– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

అమరావతినే ఆంధప్రదేశ్‌ ‌రాజధానిగా పేర్కొంటూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చి ఆరు నెలలు గడిచినా దానిని అమలు చేయడంలో వైకాపా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడం, విషప్ర చారాన్ని మరింత తీవ్రం చేస్తుండడంతో అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అమరావతిపై ప్రభుత్వం, వైకాపా నేతలు చేస్తున్న దృష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, రాజధాని ఆవశ్యకత రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు పాదయాత్రలు చేస్తున్నారు. మొదటి విడతలో దక్షిణ కోస్తా, రాయలసీమలోని చిత్తూరు జిల్లా గుండా సాగిన ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో సాగిన యాత్ర.. ఈసారి మధ్య ఆంధ్ర, ఉత్తరాంధ్ర వరకు చేపట్టారు. తేజోమూర్తి అయిన అరసవల్లి సూర్యభగవానుడి చెంతకు పాదయాత్ర చేపట్టారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు గడిచిన సందర్భంగా ప్రారంభించిన ఈ రెండో పాదయాత్రకు అన్ని పార్టీల నుంచి ఇప్పటికే మద్దతు లభిస్తోంది. అమరావతి రాజధానిపై కోర్టు తీర్పుకు ముందు వరకు ‘సేవ్‌ అమరావతి’ అని శిబిరాల్లో రైతులు నినాదాలు చేస్తూ, ఉద్యమాన్ని విస్తరించారు. తీర్పు అనంతరం పాత నినాదం స్థానంలో ‘బిల్డ్ అమరావతి’ నినాదంతో ముందుకు సాగుతున్నారు. అటు ఉద్యమం చేస్తూనే రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ సాచివేత వైఖరిపై న్యాయ పోరాటాన్ని కూడా ప్రారంభించారు.

అమరావతి టు అరసవల్లి

మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం సెప్టెంబరు 12 నాటికి వెయ్యి రోజులకు చేరింది. గతేడాది నవంబరు ఒకటి నుంచి డిసెంబరు 15 వరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించారు. రెండవ విడతగా ఈ నెల (సెప్టెంబరు) 12 నుంచి పాదయాత్ర ప్రారంభిం చారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం మీదుగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు 630 కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర జరుగుతుంది. వెంకటాయపాలెంలోని టీటీడీ నిర్మించిన వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితులు నిర్ణయించిన ముహూర్త సమయానికి రైతులు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, మంగళగిరి మీదుగా విజయవాడ చేరుకుని మోపిదేవి, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి అమరావతిని పరి రక్షించాలంటూ రైతులు దేవుళ్లను వేడుకోనున్నారు. యాత్రలో 600 మంది రైతులు పాల్గొనేందుకు అనుమతించారు. పాదయాత్రలో ముందుభాగాన తిరుమలేశుడు, భూదేవి, శ్రీదేవి సమేత రథం, దాని ముందుభాగాన సూర్య భగవానుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌చిత్ర పటంతో దళిత ఐక్యకార్యాచరణ సమితి నాయకులు, రైతులు, రైతు కూలీలు పాదయాత్రలో ముందుకు కదిలారు. యాత్రకు సంఘీభావంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు జరుగుతున్నాయి.

బీజేపీ మద్దతు

అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి బీజేపీ మొదటి నుంచి మద్దతు ఇస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్ల నిధులు అందించింది. హడ్కో ద్వారా రుణం కూడా ఇప్పించింది. ప్రధాని నరేంద్రమోదీ శంకు స్థాపన చేసిన ప్రాంతం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని బీజేపీ రాష్ట్ర శాఖ అప్పటి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు. అమరావతి రైతులు చేస్తున్న దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు. తిరుపతికి వెళ్లిన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఇటీవల ‘మనం-మన అమరావతి’ పేరుతో బీజేపీ  నాయకులు వల్లూరి జయప్రకాష్‌ ‌నారాయణ ఆధ్వర్యంలో పాదయాత్ర కూడా చేశారు. సెప్టెంబరు 12న అరసవల్లికి ప్రారంభమైన పాదయాత్ర రెండవ రోజు మంగళగిరి ప్రాంతంలో కన్నా లక్ష్మీనారాయణ, వల్లూరి జయప్రకాష్‌ ‌పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా రేపల్లెలో వల్లూరి జయప్రకాష్‌ ‌రాజధాని రైతులతో కలసి ఆ వేడుకలు నిర్వహించారు.

వాస్తవ పరిస్థితి

రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. 2050 నాటికి 35 లక్షల మంది ప్రజలు అక్కడ నివసిస్తారని, వారి అవసరాల మేరకు విజయవాడ- గుంటూరు నగరాల మధ్యలో కృష్ణానది తీరానికి ఆనుకుని కొత్త రాజధానిని అమరావతి పేరుతో నిర్మించాలని తీర్మానించింది. 2015 అక్టోబర్‌ 22‌న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకు స్థాపన చేశారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 25 పంచాయతీలను కలిపి అమరావతి నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేశారు. అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో ని 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద 34,322 ఎకరాలను ఇచ్చారు. వారిలో ఐదెకరాలలోపు భూములు ఇచ్చిన వారు 8,500 మంది, ఎకరంలోపు ఇచ్చినవారు 20 వేల మంది ఉన్నారు. వాటికి ప్రభుత్వ భూములను కలిపితే మొత్తం 53,748 ఎకరాల్లో రాజధాని అమరావతి నగర నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అందులో 27,885 ఎకరాలను రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ఇతర ప్రజావసరాలకు అనుగుణంగా వినియో గించాలని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు 14,037 ఎకరాలు వినియోగించారని నిర్ణయించారు. భూములిచ్చిన రైతులకు వారి వాటా కింద ప్లాటుల అభివృద్ధి, ఇతర అవసరాలకు 11,826 ఎకరాలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. సచివాలయం, శాసనసభ, హైకోర్ట్ ‌భవనాలను 2017 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులు, న్యాయాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటుగా సిబ్బంది కోసం చేపట్టిన భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. సీడ్‌ ‌యాక్సెస్‌ ‌రోడ్డు వంటి విశాలమైన 8 వరుసల రోడ్ల నిర్మాణం కూడా కొంత మేరకే ముందుకు సాగింది. ప్రైవేటు విద్యాసంస్థలు ఎస్‌.ఆర్‌.ఎం, ‌విట్‌ ‌వంటివి అమరావతి ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇతర ప్రతిపాదన లన్నీ అంచనాలుగానే మిగిలాయి.

వైకాపా ప్రభుత్వ వాగ్దానభంగం

ఇదిలాఉంటే 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి అడ్డుపడింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి రూ. లక్ష కోట్లు ఖర్చవుతుందని, అంత ధనం తమ వద్ద లేనందున నిర్మించలేమని చెప్పింది. పైగా అమరావతి అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాలు వెనకబడిపోతాయని, అందువల్ల అభివృద్ధిని వికేంద్రీకరించాలని పేర్కొంటూ విశాఖలో పాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలంటూ, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో మూడు రాజధానులను ప్రకటించారు. దాంతో వివాదం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదన ప్రకటనతో ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందానికి భంగం వాటిల్లినట్లయింది.

రెండున్నరేళ్ల పోరాటం

మూడు రాజధానుల ఏర్పాటు, సీ•ఆర్‌డీఏ రద్దుకు వ్యతిరేకంగా దాదాపు రెండున్నర ఏళ్ల పాటు రైతులు న్యాయపోరాటం చేశారు. రైతుల పిటిషన్లపై విచారణ చేసిన హైకోర్టు, ఈ ఏడాది మార్చి మూడున సీఆర్‌డీఏ చట్టం రద్దు చేయాలనే నిర్ణయం చెల్లదని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఉన్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే అందుకు రూ.2 లక్షల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం, అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదంటూ ఇటీవల హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. దీంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతులు కోర్టు ధిక్కారం కింద మళ్లీ వ్యాజ్యం దాఖలు చేశారు.

ఆంక్షలు – అడ్డగింతలు

హైకోర్టు తీర్పు చెప్పినా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయకపోవడాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు ‘బిల్డ్ అమరావతి’ నినాదంతో అమరావతి నుంచి అరసవల్లికి పాదయాత్ర చేయాలని నిర్ణయించి అనుమతి కోసం దరఖాస్తు చేయగా పోలీసులు అంగీకరించలేదు. దాంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి పొందారు. కాగా, ఈ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా జరుగుతున్న పరిణామాలనుబట్టి తెలుస్తోంది. ఒకవైపు రాజకీయంగా, మరోవైపు పోలీసు పరంగా అడ్డుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఉత్తరాది ప్రజలను రెచ్చగొట్టేలా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. పాదయాత్రలో దారిపొడవునా ఉద్యమాన్ని కించపరిచేలా స్లోగన్లతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేసినట్లు ప్రసారసాధనాల్లో కథనాలొస్తున్నాయి. పాదయాత్రను అక్కడక్కడ అడ్డుకోవడం, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, వీడియోలు తీయడం, పాదయాత్రకు వచ్చిన, మద్దతిచ్చేవారిపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయినా రైతులు మాత్రం ఎంతో ఉత్సాహంతో కొనసాగిస్తున్న పాదయాత్రకు స్థానికుల నుంచి విశేషంగా మద్దతు లభిస్తోంది. గతంలో కూడా ఇలాగే ‘న్యాయస్థానం-దేవస్థానం’ పాదయాత్రను భగ్నపరచాలనుకున్న ప్రభుత్వం భంగపడింది.

ప్రభుత్వ మొండి పట్టుదల

ఇదిలా ఉంటే మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం మరల తెరమీదకు తెచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా పేర్కొంటూ దానిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గౌరవించి  వివాదానికి ముగింపు పలుకుతుందని ప్రజలు ఆశించారు. కానీ, ఆరు మాసాల తర్వాత హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ ‌వేసింది. శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని అభిప్రాయపడింది. కాని ఇక్కడో విషయాన్ని వైకాపా ప్రభుత్వం మరచిపోయింది. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించినప్పుడు నాటి ప్రతిపక్షం వైకాపా కూడా ఈ నిర్ణయంలో భాగస్వామ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాటి శాసనసభ నిర్ణయాన్ని వైకాపా గౌరవించలేదు సరికదా మూడు రాజధానుల చట్టంతో వివాదాన్ని సృష్టించి, మరలా ఆ పార్టీ నేతలే శాసనసభ అధికారాల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. వికేంద్రీకరణ అంటే రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాన్ని గ్రామాలకు విస్తరింప చేయడం కాదు. స్థానిక ప్రభుత్వాలను బలపరచడం. నేడు రాష్ట్రమంతా సర్పంచులు చేస్తున్న ఆందోళన వికేంద్రీకరణ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది.

About Author

By editor

Twitter
Instagram