కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం హింసాత్మకంగా మారడం శోచనీయం. సున్నితమైన ఈ అంశంపై నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే నిరసనకారులను అడ్డుకోలేక పోవడం, వారిచే ఎమ్మెల్యే ఇల్లు దహనం కావడం అనేది పోలీసుల వైఫల్యమే. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయి. కోనసీమ జిల్లాకు డా. బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ ‌పేరు పెట్టాలన్నది ఎప్పటి నుంచో వస్తున్న డిమాండ్‌. ‌కోనసీమ చూడటానికి ఎంత ప్రశాంతంగా, అందంగా ఉంటుందో అంత సున్నితమైనది. ఇక్కడి కుల సమీకరణలు పెద్ద విధ్వంసాన్ని సృష్టించిన సంఘటనలు అనేకం జరిగాయి. పేరు మార్పుపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కాని ప్రభుత్వం కొన్ని వర్గాలవారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, నిరసనకారులను పట్టించుకోక పోవడంతో వారు రెచ్చిపోయి హింసకు దిగారు. ఇలాంటి వాటి కోసమే ఎదురుచూసే అరాచకశక్తులు చెలరేగిపోయి కోనసీమను అగ్నిగుండంగా మార్చాయి. ఇదిలావుంటే ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేసే పేరుతో జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ ‌సేవలను నిలిపివేయడం వినియోగదారులకు, ఇంటి నుంచి పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది.

కోనసీమ జిల్లా పేరు మార్పును నిరసిస్తూ మే 24న చేపట్టిన కలెక్టరేట్‌ ‌ముట్టడి తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ఇటీవల ప్రభుత్వం జిల్లాలను విభజించింది. అన్ని జిల్లాలను విడదీసింది. వాటికి జిల్లాతో సంబంధం ఉన్న కొందరి ప్రముఖుల పేర్లు పెట్టింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి కోనసీమ ప్రాంతాన్ని విడదీసి కొత్త జిల్లా ప్రకటించారు. దానికి కోనసీమ జిల్లాగా పేరుపెట్టారు. కాని ఎప్పటి నుంచో డిమాండ్‌ ‌చేస్తున్న అంబేడ్కర్‌ ‌పేరును మాత్రం పెట్టలేదు. ఈ అంశంపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు తెలిపాయి. ఈ జిల్లాకు డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ ‌పేరు పెట్టాలని డిమాండ్‌ ‌చేశాయి. ప్రభుత్వం కొత్త జిల్లాల పేర్లు, సరిహద్దులపై అభ్యంతరాలు తెలుసుకునేందుకు నెల రోజుల గడువు విధించింది. అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ ‌కోనసీమ జిల్లాగా పేరు మార్చారు. కాని కొన్ని వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకోలేదు. అసలు వాటిని వినేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఏకపక్ష నిర్ణయాల వల్ల హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయనేది వాస్తవం.

కోనసీమ పేరునే కొనసాగించాలని జేఏసీ చేపట్టిన ఆందోళన రణరంగంగా మారింది. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ ‌కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక ఉత్తర్వులు జారీచేసింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని కలెక్టరు సూచించారు. దీంతో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాగానే పేరు ఉంచాలని ఆందోళనలు చేశారు. యువత, జేఏసీ నేతలు పలుమార్లు నిరసనలు చేపట్టారు. అమలాపురం పట్టణం ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అలజడి రేగింది. ఆందోళన నేపథ్యంలో అమలాపురంతో పాటు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ ‌విధించారు. అమలాపురంలో 25 చోట్ల పోలీసులు చెక్‌ ‌పోస్టులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఒక్కసారిగా జేఏసీ నేతృత్వంలో ఆందోళనకారులు గడియారం స్తంభం నుంచి కలెక్టరేట్‌ ‌వరకు ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ దాడిలో ఎస్పీ సుబ్బారెడ్డితో పాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జీ చేశారు. దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. ఆందోళనకారులను అరెస్ట్ ‌చేశారు. వీరిని తరలించేందుకు తీసుకు వచ్చిన వాహనాలను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. లాఠీఛార్జీలో కూడా పలువురు గాయపడ్డారు. కొందరు యువకులు ఒక ప్రైవేటు బస్సుకు నిప్పుపెట్టారు. కలెక్టరేట్‌ ‌నుండి కొందరు ఆందోళనకారులు ఎర్ర వంతెన సమీపంలోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ‌క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని ఇంటిపై రాళ్లతో దాడిచేసి నిప్పుపెట్టారు. ఎర్ర వంతెన హౌసింగ్‌ ‌బోర్డ్ ‌కాలనీలో ఉంటున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇం‌ట్లోకి కూడా ఆందోళనకారులు చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఎర్ర వంతెన సమీపంలో రెండు ఆర్‌టీసీ బస్సులను పూర్తిగా ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు… ఇలా అమలాపురం అగ్నిగుండంగా మారింది. పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రశాంతంగా ఉండే అమలాపురంలో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయడానికి పోలీసులు అమలాపురంతో పాటు జిల్లాలోని రావులపాలెం, అంబాజీపాలెం, రాజోలు, కొత్తపేట ఇతర పల్లె ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూను విధించారు. అన్ని ప్రాంతాల్లో భారీగా పోలీసులు, ప్రత్యేక దళాల సిబ్బందిని మోహరించి గస్తీ నిర్వహించారు. అనుమానం వచ్చినవారిని అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం విడిచిపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్‌ల కారణంగానే ఈ సమస్య వచ్చినట్లు గుర్తించిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ ‌సేవలను నాలుగైదు రోజుల పాటు నిలిపివేశారు. ఇంటర్నెట్‌ ‌పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్ల నుంచి పనిచేస్తున్న పలు కంపెనీల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పోలీసుల వైఫల్యం!

అమలాపురంలో భారీ విధ్వంసానికి పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమని సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాగ్రహం, ఆందోళన తీవ్రరూపం దాల్చి సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసాలకే నిప్పు అంటించటం, ప్రాణభయంతో ఉన్న వారిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితులు తలెత్తటం, ఏకంగా జిల్లా ఎస్పీపైనే రాళ్లదాడి వంటి ఘటనలను చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. కుల సమీకరణల పరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన కోనసీమలో చిన్న వివాదం కూడా పెద్ద పెద్ద ఘర్షణలకు దారితీసిన అనుభవాలు గతంలో చాలా ఉన్నాయి. అలాంటిచోట జిల్లా పేరు మార్పుపై అభ్యంతరం తెలుపుతూ గత నాలుగైదు రోజులుగా భారీ నిరసనలు చేపడుతూనే ఉన్నారు. అవి తీవ్రరూపం దాల్చక ముందే పరిస్థితి అంచనా వేసి జాగ్రత్త పడాల్సిన పోలీసులు ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. నిరసనలు తెలుపుతున్న వారి అభ్యంతరాలేంటో చర్చల ద్వారా తెలుసుకోలేకపోయారు. వాటి ఫలితమే ఈ విధ్వంసమని స్థానిక ప్రజలు అంటున్నారు.

పేరు మార్పుపై అభ్యంతరాలను కలెక్టరేట్‌కే పరిమితం చేయకుండా, డివిజన్‌, ‌మండల కేంద్రాల్లో కూడా తీసుకుంటే ఎక్కడి వారు అక్కడే ఉండేవారు. అందరూ అమలాపురం వచ్చే అవకాశం అంతగా ఉండేది కాదు. అభ్యంతరాలు ఇవ్వడానికే రోజూ వందలు, వేలల్లో అమలాపురం వచ్చేవారు. ఎక్కువమంది వస్తున్నారంటూ వారిపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వం తమ అభ్యంతరాల్ని అసలు పట్టించుకోవట్లేదనే ఆందోళనే ఈ పరిస్థితికి కారణమైంది. నిరసనలు తెలిపేందుకు కూడా అవకాశం లేకపోవటం, పోలీసుల నుంచి ఎదురైన చర్యలతో నిరసనకారుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆవేశం కట్టలు తెచ్చుకుని ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది.

సమాజాన్ని చీల్చే కుట్ర

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాజంలో కుల, మత రాజకీయాలు నడుస్తున్నాయి. ఓట్ల కోసం ప్రభుత్వం అన్యమతాలకు ప్రోత్సాహకంగా ఉంటూ.. తమను అణచివేస్తున్నట్లు హిందువులు ఆరోపిస్తున్నారు. తప్పు చేసినా కూడా ఓటు బ్యాంకు కోసం నిందితులపై కేసులు వేయకుండా వెనకేసుకు వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ వివాదాలను అడ్డుపెట్టుకుని రాజకీయ లాభం పొందాలని చూస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఏది ఏమైనా డాక్టర్‌ ‌బాబా సాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌పేరును వివాదాల్లోకి లాగడం శోచనీయం. భారతీయులందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చిన అంబేడ్కర్‌ను కొందరి వాడుగా ప్రచారం చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

సమాజాన్ని చీల్చడమే లక్ష్యమైన కుట్ర రాజకీయాలను ప్రజలే తిప్పికొట్టాలి. అంబేడ్కర్‌ ‌కోనసీమ జిల్లాలోని ప్రజలు పూర్తి స్థాయిలో సంయమనం పాటించాలి. అదే కుట్రదారుల కపట వ్యూహాల నుంచి సమాజాన్ని కాపాడుతుంది.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram