– జమలాపురపు విఠల్‌రావు

చైనా ధృతరాష్ట్ర కౌగిలి ఏ విధంగా ఉంటుందో నేపాల్‌కు తెలిసొచ్చింది. స్నేహంగా ఉంటూ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తామంటూనే, తమ భూభాగాలను క్రమంగా కబ్జా చేస్తూ, మరోపక్క అప్పుల ఊబిలో నెట్టేసే చైనా వైఖరి పట్ల నేపాల్‌కు జ్ఞానోదయమైంది. గత ప్రధాని కేపీ శర్మ ఓలి దేశాన్ని చైనా గుప్పిట్లోకి తీసుకెళ్లగా, ప్రస్తుత ప్రధాని షేర్‌ ‌బహదూర్‌ ‌దేవ్‌బా వాస్తవాన్ని గుర్తించి, నిజమైన మిత్రుడు భారత్‌ ‌మాత్రమేనని గుర్తించి చైనాకు దూరంగా జరగడం ఒక సానుకూల పరిణామం. గత ఏప్రిల్‌లో భారత్‌లో ఆయన పర్యటించడం దీని నేపథ్యమే.

మే 16, అంటే బుద్ధపౌర్ణమి రోజున ప్రధాని నరేంద్రమోదీ నేపాల్‌లో పర్యటించడమే కాదు, గౌతమబుద్ధుడి జన్మస్థలమైన లుంబినీని సందర్శిం చారు. భారత్‌లోని కుశినగర్‌ ‌విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా లుంబినీకి చేరుకున్నారు. గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన ప్రదేశమే కుశినగర్‌. 2021, అక్టోబర్‌ ‌నెలలో కుశినగర్‌ ‌విమానాశ్రయాన్ని ప్రారంభించిన సుమారు ఏడు నెలల తర్వాత మోదీ నేపాల్‌ను సందర్శించడం విశేషం. కుశినగర్‌ ‌ప్రముఖ బౌద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడి విమానాశ్రయం నుంచి బుద్ధుడి ఆలయం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బౌద్ధమత పుణ్య క్షేత్రాలను కలుపుతూ ఏర్పాటు చేసిన బౌద్ధ సర్క్యూట్‌లో ఈ రెండు పట్టణాలు భాగం. లుంబినీ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో గౌతమబుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చైనాకు చెందిన నార్త్‌వెస్ట్ ‌సివిల్‌ ఏవియేషన్‌ ఎయిర్‌పోర్ట్ ‌కన్‌‌స్ట్రక్షన్‌ ‌గ్రూప్‌ ‌నిర్మించింది. ఈ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా లుంబినీకి చేరుకోవాలన్న నేపాల్‌ ‌సూచనను మోదీ పట్టించుకో లేదు. ఈ విమానాశ్రయాన్ని బైపాస్‌ ‌చేస్తూ ఆయన నేరుగా పర్‌లో లుంబినీకి చేరుకోవడం ద్వారా, నేపాల్‌లో చైనా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భారత్‌ ‌భాగస్వామి కాబోదని చైనాకు స్పష్టం చేసినట్లయింది. లుంబినీలో మాయావతి దేవాలయాన్ని మోదీ సందర్శించి పూజలు జరిపారు. 2566 సంవత్సరాల క్రితం జన్మించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలిని బుద్ధపౌర్ణమినాడు మోదీతో పాటు నేపాల్‌ ‌ప్రధాని షేర్‌ ‌బహదూర్‌ ‌దేవ్‌బా కూడా సందర్శించారు.

గతంలో మోదీ నేపాల్‌ ‌పర్యటన సందర్భంగా లుంబినీ సందర్శనాభిలాషను వ్యక్తం చేసినప్పుడు ఇది మతపరమైన లేదా సాంస్కృతిక పరమైనదిగా భావించి నప్పటికీ, ప్రస్తుతం ఇది చాలా వ్యూహాత్మకమనేది స్పష్టమవుతోంది. ఇందులో ముందుగా చెప్పుకో వాల్సింది నేపాల్‌ ‌రాయబారిగా శ్రీవాస్తవ నియామకం. ఈయన గల్వాన్‌ ‌ఘర్షణ అనంతరం చైనాతో భారత్‌ ‌తరఫున చర్చల్లో పాల్గొన్నారు. భారత విదేశాంగశాఖలో ఈస్ట్ ఆసియా డెస్క్‌ను చూస్తున్న ఆయన్ని నేపాల్‌ ‌రాయబారిగా నియమించడమంటే, అక్కడి చైనా ప్రమేయాన్ని గట్టిగా నిరోధించడానికేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి షేర్‌బహదూర్‌ ‌దేవ్‌బా కొత్త ప్రధాని కాగానే, నేపాల్‌పై చైనా కమ్యూనిస్టు పార్టీ పట్టు కోల్పోయింది. వినయ్‌ ‌క్వాత్రా నేపాల్‌లో రాయబారిగా ఉండగానే మావోయిస్టు కమ్యూనిస్టు మూవ్‌మెంట్‌ ‌నిట్టనిలువుగా చీలిపోయి బలహీన పడింది. 2017లో సిపిఎన్‌- ‌యుఎంఎల్‌ ‌తరఫున ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మ ఓలి, పూర్తి భారత వ్యతిరేక విధానాన్ని అనుసరించారు. ఆయన కాలంలో భారత్‌తో నేపాల్‌ ‌సంబంధాలు గతంలో ఎన్నడూలేని స్థాయికి దిగజారి పోయాయి. ఒకరకంగా చెప్పాలంటే నేపాల్‌ను తీసుకెళ్లి చైనా ‘ఒళ్లో’ కూర్చోబెట్టారు. ఇండియన్‌ ‌వైరస్‌.. ఇటాలియన్‌ ‌లేదా చైనా వైరస్‌ ‌కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించడం, కాలాపానీ ప్రాంతాన్ని నేపాల్‌లో భాగంగా చూపడం వంటి వివాదాస్పద చర్యల వల్ల భారత్‌తో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఇటీవల యూఎస్‌-‌చైనాల భౌగోళిక రాజకీయ స్పర్థల మధ్య నేపాల్‌ ఇరుక్కుపోయింది. ముఖ్యంగా ‘మిలియనియం ఛాలెంజ్‌ ‌కార్పొరేషన్‌’‌కు యూఎస్‌ అం‌దిస్తానన్న 500 మిలియన్‌ ‌డాలర్ల గ్రాంట్‌ను అంగీకరించవద్దని చైనా హెచ్చరించడంతో నేపాల్‌ ఇరుకునపడింది. ఎట్టకేలకు ఒక నెల తర్వాత నేపాల్‌ ‌యూఎస్‌ ‌గ్రాంట్‌ను ఆమోదించింది. వెంటనే చైనా తన విదేశాంగ మంత్రి వాంగ్‌యిని ఖాట్మండుకు పంపి, బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ ‌కింద కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదించగా, తమకు అటువంటి వాణిజ్య రుణాలపై ఆసక్తిలేదని నేపాల్‌ ‌సున్నితంగా తిరస్కరించింది. ఇప్పటికే చైనా నుంచి రుణాలు తీసుకొని దివాలా తీసిన శ్రీలంక, నిండా మునుగుతున్న పాకిస్తాన్‌ ‌మరోపక్క స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌ ‌కూడా చైనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆ దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు గణనీయంగా పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ పరిణామాలను గమనించి, చైనా రుణాలను ఆమోదించడం ‘అంపశయ్యను’ తానే సిద్ధం చేసుకున్నట్టు కాగలదన్న జ్ఞానోదయం నేపాల్‌కు కలగడమే ఈ మార్పునకు కారణం.

ఒప్పందాలతో సంబంధాలు గాట్లోకి..

 సరిగ్గా రెండు నెలల క్రితం అంటే ఏప్రిల్‌లో నేపాల్‌ ‌ప్రధాని దేవ్‌బా భారత్‌లో పర్యటించారు. అయితే 2019లో ప్రధానిగా రెండోసారి ఎన్నికైన తర్వాత మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. మొదటి దఫా ప్రభుత్వంలో ప్రధాని మోదీ నేపాల్‌లో నాలుగుసార్లు పర్యటించారు (2014లో రెండుసార్లు, 2018లో రెండుసార్లు). ఇప్పటి మాదిరిగానే గతంలో ఆయన జనక్‌పూర్‌, ‌ముక్తినాథ్‌లలో మతపరమైన, సాంస్కృతిక పర్యటనలు జరిపారు. నేపాల్‌ ‌ప్రధాని దౌవ్‌బా, భారత ప్రధాని మోదీ పరస్పరం రెండు దేశాల్లో పర్యటించడంతో సన్నిహిత సంబంధాల పునరుద్ధరణ యత్నం ఉన్నతస్థాయిలో ప్రారంభమైందని చెప్పవచ్చు.

ఇరుదేశాల ప్రధానుల మధ్య 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ‘వెస్ట్ ‌సేటీ హైడ్రో పవర్‌ ‌ప్రాజెక్టు’ పనులను చేపట్టాల్సిం దిగా నేపాల్‌ ‌ప్రధాని కోరారు. ఈ ప్రాజెక్టును మొదట ఆస్ట్రేలియా చేపట్టి తర్వాత వదిలేసింది. చైనాకు చెందిన గార్జెస్‌ ‌కార్పొరేషన్‌ ‌దీన్ని నిర్మించడానికి ఆసక్తి చూపినా, నేపాల్‌ ‌దీన్ని మనదేశానికే అప్పగించడం ఆ దేశంలో వచ్చిన మార్పునకు చిహ్నం. గతంలో 900 మెగావాట్ల సామర్థ్యం గల అరుణ్‌-3 ‌పవర్‌ ‌ప్రాజెక్టును అక్కడ భారత్‌ ‌విజయవంతంగా నిర్మించింది. దీన్ని సట్లెజ్‌ ‌జల్‌ ‌విద్యుత్‌ ‌నిగమ్‌ (ఎస్‌జేవీఎన్‌) ‌చేపట్టింది. ఇది కేంద్రం, హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ప్రభుత్వాల ఉమ్మడి వెంచర్‌. ‌మద్రాసు ఐఐటీ, ఖాట్మండు యూనివర్సిటీలు ఉమ్మడిగా డిగ్రీ కార్యక్రమాన్ని నిర్వహించడంపై మరో ఒప్పందం కుదిరింది. మూడవది ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌కల్చరల్‌ ‌రిలేషన్స్, ‌లుంబినీ బౌద్ధ యూనివర్సిటీ మధ్య ఉన్నత విద్యారంగంలో కుదిరిన ఒప్పందం. దీని ప్రకారం లుంబినీ బౌద్ధ యూనివర్సిటీలో ‘డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌ఛైర్‌ ‌ఫర్‌ ‌బుద్ధిస్ట్ ‌స్టడీస్‌’ ఏర్పాటు చేస్తారు. ఆరుగంటల ఈ పర్యటన కార్యక్రమంలో భిన్న రంగాల్లో ఒప్పందాలు కుదరడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రకటించిన ఇండో-నేపాల్‌ ‌ప్రణాళికలో లుంబినీకి సముచిత ప్రాధాన్యమివ్వడం, లుంబినీ గౌతమ బుద్ధుడి జన్మస్థలిగా మోదీ నొక్కి చెప్పడం, భారతీయ బౌద్ధారామానికి శంకుస్థాపన చేయడం వంటి చర్యలు నేపాల్‌-‌భారత్‌ ‌సంబంధాలు మళ్లీ గాట్లో పడుతున్నాయనడానికి గొప్ప ఉదాహరణ. గత ఏప్రిల్‌లో నేపాల్‌ ‌ప్రధాని మనదేశాన్ని సందర్శించి నప్పుడు ఇద్దరు ప్రధానులు భారత్‌లోని జయనగర్‌ ‌నుంచి నేపాల్‌లోని కుర్తా వరకు ప్యాసింజెర్‌ ‌రైలు సర్వీసును ప్రారంభించారు. ఇది రెండు దేశాల మధ్య వర్తకం, ప్రజల రాకపోకలకు ఏవిధమైన అడ్డంకులు లేకుండా జరగడానికి దోహదం చేస్తుంది. నేపాల్‌లో రూపే కార్డును ఉపయోగించే సదుపాయాన్ని కూడా ఏప్రిల్‌లో ప్రారంభించడం గమనార్హం. కాగా నేపాల్‌.. ‌మహేంద్రనగర్‌, ‌నేపాల్‌గంజ్‌, ‌జనక్‌పూర్‌లకు విమాన అనుసంధానత కోరుతోంది.

భాజపా వ్యూహం!

బౌద్ధం ద్వారా పాన్‌-ఆసియా, ఇతర ప్రపంచ దేశాలతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలన్న వ్యూహాన్ని అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి భాజపా అనుసరిస్తోంది. అదీకాకుండా దేశంలో బౌద్ధమతావలంబికులైన దళిత సామాజిక వర్గంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కూడా వ్యూహాత్మకంగా పార్టీ ముందుకు కదులు తోంది. దేశంలో దాదాపు 8.7 మిలియన్ల మంది బౌద్ధులుండగా వీరిలో 87% మంది ఇతర మతాల నుంచి చేరినవారే. ముఖ్యంగా హిందూ సమాజం లోని దళితులే అధికం. వీరినే నియో-బౌద్ధులు అంటారు. మిగిలిన 13% మంది ఈశాన్య, ఉత్తర హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వీరు సంప్రదాయిక బౌద్ధ మతస్థులు. 2016, అక్టోబర్‌లో వారణాసిలో ‘5వ అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనం’ నిర్వహణ, 2017లో రాజ్‌గిరిలో ‘21వ శతాబ్దంలో బౌద్ధం’ పేరుతో మరో అంతర్జాతీయ సదస్సు, నలంద విశ్వవిద్యాలయాన్ని తిరిగి ప్రారంభించడం వంటివి బౌద్ధం పట్ల ప్రభుత్వ నిబద్ధతను వెల్లడించడానికే. దళితుల ఆరాధ్యుడు, రాజ్యాంగ నిర్మాత డా।।బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ 1956‌లో బౌద్ధమతం స్వీకరించారు. అటువంటి ప్రముఖ రాజకీయవేత్త చేరడంతో బౌద్ధానికి సహజంగా సామాజిక, రాజకీయపరంగా ప్రాధాన్యం పెరిగిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం నియో-బౌద్ధుల్లో అక్షరాస్యత బాగా మెరుగవడం గమనార్హం.

ఇప్పుడు మోదీ లుంబినీ నగరాన్ని దర్శించడం, దళితులకు మరింత దగ్గర కావడానికి భాజపాకు ఒక అవకాశం కల్పిస్తున్నది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో బహుజన్‌ ‌సమాజ్‌పార్టీకి (బీఎస్పీ)కి మూల స్తంభాలుగా నిలుస్తున్న ఓటర్లు వీరే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పనితీరు ఘోరంగా ఉండటమే కాదు, ప్రస్తుతం ప్రజల స్మృతిపథం నుంచి క్రమంగా తొలగిపోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి కాంగ్రెస్‌ ‌కూడా రంగంలోకి దిగింది. ముఖ్యంగా 1980లో తాను అనుసరించిన దళిత- బ్రాహ్మణ- ముస్లింల ఓటుబ్యాంకు ఫార్ములాను పునరుద్ధరించే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో భాజపా దళితులను ఆకట్టుకునే వ్యూహంలో భాగంగా బౌద్ధంపై దృష్టిపెట్టింది. షెడ్యూల్డు కులాల మొత్తం జనాభాలో మాయావతి ఉపకులమైన ‘జాతవుల’ వాటా 14%. మొన్నటి ఎన్నికల్లో జాతవుల్లో 12.9% ఓట్లు మాత్రమే బీఎస్పీకి పోలవడం చూస్తే, సొంత కులంవాళ్లే పార్టీని పక్కనబెట్టినట్టు స్పష్టమవుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఎస్పీ ఈసారి 10% ఓటుషేరు కోల్పోయింది. అప్పటి ఎన్నికల్లో 22.2% ఓట్లతో 19 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు కేవలం ఒకేఒక సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఓటు బ్యాంకును సుసంఘటితం చేసుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో పార్టీని మరింత పటిష్టం చేసుకోవచ్చునన్నది భాజపా ఉద్దేశం. అదేవిధంగా 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మహారాష్ట్రలో బౌద్ధులను తనవైపు తిప్పుకునేందుకు కూడా భాజపా వ్యూహాత్మకంగా కదులుతోంది. ఇక్కడ బౌద్ధుల జనాభా 6,531,200. అంటే రాష్ట్ర జనాభాలో 5.81%. రాష్ట్రంలో ఈ మతం మూడో స్థానంలో ఉంది. 2011 జనగణన ప్రకారం మహారాష్ట్రలోని బౌద్ధుల సంఖ్య దేశంలోని మొత్తం బౌద్ధుల జనాభాలో 77.36%. రాష్ట్రంలో దళిత బౌద్ధ ఉద్యమంలో భాగమైన నవయాన బౌద్ధం ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడి బౌద్ధులను ఆకట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ.. మోదీ లుంబినీ యాత్రను ఉపయోగించుకోవచ్చు. తనకు సంప్రదాయిక భాగస్వామిగా ఉన్న శివసేన, నయా సెక్యూలరిస్టు పార్టీలైన ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో జట్టుకట్టిన నేపథ్యంలో, ఈ కూటమిని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనే క్రమంలో తనదైన శైలి రాజకీయాలు నడపడంలో భాగంగానే బౌద్ధులను ఆకర్షించే పనిలో పడింది. ఎన్నికల్లో కేవలం ఒకటి, రెండు శాతం ఓట్ల తేడాతో పార్టీలు గల్లంతవుతున్న నేపథ్యంలో, భాజపా దళిత ఓటుబ్యాంకుపై దృష్టి కేంద్రీకరించి, తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టబోదన్న సంగతి మాత్రం సుస్పష్టం.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram