నేడు మయన్మార్‌గా పిలుచుకుంటున్న నాటి బ్రహ్మదేశం భారతదేశానికి తూర్పున, ఈశాన్య రాష్ట్రాలు మిజోరమ్‌, ‌మణిపూర్‌, ‌నాగాలాండ్‌, అరుణాచల ప్రదేశ్‌లతో 1624 కి.మీ. అత్యంత సుదీర్ఘమైన సరిహద్దును కలిగి ఉన్న దేశం.

మయన్మార్‌ అనగానే మనందరికి రంగూన్‌ ‌గుర్తుకు రావటం కద్దు. ఈ రోజుల్లో చదువుకుని జీవన వేటకు, డబ్బు సంపాదించడానికి ముఖ్యంగా యూరోప్‌, అమెరికా దేశాలకు వెళ్తున్నట్లు, ఒకప్పుడు వ్యాపార, ఉద్యోగాల కోసం మనవారు బర్మా (నేటి మయన్మార్‌) ‌వెళ్ళేవారు. పాత సినిమాల్లో రంగూన్‌ (‌బర్మా ఒకప్పటి రాజధాని) గురించిన మాటలు వింటూ ఉంటాము. ‘రంగూన్‌ ‌రౌడీ’ అనే సినిమా కూడా వచ్చింది. ‘మెషియా గయా రంగూన్‌’ అనే హిందీ సినిమా పాట కూడా బాగా పావులరే. మన ఫర్నిచర్‌లో బర్మా టేకు ఉంటే దానికో విశేషత.

నాటి బ్రహ్మదేశం ఆంగ్లేయుల రాకతో బర్మాగా మారింది. ‘బ్రహ్మదేశం’ పేరు ఉచ్ఛారణ రాక ఆంగ్లేయులు ‘బర్మా’ అన్నారు. అప్పటినుండి ఆ పేరే స్థిరపడింది. 1989వ సంవత్సరంలో తిరిగి అది తన పేరును ‘మ్యామ్మ’గా ప్రకటించుకుంది. ‘బ్రహ్మ’ పదం అపభ్రంశమే ‘మ్యామ్మ’.అయితే ప్రస్తుతం ఆ దేశాన్ని మయన్మార్‌గా పిలుస్తున్నాం.

మయన్మార్‌తో మనకు గల సంబంధాలు అత్యంత ప్రాచీనమైనవి. ఆ దేశపు చరిత్ర పాఠాలతో ఒక విశేష వాక్యం ‘మ్యామా అస్సాన్‌ ‌ఢగోన్‌గా (మ్యామా ఢగాఁవ్‌ అనే ప్రదేశం నుండి ప్రారంభ మైందని అర్థం) నేర్పిస్తుంటారు. ఇందుకు సంబం ధించి ఇతిహాసం కూడా ఉంది. సుమారు 3000 సంవత్సరాలకు ముందు భారతదేశంలో ఉత్తరాన కోసల అనే గణరాజ్యం ఉండేది. దాని రాజు ‘అభి’ సాక్య వంశానికి చెందినవాడు. ఈ అభిరాజు గౌతమ బుద్ధుని కన్నా 300 సంవత్సరాల పూర్వంవాడు. కాలక్రమంలో ప్రక్కనే ఉన్న పాంచాల రాజ్యంతో జరిగిన యుద్ధంలో అభిరాజు పరాజయం పాలైయ్యాడు. దాంతో ఆయనలో విరక్తి భావాలు కలిగాయి, రాజ్యకాంక్ష, తిరిగి రాజ్యం సంపాదించా లన్న కోరిక నశించాయి. సన్యసించి, తపస్సు చేసుకుని తరించాలని హిమాలయాలకు వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. విషయం తెలుసు కున్న సైన్యంలోని కొందరు తామూ రాజు వెంట వస్తామన్నారు. గుర్రాలపై ఉత్తరం వైపు బయలుదేరిన వీరు కొంత కాలానికి తూర్పువైపుగా ప్రయాణం సాగించారు. ఏదైనా సుందర, మనోహరమైన ప్రదేశంలో ఉంటూ తపస్సు కొనసాగించాలనుకున్న వీరంతా కొండలు, గుట్టలు, అడవులు, నదులు దాటుకుంటూ సుదూర ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ప్రదేశమే ‘ఢగాఁవ్‌’. ఇది నేటి మాండలే నగరానికి 80 కి.మీ. దూరంలో ఉంది.

అక్కడకు చేరుకున్న రాజు అభి, ఆయన సైనికులు తపస్సు చేసుకు నేందుకు అది అనువైన స్థలంగా భావించి తగు ఏర్పాట్లు చేసుకో సాగారు. స్థానిక ఆటవిక జాతుల ప్రజలు వారిని చూసి ఆశ్చర్య పోయారు. కండలు తిరిగిన శరీరాలతో అత్యంత బలాఢ్యులైనవారు వేరొక రాజ్యం నుండి వచ్చారని, అక్కడి ప్రజలను ఈ రాజు పాలించేవాడని తెలిసి ఇంకా ఆశ్చర్యానికి గురైనారు. కారణం అక్కడి వారికి రాజ్యం, రాజు, సైనికులు, ప్రజలు అనేవి తెలియదు. ఆగంతకుల ద్వారా విషయాలు తెలుసుకున్న స్థానిక తెగలు తమకూ రాజ్యం కావాలని, రాజ్యం నిర్మాణం చేసి తమను పాలించాలని వేడుకున్నారు. వారి కోరిక మేరకు అభిరాజు రాజ్య నిర్మాణం చేసి పాలించ సాగాడు. అలా ఏర్పడ్డదే మయన్మార్‌లోని మొట్ట మొదటి రాజ్యం. ఆ స్థలం పేరు ‘ఢగాఁవ్‌’ ‌కాబట్టి ‘ఢగాఁవ్‌’ ‌నుండే మయన్మార్‌ ఏర్పడింది అని చెప్పు కుంటారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పాలన చేసిన తరువాత రాజా అభి స్వర్గస్తులైనారు. ఆయన ఇద్దరు పుత్రుల మధ్య రాజ్యాధికారం కోసం పోటీ ఏర్పడింది. మంత్రి విధించిన పోటీలో చిన్నకుమారుడు గెలిచి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ సంఘటన మయన్మార్‌లో నూతన రాజ్యాలు ఏర్పడడానికి కారణమైంది.

రాజ్యం దక్కని పెద్ద కుమారుడు తమ్ముడి పాలనలో ఉండలేక తన అనుచరులతో అక్కడి నుండి దక్షిణం వైపు ప్రయాణం చేశాడు. ప్రస్తుతం ‘ప్యేయ్‌’ ‌లేదా ‘ప్రోమ్‌’‌గా పిలుస్తున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడి ప్రజలు ఇతడిని తమకు రాజుగా ఉండి పాలించాలని వేడుకున్నారు. వారి కోరిక మేరకు అక్కడ రాజ్యస్థాపన చేసి ఆ రాజ్యాన్ని తన కుమారు నికి అప్పజెప్పి (ఆ రాజ్యమే చరిత్రలో ‘శ్రీ క్షేతమ్రు’గా విలసిల్లింది) ధన్యావతి అనే రాజ్యానికి చేరుకున్నాడు. అప్పటికే రాక్షసుల కారణంగా రాజును కోల్పోయిన ప్రజలకు ఆతని రాక సంతోషాన్ని కలిగించింది. ప్రజలు అతనిని తమ రాజుగా చేసుకున్నారు. ఇలా నూతన రాజ్యాలు ఏర్పడడానికి కారణమైన ఆ సంఘ టలను మయన్మార్‌ ‌ప్రజలు ఎప్పటికి మరచిపోరు.

ఇంకో చారిత్రాత్మక సంఘటన 5వేల సంవత్స రాలకు పూర్వం చోటుచేసుకుంది.దాని వివరాలు ‘అరాకాన్‌ అర్కైవ్స్’‌లో లభిస్తాయి. భరతవర్షంలోని ప్రాగ్జ్యోతిషపురాన్ని నరకాసురుడను రాక్షసుడు పాలిస్తుండేవాడు. ఆతని పాలనలో కష్టనష్టాల పాలైన ప్రజలు, తమను రక్షించ వలసిందిగా ద్వారకాధిపతి శ్రీ కృష్ణుడికి మొరపెట్టుకున్నారు. తగిన సమయం చూసుకుని శ్రీకృష్ణుడు నరకుని రాజ్యానికి చేరి యుద్ధంలో ఆతడిని సంహరించాడు. నరకాసురుని వధ అనంతరం కృష్ణ బలరాములు ంబూద్వీపం లోని అనేక ప్రదేశాలను, రాక్షస విముక్తం చేసి స్వాధీనపరచుకున్నారు. ఆ రాజ్యానికి ‘వైశాలి’ అని నామకరణం చేసి ద్వారకకు వెళ్ళిపోయారు.  వైశాలి రాజ్యాన్ని హైందవ రాజవంశీయులువ వేల సంవత్సరాలు పాలించారు. క్రీ.శ.1770 ప్రాంతంలో మయన్మార్‌లోని ‘టౌన్‌గూ’ రాజవంశీయుల చేతిలో ఓటమి చెందేవరకు వారికి బెంగాల్‌ ‌రాజవంశీయుల తోనే సంబంధాలు ఉండేవి.

ఇలా అనేక హిందూ రాజ్యాలు ప్రాచీన మయన్మార్‌లో ఏర్పడి చక్కగా పాలించాయి. ఆ రాజ్యాల పేర్లు కూడా హైందవ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండేవి. క్రీ.శ.837వ సంవత్సరంలో నిర్మాణమైన ఒక రాజ్యం పేరు రామావతి. ప్రస్తుతం ఆ నగరాన్ని ‘టౌన్డ్విన్‌జీ’ అని పిలుస్తున్నారు. క్రీ.శ.11వ శతాబ్దంలోని ‘బగాన్‌’ ‌హైందవ దేవాలయంలో శ్రీరామ, పరశురామ, హనుమాన్‌ ‌విగ్రహాలు ఉన్నాయి. అవే కాకుండా ‘విష్ణువురం’, హస్తినాపురం, అరిమర్థనపురం, అమరపురం, ధన్యావతి, కలశపురం, రక్షపుర, మండల, రత్నపురం హంసావతి, రామన్నదేశం… ఇలా అనేక రాజ్యాలతో ప్రాచీన హైందవ సంస్కృతితో విలసిల్లిన దేశం మయన్మార్‌. ‌త్రిమూర్తులు, గణపతి, దుర్గ, ఇంద్ర, సరస్వతి, లక్ష్మీ, నారసింహ, హయగ్రీవ వారి ఆరాధ్య దేవతలు. నిత్యము వేదపారాయణం జరుగుతుండేది.

ప్రస్తుతం మయన్మార్‌ ‌థేరవాద బౌద్ధ బాహుళ్య దేశము. భగవాన్‌ ‌బుద్ధుడు జీవించిన కాలంలోనే తపుస్స, బొల్లిక అనే ఇద్దరు వ్యాపారుల ద్వారా బౌద్ధం ప్రవేశించినా, సనాతన సంప్రదాయంలోని అనేక మతాలతో కలిసి అది కూడా ఒకటిగానే ఉంది. వెయ్యేళ్లకు పూర్వం సంపూర్ణ మయన్మార్‌ను పాలిం చిన రాజు అనిరుద్ధుని వరకు రాజభాష సంస్కృతమే. రాజ్య వ్యవహారాలన్నీ ఆ భాషలోనే జరుగుతుండేవి. గడచిన వేయి సంవత్సరాలుగా థే•రవాద బౌద్ధం ప్రధానంగా ఉన్నప్పటికీ, బ్రిటీషువారి ఆక్రమణకు పూర్వం వరకు బ్రాహ్మణుల ద్వారా పూజలు, స్తోత్ర పారాయణాలు, వేదపఠనం, విశేష కార్యక్రమాలు జరుగుతుండేవి. ముఖ్యంగా దేశంలోని అత్యధిక ప్రాంతాన్ని పాలించిన మండల (నేటి మాండలే) రాజులు మణిపూర్‌ ‌నుండి బ్రాహ్మణ కుటుంబాలను రప్పించుకున్నారు. రాజ్యాలు మారినా, రాజులు లేకున్నా ఆ మణిపూర్‌ ‌బ్రాహ్మణులు ఇప్పటికీ తమ కట్టుబాట్లను పాటిస్తూ ఉండటం విశేషం.

మయన్మార్‌ ‌ప్రజలకు జాతక చక్రాలు రాయించు కునే అలవాటు ఉంది. దేశమంతా తిరుగుతూ ఈ బ్రాహ్మణులే ప్రజలకు జాతక చక్రాలు రాసిస్తుంటారు. ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలో తాటాకు రెమ్మలపై మాత్రమే జాతక చక్రాలను రాయడం విశేషం. అంతేకాదు.. మయన్మార్‌ ‌దేశ క్యాలెండర్‌ను కూడా వీరే తయారుచేస్తారు. తిథి, వారం, పక్షం, మాసాలను గణించి పర్వదినాలను నిర్ణయించేది కూడా వీరే. మయన్మార్‌ ‌ప్రభుత్వం ఈ పంచాంగాన్నే అధికారికంగా గుర్తించింది.

 బౌద్ధ ఆరామాలలో విద్యార్థులకు అష్టమి, పౌర్ణమి, అమావాస్య పఠనానికి నిషిద్ధ తిథులు. ఈ తిథులను గణించడానికి సూర్యసిద్ధాంత గ్రంథాన్నే ఆధారం చేసుకుంటారు. ఆ గ్రంథాన్ని ప్రాచీన కాలంలోనే బర్మా భాషలోకి తర్జుమా కూడా చేసుకున్నారు. ఉత్తర మయన్మార్‌లో ఆయా తిథి రోజులలో బౌద్ధ ఆరామాలు మాత్రమే కాక ప్రభుత్వ పాఠశాలలు, మార్కెట్టు కూడా మూసి ఉంటాయి.

భారతదేశంలో క్రీ.శ.78లో శాలివాహన శకం ప్రారంభమయిన రెండు సంవత్సరాలకే మయన్మార్‌ ‌లోని అప్పటి శ్రీక్షేత్ర రాజులు దానిని అధికారికంగా గుర్తించి అనుసరించసాగారు. అయితే క్రీ.శ.638లో అప్పటి శ్రీక్షేత్ర రాజు ఆ సంవత్సరాన్ని శూన్య సంవత్సరంగా ప్రకటించి అమలు పరిచిన కారణంగా ప్రస్తుతం నడుస్తున్న శాలివాహన శకం 1943, బర్మాలో 1305గా ఉంటుంది.

మయన్మార్‌లో ప్రసిద్ధ దేవాలయాలు

ప్రాచీన కాలంలో మయన్మార్‌లోని అనేక చోట్ల హైందవ దేవాలయాలు ఉన్నాయనడానికి పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో బయటపడుతున్న ఆధారలే నిదర్శనం. 960 సంవత్సరాల నాటి ఒక దేవాలయం బగాన్‌లో కనబడుతుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి.

వెయ్యి సంవత్సరాల పూర్వం రాజా అనిరుద్ద్ ‘‌బామో’ అనే రాజ్యంపై దండయాత్రకు వెళ్లినపుడు అక్కడి ప్రజలు దుర్గామాతను ఆరాధించడాన్ని గమనించాడు.. తమ ఇహలోక కోరికలను తీర్చేదేవత అమె అని ఆ ప్రజలు రాజా అనిరుద్ధ్‌కు చెప్పారట.

మయన్మార్‌లో రామాయణం

మయన్మార్‌లో అత్యంత ప్రాచీన కాలం నుండే వ్యవహారంలో ఉన్న రామాయణం 13వ శతాబ్దంలో ‘అవ’ అనే రాజ్యంలో బర్మా భాషలోకి తర్జుమా అయినట్లు ఆధారాలు లభిస్తున్నాయి.ఆ కావ్యం ప్రజల వాణి ద్వారానే ఒక తరం నుండి ఇంకో తరానికి చేరువవుతోంది. 16-18 శతాబ్దాల మధ్య కాలంలో చాలామంది పాటల రూపంలోనూ గద్య రూపంలోనూ రామాయణ రచనలు చేశారు. రామాయణం బౌద్ధ భిక్షువులకు కూడా ఇప్పటికీ అత్యంత పవిత్ర గ్రంథం. 1775లో ‘ఊ అఁగ్‌ ‌ప్యో’ ‘ఊఁఙప్యో’ రాసిన గేయ రామాయణం ప్రస్తుతం  లభ్యమవుతోంది.

18వ శతాబ్దం నుంచే రామాయణంపై నాటకాలు ప్రారంభమయ్యాయి. ‘యామాజెడ్డార్‌’ అనే ఈ నాటకాన్ని మయన్మార్‌ ‌విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రదర్శిస్తుండడం విశేషం.  క్రీ.శ.1880 ప్రాంతంలో స్థానిక మోన్‌ ‌భాషలో రామాయణం వెలువడింది. క్రీ.శ.1849లో నిర్మించిన ‘మహాలోకా మారయిన్‌’ అనే బౌద్ధ పగోడా (మందిరం)లో 347 శిలలపై రామాయణ ఘట్టాలను చెక్కించారు. ఐరావతి అనే రాష్ట్రంలోని ప్యాపోన్‌ ‌నగరంలోని బౌద్ధ ఆరామం ఇప్పటికీ ప్రతి సంవత్సరం రామాయణ నాటకాలు వేస్తూ ఉంటుంది.

తెలుగు లిపితో ప్రభావితమైన మయన్మార్‌ ‌లిపి

మయన్మార్‌లో వాడుతున్న భాషను బర్మీస్‌ అని అంటారు. బర్మీస్‌ ‌భాష లిపికి / ‘మోన్‌’ ‌భాష లిపి ఆధారం. ఈ మోన్‌ ‌భాష తెలుగు బ్రాహ్మీ లిపితో ప్రభావంతో ఏర్పడింది. సుమారు 1400 సంవత్స రాల పూర్వం ఒక గొప్ప యుద్ధంలో ఓటమి చెందిన పల్లవులు తమ ప్రదేశాలను విడిచి తూర్పు వైపు సముద్రాన్ని దాటుతూ దక్షిణ మయన్మార్‌లోని ‘థరోన్‌’ అనే ప్రదేశాన్ని చేరారు. అక్కడ నివసిస్తున్న ‘మోన్‌’ ‌జాతి ప్రజలతో మమేకమైపోయారు. ఇప్పటికీ ఆ జాతిలో ‘తెలైన్‌’ అన్న తెగ ఉండటం గమనార్హం. ఈ తెలైన్‌ ‌తెగ కృష్ణా గోదావరి నదుల మధ్యన ఉన్న తెంగాణ నుండి వెళ్లిన పల్లవులు అని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ పల్లవుల ద్వారానే ‘మోన్‌’ ‌భాషకు లిపి ఏర్పడింది.

– బండి జగన్మోహన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారక్‌, ‌విశ్వవిభాగ్‌

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram