విద్యా కుసుమాలు పూసి, వికసించవలసిన విద్యాలయాలు మత ఛాందసవాదుల కోరలలో చిక్కుకుంటున్నాయి. విద్యార్థినుల బుర్రలలో మతతత్వపు ఆలోచనలను నింపడమే ధ్యేయంగా సాగుతున్న ప్రయత్నమే హిజాబ్‌ ఉద్యమ లక్ష్యంగా కనబడుతున్నది. కొన్ని వారాలలో దేశమంతా వ్యాపించిన ఈ అలజడి అసలు ఉద్దేశం నిజంగా వస్త్రధారణ మాత్రమే అయితే అలాంటి స్వేచ్ఛను కాదనలేం. ఈ దేశంలో ఉన్నవాళ్లు ఎవరు కోరుకున్న దుస్తులు వారు ధరించే స్వేచ్ఛ ఉన్నది. కాని కొన్ని ప్రదేశాలలో అంటే అందరూ కలిసివుండే చోటు అక్కడి పని లేదా అక్కడి వ్యవస్థకు తగినట్టుగా వస్త్రధారణ ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశాలను బట్టి అక్కడ ఉన్న వ్యవస్థలను బట్టి ఆ దుస్తులనే ధరించాలి. అక్కడి నియమాలను పాటించాలి. అంతేకానీ నా ఇష్టం అన్నట్టుగా ఉంటే కుదరదు. విద్యాలయాలకు సంబంధించి ఇలాంటి నిబంధనను ఒక పౌర సమాజపు కట్టడిగానే స్వీకరించాలి. పాఠశాలల్లో ఏకరూప దుస్తుల వ్యవస్థ అందుకే. భావి భారత పౌరులు నిర్మాణం కావాల్సిన ప్రదేశమది. అక్కడ ఎలాంటి భేదభావాలు లేకుండా అందరూ సమానం అనే భావన కల్పించే విధంగా ఏకరూప వస్త్రధారణ నియమం ఉంటుంది.


పాఠశాలల్లో హిజాబ్‌ ‌వేసుకోవచ్చా లేదా అన్నది అంత సులువైన చర్చ కాదు. సైన్యం ఎందుకు యూనిఫామ్‌ ‌ధరిస్తుంది? వైద్యులు, న్యాయవాదులు, నర్స్‌లు ఎందుకు యూనిఫామ్‌ ‌ధరిస్తారు? ఈ వ్యవస్థలలో యూనిఫామ్‌ ‌ధరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బంది కలిగించే అంశంగా ఎవరూ భావించడం లేదు. అదేవిధంగా పాఠశాలలో కూడా విద్యార్థులు యూనిఫామ్‌ ‌ధరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించదు. పాఠశాలలో కానీ ప్రభుత్వ, ప్రయివేట్‌ ‌సంస్థలలో కానీ, అంటే ఎక్కడైతే డ్రెస్‌కోడ్‌ ఉం‌టుందో అక్కడ, వారి వ్యక్తిగత ఇష్టాల మేరకు, విశ్వాసాల మేరకు దుస్తులు ధరించే హక్కును కోరడం అక్కడి సమూహ లక్షణానికీ, ఏకత్వానికీ విఘాతం కలిగిస్తుంది. కొద్దిరోజుల క్రితం బీబీసీ వార్తా సంస్థ ఇచ్చిన ఒక నివేదికలో హిజాబ్‌ ‌వివాదంతో కర్ణాటకలోని కొన్ని విద్యాసంస్థలలో విద్యార్థుల మధ్య ఎంత దూరం పెరిగిపోయిందో ఇప్పటికే నమోదు చేసింది. ఇది మొత్తంగా సమాజ ఐక్యతకే భంగం కలిగించగలదని ఈ రగడ లేవదీసిన వారు గుర్తించకపోవడం అనర్థమే. ఈ వివాదం విషయంలో కర్ణాటకలో ముస్లిం విద్యార్థులు ఎంత దూరం వెళ్లారంటే, వారు కళాశాల ఆదేశాలను లెక్క చేయడం లేదు. తీర్పు వచ్చేవరకు యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మన్నించడానికి కూడా వారు సిద్ధంగా లేకపోవడం ఏమిటి? ఆదేశాలు వచ్చినా హిజాబ్‌తో వచ్చి తమను లోపలికి అనుమతించాలని పట్టుపట్టడం, వాగ్వాదా నికి దిగడం కూడా జరిగాయి. కానీ ఈ వివాదానికి హిందూ సంస్థలను బాధ్యులను చేయాలన్న అంతర్జాతీయ మీడియా ప్రయత్నం అత్యంత జుగుప్సాకరంగా ఉంది.

కర్ణాటకలో మొదలై క్రమంగా దక్షిణాది రాష్ట్రాలు, కొన్ని ఉత్తర భారత ప్రాంతాలకు విస్తరించిన ఈ వివాదం కొన్ని ప్రశ్నలకు తావిస్తున్నది. గత సంవత్సరం వరకు ఏకరూప వస్త్రధారణతో వచ్చిన విద్యార్థులకు ఈ సంవత్సరమే తామేదో అపచారం చేస్తున్న భావన ఎందుకు వచ్చింది? ఇది ఆలోచించా ల్సిన విషయం. ఉడిపిలో హిజాబ్‌ ‌గొడవ లేవదీసిన ఆ ఆరుగురు ముస్లిం విద్యార్థినులు ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా హిజాబ్‌తో పాఠశాలకు రాలేదు. మరి ఇప్పుడే ఎందుకు పట్టుబడుతున్నారు? అంటే వీళ్ల వెనుక కొన్ని విద్రోహశక్తులు- పీపుల్స్ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (PFI) అనుబంధ విద్యార్థి విభాగం క్యాంపస్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా ప్రణాళిక బద్ధంగా మొదలుపెట్టిన రగడ. దేశంలో మతపరమైన అల్లర్లకు, విధ్వంసానికి ఏ స్థాయిలో వీలైతే ఆ స్థాయిలో, ఏ అవకాశం కుదిరితే ఆ ఆవకాశాన్ని వినియోగించుకోవడం కోసం పీఎఫ్‌ఐ ‌నిరంతరం ప్రయత్నం చేస్తుంటుంది. అసలు పీఎఫ్‌ఐ అసలు రంగు ఏమిటి?

ఇప్పుడు ప్రపంచానికి ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదాన్ని సరఫరా చేస్తున్న ఐసిస్‌కు తీవ్రవాదులను సమకూర్చి పెట్టే సంస్థ పీఎఫ్‌ఐ. ఈ ‌వాస్తవాన్ని కేరళ పోలీసులే అనేక సందర్భాలలో వెల్లడించారు. పీఎఫ్‌ఐ ఉ‌గ్రవాదులకు ఊతం ఇచ్చే విధంగా పనిచేస్తుందని 2011లో కేరళ ప్రభుత్వమే న్యాయస్థానానికి నివేదించింది. రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కారణం కూడా ఇదేనని పోలీసుల విచారణలో తెలిసింది. సిమి అనే ఇస్లాం సంస్థ వలెనే పీఎఫ్‌ఐ ‌కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే సిమిని దేశవ్యాప్తంగా నిషేధించారో అప్పుడు, 2006లో ఈ సంస్థకి పురుడు పోశారు. దీని కళాశాల విభాగం క్యాంపస్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా సెప్టెంబర్‌ 2021‌లో ఉడిపి, మంగళూరు పరిసర ప్రాంతాలలో ఉన్న అన్ని కాలేజీలలో సభ్యత్వాలు నమోదు చేయించింది. ఇది విద్యార్థుల ఆలోచనలను ఎంత వేగంగా కలుషితం చేసిందంటే, ఒక నెలకు హిజాబ్‌ ‌వివాదం రేపారు. పీఎఫ్‌ఐ ‌టూల్‌కిట్‌ను అమలులో పెట్టడం మొదలు పెట్టారు. హిందువులను నేపాల్‌ ‌వెళ్లమంటూ, సంఘీ అంటూ హిందూ సంస్థలపై ద్వేషం వెళ్లగక్కారు. ఇలాంటి ట్వీట్లు పెట్టిన వారు ఆ ఆరుగురు విద్యార్థినులే. ఈ వివాదంలో అరెస్ట్ అయిన రౌఫ్‌ ‌షరీఫ్‌కు మద్దతు ఇస్తూ ఈ విద్యార్థులు ట్విటర్‌ ‌సందేశాలు ఇచ్చారు. ఈ రౌఫ్‌ ‌షరీఫ్‌ ‌ఢిల్లీ అల్లర్ల బాధ్యులలో ఒకడని తేలింది. ఆ అల్లర్లలో పాల్గొన్న వారికి డబ్బులు సమకూర్చాడనే ఆరోపణ ఉన్నది. హత్రాస్‌ ‌కేసుతోను ఇతనికి సంబంధం ఉన్నది. సంవత్సరం క్రితం యూపీ పోలీసులు అరెస్ట్ ‌చేశారు కూడా. అయితే ఈ విద్యార్థినులు వీళ్లకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనేది అంతు చిక్కని ప్రశ్న. 31 డిసెంబర్‌ ‌మస్జిద్‌ ‌మున్నా ఈ కాలేజీ క్యాంపస్‌ల నుండి హిజాబ్‌ ‌ప్రచారం ప్రారంభించాడు. యథా ప్రకారం వామపక్ష భావజాలంతో ఉండే ది వైర్‌ ‌వంటి వార్తా సంస్థలు వీరి ఇంటర్వ్యూ తీసుకుని ప్రచార మిచ్చాయి. తరువాత వామపక్ష మీడియా, రాజకీయ పక్షాలు ఆ ఉద్యమానికి ఊతమివ్వడం మొదలుపెట్టాయి. అంటే అవార్డు వాపసీ, సీఏఏ వ్యతిరేక అల్లర్లు, షాహిన్‌బాగ్‌ ఉదంతం, రైతు ఉద్యమం తరహాలోనే హిజాబ్‌ ‌రగడను ఒక మెట్టు తరువాత మరొక మెట్టుకు తీసుకు వెళ్లాయి.

వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ తిరిగి అధికారం పొందాలంటే ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలి. అందుకే ఎన్నికల పోలింగ్‌ ఆరంభం కావడానికి ఒకరోజు ముందు విద్యార్థినిలు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ ఎన్నికలు, వాటి ప్రచారం దృష్టి నుంచి దేశ మీడియాను మరల్చడమే హిజాబ్‌ అల్లరి మూకల ధ్యేయం. తద్వారా పోలింగ్‌ ‌వేళ ముస్లింలలో మనోభావాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగమే ఇదంతా. ఇంకోవైపు దేశంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం గురించి చర్చ జరుగుతున్నది. ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవలసిన విషయం ఏమిటంటే, హిజాబ్‌ ‌విషయంలోనే 2018లో తిరువనంతపురం హైకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. మతపరమైన దుస్తులు వేసుకురావడానికి అనుమతి ఇవ్వలేమని చెప్పింది.

దేశ విభజనకు తాము ప్రయత్నిస్తున్న సంగతిని ముస్లిం మతోన్మాద శక్తులు మరొకసారి వెల్లడించ డానికి హిజాబ్‌ ‌రగడను కూడా ఉపయోగించు కుంటున్నాయి. ఈ రగడకు పాక్‌ ‌గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ‌సహకారంతో నడిచే నిషేధిత సంస్థ సిఖ్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ ‌సంస్థ ఆధ్యక్షుడు గురుపత్వంత్‌ ‌సింగ్‌ ‌పన్నుతో ఉగ్రవాద శక్తులు చేతులు కలిపి ఉర్దూస్తాన్‌ ఏర్పాటుకు ఉద్యమాన్ని నడపమని, దీనికి నిధులు ఇవ్వడానికి సిద్ధమని అతడు సమాచారం చేరవేస్తు న్నారు. 21వ శతాబ్దంలోను ఆధునిక చింతన వైపుగా ప్రయాణించాల్సిన తరుణంలో మధ్యయుగపు ఛాందసవాద ఆలోచనలు అమలు చెయ్యాలని చూస్తున్నారు.

సౌదీ అరేబియా, జోర్దాన్‌ ‌వంటి ఆధునిక ముస్లిం దేశాలు ఆధునికతవైపు నడుస్తున్నాయి. భారత ముస్లిం సమాజం మాత్రం ఈ ఛాందసవాద ఆచారా లను వదులుకోవడానికి సిద్ధంగా లేదు.

ప్రముఖ తెలుగు రచయిత్రి షాజహానా – ‘‘ముసుగు తీసి చూడు’’ రచనలో ‘‘ఈ క్షణమేనా నిశ్శబ్దాన్ని మీకు బదలాయిస్తున్న, మా బురఖా దుప్పట్టాల్ని పీలికలుగా చేసి నీ మీద విసిరేస్తున్న’’ అంటూ బురఖా విధానాన్ని తప్పు పట్టారు. ఇంగ్టిష్‌ ‌రచయిత్రి/ సామాజిక ఉద్యమకర్త అయాన్హిర్సి అలి రాసిన ‘పంజరంలో కన్య’ (THE CAGED VIRGIN) పుస్తకంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు మూల కారణం సంప్రదాయం వంకతో అమలు చేస్తున్న బురఖా, సున్తి విధానాలేనని అన్నారు. ఈ ఆచారాలతో మహిళలను సజీవంగా ఎంత చిత్ర వధలకు గురిచేస్తున్నారో వందలకొద్ది ఉదాహరణ లతో తన పుస్తకంలో వివరించింది.

సినిమా దర్శకుడు JEREMY GUY 2018 సంవత్సరంలో ‘పర్దా’ అన్న డాక్యుమెంటరి తీశాడు. అందులో ‘‘2011 2011 KAIKASH MIRZSAHA అనే ముస్లిం అమ్మాయి క్రికెట్‌ ఆడాలనే కోరికతో బురఖా తీసి బయటికి వచ్చినప్పుడు ఆమెపైన మత ఛాందస శక్తులు ఎలా దాడి చేశాయో, వాటి నుండి ఆమె కుటుంబ సభ్యుల సహయంతో ఎలా బయటపడింది, తనకు ముస్లిం సమాజంలో ఎదురయ్యే ఆటంకాలను దాటుకొని ఎలా విజయం సాధించింది వంటి విషయాలను కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించాడు.

‘‘హిజాబ్‌’’ ‌వివాదం గురించి మాట్లాడుతున్న ప్రగతిశీలవాదులు, రంగు రంగుల లోకంలో జీవిస్తున్నవారు ఎవరు కూడా వారి నిజ జీవితంలో తలమీది ముసుగు ధరించి ఉండరు. ధరించి ఉండి ఉంటే ఆ తెర వెనకాల ఉన్న వేదన వారికి అర్ధమై ఉండేది. మతం వ్యక్తిగతమైనప్పుడు వాళ్ల ఆచారాలు, అలవాట్లకు ఒక హద్దు ఉంటుంది కదా? నిజంగా సామాజిక సమస్యలకు స్పందించాలనుకుంటే ముస్లిం సమాజంలో మహిళలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. వాటిపై పోరాటం చెయ్యాల్సిన అవసరం ఉన్నది. అయితే అది వాళ్ల ఉద్దేశం కానేకాదు. ముస్లింల సమస్యను ముందుకు పెట్టి మోదీ మీద, భారతీయత మీద దాడులకు దిగడమే. బుర్ఖా, హిజాబ్‌లను ముస్లిం మహిళలకు, బాలికలకు ఏ విధంగానూ అనివార్యం కాదో అనేక మంది ముస్లిం ప్రముఖులే చెబుతున్నారు. అలాంటప్పుడు పీఎఫ్‌ఐ ‌వంటి ఉగ్రవాద మత ఛాందసవాద సంస్థ ముస్లిం సమాజాన్ని మధ్య యుగాలలోకి నెట్టివేస్తుంటే ఈ ప్రగతిశీల మహిళా సమాఖ్యలు, సెక్యులర్‌ ‌సంస్థలు ఎక్కడ నిద్రపోతున్నాయి? హిజాబ్‌ను నిషేధించడం ద్వారా ముస్లిం బాలికలను సెక్యులర్‌ ‌విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతున్నదని కొందరు స్వయం ప్రకటిత మేధావులు ఇప్పటికే ప్రకటించారు. నిజానికి మాకు పరీక్షల కంటే హిజాబ్‌ ‌ధారణే ప్రధానం అని ఆ వర్గ బాలికలు చెప్పడం ఎవరు సెక్యులర్‌ ‌విద్యకు దూరమయ్యే యోచనలో ఉన్నారో చెప్పక చెబుతుంది. శబరిమలైలో మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ కోర్టుల చుట్టూ తిరిగిన వారు ఇప్పుడు ఇస్లాంలో అనివార్యం కాదు అని తేలిన తరువాత కూడా హిజాబ్‌కు వ్యతిరేకంగా ఎందుకు వారంతా పోరాడడం లేదు? హిజాబ్‌ ‌గురించి గోల పెడుతున్న వారందరి ఉద్దేశం మత రక్షణ కాదు. ముస్లిం బాలికల స్వేచ్ఛ అసలేకాదు. కేవలం హిందూ మతాన్ని ఇరుకున పెట్టడమే. హిందూ వ్యవస్థలో కల్లోలం సృష్టించడమే.

– త్రిలోక్‌, 8317531398, సామాజిక కార్యకర్త

About Author

By editor

Twitter
Instagram