– డా।। సదానందం గుళ్లపల్లి

మనదేశం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేదని చెప్పడం అతిశయోక్తి కాదు. మళ్లీ దేశాన్ని ముందుకు నడిపించాలన్న చారిత్రక కర్తవ్యాన్ని నెరవేర్చడానికి అవసరమైన విద్యావ్యవస్థ ఇవాళ లేదు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలోనే కాదు, కొత్త రాష్ట్రం తెలంగాణలో కూడా వినపడుతున్న మాట- అందరికి విద్య. ఉద్యమ తెలంగాణలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్న హామీ వినిపించింది. అందరికి విద్య అంటే కుల, మత భేదాలు, ధనిక, పేదా తేడా లేకుండా భావి భారతపౌరులంతా కలసి చదువుకోవడం అని అర్ధం. అదే అసమానతలు లేని విద్య.

నేటి విద్యావిధానం చూడండి! కులానికి ఒక బడి, మతానికి ఒక బడి అన్నట్టే ఉంది. ఇది విద్యలో సమానత్వం సాధించేదేనా? విద్యలో సమానత్వం లేనంత వరకు సమాజంలో విద్య వికసించదు. విద్యా వికాసం లేనిచోట సమాజ వికాసం ఉండదు. మరి భారతదేశం పూర్వవైభవం ఎలా సాధిస్తుంది? ఒకటే మార్గం. మన బడులు, గురుకులాలు దేశభక్తిని పెంచే ఆలయాలు కావాలి, దేశాన్ని ముందుకు నడిపే యువతను తయారుచేసే నిలయాలు కావాలి. కానీ తెలంగాణ గురుకుల పాఠశాలలను చూస్తే భిన్నత్వంలో ఏకత్వం అన్న మౌలిక ఆశయానికే భంగం కలిగిస్తున్న వాస్తవం తెలుస్తుంది. ప్రధాన స్రవంతి సమాజంలో, అందులో వస్తున్న ఐక్యతలో నమ్మకం లేని ఉన్మాదులు, విఫల సిద్ధాంతంగా ఎప్పుడో రుజువైన ద్రవిడవాదానికి మళ్లీ ఇక్కడ ప్రాణప్రతిష్ట చేయాలని కలలు గంటున్నారు. ఆ కలను, ఆ ఆశయాన్నీ పసిహృదయాల మీద రుద్దుతున్నారు.

తెలంగాణ విద్యా గురుకులాలలో హిందూ పండుగలకు, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా బోధనలు జరుగుతున్న మాట నిజం. ఇలాంటి సంఘటనలు క్రమేణా పెరుగుతుండడం, దానికి కొందరు వ్యక్తులు, కులసంఘాల మద్దతు ఉన్నట్టు ప్రచారం జరగడం ఆందోళన కలిగించింది. ఇంకా వేలమంది భావి భారత పౌరులు ఉండే గురుకులా లను నిర్వహించే రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌.ఎస్‌.‌ప్రవీణ్‌కుమార్‌ ‌బహిరంగంగా హిందు మతానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతిజ్ఞా కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి కూడా బయటకు వచ్చింది. దీని వెనుక ఉన్నది స్వేరోస్‌. ‌విషయం పార్లమెంట్‌ ‌వరకు వెళ్లింది. గురుకుల పాఠశాలల్లో అమ్మాయిల మీద దాడులు సహా పలు అక్రమాలకు స్వేరోస్‌ ‌నాయకులు కారణమని, ఇదేమిటని ప్రశ్నించిన శ్రీశైలం అనే ఎస్‌సీ నాయకుడి పైన కూడా దాడి జరిగింది.

స్వేరోస్‌ ‌కబంధ హస్తాలలో చిక్కుకున్న గురుకుల పాఠశాలల్లో ‘భారతదేశం నా మాతృభూమి’ లాంటి ప్రతిజ్ఞ, జాతీయగీతం బహిష్కరణకు గురయ్యాయి. స్వేరోస్‌ ‌ప్రతిజ్ఞ, గీతాలు పాడిస్తున్నారు. భారత మాతాకీజై, జైహింద్‌ అనాల్సిన పిల్లలు జై స్వేరోస్‌, ‌జై భీం, జై అంబేడ్కర్‌ అన్న నినాదాలు ఇవ్వడం చూస్తున్నాం. అంబేడ్కర్‌కు జైకొట్టడానికి ఎవరూ వ్యతిరేకం కాదు. వ్యక్తికన్నా దేశమే ముఖ్యమని నమ్మిన డాక్టర్‌ అం‌బేడ్కర్‌, ‌జ్యోతిరావు ఫూలే లాంటి మహనీయుల ఆశయాలకు విరుద్ధంగా ఉండే స్వేరోస్‌ ‌వారి నినాదం భిన్నత్వంలో ఏకత్వ భావనకు వ్యతిరేకమే. ఆ మేధావులు చేసిన పోరాటం ఫలితంగా పరిస్థితులు మారుతున్నాయి. అన్ని కులాల, మతాల వారికి సమానహక్కులు, అవకాశాలు కల్పిస్తున్న దేశం ప్రపంచంలో ఒక్క భారత్‌ ‌మాత్రమే. కొన్ని లోపాలు మిగిలి ఉంటే సరి చేయాలి. వ్యవస్థనే తప్పు పట్టడం, మురిగిపోయిన సిద్ధాంతాలతో గెలవాలని అనుకోవడం కొత్త సంక్షోభానికి ఆస్కారం కల్పించడమే.

స్వేరోస్‌, ‌డాక్టర్‌ ‌ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలో హిందూ మతం మీద వ్యతిరేకత ప్రదర్శిస్తూ, ఇతర మతాలకు అనుగుణంగా చేస్తున్న కార్యక్రమాల మీద చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ నోరు విప్పడం లేదు. ఈ తతంగం ఎప్పటినుండో జరుగుతున్నా స్పందన లేదు అంటే ప్రభుత్వం స్వేరోస్‌కు భయపడుతోందా? ఇన్ని ఆరోపణలు వచ్చినా ప్రవీణ్‌కుమార్‌ను ఆ పదవి నుంచి కదల్చడం లేదు? ఇలాంటి వెసులుబాటుకు రెండు కారణాలు ఉంటాయనుకోవచ్చు. ఒకటి సమర్ధంగా పనిచెయ్యడం. లేదా ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం లోని పెద్దలు కావాలనే ఆదుకోవడం. మొదటి కారణం ప్రకారం, ఒకే శాఖకు అన్నేళ్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తే ఏ అధికారి అయినా మంచి చెయ్యగలడు. కానీ మరే ఇతర అధికారినైనా ప్రభుత్వాలు అలా స్థిరంగా ఉంచగలవా? రెండవది ప్రభుత్వ పెద్దల సహకారం ఉండడం వలననే స్వేరోస్‌ ‌మీద ఎలాంటి చర్యలు లేవన్న ఆరోపణ. ‘మేం’ శ్రీరాముడినీ,కృష్ణుడినీ పూజించం అంటూ సర్కారు సొమ్ముతోనే పిల్లలకు బోధించడం అంటే అర్ధం ఏమిటి? ఇందులో కనిపించేది ద్రవిడవాదం జాడే.

 స్వేరోస్‌ ‌రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం మిన్నకుండా ఉండడం అంటే ఒక వర్గాన్ని మచ్చిక చేసుకోవడం కోసమేనని చెబుతున్నవారు లేకపోలేదు. ఆ వర్గానికి ఇస్తామన్న పదవులు, భూములు ఇవ్వకపోవడం వలన ఆ వ్యతిరేకతను తగ్గించడం కోసం ఈ మార్గాన్ని ఉపయోగించుకొని రాబోయే రోజులలో ఒక ఓటుబ్యాంకును సురక్షితంగా ఉంచడానికేనన్న ఆరోపణ కూడా ఉంది. ప్రాంతీయ పార్టీలకు సైద్ధాంతిక విధానాలు ఉండవు. అవి ఎక్కువరోజులు మనుగడలో ఉండవు. తమ మనుగడ కొనసాగించాలి అంటే ఇలా రకరకాలుగా భేదాభి ప్రాయాలు సృష్టిస్తూ, ప్రజల్ని మభ్యపెడుతూ ఉండాలి. కొత్త ఎత్తుగడులతో ఓటుబ్యాంకులు తయారు చేసుకుంటూ ఉంటారు. కొత్త పార్టీలను వారే సృష్టించి ప్రాంతీయవాదాన్ని ముందుకు తెచ్చి జాతీయపార్టీలకు స్థానం లేకుండా చెయ్యడం ప్రాంతీయ పార్టీల వ్యూహం. ఇదే స్వేరోస్‌ ‌వంటి విధ్వంసక సంస్థలకు అనువైన పరిస్థితిని కల్పిస్తుంది. తమిళనాడు ద్రవిడ ఉద్యమ పరిస్థితులను, తరువాత రాజకీయ సమీకరణాలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ క్రమం అర్ధమవుతుంది.

ద్రవిడ ఉద్యమం అనగానే గుర్తుకు వచ్చేది పెరియార్‌ ఈవీ రామస్వామి. తమిళనాడులో మొదట కులవివక్ష, కులనిర్మూలన, అంటరానితనం, తమిళ ఆత్మగౌరవం మీద పోరాటం చేసారు. స్వాతంత్య్రానికి పూర్వం అవి దేశసమైక్యతకు భంగం కల్గించే అంశాలే. వాటిని అంతం చేయాల్సిందే. అలానే రామస్వామి మొదట వీటిపై ఉద్యమించి, తర్వాత హిందూత్వం, హిందీ భాష, ఉత్తరాది ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మలిచారు. దానికి ద్రవిడవాదమని పేరు పెట్టి తమిళ ప్రజలను జాతీయోద్యమానికి కొంతదూరం చేసారు కూడా. ఇలా మొదలయిన ద్రవిడ ఉద్యమం స్వాతంత్య్రం వచ్చాక కూడా అవే నినాదాలతో కొనసాగింది. 1954 నుండి 1963 వరకు స్వాత్య• ్రసమర యోధుడు కె.కామరాజ్‌ ‌నాడార్‌ ‌ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప పనులు చేసారు. ఆ రోజులలోనే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం తెచ్చి దేశంలోనే కొత్తరకం విద్యకు పునాదులు వేసాడు. విద్య, వైద్య, నీటిపారుదల రంగంలో తమిళనాడును దేశంలో ప్రథమస్థానంలో ఉంచారు. కావేరి మీద ఎన్నో ప్రాజెక్టులు, డ్యామ్‌లు కట్టి పరిపాలనా దక్షునిగా వన్నెకెక్కారాయన. ఇలాంటి పేరు ప్రతిష్టలు ఉన్న, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకులను, జాతీయ పార్టీలను ద్రవిడ ఉద్యమం ఎలా కబళిం చిందో చరిత్ర నుండి తెలుసుకోవాలి. అనతికాలం లోనే ద్రవిడ ఉద్యమం రాజకీయ పార్టీ అవతారం ఎత్తి, డీఎంకే పార్టీగా, 1967లో తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. డీఎంకే నుండి అన్నా డీఎంకే పుట్టింది. 1967 నుండి ఇప్పటివరకు ఒకరి తరువాత ఒకరు అధికారంలో ఉంటూ, ప్రాంతీయ భావజాలాన్ని పెంచుతూ జాతీయ పార్టీలకు స్థానం లేకుండా చేస్తున్నారు. అన్నా డీఎంకే చాలావరకు ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నప్పటికి, కరుణానిధి కుటుంబ పార్టీ డీఎంకే హిందూధర్మాన్ని అవహేళన చేస్తూ రాముడు తాగుబోతు, రామసేతు రాముడు కట్టింది కాదు అని అవకాశం దొరికినప్పుడల్లా ద్రవిడ ముసుగు తీస్తున్నది. ద్రవిడవాదాన్ని వాడుకుని అధి కారంలో కొనసాగడం తప్ప ఈ పార్టీలు చేసిందేమీ లేదు. ఒక్క ప్రాజెక్టు, ఒక్క డ్యామ్‌ ‌కట్టింది లేదు.

ఇదంతా మన సమీప గతం. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు, సామజిక అంశాలు, రాజకీయ ఉద్దండుల అంతరంగాలు తెలుసుకొని మేల్కొనకపోతే దేశం కోసం, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని నిర్మించడం కష్టమే. ద్రవిడ ఉద్యమం, ప్రాంతీయ, హిందూ, హిందీ వ్యతిరేక భావజాలం వ్యాప్తి జరిగి అభివృద్ధికి, జాతీయ వాదానికి సంకెళ్లు వేసే కుహనా లౌకికవాదులను, వాళ్ల పాలనను అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఇలాంటి రుగ్మతలను తక్షణమే రూపుమాపి, మన గురుకుల పాఠశాలలను దేశాన్ని ప్రేమించే, దేశభక్తి నరనరాన ఉండే విద్యావంతులను తయారుచేసే నిలయాలుగా తీర్చిదిద్దాలి. ఇంతేకాక అన్ని వర్గాలవారి పిల్లలు ఒకే బడిలో చదువుకునే అవకాశం కల్పించి వారిలో సామాజిక స్పృహ పెంచి, భిన్న త్వంలో ఏకత్వంపై అవగాహన కలిగించి ఒక సంఘటిత శక్తిగా మార్చి తెలంగాణ దేశానికి మార్గదర్శనం చేసే విధంగా మలచాలి.

…జైహింద్‌… ‌భారత మాతకు జై…

About Author

By editor

Twitter
Instagram