సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ ఆశ్వయుజ బహుళ తదియ – 22 నవంబర్‌ 2021, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌హిందూత్వ ఏమిటో, హిందూయిజం ఏదో అవకాశవాద రాజకీయాలకీ, అజ్ఞానానికీ, హిందూ వ్యతిరేకతకీ చిరునామాల వంటి చిల్లరమల్లర నేతలు భారతీయులకు పాఠాలు చెబుతున్నారు. హిందూయిజమే ఈ దేశ అసలు సిద్ధాంతమట. అన్నట్టు కాంగ్రెస్‌ ‌నమ్మేదీ సరిగ్గా అదేనట. హిందూయిజాన్ని హిందూత్వ ధ్వంసం చేస్తున్నదని కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ భాష్యం వెలగబెట్టారు. ఎంత దౌర్భాగ్యం! ఈ భాష్యానికి ఆ పార్టీ వాళ్లే బెదిరిపోయారు. నిజానికి ఈ తిక్క వాదన కొత్తదేమీ కాదు. వింటే అరిగిపోయిన రికార్డూ సిగ్గు పడాల్సిందే. నమిలి నమిలి ఊసిన తాంబూలం పిప్పి కంటే తక్కువేం కాదు. కాంగ్రెస్‌ ‌శిక్షణ తరగతులట. అందులో రాహుల్‌ ‌సందేశమట. అది కూడా వార్ధాలోని సేవాగ్రామ్‌ ఆ‌శ్రమంలో. ప్రథమ ప్రధాని జవహర్‌, ‌గాంధీ-నెహ్రూ వంశ యువరాజు రాహుల్‌ ‌వరకు, వీళ్లని అంటకాగిన వేలాదిమంది కాంగ్రెస్‌ ‌నాయకులు ఆరేడు దశాబ్దాలుగా పాడుతున్నది ఈ పాచి పాటే. హిందూత్వ హిందూయిజానికి రాజకీయ ముఖమని వీళ్ల నిర్వచనం.ఆ హిందూత్వ సంఘపరివార్‌దేనని ముక్తాయింపు.

వంద ఏళ్ల క్రితం ఎడారుల నుంచి వచ్చి పడినవాళ్లు నోరు తిరక్క సింధును హిందు అన్నారు. వేదాల్లోని సప్త సింధును హప్త హిందు అంటూ హింసించారు. ఇది పర్షియన్ల పరిజ్ఞానం. దానర్ధం సింధు పరిసరాలలో ఉంటున్నవారు. ఆర్యావర్తం అని పిలుచుకునే ఈ గడ్డ మీద ఆర్షధర్మం, లేదా సనాతన ధర్మమే పరిఢవిల్లింది. అదే హిందూధర్మం పేరుతో స్థిరపడింది. అయినా, హిందూయిజం అనే ఆ సంకర పదం ఆర్ష వాఙ్మయంలో ఎందుకుంటుంది? వేల ఏళ్ల నాటి ఎడారి మతాల దృష్టిలోనే కాదు, పాతికేళ్ల క్రితం మన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశం ప్రకారం కూడా ‘హిందూ’ భౌగోళిక ఉనికిని చాటేదే. ఒక జీవన విధానం పేరే. పర్షియన్లు, గ్రీకులు, మహమ్మదీయులు, ఆంగ్లేయులు- హిందూ అని పిలిచినా భారతీయులకైతే అభ్యంతరం కనిపించలేదు. హిందూ అన్న ప్రయోగం వేద వాజ్ఞయంలోనూ లేదంటారు పెద్దలు. కానీ భరతుడు అనే ఆయన పేరు మీద ఇది భారతదేశ మైందన్న వాదనకు బలం ఉంది. చిత్రంగా ఈ రెండు పిలుపులు కూడా కాంగ్రెస్‌కీ, దాని తోక విధ్వంసక ముఠాలకీ, కిరాయి సెక్యులరిస్టులకీ ఆది నుంచీ ఇష్టం లేదు. హిందూత్వ అన్న పదం వీర సావర్కర్‌ ‌సృష్టించాడని మరొక ఆరోపణ. కానీ ఆయన కంటే ముందే బెంగాల్‌లో చంద్రకాంత్‌ ‌బసు ఆర్థిక చరిత్ర రచనలో ఈ పదం 1892లో వినియోగించా డంటారు. బాలగంగాధర తిలక్‌ ‌కూడా ఆ పదం ప్రయోగించారు. 1923లో సావర్కర్‌ ఈ ‌పదాన్ని వెలుగులోకి తెచ్చినవారిగా కనిపిస్తారు. హిందూయిజం, హిందూత్వ వేర్వేరన్న సంగతి ఇవాళే కనుగొన్నట్టు యురేకా స్థాయిలో ఈ కాంగ్రెస్‌ ‌కుక్కమూతి పిందె హడావిడి చేస్తుంటే జనం నవ్విపోరా? అన్నట్టు ఆ రెండు వేర్వేరు అని సావర్కరే నిస్సంకోచంగా చెప్పారు. ఈ అజ్ఞానులకు తెలిస్తే కదా!

హిందుత్వ అంటే ఆక్స్‌ఫర్డ్ ‌నిఘంటువు ఇచ్చిన అర్ధం- హిందువు ఉనికి. హిందూ లక్షణం, వెరసి హిందూనెస్‌. ‌హిందూ జీవన విధానంలో ఉండడం. లేదా హిందూ జాతీయతావాదానికి చెంది ఉండడం. మరియం-వెబ్‌స్టర్‌ ‌విశ్వ మత సర్వస్వం, హిందుత్వ అంటే భారతీయ (ఇండియన్‌) ‌సంస్కృతి, జాతీయ, మత గుర్తింపు అని చెప్పింది. 1995లో సుప్రీంకోర్టు రూలింగ్‌ ‌ప్రకారం మౌలికంగా హిందుత్వ అంటే అర్ధం చేసుకోవలసింది అదొక జీవన విధానం అనే. లేదా మానసిక స్థితిగా భావించాలి. అంతేతప్ప హిందూత్వ అంటే హిందూ మత ఛాందసవాదంగా భావించరాదు అని తేల్చి చెప్పింది. కాబట్టి హిందుత్వ మీద వ్యాఖ్యలన్నీ కుత్సిత బుద్ధి జనితం. చట్ట వ్యతిరేకం. సుప్రీంకోర్టు ఉపయోగించిన పదం హిందుత్వమే. వీళ్లలో ఎవరూ హిందూత్వలో విద్వేష కోణం చూడలేదు. లేని హిందూయిజం పదాన్ని రంగం మీదకి తేలేదు.

హిందూయిజం ఒక సిక్కునో, మహమ్మదీయుడినో కొట్టమని చెప్పిందా? కానీ హిందుత్వ చెప్పింది అంటూ ఉపనిషత్తులు కూడా ఔపోశన పట్టేసిన(ట) రాహుల్‌ ‌సభికులకు చెప్పారు. అతడి నానమ్మ చనిపోయినప్పుడు ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా వేలాది సిక్కులను హత్య చేసిందెవరో రాహుల్‌ అప్పుడే మరచిపోతే ఎలా? కాంగ్రెస్‌ ‌పార్టీది హిందూయిజమే, అది ఈ దేశం శతాబ్దాలుగా అనుసరిస్తున్న సిద్ధాంతమే అయినప్పటికీ ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకి బలంగా చెప్పడంలో నాయకత్వం విఫలమైందని వాపోయారు పాపం. అంటే ఇది నెహ్రూ, ఇందిర తదితరుల పాపమనా? ఇప్పుడీ ఘనుడు వచ్చాడు కాబట్టి ఆ లోటేదో తీరుతుంది. ఇలా ఇతర మతాల మీద దాడి చేయమని ఇస్లాం చెప్పలేదు, సిక్కిజం చెప్పలేదు. కానీ హిందుత్వ చెబుతోందని కూడా నోరు పారేసుకున్నారు.

ఆ పార్టీలోని ముస్లిం మతోన్మాది సల్మాన్‌ ‌ఖుర్షీద్‌ ‌విడుదల చేసిన పుస్తకం ‘సన్‌రైజ్‌ ఓవర్‌ అయోధ్య: నేషన్‌హుడ్‌ ఇన్‌ అవర్‌ ‌టైమ్స్’ ‌హిందువుల చరిత్రకు రక్తం పూయాలని ప్రయత్నించింది. హిందూత్వకీ ఐఎస్‌ఎస్‌కీ, బోకోహరాంకీ తేడా లేదని ఖుర్షీద్‌ ఆ ‌పుస్తకంలోనే విషం కక్కారు. సీఏఏ వ్యతిరేక షాహిన్‌బాగ్‌ ‌శిబిరాన్ని చూసొచ్చిన కాంగ్రెస్‌వాళ్లలో ఈయన ఒకరు. హిందువులను ఉద్దే శించి చేసిన ఈ వ్యాఖ్యలు అతిశయోక్తులనీ, సత్యదూరాలనీ ఆ పార్టీకే చెందిన మరొక సీనియర్‌ ‌నేత గులాం నబీ వ్యాఖ్యానించడం విశేషం. సల్మాన్‌ ఈ ‌మాటలు వెనక్కి తీసుకోవాలని ఉత్తరాఖండ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ ‌రావత్‌ ‌హితవు చెప్పారు. ఇటీవల జరిగిన అల్లర్లలో, ఇప్పటికీ కశ్మీర్‌ ‌లోయలో ముస్లిం మతోన్మాదులు చేస్తున్న అరాచకం నేపథ్యం ఏమిటో జాతికి తెలుసు. అయినా హిందువుల హక్కుల గురించి ఉదారవాదులు, కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు ఎవరికీ పట్టని ఈ పరిస్థితిలో హిందూత్వను ఆశ్రయిస్తే తప్పేమిటి?

By editor

Twitter
Instagram