కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై తాజాగా రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్‌ ‌సుంకం తగ్గించింది. గత నవంబరులో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ ‌సుంకాన్ని తగ్గించింది. కాని ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. ఇప్పుడు కూడా తగ్గిస్తామని అనడం లేదు సరికదా అసలు స్పందించడం లేదు. మొదటిసారి తగ్గించినప్పుడు 20 రాష్ట్రాలు తమ వ్యాట్‌ను తగ్గించుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాయి. అందులో కేంద్ర ప్రభుత్వం పట్ల సఖ్యత లేని కేరళ, రాజస్థాన్‌ ‌కూడా వున్నాయి. కోవిడ్‌ ‌నేపథ్యంలో కొత్తగా ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌లు పెంచలేదు. కాని ఏపీ ప్రభుత్వం మాత్రం వ్యాట్‌ అదనపు పన్ను రూ.2, రోడ్ల అభివృద్ధి పన్ను రూ.1 విధించింది. పెట్రోల్‌పై రూ.31, డీజిల్‌పై రూ.22.5 వ్యాట్‌ ‌విధించింది. కేంద్రం ఒకందుకు పన్నులు వేస్తే, సొంత లాభానికి పెంచినట్లు రాష్ట్రాలు ఆరో పిస్త్తున్నాయి. కేంద్రం తను వసూలు చేసిన ప్రతి రూపాయిని అభివృద్ధికి ఖర్చుచేస్తే వైకాపా ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుతోంది. అభివృద్ధి అనే మాటను దూరంగా ఉంచింది. వచ్చిన ఆదాయాన్ని పథకాల పేరుతో పంచేసి దుబారా చేస్తోంది. అభివృద్ధి మాట దేవుడెరుగు… కనీసం తన వంతుగా వ్యాట్‌ ‌తగ్గిస్తే ప్రజలకు కాస్తయినా ఉపశమనం కలుగుతుంది. లేదా వారి శాపనార్థాలకు గురికాక తప్పదు.

కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులు, ఎల్పీజీ, స్టీల్‌, ఎరువులపై ఎక్సైజ్‌ ‌డ్యూటీలను, పన్నులను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యుడికి ఎంతో ఉపశమనం కలుగనుంది. ముఖ్యంగా పెట్రో ధరల పెరుగుదల వల్ల అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. ఇక నుంచి ఇవి కొంత మేర తగ్గుతాయని చెప్పవచ్చు. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ ‌సుంకాన్ని లీటరుకు రూ.8, లీటర్‌కు రూ.6 చొప్పున తగ్గించడం, ఎల్పీజీ సబ్సిడీ కస్టమ్‌ ‌డ్యూటీలపై తగ్గింపుల వల్ల ఇంటి బడ్జెట్‌పైనా భారం తక్కువ కానుంది. ఇంధనాలపై ఎక్సైజ్‌ ‌సుంకాన్ని తగ్గించడం జనానికి అన్నింటికంటే ఎక్కువ మేలు చేస్తుంది. వీటి రేట్లు దిగిరావడం వల్ల ఆహారం, రవాణా సహా చాలా వస్తువుల ధరలు తగ్గుతాయి. ఇంటి బడ్జెట్‌లపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కొంతవరకు ఎదుర్కోవచ్చు. ఎక్సైజ్‌ ‌సుంకాల కోత వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.లక్ష కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. పెట్రోల్‌, ‌డీజిల్‌పై రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) ‌కూడా తగ్గితే రేటు మరింత దిగివస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఎల్‌పీజీ సిలిండర్‌లపై రూ.200 చొప్పున సబ్సిడీని అందిస్తారు. ఇలా 12 సార్లు ఇవ్వడం వల్ల ఇంటి బడ్జెట్‌పై భారం మరింత తగ్గుతుంది. ఎక్కువ ధరల కారణంగా సిలిండర్‌ను కొనడం మానేసిన వాళ్లు మళ్లీ కొంటారు. దీంతో ప్రభుత్వానికి పన్నుల ఆదాయమూ పెరుగుతుంది. దేశవ్యాప్తంగా రైతులకు ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం బడ్జెట్‌లో రూ.1.05 లక్షల కోట్లు, తాజాగా మరో రూ.1.10 లక్షల కోట్లు కేటాయించింది. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. సాగు ఖర్చు అదుపులో ఉంటుంది. కూరగాయలు, పప్పుల ధరలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. దిగుమతి చేసుకునే కొన్ని వస్తువుపై కస్టమ్స్ ‌సుంకాన్ని తగ్గించారు. ప్లాస్టిక్‌ ‌తయారీకి వాడే ముడిసరుకులపై సుంకాన్ని తగ్గించడం వల్ల సంబంధిత వస్తువుల ధరలు దిగివస్తాయి. ఈ నిర్ణయం వల్ల ప్లాస్టిక్‌ ఉత్పత్తుల పరిశ్రమకు కూడా మేలు కలుగుతుంది. స్టీలు తయారీలో వాడే ముడి పదార్థాలపైనా కస్టమ్‌ ‌సుంకాలను తగ్గించడంతో ఇనుము ధరలు దిగివచ్చి ఎన్నో పరిశ్రమలకు మేలు జరుగుతుంది. చుక్కల్లో ఉన్న సిమెంటు ధరలను తగ్గించడానికి కూడా ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించింది. సరఫరాలో ఇబ్బందులను తొలగి స్తామని, ముఠాతత్వం లేకుండా చేస్తామని తెలిపింది. దీనివల్ల సిమెంట్‌ ‌ధర కూడా తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి.

ద్రవ్యోల్బణం అదుపునకు

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, ‌డీజిల్‌పై ఎక్సైజ్‌ ‌సుంకాన్ని, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు కోసం ముడి పదార్థాలపై కస్టమ్స్ ‌సుంకాన్ని కూడా తగ్గించాలనే నిర్ణయాలు ద్రవ్యోల్బణం శాతం తగ్గించే యోచనతో చేసినవే. రిటైల్‌ ‌ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి 7.9 శాతానికి పెరిగింది, అయితే టోకు ద్రవ్యోల్బణం వరుసగా 13 నెలలు రెండంకెలలో ఉంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఆర్థిక, ద్రవ్య విధానాలు రెండూ అవసరమని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంధన పన్నులలో తగ్గింపు జూన్‌లో ద్రవ్యోల్బణాన్ని నేరుగా దాదాపు 20 బేసిస్‌ ‌పాయింట్ల వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. కేంద్రం ఇంధన పన్నులను తగ్గించడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. గతేడాది నవంబర్‌లో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ ‌సుంకాన్ని తగ్గించింది. అప్పుడు, 21 రాష్ట్రాలు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్‌ని తగ్గించాయి. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విధానాన్ని అనుసరిస్తే ఉపశమనం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ తగ్గింపునకు ముందు కేంద్రం, రాష్ట్రాలు విధించిన పన్నులు పెట్రోల్‌ ‌రిటైల్‌ అమ్మకపు ధరలో దాదాపు 43 శాతం ఉన్నాయి. కానీ తాజా తగ్గింపుతో, ప్రభుత్వం ఎక్సైజ్‌ ‌సుంకాన్ని ప్రీ-పాండమిక్‌ ‌స్థాయికి తీసుకువచ్చింది. ఎక్సైజ్‌ ‌సుంకాన్ని తగ్గించడం వల్ల ప్రభుత్వ ఆదాయం రూ.లక్ష కోట్ల మేర తగ్గుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇలా ఏర్పడిన నష్టాన్ని.. పన్ను తగ్గించిన వస్తువుల అమ్మకాలపై వచ్చే పన్నుల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తగ్గింపు తర్వాత ప్రభుత్వ పన్ను రాబడులు బడ్జెట్‌ అం‌చనాల కంటే దాదాపు రూ. 1.3 లక్షల కోట్ల మేర పెరుగుతాయి.

ధరపై ప్రభావం చూపే అంశాలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో మార్పు నేరుగా దేశీయ మార్కెట్‌లో ముడి చమురు ధరను ప్రభావితం చేస్తుంది. దేశంలో పెట్రోల్‌ ‌ధరల పెరుగుదలకు ఇది ముఖ్యమైన కారణం. తక్కువ ఉత్పత్తి రేటు, ముడి చమురు ఉత్పత్తి దేశాలలో ఏదైనా రాజకీయ అశాంతి, అంతర్జాతీయ డిమాండ్‌ ‌పెరు గుదల పెట్రోలు ధరను తీవ్రంగా ప్రభావితం చేస్తు న్నాయి. భారతదేశం, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగుతున్న ఆర్థికవృద్ధి కూడా పెట్రోల్‌, ఇతర ముఖ్యమైన ఇంధనాలకు డిమాండ్‌ ‌పెరగడానికి కారణం. ద్విచక్రవాహనాల వినియోగం పెరగడం కూడా దేశంలో పెట్రోలు డిమాండ్‌కు ఒక కారణంగా పేర్కొనవచ్చు. ముడి చమురు ఇన్‌పుట్‌ అధిక ధర కారణంగా భారతదేశంలోని ఆయిల్‌ ‌రిఫైనరీ కంపెనీలు మార్కెట్‌ ‌డిమాండ్‌లను తీర్చడంలో సమస్యను ఎదుర్కొంటు న్నాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్‌కు సరఫరాకు మించి డిమాండ్‌ ఏర్పడుతోంది. ఇంధనాలపై పన్నులు విధించే స్థానిక ప్రభుత్వ విధానాల ప్రకారం పెట్రోల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మారుతూ ఉంటాయి. భారత ప్రభుత్వం ఇంధనాలపై పన్ను రేట్లు పెంచినప్పుడు, దేశంలోని చమురు కంపెనీలు ఆ నష్టాలను తిరిగి పొందేందుకు పెట్రోల్‌ ‌ధరను కూడా పెంచుతాయి. అలాగే భారతదేశంలో పెట్రోల్‌ ‌ధరను ప్రభావితం చేసే ప్రధాన కారకాల్లో రూపాయి-డాలర్‌ ‌మారకం రేటు కూడా ఒకటి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుకు భారతీయ చమురు కంపెనీలు డాలర్ల రూపంలో చెల్లిస్తాయి. ముడిచమురు ధర పతనంలో ఉన్నప్పుడు, డాలర్‌తో రూపాయి కూడా బలహీనంగా ఉన్నప్పుడు, అది చమురు శుద్ధి దారులకు లాభాలను తగ్గిస్తుంది. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడి నప్పుడు ముడి చమురు ధర పతనంలో ఉన్న ప్పుడు చమురు కంపెనీలు లాభపడ తాయి. రిటైల్‌ ఇం‌ధన ధర నిర్ణయించడంలో ముఖ్యమైన కారకాల్లో లాజిస్టిక్స్ ఒకటి. డిపోల నుండి దూరంగా ఉన్న నగరాలు లేదా ప్రాంతాలకు ఎక్కువ దూరాలకు రవాణా చేయబడిన పెట్రోల్‌, ‌డీజిల్‌కు చమురు నిల్వ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రదేశాల కంటే ఎక్కువ ధర ఉంటుంది. దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌ ‌ధరల మార్పు వెనుక కారణం ఇదే. ఒకదానికొకటి దూరంగా ఉన్న నగరాల మధ్య ఈ వ్యత్యాసం భారీగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఢిల్లీలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు లీటరుకు ఒక ధర ఉంటే ముంబైలో మరో ధర, దక్షిణాది రాష్ట్రాల్లో కొంత తేడా ఉంటుంది. తాజాగా తగ్గించాక కూడా న్యూఢిల్లీలో లీటరుకు రూ. 96.72, కోల్‌కతాలో లీటరుకు రూ.106.03, ముంబైలో లీటరు రూ.111.35, చెన్నైలో రూ.102.63. వసూలు చేస్తున్నారు. పెట్రోలు జీఎస్టీ పరిధిలోకి రానందున, దాని ధర రాష్ట్రాలలో ఇలా మారుతూ ఉంటుంది.

దిగుమతుల ప్రభావం

మనదేశం చమురు, గ్యాస్‌ల విషయంలో ప్రధానంగా దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. దేశీయ అవసరాలను తీర్చడానికి దేశం 82.8% ముడి చమురు, 45.3% సహజ వాయువును దిగుమతి చేసుకుంటోంది. ముడి చమురు దిగుమతి కారణంగా 2017 – 2018 ఆర్థిక సంవత్సరానికి దేశ నికర విదేశీ మారకం 3.305 బిలియన్‌ ‌డాలర్లుగా ఉంది. దేశీయ ముడి చమురు ద్వారా సుమారు 35.2 మిలియన్‌ ‌టన్నుల పెట్రోలు, దాని సంబంధిత ఉత్పత్తులను ఉత్పత్తి చేసింది, అయితే పెట్రోలియం, దాని ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వినియోగం 200 మిలియన్‌ ‌టన్నులకు పైమాటే. దేశం 2021-22లో 212.2 మిలియన్‌ ‌టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది అంతకు ముందు సంవత్సరంలో 196.5 మిలియన్‌ ‌టన్నులుగా ఉంది. 2019-20లో 227 మిలియన్‌ ‌టన్నులు. 2019-20లో చమురు దిగుమతులపై చేసిన వ్యయం 101.4 బిలియన్‌ ‌డాలర్లు. ఇంధనాన్ని అధికంగా దిగుమతి చేసుకోవడం వల్ల చమురు వినియోగం విషయంలో అమెరికా, చైనాల తర్వాత భారత్‌ ‌మూడో స్థానంలో ఉంది. దేశంలో పెట్రోలియం నిల్వలు సరిపడా లేకపోవడం వల్ల భారతదేశం దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. వాయు కాలుష్యానికి బాగా దోహదపడే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలని యోచిస్తూ, ప్రత్యామ్నాయ ఇంధన సమృద్ధిని సాధించడానికి పునరుత్పాదక వనరులైన పవన, సౌర, బయోమాస్‌, ‌జలవిద్యుత్‌ ‌మొదలైన వాటిని ఉపయోగించుకోవడానికి దేశం నెమ్మదిగా మొగ్గు చూపుతోంది.వివిధ సంక్షేమ పథకాల అమలుకు, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన వనరుల సేకరణ కోసమే పెట్రోల్‌పై ఎక్సైజ్‌ ‌సుంకం పెంచవలసి వస్తున్నా, దానివల్ల సామాన్యులపై అదనపు భారం పడుతోంది. దేశంలో చమురు ఉత్పత్తుల నుంచి స్వీకరించిన పన్నులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లడం లేదు. రహదారులు, రైల్వే లైన్లు, ఓడరేవులు, విద్యాసంస్థలు, ఆరోగ్య సదుపాయాలకు వాటిని ఖర్చు చేస్తున్నారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా పెట్రోలు ధరలను దీర్ఘకాలికంగా తగ్గించే అవకాశా లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందుకు మరింత మన్నికైన దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనవలసి ఉంటుంది.

– తురగా నాగభూషణం,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram