నేను ప్రేమించేది మొదట నా దేశాన్ని. తరవాతే ఎవరినైనా !

ఆ మాట ప్రియాతిప్రియమైన ఎమిలీకి సుభాస్‌ ‌ముందే చెప్పాడు.

వియన్నా ప్రవాసంలో సుభాస్‌కూ, అతడి సెక్రటరీగా పనిచేసిన ఎమిలీకీ నడుమ 1934 మధ్యలో చిగురించిన ప్రేమ మరుసటి సంవత్సరం అతడికి మేజర్‌ ఆపరేషన్‌ అయి కోలుకుంటున్న సమయాన పరాకాష్ఠకు చేరిందో లేదో సుభాస్‌ను దేశం పిలిచింది. అప్పుడు వెళ్ళిన వాడు ఏణ్ణర్థం తరవాత తిరిగివచ్చి 1937 డిసెంబరులో ఆమెను గాంధర్వవివాహం చేసుకున్నాడు. అప్పుడైనా వారు కలిసి అన్యోన్యంగా గడిపింది కొద్దిరోజులే. కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్ష బాధ్యత స్వీకరించటానికి అతడు ఇండియా వెళ్ళిపోయిన తరవాత మళ్ళీ దంపతు లిద్దరూ కలుసుకున్నది 1941 ఏప్రిల్‌లో బెర్లిన్లోనే. అక్కడ వారు కలిసి కాపురం చేసింది నిండా ఏణ్ణర్థం లేదు. ప్రేమకు ప్రతిరూపంగా గర్భం వచ్చిన తరవాత ఎమిలీ కాన్పు కోసం వియన్నాలో పుట్టింటికి వెళ్ళింది. 1942 నవంబర్‌ 29‌న ఆడపిల్లను కన్నది. నెల తరవాత సుభాస్‌ ‌వియన్నా వెళ్ళి బిడ్డను చూశాడు. ముద్దుల కూతురికి అనిత అని పేరుపెట్టాడు. క్రిస్టమస్‌కు కుటుంబంతో హాయిగా గడిపి తిరిగివచ్చిన కొద్ది రోజులకే బోస్‌ని మళ్ళీ దేశం పిలిచింది.

తూర్పుకు తిరిగివెళ్ళి మాతృదేశ విముక్తి కోసం పోరాడాలని సంవత్సరంగా నేతాజీ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు నెరవేరాయి. తమ గుప్పిట్లో ఇమడని బోస్‌ను తూర్పుకు రానివ్వకుండా ఏడాదికిపైగా మోకాలడ్డిన జపాన్‌ అతడొస్తే గానీ పరిస్థితులు చక్కబడవని అర్థమయ్యాక ఎట్టకేలకు 1943 జనవరి మధ్యలో గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. జర్మనీ తీరం నుంచి ఆఫ్రికా దక్షిణపు అంచు వరకూ బోస్‌ని జర్మన్‌ ‌జలాంతర్గామిలో పంపించి, అక్కడి నుంచి జపాన్‌ ‌సబ్‌ ‌మెరైన్‌లో తీసుకువెళ్లాలని ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ సంగతి బయటకి పొక్కితే ప్రమాదం. కాబట్టి ప్రయాణాన్ని అతిరహస్యంగా ఉంచారు.

ఉన్న కాసిని రోజులూ భర్తతో గడపటానికి జనవరి 20న వియన్నా నుంచి ఎమిలీ వచ్చింది. జర్మనీ వదిలేముందు చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉండటంతో సుభాస్‌కే తీరిక దొరకటం కష్టమైంది. అతడు బెర్లిన్‌లోనే ఉన్నట్టు లోకానికి కనిపించాలి. కాబట్టి అతడు వెళ్ళిపోయాక ప్రసారం చేయటానికి భారత ప్రజలను ఉద్దేశించిన రేడియో ప్రసంగాలు అనేకం ముందే రికార్డు చేసి పెట్టారు. కొద్దిరోజులు రష్యన్‌ ‌యుద్ధరంగానికి వెళ్ళి రావాలని అనుకుంటు న్నట్టు కొద్దిమందితో నేతాజీ కావాలనే జనాంతికంగా అన్నాడు. జనవరి 26న భారత స్వాతంత్య్ర దినాన్ని యథాప్రకారం బెర్లిన్‌లో ఇండియన్‌ ‌లీజన్‌ ‌సైనికుల కవాతు నడుమ వైభవంగా జరిపారు. అదే జర్మనీలో బోస్‌ ఆఖరి పబ్లిక్‌ ‌ఫంక్షన్‌.

‌నెలాఖరులో జర్మన్‌ ‌నౌకాదళ అధికారులు నేతాజీ నివాసానికి వచ్చి వైద్యపరీక్షలు జరిపారు. చేయబోయే ప్రయాణం ఎంత ప్రమాదభరితమో వివరించి ‘‘ఇంకోసారి ఆలోచించుకోండి. క్షేమంగా గమ్యం చేరే అవకాశం 5 శాతం కంటే తక్కువ’’ అని హెచ్చరించారు. నేతాజీ నవ్వేసి ఊరుకున్నాడు.

బోస్‌ ‌తన వెంట ముగ్గురు సహాయకులను తీసుకు వెళ్ళాలనుకున్నాడు. ఒకరికి మించి చోటు ఉండదని జపాన్‌ ‌వారు చెప్పారు. దాంతో తన సహాయకుడిగా ఆబిద్‌ ‌హసన్‌ ‌సఫ్రానీని ఎంచుకున్నాడు. అతడు మన హైదరాబాద్‌ ‌కుర్రాడు. బెర్లిన్లో ఇంజనీరింగ్‌ ‌చదువుతూ నేతాజీ ప్రభావంలో పడ్డాడు. ఇండియన్‌ ‌లీజన్‌ ‌లో మిలిటరీ శిక్షణ పొందుతున్నాడు. నేతాజీ ఒకరోజు అతడిని పిలిపించి ‘ప్రాణానికి చాలా ప్రమాదం ఉండే ప్రయాణానికి సిద్ధమా?’ అని అడిగాడు. అతడు వెంటనే ఒప్పేసుకున్నాడు. తను ఎక్కడికి వెళ్ళేదీ అతడికి చివరి నిమిషానికి కూడా తెలియదు. నేతాజీ వెంట వెళ్ళబోతున్నట్టు అసలే ఎరుగడు.

ఫిబ్రవరి 7 ఉదయం ఇంటి నుంచి బయలుదేరే ముందు ఎమిలీ చేతికి సుభాస్‌ ఒక ఉత్తరం ఇచ్చాడు. ‘‘ఇది మా అన్నయ్య శరత్‌కు రాసిన ఉత్తరం. ఎప్పుడో కలిసినప్పుడు ఆయన చేతికే ఇవ్వు. జాగ్రత్త’’ అన్నాడు. అందులో రాసింది ఇది.

‘‘అన్నయ్యా! నేను ఇంకోసారి ప్రమాదపు దారిలో వెళ్తున్నాను. అయితే ఈ మారు ఇంటివైపు. నేను గమ్యం చేరలేకపోవచ్చు. అలాంటిది ఏమైనా జరిగితే నేను మళ్ళీ ఈ జన్మలో కబురుపంపలేనేమో! అందుకే నా కబురును ఇక్కడే వదిలి వెళ్తున్నాను. ఎప్పుడో నీకు అందుతుంది. నేను ఇక్కడ పెళ్ళి చేసుకున్నాను. నాకొక కూతురు ఉంది. నామీద నువ్వు జీవితాంతం చూపిన ప్రేమనే నేను లేకపోయినా నా భార్యాబిడ్డల మీద చూపించు’’

ఎమిలీ గుడ్లనీరు కుక్కుకుంటూ గుమ్మం దగ్గరే ఆగిపోయింది. దూర ప్రయాణం చేయబోతున్నట్టు బయటికి పొక్కకూడదు కాబట్టి రైల్వేస్టేషను దాకా వెళ్ళి వీడ్కోలు ఇచ్చే వీలులేదు. తొమ్మిదేళ్ళ వారి ప్రణయానికి, రెండేళ్ళ దాంపత్యానికి అదే ముగింపు. మళ్ళీ వారు కలవరు.

 బెర్లిన్‌ ‌నుంచి రైల్లో ప్రయాణించి నేతాజీ మర్నాడు వేకువజామున జర్మనీ ఉత్తర తీరాన కీల్‌ ‌రేవుపట్నం చేరాడు. జర్మన్‌ ‌విదేశాంగ శాఖ ఉన్నతాధి కారులు వెర్త్, ‌కెప్లర్‌లు, జర్మనీలో కుడిభుజంగా పనిచేసిన ఎ.సి.ఎన్‌. ‌నంబియార్‌ ‌హార్బరు దాకా వెంట వెళ్ళి వీడ్కోలు ఇచ్చారు. కమాండర్‌ ‌మూసెన్‌ ‌బెర్గ్ ‌నేతాజీని సాదరంగా స్వాగతించి మోటార్‌ ‌లాంచిలో సబ్‌ ‌మెరైన్‌ ‌దగ్గరికి తీసుకువెళ్ళాడు. తెరిచి ఉన్న పై మూతలోంచి బోస్‌, ‌హసన్‌ ‌లోపలికి ప్రవేశించిన కొద్దిసేపటికే జలాంతర్గామి బయలుదేరింది.

అలా 1943 ఫిబ్రవరి 8 తెల్లవారుజామున కీల్‌ ‌రేవు దాటిన నేతాజీకి ఏకంగా మూడునెలలపాటు సముద్రజలాలే లోకం. సాగర గర్భమే నిత్యనివాసం.

అవి రెండో ప్రపంచ యుద్ధం చండ ప్రచండంగా చెలరేగుతున్న రోజులు. అందులో నే, నింగి, నీటిలో ఇతరత్రా సాగుతున్న సమరాలన్నీ ఒక ఎత్తు. అట్లాంటిక్‌ ‌మహాసముద్ర సంగ్రామం ఇంకో ఎత్తు. ప్రపంచ నౌకాయుద్ధాల చరిత్ర మొత్తంలో అంత భారీస్థాయిలో అంత దీర్ఘకాలం అంత సంక్లిష్టంగా సాగిన యుద్ధం మరొకటి లేదు. వివిధ దేశాల్లోని రణ రంగాలకు వస్తు, ఆయుధ, ఆహార సరఫరాలను తీసుకువెళ్ళే మిత్రరాజ్యాల నౌకలను జర్మన్ల Unterseeboot సబ్మరైన్లు వరసబెట్టి ముంచేస్తూ 1942నుంచీ బ్రిటిష్‌ ‌మహాసామ్రాజ్య మహానౌకా శక్తిని గడగడలాడిస్తున్నాయి. ఈ బెడద నుంచి బయట పడితే తప్ప యుద్ధంలో గెలుపు కల్ల అని మిత్రరాజ్యాలకు అర్థమయింది. బ్రిటిష్‌, అమెరికన్‌ ‌యుద్ధ నౌకలు కనిపిస్తే చాలు ధ్వంసం చేయటానికి అంటర్‌ ‌సీబూట్లు వేటాడుతూంటే – శత్రువు జాడ ఎక్కడ కనిపిస్తే అక్కడ తడాఖా చూపించటానికి బ్రిటిష్‌, అమెరికన్‌ ‌యుద్ధ విమానాలు ఆకాశంలో, యుద్ధనౌకలు సముద్రజలాల్లో వెయ్యికళ్ళతో గాలిస్తున్నాయి. సముద్రగర్భం లోంచి వెళ్ళే జలాంతర్గాములను ఆ దారిలోనే కడతేర్చటానికి మిత్రరాజ్యాలు సముద్రపు లోతుల్లో మందుపాతరలను తమకు వీలున్న చోట్లన్నిటా అమర్చాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా బాంబులు పేలతాయి. జలాంతర్గామికి, దానిలోని వారికి జలసమాధి అవుతుంది.

అలా సముద్రాలు మహోద్రిక్తంగా ఉన్న భీకర యుద్ధ సమయంలో నేతాజీ సుభాస్‌ ‌చంద్ర బోస్‌ అట్లాంటిక్‌, ‌హిందూ సముద్రాల గుండా రెండు ఖండాల మీదుగా తొమ్మిది వేల కిలోమీటర్ల ప్రమాద భరిత ప్రయాణానికి U-180 సబ్‌ ‌మరైన్లో ఆకుపచ్చ రంగు కెప్టెన్‌ ‌యూనిఫాం వేసుకుని బయలుదేరాడు.

నేతాజీ వి.వి.ఐ.పి. కావటం వల్లనేమో ఆయన హోదాకి తగ్గట్టు ఏడెనిమిది జలాంతర్గాములు బారులు తీరి కీల్‌ ‌రేవునుంచి డెన్మార్క్ ‌దాకా ఎస్కార్ట్‌గా అనుసరించాయి. దారిన నీటి లోతుల్లో పేలుడుపాతరలేమైనా ఉంటే కనిపెట్టి ఏరివేయటానికి ఒక మైన్‌ ‌స్వీపర్‌ ‌పైలట్‌లా ముందు నడిచింది. ఆ ప్రాంతాలన్నిటా జర్మన్‌ ‌నౌకా, విమాన దళాలదే సర్వాధిపత్యం. కనక జలాంతర్గాములన్నీ ఉపరితలం మీదే దర్జాగా పయనించాయి. నేతాజీ, హసన్‌ ‌లు బ్రిడ్జి మీదనుంచి సముద్రసోయగాలను తిలకించారు. తటస్థ దేశమైన స్వీడన్‌ ‌మీదుగా వెళ్ళేటప్పుడు మాత్రమే తీరం లోని వారెవరైనా గుర్తుపట్టకుండా నేతాజీ లోనికి వెళ్ళాడు.

ఉత్తర స్కాట్లాండ్‌, ఐస్‌ ‌ల్యాండ్‌ల మధ్య ప్రాంతంలోకి అడుగుపెట్టాక ప్రమాదాలతో పందెం మొదలైంది. అటుకేసి శత్రు జలాంతర్గాములు రాకుండా బ్రిటిషువారు ఆ జలమార్గం పొడవునా సముద్రపు లోతుల్లో బాంబులు అమర్చారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న మందుపాతరలు పేలతాయి. జలాంతర్గామిలోని వారు జల సమాధి అవుతారు. అందుకని ఐస్‌ ‌ల్యాండ్‌ , ఉత్తర స్కాట్లాండ్‌ ‌లను బైపాస్‌ ‌చేసి, బ్రిటిష్‌ ‌యుద్ధ విమానాల డేగ కళ్ళకు చిక్కకుండా ఉత్తరానికి మళ్ళీ ఫారో దీవులకు ఉత్తరదిశగా పెద్ద చుట్టు తిరిగి U బోటు ఉత్తర సముద్రాన్ని చేరుకుంది.

ఎముకలు కొరికే చలి; భయానకమైన ఉత్తర అట్లాంటిక్‌ ‌వాతావరణం; పొంచి ఉన్న బ్రిటిష్‌ ‌గస్తీ నావలు; గద్దల్లా తిరిగే శత్రు విమానాలు .. వీటిని తట్టుకుంటూ ముందుకు వెళ్ళటం కత్తిమీద సాము. పగటిపూట ప్రయాణం ప్రమాదం కాబట్టి సముద్రపు అడుగునే ఉన్నచోట మునిగి ఉండాలి. రాత్రిపూటే పైకి తేలటం. సరిగా అదే సమయంలో ఏకంగా పదిరోజులపాటు పెద్ద తుపాను. సబ్‌ ‌జీరో టెంపరేచరులో సబ్‌ ‌మెరైన్‌ ‌డెక్‌ ‌గన్‌ ‌మంచుముద్దలా కొయ్యబారి పోయింది. సముద్రపు అట్టడుగున బితుకుబితుకుమన్న నావికులకు ప్రాణాలతో బయటపడగలమా అన్న భయం పట్టుకుంది. అతి తీవ్రమైన 12వ స్థాయిలో ప్రచండంగా వీస్తున్న సముద్రపు గాలులకు ఎదురు వెళ్ళుతూ, బ్రిటిష్‌ ‌రాయల్‌ ‌నేవీ పెట్టిన మందుపాతరలను ఒడుపుగా తప్పించుకుంటూ కమాండర్‌ ‌మూసెన్‌ ‌బెర్గ్ ‌గొప్ప చాకచక్యంతో ధైర్యంగా నావను నడిపాడు. అప్పటి వాతావరణ పరిస్థితుల్లో, అట్లాంటిక్‌ ‌యుద్ధం భీకరంగా నడుస్తున్న సమయాన జలాంతర్గామిని క్షేమంగా నడిపించటం గొప్ప ఫీటు.

యుద్ధ కాలంలో జర్మన్లు నిర్మించిన Unterseeboot లు అన్నిటికంటే U-180 వేగంగా వెళుతుంది. అది శక్తివంతమైన ఆరు మర్సిడేస్‌ ‌బెంజి డీజీల్‌ ఇం‌జిన్ల మీద నడుస్తుంది. దాని వేగం సముద్ర ఉపరితలం మీద గంటకు 33 కిలోమీటర్లు. సాగరగర్భంలో గంటకు 14 కిలోమీటర్లు. మనకాలపు న్యూక్లియర్‌ ‌సబ్‌ ‌మెరైన్ల వలె ఎన్ని నెలలపాటైనా నీటి కింది నుంచి దూసుకుపోగల టెక్నాలజీ అప్పుడు లేదు. నీటి దిగువన ప్రయాణానికి బాటరీలు వాడేవారు. వాటిని ఎప్పటికప్పుడు చార్జింగ్‌ ‌చేసుకోవాలి. దానికోసం వీలు దొరికినప్పుడల్లా ఉపరితలం మీదికి తేలి డీజిల్‌ ఇం‌జన్ల మీద నడిపి బాటరీలను చార్జి చేసుకునేవారు.

 ప్రయాణం పైనుంచి అయినా అడుగునుంచి అయినా ప్రయాణికులకు మాత్రం బాహ్యప్రపంచంతో సంబంధం ఉండదు. పగలు, రాత్రి తేడా తెలియదు. ఎల్లవేళలా నాలుగు గోడలమధ్యనే వారిది ఇరుకు బతుకు. గాలికీ, నీటికీ కటకటే. స్నానం, షేవింగుల ముచ్చటే లేదు. ఉన్న కొద్దిపాటి నీటినీ, ఆహారపదార్థాలనే రేషను ప్రకారం ఆచి తూచి వాడుకోవాలి. అవికూడా రుచిగా ఉండవు. పైగా తినే రొట్టెల నుంచి పడుకునే దుప్పట్ల దాకా ఎక్కడ చూసినా డీజిల్‌ ‌కంపు. చుట్టూ బాంబుల మోతల మధ్య, గజగజ వణికించే చలిలో, సముద్రపు అడుగున, దరీ దాపూ కానని స్థితిలో, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడపటం ఆ రకమైన జీవితం అలవాటులేని మనుషులకు యమయాతన. జైల్లో ఏకాంత నిర్బంధం కంటే దుర్భరమైన శిక్ష . ఒకటీ రెండూ కాదు ఏకంగా 93 రోజులపాటు! అయినా నేతాజీ స్థైర్యం చెక్కుచెదరలేదు. బెర్లిన్‌లో విలాసవంత మైన విల్లాలో సుఖించినప్పుడూ జలాంతర్గామిలో మగ్గినప్పుడూ ఆయన ఒకేవిధంగా ఉన్నాడు. అప్పుడూ ఇప్పుడూ ఆయన ధ్యాసంతా దేశం మీద.

U-180 పొడవు రెండు రైలు బోగీలంత. ఉన్నది ఒకటే నడవా. దానికి ఒక పక్క పడుకునే బంకులు. ఆఫీసర్లకు ఒక పక్క. దిగువ సిబ్బందికి ఇంకో పక్క. నేతాజీకి ఆఫీసర్ల వైపు, హసన్‌కి సిబ్బంది వైపు బంకులు కేటాయించారు. వాటినీ నడవాను వేరు చేస్తూ పార్టీషను ఏమీ ఉండదు. ఎవరికైనా ఉండేదల్లా పడుకోవటానికి సరిపడా చోటు. ఆ పక్కనే మనుషులు ఎల్లవేళలా నడుస్తుంటారు. కాబట్టి మరుగు అనేది ఉండదు. ఆఫీసర్లు విడతల వారీగా భోజనం చేయటానికి ఆరు కుర్చీలు, బల్ల ఉన్నాయి. మిగతావారు బంకులో కంచం చేతిలో పట్టుకుని తినాలి. అన్ని బాపతులూ కలిపి మొత్తం 63 మంది నావికులు. వారి వైద్య చికిత్సకు ఒక డాక్టరు. సబ్‌ ‌మెరైన్‌లో పని చేసే వారివి ఎప్పుడూ రెండే రెండు భంగిమలు. పని చేసే చోట నిలబడి ; లేదా బంకులో అడ్డంగా పడుకుని!

నేతాజీ స్థితప్రజ్ఞుడు కాబట్టి ఎక్కడైనా ఎలా ఉన్నా సర్దుకుపోగలడు. సహాయకుడు హసన్‌ ‌పాతికేళ్ళ కుర్రాడు. అంత పరిణతి లేదు. లోపలికి అడుగు పెడుతూనే ముక్కులు పగిలే డీజిల్‌ ‌కంపు, హాయిగా ఒళ్ళు విరుచుకోవటానికి కూడా జాగా లేని ఇరుకు బతుకు, పగలూ రాత్రీ తేడా తెలియని, బయటి ప్రపంచంతో సంబంధం లేని చెర లాంటి అరలో ఎలా ఉండాలి? అని బెంబేలు పడ్డాడు. జిడ్డు బారిన డబ్బా మాంసం, గట్టి రొట్టెలు తినలేక అతడు చాలా అవస్థ పడ్డాడు. సిబ్బందిని మంచి చేసుకుని సామాన్ల గదిలో వెతికితే బియ్యం, కందిపప్పు మూటలు కనపడ్డాయి. జర్మన్లు ఎప్పుడో తప్ప అన్నం, పప్పు తినరు. నేతాజీ కోసం అంటే ఉన్న సరుకును ఇచ్చేశారు. హసన్‌ ‌కిచిడీ వండి పెడితే బోస్‌ ‌బాగుందంటూ జర్మన్లను కూడా పిలిచి మరీ తినిపించే వాడు. ఇలా పందేరాలు పెడుతూ పోతే మన కెలా అని హసన్‌ ‌గింజుకునేవాడు. ఉన్నదేదో అందరితో పంచుకోవాలనే నేతాజీకి దాచుకోవటాలు గిట్టవు.

సబ్‌ ‌మెరైన్‌లో ప్రయాణం అంటే హాయిగా కొన్ని వారాలు విహారయాత్రలా సరదాగా గడిపెయ్యొచ్చని హసన్‌ అనుకున్నాడు. లోపలికి వెళ్ళి కాస్త స్థిమిత పడగానే ‘ఏదీ టైపు రైటర్‌ ‌తీసుకో’ అన్నాడు నాయకుడు. సహాయకుడు ఉసూరుమన్నాడు. అది మొదలు సముద్ర ప్రయాణం సాగినన్ని రోజులూ పని.. పని.. పని! 1920 నుంచి భారత జాతీయోద్యమ ప్రస్థానాన్ని చిత్రీకరిస్తూ 1934 వియన్నా ప్రవాసంలో తాను సాధికారికంగా రాసిన సుప్రసిద్ధ గ్రంథం The Indian Struggleకు 1934 నుంచి 1943 వరకూ పరిణామాలను జోడించి సుభాస్‌ ‌బోస్‌ అప్‌ ‌డేట్‌ ‌చేశాడు. 1934లో తొలి గ్రంథం రాసినప్పటి లాగే ఇప్పుడూ బోస్‌ ‌దగ్గర రిఫరెన్స్ ‌పుస్తకాలు, డాక్యుమెంట్లు, ఇతర ఆకరాలు ఏవీలేవు. పూర్తిగా తన జ్ఞాపకం మీద ఆధారపడి ఆయన ఆశువుగా చెప్పుకుంటూ పోతే హసన్‌ ‌ముందు కాగితం మీద రాసుకుని టైప్‌ ‌చేసేవాడు. దానిని మళ్ళీ నేతాజీ సరి చూసి తప్పులు దిద్దేవాడు. సబ్‌ ‌మెరైన్‌ ‌బ్రిటిషు వాళ్ళ వలలకు, నిఘాలకు దొరకకుండా చుట్టు దారిన ఫ్రాన్స్ ‌పడమటి తీరం చేరేసరికి గ్రంథ రచన పూర్తయింది. బ్రెస్ట్ ‌రేవులో ఇంధనం నింపుకోవ టానికి, అవసరమైన సరుకులు తీసుకోవటానికి U బోటు ఆగింది. అక్కడే తన పుస్తకం రాతప్రతిని వియన్నాలో అర్ధాంగి ఎమిలీకి, కొన్ని ఉత్తరాలు బెర్లిన్‌ ‌సహచరులకు నేతాజీ పోస్టు చేశాడు. యూరప్‌ ‌ఖండంలో అదే ఆయన చిట్టచివరి మజిలీ.

ఆ తరవాత నేతాజీ తూర్పు వెళ్ళాక ఎలా పనిచేయాలన్న దాని మీద ధ్యాస పెట్టాడు. జపాన్‌ ‌ప్రధాని టోజోతో ఎలా మాట్లాడాలి, ఏమి అడగాలి, అతడు వెయబోయే ప్రశ్నలకు ఏమి జవాబు ఇవ్వాలి, కావలసింది ఎలా సాధించాలి అన్న వాటిపై పెద్ద కసరత్తు చేశాడు. అందులో భాగంగా హసన్‌ ‌తో రోల్‌ ‌ప్లే చేసేవాడు. నువ్వే టోజో అనుకో. ఎలా ఆలోచిస్తావ్‌? ‌నన్ను ఏమి అడుగుతావ్‌? ‌నేను చెప్పేదానికి ఎలా స్పందిస్తావ్‌? ఆలోచించు. అలాగే మాట్లాడు- అనేవాడు. ఆ రకంగా వారి రిహార్సల్‌లో చాలా ప్రశ్నలు వచ్చాయి. బోలెడు సమస్యలు ముందుగా ఊహించబడ్డాయి. తరవాత కాలంలో అవి నిజమయ్యాయి. అన్నిటికీ ముందే సిద్ధపడి నందువల్ల నేతాజీ దేనికీ కలవరపడలేదు. ఊహించని సవాలు అంటూ ఆయనకి టోజో సహా ఎవరినుంచీ ఎదురుకాలేదు. తాను జన్మలో అడుగు పెట్టని తూర్పు ఆసియాలో, తానూ ఏనాడూ చూడని విదేశీ పాలకులతో, తనకు అలవాటులేని సైనిక సంగ్రామ విషయంలో ఎదురవబోయే సవాళ్ళను ముందే కచ్చితంగా ఊహించగలగటం ఆషామాషీ ప్రజ్ఞ కాదు.

అలాగే రంగం లోకి దిగాక తాను వేయబోయే ప్రతి అడుగునూ, చేయబోయే ప్రతి ప్రకటననూ, అమలుపరచే ప్రతి విధానాన్నీ నేతాజీ కడు జాగ్రత్తగా యోచించాడు. బంకులో రాత్రులు ఎనిమిది గంటలపాటు పడుకున్నా అర్ధరాత్రి దాటాక 2 గంటలకు ముందు ఏనాడూ నిద్ర పోలేదు. మళ్ళీ ఉదయం 6 గంటలకు ముందే లేచేవాడు. నిద్రలోనూ మెలకువలోనూ స్వాతంత్య్ర యుద్ధం గురించే తలపోసేవాడు. స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం స్వరూపం ఎలా ఉండాలి, అందులో ఏఏ విభాగాలు ఉండాలి, వాటి వాటి బాధ్యతలు ఏమిటి, ఆర్ధిక సైనిక పరిపాలనా వ్యవస్థలను ఎలా పని చేయించాలి అన్నవి నేతాజీ కూలంకషంగా ఆలో చించాడు. వివిధ సందర్భాలలో వెలువరించబోయే విధాన ఘోషణ పత్రాలను, చేయబోయే ప్రకటనలను, ఇవ్వబోయే ప్రసంగాలను బహు జాగ్రత్తగా రూపొందించుకున్నాడు. వాటిని ఒకటి తరవాత ఒకటిగా నేతాజీ చెపుతూంటే హసన్‌ ‌రాసుకునే వాడు. టైప్‌ ‌చేశాక నాయకుడు సరి చూసి టైపింగులో తప్పులను దిద్దేవాడు. ఫైనల్‌ ‌కాపీలను ఒక సారి చదువుకుని చించి పారేసేవాడు. అయ్యో ఇప్పటిదాకా పడ్డ కష్టమంతా వృథా అయిందే అని హసన్‌ ‌బాధ పడేవాడు. అతడికి తెలియనిది ఏమిటంటే ఒకసారి మనసులో కూర్పు చేసుకున్నాక మళ్ళీ కాగితాల అవసరం నేతాజీకి ఉండదు.

తరవాతి రోజుల్లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు గురించి సింగపూర్‌ ‌లో ప్రకటన చేసేటప్పుడు నేతాజీ స్పీడు చూసి ఆయన ప్రచార శాఖ మంత్రి ఎస్‌.ఎ. అయ్యర్‌ ‌నోరు వెళ్ళబెట్టాడు. రైటింగ్‌ ‌పాడ్‌ ‌తీసుకుని చకచక రాసి ఒక్కో కాగితం పూర్తవగానే టైప్‌కు ఇచ్చాడు. టైప్‌ అయ్యాక ఒక్క పదమూ మార్చవలసిన అవసరం పడలేదు. ‘‘అది చూస్తుంటే ఆ ప్రకటన పాఠమంతటినీ ఆయన ఎప్పుడో రాసుకుని జ్ఞాపకం నుంచి దాన్ని మళ్ళీ కాగితం మీద పెట్టినట్టు నాకు తోచింది’’ అంటాడు తన Unto Him a Witness గ్రంథం 64వ పేజీలో ఎస్‌.ఎ.అయ్యర్‌.

‌సముద్రపు అడుగున ఆ ప్రకటన రూపు దిద్దుకున్న వైనం అతడు ఎరగడు.

మిగతా వచ్చేవారం…

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram