– విద్యారణ్య కామ్లేకర్‌

‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సంస్థాపక్‌ ‌ప.పూ. శ్రీ డా. హెడ్గేవార్జీ కే వంశ్‌ ‌కా తీర్థ్‌స్థాన్‌ ‌కందకుర్తి’ (హిందీ) యాదవరావు కందకుర్తీకర్‌

(‌రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌నిర్మాత డా. హెడ్గేవార్జీ వంశీకుల పుణ్యక్షేత్రం కందకుర్తి) – ఒక పరిచయం

మానవజాతిని కలిపి ఉంచేది ఏదనే ప్రశ్న ఎదురయినప్పుడు ‘ఆత్మతత్త్వ’మని నిస్సంకోచంగా చెప్పండని మన పెద్దలు అన్నమాట మరువరాదు. ఆ మాటకొస్తే మన సమాజం ఒక పూలహారం. రకరకాల పరిమళాల, ఎన్నెన్నో వర్ణాల పూలని దారంతో గుదిగుచ్చిన హారం వంటిదే మన హిందూ సమాజం.

హిందుత్వం అంతఃస్సూత్రంగా మనమంతా ఈ పవిత్రభూమి మీద జీవనం సాగిస్తున్నాం. ఉపాసనా పద్ధతులలో మార్పులు ఉన్నప్పటికీ మన పూర్వీకులు / వంశీకులు మారిపోరు కదా! పూర్వీకులు/వంశీకులు నడయాడిన నేల పుణ్యధామమని చెప్పేది అందుకే. నిజామాబాద్‌ ‌జిల్లా, కందకుర్తి అలాంటి ఒక దర్శనీయ స్థలం. హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు, భారతీయతను నలుదెసలా చాటేందుకు, ప్రతి వారిలో దేశభక్తి బీజాలు నాటేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ను స్థాపించిన పరమ పూజనీయ డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బలిరామ్‌ ‌హెడ్గేవార్‌ ‌పూర్వీకుల స్వస్థలం తెలుగునేల మీది ఈ కందకుర్తి. కొన్ని దశాబ్దాల క్రితమే ఆ వంశీకులు మహారాష్ట్ర వలసవెళ్లారు. డాక్టర్జీ అక్కడే జన్మించారు. తెలుగు ప్రాంతాల నుండి మహారాష్ట్ర వెళ్లిన స్వయంసేవకు లను డాక్టర్జీ కందకుర్తి గురించి అడిగేవారట. ‘హెడ్గేవార్‌’, ‘‌హెగ్డేవార్‌’ (ఇం‌టి పేర్లు) రెండూ ఒకటే. ‘హెడ్గే’ అపభ్రంశమే ‘హెగ్డే’. ఇక ‘వార్‌’, ‌తెలుగుపదం ‘వారు’కు రూపాంతరం. ఆద్య సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్జీ పూర్వీకులే కాదు, ద్వితీయ సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌గురూజీ పూర్వీకులూ తెలుగువారే (కరీంనగర్‌ ‌జిల్లా మంథని ప్రాంతం). వీరి పూర్వీకులు వేర్వేరు సమయాల్లో మహారాష్ట్రలోని నాగపూర్‌కు వలసపోయి స్థిరపడ్డారు.

 ఇలాటి ఆసక్తికరమైన విషయాలు, కొన్ని చారిత్రకాంశాలు యాదవరావు కందకుర్తీకర్‌ ‌రచన ‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సంస్థాపక్‌ ‌పూజనీయ శ్రీ డాక్టర్‌ ‌హెడ్గేవార్జీ కె వంశ్‌ ‌కా తీర్థస్థాన్‌ ‌కంద కుర్తి’లో కనబడతాయి. శ్రీ కేశవ సేవాసమితి (రి) విద్యాలయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న యాదవ రావు జ్యేష్ఠ స్వయంసేవకులు, వయసు 85 ఏళ్లు.

నారాయణ హరి పాల్కర్‌ ‌మరాఠీలో రాసిన డాక్టర్జీ జీవితచరిత్ర కోసం కందకుర్తి వాస్తవ్యులు యాదవరావే ఆధారాలను, వివరాలని అందజేశారు. పాల్కర్‌ ‌పుస్తకానికి గురూజీ పీఠిక అందించిన సంగతి తెలిసిందే. తన గ్రంథం గురించి పాల్కర్‌ ఇతిహాస సంకలన సమితి పెద్దలు శ్రీరామ్‌ ‌సాఠేజీని సంప్రదించారు. వారు యాదవరావు పేరు చెప్పడమే కాదు, పాల్కర్‌ను కందుకుర్తి తీసుకువచ్చి యాదవ రావుకు పరిచయం చేశారట. యాదవరావు సుమారు రెండు మూడేళ్లు కందకుర్తి ప్రాంతానికి చెందిన పలువురు వయోవృద్ధులని కలసి హెడ్గేవార్‌ ‌వంశీకులు, వారు మహారాష్ట్రకు ఎప్పుడు, ఎందుకు వలసపోయారన్న వివరాలన్నిటినీ సేకరించి 30-40 పేజీల సమాచారం పాల్కర్‌కు పంపారు. కానీ పాల్కర్‌ ‌కేవలం యాదవరావు పంపిన వివరాల సారాంశాన్ని మాత్రమే ఉపయోగించుకున్నారట. ఆ తర్వాత హెడ్గేవార్‌ ‌ప్రత్యేక సంచికను వెలువరించినా, ఇంకొంత సారాంశాన్ని మాత్రమే స్వీకరించారు. అలా యాదవరావు సేకరించిన సమాచారం దాదాపు అముద్రితంగానే ఉంది. ఈ విషయాలను గ్రంథకర్త పుస్తకంలో పేర్కొన్నారు. ఇంకా కందకుర్తిలో కేశవ స్మృతి మందిరం నిర్మించాలని యాదవరావు సహా జిల్లా స్వయంసేవకులు గురూజీకి విజ్ఞప్తి చేయడం, నాటి అఖిల భారతీయ బౌద్ధిక్‌ ‌ప్రముఖ్‌ ‌మా. మోరోపంత్‌ ‌పింగళేకు గురూజీ ఆ బాధ్యత అప్పగించిన సంగతి యాదవరావు గుర్తు చేశారు.

అరవై పేజీల ఈ పుస్తకాన్ని రచయిత రెండు భాగాలుగా విభజించారు. మొదటిభాగంలో ‘కందకుర్తి త్రివేణీ సంగమ స్థల మహత్యం’, రెండవభాగంలో డా. కేశవరావ్‌ ‌హెడ్గేవార్‌ ‌వంశీకుల/ పూర్వీకుల వివరాలు, కేశవ స్మృతి మందిర నిర్మాణం, కందకుర్తిని దర్శించిన ప్రముఖుల వివరాలు, హెడ్గేవార్‌ ‌వంశవృక్షం, సంక్షిప్తంగా డాక్టర్జీ జీవిత పరిచయం, ఇతర అంశాలు పొందుపరిచారు. మహారాష్ట్రలో పుట్టిన గోదావరి తెలుగునాట మొదటిగా కందకుర్తిలోనే ప్రవేశిస్తుంది. హరిద్రా, మంజీరా నదులు ఇక్కడే గోదావరితో సంగమించడం వల్ల త్రివేణీ సంగమ స్థానమంటారు. కందకుర్తి గ్రామస్థాపనకు పూర్వం స్కందభక్తుడు భాస్కరరాయలు ఇక్కడ స్కంద దేవాలయాన్ని నిర్మించాడని ప్రతీతి. స్కంద ‘కంద’గా, కన్నడ పదం కుడితి ‘కుర్తి’గా ప్రచలితమై కందకుర్తిగా మారింది. ఈ వివరాలతో పాటు, ఇక్కడి పురాతన దేవాలయాల వివరాలనూ రచయిత మొదటిభాగంలో అందించారు.

ఇక రెండవ భాగం -ఆ రోజుల్లో కందకుర్తిలోని పలువురు బ్రాహ్మణులు వేద పండితులు! వారంతా హెడ్గేవార్‌ ‌వంశీకులు. అక్కడో వేద పాఠశాల ఉండేది. వేదాధ్యయనమే వారి జీవిక. వీరినే వేదశాస్త్రులనీ, దీక్షితులనీ పిలిచేవారు. యజ్ఞ యాగాదులు నిర్వహణకు హెడ్గేవార్‌ ‌వంశస్థులకు దూరదూరాల్నించి పిలుపులు వచ్చేవి. అలా రాజు నుండి ఆహ్వానమందటంతో కందకుర్తికే చెందిన శ్రీధర్‌ ‌మహారాజ్‌ ‌మరి కొందరు వేదపండితులను వెంటబెట్టుకొని నాగపూర్‌ ‌వెళ్లారు. వారిలో హెడ్గేవార్‌ ‌వంశస్థుడు నరహరిశాస్త్రి సహా సంగంకర్‌ ‌వంశస్థులు కూడా ఉన్నారు. నాగపూర్‌లోని శక్కర్‌నగర్‌లో 1-11 జూన్‌ 1817‌లో భాగవత సప్తాహం జరిగింది. దీనికి స్వయంగా రాజుగారే హాజరయి పండితుల్ని ఘనంగా సత్కరించి గజారోహణం కూడా చేయించారు. కందకుర్తి రామాలయంలో పూజారి బాధ్యతల వల్ల శ్రీధర్‌ ‌మహారాజ్‌ ‌తిరిగి వచ్చేశారు. అయితే హెడ్గేవార్‌, ‌సంగంకర్‌ ‌వంశస్థులు నాగపూర్‌ ‌లోనే స్థిరపడ్డారు. నరహరిశాస్త్రి డాక్టర్జీకి స్వయానా ముత్తాత. హెడ్గేవార్‌ ‌వంశస్థులు నాగపూర్‌లో స్థిరపడినా ఈ ప్రాంతానికి వస్తూపోతూ ఉండేవారు. తమ కులదైవం ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకొని వెళ్లేవారు. డాక్టర్జీ పెద్దన్నయ్య సీతారామశాస్త్రి రెండుసార్లు వచ్చి వెళ్లారు. కందకుర్తిలో కొలువైన కేశవరాజ్‌ ‌పేరే తల్లిదండ్రులు కేశవరావ్‌ అని డాక్టర్జీకి పెట్టుకున్నారు. ఈ గ్రామంలో నివసించిన చివరి హెడ్గేవార్‌ ‌వంశస్థుడు త్రయంబక్‌ ‌భట్‌. ఈయన 1930లో ప్లేగు సోకి మరణించాడు. ఇక కందకుర్తిలో ఆ వంశస్థులెవరూ మిగలలేదు. ఆ వంశస్థులు ప్రస్తుతం నిజామాబాద్‌లో కొందరు ఉన్నారు. కందకుర్తి ఇంటిని స్థానికుడైన గోవిందరావ్‌ ‌దుడ్డువార్‌కు అప్పగించి వారు నిజామాబాద్‌ ‌వెళ్లిపోయారు. 1980లో వారు, శ్రీరామశాస్త్రి హెడ్గేవార్‌ ‌కోరిక మేరకు ఆ ఇంటిని సంఘ్‌కు సమర్పించారు. ఈ వ్యవహారంలో మోరోపంత్‌ ‌సంధానకర్తగా వ్యవహరించారు.

హెడ్గేవార్‌ ‌వంశీకుల ఇలవేల్పులు వెంకటేశ్వర స్వామి, కేశవరాజస్వామి, ధర్మపురి నరసింహస్వామి. వారు రుగ్వేద సకల శాఖీయ మహారాష్ట్రీయ బ్రాహ్మణ వేదపండితులు. కాశ్యప గోత్రీక•లు. తెలుగు -మహారాష్ట్ర సరిహద్దులో ఉండేవారి ఇంటి పేర్లు చాలావరకు తెలుగింటిపేర్లకు దగ్గరగా ఉంటాయి. కన్నమ్మవార్‌, ‌మునగంటివార్‌, ‌దొడ్డువార్‌, ‌యెలకూచివార్‌, ‌హెడ్గేవార్‌ ఇలాంటివే.

మళ్లీ విషయానికొస్తే నాగపూర్‌లో స్థిరపడ్డ నరహరిశాస్త్రికి ఒక కుమారుడు, మహాదేవశాస్త్రి. ఈయన కుమారులు పండిత బలీరామ్‌ ‌పంత్‌, ‌రామచంద్ర. బలీరామ్‌ ‌పంత్‌కు ముగ్గురు కుమారులు – మాధవ్‌, ‌సీతారామశాస్త్రి, మన కథా నాయకుడు కేశవరావ్‌. ఇం‌కా ముగ్గురు కుమార్తెలు – సరయు, రాజు, రంగు. ముగ్గురు కుమార్తెలకు బలీరామ్‌ ‌నాగపూర్‌ ‌సంబంధాలే చేశారు. మాధవ్‌ ‌ప్లేగుతో చనిపోగా, తల్లిదండ్రులు ఒకే సమయంలో మరణించారు. ఈ కారణంగా సీతారామ శాస్త్రి దంపతులే డాక్టర్జీని పెంచారు. దేశం కోసం, ధర్మం కోసం చివరిదాకా శ్రమిస్తూ జాతిని జాగృత పరచేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌స్థాపించారు డాక్టర్జీ. సీతారామశాస్త్రి దంపతులకు ఏకైక పుత్రిక వేణుతాయి. ఆమెని నానా సాహెబ్‌ ‌దేశకర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కేశవరావ్‌, ‌మాధవ్‌. ‌కేశవ స్మృతి మందిర భవన ప్రారంభ కార్యక్రమానికి మోరోపంత్‌తో కలిసి వేణుతాయి, నానా సాహెబ్‌ ‌దేశకర్‌ ‌కందకుర్తి వచ్చారు. మరోసారి వేణుతాయి కుమారుడు మాధవ్‌తో వచ్చి కేశవ స్మృతి మందిరంలో ప్రతిష్ఠించిన కేశవరాజస్వామిని పూజించారు. అనంతరం ధర్మపురి వెళ్లి నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. వర్తమాన సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌డా. మోహన్‌జీ భాగవత్‌ ‌సహా మాజీ ఉప ప్రధాని లాల్‌ ‌కృష్ణ ఆద్వాణీ, మాజీ సర్‌ ‌సంఘ్‌చాలక్‌లు బాలాసాహెబ్‌ ‌దేవరస్‌, ‌ప్రొ. రాజేంద్రసింగ్‌ (‌రజ్జు భయ్యా), ఇతర పెద్దలు శ్రీకాంత్‌ ‌జోషి, యాదవ్‌రావ్‌ ‌జోషి, కెత్కర్‌జీ, హల్దేకర్‌జీ తదితరులు కందకుర్తిని దర్శించుకున్నారు. నేటికీ పలువురు ప్రముఖులు, స్వయంసేవకులు దర్శిస్తూనే ఉన్నారు.

డాక్టర్జీ జీవితం ఆధారంగా ఒక చలనచిత్రం నిర్మింప చేయాలని మోరోపంత్‌ 1989‌లో డాక్టర్జీ స్వర్ణ జయంతి సందర్భంగా కందకుర్తి నుంచే శ్రీకారం చుట్టారు. రెండు గంటల వ్యవధితో రూపొందించారు కూడా. ఐతే సాంకేతిక సమస్యలతో ప్రయత్నం విఫలమైంది. ఈ సినిమాలో కందకుర్తికి చెందిన రేణుకా దాస్‌ ‌డాక్టర్జీగా నటించారు. మోరోపంత్‌ ‌సంకల్పాన్ని నెరవేర్చేందుకు స్వయంసేవకులెవరయినా నడుం బిగిస్తే బావుంటుంది. మరెన్నో విషయాలతో కూడిన ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి. అయితే ఇంత విలువైన పుస్తకంలో ముద్రారాక్షసాలనీ, పునరుక్తులనూ మలి ముద్రణలో నివారించాలి. తెలుగులోకి అనువదించి తెలుగు వాళ్లకి కూడా చదివే అవకాశం కల్పించాలి కూడా.

శ్రీ ‌డా. హెడ్గేవార్‌జీ కె వంశ్‌కా తీర్థ్‌స్థాన్‌ ‌కందకుర్తి

రచయిత: యాదవరావు కందకుర్తీకర్‌

‌ప్రచురణ: పతంజలి యోగపీఠ్‌,

‌హరిద్వార్‌ ‌సౌజన్యంతో

సెల్‌: 9640411849

‌పేజీలు: 68; వెల: రూ.99/-

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram