– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

నెహ్రూ గారి షానవాజ్‌ ‘‌పప్పెట్‌ ‌షో’ ముగిసిన పద్నాలుగేళ్ల తరువాత వారి అమ్మాయిగారి దర్శకత్వంలో ఖోస్లా కమిషన్‌ అనే కీలుబొమ్మ ప్రహస నానికి తెర లేచింది. దానికి ఒక నేపథ్యముంది.

కాంగ్రెసు సర్కారు ఖర్మ కాలి 1967 ఎన్నికలలో సమర్‌ ‌గుహ అనే నేతాజీ వీరాభిమాని ఎంపీ అయ్యాడు. లోక్‌సభలో అడుగు పెడుతూనే అతడు ఇండియా, జపాన్‌, ‌ఫార్మోసా ప్రభుత్వాలు కలిసి నేతాజీ మిస్టరీపై జాయింటు ఎంక్వైరీ చేయాలని డిమాండు చేశాడు. ప్రభుత్వం పట్టించుకోలేదు. అతగాడు పార్లమెంటులో ధర్నా చేశాడు. కొందరు జాతీయ స్థాయి ప్రముఖులతో ఒక నేషనల్‌ ‌కమిటీని తాను కన్వీనరుగా ఏర్పరచాడు. ఆ దరిమిలా ఆన్ని పార్టీలకు చెందిన 350 మంది ఎంపీలు ఏకమై రాష్ట్రపతి జాకీర్‌ ‌హుస్సేన్‌కు 1968 మేలో మెమోరాండం సమర్పించారు.. ఆ వినతిపత్రాన్ని ప్రసిద్ధ జాతీయ చరిత్రకారుడు ఆర్‌సి మజుందార్‌ ‌తయారు చేశాడు.

‘‘ఎర్రకోటపై స్వాతంత్య్ర పతాకం ఎగరటానికి మూడేళ్ల ముందే ఐఎన్‌ఎ ‌నేతాజీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో బ్రిటిష్‌ ‌బానిసత్వం నుంచి భారత భూభాగాన్ని విముక్తి చేసి, స్వాతంత్య్ర పతాకాన్ని ఎగురవేసింది. నిజానికి నేతాజీయే స్వతంత్ర భారతానికి మొదటి రాష్ట్రపతి. నేతాజీ విశిష్ట వ్యక్తిత్వానికి, ఉజ్వల నాయకత్వానికి సముచిత గౌరవం, గుర్తింపు ఇవ్వటంలో ప్రభుత్వం విఫల మయింది. జపాన్‌, ‌తైవాన్‌ ‌ప్రభుత్వాల కొలాబ రేషనుతో కొత్తగా సమగ్ర దర్యాప్తు చేసి, నేతాజీకి సంబంధించిన మిస్టరీని తొలగించాలి. దానికోసం సుప్రీం కోర్టు న్యాయమూర్తి, సమర్థులైన ఇద్దరు ముగ్గురు విశిష్ట వ్యక్తులతో ఒక కమిటీని నియ మించాలి. భారత విమోచనకు ప్రధాన కారకులలో ఒకరైన నేతాజీకి సంబంధించిన వాస్తవాలను కనుగొనటంలో ఇంకా జాగుచేసి నిర్లక్ష్యం, అలసత్వం చూపితే భావితరాలు క్షమించవు.’’ అని మెమో రాండంలో విన్నవించారు.

అన్ని రాజకీయ పక్షాలకు చెందిన 350 మంది పార్లమెంటు సభ్యులు సంయుక్తంగా డిమాండ్‌ ‌చేసినా ఇందిరమ్మ సర్కారు చలించలేదు. ఇంతకుముందే ఎంక్వైరీ జరిపించాము కదా? కొత్తగా ఇంకొకటి వెయ్యాల్సిన అవసరమేముంది? ఘటన తరువాత 22 ఏళ్లకు ఇంకో విచారణ జరిపితే మాత్రం కొత్త విషయాలు ఏమి తెలుస్తాయి అంటూ ప్రభుత్వం ఠలాయించింది. వాజపేయి, మధులిమాయే, సమరగుహ వంటి ఉద్దండులు పట్టువదలక వెంట పడ్డారు. 45 మంది ఎంపీలు విచారణ కమిషన్‌ ‌వెయ్యాలంటూ నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. అమ్మగారు లక్ష్య పెట్టలేదు.

అప్పుడే (1969లో) రాష్ట్రపతి ఎన్నిక వివాదం పర్యవసానంగా కాంగ్రెసు పార్టీ నిలువునా చీలింది. ప్రభుత్వ మనుగడ కోసం ప్రతిపక్షాల సహాయ సహకారాల మీద ఆధారపడవలసిన అగత్యం వచ్చింది. ఇందిరవర్గం మద్దతుతో రాష్ట్రపతిగా ఎన్నికైన వివి గిరి నేతాజీ అభిమానుల మొరను సానుభూతితో ఆలకించి, సానుకూల చర్యకు సిఫారసు చేస్తూ ఎంపీల వినతిపత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. ఉద్విగ్నులైన ఎంపీలను అనునయించి, నచ్చచెప్పమని హోం మంత్రి వైబి చవాన్‌ను ప్రధాని ఇందిర పురమాయించింది. అది అతడి వల్ల కాలేదు. నేతాజీకి ఏమయ్యిందో తెలుసుకో వాలని కోట్లాది ప్రజలు తహతహలాడుతున్న సమయాన ప్రభుత్వం విచారణకు అడ్డుపడుతున్నదన్న అభిప్రాయం కలగనివ్వటం మంచిది కాదని కేంద్ర కేబినెట్‌ ‌సమావేశంలో ఎనిమిది మంది సీనియర్‌ ‌మంత్రులు గట్టిగా చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో కేంద్రం దిగివచ్చి 1970 జూలై 11న ఏకసభ్య కమిషన్ను వేస్తున్నట్టు ప్రకటించింది.

నెహ్రూ గారి 1956 కమిటీలో అసలువాడు కాక ఇద్దరైనా ఇతరులు ఉన్నారు. తండ్రే నయం అనిపించటం ద్వారా తండ్రికి మంచిపేరు తేవాలని కంకణం కట్టుకున్న ఇందిరా ప్రియదర్శిని అలాంటి జంజాటం పెట్టుకోకుండా ఒకే ఒక్కడితో కమిషన్ను సరిపెట్టింది. కీలక నియామకానికి ‘అనర్హుడు కావటమే అర్హత’ అని నెహ్రూజీ పెట్టిన వరవడిని సుపుత్రిక చక్కగా కొనసాగించటమేకాక ఇంకా ముందుకు తీసుకుపోయింది. తండ్రి వేసిన కమిటీ చైర్మన్‌ ‌షానవాజ్‌కు కనీసం నేతాజీ సహచరుడన్న పేరైనా ఉంది. నెహ్రూ పుత్రిక జాగ్రత్తగా గాలించి ఏరికోరి కమిషన్‌ అధిపతిగా ఎంపిక చేసిన జస్టిస్‌ ‌జీడీ ఖోస్లాకు అసలు నేతాజీ పేరు వింటేనే కంపరం. కేంబ్రిడ్జ్‌లో సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌సహాధ్యాయిగా ఉన్నకాలం నుంచే అతడికి బోస్‌ అం‌టే కోపం. ఎందుకంటే ఐసిఎస్‌ ‌కొలువులో చేరి తాను బ్రిటిషువారి సేవ చేయనున్నట్టు తోటి విద్యార్థుల ముందు అతగాడు గొప్పగా చెపితే దేశం కోసం ఆ కొలువును ఎడమ కాలితో తన్నేసిన సుభాస్‌ అసహ్యంగా ఒక చూపు చూసి నలుగురిలో అవమా నించాడట. నేతాజీ అంటే పడకపోవటానికి తోడు నెహ్రూకు స్నేహితుడు, ఇష్టుడు కావటం ఖోస్లాకు అదనపు అర్హత. దానిని మించిన అసలుసిసలు క్వాలిఫికేషన్‌ ఏమిటంటే ఆయన ఇందిరాగాంధీ అనుగ్రహం కోసం అంగలార్చే వీర విధేయుడు.

నేతాజీ మిస్టరీని ఛేదించటానికి వేసిన రెండో ఎంక్వైరీ దేశమంతటా తీవ్ర ఆసక్తిని, ఆశాభావాన్ని రేకెత్తించింది. మొదటి కమిటీలా కాకుండా ఈ సారి గజ్జె కట్టింది జుడిషియల్‌ ‌కమిషను. పంజాబ్‌ ‌హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన పెద్ద జడ్జి చేస్తున్న విచారణ కాబట్టి ప్రభుత్వ ఒత్తిళ్లకు , మొగమాటాలకు లోనవకుండా స్వతంత్రంగా వ్యవహరించి, ప్రభుత్వం దాచిపుచ్చిన రహస్య పత్రాలను బయట పెట్టించి నేతాజీకి సంబంధించిన అసలు నిజాన్ని వెలికి తీస్తారని జనం ఆశపెట్టు కున్నారు.

జాతీయ ప్రాధాన్యం ఉన్న పెను వివాదాన్ని విచారించే మాన్య న్యాయమూర్తికి ముఖ్యంగా ఉండవలసినవి నిగ్రహం, సంయమనం, హుందా తనం. జస్టిస్‌ ‌గోపాల్‌ ‌దాస్‌ ‌ఖోస్లాలో లేనివి సరిగ్గా ఆ మూడు లక్షణాలే. 1964లో పంజాబ్‌ ‌హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన సందర్భంలో తనకు ఏదో మర్యాదలోపం చేశారన్న కచ్చతో అప్పటి అడ్వకేట్‌ ‌జనరల్‌ ఎస్‌ఎం ‌సిక్రీనీ, ఆయన భార్యనూ ఒక పత్రికకు రాసిన వ్యాసంలో అవమానకరంగా చిత్రించిన ఘనుడాయన. దానిపై సిక్రీ క్రిమినల్‌ ‌కేసు పెట్టాడు. అరెస్టును తప్పించు కోవటానికి ఖోస్లా లండన్‌ ‌పారిపోయాడు. తరువాత చెంపలేసుకుని సిక్రీ దంపతులకు బహిరంగ క్షమాపణ చెప్పుకున్నాడు.

అవసరమైతే ప్రభుత్వాన్ని సైతం వేలెత్తి చూపవలసిన తీర్పరి బాధ్యతను తలకెత్తుకున్నాక ప్రభుత్వాధినేతకు బాకా ఊదే చిల్లర పనికి వివేకం, విజ్ఞత ఉన్న ఏ న్యాయమూర్తీ కక్కుర్తిపడడు. కమిషను చైర్మను అయ్యాక జస్టిస్‌ ‌ఖోస్లా ఇందిరాగాంధీ జీవిత చరిత్రను రాసే కాంట్రాక్టుకు ఒప్పుకున్నాడు. దానికి మంచి రాయల్టీని మాట్లాడుకున్నాడు. అంతేకాదు జుడిషియల్‌ ‌కమిషను పని ముగించటానికి ముందే ఆ పవిత్ర గ్రంథాన్ని పబ్లిష్‌ ‌చేశాడు. కమిషన్‌ ‌పనిమీద తైవాన్‌ ‌వెళ్లినప్పుడు ఖరీదైన కానుకను షాపింగు చేసి, వెనక్కి రాగానే ఇందిరమ్మ గారి దర్శనం చేసుకుని దానిని సమర్పించి తరించిన ఆదర్శ పురుషుడాయన. ఇంకా సిగ్గుచేటు నిర్వాకం ఏమిటంటే – జుడిషియల్‌ ‌కమిషన్‌ ‌విచారణ నివేదిక పార్లమెంటులో ప్రవేశ పెట్టటానికి ముందే ఖోస్లా అందులోని అంశాలను యథాతథంగా పొందుపరచి తన సొంతలాభం కోసం‘‘••• ణ•• శీ• చీవ•••ఱ’’ అనే గ్రంథాన్ని మార్కెట్లోకి వదిలాడు. అది నీతి బాహ్యతకు పరాకాష్ట.

అసలు ఖోస్లా కమిషన్‌ ‌పుట్టుకకు కారణమే నేతాజీ మిస్టరీకి సంబంధించి కొందరు ఎంపీల ద్వారా తైపే నించి అందిన కొత్త సమాచారం రేకెత్తించిన సంచలనం. డాక్టర్‌ ‌సత్యనారాయణ సిన్హా అనే ఎంపీ 1964లో తైపే వెళ్లి అక్కడివారిని విచారిస్తే 1945 ఆగస్టు 18 న అసలు విమాన ప్రమాదమే ఏదీ జరగలేదని చెప్పారు. ఆ తేదీకి ముందు 1944 అక్టోబరులో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలనే జపాన్‌వారు అందించగా షానవాజ్‌ ‌నమ్మేసి అవే నేతాజీ ప్రమాదానికి రుజువులుగా తన రిపోర్టులో చూపెట్టాడని సత్య నారాయణ సిన్హా ఆరోపణ. ఈ సంగతి పార్లమెంటులో ప్రస్తావించటమేగాక 1966లో తాను రాసిన చీవ•••ఱ వీ••వతీ• అనే గ్రంథంలో సిన్హా వివరంగా చెప్పాడు. అది అప్పట్లో పెద్ద సంచలన మయింది. నేతాజీ సైబీరియాలో రష్యన్‌ ‌చెరలో ఉన్నాడని, ప్రధాని ఇందిరాగాంధీ తలచుకుంటే అది నిజమో కాదో తేలిగ్గా వెరిఫై చేయించగలదని సత్యనారాయణ సిన్హా వాదం.

సిన్హా గ్రంథం వెలువడిన 1966 సంవత్సరంలో రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనా (ఫార్మోసా) ఆహ్వానం మీద కొంతమంది మన ఎంపీలు సుహృద్భావ పర్యటన చేశారు. తైపేలో ఆ ప్రతినిధివర్గాన్ని రిసీవ్‌ ‌చేసుకుని వారి వెంబడే ఉన్న డాక్టర్‌ ‌లిన్‌ అనే ప్రభుత్వ అధికారిని నేతాజీ విమాన ప్రమాదం గురించి ఎంపీలు అడిగారు. తమ విదేశాంగ శాఖ ఉపమంత్రి ఆదేశం మీద అంతకుముందు తానే దాని గురించి దర్యాప్తు జరిపానని, 1945 ఆగస్టు 18 న ఎలాంటి విమాన ప్రమాదం జరగలేదని ఆ అధికారి చెప్పాడు. ఆ కాలాన తైపే మేయరుగా పనిచేసిన వ్యక్తి కూడా ఆ తేదీన ప్రమాదం అబద్ధం అని ద్రువీకరించినట్టు అతడు తెలిపాడు. అప్పటి ఎంపీల డెలిగేషనులో ఉన్న సీనియర్‌ ‌పార్లమెంటేరియన్‌ ‌ములక గోవిందరెడ్డి ఈ సంగతి ఖోస్లా కమిషను ముందు ఇచ్చిన సాక్ష్యంలో వెల్లడించాడు.

‘‘విదేశాంగ ఉపమంత్రి అన్నారే- ఆయనను మీరు కలిశారా?’’ అని జస్టిస్‌ ‌ఖోస్లా ప్రశ్న.

‘‘ఔను. ఒక డిన్నర్‌ ‌పార్టీలో మేము అతడి గెస్టులము. ఆ సందర్భంలో నేతాజీ విమాన ప్రమాదం గురించి అడిగాం. లిన్‌ ‌చెప్పినదాన్ని మంత్రి ధ్రువీకరించాడు. ఆ విషయమై దర్యాప్తుకు భారత ప్రభుత్వం ఒక కమిషన్‌ను గాని, అధికారిని కాని పంపిస్తే ఫార్మోసా గవర్నమెంటు తప్పక సహకరించ గలదని అతడు హామీ ఇచ్చాడు’’ అని గోవింద రెడ్డి జవాబు.

‘‘మా డెలిగేషనులోని ఎంపీలందరం తైవాన్‌ ‌ప్రధాని చాంగ్‌ ‌కై షేక్‌ను కూడా కలిశాం. భారత ప్రభుత్వం విమాన ప్రమాదం గురించి ఏదైనా విచారణ జరపదలచుకుంటే తాము అవసరమైన సహాయం చేయగలమని ప్రధాని మాట ఇచ్చాడు.’’ అని ఇంకో ఎంపీ ప్రకాశ వీరశాస్త్రి ఖోస్లా కమిషను ముందు సాక్ష్యమిచ్చాడు.

 తిరిగివచ్చాక ప్రకాశ వీరశాస్త్రి, ఇంకో తొమ్మిది మంది ఎంపీలు 1967జులైలో లోక్‌సభలో దీనిగురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తైవాన్‌ ‌ప్రభుత్వం నుంచి అటువంటి వర్తమానం ఏదీ అందలేదని, కొత్తగా ఒక దర్యాప్తు సంఘాన్ని తైవాన్‌ ‌పంపించే ఆలోచన లేదని ప్రభుత్వం బదులిచ్చింది. మనం ఏదైనా విచారణ జరిపిస్తాం సహాయం చేయండి అని కోరితే తైవాన్‌ ‌చేస్తుంది కాని- రండి బాబూ మా సహాయం అందుకోండి అని తైవాన్‌ ఎం‌దుకు వర్తమానం పంపుతుంది? విచారణ అవసరం మనదా వారిదా? ఆ సంగతి అందరూ అడగటం మొదలెట్టాక రాజకీయంగా ఒత్తిడి పెరిగి ఖోస్లా కమిషన్‌ ఏర్పాటుకు దారి తీసింది.

ఫార్మోసాతో మనకు దౌత్య సంబంధాలు లేవన్న వంకతో నెహ్రూ ప్రభుత్వం 1956 లో వేసిన మొదటి కమిటీని ప్రమాద స్థలం దగ్గరికి పోనివ్వలేదు. మీరు వెళ్లినా అక్కడి ప్రభుత్వం సహకరించకపోవచ్చు కాబట్టి పోనే వద్దు అంటూ న్యూదిల్లీ అప్పుడు అడ్డం పడింది. ప్రజలు, పార్లమెంటు ఒత్తిడి చేసిన మీదట తప్పనిసరై కొత్తగా జుడిషియల్‌ ‌కమిషనును నియమించిన తరవాతైనా విచారణ సంఘాన్ని ప్రమాదస్థలం చూడనివ్వాలన్న వివేకం కేంద్ర ప్రభుత్వం కనపరచ లేదు. దౌత్య సంబంధాలు లేవు కనక అక్కడికి వెళ్ళటం కుదరదు అని 1956లో తండ్రి పాడిన పాతపాటనే 1970ల్లో కుమార్తె కూడా జంకు లేకుండా వినిపించింది. తమను ప్రమాద స్థలానికి వెళ్లనివ్వండి అని షానవాజ్‌ ‌ప్రభుత్వాన్ని అడగనైనా అడిగాడు. హైకోర్టు ప్రధానన్యాయమూర్తి పదవి వెలగబెట్టి, అప్పటికి రికార్డు స్థాయిలో డజనుకు పైగా ఎంక్వైరీ కమిషన్లను కడతేర్చిన విశేష అనుభవశాలి ఖోస్లా గారికి ఘటన గురించి విచారించాలంటే ఘటనా స్థలానికి వెళ్లి చూడటం అవసరమన్న ఆలోచన పని మొదలెట్టిన రెండేళ్ల వరకూ రాలేదు. సాక్ష్యమిచ్చిన మాజీ ఎంపీలు గోల పెట్టిన తరువాత తప్పనిసరై- వెళ్ళమంటారా అని ఏలినవారిని ఖోస్లా అడిగాడు. దౌత్య సంబంధాలు లేని కారణంగా మీరు తైవాన్‌ ‌వెళ్లేందుకు వీలులేదు అని 1972 మే 10న ప్రభుత్వం బదులిచ్చింది. న్యాయమూర్తిగారు చిత్తం అన్నారు.

కమిషను ఊరకున్నా ప్రతిపక్షం ఊరుకోలేదు. దౌత్య సంబంధాలు లేని ఎన్ని దేశాలకు మన అధికారులు రాకపోకలు జరపటం లేదు? దౌత్య సంబంధాలు లేకపోయినా ఎంపీల ప్రతినిధి వర్గాలు తైవాన్‌లో పర్యటించలేదా? మొదటి నుంచీ భారతదేశం పట్ల సుహృద్భావం ఉన్న చాంగ్‌ ‌కై షేక్‌ ‌స్వయంగా సహాయాన్ని వాగ్ధానం చేశాక దానిని స్వీకరించటానికి మీకు ఏమిటి ఇబ్బంది? దౌత్య సంబంధాలు లేకున్నా తైవాన్‌తో ఇంటెలిజెన్సు వగైరాలలో మీకు లోపాయకారీ బంధాలు లేవా? వాటిని బయటపెట్టమంటారా – అంటూ ప్రతిపక్ష నాయకుడు అటల్‌ ‌బిహారీ వాజపేయి నాయకత్వంలో 26 మంది పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రికి ఘాటైన లేఖ రాసి, పార్లమెంటులో నిలదీసిన మీదట ప్రభుత్వం దారికొచ్చి తైవాన్‌ ‌వెళ్లేందుకు కమిషనుకు అనుమతి ఇచ్చింది. ఆ తరవాతైనా విచారణ సవ్యంగా జరిగిందా?

తనకు అప్పగించిన విచారణను తానే ధ్వంసం చెయ్యాలని ముందుగా నే నిర్ణయానికి వచ్చిన జస్టిస్‌ ‌ఖోస్లా 1973 జూలై 11న తైపేలో అడుగు పెట్టాడు. వెళ్లీ వెళ్లగానే ఎంపిక చేసిన కొద్దిమంది పత్రికా విలేకరులను తాను బస చేసిన హోటల్‌కు పిలిపిం చాడు. కమిషన్‌ ‌ముందు సాక్ష్యమిచ్చిన జపాన్‌ ‌వారందరూ విమానప్రమాదంలో బోస్‌ ‌మరణాన్ని ధృవీకరించారని వారి చెవిన వేశాడు. జపాన్‌తో బంధాలు, మొగమాటాలు అనేకం ఉన్న తైవాన్‌ ‌ప్రభుత్వం పత్రికల్లో ఆ వార్త చూశాక జపాన్‌ ‌వారికి వ్యతిరేకమైన వైఖరి తీసుకోవటానికి జంకుతుందని బహుశా అతడి వంకర తెలివి! జపాన్‌ ‌సాక్షులు ఏమి చెపితేనేమి- కమిషన్‌ ‌నుంచి ఎవరైనా అడిగితే నిజ నిర్ధారణకు సహాయపడటానికి తైవాన్‌ ‌ప్రభుత్వానికి అభ్యంతరం ఉండదు. కాని అడగటానికి కమిషన్‌ ‌న్యాయమూర్తే సిద్ధంగా లేడు. ఖోస్లా కంటే ముందే తైపే వెళ్లి పరిశీలన చేసి, స్థానిక అధికారు లతో మాట్లాడి రంగం సిద్ధం చేసిన సమర్‌గుహ వంటివారు కమిషన్‌ ‌సెక్రెటరీని నిగ్గదీస్తే తెలిసింది ఏమిటంటే రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనా ప్రభుత్వాన్ని కాని, మరి ఏ ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర ఏజెన్సీని కాని కాంటాక్ట్ ‌చేయరాదు అని బయలుదేరే ముందే కమిషనును విదేశాంగ శాఖ కట్టడి చేసిందట. ‘ఈ సంగతి మాకు దిల్లీలోనే ఎందుకు చెప్పలేదు? ఇక్కడికి అసలు మీరు ఎందుకొచ్చారు?’’ అని సమర్‌ ‌గుహ ఖోస్లాను మొహం మీదే దులిపేశాడు. ‘‘తైవాన్‌ ‌ప్రభుత్వానికి ఒక్క లేఖ రాయండి. తైపే మేయరు చేసిన దర్యాప్తు నివేదిక, విమాన ప్రమాదం మీద ప్రభుత్వ ఎంక్వైరీ రిపోర్టులు, చాంగ్‌ ‌కై షేక్‌కు నెహ్రూ రాసిన రహస్య లేఖ లాంటి ముఖ్యమైన పత్రాలు వారి ఆర్కైవ్స్‌లో ఉన్నాయి. మీరు అడిగితే చాలు వాటిని ఇవ్వటానికి వారు సిద్దంగా ఉన్నారు’’ అని నేషనల్‌ ‌కమిటీ ముఖ్యులు గుహ, ముఖర్జీ ఎంత మొత్తుకున్నా జస్టిస్‌ ‌ఖోస్లా నుంచి స్పందన లేదు. విచారణ చేయటానికి వచ్చిన వాడు ఎక్కువ సమయం హోటల్‌ ‌రూములో కులాసాగా గడిపితే గుహ, ముఖర్జీలే విమానాశ్ర యానికీ, ఆస్పత్రికీ, మునిసిపల్‌ ఆఫీసులకూ, దహనవాటికకూ వెళ్లి సొంత ఇన్వెస్టిగేషన్లు చేసి వెనుకటి సాక్ష్యాలలో వైరుధ్యాలను కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఆఖరికి వారు తన ముందు పెట్టిన విషయాలను కీగంట పరిశీలించ టానికి కూడా ఖోస్లాకు ప్రాణం ఒప్పలేదు. ఏమి చూస్తే, ఏమి చేస్తే భారత ప్రభుత్వ ప్రకటిత వైఖరికి ఇబ్బంది వస్తుందో, దాని వల్ల ప్రధాన మంత్రికి తన మీద ఎక్కడ దయ తప్పుతుందో అనే ఎంత సేపూ ఆ (అ)న్యాయమూర్తి ఆరాటం. అమ్మగారి మెహర్బానీ కోసం గిఫ్టుల షాపింగు మీద చూపించిన శ్రద్ధలో నూరో వంతయినా అసలు పని మీద పెట్టి ఉంటే రకరకాల అనుమానాలకు, ఆరోపణలకు, ఊహా గానాలకు, వదంతులకు జుడిషియల్‌ ‌విచారణ ద్వారా తైపేలోనే తెరపడి ఉండేది. నిజానిజాలు ఏమిటో లోకానికి తెలిసేది.

నేతాజీ మిస్టరీకి సంబంధించి ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే 1945 ఆగస్టు 18న తైపే (అప్పట్లో దాని జపనీస్‌ ‌పేరు తైహోకు)లో అసలు విమానప్రమాదమే ఏదీ జరగలేదని! 1944 అక్టోబరులో రన్వేకు దూరాన గుట్టల దగ్గర కూలిన విమానం ఫోటోలను 1945 ఆగస్టులో రన్వే దాపున జరిగినట్టుగా చెప్పబడిన ప్రమాదానికి రుజువులుగా బనాయించారని! అంతకు ముందు సత్యనారాయణ సిన్హా లాగే గుహ, ముఖర్జీలు కూడా డిటెక్టివ్‌ ‌వర్కు చేశారు. పాత విమానాశ్రయ సమీపాన ప్రమాద స్థలానికి జస్టిస్‌ ‌ఖోస్లాను వారు బలవంతపెట్టి లాక్కుపోయారు. ఇక్కడ పరిసరాల వాస్తవ స్థితికీ, జపాన్‌ ‌వారు చూపించిన మూడు ఫోటోలలో కనపడే దానికీ పొంతన లేదు. మీరే చూడండి. అసలు ఆ మూడూ వేరువేరు ప్రమాదాలకు సంబంధించిన బొమ్మలు – అని వారు చూపించారు. కాని ఖోస్లా ఎదురుగా కనపడేదానిని కాకుండా ఆకాశంలోకి చూస్తూ కాసేపు నిలబడ్డాడు. తరవాత ‘ఈ ఫోటోలతో నాకేమిటి సంబంధం’ అంటూ విసవిసా వెళ్లి కారెక్కాడు. ఆసుపత్రికీ, దహనవాటికకీ వెళ్లినప్పుడూ అంతే. ఎవరిని కదిపితే వినకూడనిది ఏమి వినవలసి వస్తుందో అన్నట్టు, నిజం చూడనని ఒట్టేసుకున్నట్టు ఖోస్లా సాక్ష్యాల సేకరణ చేశాడు. నేతాజీ చికిత్స వివరాలు, మరణ సమయం, డెత్‌ ‌సర్టిఫికేట్‌ ‌జారీకి సంబంధించి డాక్టర్ల, సాక్షుల వాంగ్మూలాలలో వైరుధ్యాల మీదికి అతడి కన్ను పొమ్మన్నా పోలేదు.

వెనక్కి వెళ్లాక ఖోస్లా విచిత్ర నిర్వాకం మీద సమర్‌ ‌గుహ పార్లమెంటులో రచ్చరచ్చ చేశాడు. ప్రభుత్వమే కావాలని విచారణకు తూట్లు పొడిచింది. తైవాన్‌ అధికారులను కాంటాక్ట్ ‌చెయ్యరాదని కమిషన్‌కు మీరు ఇచ్చిన ఆదేశాన్ని బయట పెట్టండి అని వాజపేయి, మధులిమాయే విదేశాంగ మంత్రి స్వరణ్‌ ‌సింగ్‌ను గట్టిగా తగులుకున్నారు. బయట పెట్టటం కుదరదు అన్నాడే తప్ప అలాంటి ఆదేశమేదీ తాము ఇవ్వలేదని మంత్రి ఖండించలేదు.

రాజకీయ పాలకులు తనమీద పెట్టుకున్న నమ్మకానికి పూర్తి న్యాయం చేస్తూ, జస్టిస్‌ ‌ఖోస్లా పని మొదలెట్టిన నాలుగేళ్లకు 1974 జూన్‌ 30‌న తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చాడు. సమర్‌ ‌గుహ లోక్‌సభలో దానిని చించి పోగులు పెడితేనేమి? ప్రతిపక్షం ఎన్ని అభ్యంతరాలు తెలిపితేనేమి? తనకున్న బండ మెజారిటీ సాయంతో ఇందిరమ్మ ప్రభుత్వం దానికి పార్లమెంటు ఆమోద ముద్ర పొందింది.

ఖోస్లా లీలల కథ అక్కడితో అయిపోలేదు. తన అడ్డదిడ్డపు రిపోర్టులో నెహ్రూకు, ఇందిరకూ పనికిమాలిన సర్టిఫికెట్లు ఎడా పెడా ఇవ్వటంతో ఖోస్లా ఆగలేదు. నేతాజీ చుట్టూ అలముకొన్న అనవసరపు మిస్టరీని పటాపంచలు చేయవలసిన వాడు ఆ పనిని మానేసి నేతాజీ మీద దుర్భాష లాడాడు. నేతాజీ జపాన్‌ ‌చేతిలో కీలుబొమ్మ!ఎప్పుడు ఎలా కావాలంటే అలా వాడుకుని అవతల పారేసే విధంగానే నేతాజీని వారు వాడుకున్నారు! ఇండియాలోకి దండయాత్రకు ఐఎన్‌ఎ అ‌గ్రభాగాన ఉండాలని నేతాజీ చేసింది అత్యుత్సాహంతో కూడిన అవాస్తవిక ఆలోచన! జపాన్‌ ‌సహాయంతో బోస్‌ ఇం‌డియాలోకి ప్రవేశించటమంటే ఇండియా జపాన్‌కు వలస రాజ్యం కావటమే! నేతాజీ కాంపెయిన్‌ ‌పూర్తిగా ఫెయిల్యూర్‌! ఇవి ఖోస్లా కలం నుంచి జాలువారిన కొన్ని ఆణిముత్యాలు. అసందర్భ ప్రేలాపనలు, అప్రస్తుత వ్యాఖ్యలతో నిండిన కమిషన్‌ ‌రిపోర్టులో రాసిన ఇలాంటి రాతలనే దానికంటే ముందు తాను వెలువరించిన Last Days of Netaji గ్రంథంలోనూ కూశాడు.

దాని మీద ఒళ్లుమండి నేతాజీ అన్న కొడుకు ద్విజేంద్రనాథ్‌ ‌బోస్‌ ‌క్రిమినల్‌ ‌కేసు పెట్టాడు. అరెస్టును తప్పించుకోవటానికి ఖోస్లా నానా తంటాలు పడ్డాడు. అన్ని ఎత్తులూ విఫలమయ్యాయి. పంజాబ్‌ ‌హైకోర్టులో చీఫ్‌ ‌జస్టిస్‌గా పనిచేసిన వాడు 1978 ఏప్రిల్‌1‌న మెట్రోపాలిటన్‌ ఎదుట చేతులు కట్టుకుని నిలబడి‘‘ద్విజేంద్రనాథ్‌కూ, బోస్‌ ‌కుటుంబానికీ బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. నేతాజీ మాతృభూమికి విమోచన కలిగించిన మహనీయుడు. మహాత్మాగాంధీ అన్నట్టు నేతాజీ దేశభక్తులలో కెల్లా దేశభక్తుడు. దిల్లీ, ముంబాయి, కోల్‌కతా, ఇతర రాష్ట్ర రాజధానులన్నిటి నుంచీ వెలువడే అన్ని పత్రికలలో నా క్షమాపణను ఎడ్వర్టయిజ్మెంటుగా వేయిస్తాను. అభ్యంతరకరమైన నా గ్రంథం కాపీలను వెంటనే మార్కెట్‌ ‌నుంచి ఉపసంహరిస్తాను. ఇంతకుముందు దాని కాపీలు అమ్మిన బుక్‌ ‌స్టోర్ల ముందు నా క్షమాపణను ప్రముఖంగా ప్రదర్శించేట్టు చేస్తాను’’అని లెంపలేసుకుని ముక్కు నేలకు రాశాడు!

– మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
YOUTUBE