శ్రీమద్రామాయణం మంత్రగర్భితమైన ఆదికావ్యం కాగా సీతారాములు శక్తి, విష్ణుతేజాలుగా; హనుమ శివతేజంగా పురాణాలు అభివర్ణించాయి. పదిళ్లున్న పల్లెలోనూ రామమందిరం ఉన్నట్లే హనుమత్‌ ‌మందిరాలకూ కొదవ లేదు. ఆయనకు ప్రత్యేకంగా ఆలయాలు ఉండడంతో పాటు రామాలయాలలోనూ సీతారామలక్ష్మణులతో పాటు కొలువై ఉంటారు. ఇతర దేవతలకు మించి ఇది హనుమకు ప్రత్యేకత. అంతటి విశిష్టత గల హనుమ జన్మస్థలం విషయంలో చిరకాలంగా సందేహాలు, వాదోపవాదాలు నెలకొనగా, దేశంలోని వివిధ ప్రాంతాలవారు ‘హనుమ తమ తమ ప్రాంతానికి చెందినవాడిగా చెప్పుకుంటూ వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వాటికి స్వస్తి చెబుతూ, ఆంనేయుడి జన్మస్థలం తిరుమల గిరులలోని అంజనాద్రేనని సప్రామాణికంగా ప్రకటించింది. ఈ అంశంపై ఏర్పాటైన పండిత పరిషత్‌ ‌శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా (ఏప్రిల్‌ 21) ‌తిరుమలేశుని సమక్షంలో నాద నీరాజనం వేదికపై వాఙ్మయ, భౌగోళిక, శాసన, పౌరాణిక ఆధారాలతో ప్రకటించింది. ఆంజనేయ జన్మస్థలిపై కర్ణాటక, ఝార్కండ్‌ ‌సహా ఐదు రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న వాదనలకు ఆధారాలు లేవని పండిత పరిషత్‌ ‌చైర్మన్‌, ‌రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధరశర్మ స్పష్టం చేశారు.

మతంగ మహర్షి సలహా ప్రకారం అంజనీదేవి తపస్సు చేసి ఆంజనేయుడిని పుత్రుడిగా పొందిన స్థలం కనుక ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందిన భౌగోళిక రుజువులు చెబుతున్నాయి. ‘అంజనా చ తప: కృత్వా హనుమంతమజీ జనత్‌…’ అని వరాహ పురాణం పేర్కొంటోంది. అంతకు పూర్వయుగం (కృత)లో ఈ కొండను వృషాద్రిగా వ్యవహరించేవారు. వ్యాసుడు ‘కృతే వృషాద్రి’ అని అభివర్ణించారని భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. శ్రీరాముడు వానరవీరులతో కలసి ఇక్కడ సేదతీరుతుండగా వారిలో కొందరు శేషాచలంలోని వైకుంఠ గుహను సందర్శించారిని వరాహ పురాణం, వేంకటాచల మాహాత్మ్యంలో ఉంది. ఈ గుహ స్వామివారి పుష్కరిణికి ఈశాన్యంగా సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నేటికీ చెక్కు చెదర•కుండా ఉంది. ఇక్కడికి సమీపంలోనే అంజనాద్రి మీద ఉన్న జాపాలి తీర్థం వద్దనే మారుతిని అంజనా దేవి కన్నదని కూడా పురాణాలు చెబుతున్నాయి. సీతాన్వేషణకు బయలుదేరిన రామలక్ష్మణులు హంపి సమీపంలోని ‘కిష్కింధ•’ వద్ద హనుమను మొదటిసారి చూశారని శ్రీమద్వాల్మీకి రామాయణం చెప్పడాన్ని బట్టి కిష్కింధ తిరుమల దగ్గరగా (336 కి.మి.) ఉన్నందున ఆయన అక్కడి నుంచి హంపి వెళ్లి ఉంటాడని పండిత పరిషత్‌ ‌నిర్ధారించింది. ఇతర ప్రాంతాల నుంచి హంపికి దూరాన్ని పరిగణనలోకి తీసుకుంటే గుమ్ల 1240 కి.మీ.; కైథల్‌ 1628 ‌కి.మీ., డాంగ్‌ 666 ‌కి.మీ., మహారాష్ట్ర 616 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఇవన్నీ హనుమ జన్మస్థంగా అక్కడి వారు నమ్మే ప్రాంతాలు.

వాఙ్మయ ఆధారాలు

శ్రీమద్రామాయణంలోని సుందరకాండ,అనేక పురాణాలు, కావ్యాలలో, వేంకటాచల మాహాత్మ్యంలో హనుమ జన్మ వృత్తాంతం ఉంది. స్కాంద, వరాహ, బ్రహ్మాండాది పురాణాల నుంచి వివిధ విషయాలతో ఏర్చికూర్చిన సంకలనం వేంకటాచల మాహాత్మ్యంలో హనుమ జన్మ వృత్తాంత విశదంగా కనిపిస్తుంది. సూర్యబింబాన్ని పండుగా భ్రమించి దాని కోసం ఈ కొండపై నుంచి లంఘించిన హనుమ బ్రహ్మాస్త్రఘాతం బారిన పడినప్పుడు అంజనను సాంత్వనపరిచే క్రమంలో ‘లోకశ్రేయస్సు కోసం ఈ శేషాద్రి లేదా వేంకటగిరిపై తపస్సు చేసి పుత్రుడిని పొందిన నీ పేరిటి ఇది అంజనాద్రిగా ప్రసిద్ధమవుతుంది’ అని బ్రహ్మాది దేవతలు వరం ఇచ్చారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. తమిళ అనువాదం కంబ రామాయణంతో పాటు వేదాంత దేశికులు (1268-1369) తమ ‘హంసదూతం’ కావ్యంలో ‘అగ్రే భావీ సపది నయనే రంజయన్‌ అం‌జనాద్రి’ అనీ, ప్రతివాద భయంకర అణ్ణంకరాచార్యులు (1361) తమ ‘అంజనాద్రి స్తోత్రం’లోను హనుమను ప్రస్తావించారు. అన్నమాచార్యులు (1408-1503) తమ రచనలలో వేంకటాద్రిని అంజనాద్రిగా అభివర్ణించారు. 17వ శతాబ్దానికి చెందిన శ్రీరంగరామానుజాచార్యులు ‘కఠోపనిషత్‌ ‌భాష్యం’కు రాసిన మంగళశ్లోకంలో ‘అంజనాచల శృంగార మంజలిర్మమగాహతామ్‌’ అని రాశారు. స్టాటన్‌ అనే అధికారి (క్రీ.శ.1800లో) తిరుమల ఆలయ విశేషాలతో రాసిన ‘సవాల్‌-ఎ-‌జవాబ్‌’ ‌పుస్తకంలో అంజనాద్రి వద్ద అంజనాదేవి పుత్రోదయాన్ని పేర్కొన్నారు. లండన్‌లోని ఇండియన్‌ ఆఫీస్‌ ‌రికార్డు లైబ్రరీలోని అప్రకాశిత గ్రంథం ‘అంజనాద్రి మాహాత్మ్యం’ కూడా హనుమ వేంకటాద్రిలోనే ఉదయించాడని పేర్కొంటోందని పండిత పరిషత్‌ ‌వివరించింది.

ఆంజనేయుడు సప్తగిరులలోని అంజనాద్రిపైనే జన్మించారని తెలిపేందుకు ఇతిహాసాలలో ఆంజనేయస్వామి పాత్రపై పరిశోధన చేసి పీహెచ్‌ ‌డీ పట్టా పొందిన డాక్టర్‌ అన్నదానం చిదంబరశాస్త్రి అనేక ఆధారాలు సేకరించారు. ఈ విషయంపై దాదాపు నాలుగున్నర దశాబ్దాలకు పైగా తితిదే ఆధ్యాత్మిక మాసపత్రిక ‘సప్తగిరి’లో, ఇతర పత్రికలలో వ్యాసాలు రాస్తూ వచ్చారు. ‘హనుమ జననానికి మూలకారకులైన పార్వతీపరమేశ్వరులు వేంకటాద్రిపై సంచరించారని పరాశర సంహిత చెబుతోంది… తిరుపతి నుంచి తిరుమల మార్గంలో ఏడుకొండల్లో అంజనాదేవి తపస్సు చేసిన పర్వతం ఉందని రామచరణ్‌ ‌రామాయణం పేర్కొంటోంది….కిష్కింధ రాజ్యం ఆంధ్ర ప్రాంతంలోనిదని, హనుమ తిరుమల కొండమీద ఆకాశతీర్థం ముంగిట జన్మించారని పరిశోధక పండితులు అవ్వారి సుబ్రహ్మణ్యశర్మ తమ హనుమత్కథా మంజరిలో ప్రకటించారు’ లాంటి అనేక అంశాలను చిదంబరశాస్త్రి పేర్కొన్నారు.

హనుమ ఆంధ్రుడని, ఆయన జన్మస్థలం అంజనాద్రి అని పేర్కొంటున్న భవిష్యోత్తర పురాణం తదితర ఇతిహాసాలలోని శ్లోకాలను ఉటంకిస్తూ డాక్టర్‌ ఏవీఎన్‌జీ హనుమత్‌‌ప్రసాద్‌ ‌పుస్తకం (2012) ప్రచురించారు. తితిదే పూర్వ కార్యనిర్వహణాధికారి, దివంగత పీవీఆర్కే ప్రసాద్‌ ‌తమ ‘తిరుమల లీలామృతం’లో వరాహ పురాణాన్ని ఉటంకిస్తూ, రామలక్ష్మణులు అంజనాద్రిని సందర్శించారని పేర్కొన్నారు.

శాసనాధారాలు

తురుష్కల దండయాత్ర సమయంలో శ్రీరంగంలోని ఉత్సవబేరాన్ని తిరుమల గిరులకు తరలించి అనంతరం దానిని ‘అంజనాద్రి’ నుంచి తీసుకువచ్చినట్లు శ్రీరంగంలోని శిలాశాసనం పేర్కొంటోంది. తిరుమల ఆలయంలోని రెండు శాసనాలు (27జూన్‌ 1491, 6 ‌మార్చి 1545), వేంకటాచల మాహాత్మ్యం గ్రంథం ప్రమాణమేనని చెబుతున్నాయి. ఈ గ్రంథం ఆంజనేయుడి జననాన్ని ప్రస్తావిస్తోంది. ఎట్టూర్‌ ‌లక్ష్మీకుమార తాతాచార్యులు (16వ శతాబ్దం)రాసిన ‘హనుమద్వింశతి:’ స్తోత్రం కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయం లోనూ,ఆచార్యుల వారు కట్టించిన ఆంజనేయస్వామి ఆలయంలో ‘అంజనగిరి’ ప్రస్తావన తెలిపే శ్లోకం శిలాశాసనంగా కనిపిస్తోంది. తిరుపతిలోని ఎన్నో శాసనాలు ఆ ప్రాంతంలో ఆంజనేయుడికి గల ఆరాధనను వెల్లడిస్తున్నాయి.

పురాణాధారాలు

ఇక పురాణాల పరంగా పరిశీలిస్తే… శ్రీనివాసుడు కొలువైన వేంకటాచలాన్ని త్రేతాయుగంలో అంజనాద్రిగా (కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయం అంజనాచలం!/ద్వాపరే శేషశైలేతి కలౌ శ్రీ వేంకటాచలం!!) వ్యవహరిం చేవారట. ఆకాశగంగ ప్రాంతంలో తపస్సు చేసిన అంజనాదేవికి పుత్రసంతానం కలిగిందని, ఆ ప్రకారం ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని స్కాంధ పురాణం చెబుతోంది. వరహ, బ్రహ్మండాది పురాణాల సారంతో రూపొందిన వేంకటాచల మాహాత్మ్యం హనుమ జన్మ వృత్తాంతాన్ని వివరిస్తోంది. సూర్యుడిని పట్టుకునేందుకు బాలాంజ నేయుడు వేంకటాద్రి నుంచి లఘించారని, కిష్కింధ ప్రాంతంలో రామదర్శనా నంతరం హనుమ తిరిగి వచ్చి తరలివచ్చారని, వానరవీరలు వైకుంఠ గుహలోకి ప్రవేశించారని.. ఇలా అనేక విషయాలను వేంకటాచల మహాత్మ్యం వివరిస్తోంది. వాల్మీకి రామాయణం తెలియచేస్తున్న వివరాలతో పురాణ వివరాలను ,వివిధ ఆధారాలను సరిపోల్చడం ద్వారా అంజనాద్రిపై గల జాబాలి తీర్థం హనుమ స్థలమని పండిత పరిషత్‌ ‌నిర్ధారణకు వచ్చింది.

పండిత పరిషత్‌   

‘‌హనుమ జన్మస్థలం అంజనాద్రే’ అంటూ వేలాది హనుమద్భక్తుల సంతకాలతో 1990 ఫిబ్రవరిలో, గత ఏడాది (2020) అక్టోబర్‌లో ఇతిహాసాల ఆధారాలతో చిదంబరశాస్త్రి తితిదేకి విన్నపాలు పంపారు. దీనిపై తితిదే గత ఏడాది (2020) డిసెంబర్‌ ‌లో వేదపండితులు, పురావస్తు శాఖ నిపుణులు, ఇస్రో శాస్త్రవేత్తలతో ఒక సంఘాన్ని నియమించింది. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ ఆకెళ్ల విభీషణశర్మ కన్వీనర్‌గా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధరశర్మ అధ్యక్షుడిగా, శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానుమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ ఉప సంచాలకుడు విజయ్‌ ‌కుమార్‌ ‌సభ్యులుగా పరిషత్‌ ఏర్పాటైంది. ‘ఈ అంశంపై వీరు పరిశోధించి, బలమైన ఆధారాలు సేకరించారు. ఇతర రాష్ట్రాలు నిరూపించ లేకపోయాయి. ఈ వివరాలను తితిదే వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం. ఈ నివేదికపై తితిదే పాలక మండలిలో, రాష్ట్ర దేవదాయశాఖతో చర్చించి జాపాలి తీర్థంలో ఆలయం నిర్మిస్తాం’ అని తితిదే కార్యనిర్వహణాధికారి కె.ఎస్‌.‌జవహర్‌ ‌రెడ్డి వివరించారు. శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య కాగా, ఆయన భక్తుడు హనుమ జన్మస్థానం తిరుమల అని రూఢీ అయిందని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన తమిళనాడు గవర్నర్‌ ‌భన్వరిలాల్‌ ‌పురోహిత్‌ అన్నారు. పండిత పరిషత్‌ ‌లోతైన అధ్యయనంతో ఆంజనేయుడి హనుమ జన్మస్థలాన్ని నిర్ధారించడం ఆనందదాయకమని అన్నారు. ఎట్టూర్‌ ‌లక్ష్మీకుమార తాతాచార్య (క్రీస్తుపూర్వం 16శతాబ్దం) రాసిన ‘హనుమద్వింశతి’ స్తోత్రం కాంచీపురంలో వరదరాజ గుడిలో, ఆయనే నిర్మించిన ఆంజనేయస్వామి గుడిలో శిలాశాసనం రూపంలో ఉంది.

ఐదు రాష్ట్రాల వాదన

హనుమ జన్మస్థలం ఆంధప్రదేశ్‌లోని వేంకటాచలమేనని తిరుమల తిరుపతి దేవస్థానం గట్టి ఆధారాలతో నిరూపించగా, మరో ఐదు రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, ‌హర్యానా, జార్ఖండ్‌ ‌వాదనకు దిగినా అందుకు తగిన ఆధారాలు చూపలేదని పండిత పరిషత్‌ ‌తెలిపింది. కర్ణాటక మొదట గట్టిగానే వాదించినప్పటికీ, పూర్తి ఆధారాలు సేకరించలేకపోయింది. హంపి కన్నడ విశ్వవిద్యాలయం ఈ విషయంలో కొంత పరిశోధన జరిపినా ‘కర్ణాటకలోని అంజనాద్రి ఆంజనేయుడి పుట్టిన ప్రాంతమన్నది జనశ్రుతి మాత్రమేనని, దాని నిరూపణకు తమ వద్ద ఎలాంటి ఆధారాలులేవని అక్కడి తాళపత్ర విభాగం ఆచార్యులు వాసుదేవన్‌ ‌తెలిపారని పండిత పరిషత్‌ ‌చెప్పింది.

కాగా, ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణలో హనుమ జన్మించారని శివమొగ్గలోని రామచంద్రపుర మఠాధిపతి రాఘవేశ్వర భాతీ స్వామీజీ కూడా అప్పట్లో అభిప్రాయపడ్డారు. తాను గోకర్ణలోని సముద్రతీరంలో జన్మించినట్లు హనుమ లంకలోని అశోకవనంలో సీతమ్మకు నివేదించారంటూ భారతీ స్వామీజీ రామాయణ గాథను ఉటంకించారు. దాని ఆధారంగానే గోకర్ణం ఆంజనేయుడి జన్మభూమి అని, కిష్కింధ కర్మభూమి అని చెప్పగలమని ఆయన అన్నారు. ఆ రాష్ట్రంలోని పంపాతీరంలోని అంజలకొండే అంజనాసుతుడి జన్మస్థలమని హంపి స్వామీజీ కూడా గత ఏడాది ప్రకటించారు. కొప్పల్‌ ‌జిల్లాలోని ఆనెగొందికి సమీపంలో ఉన్న కిష్కింధలోని కొండ ‘అంజనాద్రి’పై జన్మించాడని కర్ణాటక పండితులు గతంలో వాదించారు. అయితే ఆంజ నేయుడు తమ ప్రాంతంలోనే జన్మించారని నిరూపించేందుకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని హంపీ విశ్వవిద్యాలయం పండితులు చెప్పారు.

అలాగే జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో అంజన అనే గ్రామంలోని గుహ, హర్యానాలోని కైథల్‌, ‌గుజరాత్‌లోని నవ్‌సరి ప్రాంతంలోని డాంగ్‌, ‌మహారాష్ట్రలోని నాసిక్‌ ‌సమీపంలో త్య్రయంబకేశ్వర్‌ ‌వద్ద గల అంజనేరి పర్వత ప్రదేశం హనుమ జననానికి సంబంధించినదని ఆయా ప్రాంతాలు చెప్పు కొచ్చాయి. అవన్నీ స్థానికుల విశ్వాసమే తప్ప అందుకు ప్రమాణాలు కానీ, ఆధారాలు కానీ లేవని తితిదే పండిత పరిషత్‌ ‌పేర్కొంది.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram