– డా॥ చింతకింది శ్రీనివాసరావు

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

‘ఏం మనిషో ఈ మనిషి! నజ్జు నజ్జు. జడ్డి జడ్డి. చెబితే వినడు. కొడితే ఏడుస్తాడు అన్నట్టున్నాడు. మంచివాడంటే అదికాదు. చెడ్డవాడంటే అదీకాదు.’ అనుకుంటూ చేతులు జోడిరచి వెంకటేశుడికి వందనాలు అర్పించింది.

అందుకోసమే ఎదురుచూస్తున్నట్టుగా ఆ ప్రభువు వెనువెంటనే నరమామిళ్ల దడి దాటేశాడు. దూరంగా వేచి ఉన్న మందీమార్బలంతో కోటకి చేరిపోయాడు. రాజు తన దృష్టినుంచి మరలిపోగానే నెమలిజాణ తోనూ, మిగిలిన దాసికాజనంతోనూ కలిసి నిజ మందిరం వైపు వెడలిపోయింది రాణీదేవమ్మ.

*       *       *

రేగువలస వారపుసంత ఆనాటి ఎడగీత వేళకే బాగా కూడుకుని ఉంది. సూర్యుడు నెత్తిన తాండవం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రతాపం చూపించలేక పోతున్నాడు. ‘కాకులు దూరని కారడవులు.. నిశాచర జంతుగిద్దులు చేరలేని గెద్ద వేనాలు..’ అంటారే అలాంటి ప్రదేశానికి చెందినది ఈ వలస. సూర్యకాంతి పెద్దగా చొరబడని ప్రాంతం. కాబట్టే కాయలైనా పండ్లయినా బాగా సమయం తీసుకుంటేనే గానీ ఎదగవు. తీసుకుని తీసుకుని కాస్తాయి. పూసుకుని పూసుకుని పండుతాయి.

సోమవారం జరిగే రేగువలస సంత పెద్దసంత గానే పేరుపడిరది. కొండఫలమంతా ఇక్కడికి తామర తంపరగా అమ్మకానికి వస్తుంటుంది. తేనె, కుంకుళ్లు, షీకాయ, పసుపు, పిప్పలి, అల్లం, మావిళ్లు, గుమ్మళ్లు, చింతపండు, కరక్కాయలు ఒక్కటి కాదు. సమస్త గిరిబాపతు సరుకూ విక్రయానికి ఉంటుంది. అరికెలు, సామలు, ఊదలు, చోళ్లు ఇంకా అనేకానేక నిత్యావసరాలన్నీ పోగుపడి కనిపిస్తాయి. జనం ఇష్టంగా తినే ఈతమొవ్వు, అందులో పెరిగే తెల్లతెల్లని రుచిజీవులూ అమ్మకానికి దొరుకుతాయి. ఈ జీవులు తినడానికే కాదు. వీటిని మంటమీది పెంకపైన పేలిస్తే వచ్చే నూనె కీళ్లనొప్పులను చిటికెలో తగ్గిస్తుంది. నెత్తిబరువులతో దూరాభారాలు కొండ లెక్కుతూ దిగుతూ వచ్చే వనవాసులకు ఈ నూనె తీపులు తీర్చుకునేందుకు అత్యవసరం.

ఈ సంతలో మరో ప్రత్యేకత షీకాయ చిగుళ్లు. వీటిని పచ్చడిగా చేసి తింటే అమృతం జుర్రినట్టుగానే ఉంటుంది. అలా సకలమూ సంతకు తరలివస్తుంది గనకే చుట్టుపక్కల ఊళ్లనుంచే కాదు. దూరప్రాంతాల నుంచీ ప్రజలు చీమలబారుల్లా వచ్చేస్తుంటారు. సంత కిటకిటలాడిపోతుంటుంది.

అలాంటి పెద్దసంతలో చిక్కుబడినట్టుగా ఉన్నారు రాణీదేవేంద్రాలు, సేవిక నెమలిజాణ. అయితే వాళ్ల హోదాలు తాత్కాలికంగా ఇప్పుడు మలిగిపోయాయి. దేవమ్మ ఇప్పుడు మహారాణీ కాదు. నెమలి ఈ సమయాన దాసీ కూడా కాదు. వీళ్లిద్దరూ ప్రస్తుతం స్నేహితులు. మారువేషాల్లో ఉన్న మహిళలు.

నందరాజ్య విశేషాలు తెలుసుకునేందుకు పర్యటన చేసేవేళ ఈ ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోరు. నెమలి జాణ నోరుకట్టుకున్నట్టే ఉండిపోతుంది. దేవేంద్రాలి నడతా అచ్చం అదే. రాజ్య పరిశీలనకోసమే వచ్చి నట్టుగా నడయాడుతుంది. ప్రజలనాడి పట్టడానికి, వారినుంచి సమాచారాన్ని సేకరించడానికే పరిమిత మవుతుంది. ఎప్పుడయినా అత్యవసరమైతేనే తప్ప గొంతు విప్పదు. కంఠం విప్పితే మారువేషాలు బయట పడిపోతాయన్న బెంగా ఆమెకుంటుంది.

సంతజనం నడవడానికి దారివదిలి రెండు వైపులా తీరుగా నిలిచాయి దుకాణాలు. ఒద్దికగా నడచిపోతున్నారు దేవమ్మ, నెమలి. కళ్లతోనే మొత్తం వ్యవహారాన్ని పరిశోధిస్తున్నట్టుగా దృష్టి సారించింది దేవమ్మ. తోసుకువస్తున్న జనాలను తప్పించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడామె ఒకానొక పల్లె బైతు. సాధారణమైన దుస్తులతో మామూలు గిరి మహిళగా కనిపిస్తోంది. తెల్లటి అంగవస్త్రాన్ని కప్పుకుని ఉండటం ఒక్కటే ఆమెను ప్రత్యేకమైన స్త్రీగా చూపితే చూపించవచ్చునేమో.

నడుస్తూ నడుస్తూ దేవేంద్రాలు ఒక దగ్గర ఆగింది. అక్కడ అవిసె నూనె, ఆముదపు గింజలు విక్రయానికి పెట్టిన గిరికాంత సందడిగా వ్యాపారంలో మునిగిపోయి కానవచ్చింది. ఆమె దగ్గరకు చేరుకుని తైలం ధరను గురించి వాకబు చేసింది.

‘‘వీసెడు నూనె ఖరీదు రెండు కుంచాల అరికెలు. లేదా సామలు. లేకపోతే ఒక కుంచెం కుంకుళ్లు.’’ కొండపిల్ల నవ్వుతూ చెప్పింది.

ఆమె నవ్వుకే కాదు. ఆమె చెప్పిన ధరకూ సంతోషపడి ముందుకుసాగింది దేవేంద్రాలు. ఆమె నడుస్తున్న దిక్కుకే ఎందుకనో బుగ్గలు నొక్కుకుంటూ చిత్రంగా చూస్తూ ఉండిపోయింది కొండపాప. అలా ఆ పాప చూసింది దేవమ్మ వస్తువులు కొనకుండా వెళుతున్నందుకు కాదు. వనాల్లోని ఆడమనుషులు అంత తెల్లగా ఉంటారా! అంత దొరసానుల్లా అవుపిస్తారా అని. అయితే పాప ఊహలేవీ దేవమ్మకి తెలియదు కదా! వెనక్కితిరిగి చూడకుండా సంతలో సాగిపోయింది. అలా వెళుతూనే,

‘ఇక్కడ ధర అంటే వస్తువే. సరుకును సరుకుతోనే కొనుగోలు చేసే వస్తుమార్పిడి పద్ధతి. ఈ విధానం ఎంత గొప్పదో! అమ్మేవాడూ ఒడలు వంచి పండిర చాలి. కొనేవాడూ శ్రమించి పంట కొయ్యాలి. అదే రూపాయి కాసుల వ్యవస్థ అయితే అస్తవ్యస్థమే. టంకా లతో కాయకష్టాన్ని సునాయాసంగా కొల్లగొట్టవచ్చు. ఎంతయినా మెట్టలు మెట్టలే.’ లోలోన అనుకుంది.

ఇంతలోనే తను నడుస్తున్న బాటకు కొద్దిపాటి పెడగా విపరీతమైన జనసమూహం ఆమెకు కానవచ్చింది. అక్కడ విక్రయిస్తున్నదేదో ముఖ్యమైంది కాబోలునని అనుకుంది. అలాంటి చోటుకు వెళితేనే విశేషాలు తెలుస్తాయనీ భావించింది. అటుగా అడుగులు కదిపింది. తీరా వెళ్లిచూస్తే అక్కడ గరుకు ఉప్పు అమ్ముతూ కనబడ్డాడొకడు. వాడు గిరివాసి కాడని వేషభాషలు బట్టి బోధ పడుతూనే ఉంది. అతగాడి చుట్టూ ఈగల్లా మూగారు గిరిజనమంతాను.

‘‘మీద పడకండి! అందరికీ సరుకు అప్పగించే కొండ దిగుతాను. మీకోసం కాకపోతే నేనున్నది ఎవరికోసం? నా వ్యాపారమే మీ బాగు కోసం. ఎగబడకండి. ఎగబడకండి.’’ చిత్రంగా మాట్లాడుతూ వాడు ఉప్పు కొలుస్తున్నాడు.

ఎంత అనునయంగా గళం వినపిస్తున్నా వాడి మాటలు మాత్రం జింకల్ని పట్టి చంపే ముందు పులి వేసే మెత్తని అడుగుల్లాగానే దేవమ్మకి వినిపిం చాయి. ఉప్పు కొని ఆకుసంచుల్లో పట్టుకుపోతున్న వారిమధ్యకు నానా యాతనలూ పడి ఆమె పోనే పోయింది. దుకాణాదారు ఎదురుగా నిలిచి జరుగు తున్నది గమనించింది. అక్కడికి చేరాక తెలిసింది అసలు విషయం. మహాదోపిడీకి దిగుతున్నాడు ఆ లవణ వ్యాపారి. సోలడు, గిద్దెడు ఉప్పు కొలిచిపోస్తూ అమాయకగిరి ప్రజనుంచి పుట్ల కొద్దీ తృణ ధాన్యాలు బదులు తీసుకుంటున్నాడు. కుంచాల కొద్దీ సుగంది óవేరుముక్కలు చిక్కుడుగింజలు, పనసపిక్కలు సొంతం చేసుకుంటున్నాడు.

‘మహాఘోరం. ఇంతగా మనిషిని సాటి మనిషే నోట కరుచుకుపోతాడా?’ ఎదను కెల్లించు కుంది దేవమ్మ. ఇదే విషయమై ఉప్పువాణ్ణి నిల దీయాలనీ నోటిదాకా వచ్చింది. అప్పటికే లవణుడు ఆమెవైపు అదో రకంగా చూస్తున్నాడు. తెలివైన వాడుకదా! ముదురు కదా! ఈమె గిరిపిల్ల కాదన్నట్టుగా అనుమానపడుతున్నాడు. ‘అవును మరి! కిందివాడు కిందివాళ్లను గుర్తించడం సుళువే. ఇక్కడ ఉండటం ఏ మాత్రమూ మంచిది కాదు.’ అనుకుంటూ గబగబా ఉప్పును దాటుకుపోయింది దేవేంద్రాలు.

అప్పటికే మధ్యసిత్రం వేళయింది. ఎక్కడెక్కడి నుంచో కొండలు దిగి, కొండలెక్కి, ఉరుకులు పరుగులమీద వచ్చిన ప్రజానీకమంతా ఆకళ్లు మొదలు కావడంతో సంతలోనే దొరికిన చోట దొరికినట్టుగా కూర్చుండిపోయారు. మూపున మోసుకుంటూ తెచ్చుకున్న దిప్పల్ని అందుకున్నారు. వీటిలోని అంబలి నీళ్లను గొంతుల్లో పోసుకుంటున్నారు.

మానవ ప్రవృత్తి చిత్రంగా ఉంటుంది. ఆ పక్క వాడికి దాహం వేస్తే ఈ వైపు వాడికీ నీళ్లు కావలసి వస్తుంది. ఇటు వాడు ఆకలంటే అటువాడూ కడుపు రాసుకుంటూ ఉంటాడు. అచ్చం అలాగే ఉంది దేవమ్మ స్థితి కూడాను. అందరూ అంబలి తాగుతుంటూ ఆమెకూ ఆకలి గుర్తుకు వచ్చింది. అంతకంటే ముందు దప్పిక వేధించుకు తింటున్నట్టుంది. నెమలిజాణ అర్థం చేసుకుంది. గొణుగుతున్నట్టుగా,

‘‘మనం కూడా తిండి తిందామా!’’ చేతిలో ఉన్న రాగిరొట్టెల సంచిని దేవమ్మకు చూపిస్తూ అంది.

‘‘వద్దులే. కాసేపయ్యాక తిందాం. ముందు మంచినీళ్లు తాగాలి. కుత్తుక కత్తిరించుకుపోతోంది.’’ అలసిపోయినట్టుగా అనేసింది.

సంతకు అయిమూలగా ఒక గంగరావి చెట్టుకింద పెద్దపెద్ద నీటిగూనలతో ఏర్పాటయిన చలివేంద్రాన్ని రాణీదేవమ్మకు చూపించింది జాణ. అటుగా నడక మొదలుపెట్టారు ఇద్దరూను. చలివేంద్రం చేరి గబగబా నాలుగు అడ్డాకుల దొప్పలతో నీళ్లు తాగాకగానీ దేవమ్మ స్థిరత పొందలేదు. మెల్లగా కొంగుతో ముఖం తుడుచుకుని సమీపంలోని రాతి తిన్నె మీద సాగిల బడిరది. ఆమె పక్కకు చేరి నిలిచింది నెమలి.

చలివేంద్రం నిర్వహిస్తున్న గిరి కుర్రాడు నీళ్లు తాగడానికి వచ్చేవారికోసం దొప్పలు కట్టుకోవడంలో పడిపోయాడు. అప్పటికింకా భోజనాల వేళ మీర లేదు. కాబట్టి జనం నీళ్లకోసం విరుచుకుపడటం లేదు. గిరి కుర్రాడితో మాటకలిపింది దేవమ్మ.

‘‘ఈ నీళ్లు ఎక్కడివి?’’ పొడిపొడిగా అడిగింది. గిరిఅబ్బాయి దొప్పలు కట్టుకుంటూనే,

‘‘పక్కనే ఉన్న గెడ్డలోవి. సంతనాడు ఉదయమే మోసుకొస్తాను. ఇక్కడికి వచ్చేవాళ్లెవరూ దాహంతో గిలగిల్లాడకూడదని మా అమ్మ చెబుతుంది. అందుకే ఇలా.’’ వివరణ ఇచ్చాడు.

‘‘సంతనాడు ఎన్ని గూనల నీళ్లు ఖర్చవుతాయి?’’ ఈ సారి ప్రశ్న తనదన్నట్టుగా అడిగింది నెమలి.

‘‘పూర్వం బాగానే అయ్యేవి. ఇప్పుడు అంతలా అవ్వడం లేదు.’’ నిమానుగా పలికాడు కుర్రాడు. అతని జవాబుకు ఆశ్చర్యపడిరది దేవమ్మ.

‘‘ఎందుకలా?’’ అడగకూడదనుకున్నా ఆమె నోట బయటపడిరది ఆ ముక్క. అప్పటివరకూ కుదురుగానే ఉన్న కొండబ్బాయి కదిలిపోయినట్టుగా అయ్యాడు. స్వరమూ పెంచాడు.

‘‘ఎందుకేంటి? ఇప్పుడు మనవాళ్లలో మంచినీళ్లు తాగుతున్నదెవడు. అందరూ కల్లుతాగే బతుకు తున్నారు. పోనీలే ఎలాగో ఏడుస్తున్నారూ అనుకుంటే వంటసారా మరిగేశారు కూడాను. దిగువనుంచి వచ్చిన సారా కోసం తన్నుకు ఛస్తున్నారు. పంట మొత్తం పల్లంబాబులకు అప్పగించి తాగి తూలుతున్నారు. ఆ సారా మహత్యం చూడాలంటే ఆ మూలకు వెళ్లండి. కొండవారి పంట.. దిగువవారి వంట.. అంటే ఏంటో మీకే తెలుస్తుంది.’’ చేత్తో సంత కొనవైపున్న బండలమాటును చూపించాడు. గందరగోళం పడిపోయారు నెమలి, దేవమ్మలు.

‘‘వంటసారానా! అదేంటి?’’ నెమలి అయో మయంగా అంది.

‘‘వంటసారా తెలీదా! ఏదో పిండి, మరేవో తోలు ముక్కలు కలిపి ఉడికిస్తారట. పుల్లబెడతారట. అనియంకపల్లి, గోపాలపట్నం, వడ్డాది నుంచీ వస్తుం దట. అంతకు మించి నాకూ తెలీదు. నేను తాగను కదా!’’ కిలకిలమంటూ మళ్లీ దొప్పలపనిలో పడి పోయాడు కుర్రడు. మతిపోయినట్టయింది దేవమ్మ. ఠక్కున తిన్నెమీంచి లేచింది. చలివేంద్రాన్ని వదిలి పెట్టేసింది. ఆమె వెనుక అడుగులువేసింది నెమలి.

నడుస్తోందన్న మాటేగానీ గతితప్పిన అడుగులు గానే ఉంది దేవమ్మ స్థితి. సారా వ్యవహారాన్ని బండలమాటుకు వెళ్లి స్వయంగా చూడాలని అను కున్నా చూశాక మరెంతగా కనలిపోవాల్సి వస్తుందోనని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. చలివేంద్రం కుర్రాడు చెప్పినట్టుగా కొండవారి పంట దిగువవారి వంటగా మారుతోందన్న సంగతి ఆమె దృష్టికీ రాకపోలేదు. ఆ వ్యవహారం రోజురోజుకూ ముదిరి పోతోందని మాత్రం ఇప్పుడామెకు రుజువైనట్టయింది.

సంతలో దేవమ్మ సాగిపోతోందన్న మాటేగానీ చిత్తంలో మునుపటి ఉత్సాహం లేదు. మనసు ముందటి హెచ్చరికగానూ లేదు. ‘ఏం తీరో.. ఏం లోకమో..’ అన్నట్టుగా కాళ్లు తొక్కుకుంటూ వెళుతోంది. దాహం తీరినా ఆకలి మాసిపోయినట్టుగా అయింది. నెమలి కూడా వంటసారా గురించి విని నీరుగారినట్టుగా అయింది. దానికీ నోట మాటలేదు. ఈ మధ్య దాని మేనల్లుడు ఆ సారాయే పూటుగా తాగి ప్రాణాలు వదిలేశాడు. అదో విషాదం. నెమలి, దేవమ్మ ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్లుండగానే పెద్దపెద్ద కేకలు సంతమయాన వినిపించాయి. కాకరబీకరగా ఎగసివస్తున్న ఆ పెనుకేకలు సామాన్యమైనవి కావు.

‘‘ఛాయ పసుపు.. ఛాయ పసుపు.. ఒంటికి వడ్డాది పసుపు కావాలి.. ఒంటికి వడ్డాది పసుపు కావాలి.. ఒంటికి వడ్డాది పసుపు కావాలి.. కొనుక్కోండి. రాసుకోండి.. పచ్చగా కళకళలాడండి.’’ ఎవరెవరో దుకాణాదారులు ఒక్కచోట చేరి గొంతులుపోయేలా అరుస్తున్నారు. వాళ్ల దగ్గరకే ఎగబడుతోంది గిరిప్రజ. తెల్లబోయింది దేవేంద్రాలు. పుట్టిన ఊరిపేరు వినబడినందుకు ఎవరైనా ముచ్చటపడతారు. దేవమ్మ అలా లేదు. నిర్ఘాంతపోతోంది. అయోమయంలోనూ చిక్కుబడిరది. ‘ఒంటికి వడ్డాది పసుపు కావాలి.. ఒంటికి వడ్డాది పసుపు కావాలి..’ అనే మాటలు ఆమె చెవులకు చేరడమే ఇందుకు కారణం.

‘అసలు వడ్డాదిలో పసుపు పండిరచేదెవరు? మహా అయితే చెరుకు పండిస్తారు. వరి పండిస్తారు. పెసలో మినుములో జల్లుతారు. కొత్తగా ఈ పసుపు ఎక్కడిది? ఎక్కడినుంచి వచ్చింది?’ అనుకుంటూనే అటుగా గబగబా వెళ్లింది.

తీరా అక్కడికి చేరేసరికి పొడవైన పసుపు కొమ్ములు రాశులుగా పోసి అమ్మకానికి పెట్టిన దృశ్యం అగుపించింది. తండోపతండాలుగా కొనుక్కుపోతున్న జనం కానవచ్చారు. దానికంటే మించిన మరో విస్మయం ఒకటుంది. ఆ రాశుల పక్కనే కొండపసుపు పెట్టుకుని కూర్చుందో గిరివనిత. అక్కడ మాత్రం పిట్టమనిషి లేడు. ఖాళీగా కనిపించింది దుకాణం నడిపే ఆ అమ్మాయి. విచిత్రపోయింది దేవేంద్రాలు. వడ్డాది పసుపు పేరిట పరుచుకున్న కొమ్ములన్నీ కొమ్ములు విసిరి అమ్ముడవుతుండగా కొండపసుపులు కూనారిల్లిపోవడం ఏమిటని కుసిల్లింది. వెనువెంటనే బేరాల్లేని గిరిపసుపు విక్రయకేంద్రానికే సరాసరి వెళ్లిపోయింది. వెళుతూ వెళుతూనే,

‘‘నువ్వేం అమ్మవా! నీ పసుపు అమ్ముడుపోదా?’’ ఆత్రంగా ఆ పిల్లను అడిగింది. ఆ పిల్ల వెర్రినవ్వు నవ్వింది. సమాధానం ఇవ్వలేదు. కోపం వచ్చింది దేవమ్మకి. ‘‘నిన్నే అడుగుతుంట! మాట్లాడవేం? పసుపు అమ్మడంకోసం నువ్వు సంతకి రాలేదా?’’ చిరచిరగా అడిగింది. దీంతో ఇష్టంలేకున్నా తప్పదన్నట్టుగా మాట కలిపింది కొండపసుపుపిల్ల.

‘‘ఏం చెప్పమంటావమ్మా! అది వడ్డాది పసుపు. మనది కాదు కదా.’’ వెటకారం ధ్వనించేలా అనేసింది.

‘‘అసలు వడ్డాదిలో పసుపు ఎక్కడుంది?’’ ఆందోళనపడుతూ అంది దేవేంద్రాలు. ‘‘ఆ సంగతి మీకూ నాకూ తెలుసు. మన కొండజనానికి తెలియదే!’’

‘‘అంటే..’’

‘‘అంటే మరేం లేదు. మన కొండపసుపునే టోకున కొనుక్కుని కిందకు పట్టుకుపోతున్నారు పల్లం బాబులు..’’

‘‘పట్టుకుపోయి..’’

‘‘మన పసుపు కొమ్ముల్ని పెద్దపెద్ద మట్టిగూనల్లో ఉప్పునీళ్లతో ఒక్క ఉడుకు ఉడికిస్తున్నారు..’’

‘‘ఉడికించి..’’

‘‘పసుపుకొమ్ములకి ఉప్పునీటి వేడి తగిలితే ఉబ్బుతాయి. కొంచెం నిలువుగా అవుతాయి. వాటిమీదనున్న చెత్తాచెదారం వదిలిపోతుంది. ఆనక..’’

‘‘ఆ.. ఆనక.’’ అయోమయంపాలవుతూ అడిగింది దేవమ్మ.

(ఇంకా ఉంది)

By editor

Twitter
Instagram