వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన రచన

– అత్తలూరి విజయలక్ష్మి

నాన్నా! ఎలా ఉన్నావు? నీతో మనసు విప్పి మాట్లాడుకుని నేటికి పది సంవత్సరాలు.. ఆశ్చర్యం! కాలం ఎంత వేగంగా పరిగెత్తింది! కాలంతో పాటు నేను పరిగెత్తినట్టున్నాను. చాలా అలసటగా ఉంది.. కొంతదూరం నిదానంగా, మరికొంత దూరం వేగంగా, మరికొంత దూరం ఉత్సాహంగా, ఈ చివరి దశలో మాత్రం బరువుగా పడుతున్న అడుగులు బ్యాలన్స్ ‌తప్పుతున్నాయి. కాళ్లల్లో శక్తి నశించిపోతుంది. మనసులో దుఃఖ సముద్రాలు ఘనీభవించి మంచు పర్వతాలుగా మారి మోయలేని భారంతో కదలలేకపోతున్నాను.

జీవనదిలో ప్రవాహానికి ఎదురీదుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో దారీ, తెన్నూ తెలియక అగమ్యంగా, అయోమయంగా ప్రయాణిస్తూ ఒడ్డుకు చేరాను అనుకునేలోగా అది నాకు అనువైన స్థలం కాదని, నేనొక విచిత్రమైన ప్రదేశానికి వచ్చి చేరానని అర్థం అయింది. నా అరవై ఏళ్ల జీవితంలో నేనేనాడూ చూడని, ఊహించని పరిస్థితులు, వింత జీవులు, నాగరికతకీ, అనాగరికతకీ మధ్య ఊగిసలాడే సంధి యుగంలో ఉన్నాను. ఇక్కడ నువ్వు నేర్పిన జీవితపు విలువలు కనిపించడంలేదు. సంస్కృతి, సంప్రదాయాల చిహ్నాలను కూడా సమూలంగా తుడిచివేసి ఆధునిక జీవనశైలి విశృంఖలంగా స్వైర విహారం చేస్తోంది. ఈ ప్రభంజనంలో చిక్కుకున్న పిట్టలా వణికిపోతున్నాను.

‘‘ఏంటమ్మా ఏమైంది?’’ అని కంగారు పడుతున్నావా!

హు.. నీకే కాదు నాకు కంగారుగానే ఉంది. చూస్తూ, చూస్తూ ఉండగానే ఈ ప్రపంచం విచిత్రంగా మారిపోయింది. సింధు నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత ఆడం, ఈవ్‌లు చారిత్రాత్మక కథల్లో పాత్రలుగా మిగిలిపోయారు అనుకున్నా.. కానీ మళ్లీ కాలం వెనక్కి వెళ్తోంది.. వావి, వరసలు, క్రమశిక్షణ లేని అనాగరిక జీవన వ్యవస్థ కొత్తరూపం సంతరించుకుని వికృతంగా నృత్యం చేస్తోంది. ఆనాటి నుంచీ మనిషి ఎంతో శ్రమించి ఏర్పరచుకున్న నిర్దిష్టమైన జీవినవిధానం అంతరించిపోతుంది. నేను చూసిన ఉన్నతమైన జీవనవిధానం, ఉదాత్తమైన విలువలు తుపానులో కొట్టుకుపోయాయి. ఆ బీభత్స దృశ్యాలు నా కళ్లముందు నుంచి ఎంత ప్రయత్నించినా కనుమరుగు అవడంలేదు. అరవై ఏళ్లుగా నేను జీర్ణం చేసుకున్న క్రమశిక్షణతో కూడిన జీవనవిధానం నా కళ్లముందే పునాదులతో సహా కూలిపోతుంది. నేను ఈ వింత లోకంలో నాకు నేనే ఓ ప్రశ్నగా నిలబడి ఉన్నాను. ఆ ప్రశ్నకి సమాధానం కోసమే నీకీ లేఖ రాస్తున్నాను నాన్నా.. చెప్తావు కదూ సమాధానం.. చెప్తావు కదూ!

సభ్యతా, సంస్కారాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం అయిన అమ్మా, నువ్వు నన్ను ఎంతో గారంగా పెంచారు. సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చారు. నా ఇష్టాలకు, అభిప్రాయాలకు విలువ ఇచ్చారు. నన్ను ఆడపిల్లగా కాక మనిషిగా పెంచారు. ఎంత స్వేచ్ఛ ఇచ్చారో ఆ స్వేచ్ఛకి కొన్ని పరిమితులూ విధించారు. పరిమితులు లేని స్వేచ్ఛ విశృంఖలంగా మారుతుంది.. స్వేచ్ఛ నీ హక్కు.. విశృంఖలత నీ స్వభావం అని స్వేచ్ఛకీ, విశృంఖలత్వానికి ఉన్న తేడా ఎంతో సున్నితంగా చెప్పారు. యుద్ధ సమయంలో ఒక సైనికుడికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలో అలాంటి శిక్షణ నాకు ఇచ్చారు. నూరేళ్ల జీవితంతో పోరాడాల్సిన ప్రతి ఆడపిల్లకి, ఇంకా మాట్లాడితే ప్రతి మనిషికి ఇలాంటి శిక్షణే అవసరం. జీవితం అందరికీ ఒక పోరాటమే. కాకపోతే లక్ష్యాలు వేరు. నా లక్ష్యం నువ్వు ఏర్పరిచినదే. అడుగడుగునా అపజయాలు నా మీద పడి దాడి చేస్తున్నా, ఆత్మాభిమానం కాపాడుకుంటూనే విజయం సాధించాను అని శ్వాస తీసుకునేలోగా, అపజయం బంధం పేరుతో నా మీద ముట్టడి చేసింది ఆ బంధమే నీ మనవరాలు… నా కూతురు.

నాన్నా! తరాలు మారుతున్నా కొద్దీ ఆలోచనలలో, అభిరుచుల్లో, ఆశయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడం సహజమే కదా.. అయితే ఆ మార్పులు అభిలషణీయం, ఆమోదయోగ్యం కానప్పుడు ఏం చేయాలి. జీవితం కబంధ హస్తాలతో నా గొంతు నులుముతోంది. ప్రాణం పోవడంలేదు. ఊపిరి అందడం లేదు. శక్తి వంచన లేకుండా పెనుగులాడుతున్నా కానీ బయటపడలేకపోతున్నా. ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎన్నో నీకు చెప్పుకోవాలని, నీ ఒడిలో సాంత్వన పొందాలని అనిపిస్తోంది. నువ్వు, అమ్మ ఎక్కడ ఉన్నారో అక్కడికి వచ్చేయాలని ఉంది నాన్నా. నాకు బతకాలని లేదు.. ఇంకా బతికి ఉంటే ఈ కళ్లతో ఏమి చూడాలో అని భయంగా ఉంది. విశాలమైన మైదానంలో ఓ నదీ తీరంలో అవతలి ఒడ్డున ఉన్న పూతోట సౌందర్యాన్ని చూస్తూ మైమరచిపోయిన నా కళ్లముందు ఆ తోట అదృశ్యం అయి, పూతీగేలన్నీ నరాలుగా, కొమ్మలన్నీ ఎముకలుగా, వాటి చివర పూలకు బదులు వ్రేలాడే తలలు, మొండాలతో భయంకరంగా కనిపిస్తోంది ఈ ప్రపంచం. చదువు, నాగరికత వివేకాన్ని నేర్పిస్తాయి అనుకున్నాను. నేటి సమాజం ఇంత వికృతంగా, విచ్చలవిడిగా ఉంటుందని నేనే ఊహించలేదు.

తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుంది అంటే ఏమిటో అనుకున్నాను. అసమానత నుంచి సమానత వైపు ప్రయాణిస్తూ, గ్లోబ్లో తమవంతు భాగాన్ని ఆక్రమించుకుని ప్రపంచాన్ని ఏలే సామర్ధ్యం సంపాదించుకుని, వారి హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఆనందంగా అనుభవిస్తూ.. ఆకాశంలో సగం మాది అని రెండు చేతులతో మబ్బులని కౌగిలించుకుని నిశ్చితంగా జీవిస్తున్న అమ్మాయిల ఆలోచనా ధోరణిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. కుటుంబం, సమాజం విధించిన ఆంక్షలు దాటి విశాలవిశ్వంలో తమ స్థానాన్ని తెలుసుకున్నారు. అక్షరాస్యత సాధించారు. అన్నిటా తామై వెలుగులు వెదజల్లారు. దేశాన్ని ప్రగతివైపు నడిపించడంలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించారు. కానీ ఆశ్చర్యం.. జీవితానికి అసలైన నిర్వచనం తెలుసుకోలేకపోతున్నారు. సహజమైన, సుందరమైన రూపాలు వదిలేసి విచిత్ర వేషధారణలతో మేము ఆధునికులం అని చాటుకుంటున్నారు.

ఒకప్పుడు ప్రపంచం అనే డెస్క్‌టాప్‌ ‌మీద దేదీప్యమానంగా వెలిగిపోయిన ఒక ఐకాన్‌ ‌భారత స్త్రీ. కానీ ఇప్పుడు ఆమె ఆలోచనల్లో, అభిరుచుల్లో, జీవన విధానంలో, వేషధారణలో వచ్చిన మార్పులు చూసి ప్రపంచమే విస్తుబోతుంది. నీ నుంచి ఎదుటివారు నేర్చుకోవాలి అనుకునేలా నువ్వు ఎదుగు.. నువ్వు ఎదుటివారిని చూసి మారకు అని నువ్వు చెప్పిన మాటలు వినిపిస్తున్నాయి. విదేశీ సంస్కృతి, విదేశీ ఫ్యాషన్స్, ‌విదేశీ జీవనవిధానం అలవరచుకుని పుట్టి, పెరిగిన దేశంలోనే అపరిచితులుగా బతుకుతున్న లక్షలాది అమ్మాయిల్లో నా కూతురు, నీ మనవరాలు కూడా భాగస్వామి కావడమే నేటి నా ఈ ఆవేదనకీ, ఆక్రోశానికి కారణం.

అలా ఎలా జరిగింది, నువ్వు సరిగా పెంచలేదా!? అని నన్ను సంశయిస్తున్నావా నాన్నా! నేను బాగానే పెంచాను. నిజం.. నన్ను నమ్ము.. ఆనాడు నువ్వు నాకు నేర్పిన విలువలు, క్రమశిక్షణ అన్నీ నేర్పాను.. ఒక వయసు వచ్చేవరకు బాగానే ఉంది. నా కోరిక ప్రకారం ఇంజనీరు అయింది.. అంతవరకూ బాగానే ఉంది. హఠాత్తుగా ఏవో దుష్టశక్తులు మూకుమ్మడిగా దాడి చేసినట్టు వింతగా మారిపోయింది. నేను చెప్పిన కథలు నాకే కొత్త భాష్యాలతో చెబుతోంది. తండ్రి మాట విని వనవాసం చేసిన రాముడి కథ కన్నా, తండ్రిని ఎదిరించి, నేను చేయని తప్పుకి నాకెందుకు శిక్ష వేస్తున్నారు అని లాజికల్‌గా వాదించి ఎదిరించే రాముడి కథ కావాలిట. సీతకి గీత గీసి పరిధి నిర్దేశించడానికి లక్ష్మణుడు ఎవరు? కట్టుకున్న భార్యకన్నా అన్నగారి మాటే వేదం అన్న లక్ష్మణుడి కోసం ఊర్మిళలా ఎదురుచూసే ఆడపిల్లలు ఈ కాలంలో లేరు.. ఉండరు.. అని ఇంకా చాలా, చాలా… అవన్నీ చెప్పి నిన్ను బాధపెట్టే సాహసం నేను చేయలేను. మొత్తానికి నేను చెప్పిన కథల్లో లాజిక్‌ ‌లేదుట. తమాషా నాన్నా… నా కథల్లో లాజిక్‌ అలా ఉంచితే తను ఇప్పుడు ఎన్నుకున్న జీవనవిధానంలో ఉన్న లాజిక్‌ ఏమిటో నాకు బోధపడడం లేదు.

చదువు అయిపోయింది. ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది, పెళ్లి సంబంధాలు చూస్తాను అన్నాను. అంతే! నా మీద పిడుగులా పడింది. నిశ్చేష్టురాలిని అయ్యాను. పెళ్లి ఒక పవిత్రమైన బంధం కాదుట. సప్తపది అనేది ఆడదాని స్వేచ్ఛను హరించే బడబాగ్నిట. తాళి మెడను చుట్టుకుని సమయం చూసి కాటేసే కాలనాగుటు. నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆ మాటలు వింటుంటే కళ్లముందు పెద్ద, పెద్ద కొండచరియలు విస్ఫోటనాలు.. నా విశ్వాసాలు, నా సిద్ధాంతాలు, నేను నిర్మించుకున్న జీవితం విషం చిమ్ముతున్న వేల, వేల నాగుపాములై మెలికలు తిరుగుతూ కాటేయడానికి వస్తున్నట్టు అనిపించింది. ఇదెక్కడి లాజిక్‌? ‌సమాధానం చెప్పలేని అశక్తత నన్నావరించింది. నాకు నేనే అపరాధిలా అనిపించాను. అవును మరి అపరాధినే!

ఒకే ఒక్క కూతురని, అల్లారుముద్దుగా పెంచుకున్నాను. తను అడిగింది ఏదీ ఏనాడు కాదనలేదు. నియమితులు విధించలేదు. సంపూర్ణమైన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ఇచ్చాను.. అచ్చు నువ్వు నన్ను పెంచినట్టే పెంచాను.. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం సంతరించుకోవాలంటే ఎలా బతకాలో నువ్వు చెప్పిన మాటలన్నీ గుడి గంటల్లా నా చెవుల్లో ఇంకా మోగుతూనే ఉన్నాయి. నీకు తెలుసుగా నాన్నా నేనెలా ఎదిగానో.. నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా! ఎన్నో విషయాల్లో నా మీద నాకు నమ్మకం లేక నిరాశ పడుతోంటే, ఎంతో నమ్మకంతో నువ్వు ఇచ్చిన ప్రోత్సాహం నాలో ఉత్తేజాన్ని కలిగిస్తుంటే ఇక్కడిదాకా నడిచి వచ్చాను.

పెళ్లి విషయంలో కూడా పూర్తిగా నా ఇష్టానికి నువ్వు వదిలేసినా ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకుంటానో అనే భయంతో మీ ఇద్దరికే వదిలేసాను. నువ్వు చూపించిన అతనితో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచి, అత్తగారింటికి వెళ్లాను. ఒక మంచి కోడలిగా, మంచి భార్యగా నా బాధ్యతలు నిజాయితీగా, సక్రమంగా నిర్వర్తించాను.

నాన్నా! నీకు తెలియకుండా దాచుకున్న రహస్యం ఒకే ఒక్కటి.. అదే కత్తులబోను లాంటి నా సంసారం గురించిన రహస్యం.. నీ కోసం.. కేవలం నీ కోసం, విఫలం అయిన నా వైవాహిక జీవితం చూసి నువ్వు కుమిలిపోతావని.. నువ్వు జీవించి ఉన్నంతకాలం నా సంసారం గురించి నీకు తెలియకుండా దాచాను. నా భర్త నువ్వు చూసిన ఉదాత్తుడు కాదు. నరకయాతన పెట్డాడు.. కొంతవరకూ భరించాను.. ఎదుగుతున్న నా కూతురు ముందు నన్ను అవమానిస్తుంటే, మాటలతో కుళ్లబొడుస్తుంటే, ఆ అవమానం నాకు జరుగుతున్నట్టు కాదు.. నా కూతురుకి జరుగుతున్నట్టు భావించాను. గుప్పెడు మెతుకుల కోసం మా అమ్మ ఎంత దిగజారి బతుకుతోంది అని నా కూతురు అనుకోకూడదని, స్త్రీకి ఆత్మాభిమానానికి మించిన ఆభరణం ఇంకోటి లేదని తనకి తెలియజేయాలని ఆయన నుంచి విడిపోయాను. చేతిలో పైసా లేదు.. నిలవడానికి నీడ లేదు.. ఒక ఉపాధి లేదు.. ఉన్నది ఒకటే.. ధైర్యం.. అదే నన్ను నిలబెట్టింది.. కానీ నాన్నా! నేను దేనికోసం ఆయన నుంచి విడిపోయానో ఆ ఉద్దేశం నెరవేరడంలో నేను పరాజయం పాలయ్యాను..

నాన్నా! నువ్వు నన్ను పెంచినట్టే నేను నా కూతురిని పెంచాను. కానీ అదేంటో ఒక వయసు వరకూ బాగానే ఉందో లేక నా గుడ్డి ప్రేమకి తన ఆలోచనా విధానంలో ఏర్పడుతున్న వింత పోకడలు కనిపించలేదో..

ఒక దురదృష్టకరమైన స్థితిలో తనని చూసాను.. నా కాళ్లకింద భూమి అనేక భాగాలుగా చీలిపోతున్నట్టు, నా శరీరంలోని ఒక్కో భాగం ఒక్కో చీలికలో కూరుకుపోతున్నట్టు అనిపించింది. ఇదేమిటి అన్న నా ప్రశ్నకి తప్పేంటి? అన్న మరో ప్రశ్న వచ్చింది.

ఏమని చెప్పను! నేను తప్పు అన్న ప్రతి మాటకీ తను చెప్పే నిర్వచనాలు వింటూ ఉంటే నేను నమ్ముకున్న సంప్రదాయాలు, విలువలు కార్చిచ్చులా మారి నన్నే దహించి వేస్తున్న భావన.

అర్ధరాత్రి పన్నెండు గంటలకి పరాయి మగవాడు ఫోన్‌ ‌చేస్తే వాడిని కలుసుకోవడం తప్పు కాదుట.. అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్‌లో గంటలు, గంటలు చాటింగ్‌లు చేయడం, విచ్చలవిడిగా తిరగడం, బార్లకు వెళ్లడం తప్పు కాదు. సంఘం నిన్ను వెలేస్తుంది అంటే సంఘం ఎవరు నన్ను వెలేయడానికి అంది.. నీకు గౌరవం ఇవ్వదు అంటే.. తనిచ్చేదేంటి.. నేనే ఇవ్వను ఆ సంఘానికి గౌరవం అంది.. ఒళ్లు కనిపించేలా డ్రెస్‌లు వేసుకోవడం తన హక్కుట.. నా డ్రెస్‌ల విషయం మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అని నొక్కి చెప్పింది. భగవంతుడు ఇచ్చిన అపురూపమైన అందాన్ని బహిర్గతం చేస్తూ తీసుకున్న సెల్ఫీలు సోషల్‌ ‌మీడియాలో ప్రదర్శనకి పెడుతుంది. నాన్నా! ఒక అమ్మాయి మగవాడితో అవసరం ఉన్నా లేకపోయినా కల్పించుకుని గంటలు, గంటలు మాట్లాడడం, వాడిచుట్టూ తిరగడం, తనని తాను దిగజార్చుకోవడం అని నువ్వు నాకు చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోలేదు నేను.. స్నేహానికి ఆడా, మగా తేడా లేదు అంది.. బిసి నాటి మాటలు, ఆలోచనలు మానేయి… మారు.. నువ్వు కూడా కొంచెం అప్‌డేట్‌ అవు అంది.. అంటే! అప్‌డేట్‌ అం‌టే ఏమిటో నాకు అర్థం కాలేదు.

అన్నిటికన్నా భయంకరమైన విషయం నీకు చెప్పాల్సి రావడం నా దురదృష్టం.. తను పెళ్లి చేసుకోదుట.. పెళ్లి, తాళి ఇవన్నీ తన స్వేచ్ఛని హరించే బంధనాలుట. పెళ్లి చేసుకుని ఒక కుటుంబాన్ని భరించే ఓపిక లేదు నాకు.. నాకు నచ్చిన వాడితో నచ్చినంతకాలం కలిసి బతుకుతా అంటూ పెళ్లి చేసుకోకుండా కలిసి బతకడం మొదలుపెట్టింది.. బలవంతంగా నా మనసుకి సర్దిచెప్పుకుని నా మానాన నేను బతకడం మొదలుపెట్టాను. దౌర్భాగ్యం.. ఏడాదికే అతనితో తెగతెంపులు.. కారణం అడిగితే చెప్పలేదు.. మరొకరితో సహవాసం ప్రారంభించింది. తన పద్ధతి నచ్చని నేను తనకి దూరంగా ఉండడం మొదలుపెట్టాను. కానీ, ఎంతదూరం పారిపోయినా ఈ బంధం నా వెంటే వస్తుంది కదా! తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు నీ కూతురు పెళ్లి కాకుండా సహజీవనం చేస్తుందిట కదా అని ప్రశ్నిస్తుంటే ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నాకు ఏమాత్రం అవగాహన లేని సహజీవనం గురించి నేనేం చెప్పగలను! దాని జీవితం దానిష్టం అంటూ తప్పించుకోవాలని చూసాను. కానీ మరో పిడుగు.. అది పిడుగు కాదు.. నిప్పుల వాన.. రెండోసారి దానికి ఆ జీవితం నచ్చలేదు… మరో జీవనవిధానం ఎన్నుకుంది.

స్వలింగ సంపర్కమట… మగవాడు తనమీద పెత్తనం చేస్తున్నాట్ట… ఆధిపత్యం చేలాయిస్తున్నాడుట. తనని శాసిస్తున్నాడుట. అందుకే మరో అమ్మాయితో కలిసి బతుకుతున్నది అని తెలిసింది. మిన్ను విరిగి మీద పడడం అంటే ఏమిటో తెలిసింది. నా కూతురుని నా కూతురు కాదు అని చెప్పలేను. చెప్పినా లోకం నమ్మదు కదా! ఒళ్లు తెలియని ఆవేశంతో వెళ్లి చెంప చెళ్లుమనిపించాను. పాదాలు నేల మీద ఆనించి నడుస్తావా… తల కిందికి పాదాలు పైకి పెట్టి నడుస్తావా! ప్రకృతి విరుద్ధంగా బతకడం ఏమిటి? నీది ఒక బతుకా? అని చెడా మడా తిట్టాను. నాకు తను చేసిన సత్కారం చెప్పనా! నా జీవనశైలి నచ్చకపోతే నా దగ్గరకు రాకు.. నీకు కూతురు లేదు అని చెప్పు… నాకు అమ్మ లేదు అని నేను చెబుతా అని తనే ఆ విషమ సమస్యకి మంచి పరిష్కారం చెప్పింది.

పసిపిల్ల దగ్గర నుంచీ నా కంటి రెప్పలా చూసుకున్నాను. మలమూత్రాలు తీశాను, నా గుండెలమీద నడిపించాను. పెద్దమనిషి అయినప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయంగా చూస్తూ ఉంటే మైల బట్టలు కూడా ఉతికాను. నేనెప్పుడు అసహ్యించుకోలేదు, అపురూపంగానే చేసాను. ఇవన్నీ నువ్వేనా చేసేది ప్రతి తల్లి చేసేవే అన్నది. పెద్ద ఏదో త్యాగం చేసినట్టు ఫీల్‌ అవుతావేంటి అంది.. సమాధానం ఏమని చెప్పను!

నాన్నా! ఇంక తనకి నా అవసరం లేదు.. నాకు అవసరం అయిన అమ్మ, నువ్వు లేరు.. ఇంకా నేనెవరికోసం బతకాలి అని శూన్యం వైపు సాగిపోతుంటే మినుకు, మినుకు మంటూ వెలిగిందో గమ్యం.

విశాలమైన పాఠశాల ప్రాంగణంలో రేకులు విప్పుకుంటున్న లేలేత మొగ్గలు నా వైపు చూసి చేతులు ఊపుతున్నారు..

రేపటి ఉషోదయంలో విచ్చుకునే ఆ నవకుసుమాల పరిమళాలు జగత్తు అంతా నిండిపోయి, నువ్వు, నేను, మనలాంటి మరికొందరు ఆశించే మరో ప్రపంచ ద్వారాలు తెరుచుకుంటాయన్న ఆశతో రేపటి వైపు ఎగిరిపోవడానికి రెక్కలు సవరించుకుంటున్న ఆ చిన్నారులకి దిశా నిర్దేశం చేయడానికి అటువైపు వెళ్తున్నాను.. నన్ను దీవించు నాన్నా..

నీ కూతురు

About Author

By editor

Twitter
Instagram