అక్కడే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు. హిందూ ధార్మిక హక్కును కాపాడటానికి ఉత్సవ సమితి చేస్తున్న ఉద్యమానికి హిందూ సంస్థలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయాలకు అతీతంగా యావత్‌ ‌హిందూ సమాజం సంఘీభావం పలికి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమయ్యింది. భారతీయ జనతాపార్టీ గణేశ్‌ ఉత్సవ సమితికి సంఘీభావం ప్రకటించింది. తీవ్రస్థాయిలో స్పందించింది. తక్షణమే గణేశ్‌ ‌నిమజ్జనోత్సవ ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. లేదంటే హైదరాబాద్‌లో లక్షల సంఖ్యలో ప్రతిష్ఠించిన వినాయక ప్రతిమలను ప్రగతి భవన్‌కు తీసుకొస్తా మని, కేసీఆర్‌ ఎలా అడ్డుకుంటారో చూస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ నినాదం గణేశ్‌ ఉత్సవ సమితికి, గణపతి భక్తులకు ఓ టానిక్‌లా పనిచేసింది. నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. చివరకు ప్రభుత్వం దిగొచ్చింది. నిమజ్జన ఏర్పాట్లకు సిద్ధమైంది. హుటాహుటిన భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎం‌సీ ఆధ్వర్యంలో మొత్తం 10 క్రేన్లను ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్‌ ‌మార్గ్‌తో పాటు ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు కూడా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.

వాస్తవానికి ఖైరతాబాద్‌ ‌మహాగణపతి మినహా ఇతర ప్రతిమలను ట్యాంక్‌ ‌బండ్‌లో నిమజ్జనం చేయకూడదని కేసీఆర్‌ ‌ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. ప్రతిమలన్నింటినీ ప్రత్యేకంగా నిర్మించిన బేబీ పాండ్లకే పరిమితం చేయాలని అనుకున్నట్లు చెబుతున్నారు. అన్ని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు బేబీ పాండ్లు సరిపోవు. కానీ, ప్రభుత్వం ఈ చిన్న లాజిక్‌ ‌కూడా మరచింది. గత యేడాది కూడా ఇలాగే గణపతి నిమజ్జనం సమయంలోనే వివాదం నెలకొంది. అప్పుడు కూడా చివరి సమయం దాకా ప్రభుత్వం వేచి చూసింది. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొనడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. వాస్తవానికి కాలుష్యం, పర్యావరణం అనే అంశాలతో గతేడాది న్యాయస్థానానికి చేరిన వివాదం ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. అయితే, ప్రభుత్వమే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని, ఉత్సవాలకు ముందే సరైన కార్యాచరణ రూపొందిస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉత్సవాలు సజావుగా సాగిపోయేవి. కానీ, సర్కారు ఆ అంశాన్ని గాలికొది లేసింది. ప్రతిసారీ ఇలాంటి వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా మార్గదర్శ కాలు రూపొందించాలని న్యాయస్థానం సలహా కూడా ఇచ్చింది. అయినా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.

About Author

By editor

Twitter
Instagram