ఈ ఆగస్టు 15, అరవింద్‌ ‌ఘోష్‌ 150‌వ జయంతి సందర్భంగా

ఒక అంతర్వాణిని విన్నానని అరవిందులు చెప్పేవారు. నాటికే తనువు చాలించిన వివేకా నందునితో సంభాషించాననీ అన్నారు. నిజం చెప్పాలంటే ఆ సంభాషణ చిరంతనమైన భారతీయ చింతనతోనే. ఆంగ్ల వర్ణమాలతో అక్షరాభ్యాసం చేయించి, బెంగాలీ ముక్కల శబ్దం కూడా చొరబడలేని డార్జిలింగ్‌ ‌లోరెటో కాన్వెంట్‌ ‌పాఠశాలలో కొడుకును చేర్చారు తండ్రి కృష్ణధున్‌ ‌ఘోష్‌. ఆయన ఆంగ్ల ప్రభుత్వంలో అసిస్టెంట్‌ ‌సర్జన్‌. ఆయనదీ ఇంగ్లండ్‌ ‌చదువే. ఆ సర్జన్‌ ఆం‌గ్లాభిమానం ఎంతవరకు వెళ్లిందంటే కొడుకు పేరులోనే బ్రిటన్‌ ‌సంస్కృతిలోని పదం చేర్చారు. అరవిందుల అసలు పేరు అరబిందో ఎక్రిడ్‌ ‌ఘోష్‌. ఏడేళ్లు వచ్చే సరికి డార్జిలింగ్‌ ‌నుంచి ఇంగ్లండ్‌ ‌సెయింట్‌ ‌పాల్స్ ‌పాఠశాలకీ, అక్కడ నుంచి కేంబ్రిడ్జ్‌లోని కింగ్స్ ‌కళాశాలకి కూడా కొడుకును పంపించారాయన. వనవాసం ముగించినట్టే అక్షరాలా పద్నాలుగేళ్ల తరువాత బరోడా మహారాజు దగ్గర పనిచేయడానికి భారతగడ్డ మీద అడుగు పెట్టారు. భారతీయ సంస్కృతి వాసన కూడా సోక కుండా అభేద్యంగా నిర్మించానని ఆ తండ్రి భావించిన ‘తెల్లగోడ’ మంచుతెరలా కరిగిపోయింది. తాను ఆరు భాషలు నేర్చుకున్నా ఈ నేల ధర్మంతో, సంస్కృతితో మాట్లాడాలంటే కావలసింది సంస్కృతమని తెలుసు కున్నారు అరవిందులు. ఇక్కడి గాలి వాసనని పట్టిచ్చే మాతృభాష బెంగాలీలోను నిష్ణాతులయ్యారు. ఇక్కడి రాజకీయ చింతన భారతీయతపై నిర్మించాలని నమ్మారు. భారతదేశానికి బానిస చదువు అవసరం లేదని నినదించారు. వేదాలకీ, గీతకీ, ఉపనిషత్తులకు భాష్యం వెలయించారు. వందేళ్ల క్రితం నాటి ఈ అద్భుత వ్యక్తి చరిత్ర ఇచ్చే స్ఫూర్తి ఇవాళ మరింత అవసరం. బ్రిటిష్‌ ఇం‌డియా నాటి ఇంగ్లిష్‌ ‌దాస్యాన్ని మించిపోయాయి నేటి ఇంగ్లిష్‌ ‌వ్యామోహం, ఇంగ్లిష్‌ ‌బుద్ధి.

ఎప్పటికైనా మానవజాతి మనోదశ (మెంటల్‌ ‌స్టేట్‌)‌ను దాటి, అతి మనోదశ (సూపర్‌ ‌మెంటల్‌) ‌దశను అందుకుంటుంది. అదే దివ్య చైతన్యదశ. ఆ దశను చేరుకున్న మానవుడు అధిమానవుడవుతాడు. క్రమంగా ఒక అధిమానవ జాతి అవతరించినా ఆశ్చర్యం లేదు. అయితే ఆ పరిణామం అనివార్యమే అయినా దానిని త్వరితం చేయడానికి కృషి చేయాలి. సాధన చేయాలి. ఇలాంటి ఒక వినూత్న పరిణామ వాదాన్నీ, దానిని పురస్కరించుకుని ఒక విలక్షణ తత్త్వచింతననూ ప్రవచించిన మహనీయుడు అరవిందుడు (ఆగస్ట్ 15, 1872-‌డిసెంబర్‌ 5, 1950). ఈ ‌శతాబ్దపు గొప్ప తాత్త్వికులలో ఒకరు. దీనికే ఇంటిగ్రల్‌ ‌యోగా అని పేరు.

వారిది సంపన్న బెంగాలీ కుటుంబం. కలకత్తా ఇంట్లో బెంగాలీ నౌకర్లు ఉంటే ఆ భాష చెవినపడు తుందని బ్రహ్మ సమాజికుడు కృష్ణధున్‌ ‌యూరోపియన్‌ ‌నౌకర్లను నియమించారు. అరవిందుడు, మిగిలిన సోదరులను కూడా ఐసీఎస్‌ ‌చేయించాలన్న ఆశయంతో మాంచెస్టర్‌లో రెవరెండ్‌ ‌డబ్ల్యు హెచ్‌ ‌డ్వ్రెట్‌ ‌దగ్గర చేర్పించారు. ఈయన మత బోధకుడు. ఇతడే ఆ అన్నదమ్ములకు మొదట లాటిన్‌ ‌నేర్పి, తరువాత అక్కడే గ్రామర్‌ ‌స్కూల్‌లో చేర్చాడు. ఇంగ్లండ్‌లో ఆంగ్లంతో పాటు ఫ్రెంచ్‌, ‌లాటిన్‌, ‌గ్రీక్‌, ఇటాలియన్‌, ‌జర్మన్‌, ‌స్పానిష్‌ ‌భాషలు నేర్చారు అరవిందుడు. 1893లో బరోడా సంస్థానంలో చేరిన తరువాత మహారాజా కళాశాలలో ఇంగ్లిష్‌, ‌ఫ్రెంచ్‌ ‌బోధకునిగా కూడా పనిచేశారు. అక్కడే గుజరాతీ, మరాఠీ భాషలు కూడా నేర్చుకున్నారు. 1901లో మృణాళినిదేవితో వివాహం అయింది (ఇన్‌ఫ్లు యెంజాతో 1918లో ఆమె చనిపోయారు). బరోడాకు చేరడంతోనే ఆయనలోని జాతీయతా జ్వాల ఒక్కసారి ఎగసిపడింది. బొంబాయి నుంచి వెలువడే ‘ఇందు ప్రకాశ్‌’ ఆం‌గ్ల పత్రికకు విప్లవం గురించి వ్యాసాలు రాశారు. అవి ఎంత తీవ్రంగా ఉండేవంటే, పత్రిక నిషేధానికి గురి అవుతుందేమోనని సంపాదకుడు భయపడి నిలిపివేశాడు.

1902 నుంచి అరవిందుడు భారత జాతీయ కాంగ్రెస్‌ ‌సభలకు హాజరయ్యారు. కానీ మితవాదుల ధోరణి ఆయనకు రుచించే అవకాశమే లేదు. బెంగాల్‌ ‌విభజన తరువాత ఆయన తిరిగి బెంగాల్‌లో అడుగుపెట్టారు. 1907లో జాతీయ కాంగ్రెస్‌ ‌రెండుగా చీలినప్పుడు అతి జాతీయవాదుల పక్షంలో చేరారు. బాలగంగాధర తిలక్‌ అభిమానిగా మారిపోయారు. ఇంతలోనే సొంత తమ్ముడు బారీన్‌ ‌ఘోష్‌ ‌తీవ్ర జాతీయవాదులతో కలసి విప్లవ సంస్థను నెలకొల్పారు. (చిత్రంగా, బారీన్‌ ‌కూడా అరవిందుడు, మరొక సోదరుడు వినయ్‌భూషణ్‌తో కలసి ఇంగ్లండ్‌లో చదువుకుని వచ్చినవారే). అందులో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా సంపూర్ణ స్వాతంత్య్రమే మన ఆశయం కావాలని కోరుకున్నారు. బిపిన్‌ ‌చంద్రపాల్‌ ‌నడిపే ‘బందేమాతరం’ పత్రికను నిర్వహించారు. అయితే ఇది రహస్యం. అందుకే ఒకసారి అరెస్టు చేసినా ఆధారాలు దొరక్క వదిలి పెట్టవలసివచ్చింది. కానీ ఆయనను వేటాడడం మానలేదు. అనుశీలన్‌ ‌సమితి ఆధ్వర్యంలో జరిగిన1908 నాటి అలీపూర్‌ ‌బాంబ్‌ ‌కేసులో అరెస్టు చేశారు. ఆ హత్య ప్రణాళిక ఖుదీరాం బోస్‌, ‌ప్రఫుల్ల చాకి, బారీన్‌ ‌ఘోష్‌లది. కింగ్స్‌ఫర్డ్ అనే బిట్రిష్‌ ‌జాతి న్యాయమూర్తిని హత్య చేసేందుకు విసిరిన బాంబులు ప్రింజ్లి కెన్నడి అనే బారిస్టర్‌ ‌కూతురు, భార్యకు పొరపాటున తగిలి మరణించారు. ఈ కేసులో 40 మంది వరకు అరెస్టు కాగా, వారిలో అరవిందుడు ఒకరు. నిజానికి తన తమ్ముడి బారీన్‌ ‌వల్ల అనుశీలన్‌ ‌సమితి సభ్యులు భాగా జతీన్‌, ‌జతీన్‌ ‌ముఖర్జీ, సురేంద్రనాథ్‌ ‌టాగోర్‌లతో అరవిందుడికి మంచి బంధమే ఏర్పడింది. ‘ఈనాడు దేశంలోకెల్లా అత్యంత ప్రమాదకారి అయిన వ్యక్తి’ అని అరవిందుల గురించి నాటి గవర్నర్‌ ‌జనరల్‌ ‌మింటో ఇంగ్లండ్‌లోని భారత కార్యదర్శి మోర్లేకు లేఖ రాశాడు.

అలీపూర్‌ ‌కేసును చిత్తరంజన్‌దాస్‌ ‌వాదిం చడంలో 1909లో అరవిందులు అలీపూర్‌ ‌కారాగారం నుంచి విడుదలయ్యారు. ఆ జైలులోనే ఆయన పూర్తిగా అతివాదం నుంచి ఆధ్యాత్మికత వైపు మారిపోయారు. నిజానికి ఇవేమీ జరగక ముందే 1907లో తమ్ముడు బారీన్‌ ‌పరిచయం చేసిన మహారాష్ట్ర యోగి విష్ణుభాస్కర్‌ ‌లేలే బోధనలతోనే ఆయనలో మార్పు మొదలయిందని చెబుతారు. ఆయనే, నీకు బయటి గురువు అక్కరలేదు.నీలోనే గురువును అన్వేషించుకోమని చెప్పారట. బరోడాలో ఉండగానే నేర్చిన యోగసాధన దీనికి నేపథ్యం. యోగాలో ఉన్నప్పుడే ఆయనకు ఒక గొంతు వినిపించేది. అది స్వామి వివేకానందులది.

అయినా అరవిందులను ఆంగ్లేయులు వేటాడడం మానలేదు. ఏదో ఒక కుట్రలో ఇరికించి ద్వీపాంతరం పంపించాలన్న కుట్ర సాగుతోంది. ఇది తెలిసిన సిస్టర్‌ ‌నివేదిత రహస్య జీవితంలోకి వెళ్లిపొమ్మని ఆయనకు వర్తమానం పంపారు. దీనితో ఫిబ్రవరి 10, 1910న మొదట ఫ్రెంచ్‌ అధీనంలో ఉన్న చంద్రనగోర్‌కు వెళ్లారాయన. అక్కడ కూడా రక్షణ లేదని తలంచి ఏప్రిల్‌ 2‌న కలకత్తా రేవు నుంచి రహస్యంగా నౌకాయానం చేసి 4వ తేదీన పుదుచ్చేరి చేరుకున్నారు. అయినా కొద్దికాలం విప్లవసంస్థలతో మంతనాలు జరిపారు. 1902 నుంచి 1910 వరకు మొత్తం ఎనిమిదేళ్లు ఆయన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. తరువాత పూర్తిగా రాజకీయాలు విరమించి యోగ సాధనకు పరిమితమయ్యారు. తిలక్‌, ‌లాలా లాజ్‌పతిరాయ్‌, ‌చిత్తరంజన్‌ ‌వంటి వారంతా కోరినా బ్రిటిష్‌ ఇం‌డియాకు రాలేదు. గాంధీ మార్గంలోకి పోలేదు. 1924లో గాంధీజీ కుమారుడు దేవదాస్‌గాంధీ కలిసినప్పుడు, ‘అయితే, అఫ్ఘానిస్తాన్‌ ‌దాడి చేసినా మనం అహింసతో ఎదుర్కొనాలా?’ అని ప్రశ్నించారంటే ఆయనకు గాంధీజీ పట్ల ఉన్న వ్యతిరేకత అర్థమవుతుంది.1926లో పుదుచ్చేరి అరవిందాశ్రమం ఆవిర్భవించింది.

పుదుచ్చేరిలో ఉండగానే ఆయనలోని తాత్త్వికుడు, కవి, రచయిత విశ్వరూపం దాల్చారు. 1914లో ప్రారంభించిన ‘ఆర్య’ పత్రిక ఇందుకు వేదిక. ‘ది సీక్రెట్‌ ఆఫ్‌ ‌వేదా’, ‘ఎస్సేస్‌ ఆన్‌ ‌గీత’, ‘ది సింథసిస్‌ ఆఫ్‌ ‌యోగ’ వంటి అసమాన రచనలు అందులోనే ధారావాహికంగా వెలువడినాయి. వ్యాసుడు, వాల్మీకి రచనలకు భాష్యాలూ, కాళిదాసు రచనల అను వాదాలూ వెలయించారు. ఎనిమిది ఉపనిషత్తులు, గీత అనువాదం వంటివాటితో, షేక్‌స్పియర్‌, ‌గెథేల సాహిత్యం మీద వ్యాఖ్యానం రాసి విశ్వసాహిత్యానికి గొప్ప సేవ చేశారు. వీటికి మించి ఖ్యాతిగాంచినవి పుస్తకాలు- ‘ది లైఫ్‌ ‌డివైన్‌’, ‘‌సావిత్రి’.

మహాభారతంలోని సావిత్రి, సత్యవంతుల కథకు ఇది గొప్ప పునర్‌ ‌నిర్మాణం ‘సావిత్రి’. 23,814 పంక్తులు ఉన్న ఈ మహాకావ్యం నోబెల్‌ ‌పోటీకి వెళ్లింది. అరవిందులు తన తాత్త్వికతకు జన్మస్థానం ఉపనిషత్తులు, భగవద్గీతేనని సవినయంగా చెప్పుకున్నారు. నా యోగ సాధనలో ఓనమాలు అక్కడ నుంచి అందుకున్నవేననీ చెప్పారు. ‘ది లైఫ్‌ ‌డివైన్‌’‌లో రుగ్వేదం, ఉపనిషత్తులు, భగవద్గీతల నుంచే ఎక్కువ ఉల్లేఖించడం కనిపిస్తుంది. ‘సావిత్రి’ కావ్యం ఆధునిక విశ్వసాహిత్యంలో అరవిందుని మహోన్నత వచనకవిగా నిలిపింది. మొత్తం ఆయన రచనలు 36 సంపుటాలలో వెలువరించారు.

అరవిందుడంటే కేవలం అతివాద దృక్పథం నుంచి ఆధ్యాత్మికత వైపు మళ్లిన విప్లవయోగే అనుకోరాదు. ఆయన పుదుచ్చేరిలో ముక్కుమూసుకుని తపస్సు చేసుకోలేదని అర్థమవుతూనే ఉంది. సామాజిక, రాజకీయ జీవనాలకు; ఇందుకు పునాదిగా ఉండే విద్యకు ఆయన తనదైన మార్గదర్శనం చేశారు. వాటిని స్మరించుకోవడమే, ఆచరించడమే ఈ 150వ జయంతి సందర్భంగా మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. జగత్తు మిథ్య కాదు అంటారాయన. దీని మీదనే మొత్తం వారి తాత్త్వికత ఆధారపడి ఉంది. బ్రిటిష్‌ ఇం‌డియా విద్య మనసును తాకలేనిదే కాకుండా, జాతి వ్యతిరేకమైనదని కూడా ఆయన చెప్పారు. మనిషి మనసు ఆధారంగా, భారతీయతను ప్రతిబింబించే విద్య కావాలని ఆకాంక్షించారు. సాంస్కృతిక విలువల ఆధారంగా విద్య బోధించాలని ప్రకటించారు. తన వారపత్రిక ‘కర్మయోగిన్‌’‌లో వీటి గురించి రాసేవారు. వాస్తవికమైన విద్య అంటే స్వేచ్ఛ, సృజనాత్మక వాతావరణంలో చిన్నారులు ఉండాలని అన్నారు. అలాగే విద్య నైతిక విలువలు నేర్పేదై ఉండాలి. ఇలాంటి విద్య మాత్రమే విద్యార్థికి అతడి జీవితంతో, ఆత్మతో, వీటితో పాటు దేశంతో సరైన బంధాన్ని ఏర్పరుస్తుందని చెప్పారు. వారి దృష్టిలో ఈ మూడు ఒక ‘యూనిట్‌’. ‌మరొక అడుగు ముందుకేసి చదువు అంటే మానవుడు, దేశం (ప్రజలు), ప్రపంచ మానవత్వం అని కూడా అన్నారు. ఈ మూడింటి సంబంధాన్ని అర్ధం చేసుకోవడమే ఆధ్యాత్మికత అని నిర్వచించారు. జాతీయ విద్యా విధానం స్ఫూర్తిని కలగచేయడానికీ, ఆధ్యాత్మిక పునాది వేయడానికీ దోహదం చేయగలదని అన్నారు. వీటన్నిటిలోను యోగ సాధన జాడలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఒక చిన్నారి అభిరుచి, ఒక విషయం పట్ల సహజంగా ఏర్పడిన మొగ్గు, మానసిక పరిపక్వత, ప్రవర్తన, తృష్ణ ఆధారంగా వారే కేంద్ర బిందువులుగా విద్య ఉండాలన్నారు అరవిందులు. బిడ్డ తత్త్వం, మానసిక సంసిద్ధత, మానసిక అవసరాల ప్రాతిపదికగా విద్య ఉండాలని కూడా చెప్పారు. ఇవన్నీ ఉన్నా చిన్నారులకు విద్యను అందించే పని మాతృభాషలోనే జరగాలన్నదే ఆయన నిశ్చితాభిప్రాయం. విద్యలో నైతిక, ఆధ్యాత్మిక స్పర్శ లేకుంటే నీతిలేని ఒక తరం రాగలదని హెచ్చరించారు. మామూలు విద్య మేధస్సుకు సంబంధించినదైతే, నైతికాంశాల విద్య హృదయం కోసం ఉద్దేశించినదని అన్నారు.

మతం గురించి అరవిందులు చెప్పిన సూత్రాలు కూడా స్మరణీయాలు. అసత్యం నుంచి విముక్తం చేసేదే మతం అన్నారాయన. మతం అంటే తన కోసం జీవించడం ఒక్కటే కాదు, దేవుని కోసం, మానవత్వం కోసం, దేశం కోసం, ఇతరుల కోసం జీవించడం కూడా. బ్రహ్మచర్యానికీ, దాని ద్వారా వచ్చే మేధస్సుకీ చదువుకీ బంధం ఉందని విశ్వసించారు. బోధన పేరుతో విద్యార్థి మీద ఏదీ రుద్దడం సరికాదని చెప్పారు. గురువు అంటే జ్ఞానసముపార్జనలో ఉన్న విద్యార్ధికి మార్గదర్శిగా మాత్రమే ఉండాలి. అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించి అక్కడికి తరమడం కాదు. జ్ఞానసాధనలో విద్యార్థి సరైన పంథాలో నడిచేటట్టు చేయడమే. అలాగే తల్లిదండ్రుల కోరుకున్న విధంగా తయారయ్యే బొమ్మ కూడా కాదని ఆయన విద్యార్థి గురించి చెప్పారు.

తీవ్రజాతీయవాదులు, లేదా అతివాద జాతీయవాదులు ఈ దేశానికీ, స్వాతంత్య్ర సమరానికీ, ఆలోచనా విధానానికీ చేసిన సేవ నిరుపమానమైనది. కాంగ్రెస్‌ ‌నీడలోకి రానంత మాత్రానే వారి మీద ముద్రలు వేయడం సరికాదు. వారి పోరాటంలో పరిపూర్ణ భారతీయత కోసం రాజీలేని ఆరాటం ఉంది. అది గమనించాలి. అందుకు అరవిందుల జీవితమే నిదర్శనం.

-గోపరాజు

By editor

Twitter
Instagram