-సాయి

– ‌రూ.6.29 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ
– పిల్లల ఆరోగ్యం, వైద్యరంగాలకు అగ్రస్థానం
– రూ.1.10 లక్షల కోట్లు వైద్య సదుపాయాలకే
– అప్పు తీసుకున్న వారి తరఫున ప్రభుత్వం పూచీ
– ‘మైక్రోఫైనాన్స్’‌కు రూ. 1.25 లక్షల కోట్ల రుణం
– విస్తృతమైన అత్యవసర పరపతి హామీ పథకం
– ఎరువుల సబ్సిడీ పెంపుతో రైతుకు చేయూత

కొవిడ్‌ ‌వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ప్రయత్నంలో భాగంగా ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌ప్యాకేజీ అనంతరం మరో భారీ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 17 అంశాలతో కూడిన 6.29 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇంత భారీ ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ప్రకటించినప్పటికి దీనికి రావాల్సినంత ప్రాచుర్యం రావటంలేదు. ప్రచార మాధ్యమాలు కూడా తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. పాలకపక్షం నాయకులు కూడా దీని గురించి ఆశించినంతమేర మాట్లాడటం లేదు, ప్రజలకు ఈ ప్రత్యేక ప్యాకేజీ గురించి వివరించే ప్రయత్నం చేయట్లేదనే వాదన బలంగా వినిపిస్తున్నది.

జూన్‌ 28‌న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించిన ప్యాకేజీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలకు ఒకింత ఉపశమనం కల్పించి, దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచి, ఉపాధి అవకాశాలను, ఉత్పత్తిని పెంచే దిశగా చేసిన ప్రయత్నం. దీనికి సాధారణంగా మంచిస్పందన రావాలి. కానీ దేశంలో నెలకొన్న ప్రత్యేక వాతావరణం వల్ల ఆశించిన మేర ప్రచారం, స్పందన లభించలేదు. ప్రభుత్వం ఏం చేసినా విమర్శించే, అందులో లోపాలు వెతికి అనవసర రాద్ధాంతం చేసే వర్గాలు కూడా ఈ ప్యాకేజీ విషయంలో ఘాటైన విమర్శలు చేయలేదనే విషయాన్ని గమనించాలి. విషయాన్ని లోతుగా పరిశీలించకుండా ప్రజాకర్షక సలహాలను ఇచ్చే మేధావులు, ఆర్థికవేత్తలు కొందరు ఈ ప్యాకేజీ పట్ల పెదవి విరిచారు.

ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజీ వైద్యరంగం, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధతో అవసరమైన సదుపాయాలను పటిష్టపరచటానికి ఉద్దేశించినది. ఇందులో ఆవశ్యక వర్గాలకు బ్యాంకులు, ఇతర ఆర్థికసంస్థల ద్వారా రుణ సౌకర్యం కల్పించటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కేవలం రుణాలు ఇవ్వమని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆదేశాలు ఇవ్వలేదు. రుణగ్రహీతల పక్షాన 1.10 లక్షల కోట్లకు పూచీకత్తు ఇచ్చారు. అంటే, ఈ 1.10 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు అర్హులకు అప్పు ఇచ్చినప్పుడు ఏ కారణం చేతనైనా అప్పు తీసుక్నువారు తిరిగి బ్యాంకుకు/ఆర్థికసంస్థకు చెల్లించలేకపోతే వారి పక్షాన ఆ అప్పును ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఈ లక్షా పదివేల కోట్లలో 50వేల కోట్లు కేవలం వైద్యరంగానికే కేటాయించారు. దేశంలో 8 ప్రధాన మెట్రోపాలిటన్‌ ‌నగరాలు మినహా మిగతా ప్రాంతాల్లో వైద్యసౌకర్యాలు కల్పించటానికి ఈ రుణం పొందవచ్చు. ఈ సౌకర్యం కేవలం నూతన సంస్థలకే కాక, ఇప్పటికే వైద్యరంగంలో సేవలందిస్తున్న సంస్థలు తమ సేవల విస్తరణకు కూడా పొందవచ్చు. ఈ పథకం కింద దాదాపు 100 కోట్ల వరకు అప్పు తీసుకోవచ్చు. ప్రభుత్వం తన హామీని మూడు సంవత్సరాల వరకు కొనసాగిస్తుంది. అప్పు తీసుకునేవారి నుంచి సంవత్సరానికి 7.95 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన 60వేల కోట్లు ఇతర రంగాల వారికి 8.25 శాతం వడ్డీకి అప్పులు ఇవ్వాలని నిర్దేశించారు. దీనివల్ల తక్కువ వడ్డీకి అప్పు లభ్యమౌ తుంది. కాబట్టి ఆయా రంగాల్లో సదుపాయాలు పెరుగుతాయి. సదుపాయాలు పెరిగితే మరికొంత మంది పనిచేసేవారు అవసరం అవుతారు. దానివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రజలకు నాణ్యమైన సేవలు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది.

అంతేకాదు, గతంలో ఆత్మనిర్భర్‌ ‌ప్యాకేజీలో ప్రవేశపెట్టిన అత్యవసర పరపతి హామీ పథకాన్ని కూడా ప్రభుత్వం మరింత విస్తృతపరిచి దాని కింద మరో 1.50 లక్షల కోట్ల రూపాయలను పారిశ్రామిక, వ్యాపారరంగాల వారికి రుణ సౌకర్యం కల్పించే ఏర్పాటుచేసింది. ఆత్మనిర్భర్‌ ‌ప్యాకేజీలో ఈ పథకానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో దీనిని మరింత పెంచారు. ఆత్మనిర్భర్‌ ‌ప్యాకేజీ ప్రకటించిన స్వల్పకాలంలోనే దీనికింద అనేక దరఖాస్తులు వచ్చాయి. వాటిని త్వరితగతిన పరిశీలించి ఇప్పటికే 2.73 లక్షల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశారు. ప్రభుత్వ పథకాలను ఆక్షేపించేవారు మొదట్లో ఈ పథకం అమలుకు చాలా సమయం పడుతుందని ప్రచారం చేశారు. అయితే వారి అంచనాలకు విరుద్ధంగా అది త్వరితగతిన అమలు జరగటం, 2.73 లక్షల కోట్లకు మంజూరు కూడా లభించటంతో ఖంగుతిన్నారు. తమ విమర్శలను కొనసాగిస్తూ ఇవి కేవలం మంజూరుకే పరిమితమవుతాయని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంచేశారు. అయితే వారి ప్రచారానికి జవాబుగా ఇప్పటికే 2.10 లక్షల కోట్ల రూపాయల రుణాలు వితరణ చేసి డబ్బును రుణగ్రహీతల ఖాతాలకు బదిలీచేయటం, వారు దానిని వినియోగించుకుని తమ కార్యకలాపాలను కొనసాగించటం జరిగింది. అంతేకాదు, గతంలో ఉన్న మూడు కోట్ల గరిష్ట పరిమితిని కూడా 4.50 కోట్లకు పెంచారు. దీనివల్ల దేశంలో 1.10 కోట్లమంది లబ్ధి పొందారు. అయితే, ఈ లబ్ధిదారుల సంఖ్యను దేశ జనాభాతో పోల్చి తక్కువగా చూపించి, దీనిని అల్పమైన పథకంగా చూపించే ప్రయత్నం కూడా చేశారు. ఇటువంటి విషయాలలో అర్హులైన వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఎన్ని? ఎంతమందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది? వంటి విషయాలనే పరిగణనలోనికి తీసుకోవాలన్న విషయం వారికీ తెలుసు. కానీ అలా చేస్తే తమ విమర్శ పసలేనిదిగా తేలిపోతుంది.

ప్రభుత్వం ప్రకటించే హామీ పథకాలు కేవలం ఒక స్థాయి ఉన్న పారిశ్రామిక వర్గాలకే వర్తిస్తాయి. సామాన్య, చిరువ్యాపారులకి వర్తించవని, చిరు వ్యాపారులు అనేకమంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేస్తారు. లేదా సూక్ష్మరుణ సంస్థల నుంచి అప్పు తీసుకుంటారు. అటువంటి వారికి ప్రభుత్వ తోడ్పాటు అవసరం కాబట్టి వారికోసం 1.25 లక్షల కోట్ల రూపాయల హామీ పథకాన్ని కేంద్రం ప్రకటిం చింది. మైక్రో ఫైనాన్స్ ‌సంస్థలు చిరువ్యాపారులకి అందించే రుణాలకు ప్రభుత్వం హామీ ఇవ్వటానికి 1.25 లక్షల కోట్ల రూపాయల పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం వల్ల చిరు వ్యాపారులకి తక్కువ వడ్డీకి రుణసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక గ్రూపులు తమ సభ్యులకి అప్పులిచ్చి వారిలో కొంతమంది తిరిగి చెల్లించలేకపోవటం వల్ల కొన్ని మైక్రోఫైనాన్స్ ‌సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని అవసరమైన వారికి రుణాలు ఇవ్వలేక పోతున్నాయి. తాజా నిర్ణయంతో అటువంటి సంస్థలు కూడా ఆర్థిక వనరులను సమకూర్చుకుని అవసరమైన వారికి రుణసౌకర్యం కల్పించవచ్చు.

గతంలో MSME సంస్థలను గుర్తించటంలో కూడా అనేక ఇబ్బందులు ఉండేవి. వీటిని, ముఖ్యంగా చిన్న, సూక్ష్మ సంస్థలను ప్రత్యేకంగా రిజిష్టర్‌ ‌చేసుకునే నిబంధన కాని, చట్టంకాని లేదు. ఈ సంస్థలను గుర్తించి, నమోదు చేసుకోవటానికి ప్రత్యేక వ్యవస్థ లేదు. ఈ సంస్థల సమగ్ర సమాచారం ప్రభుత్వాల వద్ద లేదు. అయితే ఆత్మనిర్భర్‌ ‌ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఈ సంస్థల గుర్తింపు, నమోదుకుMSME Udyam అనే పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందించి, ఇటువంటి సంస్థలను నమోదు చేయటమే కాక వాటికి అందుతున్న వివిధ రకాల సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, రుణసౌకర్యం తదితర అంశాలను సేకరిస్తున్నది. సమగ్ర సాధికార సమాచారం లేకపోవటం వల్ల నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా సర్వేలపై ఆధారపడవలసి వస్తున్నది. రకరకాల సంస్థలు అనేక సర్వేలు చేసి నివేదికలు సమర్పించాయి. కాని వాటిలోని గణాంకాల విశ్వసనీయత మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. ఉదాహరణకి ఇటీవల ఒక సంస్థ జరిపిన సర్వేలో చిన్న, సూక్ష్మ సంస్థల ఉత్పత్తి కొవిడ్‌ ‌వల్ల సగటున 75 శాతం నుంచి 13 శాతానికి తగ్గిపోయిందని తెలియజేశారు. దాదాపు 11 కోట్లమందికి పైగా ఉపాధి కల్పించే రంగంలో ఉత్పత్తి ఇంతగా తగ్గిపోయిందంటే ఆందోళన చెందవలసిన అంశమే. మనదేశంలో జరిగే మొత్తం వస్తువుల ఉత్పత్తిలో ఈ రంగం నుంచే 45 శాతం వస్తుంది. అలాగే మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేసే వస్తువులలో 48 శాతం చిన్న, సూక్ష్మ సంస్థల నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇంత కీలక రంగం ఇంతటి సంక్షోభం ఎదుర్కొంటున్నదంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే కొవిడ్‌ ‌సమయంలో కూడా మన వినిమయం ఇంత భారీగా తగ్గలేదు. అలాగే ఎగుమతులు కూడా మరీ భారీగా తగ్గిపో లేదు. దేశంలోను, అంతర్జాతీయ మార్కెట్లలోనూ వినిమయం, డిమాండు తగ్గనప్పుడు ఉత్పత్తి అంతగా ఎలా పడిపోతుంది? అందుకని సర్వే ఎప్పుడు చేశారు, ఏ సంస్థ చేసింది, వారు తీసుకున్న నమూన ఎటువంటిది. ఏ లక్ష్యంతో ఈ సర్వే నిర్వహించారు. సమాచారాన్ని ఎలా, ఎవరి వద్ద నుంచి సేకరించారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు ఉంటాయని గుర్తించే ప్రభుత్వం నేరుగా ఈ సంస్థల నుంచి సమాచారం సేకరించటానికే ఒక పోర్టల్‌ను రూపొందించింది. ప్రస్తుతానికి దీనిలో నమోదు చేసుకోవటం ఈ సంస్థలకి కచ్చితం కానప్పటికి ఈ దిశగా ఒక ప్రయత్నం మాత్రం మొదలైంది.
చిన్న సంస్థలకు చెల్లించవలసిన బకాయిలు త్వరితగతిన చెల్లించటానికి, వారికి తక్కువ వడ్డీకి రుణాలు కల్పించటానికి ఆత్మనిర్భర్‌ ‌ప్యాకేజీలో తగు చర్యలు తీసుకున్నారు. చిన్న, సూక్ష్మ సంస్థలకు అవసరమైన రుణ సౌకర్యం కల్పించటానికి గత సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు ఆత్మనిర్భర్‌ ‌ప్యాకేజీ కింద, ఈ సంవత్సరం మరో 2.6 లక్షల కోట్ల రూపాయలు.. మొత్తం 5.6 లక్షల కోట్ల రూపాయల రుణ సౌకర్యం కల్పించటానికి బ్యాంకులకి ఈ సంస్థల పక్షాన ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం తన ఖజానా నుంచి ఖర్చుపెట్టకుండా బ్యాంకులను ఆదేశించి ప్యాకేజీ ప్రకటించటం సరైనది కాదని కొంతమంది వాదన. అయితే అవసరమైన వారికి సాయం ఏ రూపంలో అందించాలో ఆలోచించి, దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఏది ఉపయుక్తమో ఆ పద్ధతిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యాంకులలోని సొమ్ము కూడా ప్రజలదే, కాబట్టి వాటిని కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యతే. అలాగే ప్రభుత్వ ఖజానాకి కూడా ప్రజల నుంచే డబ్బు వస్తుంది. దానిని సక్రమంగా వినియోగించటం కూడా ప్రభుత్వ బాధ్యతే. అందుకని అవసరమైన సంస్థలకు అప్పురూపంలో సాయం అందేలా నిర్ణయం తీసుకుంది. బ్యాంకులను పరిరక్షించవలసిన బాధ్యత గుర్తించింది కాబట్టే ప్రభుత్వం హామీ ఇస్తున్నదని గ్రహించాలి.

బ్యాంకులను తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వమని ఆదేశించటం వల్ల బ్యాంకులకు ఆదాయం తగ్గుతున్న దని, దాదాపు 28 వేల కోట్ల రూపాయల ఆదాయం బ్యాంకులు కోల్పోవలసి వస్తుందని, అందువల్ల డిపాజిట్లపై వడ్డీ పెంచలేకపోతున్నాయనే ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇటువంటి ప్రచారం చేసేవారికి ఈ విషయంపై సమగ్ర అవగాహన లేదని చెప్పాలి లేదా ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఉద్దేశపూర్వకంగా ఈ పని చేస్తున్నారని చెప్పాలి. బ్యాంకుల డిపాజిట్లపై వడ్డీకి, ఈ అప్పులపై వడ్డీకి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలకు సంబంధం లేదు. బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్లపై చెల్లించే వడ్డీలో ఈ 28 వేల కోట్ల రూపాయలు స్వల్పమని తెలుసుకోవాలి. బ్యాంకులు తమ విధానాల మేరకు రిస్క్ ‌తక్కువగా ఉన్న రుణగ్రహీతల నుంచి కంటే తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తున్నాయనే విషయాన్ని విస్మరించరాదు. ప్రభుత్వం చేసే సాయం ఉపాధి, ఉత్పత్తి పెంచేదిగా ఉండాలంటే అప్పులు ఇవ్వడం సరైన మార్గమని కొంత ఆలోచించేవారికి ఎవరికైనా అర్థమవుతుంది. కొవిడ్‌వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు ఉత్పత్తి పెంచటం వల్ల వస్తునిల్వలు పెరుగుతాయి, దానివల్ల వ్యాపారులు నష్టపోయి అసలుకే మోసం వస్తుందనే మొండివాదన కూడా కొంతమంది చేస్తున్నారు. ఇటువంటివారి వాదనలను ప్రభుత్వం ముందుగానే ఊహించింది కాబోలు, నిల్వలు పేరుకు పోకుండా వినిమయం ఉన్న వస్తువుల ఉత్పత్తిని పెంచటానికే రుణ సౌకర్యం కల్పించి అందులో భాగంగానే ఎగుమతి ప్రాధాన్య సంస్థలకు రుణవితరణలో ప్రాధాన్యం కల్పించింది. అంతేకాదు, చాలామంది ఎగుమతిదారులు ముఖ్యంగా చిన్న, మధ్యతరహా సంస్థలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసిన అనంతరం విదేశాల నుంచి చెల్లింపులు నిలిచిపోయి నష్టపోవటం జరుగుతున్నది. ఇటువంటి సంస్థల ఇబ్బంది కనిపెట్టి వారు చేసిన ఎగుమతులకు చెల్లింపులు రానిపక్షంలో వారికి నష్టం వాటిల్లకుండా ఈ ప్యాకేజీలో జాతీయ ఎగుమతి బీమా పద్దు కింద 33 వేల కోట్లు, ఎగుమతి బీమా కింద 80వేల కోట్లు ప్రకటించారు. దేశీయ ఉత్పత్తుల వినిమయం పెంచడానికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు లను వేగవంతం చేసే పక్రియను ప్రకటించారు. కొవిడ్‌ ‌సమయంలో పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, ఆ విభాగంలో ఆసుపత్రిల మౌలిక సదుపాయాలు మెరుగుపరచటానికి 23,220 కోట్ల రూపాయల పథకాన్ని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని విస్మరించకుండా, పోషక ఆధారిత సబ్సిడీ కింద ణ, ఇతర ఎరువులకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని 27,500 కోట్ల రూపాయల నుంచి 42,275 కోట్లకి పెంచారు. వీటితోపాటు విద్యుత్‌ ‌పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటానికి, అవసరమైన సంస్కరణలు అమలు చేయటానికి 3.03 లక్షల కోట్లతో పథకాన్ని ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయం 97,631 కోట్ల రూపాయలు. ఇటువంటి పథకాలు ప్రకటిస్తూనే కేందప్రభుత్వ అంతర్గత అప్పులు అదుపు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒడ్డున ఉండి సలహాలు ఇవ్వటం తేలిక, వాస్తవానికి ప్రభుత్వ ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో భారీ ప్యాకేజీలతో ఆర్థిక రంగాన్ని ఉత్తేజపరచటం అంత తేలికైన పని కాదని గ్రహించాలి.

వ్యాసకర్త : ఆర్థికరంగ నిపుణులు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram