ఏటా ఆషాఢశుద్ధ విదియనాడు నిర్వహించే పూరీ జగన్నాథస్వామి రథయాత్ర ప్రపంచ వేడుక. విశ్వరక్షకుడు జగన్నాథుడిని ‘దారుబ్రహ్మ’అంటారు. వేటగాడి బాణ ప్రయోగంతో శ్రీకృష్ణ భగవానుడు అవతార సమాప్తి చేసినప్పుడు ఆత్మ స్వరూపమైన బ్రహ్మ పదార్ధాన్ని ఇంద్రద్యుమ్నుడనే రాజు దారు విగ్రహాలలో నిక్షిప్తం చేసి ప్రతిష్టించాడని పురాణ గాథ. నాటి నుంచి ఈ క్షేత్రం భూలోక వైకుంఠంగా విలసిల్లుతోంది. స్వామి మూర్తి నుంచి ప్రసాద వితరణ వరకు ఎన్నో అంశాలలో ఈ విశిష్టతలు కనిపిస్తాయి.

పూరీని ‘శ్రీ క్షేత్రం’గా వ్యవహరిస్తారు. నీలాచలం, నీలాద్రి, జగన్నాథపురి, పురుషోత్తమ ధామం అనీ అంటారు. శ్రీకృష్ణుడు రుక్మిణీ సత్యభామ సమేతుడుగా కాకుండా అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో జగన్నాథస్వామిగా కొలువుదీరడం ఇక్కడి ప్రత్యేకత. శంకర భగవత్పాదులు, భగవద్రామానుజ యతీంద్రులు, మధ్వాచార్యులు, సిక్కు గురువు గురునానక్‌, శ్రీ‌పాదవల్లభులు, కబీర్‌, ‌తులసీదాస్‌ ‌తదితర మహనీయులెందరో ఈ క్షేత్రాన్ని సందర్శించారు.
శంకరులు దేశం నలుమూలల నెలకొల్పిన నాలుగు పీఠాలలో ఇది ఒకటి. దీనిని ‘భోగవర్థన’ మఠంగా వ్యవహరిస్తారు.పూరీ మఠానికి ‘కర్మ’ క్షేత్రమని పేరు. స్వామి సదా తన కన్నుల ముందే ఉండాలంటూ‘జగన్నాథస్వామి నయన పథగామీ భవతుమే…’ అని జగన్నాథాష్టకంలో శంకరులు స్తుతించారు. భగవద్రామాజులు వైష్ణవ సంప్ర దాయాన్ని ప్రతిష్టించారు. ఆయన ద్వారా దక్షిణాదిని, ప్రత్యేకించి తెలుగునాట ‘జగన్నాథ సేవ’ ప్రాచుర్యం పొందింది. చైతన్య మహా ప్రభువు శేష జీవితం ఇక్కడే గడిపారు. జయదేవుడు స్వామి సన్నిధిలో రచించిన ‘గీత గోవిందం’కావ్యాన్ని ఆయనకే సమర్పించారు.

అలంకరణలు-దివ్యదర్శనం

దారుబ్రహ్మ జగన్నాథుడిని నిత్యం పట్టువస్త్రాలు, పుష్పాలతో అలంకరిస్తారు. శ్రీమహావిష్ణువు అవతరణ పర్వదినాల సందర్భంగా ఆయా అవతారాలలో దర్శనం ఇస్తారు. ఏడాదిలో దాదాపు 34 అలంకారాలలో స్వామి కనువిందు చేస్తారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క రంగు వస్త్రంతో అలంకరి స్తారు. ఆదివారంఎరుపు రంగు,సోమవారం తెలుపు, మంగళవారం పంచరంగుల వస్త్రాలు, బుధవారం పచ్చ, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నలుపు వస్త్రాలతో అలంకరిస్తారు.
జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్నానోత్సవం అనంతరం బలరామజగన్నాథులను గణపతి రూపాలలో అలంకరించడాన్ని ‘గజవేష’ అని, రథయాత్రకు రెండు రోజుల ముందు భక్తులను అనుగ్రహించే దర్శనాన్ని ‘నవయవ్వన వేష’అని, రథయాత్ర నాటి అలంకరణను ‘సునావేష’అని అంటారు. భాద్రపద బహుళ దశమి నాడు వనభోజి అలంకరణలో (అగ్రజుడు బలదేవునితో గోపబాలునిగా వనభోజనానికి వెళ్లినట్లు), ఆ మరునాడు కాళీయమర్దనుడి అలంకారంలో, కార్తిక సోమ వారాలలో హరిహర ఏకతత్త్వానికి ప్రతీకంగా శివకేశవ రూపంలో దర్శనమిస్తారు.

సోదరి కోసం శోభాయాత్ర

పూరీ పేరు విన్నవెంటనే స్ఫురించేది రథయాత్ర. ‘రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే…’ రథంపై ఊరేగే విష్ణుదర్శనంతో పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందునా పూరీ జగన్నాథుడి రథోత్సవం మరింత విశిష్టమైందిగా చెబుతారు.. ఇతర క్షేత్రాలలో ఉత్సవమూర్తులు పురవీధుల్లో విహరిస్తే, ఇక్కడ మూలవిగ్రహాలే తరలి వెళతాయి.ఈ రథయాత్రను సోదరి సుభద్ర పట్ల ప్రేమకు ప్రతీక అని, ఆమెను సంతోషపరచడమే ఈ రథయాత్ర ఉద్దేశమనీ చెబుతారు. బలరామ, కృష్ణులు కంసవధకు బయలుదేరిన ఘట్టం ఈ యాత్రకు నేపథ్యమని, వారితో పాటు వెళ్లాలనుకున్న చెల్లెలి ముచ్చటను ఇలా తీర్చడం ఈ రథయాత్ర నేపథ్యంగా ప్రచారంలో ఉంది. నియమం ‘యాత్ర’ ప్రారంభ•మైన తరువాత ఎట్టి పరిస్థితలులోనూ రథం తిరోగమించ కూడదు. ఈ ‘ఘోషయాత్ర’ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని, ప్రమాదవశాత్తు ఎవరైనా రథం కింద పడినా, దారిలో ఏ దుకాణమైనా అడ్డు వచ్చినా రథం వెనకగడుగు వేసే ప్రసక్తి ఉండదు.

రథత్రయం

ఏ క్షేత్రంలోనైనా స్వామివారి ఊరేగింపునకు శాశ్వత ప్రాతిపదికపై రథాలు వినియోగిస్తే పూరీలో అందుకు భిన్నంగా ఏటా కొత్తవి తయారవుతాయి. ఇతర ఆలయాలలోని దేవదేవేరులు ఒకే రథంలో ఊరేగడం కనిపిస్తే, ఇక్కడి జగన్నాథ, బలభద్ర, సుభద్రలు వేర్వేరు రథాలపై తిరువీథులకేగుతారు. 44 అడుగుల ఎత్తుతో 14 చక్రాలతో గల బలరాముని రథాన్ని ‘తాళధ్వజం’, 43 అడుగుల ఎత్తు12 చక్రాలతో గల సుభద్రాదేవి రథాన్ని ‘పద్మధ్వజం’, 45 అడుగుల ఎత్తు 16 చక్రాలతో గల జగన్నాథస్వామి రథాన్ని ‘నందిఘోష్‌’ అం‌టారు. ప్రతి రథానికి ఎనిమిది అంగుళాల మందం, 250 అడుగుల పొడవు గల తాళ్లను కడతారు. రథయాత్ర ఆరంభానికి ముందు జగన్నాథుడి తొలిసేవకుడు గజపతి మహారాజు తలపై కిరీటాన్ని తీసి నేలపై ఉంచి బంగారు చీపురుతో రథాలను శుభ్రపరచి మంచిగంధం నీటితో కడుగుతారు. ‘యాత్ర’లో బలభద్రుని రథం ముందు భాగంలో, దాని వెంట సోదరి సుభద్ర రథం వెళ్తుంటే జగన్నాథుడి తేరు వాటిని అనుసరిస్తుంది. చెల్లెలిని సు‘భద్రం’గా చూసుకోవాలన్న తత్త్వాన్ని బోధిస్తున్నట్లుంటుంది.
కులం, భాష, సంస్కృతి, లింగ, పేద ధనిక, పండిత-పామర, వయోభేద రహితంగా లక్షలాది మంది ఈ రథయాత్రలో పాల్గొంటారు. రథాన్ని లాగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. రథయాత్ర అశ్లీల పదప్రయోగంతో మొదలవు తుంది. దాహుకా అనే జగన్నాథ సేవకుడు ఇందుకోసం ప్రత్యేకంగా రథం వెంట ఉంటాడు. రథం నెమ్మదిగా సాగుతుండగా ఆగినప్పుడల్లా కొబ్బరికాయలు కొడుతూ లాగుతారు.

సర్వసమానత్వం జగన్నాథీయం

జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. నిత్యం 64 రకాల పిండివంటలను కట్టెలపొయ్యిల మీద మట్టి కుండలలోనే తయారు చేస్తారు. ఒకసారి వాడిని పాత్రను మరోసారి ఉపయోగించరు. కుండమీద కుండపెట్టి అన్నం వండడం, అన్ని పాత్రలలోని పదార్థం ఒకేలా ఉడకడం విశేషమే. మహాప్రసాదం స్వీకరణలో అంటూ సొంటూ ఉండదు.
సర్వ మానవ సమానత్వం, లౌకికతత్వ్తం జగన్నాథుని సిద్ధాంతం. దానిని అవగాహన చేసుకుంటే లోకమంతా అనందమయమవుతుందని, కులమతవర్ణ వైరుధ్యాలకు అతీతమైన సమసమాజం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ స్వామి సన్నిధిలో దర్శనం, అర్చనాదు లలో హెచ్చుతగ్గులు, ‘మహాప్రసాద’ స్వీకరణలో తేడాలు, అంటూ సొంటూ ఉండదు. ఎంగిలి అంటదు. ఆనందబజారులో ఒకే పంక్తిన ప్రసాదాలు అందచేస్తారు. ఎవరైనా వడ్డించవచ్చు. ఎవరైనా తినవచ్చు. ఉదాత్త, ఉత్తమ మనసులతో అరమరికలు లేకుండా అందరూ ఆనందంగా భుజిస్తారు. కనుక•నే ‘సర్వం శ్రీ జగన్నాథం’అనేది వాడుకలోకి వచ్చిందంటారు.

‘జగతి నాలుగు వర్ణముల్‌ ‌సమముచేసి
కుడువ చేసితివౌ!భళా! కుడుచువేళ
యేహ్య మిసుమంతయును లేక సహ్యముగను
శ్రీజగన్నాథ చేసితే చిత్రముగను’ అని వద్దిపర్తి కోనమరాజు కవి కీర్తించారు.

భక్తాధీనుడు దేవదేవుడు

జగన్నాథుడు భక్తపరాయణుడు, భక్తాధీనుడు. భక్త సులభుడు.భక్తి, ఆర్తితో పిలిస్తే అప్రహతిహతంగా సాగే ఆయన రథచక్రాలు ఆగిపోతాయి. అందుకు ప్రచారంలో ఉన్న మన తెలుగు భాగవతోత్తముడి గాథను స్మరించుకుంటే… నేటి విశా•పట్నం జిల్లా సర్వసిద్ధి గ్రామవాసి వద్దిపర్తి కోనమరాజు కవి (1754-1834) బంధుమిత్రులతో పూరీ రథయాత్రకు వెళ్లారు. అక్కడి ‘నరసింహఘాటీ’ వద్ద స్వామివారు ఊరేగింపునకు సిద్ధంగా ఉన్నారు.రథం కదలడానికి ముందే స్వామి వారిని దర్శించు కోవాలన్నది కోనమరాజు పరివారం కోరిక. అప్పట్లో భక్తుల నుంచి కొంతపైకం తీసుకొని అక్కడ స్వామి వారి దర్శనానికి అనుమతించేవారు. డబ్బు చెల్లించడం ఆయనకు ఇష్టంలేదు.చెల్లించకపోవడంతో ఉత్సవ నిర్వాహకులు వారిని అనుమతించలేదు. ‘మాణిక్యపురం మొదట్లో ఉన్నాను. శేషశయనా!అక్కడే ఉండు. నరసింహా! ప్రయాణం మధ్యలో ఉన్నాను. కదలకు. పుణ్యమూర్తీ! రాక్షసాంతకా! జగన్నాథమూర్తీ! పతితపావన బిరుదాంకితుడా! ఈ నీ సేవకుడి మీద దయజూపు. నాకు నీ దర్శనమయ్యేంత వరకు రథాన్ని కదలనీయకు’ అని ఆశువుగా పద్యాలతో ప్రార్థించారు. అంతే…రథం కదలడంలేదు. అటు వేళ మించి పోతోంది. రథం కదలకపోవడానికి కారణం ఏమై ఉంటుందని ఆలయ ప్రధానార్చకుడు ‘మహంతి’, అర్చక స్వాములు ఆలోచనలో, ఆదుర్దాలో పడ్డారు. కవి చెప్పిన పద్యాలే ఇందుకు కారణమని ఆ నోట, ఈ నోట మహంతు చెవికి సోకడంతో ఆయన స్వయంగా కవిగారిని కలిసి విషయం తెలుసు కున్నారు. సుంకం చెల్లించకుండానే స్వామి దర్శనానికి సగౌరంగా ఆహ్వానించారు. అయినా దర్శనానికి కవి సుముఖంగా లేరు. ‘మహంతు మహాశయా! స్వామి దర్శనానికి సుంకం వసూలు నాకు సుతరాము ఇష్టం లేదు. దీనిని పూర్తిగా తీసివేయాలన్నది నా విన్నపం’ అని సమాధానమిచ్చాడు. దర్శన సుంకం రద్దు చేస్తే రాబడి తగ్గిపోతుంది. దీనిపై సత్వరం నిర్ణయం తీసుకోకపోతే రథం కదలదు. ఏమిటి మార్గం? అని ఆలోచించి, ఎట్టకేలకు నరసింహఘాటీ వద్ద సుంకం వసూలును శాశ్వతంగా రద్దు నిర్ణయం తీసుకున్నారట. (నేటికీ అక్కడ ఇదే విధానం కొనసాగుతోంది). ఆ వెంటనే కవిగారు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత రథం కదిలింది. ఇక్కడ కవిగారి భక్తితో పాటు కవితాశక్తి ప్రదర్శితమైందని ఆచార్య కోలవెన్ను మలయవాసిని హృద్యంగా వ్యాఖ్యానించారు.
‘నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే!
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్‌!!’

‌కోలాహలానికి కొవిడ్‌ ఆం‌క్షలు
ఇసుకేస్తే రాలనంతగా భక్తకోటి నిండిపోయే జగన్నాథుడి రథయాత్ర ఈసారీ భక్తులు లేకుండానే ముగియనుంది. గత ఏడాది మాదిరిగానే ఇప్పుడూ గుర్తింపు పొందిన సేవాయత్‌లే రథం పగ్గాలు పడతారు. వారు కోవిడ్‌ ‌టీకాలు వేయించుకున్నట్లు, కరోనా వైరస్‌ ‌లక్షణాలు లేనట్లు ఆర్టీపీసీ పరీక్షా ధ్రువపత్రాలు చూపవలసి ఉంటుందని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కోవిడ్‌ ‌నిబంధనల నేపథ్యంలో ఇతర ప్రాంత యాత్రీకులను అనుమతించరు. రథయాత్రకు (12వ తేదీ) రెండు రోజుల ముందు నుంచే పూరీలోకి బస్సులు, రైళ్ల పోకలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రాష్ట్రంలోని ఇతర జగన్నాథ ఆలయాలలోనూ వేడుకలు అనుమతించబోమని సహాయక చర్యల ప్రత్యేక కమిషనర్‌ ‌స్పష్టం చేశారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram