అస్సాంలో ఏళ్ల తరబడి బంగ్లాదేశీ చొరబాటుదారుల కబ్జాలో ఉన్న ధార్మిక సంస్థల భూములు విముక్తమవుతున్నాయి. అస్సాం భూమిని, భాషా సంస్కృతులను చొరబాటు దారుల బారి నుంచి కాపాడతామనీ, ఆక్రమణదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకుంటామనీ ఎన్నికల్లో బీజేపీ వాగ్దానం చేసింది. బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో ఈ హామీని నెరవేర్చే కార్యాచరణ చేపట్టారు కొత్త ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ. కాజీరంగా అభయారణ్యం నుంచి కూడా బంగ్లాదేశీ చొరబాటుదారులను ఏరివేసే కార్యక్రమం మొదలైంది. ఆక్రమణలపై హిమంత ఉక్కుపాదం మోపడంతో చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరోవైపు పేదరికం నుంచి బయట పడేందుకు మైనారిటీలు కుటుంబ నియంత్రణ పాటించాలని హిమంత పిలుపునిచ్చారు. ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ సంతానం కలవారికి ప్రభుత్వ పథకాలు వర్తించవని ప్రకటించారు.

జూన్‌ 7‌వ తేదీ. అస్సాంలోని దరంగ్‌ ‌జిల్లా సిపాజార్‌లోని గోరుఖుటికి బయలుదేరారు హిమంత. ధోల్‌పూర్‌ ‌శిబో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతాన్ని ఆయన వెంటనే సందర్శించడానికి ప్రత్యేక కారణం ఉంది. ఇచ్చిన ఓ ప్రధాన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా పడిన అడుగు అది. ఒక కొండపై ఉన్న శివాలయ దర్శనం కోసం సాధారణ పడవలో ప్రయాణించారు. అక్కడ భోళా శంకరునికి పూజలు చేశారు.

వందల ఏళ్లనాటి ఈ ప్రాచీన శివమందిరానికి 180 బిఘాల భూమి ఉంది. కానీ అందులో 120 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. బంగ్లాదేశ్‌ ‌నుంచి అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కబ్జా చేసేశారు. ఏళ్ల తరబడి చొరబాటుదారులు అప్పనంగా అనుభవిస్తున్న ఈ ఆలయ భూములను విముక్తి చేస్తున్నట్లు ప్రకటించారు హిమంత. జిల్లా యంత్రాంగం, పోలీసులు ఆ భూములలోని అక్రమ కట్టడాలను కూల్చారు. ఈ విషయాన్ని సోషల్‌ ‌మీడియా ద్వారా ప్రకటించారు ముఖ్యమంత్రి.

ఈ చరిత్రాత్మక ఆలయాన్ని పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని శివ మందిర నిర్వహణ కమిటీకి ఆయన హామీ ఇచ్చారు. మణికట్‌ (‌గర్భగుడి) ఏర్పాటు చేస్తామని, అతిథిగృహం నిర్మించి సరిహద్దు గోడలు నిర్మిస్తామని చెప్పారు. ఆలయభూమిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా సంపాదించాలో నిర్ణయించే అధికారం కమిటీకే ఉంటుందని శర్మ చెప్పారు కూడా. ఈ ఆలయాన్ని పర్యాటక ఆకర్షణగా మార్చడానికి, దాని పవిత్రతను కాపాడటానికి ప్రభుత్వంతో చేతులు కలపాలని సమాజంలోని అన్ని వర్గాలను కోరారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అస్సాం ప్రజలు వరుసగా రెండోసారి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయ భూములు, సత్రాలు (మఠాలు), ప్రభుత్వ భూములను బంగ్లాదేశీ చొరబాటుదారుల కబ్జాల నుంచి విముక్తి చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.

అస్సాంలో హైందవ ధర్మజాగరణలో ప్రధాన భూమిక శ్రీమంత శంకరదేవ్‌ ‌మహాపురుషునిది. సెప్టెంబర్‌ 26, 1449‌న నాగావ్‌ ‌జిల్లా వటధృవ (బర్దువా)లో కుసుంబర్‌ ‌భూయాన్‌, ‌సత్యసంధ్య దంపతులకు జన్మించారు. అస్సాంలో వైష్ణవ భక్తి ఉద్యమాన్ని వ్యాపింపజేసిన శ్రీమంత గొప్ప సాధువు మాత్రమే కాదు, భాషా పండితుడు, నాటకకర్త, సంగీత విద్వాంసుడు, సాంఘిక, సాంస్క ృతిక సంస్కర్త.

శంకర్‌దేవ్‌ ‌పుట్టింది అస్సాంలోని సంప్రదాయ బారో-భూయాన్స్, ‌భూస్వామ్య కుటుంబంలో. అయినా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. వారసత్వంగా వచ్చిన అలీపుఖురి శిరోమణి (చీఫ్‌) ‌బాధ్యత చేపట్టేందుకు తిరస్కరించారు. దేశంలోని పూరి, మధుర, ద్వారక, బృందావన్‌, ‌గయా, రామేశ్వరం, అయోధ్య, సీతాకుండ్‌ ‌తదితర పుణ్యక్షేత్రా లను సందర్శించారు. తీర్థయాత్రలో భాగంగా పూరి లోని జగన్నాథ్‌ ‌క్షేత్రంలో ఎక్కువ కాలం గడిపారు.

శంకర్‌దేవ్‌ ‌పాఠశాలకు వెళ్లే 12 ఏళ్ల వయసులోనే విష్ణు-కరటాల కమల కమల దళ నయనా స్తుతిని రచించారు. అంకియా నాట్‌, ‌సత్రియా నృత్యాల ద్వారా కీర్తన్‌ ‌ఘోసా, గుణమాల పద్య రూపక కీర్తనలు ప్రచారం చేశారు. ఇందులో ఎక్కువగా రాముడు, కృష్ణుని జీవితాలను వర్ణించారు. శంకర్‌దేవ్‌ ఇతర రచనలు చిహ్నాజాత్రా, కలియా డామన్‌, ‌పట్ని ప్రసాద్‌, ‌కేలి గోపాల్‌, ‌రుక్మిణి హరన్‌, ‌పారిజత్‌ ‌హరన్‌, ‌రంబిజయ్‌ ‌నాట్‌ అస్సామీ భాషలో ఎంతో ప్రసిద్ధి పొందాయి.

వైష్ణవ సాధువుగా ప్రసిద్ధి పొందిన శంకరదేవ్‌ ‘ఏక్‌ ‌శరణియా నామ్‌ ‌ధర్మ’ ప్రచారం చేశారు. ఏకశరణ భాగవతీ ధర్మంగా ఇది ప్రసిద్ధి పొందింది. 120 సంవత్సరాలు జీవించిన ఈ మహాపురుషుడు ఆగస్ట్ 23, 1568‌న కూచ్‌ ‌బిహార్‌లోని భేలాడోండాలో విష్ణు సాయుజ్యం పొందారు. తదనంతరం ఆయన ముఖ్య శిష్యుడు మాధవ్‌దేవ్‌ ఈ ‌ధర్మప్రచార వ్యాప్తి కోసం కృషి చేశారు. ఆయన రచనలు నామ్‌ ‌ఘోసా, భక్తిరత్న ప్రసిద్ధి పొందాయి.

అస్సాంలోని గ్రామ గ్రామాన నామ్‌ఘర్‌ ‌పేరిట ఆలయాలు కనిపిస్తాయి. వీటిలో విగ్రహాలకు బదులు శ్రీమంత శంకరదేవ్‌ ‌రచనలు, భాగవత గ్రంథాలు కనిపిస్తాయి.అక్కడి ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా భాగవతాన్ని పూజిస్తారు. ఏకశరణ భాగవతీ ధర్మ ప్రచారం కోసం ఎంతో మంది రాజులు, జమీందారు లతో పాటు సామాన్యులు కూడా భూములు ఇచ్చారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో ధర్మప్రచారం చేయాలని నిర్దేశించారు. వీటిని సత్రాలు (మఠాలు)గా పిలుస్తారు. అస్సాం ప్రజల మత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవన కేంద్రాలుగా ఇవి అభివృద్ధి చెందాయి. శ్రీమంత శంకరదేవ్‌ ‌పుట్టిన బర్దువాతో పాటు చివరిరోజులు గడిపిన బర్‌పేటలో నామ్‌ఘర్‌ ‌సత్రాలు ఉన్నాయి. జోర్హాట్‌ ‌జిల్లా బ్రహ్మపుత్ర నదీ మాధులీ ద్వీపంలో ఇలాంటి నాలుగు సత్రాలు ఉన్నాయి.

అస్సాంలో బంగ్లాదేశీయుల చొరబాట్లు కొత్తేమీ కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచే ఇవి మొదలయ్యాయి. సరిహద్దులు దాటి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించే ఈ చొరబాటుదారుల కారణంగా జనాభా, మత, సాంస్కృతిక సమతౌల్యం దెబ్బతిన్నది. ఈ విదేశీ చొరబాటుదారులను అడ్డుకోవాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ ‌తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ సమస్యను పట్టించుకోలేదు. పైగా చొరబాటుదారులకు అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చింది. ఈ కారణంగా చొరబాటుదారులు స్థానికులుగా చెలామణి అవుతూ రాష్ట్ర రాజకీయలపై ప్రభావం చూపించే శక్తిగా ఎదిగారు.

బంగ్లాదేశ్‌ ‌నుంచి అస్సాంలోకి ప్రవేశించే చొరబాటుదారులు సరిహద్దు జిల్లాలోని గ్రామాలకు గ్రామలనే అక్రమించి దాదాపు రాష్ట్రం మధ్యవరకూ వచ్చేశారు. స్థానిక అటవీ, ప్రభుత్వ భూములతో పాటు దేవాలయాల మాన్యాలను కూడా వదలకుండా కబ్జా చేస్తూ వచ్చారు. ఇందులో శంకర్‌దేవ్‌ ‌వారసత్వ చిహ్నాలైన నామ్‌ఘర్‌ ‌సత్రం భూములు కూడా చాలా ఉన్నాయి. ఈ భూముల్లో ఇళ్లు కట్టుకోవడంతో పాటు వందలు, వేల ఎకరాల్లో వ్యవసాయం ఆరంభించారు. ఈ దురాగతాన్ని ఎవరు ఎదురించినా, ఆక్రమిత భూముల్లోకి ప్రవేశించినా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. దీన్ని బట్టి బంగ్లాదేశీ చొరబాటుదారుల మనస్తత్వం ఎంత క్రూరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

బంగ్లాదేశీ అక్రమచొరబాటుదారులు కాజీరంగా అభయారణ్యాన్ని కూడా వదలలేదు. పెద్ద సంఖ్యలో గ్రామాలు వెలిశాయి. ఖడ్గమృగాలకు ఖ్యాతిగాంచిన ఆ ప్రాంతానికి ఈ కబ్జాలతో ముప్పు ఏర్పడింది. ఆసియాలో అస్సాంలో తప్ప ఎక్కడా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు కనిపించవు. వీటిని చొరబాటుదారులు చంపి కొమ్ములను విదేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ కొమ్ములకు చైనా, థాయిలాండ్‌లలో కోట్ల రూపాయల ధర పలుకుతుంది. కాజీరంగా అభయాణ్యంలో ఏళ్ల తరబడి తిష్టేసిన బంగ్లా చొరబాటుదారుల ఏరివేత కూడా మొదలైంది.

గత 60-70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేని పని ఇది. ధోల్‌పూర్‌ ‌శిబో మందిర్‌ ‌భూములతో పాటు ఇప్పటి వరకూ 600 ఎకరాల భూములకు విముక్తి కలిగింది. ఇందులో చొరబాటుదారుల పార్టీ ఆల్‌ ఇం‌డియా డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌ ‌నేత బజురుద్దీన్‌ అజ్మల్‌ అ‌క్రమించిన భూములు కూడా ఉన్నాయి. అజ్మల్‌ ఆ‌క్రమించిన అస్సాం రబ్బర్‌ ‌కార్పోరేషన్‌కు చెందిన 280 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటికి రెండు హెలిప్యాడ్స్ ఉం‌టాయి. హెలికాప్టర్‌ ‌ద్వారా ఎన్నికల ప్రచారం చేసే స్థాయికి ఎదిగాడు అంటే బజురుద్దీన్‌ ‌ప్రభావం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పేదరికం తగ్గాలంటే జనాభాను నియంత్రించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించాలి. దురదృష్టవశాత్తు సంతృష్టీకరణ రాజకీయాల కారణంగా కుటుంబ నియంత్రణ హిందువులకే పరిమితమైంది. మైనారిటీలకు ఇది అవసరం లేదు అన్నట్లుగా కుహనా లౌకికవాద పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌వారిని పోత్సహిస్తూ వచ్చాయి. మత పరంగా జనాభా పెంచుకోడానికి వారికి ఉపయోగపడ్డా, అధిక సంతానాన్ని పోషించలేక, వారి భవిష్యత్తుకు న్యాయం చేయలేక పోతున్నారు. ఈ కారణంగానే ఎన్నో ముస్లిం కుటుంబాలు పేదరికంతో ఇబ్బంది పడుతున్నాయి.

తన పాలనకు 30 రోజులు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలోనే హిమంత మైనారిటీలు కుటుంబ నియంత్రణ పాటించాలని కోరారు. మైనారిటీల పేదరికం తగ్గించడానికి సహకరించాలని కోరారు. జనాభా సమస్యను పరిష్కరించేందుకు మైనారిటీ మహిళలను ప్రభుత్వం చైతన్యపరుస్తుందని చెప్పారు. మైనారిటీ వర్గాల నేతలు ఆత్మావలోకనం చేసుకోవాలని కుటుంబ నియంత్రణ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని కోరారు. ఇది మాటలకే పరిమితం చేయడం లేదు హిమంత. కఠిన చర్యలకు ఉద్యుక్తులయ్యారు కూడా. జనాభా పెరుగుదలకు కళ్లెం వేయడమే లక్ష్యంగా ఇద్దరు సంతానం ఉన్న కుటుంబాలకే ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కొన్ని పథకాలకు మాత్రమే ‘ఇద్దరు సంతానం’ నియమాన్ని అమలుచేస్తామని, క్రమంగా అన్ని ప్రభుత్వ పథకాలకూ తప్పనిసరి చేస్తామని స్పష్టం చేశారు. పాఠశాల, కళాశాలల్లో ఉచిత ప్రవేశం, ప్రధాన మంత్రి ఆవాస్‌ ‌యోజన వంటి పథకాలకు ఈ నియమాన్ని వర్తింపచేయడం లేదు.

హిమంత ధోరణి సహజంగానే చొరబాటుదారుల పార్టీ ఎఐయుడిఎఫ్‌కు రుచించలేదు. బీజేపీ తమ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అమీనుల్‌ ఇస్లాం అంటున్నారు. చిత్రంగా ప్రజలకు సరైన విద్య లభిస్తే అధిక జనాభా తగ్గుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హిమంత చెప్పింది ఇదే. కానీ వలసదారు కాబట్టి అమీనుల్‌ ‌భుజాలు తడుముకున్నాడు.

నిజానికి కుటుంబ నియంత్రణ గురించి హిమంత కొత్తగా చెప్పడం లేదు. పంచాయతీ ఎన్నికలు, సహకార, మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మించి ఉంటే అనర్హులే. కుటుంబ నియంత్రణ చట్టాలు కాంగ్రెస్‌ ‌పార్టీ హయంలోనే రూపొందాయి. అమలులో మాత్రం మెజారిటీ ప్రజలకు పరిమితం చేశాయి. ఇది మైనారిటీలకు కూడా అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. విపక్షాలు కూడా హిమంత వ్యాఖ్యలను వివాదాస్పదం చేయాలని ఉత్సాహం చూపాయి. కానీ సాగలేదు. అస్సాంలో భూ ఆక్రమణలకు, ఈ అధిక జనాభాకు ఉన్న సంబంధాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram