సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి ఫాల్గుణ అమావాస్య – 12 ఏప్రిల్‌ 2021, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‘‌భూమి నా తల్లి! ఆమె కొడుకును నేను!’ అని యుగయుగాల కిందటే ప్రకటించుకున్నాడు భారతీయుడు. నేల మీదే కాదు, నీరు, గోవుల మీదా భారతావనికి తనదైన, లోతైన చింతన ఉంది. ఆ చింతన మూలాలను అటు సంప్రదాయంలోనూ, ఇటు శాస్త్రంలోనూ దర్శించుకోవచ్చు. ఆ మూడింటిని భారతీయులు మాతృస్థానంలో ఉంచారు. కానీ ఈ ముగురమ్మలూ ఇప్పుడు ప్రమాదంలో పడ్డారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రకు ఇదొక మచ్చ. ప్రపంచంలో ముప్పయ్‌ ‌శాతం వ్యవసాయ యోగ్య నేలలు నిరుపయోగంగా మారిపోయాయని లోపల మీరు చదువుతారు. ఇంతటి నేరానికి ఈ తరాలు ఎందుకు పాల్పడుతున్నాయి?  ఎవరిదీ నేరం? ఈ ప్రశ్నలకు జవాబులు కూడా లోపలి వ్యాసాలలో గమనిస్తారు. మితిమీరిన రసాయనిక ఎరువులతో నేలను అక్షరాలా కుళ్లబెడుతున్నాం.ఈ దుస్థితి నుంచి వసుధను రక్షించుకోవాలంటే మళ్లీ పూర్వపు సేద్య రీతులను ఆశ్రయించాలి. అదే గో ఆధారిత సేద్యం. ఇక నీటి కాలుష్యం సరే. కానీ నీటి కాలుష్యం గురించి చర్చించుకుంటున్న స్థాయిలో భూమి దుస్థితి గురించి మాట్లాడడం లేదు. భూమి ఆరోగ్యాన్నీ, మానవాళి ఆరోగ్యాన్నీ విభజించి చూడలేం.

ఇటీవలి వందల సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నదేమిటి? పతనం నుంచి పతనానికి ప్రయాణం. వేల ఏళ్ల నుంచి సురక్షితంగా ఉన్న భూమిని ఏడు దశాబ్దాలలోనే ఆధునికుడు ధ్వంసం చేయడం ఆ ప్రస్థానంలో వికృతే. ఉత్పత్తి పెరిగింది. వనరు నాశనమైంది. అందుకే ఒక రైతు ప్రశ్నిస్తున్నారు, ‘పాతిక బస్తాలు పండినప్పుడు లేని రైతుల బలవన్మరణాలు, డెబ్బయ్‌ ‌బస్తాలు పండినప్పుడు ఎందుకు సంభవిస్తున్నాయి?’ అంటే, సామెత చెప్పినట్టు ‘కుప్ప తగలబెట్టి పేలాలు వేయించుకున్నట్టు’ అవలేదా! రసాయనిక ఎరువులతో యథేచ్ఛగా సాగుతున్న సేద్యం ఫలితమిది. ఒప్పుకోవడానికి ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, వాస్తవం ఇదే.

ఒక చారిత్రక సత్యాన్ని ఇక్కడ ప్రస్తావించాలి.ఎరువుల పద్ధతికి  భారతావని వ్యతిరేకం కాదు. ‘ఎరువులేని పైరు పరువు లేని ఊరు’ అంటారు. వేదకాలం నుంచి, రామాయణ, భారతాలు నుంచి సేద్యం గురించి మనకు అందుతోంది. క్రీస్తుపూర్వం 400 సంవత్సరం నుంచి క్రీస్తుశకం 1600 వరకు వచ్చిన శాస్త్రాలు భారతీయ సేద్యం గురించి స్మరణీయ సత్యాలు చెబుతున్నాయి. ‘కృషి పరాశరం’ లేదా కృషి పరాశర పంచాంగం నాగలికి వివిధ ప్రాంతాలలో ఉన్న పేర్లు, నిర్మించుకునే పద్ధతులు చెబుతుంది. ‘గొర్రు గుచ్చిన నేలకు కొరత ఉండదు’ అంటూ ఒక నిత్యసత్యం ఆవిష్కృతమైంది అలాగే మరి! విత్తనరక్షణ, నీటి నిల్వ, పొం తవ్వడం గురించీ చెప్పిందా గ్రంథం. ఎరువు లేకుండా పంట ఎదగవచ్చు, కానీ ఫలం రాదు అని ఆనాడే పరాశర ముని చెప్పాడు. సూర్యచంద్రుల స్థితిగతులను బట్టి వర్షపాతాన్ని అంచనా వేశాడాయన. ప్రకృతికీ, సేద్యానికీ ఉన్న బంధమదే. మన యలమంచిలి ప్రాంతానికి చెందిన దోనయామాత్యుడు కూడా తన ‘సస్యశాస్త్రం’లో ఇలాగే లెక్క కట్టడం కనిపిస్తుంది. పశువులు, కొట్టం, అందులో ఉండవలసిన పరిశుభ్రత గురించి కూడా పరాశరుడు సూచనలు చేశాడు. విత్తనాలను ఆవుపేడతో వచ్చిన బూడిదతో భద్రపరచమన్నాడు. అర్ధశాస్త్రం, అమరకోశం, మహాభాష్యం, సంగమ సాహిత్యం, అగ్ని పురాణం, కాశ్యపేయ కృషిసూక్తి, వృక్షాయుర్వేదం వంటి గ్రంథాలెన్నో సేద్యం గురించి శాస్త్రీయంగా వెల్లడించాయి. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మంచి పంటలను పండించాలని వేదమే ఘోషిస్తున్నది. ‘కళ్లెం పళ్లెం పెద్దవిగా ఉండాలి’ అని సామెత రూపంలో దీవించారు మన పురాతనులు. ఈ మహోన్నత సత్యాలను విస్మరించి ఇటీవలి తరాలు మహానేరం చేస్తున్నాయి, భవిష్యత్‌ ‌తరాలకు ఎనలేని క్షోభను మిగులుస్తున్నాయి. ఉత్పత్తి పెంచినా నేలను ఊసరక్షేత్రం చేసే రసాయనిక ఎరువుల• కాక, సేంద్రియ ఎరువులు వేద్దాం. ఇంత పండిస్తున్న కాలంలోను ‘అన్నీ పండించే  రైతుకు అన్నం కరవు’ అన్న సామెత నిజమయ్యే పరిస్థితులు దాపురించడం పెద్ద విషాదం.

ఆవుకు ముందు తరాలు ఇచ్చిన ప్రాధాన్యం ఘనమైనది. ‘ఆవులేని ఇంట అన్నమే తినరాదు’ అన్నారు. ఆవుకీ, భూసుపోషణకూ అవినాభావ సంబంధం ఉంది. గోవే కాదు, ఎన్నో సూక్ష్మజీవులు, పశుపక్ష్యాదులు భూరక్షణలో ఉడతాభక్తిగా తోడ్పడుతున్నాయి. మనిషితో పాటు వాటి జీవించే హక్కూ అనివార్యమే. అప్పుడే భూమికి నిజమైన రక్ష.

భూసుపోషణ గురించి ప్రత్యేక సంచిక తీసుకురావాలని  పెద్దలు భాగయ్య గారు చెప్పిన మాటే ఈ సంచికకు నాంది. కోరడమే ఆలస్యం అన్నట్టు ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపసంచాలకులు ప్రొఫెసర్‌ ‌పి. రాఘవరెడ్డి శక్తివంచన లేకుండా శ్రమించారు. శాస్త్రవేత్తలను కదిపి కలాలు పట్టించారు. ఏకలవ్య ఫౌండేషన్‌ అధ్యక్షులు పి.వేణుగోపాలరెడ్డి మౌనముద్రతోనే ఈ యజ్ఞం చేయించారు. హరీష్‌ ‌గుప్తా (జియాలజిస్ట్, ఓయూ), చిట్టూరి బాలసుబ్రహ్మణ్యం, సత్యభూపాల్‌ ‌రెడ్డి (సేంద్రియ సేద్య కార్యకర్తలు) చేయూత నిచ్చారు. అన్నిటికంటే మనిషికీ, భూమికీ ఉన్న అనిర్వచనీయ బంధం గురించి మహా పౌరాణికులు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ రాసిన వ్యాసం ఆణిముత్యం. ఎందరో వ్యవసాయ శాస్త్రవేత్తలు సమయం కేటాయించి వ్యాసాలు రాశారు. స్వీయానుభవాలతో రైతులు ఈ ‘జాగృతి’కి మట్టి వాసన తెచ్చారు. వీరందరికీ నమశ్శతములు. భూమి రక్షణ, పర్యావరణ పరిరక్షణ, జల కాలుష్య నివారణ మాటలతో కాదు, ప్రజా ఉద్యమంతోనే సాధించగలం. ప్రజలందరి చైతన్యంతోనే సాధ్యం. ఆ యజ్ఞంలో మా వంతుగా ఈ ప్రత్యేక సంచిక వెలువరిస్తున్నాం. సేద్యం నిత్యం, సేద్యం సత్యం.

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram