ఇరుగు పొరుగుకు ఇతోధిక సాయం, కష్టకాలంలో ఉన్న ప్రపంచ దేశాలకు తానున్నాని భరోసా కల్పించడం, ఏదో ఒక రూపంలో తనవంతు సాయం అందించడం, అవసరమైన నైతిక మద్దతు కొనసాగించడం… ఇదీ ఆది నుంచి భారత్‌ అవలంబిస్తున్న విధానం. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ విషయంలో పెద్దగా తేడా ఉండదు. ఒక వర్థమాన దేశంగా దాదాపు ఏడున్నర దశాబ్దాల క్రితం ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందుతున్న భారత్‌ ఆపదలో ఉన్న ఏ దేశాన్నయినా ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుకు వచ్చేదన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కష్టకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే బాటలో ప్రయాణించారు.


తొలిదశ కరోనా ప్రపంచాన్ని కబళిస్తున్న తరుణంలో అంతర్జాతీయ సమాజానికి ఆయన అండగా నిలిచారు. అగ్రరాజ్యమైన అమెరికాకు అన్నివిధాలా సహకరించారు. ముఖ్యంగా హైడ్రాక్సీ క్వోరోక్విన్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని తొలగించి దానిని అమెరికాకు సరఫరా చేసి ఉదారతను చాటుకున్నారు. ఒక్క అమెరికాకే కాదు అనేక దేశాలకు ఆపన్నహస్తం అందించారు. ఇంతటితోనే ఆగలేదు. కరోనా నివారణలో కీలకపాత్ర పోషించే టీకాను వివిధ దేశాలకు సరఫరా చేసి పెద్దమనసు చాటుకున్నారు. భారత్‌ ‌నుంచి దాదాపు 90కి పైగా దేశాలు టీకా పొందడం గమనార్హం. ఇరుగు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, ‌భూటాన్‌, ‌నేపాల్‌, ‌శ్రీలంక, మయన్మార్‌, అఫ్గానిస్తాన్‌, ‌మాల్దీవులతో పాటు ఎక్కడో సుదూరాన ఉన్న కెనడా, సిరియా, ఆస్ట్రేలియా, జాంబియా, కెన్యా, యెమెన్‌, ‌యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ‌పాలస్తీనా తదితర 90కి పైగా దేశాలకు మనదేశంలో తయారైన కొవిషీల్డ్, ‌కొవ్యాగ్జిన్‌ ‌టీకాలను సరఫరా చేసి తనవంతుగా చేయూత అందించింది. శత్రు దేశమైన పాకిస్తాన్‌కు కూడా 45 మిలియన్ల డోసుల వ్యాక్సిన్లను పంపించి సరిహద్దు తగాదాల కన్నా ప్రజల విలువైన ప్రాణాలే తనకు ముఖ్యమని చాటిచెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సుమారు 67.5 లక్షల డోసుల టీకాను ఎగుమతి చేసినట్లు అంచనా. ఇందులో కొంతమొత్తం గ్రాంటు రూపంలో అందించడం విశేషం. నిరుడు ఏప్రిల్‌ ‌నుంచి దాదాపు 9300 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ను వివిధ దేశాలకు ఎగుమతి చేసి ప్రజల ప్రాణాలను కాపాడింది. పొరుగు దేశమైన చైనా కేవలం 28 దేశాలకు మాత్రమే వ్యాక్సిన్‌ ‌సరఫరా చేయడం గమనార్హం.

భారత్‌ ‌సాయాన్ని ఎవరూ మరచిపోలేదు. కష్టకాలంలో అందించిన భరోసా, నైతిక మద్దతును గుర్తుంచుకున్నాయి. దీంతో ఇప్పుడు రెండోదశ కరోనాతో సతమతమవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చాయి. దీనిని సాయం చేయడం అని పెద్దపెద్ద మాటలు చెప్పలేమని, కరోనా తొలిదశలో అనేక విధాలుగా తమకు అండగా నిలిచిన భారత్‌కు తమకు చేతనైన సాయం అందజేయడం తమ కనీస బాధ్యత అని ఆయా దేశాలు పేర్కొనడం గమనార్హం. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, ‌సింగపూర్‌, ఐరోపా యూనియన్‌, ‌సౌదీ అరేబియా తదితర దేశాలు భారత్‌కు సాయంలో భాగస్వాములయ్యాయి.  అగ్రరాజ్యం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్క పెట్టకుండా, నిబంధనల పేరుతో జాప్యం చేయకుండా తనవంతుగా సాయం చేసింది. ఈ విషయాన్ని తాము మరచిపోలేదని, అందుకు ప్రత్యుపకారంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో చేతనైన మేరకు భారత్‌కు సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌స్పష్టం చేశారు. కొవిషీల్డ్ ‌టీకా తయారీకి అవసరమైన ముడిపదార్థాలు సరఫరా చేసేందుకు అగ్రరాజ్యం ముందుకు రావడం ఊరట కలిగించే విషయం. దీనివల్ల టీకా తయారీ మరింత వేగవంతం అవుతుంది. మరోవైపు భారత్‌కు అవసరమైన సాయం అందించాలని అమెరికా రక్షణ శాఖ కార్యాలయమైన ‘పెంటగన్‌’‌ను రక్షణ మంత్రి ఆస్టిన్‌ ‌లాయిడ్‌ ఆదేశించారు. మొదట్లో ముడిపదార్థాల సరఫరాపై బైడెన్‌ ‌సర్కారు కొంత విముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ తరవాత తన వైఖరిని మార్చుకుంది. మరోపక్క భారత్‌కు సాయంపై పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు స్పందించడం విశేషం. ఇది భారత్‌కి అన్నివిధాలా అండగా నిలబడాల్సిన సమయమని అధికార డెమొక్రటిక్‌, ‌విపక్ష రిపబ్లిక్‌ ‌పార్టీల సెనెటర్లు మార్క్ ‌వార్నర్‌, ‌జాన్‌ ‌కార్నీలు సర్కారును కోరడం గమనించదగ్గ విషయం. శక్తిమంతులైన ఈ ఇద్దరు సెనెటర్లు తమ తమ పార్టీలలో భారత అనుకూల గ్రూపులకు నాయకత్వం వహిస్తున్నారు. వాల్‌ ‌డెమింగ్స్, ‌సారా జాకబ్స్, ఆం‌డీ కిమ్‌ ‌తదితర కాంగ్రెస్‌ ‌సభ్యులు సైతం భారత్‌కు సాయంపై గట్టిగా తమ గళం వినిపించారు.

హైదరాబాద్‌ ‌కేంద్రంగా పనిచేసే ‘బయెలాజికల్‌ ఈ’ అనే టీకా తయారీ సంస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు అమెరికా డెవలప్‌మెంట్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ‌ముందుకు వచ్చింది. వివిధ సంస్థల సాయంతో 1000 కాన్సంట్రేటర్లు అందజేస్తామని డెలాయిట్‌ ‌కంపెనీ సీఈవో పునీత్‌ ‌రెంజెన్‌ ‌తెలిపారు. 80 మెట్రిక్‌ ‌టన్నుల ద్రవీకృత ఆక్సిజన్‌ను సౌదీ అరేబియా నౌకల్లో పంపింది. సింగపూర్‌ ‌నాలుగు క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ‌ట్యాంకులను వాయుమార్గంలో తరలించి పెద్ద మనసు చాటుకుంది. అత్యవసర వైద్య సామాగ్రిని పంపించినట్లు ఐరోపా యూనియన్‌ ‌విపత్తు నిర్వహణశాఖ మంత్రి జానెజ్‌ ‌రెనారిక్స్ ‌వెల్లడించారు. అమెరికాలో దిగ్గజ టెక్‌ ‌కంపెనీలకు సారథ్యం వహిస్తున్న సుందర్‌ ‌పిచాయ్‌, ‌సత్యనాదెళ్ల మాతృదేశానికి ఎదురైన ఇబ్బందులు చూసి తల్లడిల్లారు. తమ వంతు సాయానికి ముందుకు వచ్చారు. స్వచ్ఛంద సంస్థ గివ్‌ ఇం‌డియా, యునిసెఫ్‌ల ద్వారా రూ.135 కోట్లు ఇస్తున్నట్లు గూగుల్‌ ‌సీఈవో సుందర్‌ ‌పిచాయ్‌ ‌తెలిపారు. సహాయక చర్యలకు తన వంతుగా వనరులు, సాంకేతికతను అందించనున్నట్లు మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల ప్రకటించారు. పీఎం కేర్స్‌కు సత్య నాదెళ్ల, ఆయన సతీమణి అనపమ రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు.

ఆక్సిజన్‌ ‌సిలిండర్లు, రెగ్యులేటర్లు, మాస్కులతో అమెరికా వాయుసేనకు చెందిన అతిపెద్ద సి-5 సూపర్‌ ‌గెలాక్సీ విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందుకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం కృతజ్ఞతలు తెలుపగా, కరోనా తొలిదశలో కష్టకాలంలో ఉన్న తమను భారత్‌ ఆదుకుందని, ఇప్పుడు తమ వంతు వచ్చిందని యూఎస్‌ ఎయిడ్‌ ‌సంస్థ సీనియర్‌ ‌సలహాదారు జెరెమీ కొన్‌ ‌యన్‌ ‌డిక్‌ ‌వినమ్రంగా వ్యాఖ్యానించారు. భారత్‌ ‌సూచన మేరకు తాము అందజేసిన వైద్య సామాగ్రిని రెడ్‌‌క్రాస్‌కు అందజేస్తామని తెలిపారు. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థలు సైతం సాయానికి ముందుకు వచ్చాయి. హ్యూస్టన్‌లోని సేవా ఇంటర్నేషనల్‌ ‌సంస్థ తొలి విడతగా 2,184 ఆక్సిజన్‌ ‌కాన్సంట్రేటర్లు పంపించింది. యునైటెడ్‌ ‌పార్శిల్‌ ‌సర్వీస్‌ ‌ఫౌండేషన్‌ ఉచితంగా దీనిని రవాణా చేసింది. సిస్కో కంపెనీ మాజీ సీఈవో జాన్‌ ‌ఛాంబర్స్ ఒక మిలియన్‌ ‌డాలర్లు విరాళంగా ఇచ్చారు. జపాన్‌ ‌సర్కార్‌ 300 ఆక్సిజన్‌ ‌కాన్సంట్రేటర్లు, 300 వెంటిలేటర్లు పంపించింది. బ్రిటన్‌, ‌రుమేనియా, హాంకాంగ్‌ ‌పంపిన 280, 80, 300 ఆక్సిజన్‌ ‌కాన్సంట్రేటర్లు అందాయి. యూఎస్‌ ఇం‌డియన్‌ ‌ఛాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ 50 ‌వెంటిలేటర్లు సరఫరా చేసింది. ఈ విషయంలో డల్లాస్‌ ‌శాఖ అధ్యక్షుడు నీల్‌ ‌గొనుగుంట్ల కీలకపాత్ర పోషించారు. భారత్‌కు వెంటిలేటర్ల సరఫరాపై వివిధ సంఘాలను అమెజాన్‌ ‌సంస్థ సమన్వయం చేస్తోంది. సామగ్రిని తరలించడానికి లాక్‌ ‌షీడ్‌ ‌మార్టిన్‌ ‌విమానయాన సంస్థ ముందుకు వచ్చింది. ఫెడ్‌ ఎక్స్ ‌సంస్థ 1000 ఆక్సిజన్‌ ‌కాన్సంట్రేటర్లును పంపించి తన ఉదారతను చాటుకుంది. సుమారు పాతికవేల ఆక్సిజన్‌ ‌కాన్సంట్రేటర్లు పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు యూఎస్‌ ఇం‌డియా స్ట్రాటజిక్‌ అం‌డ్‌ ‌పార్టనర్‌షిప్‌ ‌ఫోరం అధ్యక్షుడు ముఖేష్‌ అఘీ వెల్లడించారు. అమెరికాకు చెందిన సేవా ఇంటర్నేషనల్‌ ‌సంస్థ కేవలం వంద గంటల వ్యవధిలో దాదాపు రూ.35 కోట్ల విరాళాలను సేకరించింది. అమెరికా పంపిన ఆస్ట్రోజెన్‌ ‌టీకాలు భారత్‌కు వచ్చేశాయి.

 భారత్‌లోని రెడ్‌‌క్రాస్‌ ‌సంస్థకు రూ.5.37 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు న్యూజిలాండ్‌ ‌విదేశాంగ మంత్రి నానయ మహుట తెలిపారు. రూ.60 కోట్లు విరాళంగా అందజేయనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడో ప్రకటించారు. అదనంగా మరో 400 ఆక్సిజన్‌ ‌కాన్సంట్రేటర్లు పంపిస్తామని బ్రిటన్‌ ‌ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌ ‌వెల్లడించారు. సింగపూర్‌ ‌నుంచి 256 ఆక్సిజన్‌ ‌సిలిండర్లు ఢిల్లీకి చేరుకున్నాయి. ఫ్రాన్స్ ‌నుంచి అయిదు ఆక్సిజన్‌ ‌కంటెయినర్లు, 28 వెంటిలేటర్లు, 200 ఎలక్ట్రిక్‌ ‌పంపులు వచ్చాయి. ఐర్లాండ్‌ 700 ఆక్సిజన్‌ ‌కాన్సంట్రేటర్లు, ఒక ఆక్సిజన్‌ ‌జనరేటరు, 365 వెంటిలేటర్లు, బెల్జియం 9000 డోసుల రెమ్‌డెసివర్‌ ‌టీకాలు, స్వీడన్‌ 120 ‌వెంటిలేటర్లు, రుమేనియా 80 ఆక్సిజన్‌ ‌కాన్సంట్రేటర్లు, 75 ఆక్సిజన్‌ ‌సిలిండర్లు, లగ్జంబర్గ్ 58 ‌వెంటిలేటర్లు, పోర్చుగల్‌ ‌రెమ్‌డెసివర్‌, ఆ‌స్ట్రేలియా 500 వెంటిలేటర్లు, 10 లక్షల సర్జికల్‌ ‌మాస్కులు, 5 లక్షల పీ2 ఎన్‌95 ‌మాస్కులు, లక్ష గాగుల్స్, ‌లక్ష జతల గ్లౌజులు, 20వేల ఫేస్‌ ‌షీల్డులు పంపించాయి.

 భారత్‌కు సాయం విషయంలో పొరుగు దేశమైన చైనా వైఖరి ‘నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించిన’ చందాన ఉందన్న విమర్శలు వినపడుతున్నాయి. ఆక్సిజన్‌ ‌సరఫరాకు ముందుకు వచ్చిన బీజింగ్‌ ‌తరవాత రవాణా విషయమై అడ్డుపుల్ల వేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సిచువాన్‌ ఎయిర్‌లైన్స్ ‌భారత్‌కు 15 రోజుల పాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఆక్సిజన్‌ ‌సరఫరాకు అంతరాయం కలిగింది. దీనివల్ల ఆక్సిజన్‌ ‌రవాణా సవాల్‌గా మారుతుంది. సింగపూర్‌ ‌లేదా ఇతర దేశాల మీదుగా వేరే ఎయిర్‌లైన్స్ ‌ద్వారా భారత్‌కు రవాణా చేయవలసి వస్తుంది. దీనివల్ల రవాణా విషయంలో మరింత జాప్యం జరుగుతుంది. అంతేకాక ఆక్సిజన్‌ ‌ధరలను సుమారు 35 నుంచి 40 శాతం పెంచిందన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. సరుకు రవాణా ఛార్జీలను సైతం అధికం చేసింది. ప్రభుత్వం 20 శాతం పైగా ఛార్జీలను పెంచినట్లు సినో గ్లోబల్‌ ‌లాజిస్టిక్స్ ‌సంస్థ తెలిపింది. దీనివల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది. చైనా వైఖరి చూసిన తరవాత సాయంపై దాని చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

 సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram