– క్రాంతి

ప్రాణవాయువు అందక దేశవ్యాప్తంగా జనం చస్తే మాకేం! అసలు ఢిల్లీ ఆసుపత్రుల ప్రాణవాయువు అవసరాలు ఏపాటివో ప్రభుత్వానికే తెలియకపోతేనేం! కోర్టును కూడా పెడతోవ పట్టించి సాధించుకున్న అదనపు ఆక్సిజన్‌ ‌రోగులకు అందక ఢిల్లీలో మరణ మృదంగం మోగితేనేం! ప్రధాని నరేంద్ర మోదీ అపకీర్తి పాలైతే చాలు- కరోనా రెండోదశ ఉత్పాతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ప్రదర్శించిన నీచబుద్ధి సాక్షాత్తు ఇదే. అవసరాలకు మించి నాలుగు రెట్లు ఆక్సిజన్‌ను పోగేసింది ఢిల్లీ ప్రభుత్వం. సుప్రీం కోర్టును కూడా తప్పుదోవ పట్టించింది. ధర్మాసనం ఆదేశాలతో కేంద్రం ఢిల్లీకి 700 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌సరఫరా చేసింది. దీనితో మహారాష్ట్ర సహా సమస్య తీవ్రంగా ఉన్న పన్నెండు రాష్ట్రాలకు తగినంత ఆక్సిజన్‌ ‌సరఫరా జరగలేదు. ఇదంతా సుప్రీం కోర్టు ఆడిట్‌ ‌ప్యానల్‌ ‌నివేదిక బయటపెట్టింది.

కరోనా రెండోదశలో మెడికల్‌ ఆక్సిజన్‌ ‌దొరక్క దేశవ్యాప్తంగా రోగులు, వారి బంధువులు ఎంతగా తల్లడిల్లిపోయారో చూశాం. కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్‌ అం‌దించేందుకు భారీ ఎత్తున కసరత్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశమంతా ఏకతాటిపై నిలిచి కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలి. కానీ కేజ్రీవాల్‌ ఆక్సిజన్‌ను అడ్డుపెట్టు కొని నడిపిన క్ష•ద్ర రాజకీయాలు ఇప్పుడు బయటపడి, దేశం ముందు దోషిగా నిలబడ్డారు. కేజ్రీవాల్‌ ‌కేంద్రంపై ఒత్తిడి రాజకీయాలు చేసి అవసరానికి మించి ఆక్సిజన్‌ ‌సాధించారని సుప్రీం కోర్టు ఆక్సిజన్‌ ఆడిట్‌ ‌ప్యానెల్‌ ‌కమిటి నివేదిక నిగ్గు తేల్చింది.

ఢిల్లీ నేషనల్‌ ‌క్యాపిటల్‌ ‌రీజియన్‌కు 289 మెట్రిక్‌ ‌టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ ‌చాలు. కానీ నాలుగు రెట్లు అధికంగా, 1,140 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌ఢిల్లీ ప్రభుత్వం తీసుకుందని ఆ నివేదిక వెల్లడించింది. ఆ సమయంలో ఢిల్లీ సగటు మెడికల్‌ ఆక్సిజన్‌ ‌వినియోగం 284 టన్నుల నుంచి 372 టన్నుల మధ్యే ఉందని కూడా నివేదిక పేర్కొంది.

అన్నీ తప్పుడు లెక్కలే..

అవసరానికి మించి మెడికల్‌ ఆక్సిజన్‌ ‌రాబట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన లెక్కలన్నీ తప్పేనని సబ్‌ ‌కమిటీ కనుగొంది. కేంద్రం, ఢిల్లీ, ఆసుపత్రులు, పీఈఎస్‌వో, ఆక్సిజన్‌ ‌తయారీ సంస్థల నుండి పత్రాలు సేకరించింది. ఆక్సిజన్‌ ‌వినియోగం, పడకల సామర్థ్యం ఫార్మ్యులా ఆధారంగా లెక్కించినప్పుడు అవసరానికీ, డిమాండ్‌కీ మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆడిట్‌ ‌కమిటీ గుర్తించింది. ఢిల్లీ పరిధిలోని ఆసుపత్రుల్లో 5,500 ఐసీయూ, 18,000 నాన్‌ ఐసీయూ పడకలు ఉన్నట్లు రికార్డులు చెబుతు న్నాయి. కానీ ప్రభుత్వం, ఆసుపత్రులు పంపిన డేటాలో ఎక్కువ పడకలు చూపి అధిక ఆక్సిజన్‌ను డిమాండ్‌ ‌చేసినట్లు తేలింది. నాలుగు ఆసుపత్రులు – సింఘాల్‌ ‌హాస్పిటల్‌, అరుణా అసఫ్‌ అలీ హాస్ప టల్‌, ఈఎస్‌ఐ ‌మోడల్‌ ‌హాస్పిటల్‌, ‌లైఫ్‌రే హాస్పిటల్‌ ‌పడకలు తక్కువే అయినా ఎక్కువ ఆక్సిజన్‌ ‌తీసుకున్నాయి. ఇంకొన్ని ఆసుపత్రులూ తప్పుడు సమాచారమే ఇచ్చాయి. తప్పుడు లెక్కలే కాక, కేంద్ర ఫార్మలా ఆధారంగానే ఈ లెక్కలు కట్టామని బుకాయిస్తోంది ఢిల్లీ సర్కారు. కేందప్రభుత్వ ఫార్ములాను తీసుకున్నా ఢిల్లీలో ఆక్సిజన్‌ ‌డిమాండ్‌ ‌తక్కువగానే కనిపిస్తోంది. వాస్తవ డిమాండ్‌ 209 ‌మెట్రిక్‌ ‌టన్నులు మాత్రమే.

ఢిల్లీలో కేసులు వెల్లువెత్తిన మే 2న కేంద్ర ఫార్ములా ప్రకారం 289 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ అవసరమైంది. కానీ దీనిని ఢిల్లీ ప్రభుత్వం 391 మెట్రిక్‌ ‌టన్నులుగా చూపింది. ఆసుపత్రుల్లో పడక కేటాయించినా, కొవిడ్‌ ‌రోగులందరికీ ఆక్సిజన్‌ అవసరం రాదు. ఆక్సిజన్‌ అవసరం తీరిన తర్వాత కూడా పేషెంట్‌ అదే పడక మీద కొనసాగే అవకాశా లున్నాయి. ఐసీయూతో పాటు నాన్‌ ఐసీయూ పడకలన్నింటికీ ఆక్సిజన్‌ అవసరమని తప్పడు లెక్క కట్టింది ఢిల్లీ ప్రభుత్వం.

న్యాయస్థానం ఆదేశాలతో..

ఢిల్లీ ఆసుపత్రుల వాస్తవ అవసరాల మేరకే కేంద్రం 250 మెట్రిక్‌ ‌టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ ఇచ్చేందుకు సిద్దమైంది. తమకు 700 మెట్రిక్‌ ‌టన్నులు కావాల్సిందేనంటూ కేజ్రీవాల్‌ ‌ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ఆక్సిజన్‌ ‌సరఫరా చేయాలని న్యాయ స్థానం ఆదేశించింది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతుండగానే మే 4వ తేదీన ఢిల్లీ హైకోర్టు కేంద్రం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు వ్యక్తిగతంగా హాజరై సంజాయిషీ చెప్పాలని కేంద్ర ఉన్నతాధికారులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ ‌దాఖలు చేసింది. దీనిపై మే 5న జస్టిస్‌ ‌డి.వై.చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ఎం.ఆర్‌.‌షాల ధర్మాసనం విచారణ చేపట్టి హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది. ‘కరోనా యావద్దేశ విపత్తు. ప్రభుత్వం తాను చేయాల్సింది చేస్తోంది. అయినా ప్రజలు చనిపోతున్నారు. వీటినెవరూ ప్రశ్నించజాలరు. అయితే ప్రాణవాయువు అందించే విషయంలో సహకారం అవసరం. అధికారులను జైల్లో పెట్టినంత మాత్రాన ఆక్సిజన్‌ ‌రాదు’ అని వ్యాఖ్యానించింది. అయితే ఢిల్లీ పరిస్థితులను బట్టి 700 మెట్రిక్‌ ‌టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ విషయంలో తాము కఠిన చర్యలు తీసుకునే పరిస్థితిని రానివ్వొద్దనీ హెచ్చరించింది.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ

ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆక్సిజన్‌ ‌సరఫరా సవ్యంగా, శాస్త్రీయంగా, సమాన ప్రాతిపదికన జరిగేలా చూసేందుకు ప్రధాన ధర్మాసనం స్వయంగా రంగంలోకి దిగింది. జస్టిస్‌ ‌డీవై చంద్రమూడ్‌ ‌నేతృత్వంలో 12 మంది సభ్యులతో మే 28న జాతీయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. ఢిల్లీ ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా నేతృత్వంలో ఆక్సిజన్‌ ఆడిట్‌ ‌ప్యానెల్‌ ఏర్పాటు చేశారు. ప్రతి రాష్ట్రానికి సరఫరా అవుతున్న ఆక్సిజన్‌పై నిపుణుల కమిటీ ఆడిట్‌ ‌నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ‌పరిధిలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఐదుగురితో ఉపసంఘం నియమించారు.

ఢిల్లీ తీరుతో మహారాష్ట్రకు అన్యాయం

వాస్తవానికి రెండోదశ తీవ్రంగా ఉన్న ఏప్రిల్‌, ‌మే మాసాల్లో ఢిల్లీ కన్నా మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో సమానంగా ముంబైలో 9,000 యాక్టివ్‌ ‌కేసులు నమోదు కాగా అక్కడ 250 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌వినియోగించారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం నాలుగు రెట్లు అధికంగా 976 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. పైగా తమకు ఆక్సిజన్‌ ‌సరిపోడం లేదని రోజుకు 700 టన్నుల ఆక్సిజన్‌ ‌కావాలని కేజ్రీవాల్‌ ‌ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ మేరకే సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. వాస్తవానికి ఆ సమయంలో ఢిల్లీలో సగటు వినియోగ 284-372 టన్నుల మధ్య ఉంది.

కేజ్రీవాల్‌ ‌బాధ్యత వహించాలి

కేజ్రీవాల్‌ ‌ప్రభుత్వ కక్కుర్తిని ఆడిట్‌ ‌ప్యానల్‌ ‌బయట పెట్టడంతో బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ కమిటీ నివేదికపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ ‌పాత్ర స్పందిస్తూ.. ‘ఇది పూర్తిగా నేరపూరిత నిర్లక్ష్యమే. కేజ్రీవాల్‌ ‌ఘోరమైన నేరానికి పాల్పడ్డారు. దీని మూల్యం ఎంతో మనం ఊహించుకోవచ్చు. కొవిడ్‌ ‌నియంత్రణలో తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్రంపై మోపేందుకు కేజ్రీవాల్‌ ‌రాజకీయాలకు పాల్పడ్డారని ఈ నివేదిక చూస్తే అర్థమవుతోంది’అని ధ్వజమెత్తారు. ఆక్సిజన్‌ ‌కొరత కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, దానికి కేజ్రీవాల్‌ ‌బాధ్యత వహించాలని అన్నారు. మరో బీజేపీ నేత బీఎల్‌ ‌సంతోష్‌ ‌ట్విటర్‌ ‌వేదికగా స్పందిస్తూ వేలమంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిన కేజ్రీవాల్‌ ‌దేశానికి క్షమాపణలు చెప్పాలని కోరారు. అయితే ఆప్‌ ‌సర్కారు మాత్రం తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా తమ చర్యలను సమర్ధించుకుంది. ఆడిట్‌ ‌కమిటీనే తప్పు పట్టింది. అలాంటి నివేదిక ఏదీ రాలేదనీ అవన్నీ బీజేపీ లెక్కలని వ్యాఖ్యానించింది.

ఆక్సిజన్‌ ‌చోరీ

అవసరానికి మించి మెడికల్‌ ఆక్సిజన్‌ ‌పోగేయడమే కాదు, పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సిన అక్సిజన్‌ను దొంగచాటుగా ఎత్తుకెళ్లిన అపవాదును కూడా ఎదుర్కొంది ఢిల్లీ సర్కారు. ఏప్రిల్‌ 20‌వ తేదీన హరియాణాలోని ఫరీదాబాద్‌కు వెళుతున్న ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌ను ఢిల్లీ అధికారులు దారి మళ్లించారని హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ ‌విజ్‌ ఈ ‌సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఇలాంటి పనులకు పాల్పడితే ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి ఆక్సిజన్‌ ‌తీసుకొస్తున్న వాహనాలక పోలీసు భద్రత కల్పిస్తున్నట్లు అనిల్‌ ‌విజ్‌ ‌చెప్పడం ఢిల్లీకి చెంపపెట్టు.

ఢిల్లీలో రోగుల బలి

అవసరానికి మించి ఢిల్లీకి మెడికల్‌ ఆక్సిజన్‌ను అందించినా, దాన్ని సకాలంలో ఆసుత్రులకు చేరవేయడంలో కేజ్రీవాల్‌ ‌సర్కారు విఫలమైంది. ఈ కారణంగా రోగులు బలైపోయారు. ఏప్రిల్‌22‌వ తేదీన గంగారామ్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ‌సరిపడా లేక 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ వద్ద కేవలం రెండు గంటలకు సరిపడా ఆక్సిజన్‌ ‌మాత్రమే ఉందని, అదీ అయిపోతే రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయని ఆసుపత్రి అత్యవసర సందేశం పంపింది. ప్రభుత్వం రెండు ట్యాంకర్లు పంపింది. ఆక్సిజన్‌ ‌నిండుకోక ముందే పంపి ఉంటే మరి కొన్ని ప్రాణాలు దక్కేవని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఆ మరునాడే, ఏప్రిల్‌ 23‌వ తేదీ రాత్రి ఢిల్లీలోనే జైపూర్‌ ‌గోల్డెన్‌ ఆస్పత్రిలో 20 మంది కొవిడ్‌ ‌రోగులు మృత్యవాత పడ్డారు. ‘ఆరోజు సాయంత్రం 5 గంటల వరకే 3,600 లీటర్ల ఆక్సిజన్‌ ఆసుపత్రికి చేరాల్సి ఉంది. కానీ అర్ధరాత్రి 12 గంటలకు 1500 లీటర్ల ఆక్సిజన్‌ ‌మాత్రమే ఆసుపత్రికి చేరింది. 7 గంటలు ఆలస్యంగా ప్రాణవాయువు రావడంతో రోగులు ప్రాణాలు కోల్పోయారు’ అని ఆసుపత్రి మెడికల్‌ ‌డైరెక్టర్‌ ‌డా.బలూజా పేర్కొన్నారు.

మోదీ ఆగ్రహం.. కేజ్రీ క్షమాపణ

ప్రచార కండూతితో కేజ్రీవాల్‌ ‌ప్రధాని మోదీ ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌ ‌సమావేశం జరిపారు. ఆమ్‌ఆద్మీ పార్టీ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతోంది. ఇన్‌హౌస్‌ ‌మీటింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమే. ఇది సంప్రదాయానికి విరుద్ధం కదా!’ అన్నారు మోదీ. దీనితో కేజ్రీవాల్‌ ఇబ్బందుల్లో పడ్డారు. తప్పు జరిగితే క్షమించాలని, ఇకపై జాగ్రత్తగా ఉంటామని కేజ్రీవాల్‌ ‌వివరణ ఇచ్చుకున్నారు.

పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ ‌సరఫరా

రెండోదశలో వచ్చిన వేరియంట్‌ ‌గతంలో కన్నా ఎక్కువ ప్రమాదకారి కావడంతో మరిన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థపై ఈ వేరియంట్‌ అధిక ప్రభావం చూపింది. కృత్రిమంగా మెడికల్‌ ఆక్సిజన్‌ అం‌దించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక్కసారిగా ఆసుపత్రుల్లో రోగులు పెరిగిపోవడంతో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. డాక్టర్లు రాత్రింబవళ్లూ శ్రమించినా ఆక్సిజన్‌ ‌తగినంత అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు పోయాయి. ఇదే అదనుగా ప్రతిపక్షాలు కేంద్రం మీద విమర్శల దాడిని పెంచాయి.

నిజానికి కరోనా రెండోదశను ముందే అంచనా వేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో అదనంగా ఆక్సిజన్‌ ‌ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి గత ఏడాది అక్టోబర్‌లో బిడ్స్ ఆహ్వానించింది. ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. 162 సంస్థలకు కేంద్రం అనుమతులు కూడా ఇచ్చింది. అన్ని రాష్ట్రాలను కూడా ఆక్సిజన్‌ ‌ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని ముందుగానే హెచ్చరించింది. కానీ చాలా రాష్ట్రాలు ఆశ్రద్ధ చేయడంతో ఎంతో ప్రాణనష్టం జరగింది.

ఆక్సిజన్‌ ‌కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. దేశంలోని తొమ్మిది పరిశ్రమలు మినహా మిగతావి ఆక్సిజన్‌ ‌వినియోగించడంపై ప్రభుత్వ ఎంపవర్డ్ ‌గ్రూప్‌-2 ‌నిషేధం విధించింది. మరో మూడు నెలలపాటు ఆక్సిజన్‌, ‌దానికి సంబంధించిన పరికరాల దిగుమతులపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. విదేశాల నుంచి కూడా ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. మొత్తం 50 వేల మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌దిగుమతులకు చర్యలు తీసుకుంది. మెడికల్‌ ఆక్సిజన్‌ను అన్ని రాష్ట్రాలకు వేగంగా సరఫరా చేసేందుకు కేంద్రం ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ‌రైళ్లు కూడా నడుపుతోంది. ఖాళీ కంటైనర్లను త్వరగా ప్లాంట్‌ ‌దగ్గరకు చేర్చడానికి వైమానిక దళం సాయం కూడా తీసుకుంటోంది.

లిక్విడ్‌ ఆక్సిజన్‌ ‌నీలిరంగులో ఉండే తేలికపాటి వాయువు. చాలా చల్లగా ఉండే క్రయోజెనిక్‌ ‌గ్యాస్‌. 183 ‌సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో ఉంటుంది. దీనిని ప్రత్యేక సిలిండర్లలో, ట్యాంకర్లలో నిల్వ చేస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 500 పరిశ్రమలు గాలి నుంచి ఆక్సిజన్‌ ‌తయారీ, శుద్ధి చేస్తున్నాయి. తర్వాత దానిని ద్రవరూపంలోకి మార్చి ఆసుపత్రులకు పంపిస్తాయి. దీనిని ఎక్కువగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆసుపత్రుల్లోని ఆక్సిజన్‌ ‌ట్యాంకర్లలో దీనిని నింపి రోగుల పడకల వరకూ పైపుల ద్వారా సరఫరా చేస్తారు.

ఆసుపత్రుల్లో పర్యవేక్షణ కమిటీలు

భవిష్యత్తులో పెరిగే ఆక్సిజన్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అందుకు తగ్గట్టు సమాయత్తం కావాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ‌ఫోర్స్ (ఎన్‌టీఎఫ్‌) ‌సూచించింది. పెట్రోలియం ఉత్పత్తుల తరహాలో దేశంలో 2-3 వారాలకు సరిపడా వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేసుకోవాలని సిఫార్సు చేసింది. ఆసుపత్రుల్లో ప్రాణవాయువు పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. భవిష్యత్తులో ప్రాణవాయువు సంబంధిత సమస్యలు తలెత్తకుండా నివారించేందుకుగాను పలు సిఫార్సులతో నివేదికను రూపొందించింది. ఆ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. దేశంలో గత ఏడాది ఏప్రిల్‌లో రోజుకు సగటున 902 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఏర్పడిందని నివేదికలో ఎన్‌టీఎఫ్‌ ‌పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాత్రం రోజువారీ అవసరం 4,923 మెట్రిక్‌ ‌టన్నులకు పెరిగిందని తెలిపింది. మే 9 నాటికి అది గరిష్ఠంగా 8,943 మెట్రిక్‌ ‌టన్నులను తాకినట్లు వెల్లడించింది. ప్రాణవాయువు కొరతను అధిగమించేందుకు కేంద్రం వ్యవహరించిన తీరును అభినందించడం దీనికి కొసమెరుపు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram